Tags

, , , , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

ఇటీవల చైనాతో సంబంధం ఉన్న రెండు వార్తలు, విశ్లేషణలు మీడియాలో వచ్చాయి.ఒకటి, 1962లో చైనాతో వచ్చిన యుద్ధం సరిహద్దు సమస్యల మీద కాదు, రెండవది అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన మన పౌరురాలి పాస్‌పోర్టు, వీసా చెల్లదు అని చైనా విమానాశ్రయంలో ఇబ్బంది పెట్టారు అన్నది రెండవది. మొదటి అంశాన్ని మన మీడియా పెద్దగా పట్టించుకోలేదు, రెండవదాని మీద పెద్ద ఎత్తున స్పందించింది, ఎందుకు ?చైనాతో వచ్చిన యుద్దం గురించి వచ్చిన విశ్లేషణ మీద కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంది, దాని మనసెరిగి, కనుసన్నలలో నడుస్తున్న మీడియా కావాలనే విస్మరించింది. రెండవ ఉదంతం మీద దానికి భిన్నంగా జరిగింది. చరిత్ర దాస్తే దాగేది కాదు, చెరిపితే పోయేది కాదు.రెండు దేశాల మధ్య యుద్ధం ప్రాధమికంగా సరిహద్దులపై ఏకాభిప్రాయం లేకపోవటం లేదా దౌత్యపరమైన వైఫల్యాల వలన జరగలేదని, పథకం ప్రకారం 1950 మరియు 60దశకాల్లో అమెరికా అనుసరించిన వ్యూహంలో భాగంగా చోటు చేసుకుందని సిఐఏ, దౌత్యకార్యాలయాల పత్రాలు, ప్రచ్చన్న యుద్ద అంతర్జాతీయ చరిత్ర ప్రాజెక్టు పత్రాలు వెల్లడించాయి. కొన్ని ప్రధాన మంత్రి మ్యూజియం మరియు లైబ్రరీలో కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.

చైనాతో ఉన్న సరిహద్దు వివాదాన్ని సంప్రదింపులతో పరిష్కరించుకోవాలన్న వైఖరిని వెల్లడించినందుకు తరువాత సిపిఐ(ఎం)గా ఏర్పడిన నాయకులను యుద్ధ సమయంలో ప్రభుత్వం, నాడు జనసంఘం రూపంలో ఉన్న నేటి బిజెపి నేతలు, ఆర్‌ఎస్‌ఎస్‌, ఇతర పార్టీలు, సంస్థలు దేశద్రోహులుగా చిత్రించాయి. ప్రభుత్వం జైల్లో పెట్టింది. యుద్దాన్ని సమర్ధించి నాటి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపిన సిపిఐతో ఇతరులను దేశభక్తులుగా చిత్రించారు, జనం కూడా అత్యధికులు నిజమే అని నమ్మారు. అది జరిగి ఆరు దశాబ్దాలు దాటింది. ఇప్పుడు వెలువడిన నిజానిజాలేమిటి ? యుద్ధానికి కారణం సరిహద్దు సమస్య కాదని, టిబెట్‌ కేంద్రంగా అమెరికా జరిపిన కుట్రలో భాగంగా జరిగిందని ఇటీవల బహిర్గత పరచిన నాటి రహస్య పత్రాలను అధ్యయం చేసిన వారు చెప్పిన మాట ఇది. వారెవరూ కమ్యూనిస్టులు కాదు. ఆ పత్రాలన్నీ అందరికీ అందుబాటులో ఉన్నాయి గనుక దీనికి భిన్నమైన విశ్లేషణను ఎవరైనా జనం ముందు పెట్టవచ్చు. అప్పటి వరకు కమ్యూనిస్టుల మీద నిందవేయటం తప్పని దాన్ని వెనక్కు తీసుకుంటామని ఎవరైనా నిజాయితీతో అంగీకరిస్తారా ?

