Tags
Anti China Media, Anti communist, BJP, China, Made in China 2025, Make In India, make in india crew line for made in china products, Narendra Modi Failures, Narendra Modi in Policy dilemma, RSS, Xi Jinping
ఎం కోటేశ్వరరావు
మన ఆటోమొబైల్ పరిశ్రమ చైనా నుంచి రావాల్సిన ఒక చిన్న పరికరం కారణంగా ప్రస్తుతం ఆందోళన చెందుతోందంటే ఎవరైనా నమ్ముతారా ? అదే నియోడిమియమ్ ఐరన్ బోరోన్ అనే మాగ్నెట్.కార్లలో స్టీరింగ్ నుంచి బ్రేకులు, వైపర్‌లు, ఆడియో పరికరాల వంటి వాటికి ఇది ఎంతో ముఖ్యం. అది లేకపోతే మొత్తం కారు సిద్దమైనా ప్రయోజనం ఉండదు. వాటి తయారీ, సరఫరాలో గుత్తాధిపత్యం ఉన్న చైనా ఏప్రిల్ నుంచి ఎగుమతుల మీద పలు ఆంక్షలు విధించింది. వాటిని దేనికి వినియోగిస్తారో ముందుగానే ఆయా దేశాలు హామీ పత్రాలు ఇవ్వాలన్నది వాటిలో ఒకటి. కొన్ని దేశాలు వాటిని కొని చైనాతో వైరానికి దిగిన అమెరికా, ఐరోపా దేశాలకు అమ్ముకుంటున్నాయి.దాన్ని నిరోధించేందుకే ఆ షరతు అన్నది స్పష్టం. మన దేశంలో గతంలో దిగుమతి చేసుకున్న నిల్వలు జూన్ మొదటి వారం వరకు వస్తాయని అందువలన త్వరగా తెచ్చుకొనేందుకు చైనాతో సంప్రదింపులు(పైరవీలు) జరపాలని ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ సొసైటీ, ఆటోమోటివ్ కాంపొనెంట్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ల ప్రతినిధులు చైనా వెళ్లేందుకు సిద్దం అవుతున్నారని బిజినెస్ టుడే పత్రిక 2025 మే 31వ తేదీ వార్తలో పేర్కొన్నది. 2024లో 470 టన్నుల మాగ్నెట్‌లు దిగుమతి చేసుకోగా ఈ ఏడాది 700 టన్నులకు నిర్ణయించారు. చైనా మీద ఆధారపడకుండా మనమే మాగ్నెట్‌లు తయారు చేసేందుకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలో నిర్ణయించేందుకు జూన్ 3న ఉన్నతస్థాయి కమిటీ సమావేశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు కూడా ఆ పత్రిక రాసింది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవటం అంటే ఇదే ! పదకొండు సంవత్సరాల నుంచి ఏం చేసినట్లు ? తన పెట్టుబడులను మన ప్రభుత్వం అడ్డుకున్న కారణంగానే సరఫరాకు చైనా ఆంక్షలు పెడుతోందా ? ఏమో, ఎవరి ప్రయోజనం వారిది, ఎవరి తురుపు ముక్కలు వారివి !
లోకల్ సర్కిల్స్ అనే సంస్థ 2025 ఏప్రిల్ 25వ తేదీన తన సర్వే నివేదికను ప్రచురించింది.దాన్లో చెప్పినదాని ప్రకారం గడచిన ఏడాది కాలంలో భారతీయుల్లో 62శాతం మంది చైనా వస్తువులను కొనుగోలు చేశారు. అంతకు ముందు ఏడాది వారు 55శాతమే ఉన్నారు, 15శాతం మంది కొత్త చైనా వస్తువులు భారతీయ కంపెనీల ద్వారా వస్తే కొనుగోలు చేయటం ఖాయమని చెప్పారు. ఈ వివరాలు సూచిస్తున్నదేమిటి ? స్వదేశీ వస్తువులనే వాడండి అని పాలకులు ఎన్ని సుభాషితాలు పలికినప్పటికీ జనం పట్టించుకోవటం లేదు. ఆధునిక జీవితం, వినియోగదారీ తత్వాన్ని పెంచుతున్న కారణంగా నాణ్యమైన, చౌకగా దొరికే చైనా వస్తువుల కోసం ప్రపంచమంతా ఎగబడుతున్నపుడు మనవారు దూరంగా ఉంటారా ! మావెనుకే జనం ఉన్నారని చెప్పుకుంటున్న పార్టీ మాటలు విని ఉంటే చైనా దిగుమతులు పడిపోయేవి. దానికి విరుద్దంగా మోడీ ఏలుబడిలో రికార్డులు బద్దలవుతున్నాయి.
