Tags
China, Donald trump, India GDP, India per capita GDP, Narendra Modi, Narendra Modi Failures, Xi Jinping
ఎం కోటేశ్వరరావు
జపాన్ను వెనక్కు నెట్టేసి మనదేశం ప్రపంచ జిడిపిలో నాలుగో స్థానానికి చేరిందని, రెండున్నర లేదా మూడు సంవత్సరాల్లో జర్మనీని కూడా పక్కనపెట్టి మూడవ స్థానానికి వెళతామని నీతిఅయోగ్ సిఇవో బివిఆర్ సుబ్రమణ్యం చేసిన ప్రకటనకు మీడియాలో పెద్ద స్పందనే వచ్చింది. అనేక మంది సంతోషిస్తున్నారు. ఇదొక గొప్పా అని పెదవి విరిచేవారు కూడా ఉన్నారు.నూటనలభై కోట్ల జనాభాలో ఈలెక్కల ఆల్జిబ్రా ఎంతమందికి అర్ధం అవుతుంది ? ‘‘ నేను చెప్పినట్లుగా మనది నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, నాలుగు లక్షల కోట్ల ఆర్థికం, ఇది నేను చెబుతున్న సమాచారం కాదు. ఐఎంఎఫ్ చెబుతున్నది, జపాన్ కంటే పెద్ద ఆర్థిక వ్యవస్థ ’’ అని సుబ్రమణ్యం నీతి అయోగ్ పాలకమండలి పదవ సమావేశంలో ప్రకటించారు. మనం రూపొందించిన పథకం ప్రకారం జరిగితే రెండు, రెండున్నర, మూడు సంవత్సరాల్లో మనది మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది అన్నారు. ఐఎంఎఫ్ ఏప్రిల్ 22 సమాచారం ప్రకారం వర్తమాన ధరల్లో సాధారణ(నామినల్) జిడిపి అమెరికా 30.51లక్షల కోట్ల డాలర్లు, చైనా 19.23, జర్మనీ 4.74,భారత్ 4.19, జపాన్ 4.19, బ్రిటన్ 3.84,ఫ్రాన్సు 3.21, ఇటలీ 2.42, కెనడా 2.23, బ్రెజిల్ 2.13 లక్షల కోట్లతో మొదటి పది స్థానాల్లో ఉన్నాయి. 202526 నాటికి మన జిడిపి 4.187.017,జపాన్‌లో 4.186.431 బిలియన్ డాలర్లుగా అంచనా. వేసింది. బొమ్మను పాలకులు ఎలాగూ చూపించారు, వారు మూసిపెట్టే బొరుసు ఎలా ఉందో చూడాలి కదా !
నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2015లో 2.1లక్షల కోట్ల డాలర్ల నుంచి 2025లో దేశ జిడిపి 4.3లక్షల కోట్ల డాలర్లకు చేరినట్లు, ఇది 105శాతం పెరుగుదల అని ఐఎంఎఫ్ కొద్ది నెలల క్రితం చెప్పింది.అదే సంస్థ తాజాగా విడుదల చేసిన అంచనాలో ఆ మొత్తాన్ని 4.187 లక్షల కోట్లకు తగ్గించింది. జపాన్ మొత్తం 4.186 గనుక దాన్ని పక్కన పెట్టి మనకు నాలుగో స్థానాన్ని ఇచ్చింది. తేడా ఎంత 0.001 లక్షల కోట్లు. చెవులప్పగించేవారుంటే కాకమ్మ కతలు చెప్పేవారికి కొదవ ఏముంది. బిజెపి పెద్దలు 2025 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్లకు పెంచుతామని గొప్పలు చెప్పుకున్న అంశం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంతటి అభివృద్ధిని ఏ ప్రభుత్వమూ సాధించలేదని కూడా బిజెపి ఐటి సెల్ మాలవీయ చెప్పారు.అలా ప్రచారం చేయటమే కదా ఆ పెద్దమనిషి ఉద్యోగం. వాస్తవం ఏమిటి, 2004లో మన్మోహన్ సింగ్ అధికారానికి వచ్చినపుడు జిడిపి 709 బిలియన్ డాలర్లు కాగా 2014 నాటికి అది 2030 బిలియన్లకు పెరిగింది. యుపిఏ పాలనా కాలంలో పెరుగుదల రేటు 186 శాతమని, 105కంటే ఎక్కువని కాస్త నిజాయితీ ఉన్నవారు కూడా చెబుతారు.
