Tags

, , , , , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


మానవాళి చరిత్రలో ఇంతవరకు ఎన్నడూ, ఎక్కడా విప్లవాలు చెప్పిరాలేదు, వాటికి ముహూర్తాలు, వాస్తు వంటివి కూడా లేవు. ఎక్కడ, ఎప్పుడు, ఎలా వస్తాయో కూడా తెలియదు.అన్నింటినీ మించి అంతిమంగా అడ్డుకోవటం ఎవరివల్లా కాదు. 2025 జూన్‌ 24వ తేదీ బుధవారం నాడు ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ రాజధాని న్యూయార్క్‌ నగరంలో పిడుగుపాటు. విప్లవం అని వర్ణించటం అతిశయోక్తి అవుతుందిగానీ పెట్టుబడిదారులకు దడపుట్టించే పరిణామం జరిగింది. ఈ ఏడాది నవంబరు నాల్గవతేదీన జరిగే నగర మేయర్‌ ఎన్నికలో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా జోహ్రాన్‌ మమ్‌దానీ(33) ఎన్నిక యావత్‌ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అభ్యర్థిత్వాన్ని కోరుతూ 11 మంది పోటీపడ్డారు. అయితే 93శాతం ఓట్లు లెక్కించిన సమయానికి న్యూయార్క్‌ రాష్ట్ర ఎంఎల్‌ఏ జొహ్రాన్‌కు 43.5, రెండవ స్థానంలో ఉన్న న్యూయార్క్‌ మాజీ గవర్నర్‌, ఒక కార్పొరేట్‌ సంస్థకు అధిపతి అయిన అండ్రూ కుమోకు 36.4శాతం, మూడో స్థానంలో ఉన్న అభ్యర్థికి 11.3, నాలుగో స్థానంలో ఉన్న వ్యక్తికి 4.1 మిగిలిన అందరికీ కలిపి 4.6శాతం ఓట్లు వచ్చాయి. కుమో తన ఓటమిని అంగీకరించాడు.గత 36 సంవత్సరాలలో ఇంత పెద్ద ఎత్తున డెమోక్రటిక్‌ పార్టీలో ఓటర్లు పాల్గ్గొనటం ఇదే ప్రధమం. ప్రస్తుత మేయర్‌గా డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన ఎరిక్‌ ఆడమ్స్‌ ఉన్నాడు. బలాబలాలను బట్టి జోహ్రాన్‌ ఎన్నిక లాంఛన ప్రాయమే అని విశ్లేషకులు అంటున్నారు, అదే జరిగితే తొలి సోషలిస్టు మేయర్‌ అవుతాడు.


మన స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో కాంగ్రెస్‌ నాయకత్వ విధానాలను వ్యతిరేకించే వారు తమ పురోగామి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీని ఏర్పాటు చేశారు. దాని నేతలుగా ఉన్న ఇంఎంఎస్‌ నంబూద్రిపాద్‌, పుచ్చలపల్లి సుందరయ్య వంటి అనేక మంది తరువాత కమ్యూనిస్టులుగా మారారు. అదే మాదిరి అమెరికా డెమోక్రటిక్‌ పార్టీలో పురోగామి విధానాలను ముందుకు తెచ్చేవారు డెమోక్రటిక్‌ సోషలిస్టు పార్టీని ఏర్పాటు చేశారు. వారిలో సెనెటర్‌ బెర్నీశాండర్స్‌ బహిరంగంగా తనను సోషలిస్టుగా ప్రకటించుకున్నాడు. అదే బాటలో జోహ్రాన్‌ మమ్‌దానీ వంటి యువకులు పెద్ద సంఖ్యలో సోషలిస్టులుగా మారారు.వీరందరినీ కమ్యూనిస్టులుగా అక్కడి మీడియా, రిపబ్లికన్‌, డెమోక్రటిక్‌ పార్టీలోని మితవాదులు ముద్రవేస్తున్నారు. జోహ్రాన్‌ ఒక కమ్యూనిస్టు పిచ్చోడని డోనాల్డ్‌ ట్రంప్‌ నోరుపారవేసుకున్నాడు.అమెరికా సమాజంలో ఒక మధనం జరుగుతున్నది. లక్షలాది మంది ఇటీవలి కాలంలో సోషలిస్టులం అని సగర్వంగా ప్రకటించుకుంటున్నారు. వారిని కమ్యూనిస్టులని ప్రచారం చేసినా ఎన్నికల్లో గెలిపిస్తున్నారు. ఇది అక్కడి కార్మికవర్గం మార్పును కోరుకుంటున్నదని, వామపక్షం వైపు మొగ్గేందుకు సిద్దంగా ఉన్నట్లు, ఒక సామాజిక సంక్షోభానికి ఒక సూచికగా చెప్పవచ్చు. దీని అర్ధం తెల్లవారేసరికల్లా అధికారానికి రాబోతున్నారని కాదు.

