Tags

, , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఆహార వ్యవహారాల్లో జోక్యం అంటే ఫలాన తినకూడదు అని ఆంక్షలు పెట్టటం వ్యక్తిగత స్వేచ్చలో మితిమీరిన జోక్యం చేసుకోవటం తప్ప మరొకటి కాదు. ఆహారం, ఆహార్యం కొన్ని సమూహాలకు అస్థిత్వ సూచికలుగా ఉన్నాయి. పెద్ద కూర, దీన్ని ఆంగ్లంలో బీఫ్‌ , అచ్చతెలుగులో గొడ్డు మాంసం అంటారు. తక్కువ ఖర్చుతో జనాలకు అవసరమైన ఎక్కువ ప్రొటీన్లు అందచేసే ఆహారం ఇది. ఇటీవలి కాలంలో హిందూత్వశక్తులు, సనాతనులుగా ముద్రవేసుకున్నవారు దీని మీద పెద్ద రాద్దాంతం, దాడులు, హత్యలకూ పాల్పడటాన్ని చూశాం. మేం శాకాహారులం మా మనోభావాలను గాయపరచవద్దు అనేవారు తయారయ్యారు. మాంసాహారులకు కూడా మనోభావాలు ఉంటాయి. తాజాగా కేరళలోని కోచ్చి నగరంలో కెనరా బ్యాంక్‌ ప్రాంతీయ కార్యాలయానికి బీహార్‌ నుంచి అశ్వనీ కుమార్‌ అనే మేనేజర్‌ బదిలీ మీద వచ్చారు. అప్పటి వరకు ఎన్నో సంవత్సరాలుగా బ్యాంకు క్యాంటీన్‌లో పెద్ద కూర కూడా వారంలో కొన్ని రోజులు అందుబాటులో ఉండేది. ఆ పెద్దమనిషి రాగానే ఆహార జాబితా నుంచి దాన్ని తొలగించి నిషేధం విధించారు.ఎందుకంటే నేను తినను అని చెప్పారట. నాకు దక్కనిది ఎవరికీ దక్క కూడదు అనే సినిమా మాటలు బాగా వంటబట్టి ఉంటాయి. దేశంలో అనేక ప్రాంతాలలో ఇలాంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపిన సంగతి తెలియనంత అమాయకంగా సదరు అధికారి ఉంటారని అనుకోలేం. ఉద్యోగులు ప్రశ్నించిన తరువాత అయినా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఉంటే ఆ పెద్దమనిషి ఇప్పుడు మీడియాకు ఎక్కి ఉండేవారు కాదు. విధిలేని స్థితిలో బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (బెఫి) నాయకత్వంలో సిబ్బంది నిరసన తెలుపుతూ బ్యాంకు ప్రాంగణంలో పెద్ద కూర, పరోటాల పండగచేసి నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఏ ఆహారం తీసుకోవాలన్నది వ్యక్తిగత ఎంపిక అంశమని, కొన్నింటి మీద నిషేధం విధించటం రాజ్యాంగహక్కులను ఉల్లంఘించటమే అని స్పష్టం చేశారు. బ్యాంకు అధికారి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఒక ఉన్నతాధికారి ఇష్టా ఇష్టాలకు అనుగుణంగా ఇతరులు ఆహార అలవాట్లను ఎందుకు మార్చుకోవాలని వారు ప్రశ్నించారు. మాంసాహారం తినాలని తామెవరినీ బలవంతం చేయటం లేదని బెఫి నేత చెప్పారు.


