ఎం కోటేశ్వరరావు
అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫిబ్రవరి 12న జరిపిన ఫోన్ సంభాషణ ప్రపంచంలో ఎంతో ఆసక్తి రేపింది. ఉక్రెయిన్ సమస్య పరిష్కారానికి చర్చలు జరపనున్నట్లు ప్రకటించాడు. పరస్పర విరుద్ద వార్తలు, వ్యాఖ్యానాలు, విశ్లేషణలు, ఉక్రెయిన్ సంక్షోభం ముగింపు గురించి నేతలు చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే అసలేం జరుగుతోంది అని సామాన్యుడు ఎటూ తేల్చుకోలేని స్థితి. ఒక ప్రకటన, పరిణామం వాస్తవం అనుకుంటే తలెత్తే సందేహాలు ఎన్నో. మంగళవారం నాడు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో అమెరికారష్యా ఉన్నత ప్రతినిధి వర్గాలు భేటీ అయ్యాయి. చర్చలను కొనసాగించాలని నిర్ణయించారు. డోనాల్డ్ ట్రంప్‌వ్లదిమిర్ పుతిన్ కూడా అక్కడి చేరుకోవచ్చని వార్తలు వాస్తవం కాదని, ఇంకా ఎలాంటి నిర్ణయం జరగలేదని ప్రకటించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెనెస్కీ బుధవారం నాడు అక్కడికి చేరుకోనున్నట్లు వార్త. ఐరోపాకు చర్చల్లో ఎలాంటి ప్రమేయం ఉండదనే ఊహాగానాల పూర్వరంగంలో సోమవారం నాడు పారిస్‌లో కొన్ని దేశాల నేతలు సమావేశం జరిపి పరిస్థితిని సమీక్షించారు. ఉక్రెయిన్‌పై 2022 ఫిబ్రవరి 24న రష్యా సైనిక చర్య ప్రారంభమైంది. వేగంగా మారుతున్న పరిణామాలను చూస్తే నాలుగో ఏడాదిలో ప్రవేశించక ముందే దానికి ముగింపు పలుకుతారా ? ఈ సమస్యను ఇంత సులభంగా పరిష్కరించే అవకాశం ఉంటే మూడు సంవత్సరాలు ఎందుకు కొనసాగించినట్లు ? కోట్లాది మంది జనాలను, అనేక దేశాలను ఎందుకు ఇబ్బందులు పెట్టినట్లు ? దీనికి ఎవరిది బాధ్యత ? ఎంతో సంక్లిష్టమైన ఈ వివాదం ఒక్క భేటీతో నాటకీయంగా ముగుస్తుందా ? చర్చల పేరుతో కొత్త ఎత్తుగడలకు ప్రాతిపదిక వేస్తున్నారా?
జెలెనెస్కీ, ఐరోపా సమాఖ్యతో నిమిత్తం లేకుండానే చర్చలు జరిపి ఒక ముగింపు పలుకుతామని అమెరికన్లు చెప్పారు. తమతో నిమిత్తం లేకుండా జరిగే చర్చలను అంగీకరించేది లేదని జెలెనెస్కీ ప్రకటించాడు. పుతిన్ అబద్దాల కోరు, అసలు తమకు చర్చల గురించి సమాచారమే లేదన్నాడు. ముసాయిదా ప్రతిపాదనల్లో తమ భద్రతకు ఎలాంటి హామీ లేదన్నాడు. తమకూ అంగీకారం కాదని ఐరోపా దేశాలు స్పష్టం చేశాయి. మరి జెలెనెస్కీ సతీసమేతంగా రియాద్ ఎందుకు వస్తున్నారంటే ‘‘ అది ఎప్పుడో నిర్ణయించిన పర్యటన ’’ అని అతగాడి ప్రతినిధి వివరణ ఇచ్చాడు. రష్యాఉక్రెయిన్ ఖైదీల మార్పిడి గురించి చర్చలు జరిపేందుకు జెలెనెస్కీ ఆదివారం నాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకున్నాడు. సౌదీ పర్యటన గురించి గతంలో ఎలాంటి వార్తా లేదు. ఎవరి ప్రమేయం లేకుండా చర్చలు జరుగుతాయని ట్రంప్ సలహాదారులు స్పష్టంగా చెప్పారు. దానికి పూర్తి విరుద్దంగా శాంతి చర్చల్లో జెలెనెస్కీ పాల్గొంటారని ఆదివారం నాడు డోనాల్డ్ ట్రంప్ చెప్పినట్లు రాయిటర్స్ వార్త పేర్కొన్నది. ఐరోపా నుంచి వ్యతిరేక స్పందన వెలువడటంతో అమెరికా మాట మార్చింది.