” 1962 చైనా-భారత్‌ సంఘర్షణ భౌగోళిక రాజకీయ పరిణామాల వెల్లడి : చైనాా-భారత్‌ విభజనను అమెరికా ఎలా మలచింది ? ” అనే శీర్షికతో అమెరికాలోని పబ్లిక్‌ ఎఫైర్స్‌ జర్నల్‌ ఏప్రిల్‌ 2025 సంచికలో వెల్లడించారు. దాని రచయిత జిందాల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎఫైర్స్‌లో పని చేస్తున్న డాక్టర్‌ లక్ష్మణ కుమార్‌. ది హిందూ బిజినెస్‌లైన్‌ పత్రికతో ఆయన సంభాషించిన అంశాలను ఆ పత్రిక ప్రచురించింది. సోషలిస్టు దేశాలపై అమెరికా ప్రారంభించిన ప్రచ్చన్న యుద్దం, సోవియట్‌ యూనియన్‌-చైనా మధ్య తలెత్తిన సైద్ధాంతిక వివాదాలను ఆసరా చేసుకొని టిబెట్‌ అంశాన్ని ముందుకు తెచ్చి భారత్‌-చైనా మధ్య వివాదాన్ని రగిలించేందుకు అమెరికా రూపొందించిన దీర్ఘకాలిక కుట్రకు రెండు దేశాలూ గురయ్యాయి. నాటి నుంచి నేటి వరకు తరువాత కాలంలో సాధారణ సంబంధాలు ఏర్పడినప్పటికీ పరస్పరం నమ్మకంలేకుండా గడుపుతున్నాయంటే అతిశయోక్తి కాదు. అమెరికా ఎత్తుగడ నిజానికి టిబెట్‌ తిరుగుబాటుదార్లకు ఏదో చేద్దామని కాదు, వారికి సాయపడే ముసుగులో భారత్‌-,చైౖనా మధ్య వైరం పెంచటమే అసలు లక్ష్యంగా రహస్య పత్రాల్లో వెల్లడైంది.

1962 అక్టోబరు 20న చైనా దాడి ప్రారంభించి నవంబరు 20న ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించి అరుణాచల్‌ ప్రదేశ్‌లో తన ఆధీనంలోకి తెచ్చుకున్న ప్రాంతాల నుంచి సేనలను ఉపసంహరించుకొని వాస్తవాధీన రేఖకు పరిమితమైంది. అవి తన ప్రాంతాలని అంతకు ముందునుంచి చెబుతున్నప్పటికీ చైనా వెనక్కు తగ్గింది. టిబెట్‌లో జరిగిన కుట్రల క్రమ సారాంశం ఇలా ఉంది.1956లో అక్కడ దలైలామా పలుకుబడిలో ఉన్న ప్రభుత్వ మద్దతుతో తిరుగుబాటుకు నాందిపలికారు. సిఐఏ దాన్ని అవకాశంగా తీసుకొని ముందే చెప్పుకున్నట్లు 1957 నుంచి 1961వరకు వారికి శిక్షణ, ఆయుధాలు,రేడియోలు, ఇతర పరికరాలను ఇచ్చింది.విమానాల ద్వారా 250టన్నుల మిలిటరీ సరఫరాలు చేసింది.నిఘావిమానాల ద్వారా సమాచారాన్ని అందచేసింది. చైనా మిలిటరీ తిరుగుబాటును అణచివేయటంతో 1959లో దలైలామాను టిబెట్‌ నుంచి తప్పించి అరుణాచల్‌ ప్రదేశ్‌ ద్వారా భారత్‌కు చేర్చారు.దీనికి నాటి నెహ్రూ సర్కార్‌ పూర్తి మద్దతు ఇచ్చింది, అధికారులను పంపి మరీ స్వాగత ఏర్పాట్లు చేసిందంటే అమెరికా సిఐఏతో సమన్వయం చేసుకోకుండా జరిగేది కాదు. అంతేనా మన దేశంలో ఆశ్రయం కల్పించటమే గాక తిరుగుబాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశమిచ్చింది. దీన్ని రెచ్చగొట్టటం, తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటంగా చైనా పరిగణించింది.1961లో ఉత్తర నేపాల్లోని ముస్టాంగ్‌కు సిఐఏ తన కార్యకలాపాలను విస్తరించింది. దలైలామా పరారీ తరువాత అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా మిలిటరీ మన సైనికుల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది.చైనాను నిలువరించాలని ప్రధాని నెహ్రూ నాటి సోవియట్‌ నేతలను కోరారు. అయితే తాము తటస్థంగా ఉంటామనే సందేశాన్ని వార్తల ద్వారా సోవియట్‌ పంపింది. తరువాత దాని నేత కృశ్చెవ్‌ 1959 అక్టోబరు రెండున బీజింగ్‌ పర్యటనలో నెహ్రూ మంచివాడని, భారత్‌తో వైరం వద్దని మావోకు సూచించటంతో ఈ వైఖరి చైనా-సోవియట్‌ మధ్య విబేధాలను పెంచింది. సరిహద్దు సమస్యలను పరిష్కరించుకుంటామని అది పెద్ద సమస్య కాదని, అసలు అంశం టిబెట్‌ అని ఈ విషయంలో భారత్‌తో రాజీపడేది లేదని మావో చెప్పినట్లు కథనాలు వచ్చాయి. దాని పర్యవసానాలు మనదేశంలో కూడా ప్రతిబింబించాయి. అవిభక్త కమ్యూనిస్టు పార్టీలోని ఒక వర్గం సోవియట్‌ వైఖరికి అనుగుణంగా నెహ్రూ అనుకూల, చైనా వ్యతిరేక వైఖరిని తీసుకుంది.దానికి భిన్నంగా సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనే వైఖరిని మరో వర్గం తీసుకుంది. అందుకు వారిని జైలుపాలు చేశారు. తరువాత వారే సిపిఐ(ఎం)గా ఏర్పడ్డారు. నాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలు సిపిఐ(ఎం) వైఖరే సరైనదని రుజువు చేశాయి.సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ కాంగ్రెస్‌, బిజెపి ఎవరు అధికారంలో ఉన్నా వాటి మీద ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉంటూనే చైనాతో సంబంధాలను కొనసాగించారు. ఏ ప్రధానీ కలవనన్ని సార్లు చైనా నేతలతో భేటీ అయి నరేంద్రమోడీ ఒక రికార్డు సృష్టించారు.చైనా నుంచి చేసుకుంటున్న దిగుమతులలో మోడీ తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నారు.

అసలు రెండు దేశాల మధ్య యుద్దానికి దారితీసిన పరిస్థితి ఏమిటి ? తెరవెనుక అమెరికా సృష్టించిన టిబెట్‌ చిచ్చుకాగా బయటికి సరిహద్దు వివాదంగా ముందుకు వచ్చింది.1954లో చైనా-భారత్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. అయితే అప్పటికే అమెరికా కుట్ర మొదలైంది. దాన్లో భాగంగా బుద్ద జయంతిని జరుపుకొనే పేరుతో 14వ దలైలామా భారత్‌ వచ్చాడు. ఆ సందర్భంగా అంగీకరిస్తే భారత్‌లో ఆశ్రయం పొందుతానని చేసిన వినతిని నెహ్రూ తిరస్కరించారు. కానీ అదే నెహ్రూ సిఐఏ పధకం ప్రకారం టిబెట్‌ నుంచి పారిపోయి 1959 ఏప్రిల్‌ 18న అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తేజ్‌పూర్‌ చేరుకున్న దలైలామాకు మానవతాపూర్వక కారణాల సాకుతో ఆశ్రయం ఇవ్వటమేగాక ప్రవాస ప్రభుత్వ ఏర్పాటుకూ అనుమతించించారు. వేలాది మంది టిబెట్‌ నుంచి వచ్చిన వారికీ ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. కాలనీలను ఏర్పాటు చేసింది. ఇప్పటికీ అదే కొనసాగుతోంది.సరిహద్దులో మన ప్రభుత్వం 1961 కొన్ని పోస్టులను కొత్తగా ఏర్పాటు చేసి ఆ ప్రాంతం తమ అదుపులోనే ఉందని ఉద్ఘాటించింది. అప్పటికే దలైలామా ప్రవాస ప్రభుత్వం చైనా వ్యతిరేక కార్యకలాపాలను సాగిస్తోంది.దీనికి తోడు సరిహద్దుల్లో కొత్తగా పోస్టులను ఏర్పాటు చేయటాన్ని అవకాశంగా తీసుకొని చైనా వాటిని తొలగించేందుకు పూనుకోవటం, మన మిలిటరీ ప్రతిఘటించటంతో అది తరువాత నెల రోజుల యుద్ధంగా మారింది.

