Tags

, , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


‘‘ ఆపరేషన్‌ సిందూర్‌లో భారత యుద్ధ విమానాల కూల్చివేతకు అంత ప్రాధాన్యత లేదు గానీ దానికంటే ఎలా కూలిపోయాయన్నది ముఖ్యం, తొలి రోజు వ్యూహాత్మక తప్పిదాలను 48గంటల్లోనే సరిచేసి పాక్‌ మీద దాడి చేశాం ’’ మన రక్షణ దళాల అధిపతి(సిడిఎస్‌) అనిల్‌ చౌహాన్‌ శనివారం నాడు సింగపూర్‌లో చెప్పిన మాటల సారాంశం. అయితే ఎన్నింటిని కూల్చారన్నది చెప్పటానికి నిరాకరించారు గానీ పాక్‌ ప్రధాని చెప్పినట్లుగా ఆరు అన్నది పచ్చి అవాస్తవం అన్నారు. పాక్‌తో ఘర్షణలో ‘‘ వైమానిక ఆస్తులను కొన్నింటిని కోల్పోయాం ’’ అని చెప్పారు, అంటే విమానాలు అని చెప్పనవసరం లేదు. పరిస్థితి అణుదాడుల వరకు వచ్చిందన్నది కూడా అవాస్తవం అన్నారు.మూడు రాఫేల్‌ విమానాలను పాక్‌ దళాలు కూల్చివేసినట్లు వచ్చిన తొలుత వచ్చిన వార్తలను మన అధికారులు ఖండిరచిన సంగతి తెలిసిందే. యుద్ధం అన్న తరువాత నష్టాలు ఉంటాయని, మన పైలట్లు అందరూ సురక్షితంగా తిరిగి వచ్చినట్లు కొద్ది రోజుల క్రితం మన త్రివిధ దళాల అధిపతులు విలేకర్ల సమావేశంలో చెప్పినపుడే సూచన ప్రాయంగా స్పష్టమైంది. ఇప్పుడు సిడిఎస్‌ మరింత స్పష్టంగా చెప్పారు. మరి ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ, ఒక్క విమానమూ కూలలేదని ఊరూవాడా ఊదరగొట్టిన కాషాయ మరుగుజ్జులు, వాటిని ప్రామాణికంగా తీసుకున్న మీడియా నిపుణులు ఏమంటారో తెలియదు. ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ సెక్యూరిటీ స్టడీస్‌, సింగపూర్‌ సంస్థ షాంగ్రీ లా డైలాగ్‌(ఎస్‌ఎల్‌డి) పేరుతో ప్రతి ఏటా చర్చలు నిర్వహిస్తున్నది. 2001లో పురుడు పోసుకున్న ఈ సంస్థ 2002లో తొలి సారిగా అనధికార చర్చలు నిర్వహించింది. ఈ చర్చలను ఆసియా భద్రతా వ్యవహారాల సభగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో 22వ సభ మే నెల 30,31, జూన్‌ ఒకటిన జరిగింది. మన దేశం తరఫున 31వ తేదీన మన సిడిఎస్‌ అనిల్‌ చౌహాన్‌ అధికారయుతంగానే పాల్గొన్నారు.ఆ సభలో మాట్లాడటంతో పాటు వెలుపల రాయిటర్స్‌ వార్తా సంస్థ, అంతర్జాతీయ విలేకర్లతో కూడా ఆయన మాట్లాడారు. బ్లూమ్‌బెర్గ్‌ టీవీకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఈ సమావేశాలకు వివిధ దేశాల అధినేతలు, రక్షణ మంత్రులు,ఉన్నతాధికారులు రావటం జరుగుతున్నది. ప్రపంచమంతా తిరిగి పాకిస్తాన్‌ దుర్మార్గాలను ఎండగట్టాలని పార్లమెంటరీ ప్రతినిధి బృందాలను పంపి హడావుడి చేసిన ప్రభుత్వం కొద్ది ఖర్చుతో ఆసియా ఖండం, ఇతర దేశాల నుంచి వచ్చే ప్రముఖులు పాల్గొనే ఈ సభలో ప్రభుత్వం ప్రధాని లేదా కనీసం రక్షణ మంత్రి లేదా విదేశాంగ మంత్రిని అయినా పంపలేదంటే వారికి ఎంత శ్రద్ద ఉందో వెల్లడి అవుతున్నది. పోనీ ఇంతకంటే దేశంలో ఉండి పొడుస్తున్నది ఏమైనా ఉందా ! సింగపూర్‌లో సిడిఎస్‌ చెప్పిన మాటలు అనేక అంశాలను ముందుకు తెచ్చాయి.మామ తిట్టినందుకు కాదు గానీ తోడల్లుడు తొంగిచూసి కిసుక్కున నవ్వినందుకు అన్నట్లు సిడిఎస్‌ మాటలపై చర్చ చేస్తే దేశద్రోహం అంటారేమో !