సౌదీలో చర్చలకు అమెరికా ప్రతినిధివర్గ నేత మార్క్ రూబియో సిబిఎస్ టీవీతో మాట్లాడుతూ అసలు పుతిన్ నిజంగా చిత్తశుద్దితో ఉన్నాడా లేదా అన్నది పరీక్షించేందుకు చర్చలను ముందుకు తెచ్చామని, నిజమైన సంప్రదింపుల్లో ఉక్రెయిన్, ఐరోపాకు భాగస్వామ్యం ఉంటుందని చెప్పాడు. ఎందుకంటే రష్యాపై ఆంక్షల్లో ఐరోపా కూడా ఉందన్నాడు. పైకి ఏమి చెప్పినప్పటికీ అమెరికా అధికారులు ప్రయివేటు సంభాషణల్లో ఐరోపా వారితో మీ అంగీకారం లేకుండా ఏదీ జరగదని చెబుతున్నట్లు మీడియా పేర్కొన్నది. ఏ రోటి దగ్గర ఆ పాట పాడినట్లు వ్యవహరిస్తున్నారా ? దీన్ని చూస్తుంటే పరిణామాలు ఏ మలుపు తిరిగేదీ ఊహించలేము.
ట్రంప్ ఫోన్ సంభాషణకు ముందు జరిగిన పరిణామాలను సింహావలోకనం చేసుకోవాల్సి ఉంది. ఉక్రెయిన్ పోరులో తాము చేసిన సాయం లేదా చేసిన ఖర్చును తిరిగి చెల్లించే స్థితిలో లేనందున ప్రతిగా టిటానియం,యురేనియం, లిథియం వంటి 500 బిలియన్ల విలువగల ఖనిజ సంపదలున్న ప్రాంతాల్లో సగం తమకు అప్పగించాలని అమెరికా బేరం పెట్టింది. దాని కోసం తన ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్‌ను కీవ్ పంపిన సంగతి తెలిసిందే ప్రస్తుతం రష్యా, దాని అనుకూల శక్తుల ఆధీనంలో ఉన్న నాలుగో వంతు భూ భాగంలో ఈ ఖనిజాలు ఉన్నాయి. సంక్షోభానికి ముందు ఉన్న ప్రాంతాలు తిరిగి కావాలని కోరుకోవద్దని కూడా ట్రంప్ యంత్రాంగం జెలెనెస్కీకి సూచించింది. అలాంటపుడు ఖనిజాల గురించి ఎందుకు బేరం పెట్టినట్లు? రష్యాను అడ్డుకొనేందుకు ఐరోపా దేశాలు కూడా పెద్ద మొత్తంలో ఖర్చు చేశాయి. ఖనిజాలతో అమెరికా తన ఖర్చుతాను రాబట్టుకుంటే తమ సంగతేమిటని అవి ప్రశ్నిస్తాయి. అయితే సంక్షోభం ప్రారంభమైన తరువాత ఐరోపా దేశాలు 300 బిలియన్ డాలర్ల విలువగల రష్యన్ ఆస్తులను స్థంభింప చేశాయి. వాటిని స్వాధీనం చేసుకోవటం గురించి కొందరు ఆలోచనలు చేస్తున్నారు. దీనికి రష్యా అంగీకరించే సమస్యే ఉత్పన్నం కాదు.2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియా ద్వీపకల్పంతో సహా ఆక్రమిత ప్రాంతాలన్నింటినీ తమకు అప్పగించాలని జెలెనెస్కీ డిమాండ్ చేశాడు. ఒక వైపు చర్చల గురించి సిద్దం అవుతూనే రష్యా తన దాడులను కొనసాగిస్తూనే ఉంది. ఉక్రెయిన్ ప్రతిఘటన కూడా సాగుతోంది.