అరుణాచల్‌ ప్రదేశ్‌ మహిళ ప్రేమా వాంగ్‌జోమ్‌ థోంగ్‌డాక్‌ దగ్గర ఉన్న పాస్‌పోర్టు చెల్లదంటూ షాంఘై పుడోంగ్‌ విమానాశ్రయ అధికారులు కొన్ని గంటల పాటు నిలిపివేశారంటూ వచ్చిన వార్తలకు మన మీడియా పెద్ద ఎత్తున ప్రచారమిచ్చిన సంగతి తెలిసిందే.మనదేశం, చైనాల మధ్య సరిహద్దులంటూ మాపులపై బ్రిటీష్‌ అధికారులు గీచిన రేఖలు రెండు దేశాల మధ్య వివాదాన్ని సృష్టించాయి. వివిధ సందర్భాలలో ప్రచురించిన మాప్‌ల ప్రకారం ప్రస్తుతం మన దేశంలో అంతర్భాగంగా ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ చైనాకు చెందినది, చైనా ఆధీనంలో ఉన్న లడఖ్‌ సమీపంలోని ఆక్సారుచిన్‌ ప్రాంతం మనదిగా చూపాయి. అందువలన రెండుదేశాలూ అవి తమ ప్రాంతాలని మాపుల్లో చూపుతున్నాయి. అరుణాచల్‌ తమ టిబెట్‌లోని దక్షిణ ప్రాంతమైన జాంగ్‌నాన్‌ అని చెబుతుండగా ఆక్సారు చిన్‌ మా లే (లడఖ్‌) జిల్లాలో భాగమని అంటున్నాము. దలైలామా 2023లో తవాంగ్‌ పర్యటన చేస్తామని ప్రకటించగా అనుమతించకూడదంటూ నాడు చైనా అభ్యంతరం చెప్పింది.అంతకు ముందు కూడా అభ్యంతరాల మధ్య పర్యటించినా చివరిసారిగా గాల్వన్‌ ఉదంతాల తరువాత ఏర్పడిన పరిస్థితుల నేపధ్యంలో పర్యటనను రద్దు చేసుకున్నాడు. అరుణాచల్‌ ప్రదేశ్‌-భారత్‌ పేరుతో ఉన్న పాస్‌పోర్టు, వీసాలను చైనా తిరస్కరించటం ఇదే మొదటిసారి కాదు. పాస్‌పోర్టు మీద స్టాంప్‌ వేయటానికి నిరాకరించి ఒక తెల్లకాగితం మీద అనుమతి పత్రాన్ని జారీ చేస్తామని చైనా చెప్పింది. దానికి నిరాకరించిన మనదేశం చైనాలో జరిగిన ఆసియా క్రీడలకు మన క్రీడాకారులను పంపలేదు. తాజాగా ప్రేమ అనే మహిళ విషయంలో కూడా అదే జరిగింది, మీరు భారతీయురాలు కాదు, చైనీస్‌ అందువలన వీసా కోసం దరఖాస్తు చేసుకోండి అని చైనా అధికారులు చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