పదకొండు సంవత్సరాల ప్రచార ఆర్భాటం తరువాత పరిస్ధితి ఏమిటి ? ఏదీ ఊరికే రాదు. ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో లక్కు మీద ఆధారపడిన రాజేంద్ర ప్రసాదు మాదిరి ఉంటే కుదరదు. కొంత మందికి చైనాలో కమ్యూనిస్టు నియంత్రత్వం కనిపిస్తుంది. నియంతల పాలన ఉన్నదేశాలన్నీ దాని మాదిరి ఎందుకు అభివృద్ధి చెందలేదో చెప్పాలి మరి. పరిశోధన మరియు అభివృద్ధికి గణనీయంగా ఖర్చు పెట్టిన కారణంగానే చైనా అనేక రంగాలలో దూసుకుపోతున్నది. ముందే చెప్పుకున్న మాగ్నెట్‌ల ఎగుమతిలో చైనా వాటా ప్రపంచంలో అపురూప ఖనిజాలతో తయారయ్యే వాటిలో 80శాతం వరకు ఉన్నట్లు అంచనా, మెటల్ మాగ్నెట్లలో 2012లో 49.6శాతం ఉండగా 2024కు అది 63.5శాతానికి పెరిగింది.నాన్ మెటల్ మాగ్నట్లలో 50.8 నుంచి 59.1శాతానికి పెరిగింది(మనీ కంట్రోల్ వెబ్ 2025 మే 29).మన నరేంద్రమోడీ తలచుకోవాలే గానీ తెల్లవారేసరికి వాటిని ఉత్పత్తి చేయగలరని గొప్పలు చెప్పేవారు మనకు కనిపిస్తారు. వాస్తవం ఏమంటే 2013లో మనకు అవసరమైన మెటల్ మాగ్నట్లలో చైనా నుంచి 73.5శాతం దిగుమతి చేసుకుంటే 2024లో 82.9శాతానికి పెరిగాయి. విద్యుత్ వాహనాల తయారీలో ఈ మాగ్నెట్‌లు కీలకం. పాకిస్తాన్ వందకు వంద, ఐరోపా సమాఖ్య 90, దక్షిణ కొరియా 87.4శాతం, అమెరికా దిగుమతుల్లో 75శాతం చైనా నుంచి తెచ్చుకుంటున్నాయి. ప్రపంచంలో 78 దేశాలు చైనా నుంచి దిగుమతి చేసుకుంటుండగా వాటిలో 41 చైనా మీద 60శాతంపైగా ఆధారపడి ఉన్నాయి.మన పాలకులు లేదా పరిశ్రమగానీ చైనా మీద ఆధారపడకుండా చేయటంలో విఫలమయ్యారు. డోనాల్డ్ ట్రంప్ ఏడు అపురూప ఖనిజాలు, మాగ్నెట్ ఉత్పత్తుల దిగుమతుల మీద ఆంక్షలు విధించాడు.ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిందన్నట్లుగా ఇది ఇతర దేశాలకు ఇబ్బందులు తెచ్చింది. మన విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ మే నెలలో 30 సర్టిఫికెట్లు జారీ చేసి చైనా నుంచి దిగుమతుల పునరుద్దరణకు వీలు కల్పించినట్లు వార్తలు వచ్చాయి. వాటిని రక్షణ అవసరాలకు లేదా తిరిగి అమెరికాకు ఎగుమతులు చేయబోమని హామీ ఇచ్చింది.వాటిని చైనా పరిశీలించిన తరువాత దిగుమతి చేసుకోవచ్చు, ఆ ప్రక్రియను త్వరగా చేపట్టాలనే పరిశ్రమల వారు పైరవీ కోసం చైనా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారని ముందే చెప్పుకున్నాం.
