ఎం కోటేశ్వరరావు
దీపావళి కానుకగా వస్తు,సేవల పన్ను(జిఎస్‌టి) భారాన్ని తగ్గించనున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు. దీనికి మీడియాలో ఇప్పటికే పెద్ద ప్రచారం వచ్చింది. సిద్దం సుమతీ అన్నట్లు కాచుకొని ఉండే కాషాయ దళాలు భజన ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వం 12,28 పన్ను శ్లాబులను రద్దు చేసి ఐదు, 18శాతం స్లాబులకు అంగీకరించగా, జిఎస్‌టి మండలి నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. అయితే పన్నెండు, 28శాతాలలో ఉన్న వస్తువులను దేనిలో కలుపుతారు అన్నది ఇంకా ఖరారు కాలేదు. ఈ చర్యతో కలిగే లాభాలు, నష్టాల గురించి మీడియాలో విశ్లేషణలు వెలువడుతున్నాయి. వాటి మంచి చెడ్డల గురించి మాట్లాడుకొనే ముందు ఇప్పుడున్న తీరు తెన్నులేమిటో చూద్దాం. ప్రతిదాన్లో ఉన్నట్లు మంచీ చెడు ఉంటాయి, ఏదెక్కువ అన్నదే గీటురాయిగా ఉండాలి.
జిఎస్‌టి కూడా ప్రపంచబ్యాంకు ఆదేశిత విధానమే. విదేశీ కంపెనీలు, వస్తువులకు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో అమ్మకపు పన్ను విధించటంతో వాటికి తలనొప్పిగా ఉండి దేశమంతటా ఒకే పన్ను విధానం తీసుకురావాలని వత్తిడి తెచ్చిన ఫలితమే ఇది. దీన్ని అమలు చేయాలని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 115వ రాజ్యాంగ సవరణ బిల్లును బిజెపి, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ వ్యతిరేకించారనే అంశం చాలా మందికి గుర్తు ఉండి ఉండదు. బిజెపికి మద్దతు ఇచ్చే వ్యాపారవర్గం పన్నుల ఎగవేతకు అవకాశాలు ‘‘ తగ్గుతాయని ’’ వ్యతిరేకించినట్లు కూడా చెబుతారు. రాజకీయ నేతలు ఎల్లవేళలా కుడి, ఎడమ జేబుల్లో పరస్పర విరుద్దమైన ప్రకటనలు పెట్టుకొని సంచరిస్తూ ఉంటారట. ఏది వాటంగా ఉంటే దాన్ని బయటకు తీస్తారు. జిఎస్‌టి బిల్లు తిరోగామి స్వభావం కలిగినదని, సమాఖ్య ఆర్థిక మూలాలకు పూర్తిగా వ్యతిరేకమని ముఖ్యమంత్రి పాత్రలో 2011 ఫిబ్రవరి 11న వాదించిన రాజనీతిజ్ఞుడు మోడీ. ప్రధాని హోదాలో దానికి పూర్తి విరుద్దంగా రెండో జేబులో ఉన్న ప్రకటన బయటకు తీశారు.(మోడీ కంటే రెండాకులు ఎక్కువ చదివిన చంద్రబాబు స్మార్ట్ విద్యుత్ మీటర్ల గురించి ప్రతిపక్షంలో ఉండగా చెప్పినదానికి అధికారానికి వచ్చిన తరువాత మాట మార్చినట్లు ) తన ప్రభుత్వం ముందుకు తెచ్చిన జిఎస్‌టి బిల్లు గురించి 2016 ఆగస్టు 9న పార్లమెంటులో మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రిగా తనకు సందేహాలు ఉండేవని ఇప్పుడు అవి ఒక ప్రధానిగా ఆ సమస్యలను పరిష్కరించటాన్ని సులభతరం చేసిందని చెప్పుకున్నారు. దానికి తోడు అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీతో కూడా అనేక సార్లు చర్చించినట్లు చెప్పుకున్నారు.(మోడీ సందేహాలను ఆయన తీర్చని కారణంగానే బిల్లును వ్యతిరేకించారా) అదియును సూనృతమే ఇదియును సూనృతమే అని వంది మాగధులు తాళం వేశారు.2017 జూలై ఒకటి నుంచి జిఎస్‌టి అమల్లోకి వచ్చింది.తరువాత కొన్ని శ్లాబుల్లో వస్తువుల జాబితా మార్పు, పన్ను రేటు పెంపుదల వంటివి జరిగాయి.