చిత్రం ఏమిటంటే మన దేశంలో ఆశ్రయం పొంది,ప్రవాస టిబెట్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 1959 నుంచి అన్ని సౌకరాలను అనుభవిస్తున్న 14వ దలైలామా 2003లో మాట్లాడుతూ అరుణాచల్‌ ప్రదేశ్‌ టిబెట్‌లో అంతర్భాగం అన్నాడు తప్ప మనదేశంలో భాగం అని గుర్తించలేదు. అయినప్పటికీ అతగాడికి సౌకర్యాలు కల్పించటం రాజకీయం తప్ప వేరు కాదు. మనదేశం తెచ్చిన వత్తిడి, విధిలేని పరిస్థితిలో 2008లో తన వైఖరిని మార్చుకున్నాడు. 1914లో బ్రిటీష్‌ వారు గీచిన మక్‌మోహన్‌ రేఖను భారత్‌-టిబెట్‌ సరిహద్దుగా నిర్ణయిస్తూ బ్రిటీష్‌ ఇండియా పాలకులు టిబెట్‌ పాలకులతో సిమ్లాలో ఒప్పందం చేసుకున్నారు.బ్రిటీష్‌ వారి పాలనకు చరమగీతం పాడారు, దాంతో ఉక్రోషం పట్టలేని బ్రిటన్‌ కుట్రకు తెరలేపింది. అప్పుడే స్వాతంత్య్రం పొందిన చైనాకు టిబెట్‌ మీద హక్కులేదని చెప్పేందుకు బ్రిటీష్‌ పాలకులు పన్నిన కుట్రలో భాగం సిమ్లా ఒప్పందమంటూ నాటి, నేటి చైనా ప్రభుత్వం అంగీకరించలేదు. టిబెట్‌ తమ సామంత దేశమని అంతర్జాతీయ ఒప్పందాలు చేసుకొనేందుకు దాని పాలకులకు హక్కు లేదు, చెల్లదని చైనా చెబుతున్నది. ఉదాహరణకు, బ్రిటీష్‌ పాలనలో సామంత రాజ్యాలుగా ఉన్న కాశ్మీరు, నిజాం సంస్థానాలు స్వాతంత్య్రం ప్రకటించుకోవటాన్ని నాడు మన కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ పూర్వరంగంలో సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవటం తప్ప దగ్గరదారి లేదు. అప్పటి వరకు యథాతధ స్థితి కొనసాగించాల్సి ఉంది. రెండు దేశాలూ ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉన్నప్పటికీ సాధారణ సంబంధాలకు ఢోకా ఉండదు. వివాదాన్ని కాలమే పరిష్కరించాల్సి ఉంది. యుద్ధాల ద్వారా ప్రాంతాలను స్వాధీనం చేసుకోవటం కుదిరే అంశం కాదు. ఆక్రమిత కాశ్మీరుపై మనకు తిరుగులేని హక్కు ఉంది, ఎలాంటి వివాదం లేకున్నా బలప్రయోగంతో స్వాధీనం చేసుకొనేందుకు పూనుకోలేదు. చైనా గురించి న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి అమెరికా బడా పత్రికలు అనేక తప్పుడు వార్తలు ఇచ్చాయి. మీడియాలో వచ్చే వార్తలు, వ్యాఖ్యలు లేదా అధికారంలో లేని సంస్థలు, వ్యక్తులు చేసే వ్యాఖ్యలు, రెచ్చగొట్టే అంశాలకు రెండు దేశాలకు చెందిన పౌరులు భావోద్వేగాలకు గురైతే బుర్రలు ఖరాబు చేసుకోవటం తప్ప జరిగేదేమీ ఉండదు. వివాదాలు పభుత్వాలు తేల్చాల్సిన, తేల్చుకోవాల్సిన అంశాలని గ్రహించాలి !