‘‘ మే ఏడవ తేదీన జరిగిందాన్ని గురించి నేను చెప్పగలిగిందేమిటంటే తొలి దశలో కొన్ని నష్టాలు ఉన్నాయి.సంఖ్య ముఖ్యం కాదు… ఆ నష్టాలు ఎందుకు జరిగాయి, ఆ తరువాత మనమేమి చేయాలనన్నది ముఖ్యమైన అంశం. మంచి విషయం ఏమంటే వ్యూహాత్మకంగా చేసిన తప్పిదాలను మేము అర్ధం చేసుకోగలిగాం, వాటికి పరిష్కారం ఉంది, వాటిని సరిదిద్దాం, రెండు రోజుల తరువాత దాన్ని అమలు జరిపాం, అన్ని రకాల మందుగుండుతో మన జెట్‌ విమానాలన్నీ మరోసారి దూరంగా ఉన్న లక్ష్యాలను చేధించేందుకు ఎగిరాయి. ఒక మీటరు అటూ ఇటూగా మూడు వందల కిలోమీటర్ల దూరంలోని పాకిస్తాన్‌ వైమానిక స్థావరాల మీద దాడి చేయగలిగాం, చైనా వారి ఆయుధాలు ఏమీ పని చేయలేదు. పాకిస్తాన్‌తో చైనా సన్నిహితంగా మెలిగినప్పటికీ వివాద సమయంలో చైనా నుంచి వాస్తవంగా సాయం అందిన సూచనలు లేవు. ఉత్తర సరిహద్దులో పరిస్థితులన్నీ సాధారణంగానే ఉన్నాయి. (వివాదం సందర్భంగా చైనా గూఢచార సమాచారం అందించిందా అన్న ప్రశ్నకు ) అలాంటి దానిని వాణిజ్యపరంగా చైనా నుంచి పొంది ఉండవచ్చు, చైనా లేదా అదేవిధంగా ఇతర వనరులనుంచి కూడా కావచ్చు ’’ అని సిడిఎస్‌ చెప్పారు. మొత్తం మీద సారాంశం ఇది.
ఇక చైనా ఆయుధాలు తుస్సుమన్నాయి, దేనికీ పనికిరానివని తేలిపోయింది, దీంతో మిలిటరీ అధికారులను చైనా జైల్లో పెట్టారని రాశారు. పాకిస్తాన్‌ వారే కొనుగోలు చేసేందుకు విముఖత చూపుతున్నారంటూ విశ్లేషణలు చేసిన వారు, వాటికి ప్రాధాన్యత ఇచ్చిన మీడియా యుద్ధ వీరులు ఇప్పుడు ఎలాంటి కతలు చెబుతారో తెలియదు. మన దగ్గర రష్యా ఇచ్చిన సుదర్శన చక్రం ఎస్‌`400 ఉంది, చైనా దగ్గర ఉన్నవి పని చేయటంలేదు, పనిలో పనిగా దాని ఆధీనంలో ఉన్న ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకోవటానికి ఇదే తరుణం అని సలహాలు ఇచ్చిన వారు కూడా లేకపోలేదు. అసలు విమానాలు కూలలేదు, తప్పుడు సమాచారం వ్యాపింప చేస్తున్నారంటూ దాడులకు దిగిన సామాజిక మాధ్యమ మరుగుజ్జులు ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు, కొన్ని నష్టాలు జరిగినా అంతిమంగా పాకిస్తాన్ను దెబ్బతీశామా లేదా అన్నది చూడాలంటున్నారు. ఈ వితండవాదానికి తిరుగులేదు.