జోహ్రాన్‌ అభ్యర్థిగా ఎన్నికైనట్లు ఫలితాల తీరు వెల్లడిరచగానే జరిగిన పరిణామాలు మనదేశంలో జరిగిందాన్ని గుర్తుకు తెచ్చాయి. కొన్ని పార్టీల వారు గతంలో సిపిఎం నేత జ్యోతిబసును ప్రధాని పదవికి సూచించగానే బాంబేక్లబ్‌గా పిలిచే బడాకార్పొరేట్‌ ప్రతినిధులందరూ సమావేశమై ఎట్టి పరిస్థితిలోనూ కానివ్వరాదని తీర్మానించారు. న్యూయార్క్‌ నగరానికి ఒక వామపక్షవాది మేయర్‌ కాగానే అక్కడి పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోసే అవకాశం లేదు. అయినప్పటికీ డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన ప్రస్తుత మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ లేదా జోహ్రాన్‌తో పోటీ పడిన కుమోను స్వతంత్ర అభ్యర్ధిగా నిలపాలని, రిపబ్లికన్‌ పార్టీ పోటీ చేయకుండా మద్దతు ఇవ్వాలంటూ విజ్ఞాపనలతో పాటు 20 మిలియన్ల డాలర్లను వసూలు చేయాలని పిలుపు ఇచ్చారు. జోహ్రాన్‌ ముందంజ గురించి తెలియగానే స్టాక్‌మార్కెట్లో కొన్ని కంపెనీల వాటాల ధరలు పడిపోయాయంటే ఎలాంటి కుదుపో చెప్పనవరం లేదు. డెమోక్రటిక్‌ పార్టీ సంస్కరణవాదంలో భాగంగా కొన్ని పురోగామి నినాదాలను ఇవ్వవచ్చు, జాత్యహంకారాన్ని వ్యతిరేకించవచ్చు,రిపబ్లికన్లతో పోలిస్తే మితవాదులు తక్కువగా ఉండవచ్చు తప్ప అదేమీ పాలకవర్గాన్ని సమూలంగా మార్చేది కాదు. గాజా మారణకాండను పూర్తిగా సమర్ధించింది. మమ్దానీ ఇజ్రాయెల్‌ను గట్టిగా వ్యతిరేకించటమే కాదు, ఎన్ని విమర్శలు వచ్చినా పాలస్తీనా మద్దతుదారుగా ఉన్నాడు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు న్యూయార్క్‌ వస్తే అరెస్టు చేయించేందుకు వెనుకాడనని కూడా చెప్పాడు. అందుకనే ప్రత్యర్ధులు అతనికి యూదు వ్యతిరేకి అని ముద్రవేశారు. అయినప్పటికీ న్యూయార్క్‌లోని యూదులు పెద్ద సంఖ్యలో అతని అభ్యర్థిత్వానికి మద్దతుగా ఓటు చేశారని వార్తలు వచ్చాయి. నరేంద్రమోడీ న్యూయార్క్‌ వస్తే భేటీ అవుతారా అని విలేకర్లు ప్రచారం సందర్భంగా అడగ్గా డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధులందరూ లేదని ముక్తకంఠంతో చెప్పారు. బెంజమిన్‌ నెతన్యాహు మాదిరి నరేంద్రమోడీ కూడా గుజరాత్‌లో మారణకాండకు బాధ్యుడైన ఒక యుద్ధ నేరగాడని జోహ్రాన్‌ చెప్పాడు.