ప్రతి వంద రూపాయల జిఎస్‌టి రాబడిలో ఏ స్లాబ్ నుంచి ఎంతవస్తున్నదంటే ఐదుశాతం ఉన్న వస్తువుల ద్వారా ఏడు రూపాయలు, పన్నెండు శాతం ఉన్నవాటితో ఐదు, పద్దెనిమిదిశాతం వాటితో 65, విలాసవస్తువుల జాబితాలో ఉన్న 28శాతం నుంచి పదకొండు రూపాయలు వస్తున్నాయి. మీడియా రాస్తున్న ఊహాగానాల ప్రకారం పన్నెండుశాతం శ్లాబులో ఉన్న జాబితాలో 99శాతం వస్తువులను ఐదు శాతం స్లాబులో చేరుస్తారు.తొంభై శాతం వస్తువుల మీద పన్ను మొత్తాన్ని 28 నుంచి 18శాతానికి తగ్గిస్తారు.పాపపు పన్ను వస్తువులు అంటే పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలా వంటి ఐదు లేదా ఏడు ఉత్పత్తులను 40శాతం మరియు సెస్ విధించే ప్రత్యేక శ్లాబులో ఉంచుతారు. బంగారం మీద మూడుశాతం మారదు, వజ్రాల మీద 0.25 నుంచి 0.5శాతానికి పెంచవచ్చు.ఈ కసరత్తు తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత రాబడి తగ్గుతుంది లేదా వినియోగదారులకు ఎంత మేరకు ఉపశమనం కలుగుతుంది అంటే ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్ ఏటా 1.45శాతం అంటే రు.32 వేల కోట్లు మాత్రమే అని చెప్పారు. ఇతరులు రు.60 వేల నుంచి 1.8లక్షల కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఒక నిర్ణయం జరిగి కొన్ని నెలల రాబడి చూసిన తరువాత మాత్రమే ఏది వాస్తవం అన్నది చెప్పగలం. ఒకటి మాత్రం ఖాయం జనానికి తగ్గేది స్వల్పం.
దేశంలో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు అనుగుణంగా నిజవేతనాలు పెరగకపోవటంతో వస్తువినియోగం తగ్గుతున్నది. ఇది కార్పొరేట్ శక్తులకు ఆందోళన కలిగిస్తున్నది. అందువలన వినియోగాన్ని పెంచాలంటే హెలికాప్టర్ మనీ అంటే నేరుగా నగదు ఇవ్వాలని కరోనా సమయంలో కొందరు సూచించారు. మరొకటి పన్నుల తగ్గింపు ఒక మార్గంగా చెబుతున్నారు. అందుకే 28శాతం ఉన్న వస్తువులను 18శాతంలోకి మార్చేందుకు పూనుకున్నారు. గత ఏడాది కాలంగా శ్లాబుల తగ్గింపు గురించి మధనం జరుగుతున్నది. 2024 డిసెంబరులో 55వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో చర్చకు పెట్టారు. కొన్ని వస్తువుల మీద పన్ను తగ్గింపు ద్వారా వచ్చే దీపావళి పండుగ తరుణంలో రు.4.25 లక్షల కోట్ల మేర వినియోగాన్ని పెంచాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం వెల్లడిరచిన సమాచారం ప్రకారం 2018లో జిఎస్‌టి ద్వారా వచ్చిన రాబడి రు.11,77,380 కోట్లు. సగటున నెలకు రు.98వేల కోట్లు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ధరల పెరుగుదల, కొన్ని వస్తువుల మీద పన్ను పెరుగుదల వంటి కారణాలు కూడా తోడై 2024లో రు.20,12,720 కోట్లకు అంటే సగటున రు.183వేల కోట్లకు పెరిగింది. సహజన్యాయం లేదా సామాజిక న్యాయం ప్రకారం అధిక ఆదాయం కలిగిన వారు ఎక్కువ మొత్తం పన్ను చెల్లించాలి, ఆ మేరకు తక్కువ రాబడి కలిగిన వారికి ఉపశమనం కలగాలి. ఆదాయపన్ను విషయంలో అదే జరుగుతున్నది. అదే జిఎస్‌టికి ఎందుకు వర్తించదు ?