గతంలో ప్రధాని చెప్పిన కొన్ని అతిశయోక్తుల గురించి చెప్పుకుందాం. ‘‘ గత పదేండ్లలో జిడిపిని రెట్టింపు చేయటం అంకెలు కాదు, 25 కోట్ల మందిని దారిద్య్రరేఖ దాటించి నూతన మధ్యతరగతిని సృష్టించాం. వారు కొత్త జీవితాన్ని ప్రారంభించారు, సచేతనంగా ఆర్థికవృద్ధికి తోడ్పడుతున్నారు ’’. ప్రధాని నోటి నుంచి జాలువారిన ఈ మాటలను చూసి నవ్వాలా ఏడవాలో తెలియటం లేదు. ఇరవై ఐదు కోట్ల మందిని దారిద్య్రరేఖ నుంచి ఎగువకు లాగాం అంటూనే కనీసం ఆహార ధాన్యాలు కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్న 140కిగాను 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార భద్రతా పధకం కింద గోధుమలు, బియ్యం ఇస్తున్నామని, మరికొన్నేండ్లు ఇస్తామని ఒక ఘనతగా చెప్పుకుంటారు. ప్రపంచ ఆకలి సూచికలో తాజాగా 127లో 105వ దేశంగా ఉన్నాం. ఆకలి లేని(9.9), స్వల్ప (10 నుంచి 19.9), తీవ్రం(20 నుంచి 34.9), ఆందోళనకరం(35నుంచి 49.9) , అత్యంత ఆందోళనకరం(50పైన) అనే ఐదు తరగతులుగా దేశాలను విభజిస్తే మన దేశం తీవ్ర తరగతిలో అంతకు ముందు, గత పదేండ్లుగా కూడా ఉంది. పదేండ్లలో జిడిపి రెట్టింపు అని ఇతర గొప్పలు కానీ పది సంవత్సరాల్లో 2014 నుంచి 2014వరకు మన ఆకలి సూచిక స్కోరు 28.2 నుంచి 27.3కు మాత్రమే తగ్గింది,దీనిలో అంత అభివృద్ధి ఎందుకు రాలేదు ? ఇదే కాలంలో పాకిస్తాన్ స్కోరు 29.6 నుంచి 27.9కి తగ్గింది, దీని గురించి చెబితే ఈ దేశంలో పుట్టీ, ఈ దేశంలో పెరిగీ, అన్నం తింటూ పక్కదేశాన్ని పొగుడుతున్నట్లు ఎదురు దాడి చేస్తారు. పాక్ రాంకు మన తరువాత 109, ఆకలిని ఎవరు ఎక్కువగా తగ్గించినట్లు ? గత పదేండ్లలో చైనా స్కోరు ఐదు కంటే తక్కువే ఉందన్న వాస్తవాన్ని చెబితే నానా యాగీ చేస్తారు. మోడీ సాధించిన విజయాలు మీకు పట్టవా అంటారు కొందరు. నిజమే 188 దేశాల జిడిపిలో మనలను నాలుగవ స్థానంలోకి తీసుకు వెళ్లినందుకు మోడీ ఘనత ఖాతాలో వేద్దాం. అదే తలసరి జిడిపిలో 136వ స్థానంలో ఉంచిన ఘనుడని కూడా కీర్తించాలా ! తలసరి జిడిపి కూడా నిజానికి ఒక మైండ్‌గేమ్ తప్ప మరొకటి కాదు. కొందరి దగ్గర సంపదలు పోగుపడటం అంటే ఆర్థిక అసమానతలు పెరుగుతున్నట్లే, మోడీ ఏలుబడిలో పెరిగినట్లు స్పష్టంగా తేలింది. సర్ గోచిపాతరాయుడు సంపద ఒక రూపాయి, 50,49 చొప్పున అంబానీ, అదానీల సంపదలు ఒక దగ్గర చేర్చి మూడుతో భాగిస్తే వచ్చే 33 గోచిపాతరాయుడి సంపద అంటే నవ్విపోతారు. అంబానీ ఇంట వివాహానికి విమానాలు,హెలికాప్టర్లు వేసుకొని వచ్చిన అతిధులు గోచిపాతరాయుడి ఇంటికి వస్తారా !
