Tags
#Failed Narendra Modi, Aatmanirbhar Bharat, BJP, India GDP, Made in India, Narendra Modi Failures
ఎం కోటేశ్వరరావు
వర్తమాన ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాస కాలంలో మన జిడిపి వృద్ధి రేటు అంతకు ముందున్న 7.5శాతం నుంచి 5.4శాతానికి దిగజారింది.దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు లోక్‌సభ ఎన్నికల ముందు ప్రధాని నరేంద్రమోడీ చూపిన రంగుల కలను ఇది భగ్నం చేసింది. మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా పిలుపులు విఫలమైన తరువాత 20లక్షల కోట్ల రూపాయలతో 2020లో ఆత్మనిర్భర అభియాన్ పేరుతో ఉద్దీపన పథకాన్ని ప్రకటించిన తరువాత పరిస్థితి ఇది. ఈ ఉద్దీపన కూడా విఫలమైనట్లు వేరే చెప్పనవసరం లేదు. జాతీయ గణాంక సంస్థ(ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన ఈ వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి.నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన 2014లో జిడిపిలో రుణ భారం 49.9శాతం కాగా 2023 నాటికి అది 83.1శాతానికి పెరిగింది. తాము చేస్తున్న అప్పు దేశ ఆభివృద్ధికి వినియోగిస్తున్నామని చెబుతున్న బిజెపి ఆచరణలో అప్పు తప్ప అభివృద్ధిని చూపటం లేదు. పోనీ దేశ జనం మీద పన్నుల భారం ఏమైనా తగ్గిందా అంటే లేదు. గోడదెబ్బ`చెంపదెబ్బ అన్నట్లుగా రోడ్ల అభివృద్ధి పేరుతో చమురు మీద పెద్ద మొత్తంలో సెస్ వసూలు, ఆ రోడ్ల మీద ప్రయాణించిన వారి నుంచి ముక్కు పిండి టోల్ టాక్సు వసూలు చేస్తున్నారు. ఇంత అప్పు చేస్తున్నా మూల ధన పెట్టుబడుల మొత్తం పెంచటం లేదు, జిడిపి వృద్ధి రేటు పడిపోవటానికి ఇది ఒక ప్రధాన కారణమని తేలింది గనుకనే అప్పుల గురించి చెప్పుకోవాల్సి వచ్చింది. మూల ధన పెట్టుబడులు ఎంత ఎక్కువ ఉంటే అంతగా శాశ్వత, రాబడిని తెచ్చే ఆస్తులు సమకూరుతాయి. కాగ్ నివేదిక ప్రకారం గతేడాది రెండవ త్రైమాస కాలంలో ప్రభుత్వ మూలధన పెట్టుబడి 49శాతం( రు.4.9లక్షల కోట్లు) ఉండగా ఈ ఏడాది రు.4.14లక్షల కోట్లు 37.3శాతానికి పడిపోయిందని కేర్ రేటింగ్స్ ప్రధాన ఆర్థికవేత్త రజనీ సిన్హా చెప్పారు. ప్రైవేటు రంగ మూలధన పెట్టుబడులు లేనపుడు ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోవటం ప్రతిదేశంలోనూ జరుగుతున్నదే.ప్రభుత్వం ద్రవ్యలోటు తగ్గించుకొనేందుకు చూస్తున్నందున ప్రయివేటు రంగం ముందుకు రావాలని క్రిసిల్ రేటింగ్స్ ప్రధాన ఆర్థికవేత్త డికె జోషి చెప్పారు. పెట్టుబడులు తగ్గిపోవటమే కాదు, గృహస్తులు చేసే ఖర్చు కూడా 7.4 నుంచి ఆరుశాతానికి పతనమైంది. జనాన్ని మభ్యపెట్టేందుకు గతేడాది పెట్టుబడుల మొత్తం రు.9.48లక్షల కోట్లను ఈ ఏడాది రు.11.11లక్షల కోట్లకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అయితే తొలి ఐదు మాసాల్లో ఈ మొత్తంలో ఖర్చు చేసింది రు.3.09లక్షల కోట్లు 27శాతం మాత్రమే. గతేడాది ఇదే కాలానికి 37.4శాతం ఖర్చు చేసింది. అందువలన రానున్న ఏడు నెలల్లో 73శాతం ఖర్చు చేసే అవకాశం లేదని, కోత పెడతారని చెబుతున్నారు.