జోహ్రాన్‌ తండ్రి మహమ్మద్‌ మమ్దానీ అమెరికాలో స్థిరపడిన గుజరాతీ మూలాలు ఉన్న ఉగాండా జాతీయుడు కాగా తల్లి ఒడిషాలో జన్మించిన పంజాబ్‌ హిందూ కుటుంబానికి చెందిన మీరా నాయర్‌(నయ్యర్‌ ) పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత, ప్రముఖ సినిమా దర్శకురాలు, నిర్మాత. ఇజ్రాయెల్‌ హైఫా అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి గౌరవ అతిధిగా వచ్చిన ఆహ్వానాన్ని 2013లో ఆమె తిరస్కరించారు. పాలస్తీనా ఆక్రమణనుంచి వైదొలిగినపుడు, జాత్యంహంకారాన్ని వీడినపుడు మాత్రమే ఇజ్రాయెల్‌ గడ్డమీద అడుగుపెడతానని చెప్పారు. జోహ్రాన్‌ వాగ్దానాల విషయానికి వస్తే తనను ఎన్నుకుంటే న్యూయార్క్‌ నగరంలో అద్దెలను స్థంభింప చేస్తానని, పేదలకు ఇండ్లు నిర్మిస్తానని, లాభనష్టాలు లేని ప్రాతిపదిక నగరపాలక సంస్థ సూపర్‌మార్కెట్లను ఏర్పాటు చేస్తానని, 2030 నాటికి గంటకు 30 డాలర్ల కనీసవేతన అమలు జరిగేట్లు చూస్తానని, అందరికీ అందుబాటులో ఉండే శిశు సంరక్షణా కేంద్రాల ఏర్పాటు వంటి తన వాగ్దానాల అమలుకు అవసరమైన పదిబిలియన్‌ డాలర్ల సొమ్మును ధనికుల మీద అదనంగా పన్నులు వేసి సమీకరిస్తానని చెప్పాడు.వలసవచ్చిన కుటుంబాల వారికి రక్షణ కల్పిస్తానని జోహ్రాన్‌ వాగ్దానం చేశాడు. ఇతగాడిని డెమోక్రటిక్‌ పార్టీలోని కార్పొరేట్‌ అనుకూల శక్తులు ఏదో ఒక సంస్కరణవాది అని సరిపెట్టుకోలేదు, వర్గపోరాటాన్ని ప్రోత్సహించే విప్లవవాదిగా చూశారు. ఆ పార్టీలో చేయి తిరిగిన పెద్దలు, మితవాదులు, కార్మిక, కార్పొరేట్‌ శక్తులు ఏకమై అనేక తప్పుడు ప్రచారాలు చేశారు. ఒక చర్చలో కుమో అతనో కుర్రకుంక అనుభవం ఏముందన్నారు. దాంతో జోహ్రాన్‌ చీల్చి చెండాడు. తాను అవమానకరంగా గవర్నర్‌ పదవికి రాజీనామా చేయలేదని, మిలియన్ల డాలర్లను అక్రమంగా కొట్టేయలేదని, వైద్య సౌకర్యాలకు కోత పెట్టలేదని, పదమూడు మంది మహిళలు లైంగికవేధింపులకు పాల్పడినట్లు తన మీద ఎవరూ ఆరోపణలు చేయలేదని తానలాంటి పనులు చేయకపోవటానికి నేను మీరు కాదు అన్నింటికీ మించి నా పేరు మమ్దానీ అంటూ దులిపేశాడు. ఇతగాడికి మద్దతుగా 30వేల మంది వలంటీర్లుగా పని చేశారు.వలస కార్మికులకు వ్యతిరేకంగా ట్రంప్‌ సర్కార్‌ తీసుకున్న చర్యలకు ఎలాంటి ప్రతిఘటన ఎదురైందో చూశాము. ఆ తరువాత జూన్‌ 14న రాజులు లేరు అంటూ లక్షలాది మంది జనం వీధుల్లోకి వచ్చి ట్రంప్‌ వ్యతిరేక ప్రదర్శనలు చేశారు. ఈ రెండు పరిణామాల వెనుక ప్రధాన చోదకశక్తి కాదు డెమోక్రటిక్‌ పార్టీ కాదు, వివిధ ప్రజాసంఘాలు, సామాజిక ఉద్యమాలు, అదే మేయర్‌ అభ్యర్థి ఎన్నికలో కూడా ప్రతిబింబించింది.