అసలు జిడిపి చర్చలోకి వెళితే బుర్ర బద్దలవుతుందంటే అతిశయోక్తి కాదు. దీన్ని సాధారణ(నామినల్), పిపిపి(పవర్ పర్చేజింగ్ పారిటీ) పద్దతుల్లో లెక్కిస్తున్నారు. రెండవదే వాస్తవానికి దగ్గరగా ఉంటుందన్నది కొందరి సమర్ధన. దాని ప్రకారం చూస్తే నరేంద్రమోడీ అధికారానికి వచ్చే నాటికే మన దేశం సాధారణంలో పది, రెండవ లెక్కలో మూడవ స్థానంలో ఉంది. మోడీ గణం రెండవ లెక్కలను ఎందుకు చెప్పటం లేదు. ఎందుకంటే దేశాన్ని ఇప్పటికీ అదే స్థానంలోనే మోడీ ఉంచారు గనుక. ఐఎంఎఫ్ 2025 పిపిపి అంచనా ప్రకారం చైనా 42.72, అమెరికా 30.51, భారత్ 17.65 లక్షల కోట్ల డాలర్లతో మూడవదిగా, రష్యా నాలుగు, జపాన్ ఐదవదిగా ఉంది. 2027 తొలి ఆరునెలల్లోనే సాధారణంలో 4.9లక్షల కోట్ల డాలర్లతో జర్మనీని కూడా దాటించేస్తారని ఊదరగొడుతున్నారు.అవన్నీ గిడసబారిన దేశాలుగా మారుతున్నాయి. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఆంబోతుల్లో అన్నట్లుగా చెప్పుకుంటే కుదరదు. మనం పోల్చుకోవాల్సింది చైనాతో కదా ! మన వృద్ధి రేటు చైనా, అమెరికా, జర్మనీ కంటే ఎక్కువగా ఉందని, గడచిన పదేండ్లలో భారత్ 105శాతం పెరుగుదల సాధించగా చైనా 76, అమెరికా 66, జర్మనీ 44, ఫ్రాన్సు 38, బ్రిటన్ 28శాతం పెరుగుదల సాధించిందని ఐఎంఎఫ్ చెప్పింది. లక్ష కోట్ల డాలర్ల కిలోమీటర్(మైలు) రాయిని దేశం 2007లో దాటింది.తదుపరి 2014లో రెండు లక్షల కోట్లు, 2025లో నాలుగు లక్షల కోట్లు దాటింది. 2032నాటికి పదిలక్షల కోట్ల డాలర్ల జిడిపి కలిగిన దేశంగా మారుతుందని కొందరు ఆర్థికవేత్తలు జోశ్యం చెప్పారు. వారి తర్కం ఏమిటి ? 2021లో మూడు లక్షల కోట్లకు విస్తరించింది. కేవలం నాలుగు సంవత్సరాల్లోనే 4.3లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ప్రతి 18నెలలకు ప్రస్తుత వేగంలో ఒక లక్ష కోట్ల డాలర్లు పెరుగుతున్నది. ఇదే కొనసాగితే 2032 నాటికి 10లక్షల కోట్ల డాలర్లకు చేరుతుంది.
రానున్న కొద్ది సంవత్సరాల్లో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నందుకు ఇప్పటి నుంచి సంబరాలు జరుపుకుంటున్న వారిని చూసి ఆర్థిక నిపుణుడు డి ముత్తుకృష్ణన్ ఉత్సవాలు జరుపుకోవాల్సినంత ఘనత ఏమి సాధించామని 2024లోనే ప్రశ్నించారు. జిడిపిలో ఏ స్థానంలో ఉన్నామన్నది కాదు తలసరి రాబడిలో ప్రపంచంలో మనం 140వ స్థానంలో ఉన్నామని, మనకంటే 139దేశాలు ముందున్నాయని గుర్తించాలని చెప్పారు.(తాజాగా 136 గనుక 135 ముందున్నాయి) పిపిపి ప్రకారం చూసినా మన స్థానం 119 అని చెప్పారు. పదేండ్లలో మన జిడిపి 105శాతం పెరిగిందని ఏ ఐఎంఎఫ్ చెప్పిందో అదే సంస్థ 2025 తలసరి జిడిపిలో 141వ స్థానం అని కూడా జోశ్యం చెప్పింది. దివాలా తీసిందని చెప్పిన శ్రీలంక 133, బంగ్లాదేశ్ 143, పాకిస్తాన్ 159, షీ జింపింగ్ ఏలుబడిలో కుప్పకూలిపోయిందని కొంత మంది చెప్పే చైనా 71వ స్థానంలో (తాజాగా 70) ఉందని కూడా ఐఎంఎఫ్ చెప్పింది. మన తలసరి రాబడి పదివేల డాలర్లకు చేరాలంటే కనీసం 30 సంవత్సరాలు కష్టపడి పని చేయాలని, దానికి అనుకూలమైన ఆర్థిక పరిస్థితులు ఉండాలని ముత్తు కృష్ణన్ చెప్పారు. చైనా తలసరి జిడిపి 2025లో 13,873 డాలర్లు, ఇప్పుడున్న మన 2,937 డాలర్ల నుంచి ఎదిగి ప్రధమ స్థానంలో ఉన్న మొనాకో 2,56,581( 2023 ప్రపంచ బ్యాంకు సమాచారం) లేదా డాలర్ దేవుడున్న అమెరికా 89,678(2025 ఐఎంఎఫ్) స్థాయికి, చివరికి పడకకుర్చీ మేథావులు చెబుతున్నట్లుగా అధిగమించే దూరం ఎంతో లేని చైనాను అయినా కనీసం అధిగమించాలంటే ఎంత సమయం పడుతుందో వేరే చెప్పనవసరం లేదు.