నువ్కొకందుకు పోస్తే నేనొకందుకు తాగాను అన్నట్లుగా పుతిన్ చాలా జాగ్రత్తగా స్పందిస్తున్నాడు. ఎవరూ ఎవరిని నమ్మే స్థితిలో లేరు. అమెరికాఐరోపా యూనియన్ మధ్య ఉన్న మిత్ర వైరుధ్యం ప్రస్తుతానికి శత్రు వైరుధ్యంగా మారుతుందని చెప్పలేము గానీ ట్రంప్ పుతిన్ ఫోన్ చర్చల తరువాత తేడా మరింత పెరిగింది. అలా అయితే ఏం చేయాలి ఇలాజరిగితే ఏం చేద్దామనే సంప్రదింపులు ఐరోపాలో ప్రాధమికంగా ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఐరోపా దేశాలన్నింటికీ కలిపి ఎంత మిలిటరీ ఉందో అంతకంటే ఎక్కువగా రష్యా కలిగి ఉంది. అందువలన ఆచితూచి అడుగేస్తున్నాయి. అది వాటి బలహీనత అయితే దాన్ని సొమ్ముచేసుకోవాలని చూడటం అమెరికా బలం. అమెరికాకు అగ్రపీఠం అనే తన అవగాహనను ట్రంప్ మరింత ముందుకు తీసుకుపోయేట్లయితే ఐరోపాకు దానితో ఘర్షణ పడటం లేదా లొంగిపోవటం తప్ప మరొక మార్గం లేదు. అమెరికా బలహీనతలు కూడా తెలిసినందున ఐరోపా ధనిక దేశాలు అంత తేలికగా సాగిలపడతాయని చెప్పలేము. ప్రపంచ బలాబలాల్లో కొత్త సమీకరణకు తెరలేచే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే జరిగితే అమెరికా ఏకాకి అవుతుంది, దానికి సిద్దపడుతుందా ? అలాంటి అవకాశమే లేదని చెప్పవచ్చు.
ఐరోపా మీద డోనాల్డ్ ట్రంప్ దాడి అంటూ ఎకనమిస్టు పత్రిక ఒక వ్యాఖ్యా విశ్లేషణ చేసింది. ఉక్రెయిన్ మీద ఒక ఒప్పందం చేసుకొనేందుకు పుతిన్‌కు ట్రంప్ పంపిన ఆహ్వానం నాటో కూటమిని గందరగోళంలోకి నెట్టిందని పేర్కొన్నది. ఐరోపా భద్రతకు తామింకే మాత్రం ప్రాధమిక హామీదారుగా ఉండేది లేదంటూ ముందుగా అమెరికా రక్షణ మంత్రి పేట్ హెగ్‌సేత్ చేసిన ప్రకటన షాకిచ్చింది. కొద్ది గంటల తరువాత పుతిన్‌తో సంప్రదింపుల గురించి ట్రంప్ ప్రకటించాడు. ఆ తరువాత వార్షిక మ్యూనిచ్ భద్రతా సమావేశంలో ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ నొప్పించే రీతిలో ఐరోపా మీద దాడి చేశాడు.ఉక్రెయిన్ గురించి మాట్లాడాల్సిన వాన్స్ తన ప్రసంగమంతా ఐరోపా మీద కేంద్రీకరించాడు.ఐరోపాకు ఉందని చెబుతున్న ముప్పు రష్యా నుంచి కాదు, అంతర్గతంగానే ఉందన్నాడు. దాని అర్ధం వలసల సమస్య. పుండు మీద కారం చల్లినట్లుగా ఉక్రెయిన్‌లో అమెరికా రాయబారి కెయిత్ కెలోగ్ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడాడు. సంప్రదింపుల్లో ఐరోపాకు స్థానం ఉంటుందా అన్న ప్రశ్నకు అది జరుగుతుందని అనుకోవటం లేదన్నాడు. దీంతో ఐరోపా భద్రత తమ కళ్ల ముందే కుప్పకూలుతుందా అన్నట్లుగా అనేక మంది నేతలు, అధికారులు భావించినట్లు ఎకనమిస్టు వర్ణించింది. ట్రంప్ ప్రతిపాదించిన చర్చలు ఎవరి అజెండా మేరకు జరుగుతాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. వస్తున్న వార్తలన్నీ పుతిన్ డిమాండ్లకే అమెరికా అంగీకరించవచ్చని సూచిస్తున్నాయి.ఒక వేళ నిజంగా అదే జరిగితే రానున్న రోజుల్లో ఏ ఒక్కదేశం కూడా అమెరికా మాటలు, హామీల మీద ఆధారపడి వ్యవహరించే అవకాశాలు మరింతగా కుచించుకుపోతాయి. ఇంతవరకు దాన్ని నమ్మిబాగుపడిన దేశం లేదనే అభిప్రాయాన్ని మరింతగా బలపరిచినట్లు అవుతుంది. ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్న అమెరికా సామ్రాజ్యవాదులు ఆత్మహత్యకు పాల్పడతారా ? సోమవారం నాడు ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్ ఎంపిక చేసిన కొన్ని దేశాలతో పారిస్‌లో సంప్రదింపులు జరిపాడు. వాటి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