మాంసం, చేపలు, గుడ్లు తినరాదంటూ బలవంతం చేయటాన్ని బ్రాహ్మణీయ జాతీయవాదం(భావజాలం) అంటున్నారు. అనేక మంది బ్రాహ్మలు మాంసాహారాన్ని తింటారన్నది అందరికీ తెలిసిందే. తిరోగామి జాతీయవాదం ఏ రంగంలో, ఏ సమస్యపై తలెత్తినా దాన్ని వ్యతిరేకించాల్సిందే. మన దేశంలో ఆవును పూజించటానికి, గొడ్డు మాంసం తినటానికి లంకె పెడుతున్న కారణంగా తలెత్తిన భావజాల ఘర్షణను భౌతిక దాడులకు తీసుకుపోయేందుకు కొన్ని శక్తులు పనిగట్టుకు పనిచేస్తున్నాయి. బిజెపి పాలిత ఒడిషా రాష్ట్రంలో ఇద్దరు దళితులు చచ్చిన ఆవు కళేబరం నుంచి చర్మాన్ని వేరు చేయటాన్ని చూసిన కొందరు గోవధకు పాల్పడ్డారంటూ వారి మీద దాడి చేయగా ఒక వ్యక్తి మరణించాడు. ఉన్మాదాన్ని ఎలా ఎక్కించారో చూస్తున్నాం. దళితుల మీద దాడులకు ఆవునొక సాకుగా కూడా చూపిన ఉదంతాలు ఉన్నాయి. తమ ఇంట ఆవు చనిపోతే దాన్ని పూడ్చిపెట్టేందుకు ఏ సనాతనవాదీ ముందుకు రారు. ఇదీ గోవుల మీద ప్రేమ బండారం. చివరకు ఆ దళితులే కావాలి. సాంస్కృతిక గురుపీఠాల సృష్టికి ఆహారం ఒక ఉత్ప్రేక్షగా( ప్రస్తుతాన్ని అప్రస్తుతమైనదిగా మార్చటం) మారి చివరకు అవమానించేందుకు దారితీస్తున్నదని ప్రముఖ మేథావి, జెఎన్‌యు ప్రొఫెసర్‌ గోపాల్‌ గురు చెప్పారు. నైతిక పోలీసుల మాదిరి ఇలాంటి గురుపీఠాలు సాంస్కృతిక పోలీసులుగా బ్రాహ్మణ భావజాలాన్ని రుద్దే నిరంకుశ శక్తులుగా మారుతున్నాయి. వాటి ప్రభావానికి లోనైన కారణంగానే కెనరా బాంక్‌ కొచ్చి మేనేజర్‌ వంటి వారు తమ అధికార స్థానాలను ఉపయోగించుకొని నిషేధాలకు దిగటం సహించరానిది. నిజానికి సదరు మేనేజరుకు హిందూత్వ సంస్థలతో సంబంధాలు ఉన్నాయో లేవో తెలియదు. లేనప్పటికీ వాటి ప్రభాంతో తెలియకుండనే హిందూత్వ అజెండాను అమలు జరిపే ఒక పరికరంగా మారటాన్ని గమనించాలి. ఇలాంటి చర్యలకు ప్రతిఘటన తప్పదు. చిత్రం ఏమిటంటే దేశంలో 81శాతం మంది మాంసాహారులు ఉన్నట్లు కొన్ని సర్వేలు చెప్పగా 39శాతం శాకాహారులని కొన్ని సర్వేలు చెప్పాయి. ఒకటి మాత్రం వాస్తవం, ఏ విధంగా చూసినా మాంసాహారులే అత్యధికంగా ఉన్నప్పటికీ మైనారిటీలుగా ఉన్న శాకాహారులు తమ అలవాట్లను మెజారిటీ మీద రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. గోవధ గురించి దేశంలో ఎంతో చర్చ జరిగిన తరువాత దాని గురించి రాష్ట్రాలకు నిర్ణయాన్ని వదలివేస్తూ రాజ్యాంగంలో ఆర్టికల్‌ 48లో పేర్కొన్నారు. దాన్ని విధి గాక ఆదేశిక సూత్రాల్లో చేర్చారు. కొన్ని రాష్ట్రాలలో బిజెపి తన హిందూత్వ అజెండాలో భాగంగా గోవధ నిషేధ చట్టాలు చేసింది. అది కొత్త సమస్యలను ముందుకు తెస్తున్నది.