ఫ్రాన్సు రాజధాని పారిస్ కేంద్రంగా పని చేస్తున్న సెంటర్ ఫర్ ఎకనమిక్ పాలసీ రీసెర్చ్ (సిఇపిఆర్) సంస్థ మన జిఎస్‌టి మీద ఒక అధ్యయనం చేసింది. జనాభాలో దిగువ 50శాతం మంది నుంచి 25శాతం రాబడి వస్తుండగా వారు వినియోగిస్తున్న వస్తు, సేవల వాటా 20 నుంచి 25శాతం మధ్య ఉంది.ఎగువ మధ్యతరగతిలోని 30శాతం మంది నుంచి రాబడి 35శాతం కాగా వినియోగం 35 నుంచి 38శాతం ఉంది. అదే ఎగువ 20శాతం నుంచి వస్తున్న మొత్తం 40శాతం కాగా వినియోగిస్తున్నది 45శాతంగా ఉందని మన కేంద్ర ప్రభుత్వ ఎన్‌ఎస్‌ఎస్‌ఓ దగ్గర ఉన్న గణాంకాలను విశ్లేషించి చెప్పింది. ఇప్పుడున్న విధానం ప్రకారం అంబానీ, అదానీ, వారి దగ్గర పని చేసే దిగువ సిబ్బందిలో ఇద్దరు ఒకే షాపులో పండ్లుతోముకొనే బ్రష్‌లను కొనుగోలు చేస్తే నలుగురి మీద విధించే పన్ను మొత్తం ఒక్కటే. మొదటి ఇద్దరు జేబులో ఎంత తగ్గిందో అసలు చూడరు, కానీ పనివారు ఒకటికి రెండుసార్లు మిగిలి ఉన్న మొత్తాన్ని లెక్కపెట్టుకుంటారు. ఎందుకంటే ఆదాయ అసమానత. చూశారా చట్టం ముందు అందరూ సమానులే, సమానత్వం ఎంత చక్కగా అమలు జరుగుతోందో అని కొందరు తమ భుజాలను తామే చరుచుకుంటారు.
ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త థామస్ పికెట్టీ, మరో ప్రముఖుడు ల్యూకాస్ ఛాన్సెల్ ఒక అధ్యయనం చేశారు. అదేమంటే 1922 నుంచి 2015 మధ్య కాలంలో మనదేశంలో జరిగిన ఆదాయ అసమానత పరిణామాలను పరిశీలించారు. బ్రిటీష్ రాజ్యం నుంచి బిలియనీర్ల రాజ్యం వరకు అంటూ తమ పరిశీలనకు పేరు పెట్టారు. పేరుకు మనది గణతంత్ర రాజ్యం అని రాసుకున్నప్పటికీ గతంలో బ్రిటీష్ వారు పాలిస్తే ఇప్పుడు వారి స్థానంలో బిలియనీర్లు ఉన్నారు.1922ను ఎందుకు ప్రామాణికంగా తీసుకున్నారు అంటే అదే ఏడాది మనదేశంలో బ్రిటీష్ పాలకులు ఆదాయపన్ను చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.మన జనాభాలో ఎగువ ఒకశాతం మందికి 1930దశకంలో 21శాతం రాబడి రాగా, 1980దశకంలో అది ఆరుశాతానికి తగ్గింది. తరువాత నూతన ఆర్థిక విధానాలు వచ్చాయి. ఎగువ నుంచి దిగువకు ఊటదిగినట్లుగా జనాభాలో దిగువన ఉన్న వారికి రాబడి ఊట దించేందుకు ఈ విధానాలను అనుసరిస్తున్నట్లు ఊట సిద్దాంతం చెప్పారు. కానీ జరిగిందేమిటి ? జనాభాలో ఒక శాతం ఉన్న ధనికుల ఆదాయం తిరిగి 22శాతానికి చేరింది. అందుకే బ్రిటీష్ వారి ఏలుబడి కంటే స్వాతంత్య్రంలోనే అసమానతలు పెరిగినట్లు వారు వ్యాఖ్యానించారు.1950 నుంచి 1980 మధ్య కాలంలో దిగువన ఉన్న 50శాతం మంది రాబడి మొత్తం సగటుతో పోలిస్తే ఎక్కువగా 28శాతం వేగంతో పెరగ్గా ఎగువన ఉన్న 0.1శాతం మంది రాబడి తగ్గిపోయింది. కానీ 2015 నాటికి అది తారుమారైంది. దిగువ 50శాతం మంది వృద్ధి రేటు పదకొండు శాతం కాగా ఎగువన ఉన్నవారిది 12శాతం పెరిగింది. మధ్య తరగతిగా ఉన్న 40శాతం మంది 23శాతం పొందగా ఎగువున ఒక శాతం మందికి 29శాతం ఉంది.