జొహ్రాన్‌ పూర్తి పేరు జోహ్రాన్‌ క్వామే మమ్దానీ. తండ్రి మహమ్మద్‌ మమ్దానీ ఒక గుజరాతీ ముస్లిం కుటుంబంలో 1946లో ముంబైలో జన్మించాడు. తరువాత ఆఫ్రికాలోని ఉగాండాకు ఆ కుటుంబం వలస వెళ్లింది. ఉగాండాలో ఉండగా 1963లో అమెరికాలో విద్య స్కాలర్‌షిప్‌ రావటంతో అక్కడ చదువుకున్నాడు. తిరిగి ఉగండా వెళ్లి అక్కడ బోధనావృత్తిలో చేరాడు. సినిమా దర్శకురాలు మీరా నయర్‌ తన సినిమా ‘‘ మిస్సిసిపీ మసాలా ’’ కోసం ఉగాండాలో పరిశోధనకు వెళ్లినపుడు 1988లో అక్కడ పరిచయమైన మహమ్మద్‌ హిమ్దానీని ఆమె రెండవ వివాహంచేసుకున్నారు. వారికి అక్కడే 1991లో జోహ్రాన్‌ జన్మించాడు.ఘనా తొలి అధ్యక్షుడు క్వామే అంటే అపరిమిత అభిమానంతో తమ కుమారుడి పేరులో క్వామే చేర్చారు. ఆ కుటుంబం తరువాత కొంత కాలం దక్షిణాఫ్రికాలో కూడా ఉంది, తరువాత అమెరికా వచ్చింది.2018లో జోహ్రాన్‌కు అమెరికా పౌరసత్వం వచ్చింది.రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికలలో 2020లో తొలిసారిగా న్యూయార్క్‌ రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు,2024లో మూడవసారి ఎన్నికై ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నాడు. ఆచరణ సాధ్యంగాని వాగ్దానాలు చేసినట్లుగా జోహ్రాన్‌ ఎన్నికను జీర్జించుకోలేని అదే పార్టీకి చెందిన ప్రస్తుత న్యూయార్క్‌ మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ ఉక్రోషం వెలిబుచ్చాడు. చివరికి అనుకున్నదంతా జరిగింది,జోహ్రాన్‌ మమ్దానీ వందశాతం కమ్యూనిస్టు పిచ్చోడు,డెమోక్రటిక్‌ అభ్యర్ధిగా విజయం విజయం సాధించాడు, మేయర్‌ అయ్యేదారిలో ఉన్నాడు అని ట్రంప్‌ తన సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టాడు. మన దగ్గర విప్లవకారులైన వామపక్షవాదులున్నారు,కానీ ఇతను భయంకరంగా ఉన్నాడు, అసహ్యంగా మాట్లాడుతున్నాడని కూడా ట్రంప్‌ రెచ్చిపోయాడు. జోహ్రాన్‌ ఎన్నికను అడ్డుకొనేందుకు కొందరు 1954నాటి కమ్యూనిస్టు వ్యతిరేక చట్టానికి దుమ్ముదులిపి పౌరసత్వాన్ని రద్దు చేసి ఉగాండాకు పంపే అవకాశాలను పరిశీలించాలని వత్తిడి తెస్తున్నారు. ఈ మేరకు మీడియాలో విశ్లేషణలు మొదలయ్యాయి. ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.