దోపిడీకి అవకాశం కల్పించే, సామాజిక పరంగా వివక్షాపూరితమైన మనువాదాన్ని సమర్ధించే శక్తులు ఇటీవలి కాలంలో రూటు మార్చి చిల్లి కాదు తూటు అన్నట్లుగా సనాతనం పేరుతో రాజకీయం చేస్తున్నాయి.అధునాతన కాలంలో సనాతనాన్ని పాటించటం ఎలా సాధ్యమో వారు చెప్పలేరు. రెండవది వేదకాలం గొప్పతనం గురించి ఒక వైపు చెబుతారు. పోనీ ఆ కాలానికి వెళ్లగలమా ? వేదకాలం గురించి చెప్పేవారు రెండో వైపున గోవధ నిషేధం గురించి మాట్లాడతారు. ఇది రెండిరటికీ పొసగని అంశం అని ఎంత మందికి తెలుసు? ఆవును పవిత్రంగా చిత్రించేవారు వేదకాలంలో ఆవు మాంసం తినటం గురించి ఎందుకు మాట్లాడరు ? వేదాలుగానీ, శాస్త్రాలు గానీ చరిత్రలు కావు.వాటిలో అనేక పరస్పర వైరుధ్యాలు ఉన్నాయి. కారణం ఎవరికి తోచిన వాటిని వారు రాసి వాటిలో చేర్చారు. ఎవరి వాదనలకు అనువుగా ఉన్నవాటిని వారు ఉటంకిస్తూ జనాలను మభ్య పెడుతున్నారు. యజ్ఞయాగాదులలో ఆవు పాలు, పెరుగు, నెయ్యి లేకుండా నేడు గడవటం లేదు. వేదాలతో సమానమైనదిగా భావించే శతపథ బ్రాహ్మణంలో యాజ్జవల్క్యుడు తాను బాగా ఉడికించిన పెద్దకూరను తింటానని చెప్పినట్లుగా ఉంది. దేవతల చక్రవర్తిగా పరిగణించే దేవేంద్రుడు ఎద్దుమాంస వడ్డన గురించి చెప్పాడు. వేదకాలంలో పూజారులకు ఆవులను ఇవ్వాలని లేకుంటే కనీసం ఆవు మాంసమైనా అందచేసే సాంప్రదాయం ఉన్నట్లు రాతలను బట్టి తెలిసిందే. కొంత కాలం తరువాత ఆవు వలన ఉపయోగం ఉందని గ్రహించి దాన్ని చంపకూడదని భావించారు. ఆ మాట చెబితే వినే పరిస్థితి లేకపోవటంతో ఆవు గురించి అభూత కల్పనలు, పవిత్రతను అంటగట్టి నిరోధించేందుకు కావాల్సిన వాటినన్నింటినీ చేర్చారన్నది స్పష్టంగా కనిపిస్తున్నది. ఆ క్రమంలో ప్రతి జంతువుకు పవిత్రతను ఆపాదించి పురాణాల్లో రాయటం కనిపిస్తుంది. కానీ వాటిని వధించి తినటానికి ఉన్న అనుమతి ఆవుకు ఎందుకు నిరాకరిస్తున్నారన్నదే ప్రశ్న. దీన్ని లేవనెత్తితే అనేక మంది తమ మనోభావాలను స్వయంగా గాయపరుచుకుంటున్నారు. రాజకీయ నేతలు ఒకే ప్రకటనకు విరుద్ధ భాష్యాలు చెప్పినట్లుగా పురాణాలు, వేదాలలోని వాటికీ ఈ మధ్య తమకు అనుకూలమైన అర్ధాలు, భాష్యాలు చెప్పటాన్ని చూస్తున్నాము. చెప్పుకోనివ్వండి ఎవరికీ అభ్యంతరం లేదు కానీ ధర్మరక్షకుల పేరుతో సంఘటితం అవుతున్నవారు అంగీకరించనివారి మీద బలవంతంగా రుద్దే గూండాయిజం ఏమాత్రం సహించరానిది.