బిజెపి లేదా దానికి భజన చేసే గోడీ మీడియా పండితులు మేకిన్ ఇండియా గురించి గోరంతను కొండంతలుగా చిత్రించి కబుర్లు చెబుతారు. రాజకీయంగా అమెరికాతో అంటకాగేందుకు కేంద్ర పాలకులు తపించి పోతుంటారు. కాషాయ దళాలు నిత్యం చైనా, కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొడుతుంటాయి. కానీ ఆర్థిక విషయాల్లో మాత్రం చైనా కావాల్సి వస్తోంది. నరేంద్రమోడీ అధికారం స్వీకరించగానే 2014లో చెప్పిందేమిటి ? మేకిన్ ఇండియా పథకంతో దేశాన్ని ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా మారుస్తా, అందుకు అవసరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తా అన్నారు, ఉత్పత్తితో ముడిపెట్టిన ప్రోత్సాహక పధకం(పిఎల్‌ఐ) ప్రకటించారు. జిడిపిలో ఉత్పాదక రంగ వాటాను 15 నుంచి 2025 నాటికి 25శాతానికి పెంచుతానని, కీలక రంగాల్లో చైనా మీద ఆధారపడటాన్ని తగ్గిస్తా అని చెప్పారు. అందుకు దేశమంతటా గుజరాత్ నమూనా అభివృద్ధి చేస్తా అన్నారు. పదేండ్లలో జరిగిందేమిటి ? కొంత మేరకు ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతుల విలువ పెరిగింది. జిడిపిలో వస్తూత్పత్తి వాటా పెరగకపోగా 14శాతానికి తగ్గింది. దీని గురించి మాట్లాడకుండా సెల్ ఫోన్ల ఎగుమతి చూడండి, ఆపిల్ కంపెనీ 20శాతం ఉత్పత్తి ఇక్కడే చేస్తున్నది అంటూ సర్వస్వం అదే అన్నట్లుగా చిత్రిస్తున్నారు. పిఎల్‌ఐ స్కీములో కేటాయించిన 1.9లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ దీనికి ఒక కారణం. టెలికమ్యూనికేషన్స్, పివి సెల్స్ వంటి కొన్ని దిగుమతులు చైనా నుంచి తగ్గాయి. కానీ ఔషధ రంగానికి అవసరమైన ఏపిఐ దిగుమతులు 75 నుంచి 72శాతానికి మాత్రమే తగ్గాయి. అనేక రంగాలకు ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాలను సాధించటంలో వైఫల్యం కనిపిస్తుంది. మొత్తంగా విజయమా వైఫల్యమా అన్నది చూడాలి. యాపిల్ కంపెనీని ఒక ఉదాహరణగా చూపుతున్నారు.చైనాలో ఉత్పాదక ఖర్చు పెరిగిన కారణంగా అది వియత్నాం, మనదేశానికి వచ్చింది. అమెరికాలో తడిచి మోపెడవుతుంది గనుక ఎన్ని పన్నులు వేసినా విదేశాల్లోనే తయారు చేస్తానని ట్రంప్‌కు తెగేసి చెప్పింది.షీ జింపింగ్, నరేంద్రమోడీ, ట్రంపా ఎల్లయ్యా పుల్లయ్యా అన్నది కాదు, దానికి కావాల్సింది లాభాలు. రేపు ఆఫ్రికా ఖండంలో ఖర్చు తక్కువగా ఉంటే పొలో మంటూ అక్కడికి పోతుంది. ఆ కంపెనీ చైనాలో విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, విడిభాగాలు తయారు చేసే పరిశ్రమలతో సమగ్ర ఒప్పందాలు చేసుకుంది. చైనా ప్రభుత్వ సహకారంతో రెండు దశాబ్దాల కాలంలో అది జరిగింది. మనదేశంలో అలాంటివేమీ లేదు.