ఉత్పాదక రంగ వృద్ధి సగటు జిడిపి కంటే తక్కువగా కేవలం 2.2శాతమే ఉంది. గతేదాది ఇదే కాలంలో 14.3శాతం ఉంది. విద్యుత్ 10.4 నుంచి 3.3శాతానికి తగ్గింది. ఉత్పాదక రంగం పడిపోయిన తరువాత విద్యుత్ వినియోగం కూడా పడిపోతుంది.వ్యవసాయం రెండు నుంచి 3.5శాతానికి పెరిగింది. గనుల రంగం వార్షిక ప్రాతిపదికన గతంలో 11.1శాతం, తొలి త్రైమాసంలో 7.2శాతం ఉండగా రెండవ త్రైమాసంలో 0.1శాతానికి దిగజారింది. నిర్మాణ రంగం 10.5 నుంచి 7.7కు,ద్రవ్య, రియలెస్టేట్, ఇతర సేవల రంగం 7.1 నుంచి 6.7శాతానికి పడిపోయింది. రవాణా,హోటల్స్ వంటి సేవారంగం 5.7 నుంచి 6 కు పెరిగింది. మేడిన్ ఇండియా,మేకిన్ ఇండియా, అత్మనిర్భరత వంటి మాటలు, పథకాలన్నీ ఏమైనట్లు ? ప్రభుత్వం ఆశలు పెట్టుకున్న ప్రైవేటు రంగం, ప్రైవేటు వినియోగం, పారిశ్రామిక ఉత్పత్తి నిస్తేజంగా ఉంది. వ్యవసాయం,ప్రభుత్వ రంగ వ్యయమే మద్దతుగా నిలిచింది.అయితే ఏడాది మొత్తం వృద్ధి రేటు 7.5శాతం ఉంటుందని చెబుతున్నారు.
దేశంలో మూల ధన పెట్టుబడుల పథకాలు దెబ్బతినటానికి నెపం ఇతర దేశాల మీద నెడుతున్నారు.చైనా, ఇతర ఆగ్నేయాసియా దేశాలు తమ దేశాలలో విస్తరణ మీద కేంద్రీకరించటం, ప్రపంచ ఉద్రిక్తతలు, ఎర్ర సముద్రంలో రవాణాకు ఆటంకం ఏర్పడటం వంటి కారణాల వలన మనదేశానికి అవసరమైన భారీ యంత్రాల రాక ఆలస్యం అవుతున్నదని సాకుగా చూపుతున్నారు.వేగంగా అమ్ముడు పోయే వినియోగదారుల వస్తువుల తయారీకి అవసరమైన యంత్రాల దిగుమతిలో రిలయన్స్ వంటి కంపెనీలు సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. కాంపాకోలా డ్రిరకుల తయారీకి అవసరమైన యంత్రాల కోసం ఏడాది అంతకు ముందు నుంచి ఎదురుచూస్తున్నదని ఈ ఏడాది మే నెలలో వార్తలు వచ్చాయి. చైనా ఉత్పాదక రంగం దెబ్బతిన్నదని చెప్పేవారే మన దేశానికి యంత్రాలు సకాలంలో రాకపోవటానికి అక్కడి ఆర్థిక వ్యవస్థ పునరుద్దరణకు తీసుకుంటున్న చర్యలే కారణమని అదే నోటితో చెబుతారు. వెయ్యి కోట్లతో ఈ ఏడాది యంత్రాలు అమర్చాలని తాము తలపెట్టగా ఆలశ్యం కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు హావెల్స్ ఇండియా ఇడి రాజీవ్ గోయల్ చెప్పారు. చైనా తన పరిశ్రమలను నవీకరించుకొనేందుకు 140 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు, సాంకేతిక రంగంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. స్థానికంగా గిరాకీని పెంచేందుకు పాత వస్తువులను ధ్వంసం చేసేందుకు, పాత కార్లకు బదులు విద్యుత్ వాహనాలను వినియోగించేందుకు ప్రోత్సాహకాలనిస్తున్నది, అక్కడ ఫ్యాక్టరీ కార్యకలాపాలు విస్తరించాయి. పిల్లి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లుగా ఇజ్రాయెల్ గాజాలో సాగిస్తున్న మారణకాండను అమెరికా, ఇతర పశ్చిమ దేశాలతో పాటు మనదేశం కూడా సమర్థిస్తున్న కారణంగా ఎర్ర సముద్రంలో నౌకల రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతున్నది. దాని వలన మనదేశం దిగుమతి చేసుకొనే వస్తువుల రవాణా ఖర్చులు పెద్ద మొత్తంలో పెరుగుతున్నాయి.