మూడు సంవత్సరాలుగా ఉక్రెయిన్ శాంతి చర్చలను సాగనివ్వని అమెరికన్లు ఆకస్మికంగా ఎందుకు రష్యాతో సంప్రదింపులకు సిద్దపడుతున్నారు ? ఒకటి ఐరోపాలోని నాటో కూటమి దేశాలు అవసరమైతే రంగంలోకి దిగుతామని కబుర్లు చెబుతున్నప్పటికీ నేరుగా ఉక్రెయిన్ తరఫున యుద్దంలో పాల్గొనే అవకాశాలు లేవు. వేల కిలోమీటర్ల దూరం నుంచి అమెరికా సేనలు వచ్చి రష్యాతో తలపడేందుకు సిద్దం కాదు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకే సలాంగొట్టి కాళ్లు గడ్డాలు పట్టుకొని ప్రాణాలు అరచేత పట్టుకొని వెళ్లిన వారు అణుశక్తి రష్యాతో తలపడగలరా ? రష్యా తొలి నుంచీ కోరుతున్నదేమిటి ? గతంలో తమకు హామీ ఇచ్చినట్లుగా ఉక్రెయిన్‌కు సభ్యత్వమిచ్చి నాటో కూటమి ఆయుధాలను తమ ముంగిట్లో ఉంచకూడదు. సంక్షోభానికి ముందు ఉన్న సరిహద్దులు, ప్రాంతాల గురించి ఉక్రెయిన్ మరచిపోవాలి.శాంతి పరిరక్షణ, మరొక పేరుతో నాటో కూటమి దళాలు తమ సరిహద్దులో తిష్టవేయకూడదు. ఉక్రెయిన్ మిలిటరీపై పరిమితులు పెట్టాలి.స్వాతంత్య్రం ప్రకటించుకున్న ఉక్రెయిన్‌లోని ప్రాంతాలకు అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వాలి. ఏ విషయంలోనూ రాజీ పడేందుకు పుతిన్ సిద్దంగా లేడని ఐరోపా గూఢచారులు నివేదించినట్లు వార్తలు. పుతిన్ షరతుల మేర ఒప్పందం కుదుర్చుకుంటే అమెరికాకు వచ్చేదేముంది ? వారు మరీ అంత అమాయకులా ?
కొద్ది నెలలు, వారాల క్రితం వరకు కూడా రష్యాను నిలువరించేందుకు ఏం చేయాలి ? ఎలాంటి ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందించాలి అని తర్జన భర్జనలు పడిన ఐరోపా నేతలు, వ్యూహకర్తలు ఇప్పుడు ట్రంప్ తెచ్చిపెట్టిన పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలా అని మల్లగుల్లాలు పడుతున్నారు. తాము విధించిన ఆంక్షలతో బలహీనపడిన పుతిన్ నాయకత్వాన్ని మరింతగా ఎలా వంటరిపాటు చేయాలా అని చూశారు.ట్రంప్ చర్యతో పుతిన్ ఆ స్థితి నుంచి తాత్కాలికంగా అయినా బయటపడ్డారు. దీని అర్ధం ఎవరిదారి వారు చూసుకోవటం అని కాదు.ఇప్పుడున్న పరిస్థితిలో అమెరికాఐరోపాలకు పరస్పర సహకారం అవసరం. మమ్మల్ని, మా భద్రతను అర్దంతరంగా ఎలా వదలి వెళతారని అడిగితే ఐరోపా మరింత చులకన అవుతుంది. అమెరికా పట్టుమరింతగా దాని మీద బిగుస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన సమయంలో మాదిరి పశ్చిమ ఐరోపా ఆర్థికంగా బలహీనంగా లేదు. గడచిన ఏడు దశాబ్దాల్లో మొత్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థలన్నీ సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ పశ్చిమ ఐరోపా పరిస్థితి మెరుగుపడిరది. అందుకే ఫ్రాన్సు, జర్మనీ పాలకవర్గాలు స్వంతంగానే భద్రతను చూసుకోగలమనే సంకేతాలను పంపుతున్నప్పటికీ మొత్తంగా ఐరోపాను ఆదుకొనేంత ఆర్థిక శక్తి వాటికి లేదు.. మొత్తం మీద ప్రపంచ రాజకీయాల గురించి మీడియాలో గతంలో ఎన్నడూ లేని చర్చ జరుగుతోంది. సౌదీలో ఏం జరగనుంది ? తురుపు ముక్కలను ఎవరు ఎలా ప్రయోగిస్తారు. చూద్దాం !