వాజ్‌పాయి పాలనలో దేశం వెలిగి పోయింది అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ పాలన ముగిసి యుపిఏ అధికారానికి వచ్చిన రెండేళ్లకు 2006లో నేషనల్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంపిటీటివ్ కౌన్సిల్ ఉత్పాదక రంగం సంక్షోభంలో ఉందని, జాతీయ ఉత్పాదక విధానాన్ని రూపొందించాలని కోరింది. దానికి అనుగుణంగా 2011లో యుపిఏ సర్కార్ పదేండ్లలో జిడిపిలో ఉత్పాదక రంగ వాటాను 25పెంచేందుకు ఒక విధానాన్ని ఆమోదించింది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2014లో దానికి మేకిన్ ఇండియా అనే పేరు తగిలించి తానే రూపొందించినట్లు ప్రచారం చేసుకున్నారు. దాన్లో భాగంగానే సబ్సిడీలకు ప్రోత్సాహకాల పేరుతో కొత్త పేరు పెట్టి 2020లో పిఎల్‌ఐ స్కీమును ఐదేండ్ల ప్రణాళికతో ప్రకటించారు. దాని గడువు ముగిసినప్పటికీ లక్ష్యాలను సాధించకపోవటంతో పొడిగించాలని నిర్ణయించారు. చిత్రం ఏమిటంటే గాల్వన్ లోయ ఉదంతాల తరువాత దేశభద్రతకు ముప్పు అనే పేరుతో పరోక్షంగా చైనా పెట్టుబడులను నిషేధించిన మోడీ సర్కార్ ఈ స్కీము కింద ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో చైనా కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టి సబ్సిడీలు పొందవచ్చని నిర్ణయించింది. అయితే దానికి మనదేశంలో ఉన్న ఏదైనా కంపెనీతో సంయుక్త భాగస్వామ్యంలో 49శాతం వాటాకు పరిమితం కావాలని, యాజమాన్యం భారతీయ కంపెనీల చేతుల్లో ఉండాలని, సాంకేతిక పరిజ్ఞాన బదిలీలు జరగాలని షరతు పెట్టింది.(ఫైనాన్సియల్ ఎక్స్‌ప్రెస్ 2025 ఏప్రిల్ 28). వేగంగా పని చేస్తానని చెప్పుకొనే మోడీ సర్కార్‌కు ఈ నిర్ణయం తీసుకొనేందుకు పదేండ్లు పట్టింది, చివరకు పెట్టుబడిదారుల వత్తిడి పని చేసినట్లు కనిపించి, ఏదైతే అదవుతుందని సందిగ్ధావస్ధ నుంచి బయటపడినట్లు ఉంది. చైనా, దాని కమ్యూనిస్టు పార్టీని వ్యతిరేకించే పచ్చివ్యతిరేకులు బిజెపిలో పుష్కలంగా ఉన్నారు. వారు అడుగడుగునా అడ్డుతగులుతున్నారు కనుకనే ఈ అలశ్యం. ఎందుకంటే చైనాను అనుమతిస్తే వారి సైద్దాంతిక దాడిని జనం ఏమాత్రం నమ్మరు. అన్నింటికీ మించి అమెరికా, ఐరోపా ధనికదేశాల మీద ఉన్న మోజు మామూలుగా లేదు. వేదాల్లో అన్నీ ఉన్నాయష అని చెప్పేవారు సంస్కృత గ్రంధాల్లో విమానాల తయారీతో సహా ఉందని చెబుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏమైనా వెలికితీశారా అంటే అదీ లేదు. పోనీ ఈ పదేండ్లలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిధులేమైనా కేటాయించిందా ? గత మూడు పారిశ్రామిక విప్లవాల బస్సులను ఎక్కలేకపోయామని నరేంద్రమోడీ చెప్పింది నిజమే, కానీ నాలుగో బస్సును ఎక్కటానికి చేసిందేమిటి అన్నది ప్రశ్న. జిడిపిలో అమెరికా 2.8, చైనా 2.1,దక్షిణ కొరియా 4.2, ఇజ్రాయెల్ 4.3శాతం ఖర్చు చేస్తుంటే మన ఖర్చు పదేండ్లలో 0.6 నుంచి 0.7శాతం మధ్య ఉందంటే మోడీ దేశాన్ని ఎంత వెనక్కు తీసుకుపోయారో అర్ధం అవుతోంది. ఎంతసేపూ ఆవు పేడలో, మూత్రంలో బంగారం ఉందా,ఏముంది అనే ఆత్రంతో పరిశోధనల మీద ఉన్న కేంద్రీకరణ మిగతా వాటి మీద లేదు. ఇందువల్లనే మనదంటూ చెప్పుకొనేందుకు హిందూత్వ తప్ప ఒక్క వస్తు బ్రాండైనా లేదు. చైనా నుంచి కంపెనీలు వస్తున్నాయదిగో చూడండి ఇదిగో చూడండి అంటూ ఇంట్లోకి గేటు బయటకు తిరిగి చూసినట్లు తప్ప స్వంత కంపెనీల ఏర్పాటు గురించి పట్టించుకోలేదు. ప్రైవేటు వారికి ఏం పడుతుంది, రిలయన్స్ , ఇతరులకు చమురు తవ్వకం ఇచ్చారు. పదేండ్ల నాటికీ ఇప్పటికీ స్వంత ఉత్పత్తి తగ్గింది తప్ప పెరగలేదు.