ఊరకుక్కల కాట్లకు బలవుతున్న పిల్లలు, పెద్దల గురించి తెలిసిందే. ఇప్పుడు వాటికి తోడు యజమానులు పట్టించుకోకుండా వీధుల్లోకి వదలివేస్తున్న ఆవులు కూడా సమస్యగా మారుతున్నాయి. సనాతనులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రతి ఉదయం లేవగానే రోడ్ల మీద తిరుగుతున్న వాటన్నింటినీ తమ ఇండ్లకు చేర్చుకొని ఆదరిస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఎందుకు ఆపని చేయటం లేదు. ఇటీవల ఢల్లీి ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రయాణిస్తుండగా ఆకస్మికంగా ఒక ఫ్లై ఓవర్‌ మీదకు ఆవులు రావటంతో ఆకస్మికంగా డ్రైవర్‌ బ్రేకులు వేసి వాహనాన్ని నిలిపివేయాల్సి వచ్చింది.చిత్రం ఏమిటంటే ఆమె కూడా ఒక సనాతన వాదే, ఆవులు వెళ్లేంత వరకు వాహనం దిగి చూశారు తప్ప సిబ్బందిని ఆదేశించి వాటన్నింటిని తన ఇంటికో, కార్యాలయానికో తోలుకు రమ్మని చెప్పలేదు. దేశంలో 50లక్షలకు పైగా ఆవులను రోడ్ల మీద వదలివేసినట్లు అంచనా, నిజానికి ఇంకా ఎక్కువే ఉంటాయి. యోగి ఆదిత్యనాధ్‌, పవన్‌ కల్యాణ్‌ వంటి పక్కా సనాతనవాదులు అత్యధిక రాష్ట్రాల్లో పాలకులుగా ఉన్న ఈ దేశంలో అలా బాధ్యతా రహితంగా వదలివేయటం ఏమిటి ! ఉత్తర ప్రదేశ్‌లోనే పన్నెండున్నర లక్షలు ఉన్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. బిజెపి పాలిత మహారాష్ట్రలో గోశాలల్లో ఉన్న ఒక్కో ఆవుకు రోజుకు రు.50 చెల్లిస్తున్న ప్రభుత్వం వృద్దాప్య పెన్షన్‌గా నెలకు ఇస్తున్న మొత్తం రు.1,500 అంటే ఆవుతో సమానం.బీహార్‌లో రు.400గా ఉన్న వృద్ధాప్య పెన్షన్‌ మొత్తాన్ని ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని 2025జూన్‌లో నితీష్‌ కుమార్‌ సర్కార్‌ రు.1,100కు పెంచింది. అత్యంత మానవీయ కోణం ఉన్న ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని సర్కార్‌ జాతీయ సామాజిక సహాయ పథకం కింద మన్మోహన్‌ సింగ్‌ హయాంలో నిర్ణయించిన రు.200, రు.500మొత్తాలనే ఇప్పటికీ మంజూరు చేస్తున్నది. ఈ మాత్రానికే తమ వాటా ఎంత ఉందో లబ్దిదారులకు తెలపాలని కేరళ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాము ఇస్తున్న రు.1,600లలో ఎవరి వాటా ఎంతో చెప్పటానికి తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని అక్కడి వామపక్ష ప్రభుత్వం చురక అంటించింది.

