Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఒక సినిమాలో రాజకీయ నేతలు కుడి జేబులో ఒకటి, ఎడమదానిలో మరో ప్రకటన పెట్టుకు తిరగటం గురించి పరుచూరి బ్రదర్స్‌ చెప్పారు. ఇప్పుడు విశ్వగురువు నరేంద్రమోడీ ఆ కోవలో చేరిపోయారు. చరిత్రలో ఎప్పుడో జరిగినదానికి వక్రీకరణలు తెలిసిందే, మన కళ్ల ముందు జరిగిన వాటిని కూడా బిజెపి నేతలు ఎలా మార్చి వేస్తున్నారో కులగణనకు కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయంపై సమర్ధన స్పందన వెల్లడిస్తున్నది.జనం మరీ అంత బుర్రలేని వారిగా కనిపిస్తున్నారా ! కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వార్తగా ఇచ్చిన తరువాత ఈ అంశంపై ఆకస్మికంగా మాట మార్చింది అంటూ కొన్ని మీడియా సంస్థలు విశ్లేషణలు వెలువరిస్తున్నాయి. వార్తను సంతోష పడే బిజెపి మద్దతుదారులు ఇప్పుడు ఇవెందుకు అని చిరాకు పడుతున్నారు. ఇప్పటికీ కొందరు స్వతంత్రంగా ఆలోచించే జర్నలిస్టులు ఉన్నందుకు మండిపడుతున్నారు,విమర్శనాత్మకంగా చూడకుండా పాకేజ్‌లతో మొత్తం గోడీ మీడియాగా ఎందుకు మారలేదని చిందులు వేస్తున్నారు. అవును మరి హిట్లర్‌ బాటలో నడుస్తున్న కాషాయ దళాల ప్రజాస్వామ్యంలో నందంటే నంది కాదు పందంటే పంది అనాలి కదా ! లేకపోతే వీపులు పగులుతాయి మరి !!


కులగణన చేయాలని కోరే వారు ప్రత్యేకించి కాంగ్రెస్‌ పేదల అనుభూతులతో ఆటలాడుకుంటున్నదని, కులం పేరుతో విడదీస్తున్నదని ప్రధాని నరేంద్రమోడీ ధ్వజమెత్తారు.(2023 అక్టోబరు 2, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా) గతంలో వారు దేశాన్ని చీల్చారని ఇప్పుడు కూడా అదే చేస్తున్నారన్నారు. మధ్య ప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు బీహార్‌ కుల సర్వే వివరాల విడుదల సందర్భంగా మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు బీహార్‌ ఎన్నికల్లో ఓట్లు అవసరం గనుక కులగణనకు అంగీకరిస్తూ కాబినెట్‌లో తీర్మానించారు. ఆకలేస్తే తినేందుకు ఏదీ దొరకనపుడు మొరటు పనిని తెలుగులో మర్యాద పూర్వకంగా దుప్పి భోజనం అనటాన్ని బిజెపి ఓట్ల ఆకలి గుర్తుకు తెచ్చింది.బీహార్‌ సర్వే ఫలితాలు అవాస్తవమని, పేదల కంటినీరు తుడిచే ఎత్తుగడ అని బిజెపి వర్ణించింది. అంతేనా ప్రతిపక్ష పార్టీలు కుల గణన చేయాలని కోరటం అర్బన్‌ నక్సల్స్‌ ఆలోచనలకు ఒక సూచిక అని 2024లోక్‌సభ ఎన్నికలకు ముందు మోడీ వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే అర్బన్‌ నక్సల్‌గా అధికారికంగానే మారినట్లు కాదా ? ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఒక్కటిగా ఉంటేనే ఐక్యంగా ఉంటాం అని చెప్పారు, అంటే ఇప్పుడు కులాల వారీ విడతీసేందుకు పూనుకున్నారా ? విశ్వగురువు గనుక రాత్రి ఒక సుభాషితం పగలు ఒకటి వల్లిస్తారా ! మోడీ తరువాత వారసుల్లో ఒకరని భావిస్తున్న ఉత్తర ప్రదేశ్‌ సిఎం యోగి ఆదిత్యనాధ్‌ కులంపేరుతో విడతీస్తే హత్య చేసినట్లే అన్నారు. ఓటు బాంకు రాజకీయాలకు మేం వ్యతిరేకం అని సుద్దులు చెప్పే బిజెపి బుద్ది ఇప్పుడు అదే ఓట్ల కోసం అర్రులు చాస్తున్నదని, విధిలేకనే దిగివచ్చిందని జనం భావిస్తున్నారు. నేషనల్‌ ఫ్రంట్‌ నేతగా ప్రధాని విపి సింగ్‌ వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లకు మండల్‌ కమిషన్‌ సిఫార్సు చేస్తే దానికి పోటీ కమండల్‌గా అద్వానీ రామ్‌ రథయాత్ర