పదకొండేండ్ల మోడినోమిక్స్ తీరు తెన్నులు చూసినపుడు కొన్ని ధోరణులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎండమావుల వెంట నీళ్ల కోసం పరుగెత్తినట్లుగా ఆధునిక టెక్నాలజీ కోసం మనదేశం అమెరికా వైపు చూస్తోంది. ఇంథనం, ఆయుధాల కోసం రష్యా మీద, చౌకగా వచ్చే వస్తువుల కోసం చైనా మీద ఆధారపడినట్లు కనిపిస్తోంది. ఇలా ఎంతకాలం అన్నది ప్రశ్న. చైనా వస్తువుల మీద ఆధారపడిన అమెరికా, ఇతర ఐరోపా దేశాలు నేర్చుకున్న గుణపాఠం మనవారు నేర్చుకోవటానికి సిద్దంగా లేరు. అందుకు నిదర్శనం పరిశోధన మరియు అభివృద్ధి కేటాయింపులను నిర్లక్ష్యం చేయటమే. మనదంటూ ఒక ప్రత్యేకత లేకపోతే సమగ్ర స్వయం సమృద్ధి అనేది పగటి కలే. ఏ దేశం కూడా మరొక దేశానికి తనకు లబ్దికలిగించే పరిజ్ఞానాన్ని మరొకదేశానికి పంచుకొనే స్థితి ప్రస్తుతం లేదు. అది పాతబడిన తరువాత మాత్రమే బదలాయిస్తున్నాయి. దేశాలతో వ్యవహరించే తీరును బట్టి వాణిజ్య లావాదేవీలు జరుగుతాయి. మనం ఇతరుల మీద ఆధారపడినంతకాలం అవి చెప్పినట్లు మనం వినాలి తప్ప మన మాట చెల్లదు. ఉదాహరణకు గాల్వన్ లోయ ఉదంతాలు జరిగినపుడు చైనా వస్తువుల దిగుమతులు నిలిపివేసి డ్రాగన్ దేశాన్ని మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని అనేక మంది వీధుల్లో వీరంగం వేశారు.చైనా ఎగుమతులు ఎన్ని, వాటిలో మనదేశ వాటా ఎంత అన్న కనీస సమాచారం తెలిసి ఉంటే ఆ గంతులు, ప్రకటనలు ఉండేవి కాదు. వారి మనోభావాలను మోడీ గట్టి దెబ్బతీశారు, దిగుమతులు పెంచారు. తాజాగా పాకిస్తాన్‌కు చైనా ఆయుధాలు అందించి సాయం చేస్తున్నదని ప్రచారం చేసినా చైనా వస్తువులు బహిష్కరించాలనే పిలుపులు రాలేదంటే తత్వం తలకెక్కిన బిజెపి ఈసారి ముందు జాగ్రత్త పడి తన మరుగుజ్జులను అదుపు చేయటమే, కాదంటారా !