విమానాలు కూలింది మన గడ్డమీదా లేక పాక్‌ భూమిలోనా అన్నది మరింత ఆసక్తికరంగా మారింది. మన పైలట్లు సురక్షితంగా వచ్చారని మన అధికారులు చెప్పటాన్ని బట్టి కూలింది మన దేశంలోనే అని చెప్పవచ్చు.2019లో బాలాకోట్‌ మెరుపుదాడుల సమయంలో పాక్‌ మిలిటరీ మన మిగ్‌ విమానాన్ని వారి భూభాగంలో కూల్చివేసి పైలట్‌ అభినందన్‌ వర్దమాన్ను బందీగా పట్టుకున్న సంగతి తెలిసిందే. మన భూభాగంలోనే మన విమానాల కూల్చివేత జరిగిందంటే అవి ఎగరగానే గతంలో చైనా నుంచి కొనుగోలు చేసిన పాక్‌ రాడార్లు పసిగట్టి కూల్చివేసినట్లు కనిపిస్తోంది. చైనా క్షిపణులు లేవలేదు, లేచినవి మన భూభాగంలో పేలకుండా పడ్డాయి అన్న వార్తలు తెలిసిందే. చైనా ఆయుధాలు పని చేయలేదని సిడిఎస్‌ కూడా చెప్పారు. అదే నిజమైతే అంటే పాకిస్తాన్‌ దగ్గర చైనా లేదా అమెరికా ఆయుధాలు తప్ప వేరే దేశానివి లేవు. అమెరికా వాటితోనే కూల్చివేసి ఉండాలి. వాటిని ఉపయోగించటానికి కొన్ని షరతులు పెట్టామని గతంలో అమెరికా ప్రకటించింది, ఈ సందర్భంగా ట్రంప్‌ వాటిని సడలించి ఉండకపోతే పాక్‌ మిలిటరీ ప్రయోగించి ఉండేది కాదు. ఆ విషయాన్ని చెప్పటం దేశద్రోహం కాదు, జరిగే నష్టమూ లేదు. రష్యా సుదర్శన చక్రంతో దెబ్బతీసినట్లు చెప్పుకున్న మనం అమెరికా ఆయుధాలతో దెబ్బతిన్నామని అంగీకరిస్తే కలిగే నష్టం ఏముంది ? ట్రంప్‌ అంటే భయమా ?


అసలేం జరిగిందో చెప్పాలన్న ప్రతిపక్షాల మీద సైన్యాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తారా అంటూ ఎదురుదాడి చేసిన బిజెపి, కాషాయ దళాలు, సామాజిమాధ్య మరుగుజ్జులు ఇప్పుడెలా ఎగిరిపడతారో చూడాలి. పార్లమెంటు సమావేశం జరపాలన్న డిమాండ్‌ను బిజెపి తిరస్కరిస్తే చాలా మందికి అంతుబట్టలేదు గానీ అనిల్‌ చౌహాన్‌ ప్రకటనతో అసలు సంగతి అర్ధమైంది. నాలుగు రోజుల్లోనే ఆకస్మికంగా దాడులు ఆపివేసి కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవటం వెనుక కూడా విమానాలు కూలిపోయిన ప్రభావం ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.మన తప్పిదాలను గుర్తించి సరి చేసుకున్నట్లే పాకిస్తాన్‌ కూడా తన తప్పిదాలను సవరించుకొని ఎదురుదాడులకు సిద్దమైందా ? ఇప్పటికైనా పార్లమెంటును సమావేశపరచి సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం లేదా !

యుద్ధం అన్న తరువాత రెండువైపులా నష్టాలు ఉంటాయనేందుకు రెండవ ప్రపంచ పోరు చక్కటి ఉదాహరణ అన్నది అందరికీ తెలిసిందే. పాక్‌తో జరిగిన యుద్ధాలు, చిన్న చిన్న జగడాలు అయినా అంతే దానికి మన దళాలను తప్పుపట్టాల్సింది గానీ నిరుత్సాహపరచాల్సిందిగానీ ఏమీ లేదు. పాక్‌ ఉగ్రవాదుల మీద కంటే మన జనం మీదనే బిజెపి దళాలు పెద్ద ప్రచారదాడి చేసినట్లు కనిపిస్తోంది. కొందరు నేతలు ఎలా నోరు పారవేసుకున్నదీ ఒక మధ్య ప్రదేశ్‌ మంత్రి మీద విచారణ జరపాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతీ తెలిసిందే. విదేశీ సంస్థలు ఇచ్చిన విమానాల కూల్చివేత వార్తలను చైనా అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ఇచ్చింది. మాతో నిర్ధారించుకోకుండా నిరాధార వార్తలను రాస్తారా అంటూ మన విదేశాంగశాఖ నిరసన తెలిపింది. మరి ఇప్పుడు ఏమంటారు ? గతంలో ఇతర దేశాల మీడియా ఇచ్చిన సమాచారాన్ని గ్లోబల్‌ టైమ్స్‌ వార్తగా ఇచ్చినట్లే సిడిఎస్‌ చెప్పిన బ్లూమ్‌బెర్గ్‌ వార్తను ఉటంకిస్తూ అదే పత్రిక రాసింది.పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా మన సైన్యం ప్రాణాలకు తెగించి దెబ్బకు దెబ్బ తీస్తే అదేదో మోడీ స్వయంగా చేసినట్లు చిత్రించారు.తన వ్యక్తిగత ప్రతిష్టను, దానికి లోబడి బిజెపిని జనంలో ప్రచారం చేసేందుకు నరేంద్రమోడీ పడిన తాపత్రయం, చేసిన ఖర్చు, మీడియాను గోడియాగా మార్చిన తీరు, సామాజిక మాధ్యమ సంస్థలకు ఇచ్చిన పాకేజీల గురించి తెలిసిందే.