ఈ ఏడాది జరిగే న్యూయార్క్‌ మేయర్‌ ఎన్నిక అమెరికా చరిత్రలో ఒక ప్రత్యేక పేజీకి నాంది పలికింది. ఇటీవలి కాలంలో ఫాసిస్టు ధోరణులు పెరుగుతున్న పూర్వరంగంలో కార్మికవర్గం వామపక్ష అభ్యర్ధివైపు మొగ్గటం యావత్‌ పురోగామిశక్తులకు ఉత్సాహం ఇచ్చే పరిణామం. అమెరికాలో నిజమైన సోషలిస్టు శక్తుల పెరుగుదలకు తోడ్పడే పరిస్ధితి కనిపిస్తున్నది. డెమోక్రటిక్‌ సోషలిస్టులు ముందుకు తెస్తున్న సంస్కరణలనే మీడియా, శత్రువులు సోషలిజం, కమ్యూనిజం అని చిత్రిస్తున్నారు. వాటికి ఉండే పరిమితులను కార్మికవర్గం అర్ధం చేసుకున్న తరువాత శాస్త్రీయ సోషలిజం కోసం మరింత ముందుకు పోవటం తప్ప మరొక మార్గం లేదు. డెమోక్రటిక్‌ పార్టీ భవిష్యత్‌ను నిర్ణయించేది ఇప్పుడున్న నాయకత్వం కాదని దేశ కార్మికవర్గమేనని డెమోక్రటిక్‌ సోషలిస్టు సెనెటర్‌ బెర్నీశాండర్స్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు.కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ మను సింఘ్వి కూడా ధ్వజమెత్తాడు. జోహ్రాన్‌ నోరు తెరిస్తే పాకిస్తాన్‌ ప్రజాసంబంధాల బృందం ఆ రోజు సెలవు తీసుకోవచ్చు. భారత్‌కు అలాంటి మిత్రులు ఉంటే వేరే శత్రువులు అవసరం లేదన్నారు.భారత్‌ మూలాలున్న జోహ్రాన్‌ భారతీయుడి కంటే పాకిస్తానీగా ఎక్కువ హడావుడి చేస్తున్నాడని బిజెపి ఎంపీ కంగనా రనౌత్‌ వ్యాఖ్యానించారు. అతని హిందూ గుర్తింపు లేదా రక్తం సంగతి పక్కన పెడితే హిందూయిజాన్ని లేపేసేందుకు ఇప్పుడు సిద్దంగా ఉన్నట్లు ఆరోపించారు. అసలు ఉక్రోషం ఏమిటంటే నరేంద్రమోడీని యుద్ధ నేరస్తుడని వర్ణించటమే అనివేరే చెప్పనవసరం లేదు. కొసమెరుపు ఏమంటే ప్రపంచంలోనే పిన్నవయస్కురాలైన మేయర్‌గా తిరువనంతపురంలో ఎన్నికైన సిపిఎం నాయకురాలు 21ఏండ్ల ఆర్య రాజేంద్రన్‌.ఆమెను గతంలో అభినందిస్తూ జోహ్రాన్‌ చేసిన ట్వీట్‌ను ఉటంకిస్తూ ఒక కమ్యూనిస్టును అభిందించిన ఇతగాడు కూడా కమ్యూనిస్టే అంటూ విద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారు.అయితే ఏంటట ! ఆర్య రాజకీయ భావాలకు సిపిఎం కార్యకర్తలైన ఆమె తలిదండ్రులే కారకులైనట్లుగా జోహ్రాన్‌ వామపక్షవాది కావటం వెనుక కూడా తలిదండ్రులు భావజాలమే పని చేసింది.

 
.