మనదేశంలో తొలి బిలియనీర్ నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్. పారిశ్రామికవేత్తలలో 1991లో ఒక్కరే ఉన్నారు. ఇండియా టుడే విశ్లేషణ ప్రకారం 2014లో 70 మంది 2025 నాటికి 284కు పెరిగారు. ఎగువ ఒక శాతం మంది వద్ద దేశ సంపదలో 40.1శాతం పోగుపడిరది. ఇంతగా ధనికులు పెరిగిన తరువాత అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరింతగా సంపాదిస్తారే తప్ప మోడీ చెప్పినట్లు సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ నినాదాన్ని సాకారం కానిస్తారా ? పార్లమెంటు, అసెంబ్లీల్లో పెరుగుతున్న కోటీశ్వరులు సామాన్యుల కోసం విధానాలను రూపొందిస్తారా ? 2025`26 కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 50లక్షల కోట్లు అనుకుంటే బిలియనీర్ల వద్ద ఉన్న సంపద 98లక్షల కోట్లు. ఒక్క ముంబైలోనే 90 మంది ఉన్నారని వారి సంపద 39లక్షల కోట్ల రూపాయలని లెక్క. ప్రపంచ అసమానతల ప్రయోగశాల(వరల్డ్ ఇనీక్వాలిటీ లాబ్) 2024 మార్చినెలలో విడుదల చేసిన విశ్లేషణ ప్రకారం మనదేశంలో 2022లో వార్షిక రాబడి ఇరవై ఏండ్లు పైబడిన 92 కోట్ల మంది సగటు రు.2.3లక్షలంటే నెలకు ఇరవై వేలు. మధ్యగత రేఖ(మెడియన్) వార్షిక రాబడి రు.లక్ష అంటే నెలకు సగటున రు.8,750 మాత్రమే వస్తున్నది. ఎగువున ఉన్న పదిశాతం మంది ఏడాదికి సగటున రు.13లక్షలు, ఎగువ ఒక శాతం రు.50లక్షలు, ఎగువన 0.1శాతం మంది రెండు కోట్లు, 0.01శాతం మంది పది కోట్ల వంతున సంపాదిస్తున్నారు. ధనికుల్లో అగ్రశ్రేణి వారిలో 9,223 మంది సగటున 50 కోట్లు సంపాదిస్తున్నారు. ఇక సామాజిక తరగతుల వారీ చూస్తే ఐశ్యర్యవంతుల్లో 90శాతం మంది ‘‘ సవర్ణులు ’’’ 2.6శాతం దళితులు, మిగిలిన వారు ఓబిసిలు ఉన్నారట.2014 నుంచి 2022 కాలంలో ధనవంతులైన ఓబిసి బిలియనీర్ల సంపద 20 నుంచి పదిశాతానికి తగ్గగా సవర్ణులకు 80 నుంచి 90శాతానికి పెరిగిందని ఇనీక్వాలిటీ లాబ్ పర్కొన్నది. జనాభాలో 25శాతంగా ఉన్న వీరు 55శాతం సంపద కలిగి ఉన్నారట. ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం ఏమంటే ఇలాంటి ఆర్థిక అసమానతల ఉన్నపుడు శతకోటీశ్వరులు, అల్పాదాయ వర్గాలకు ఒకే జిఎస్‌టి రేటు సామాజిక న్యాయానికి విరుద్దం. ధనికుల మీద సంపదపన్ను విధిస్తే వచ్చే రాబడితో ఖజాన నింపుకోవచ్చు. వస్తు, సేవల పన్ను తగ్గిస్తే భారం ఎంతో తగ్గుతుంది.వినియోగం పెరిగితే యువతకు ఉపాధి పెరుగుతుంది, తద్వారా ప్రభుత్వాలకు రాబడీ పెరుగుతుంది. కానీ ఆ పని చేయటం లేదు. మోడీ సర్కార్ మహామాయ జిమ్మిక్కులతో శ్లాబుల కుదింపును రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకొనేందుకు చూస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇది తాత్కాలికమే. వాస్తవాలను గ్రహించినపుడు జనాలు చివరికి మోడీ నిజం చెప్పినా నమ్మని స్థితి వస్తుంది !