గో సంరక్షణ చట్టాలతో వట్టిపోయిన ఆవులను మేపటం రైతాంగానికి భారంగా మారుతున్నది. గతంలో వాటిని అమ్మివేస్తే వధశాలలకు తరలించేవారు. ఇప్పుడు ఆమ్ముకోవచ్చుగానీ కొనేవారెవరు ? మహారాష్ట్రలో ఉన్న జంతు సంరక్షణ చట్టాన్ని సవరించటం లేదా రద్దు చేయాలని ఏకంగా అక్కడి బిజెపి ఎంఎల్‌సి, మాజీ మంత్రి సదాశివ ఖోట్‌ డిమాండ్‌ చేస్తున్నారు. అందుకుగాను మండిపడిన కాషాయదళాలు ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేయటమే కాదు దాడులకు పాల్పడటంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. పోలీస్‌ స్టేషన్‌ ముందు నిరసన కూడా తెలిపారు. సతారా జిల్లాలో కొందరు రైతులు తమ గేదెలను విక్రయించారు.వారికి డబ్బు చేతికి అందక ముందే గోరక్షకులమంటూ కొందరు వచ్చి వాటిని బలవంతంగా పూనే తరలించారు. రైతులు కోర్టుకు ఎక్కటంతో వారి పశువులను వెనక్కు ఇవ్వాలని ఆదేశించింది. అయితే వాటికోసం ఒక గోశాలకు వెళ్లగా అవి కనిపించలేదు. రైతులతో పాటు ఎంఎల్‌సి అక్కడ ఉండగా గోరక్షకులమంటూ వచ్చిన వారు తన మీద దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు సదాశివ ఖోట్‌ చెప్పారు. మహారాష్ట్రలో వట్టిపోయిన ఆవులు, గేదెలను విక్రయించటానికి వీల్లేకపోవటంతో రైతాంగానికి అవి భారంగా మారాయి. షేత్కారి రైతు సంఘ నేత శరద్‌ జోషి, మరికొందరు ఎప్పటి నుంచో చట్టాన్ని సవరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తాను మూడు దశాబ్దాలుగా రైతుల సమస్యల మీద పని చేస్తున్నానని గోరక్షకులుగా చెప్పుకుంటున్నవారు కనీసం ఒక్కసారైనా పాలు పితికిన వారు కాదని ఎంఎల్‌సి విమర్శించారు. గత కొద్ది వారాలుగా సాంప్రదాయకంగా పశువ్యాపారం చేస్తున్నవారు గోరక్షకుల పేరుతో ఉన్నవారి ఆగడాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు.వారికి సదాశివ ఖోట్‌ మద్దతు ప్రకటించారు. వట్టిపోయిన పశువులకు నెలకు తొమ్మిదివేల రూపాయల వంతున మేతకు ఖర్చు చేస్తే రైతులకు వచ్చేదేమీ ఉండదని అందువలన వాటిని అమ్ముకోవటం మినహా మరొక మార్గం లేదని, అయితే గోరక్షకులమంటూ బయలుదేరిన వారు ఆ లావాదేవీలను అడ్డుకుంటున్నారని, రైతాంగానికి నష్టం కలిగిస్తున్నారని చెప్పారు.హిందూత్వ నేత మిలింద్‌ ఎక్బోటే ఒక ప్రకటన చేస్తూ ఎంఎల్‌సి పశువులను వధించేవారి తరఫున మాట్లాడుతున్నారని, రాజకీయాలనుంచి గెంటివేయాలని డిమాండ్‌ చేశారు. ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ కూడా పశువధ చేసే వారికి మద్దతు ఇస్తున్నారని అన్నారు. అనేక రాష్ట్రాలలో పశువధ, వ్యాపారం వృత్తిగా ఖురేషీ అనే ముస్లిం తెగకు చెందిన వారు ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ మతాన్ని కూడా ముందుకు తెచ్చే ప్రయత్నం జరుగుతోంది.మహారాష్ట్రలో వట్టిపోయిన పశువుల సమస్య ముందుకు రావటం ఇదే మొదటి సారి కాదు. నిజానికి ఇది ఒక్క ఆ రాష్ట్రానిదే కాదు, పశువధ నిషేధం ఉన్న ప్రతి చోటా గోరక్షకుల పేరుతో రైతాంగాన్ని దెబ్బతీసే శక్తులు పేట్రేగిపోతాయి !