చేపట్టారనే విమర్శలు అప్పుడే వచ్చాయి. ఓబిసిలో వర్గీకరణకు మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్‌ చేసిన సిఫార్సులను పక్కన పెట్టి రోహిణీ కమిషన్‌ వేశారు, అది సమర్పించిన నివేదికను రెండేండ్లు కావస్తున్నా ఇంతవరకు బయటపెట్టలేదు. అలాంటి పాలకులు ఇప్పుడు బిసిల మీద ఎక్కడలేని ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారు. కుల గణన చేస్తే హిందూ సమాజం విడిపోతుందని చెప్పటమే అసలు హిమాలయమంత అబద్దం, సాకు. ఇప్పుడు ఒక్కటిగా ఉందా ? ఎన్ని రకాలుగా విడిపోయి ఉందో జనాలకు తెలియదా, గ్రామాల్లో గోడలతో విభజిస్తున్నారు, చివరకు చచ్చిన తరువాత శ్మశానాల్లో కూడా మతాలు, కులాలవారీ లేవా ? ఇంకా కులం ఎక్కడ, మతం ఎక్కడా అనిపడక కుర్చీల్లో కూర్చొని వాదించేవారు కనిపిస్తారు. ఇంత అభివృద్ది, విద్య తరువాత కూడా సమాజంలో కులాంతర వివాహాలు కేవలం ఐదుశాతమే అని చెప్పాలంటే సిగ్గుపడాలి. ఏ నియోజకవర్గంలో ఏ కులం, మతం, ప్రాంతం వారు ఎందరున్నారో ఎన్నికలపుడు అందరికీ తెలిసిందే కదా ?


కులగణనను గతంలో కాంగ్రెస్‌ కూడా వ్యతిరేకించిన మాట నిజం. నిజానికి బిజెపి దాని మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం కూడా వ్యతిరేకమే. రెండిరటికీ కారణాలు వేర్వేరు. బిజెపికి 2014లో సంపూర్ణ అధికారం వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎందుకు సముఖత చూపలేదు. ఇప్పుడు సామాజిక న్యాయం కోసం చేశామని చెబుతున్నవారు తమ పార్టీ నేత వాజ్‌పాయ్‌ హయాంలోనే 2001 జనగణన జరిగిందని, అప్పుడే ఎందుకు చేయలేదో చెప్పాలి. కుల గణన జరిగితే రిజర్వేషన్లు, వర్గీకరణ డిమాండ్లతో పాటు, బిజెపి నాయకత్వంలో ఉన్న కొన్ని కులాల వారి ఆధిపత్యానికి గండిపడుతుంది గనుకనే ఆ పార్టీ సుముఖంగా లేదు. కొన్ని పదవుల్లో కొందరికి అవకాశం కల్పించినప్పటికీ సంఘపరివార్‌ సంస్థలలో పునాది ఆధిపత్య కులాలదే. కొన్ని సంక్షేమ పధకాలు అమలు జరపవచ్చు, రాజకీయ సాధికారత అప్పగించటానికిసిద్దపడుతుందా అన్నదే సమస్య. మోడీ సామాజిక తరగతి ఓబిసి అయినప్పటికీ గత పదకొండు సంవత్సరాల్లో వారికి ఒరగబెట్టిందేమీ లేదు, ఆర్థికంగా పరిస్థితి మెరుగుపరచిందీ లేదు. బిజెపి మతం కార్డుతో రాజకీయం చేస్తున్నదానికి విరుగుడుగా కాంగ్రెస్‌ ఇప్పుడు కులగణన ముందుకు తెచ్చింది. దానికంటే ముందు బిసి సంఘాలు ఈ డిమాండ్‌ను ముందుకు తెచ్చాయి. దీనికి మూలం అస్థిత్వ భావజాలం విస్తరించిన కారణంగా దేశంలో అత్యధికులుగా ఉన్న వెనుకబడిన తరగతుల వారు మేమెంత మందిమో మాకంత వాటా పేరుతో రాజకీయ ప్రాతినిధ్యం కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేయటమే. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో రాజ్యాంగం అన్ని కులాలను సమంగానే చూస్తున్నప్పటికీ ఆచరణలో మనువాదం ప్రకారం పైనున్న ప్రతివారూ దిగువన ఉన్న వారిని తక్కువగా చూస్తున్నారు. వివాహాలు, కలసి భోజనం చేసేందుకు కూడా అంగీకరించటం లేదు. దాడులు చేసి చంపేస్తున్నారు. అంబేద్కర్‌ కుల నిర్మూలన జరగాలని కోరుకున్న నాటికీ ఇప్పటికీ చివరికి వివక్షకు గురవుతున్న దళితుల్లోనూ కుల ధోరణులు మరింత పెరిగాయి.ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి తాజాగా అందరికీ ఒకే దేవాలయం, ఒకే బావి, ఒకే స్మశానం ఉండాలని చెప్పారు గానీ కులం, మతం విద్వేషాలు పోవాలని కోరలేదు.