మన దేశంలో ఉత్పాదక రంగం పెరగకపోవటానికి ఒక ప్రధాన కారణం మన జనాల వినియోగం పెరగకపోవటమే అన్నది స్పష్టం. ఆహారం మీద చేసే ఖర్చు తక్కువగా ఉందంటే అభివృద్ధి చెందిన దేశంగా పరిగణిస్తారు. ఉదాహరణకు అమెరికాలో కుటుంబ ఆదాయంలో ఆహారానికి చేసే ఖర్చు కేవలం 12.9శాతం, ఫ్రాన్సులో 13.3 శాతమే, అదే మన దేశంలో నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్( ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) సర్వే ప్రకారం 2011`12లో 53శాతం ఉండగా 2022`23లో 46.5శాతానికి తగ్గింది. జనాభాలో అగ్రస్థానంలో ఉన్న చైనాను మనదేశం వెనక్కు నెట్టింది.చైనాలో కూడా ఆహారం మీద చేసే ఖర్చు ఎక్కువగానే ఉన్నప్పటికీ తగ్గుతున్నతీరు అక్కడి సమాజం అభివృద్ది వైపు వెళుతున్నట్లుగా చెబుతున్నారు. అవర్ వరల్డ్ ఇన్ డాటా పోర్టల్ సమాచారం ప్రకారం 2022లో చైనా కుటుంబ మొత్తం వినియోగం 4,805 డాలర్లు కాగా దానిలో ఆహారం కోసం 20.1శాతం వినియోగిస్తున్నారు. భారత్‌లో 1,553 డాలర్లకు గాను 32శాతం ఖర్చు చేస్తున్నారు.( గమనిక ఈ సమాచారంలో పరిగణనలోకి తీసుకొనే వాటిని బట్టి అంకెల్లో తేడాలు ఉన్నందున ధోరణిని అర్ధం చేసుకొనేందుకు మాత్రమే వీటిని పరిగణనలోకి తీసుకోవటం మంచిది) రావూస్ ఐఏఎస్ అకాడమీ విశ్లేషణలో అందచేసిన 2022 సమాచారం ప్రకారం భారత్, చైనాల్లో వినియోగానికి చేసే ఖర్చు దిగువ విధంగా ఉంది. ఆహారం అంటే పొగాకుతో, దుస్తులు అంటే పాదరక్షలతో కలిపి అని పరికరాలు అంటే గృహవినియోగ వస్తువులు అని గమనించాలి.
దేశం IIఆహారంIIదుస్తులుIIరవాణాIIఇల్లుII విద్యII ఆరోగ్యంIIపరికరాలుII ఇతరం
భారత్II 32.5 II 6.1 II 16.3 II13.2II4.5 II 5.2 II 3 IIII 17
చైనా II 30.5 II 5.6 II 13.0 II24.0II10.1II 8.6 II 5.8 IIII 2.5
నేషనల్ శాంపుల్ సర్వేను పరిగణనలోకి తీసుకున్నపుడు మనదేశంలో ఆహారం మీద చేసే ఖర్చు తగ్గుదల సంతృప్తి చెందాల్సినదా లేక ఆందోళన పడాల్సిన అంశమా అన్న మీమాంస ఉంది. పట్టణ ప్రాంతాల్లో 42.7 నుంచి 39.2శాతానికి తగ్గింది. మొత్తం మీద తృణ ధాన్యాలు, కూరగాయల మీద చేసే ఖర్చు తక్కువగా ఉండటం వలన ఈ తగ్గుదలకు దోహదం చేసిందని దీన్ని సంతోషించాలా లేక దేన్నయినా కోల్పోతున్నామా అన్నది చర్చ. ఆహారం కోసం నెలవారీ రాబడిలో సగం ఖర్చు చేయాల్సి వస్తోందంటే దాన్ని మరో రకంగా చెప్పుకోవాలంటే కుటుంబ ఆదాయం తగినంత లేనట్లు, పొదుపు చేసుకొనేందుకు ఏమీ మిగలటం లేదనే. రాబడి పెరిగితే ఇతర వాటి మీద ఖర్చు చేస్తారు. సర్వే చేసిన కాలంలో నెలవారీ ఖర్చు గ్రామీణ ప్రాంతాలలో 164, పట్టణాల్లో 146శాతం పెరిగినట్లు తేలింది. ఆహారం మీద చేసే ఖర్చులో తగ్గుదల కనిపించటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత లేదా సబ్సిడీ ఆహారధాన్యాల కోణం ఉందన్నది ఒక అభిప్రాయం. దీనిలో మరో కోణం కూడా ఉంది. ఎనభై కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్నట్లు