జరిగిందాన్ని గురించి కాంగ్రెస్‌ అనేక ప్రశ్నలను సంధించింది.మిలిటరీ చర్యలను సమర్ధించింది. తెలంగాణా మంత్రి కెప్టెన్‌ ఉత్తమకుమార్‌ రెడ్డి, జయరామ్‌ రమేష్‌ విలేకర్లతో మాట్లాడారు. జరిగిందాని మీద ఒక సమీక్షా కమిటీని వేయాలని కోరారు. కార్గిల్‌ యుద్ధం జరిగినపుడు ప్రస్తుత విదేశాంగ మంత్రి జై శంకర్‌ తండ్రి, రక్షణ వ్యవహారాల నిపుణుడు కె సుబ్రమణ్యం అధ్యక్షతన 1999లో వాజ్‌పాయి ఒక సమీక్షా కమిటీని ఏర్పాటు చేసినట్లు జయరామ్‌ రమేష్‌ గుర్తు చేశారు.ఐదు నెలల తరువాత ఆ కమిటీ సమర్పించిన నివేదికను పార్లమెంటు ఉభయ సభలలో ప్రవేశపెట్టారని ఇప్పుడు కూడా సిడిఎస్‌ చెప్పిన అంశాలను సమీక్షించాలని కోరారు.


సింగపూర్‌ సమావేశానికి సిడిఎస్‌ అనిల్‌ చౌహాన్ను పంపి చాణక్యుడు అనుకుంటున్న నరేంద్రమోడీ పప్పులో కాలువేశారా ? సిడిఎస్‌ను సింగపూర్‌కు అనవసరంగా పంపారని అక్కడ ఆయన ఒక ప్రచార విజయాన్ని పాకిస్తాన్‌కు అందచేశారని రక్షణ రంగ వ్యూహకర్త బ్రహ్మ చెలానే విమర్శించారు.పాకిస్తాన్‌కు మనం కలిగించిన నష్ట వివరాలతో పాటు మన విమానాలను కోల్పోయినట్లు మన గడ్డ మీద మాత్రమే చెప్పాలని అన్నారు. సింగపూర్‌ సభకు పాక్‌ మిలిటరీ అధికారి కూడా వచ్చారని ఆ సందర్భంగా మన నష్టాల గురించి చెప్పటం పాకిస్తాన్‌తో అనుసంధానం చేయటమే అన్నారు.భారత నిర్ణయాత్మక విజయాన్ని వివరించేందుకు నరేంద్రమోడీ రోడ్‌ షోలు చేస్తున్నారు. అయినప్పటికీ వాణిజ్య ఆంక్షలు విధిస్తాననే బెదిరింపుతో మిలిటరీ శత్రుత్వాన్ని తానే ఆపినట్లు డోనాల్డ్‌ ట్రంప్‌ పదే పదే చెబుతున్నాడు.మోడీ ప్రయత్నాలను బలహీనపరుస్తున్నాడు. సింగపూర్‌లో మీడియాతో మాట్లాడి సిడిఎస్‌ పరిస్థితిని మరింత సంక్లిష్టం కావించారని చెలానే వ్యాఖ్యానించారు. ఆపరేషన్‌ సింధూర్‌ లక్ష్యాలు ఏమిటో చెప్పకుండా కొన్ని విమానాలు నష్టపోవటం గురించి చెప్పటం ఏమిటని మరో విశ్లేషకుడు సుషాంత్‌ శరీన్‌ అన్నారు.కొన్ని విమానాలు నష్టపోవటం కొలమానం కాదన్నారు. మొత్తం మీద చూసినపుడు మిలిటరీ చర్యలను అధికారంలో ఉన్న పార్టీ తన ప్రతిష్టను పెంచుకొనేందుకు చూస్తే ప్రతిపక్షాలు చూస్తూ ఊరుకోవని ఇప్పటికే వెల్లడైంది. మణిపూర్‌ పర్యటించి అక్కడి పౌర సమాజంలో తలెత్తిన అపోహలను పొగొట్టేందుకు రెండు సంవత్సరాలుగా దాని మొహం చూడని ప్రధాని నరేంద్రమోడీ పాక్‌తో ఘర్షణపై పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు తిరస్కరించి అప్రజాస్వామికంగా వ్యవహరించారనే విమర్శను మూటగట్టుకున్నారు. నష్ట నివారణకు ఇప్పటికీ సమయం మించి పోలేదు. విదేశాల్లో పర్యటించి వచ్చిన పార్లమెంటరీ బృందాల అనుభవాల పేరుతో పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తే పరువు దక్కుతుంది.