ఇప్పుడు బిజెపి ఎందుకు కులగణనకు అంగీకరించింది ? ఆయారాం గయారాం పాత మాట. నితీష్‌ ఆయా నితీష్‌ గయా అన్నది కొత్త మాట, కూటముల ఫిరాయింపులకు బ్రాండ్‌ అంబాసిడర్‌ బీహార్‌లో ఎదురీదుతున్నట్లు అర్ధమైంది, తన కులగణన సర్వే గురించి చెప్పుకోవాలంటే సిగ్గుపడే స్థితి.అన్నింటికీ మించి మోడీ సర్కార్‌ నిలిచేందుకు రెండు పంగటి కర్రలలో ఒకటి నితీష్‌. అదువలన గతంలో మోడీ కులగణన గురించి ఎంత ఠలాయించినా ఇప్పుడు కుదరదు, నితీష్‌తో పాటు బిజెపి మునగటం ఖాయం. కనుక నితీష్‌ కూడా కులగణనకు అంగీకరిస్తారా లేదా అని పట్టుబట్టినట్లు కనిపిస్తోంది. అందుకే తక్షణ ప్రయోజనంగా బీహార్‌ ఓట్ల కోసం అన్నది స్పష్టం. అయితే ఆ ఎన్నికల నాటికి గణన జరగదు, ఒక ప్రచార అస్త్రంగా మాత్రమే ఉంటుంది. మతం కార్డుతో నూటికి 80శాతంగా ఉన్న హిందువుల ఓట్లు తమకే పడతాయని ఆశించిన వారికి అంత సీన్‌ లేదని, హిందువులు అంత అమాయకంగా బిజెపి వెంటనడవరని, చివరికి అయోధ్యలో ఆ పార్టీని ఓడిరచిన తీరు, మోడీకి గణనీయంగా మెజారిటీ పడిపోవటం, గత ఎన్నికల కంటే ఓట్లు, సీట్లు తగ్గటంతో దిగజారుడు మొదలైనట్లు గ్రహించారు. కులగణన కార్డు ఎంత కాలం పని చేస్తే అంతవరకు ఉపయోగించుకోవాలని నిర్ణయించారని వేరే చెప్పనవసరం లేదు. సంఘపరివార్‌ సంస్థలలో బిసిలు పెద్ద సంఖ్యలో ఉన్నారు,హిందూత్వ భావజాలాన్ని వారిలో గణనీయంగా ఎక్కించామనే విశ్వాసం ఆర్‌ఎస్‌ఎస్‌లో కలిగి ఉండాలి, 2013 నుంచి నరేంద్రమోడీని ఓబిసిగా చూపుతూ తమది బిసిల పార్టీ అని బిజెపి ఊదరగొడుతున్న సంగతి తెలిసిందే. అందువలన గణన జరిగినా తమ ఓట్లు పదిలంగా ఉంటాయనే అంచనాకు వచ్చి ఉండాలి, ఈ నిర్ణయానికి ముందు ప్రధానితో మోహన్‌భగవత్‌ భేటీ కూడా దాని గురించి చర్చించటానికే అన్నది వేరే చెప్పనవసరం లేదు. అయితే వారి అంచనా ప్రకారమే జరుగుతుందా ?