ప్రపంచ సవాళ్లు ఉన్నప్పటికీ నరేంద్రమోడీ నాయకత్వం కారణంగా ప్రపంచ వెలుగు దివ్వెగా భారత్ ముందుకు వచ్చిందని బిజెపినేత ప్రదీప్ బండారీ చెప్పిన మాటలు భజనరాయుళ్ల గళం తప్ప మరొకటి కాదు. పదకొండు సంవత్సరాలుగా వేసిన పునాదులే కారణమన్నారు. ఐరోపా దేశాలు, జపాన్ ఆర్థిక వ్యవస్థలు పెరుగుదల లేక గిడసబారిపోయాయి. రెండవ ప్రపంచయుద్ధానికి ముందు ఉన్న వలసలను కోల్పోయిన బ్రిటన్, ఫ్రాన్స్ మాజీ రాజుల వలే ఉన్నాయి. మిలిటరీలను నిషేధించిన కారణంగా అందుకు వెచ్చించే సొమ్మును పరిశోధనలకు మళ్లించి జర్మనీ, జపాన్, అమెరికా ఇచ్చిన దన్నుతో దక్షిణ కొరియా వేగంగా వృద్ధి చెందాయి. ఇప్పుడు వాటికి పరిమితి ఏర్పడిరది కనుకనే మనం ముందుకు వస్తున్నాం. ఒక నాడు మనకంటే వెనుకబడి ఉన్న చైనాతో తప్ప వాటితో పోల్చుకుంటే అవ్వతో వసంతమాడినట్లే ! అదేమంటే చైనా కమ్యూనిస్టు దేశమంటారు, మనది ప్రజాస్వామ్యం, స్వేచ్చ ఎక్కువ గనుక దాని కంటే ఎంతో ముందు ఎందుకు లేదు అంటే సమాధానం ఉండదు. ఒక ఐదు సంవత్సరాల పాటు ఐదులక్షల కోట్ల డాలర్ల గురించి ఊదరగొట్టారు. ఇప్పుడు పదిలక్షల కోట్ల గురించి చెప్పబోతున్నారు. 1950లో మన దేశంలో 20 కోట్ల మంది జనం ఉపాధి కోసం వ్యవసాయంపై ఆధారపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగు భూమి ఎంత పెరిగింది, ఎంత తగ్గింది అన్న లెక్కలను పక్కన పెట్టి స్థిరంగా ఉందనుకున్నప్పటికీ అదే భూమి మీద 2023`24లో జనాభాలో 46.1శాతం మంది ఆధారపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే తెలిపింది. ఆరు సంవత్సరాల క్రితంతో పోల్చితే రెండు శాతం పెరిగారు. అంటే ఇప్పుడు 67 కోట్ల మంది పని చేస్తున్నారు.చైనాలో 24.1 శాతం లేదా 17.66 కోట్ల మంది(2023) పని చేస్తున్నారు. భూమి మీద ఆధారపడే వారు తగ్గటం అభివృద్ధి చెందిన దేశాల లక్షణం. వెనుకటికి ఒకడు మాది నూటొక్క అరకల వ్యవసాయం అని గొప్పలు చెప్పాడట. మీది అంటున్నావు ఎవరెవరికి ఎన్ని అంటే నాది ఒకటి మా అయ్యగారివి వంద అన్నాడట. జిడిపి కూడా అంతే !

ఓకే! ఈ విషయం ఒప్పుకుందాం కాసేపు! నరేంద్ర మోడీ కంటే ముందు దేశం అద్భుతమైన ప్రగతి సాధించిందా! ఎందులోనైనా! ఎందుకో RSS బీజేపీ లను పనిగట్టుకుని విమర్శించడమే చేస్తున్న వ్యాఖ్యలు గా మాత్రమే కనబడుతున్నాయి!
ఇంతకీ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం, భారత దేశం పట్ల చైనా దృక్పథం, అమెరికా కుయుక్తులు ఇలా geopolitical చదరంగం లో ప్రపంచం నలుగుతున్న విపత్కర పరిస్థితిలో మీ చేతిలో ప్రభుత్వాన్ని పెడితే మీరైతే ఏమి చేస్తారు?
LikeLike