బిజెపి గొప్పలు చెప్పుకుంటున్నది. దీని కోసం ఏటా రెండు లక్షల కోట్ల రూపాయల మేరకు సబ్సిడీ మొత్తాన్ని భరిస్తున్నట్లు చెబుతున్నది. ఒకటి జనంలో కొనుగోలు శక్తి లేనపుడు దాన్ని పెంచటానికి సబ్సిడీలు ఒక మార్గం. ఆహార సబ్సిడీ లేకపోతే జనాలు ఆ మేరకు భారం భరించి కొనుగోలు చేయాల్సి వస్తుంది. అదే సబ్సిడీ ఇస్తే ఆ మొత్తాన్ని ఇతర వస్తువులు లేదా సేవల కోసం వినియోగిస్తే పరోక్షంగా పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు మేలు జరుగుతుంది. కరోనా సమయంలో జనాలు ఉచితంగా నగదు అందచేయాలని కోటక్ మహింద్ర బ్యాంక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ గుప్తా సూచించారు.ఇది జనాల మీద ప్రేమతో కాదు. అలా చేస్తే ఏడాది కాలంలో ఆర్థికరంగం పుంచుకుంటుందని గుప్తా అసలు విషయం కూడా చెప్పారు. జనాల్లో ఉన్న పేదరికం, దారిద్య్రం తీరదు గానీ అంతిమంగా అది పారిశ్రామికవేత్తలను ఆదుకొనేందుకు దారితీస్తుంది. కరోనా సమయంలో ఉచితంగా ఇచ్చారంటే నరేంద్రమోడీ జనాలకు మేలు చేస్తున్నారని అనుకుందాం. అంతకు ముందు ఐదేండ్లలో ఎందుకు ఇవ్వలేదు, కరోనా తరువాత సాధారణ పరిస్థితులు నెలకాన్నాయని చెప్పిన తరువాత మరికొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా ఇస్తామని ప్రకటించటం వెనుక దేశ ఆర్థిక వ్యవస్థ, జనాల నిజరాబడి దిగజారుడే కారణం. ఆ విషయాలను చెప్పకుండా మేలు చేస్తున్నట్లు ఫోజుపెడుతున్నారు. మొత్తంగా చూసినపుడు మన వినియోగదారుల కొనుగోలు శక్తి పెరగటం లేదు.పారిశ్రామిక వస్తువులకు గిరాకీ లేకపోవటానికి ఇది ప్రధాన కారణం.
ఇప్పటికీ మనది ఉపాధి రీత్యా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్తే. దాని ద్వారా జిడిపికి గత రెండు దశాబ్దాల్లో 17`20శాతం మధ్యనే ఊగిసలాడుతోంది, తగ్గుదల ధోరణిలో ఉంది. వ్యవసాయంపై ఆధారపడే వారు 1993`94లో 64.6శాతం ఉండగా ప్రస్తుతం 46 శాతానికి అటూ ఇటూగా ఉంది. ఇదే కాలంలో పరిశ్రమలు గొప్పగా అభివృద్ధి చెందాయని చెబుతున్నప్పటికీ ఆ రంగంలో ఉపాధి 1993`94 నుంచి 2021`22 మధ్య 10.4 నుంచి మధ్యలో 12.6కు పెరిగినా 11.6శాతంగా ఉంది. అంటే ఉపాధి రహిత పారిశ్రామిక వృద్ధి అన్నది స్పష్టం. వ్యవసాయంపై ఆధారపడే ఎక్కువగా ఉండటం, గ్రామీణ ప్రాంతాల్లో 2019`2024 మధ్య కాలంలో వేతనాలు 5.2శాతం పెరిగినప్పటికీ ద్రవ్యోల్బణనాన్ని పరిగణనలోకి తీసుకుంటే వాస్తవంలో 0.4శాతం తగ్గింది, అంటే ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు పెరగలేదు. ఈ కారణంగానే వినియోగంపై ఖర్చు పెరగలేదు, పారిశ్రామిక వస్తువులకు గిరాకీ ఉండటం లేదు.మోడినోమిక్స్ పేరుతో తనదైన ఆర్థిక విధానాలను అమలు జరుపుతున్నట్లు చెబుతున్నారు, పదేండ్ల తరువాత అన్ని ప్రధాన రంగాలు దిగజారటం తప్ప మెరుగుపడటం లేదు. రోగం ఒకటైతే మందు మరొకటి వేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి.