లెక్కతేలినంత మాత్రాన ఒరిగేది, జరిగేది ఏమిటి ? ఎవరెంత అన్న వివాదానికి తెరపడుతుంది. కొత్త డిమాండ్లు ముందుకు వస్తాయి, వాటికి రాజకీయ పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాల్సి ఉంది. ఇప్పటికే దళితులు, గిరిజనుల సంఖ్య ఎంతో తెలిసిందే.201112 జాతీయ నమూనా సర్వే ప్రకారం, 201516 కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం చూసినా జనరల్‌ తరగతులతో పోలిస్తే ఎస్‌సి,ఎస్‌టి,ఓబిసిలు చేస్తున్న ఖర్చు చాలా తక్కువ.జనరల్‌ తరగతుల్లో దారిద్య్రం 15.6శాతం ఉంటే గిరిజనుల్లో 50.6, దళితుల్లో 33.3, ఓబిసీల్లో 27.2శాతాల చొప్పున దారిద్య్రంలో ఉన్నట్లు తేలింది. విద్య, ఉద్యోగాలు, చట్టసభలు, స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఉపశమనం తప్ప అసమానతలు, దారిద్య్రాన్ని తగ్గించే సాధనాలు కాదని తేలిపోయింది. ముస్లింలలో కూడా దారిద్య్రం ఎక్కువగానే ఉంది. కులగణన తరువాత ఈ పరిస్థితిని మార్చేందుకు పథకాలేమైనా ఉంటే ఉపయోగం, లేకుంటే ఎప్పటికాలు ఇట్టిట్టే ! దాని గురించి ఎలాంటి ప్రకటన లేదు. దళితుల వర్గీకరణ న్యాయసమ్మతమే అయినప్పటికీ ఒకే తరగతిగా ఉన్నపుడు లబ్ది పొందిన సామాజిక తరగతులు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాయి. అదే విధంగా ఓబిసి వర్గీకరణ డిమాండ్‌ కూడా ఉంది, దాన్ని చేసేందుకు మోడీ సర్కార్‌కు చెమటలు పడుతున్నాయి. రోహిణీ కమిషన్‌ వేసి అనేకసార్లు గడువు పొడిగించి నివేదిక రాకుండా చూసినప్పటికీ 2023 ఆగస్టులో ఇచ్చిన నివేదికను ఇంతవరకు బహిర్గత పరచలేదు.


బ్రిటీష్‌ పాలనా కాలంలో 1881 నుంచి 1931వరకు కులగణన జరిగింది.అణగారిన తరగతుల ఉద్దరణకు గాక విభజించి పాలించు అనే ఎత్తుగడతో ఆ లెక్కలను తీసిందన్నది స్పష్టం. దాని పర్యవసానాలలో ముస్లింలను వేరుగా సంఘటిత పరచేందుకు ముస్లిం లీగ్‌ ఆవిర్భావం ఒకటి. మద్రాస్‌ ప్రావిన్స్‌లో కులాల వారీ కోటాల నిర్ణయానికి దారితీసింది.దేశంలో దళితుల కోసం ద్విసభ్య నియోజకవర్గాలూ, తరువాత రిజర్వేషన్లూ దాని ఫలితమే. కులగణన జరిగితే సామాజిక విభజనకు దారి తీస్తుందని,అణగారిన తరగతులకు సంక్షేమ పథకాలను అమలు జరిపి ఉద్దరించాలనే వైఖరితో దళితులు, గిరిజనులకు తప్ప 1951 నుంచి నెహ్రూ సర్కార్‌ కులగణన నిలిపివేసింది.అయితే నాటి నుంచి నేటి వరకు చూస్తే అలాంటి ఉద్దరణ జరగకపోగా కొంత మంది దగ్గర సంపద పోగుపడటం, ముఖ్యంగా 1990 దశకం నుంచి ప్రారంభమైన నూతన ఆర్థిక విధానాల అమలు తరువాత కనిపిస్తున్నది. గత పదేండ్లలో దాని తీవ్రత మరింత పెరిగింది. అందుకే తిరిగి కులగణన, రాజకీయ, ఆర్థిక సాధికారత సామాజిక న్యాయ డిమాండ్లు ముందుకు వచ్చాయి.1931 తరువాత జరిగిన మార్పుల్లో వివిధ తరగతుల జనాభా పొందికలో అనేక మార్పులు వచ్చాయి. మొత్తంగా జనాభా పెరుగుదల తగ్గినప్పటికీ ఇతరులతో పోల్చినపుడు భూమి, ఆస్థి కేంద్రీకృతమైన వారిలో సంతానోత్పత్తి గణనీయంగా తగ్గింది. ఇప్పుడు బిసిల జనాభా 52శాతమని చెబుతున్నవన్నీ అంచనా లేదా 1931 లెక్కల ప్రాతిపదికన చెబుతున్నవి మాత్రమే.వచ్చే జనాభా గణనలో లెక్కలు తేలిన తరువాత తలెత్తే కొత్త సమస్యలను ఇప్పుడే ఊహించటం, వ్యాఖ్యానించటం తొందరపాటు అవుతుంది.