Tags
#India trade matters, BJP, China, India exports and Imports, Japan, Narendra Modi Failures, Nirmala Sitharaman, Rupee, Rupee fall under Modi rule, US Dollar
ఎం కోటేశ్వరరావు
వినేవారికి కేవలం చెవులే ఉండి మెదడులో పదార్ధం లేకపోతే చెప్పేవారు ఎన్ని కతలైనా వినిపిస్తారు. రూపాయి పతనం గురించి ఇప్పుడు అదే నడుస్తున్నది. డాలరు విలువ పెరిగింది తప్ప మన రూపాయి పడిపోలేదని ఒక పాట, మిగతా కరెన్సీలతో పోలిస్తే మన పతనం తక్కువ, ఇతర కరెన్సీలన్నీ ఇలాగే ఉన్నాయంటూ మరోముక్తాయింపు. గతంలో వీరే ఏం చెప్పారంటే తాము చేస్తే సంసారం, ఇతరులు చేస్తే ……. అన్నట్లుగా ఉంది. అవునులే నడిచినంత కాలం దేశం కోసం ధర్మం కోసం అంటూ ఏమైనా చెప్పవచ్చు, చేయవచ్చు. డాలరుతో పోటీ పడి మన రూపాయి విలువను ఎందుకు పెంచలేదని ఎవరైనా ప్రశ్నిస్తే దేశద్రోహం నేరం కింద జైల్లో వేస్తారు. రూపాయి పతనమైతే వచ్చే నష్టం ఏమిటి ? ఉదాహరణకు నరేంద్రమోడీకి అమెరికాలో ఉన్న పలుకుబడి కారణంగా గత పదకొండేళ్లుగా మనం కేవలం పదిడాలర్లకే విమానంలో అమెరికా వెళుతున్నాం, రాయితీ టిక్కెట్ల ధరలు పెంచలేదు అనుకుందాం. గత ఏడాది కాలంలో రూపాయి విలువ 85 నుంచి 91కి దిగజారింది. టికెట్ కొనుక్కోవాలంటే రు.850 బదులు రు.910 చెల్లించాలి. ఇంకో ఉదాహరణ చెప్పాలంటే రూపాయి పాపాయికి రక్షణ లేకుండా పోయిందని నరేంద్రమోడీ, బిజెపి నేతలు ఊరూవాడా నానా యాగీచేసి అధికారానికి వచ్చినపుడు కేవలం రు.600లకే ఆ టికెట్ దొరికేది. బిజెపి నేత సుబ్రమణ్య స్వామి చెప్పినట్లు మోడీ వస్తే విలువను 35కు పెంచుతామని చెప్పారు. ఆ పుణ్యం కట్టుకొని ఉంటే రు.350కే దొరికేది. ఇది అత్యాశ అనుకున్నా కనీసం ”56” కు పెంచినా రు.560కి దొరికేది. మోడీకి అంత బలమైన ఛాతీ ఉందని జనం నమ్మేవారు. బిజెపి ప్రభుత్వ నిర్వాకం గురించి ఇంతకంటే వివరణ అవసరం లేదేమో ?
ప్రధాన మంత్రికి రోజూ సలహాలిస్తున్న ఆర్థిక సలహామండలి సభ్యుల్లో ఒకరైన సంజీవ్ సన్యాల్ పుండు మీద కారం చల్లుతున్నారు. రూపాయి పతనంపై తనకెలాంటి ఆందోళన లేదని చెప్పారు.ఆర్ధిక స్థితికి – రూపాయికి సంబంధం లేదని, దేశాల ఆర్థిక వ్యవస్థలలో ఉన్నత వృద్ధి రేటు ఉన్నపుడు తరచుగా కరెన్సీ మారకపు విలువలు తక్కువగా ఉంటాయన్నారు. రూపాయి పతనం 91 నుంచి వందకు చేరి నరేంద్రమోడీ కళ్లలో ఆనందం చూసే సమయం దగ్గరపడుతున్నదని నెటిజన్లు స్పందిస్తున్న తరుణమిది. టైమ్స్ నెట్‌వర్క్ 2025 సమావేశంలో సన్యాల్ మాట్లాడారు.దేశీయంగా ద్రవ్యోల్బణానికి కారణం కానంత వరకు రూపాయి పతనమైనా ఇబ్బంది లేదని, వెనక్కు తిరిగి చూస్తే జపాన్ ఆర్థిక వ్యవస్థ చాలా చాలా వేగంగా పురోగమిస్తున్నపుడు దాని కరెన్సీ చాలా బలహీనంగా ఉంది.చైనా తన కరెన్సీ విలువను పెరగనిచ్చేంతవరకు 1990, 2000దశకాల్లో అలాగే ఉందంటూ సన్యాల్ చెప్పారు. ఒక దేశ కరెన్సీ డాలరుతో మారకపు విలువ తక్కువగా ఉన్నపుడు ఆయాదేశాల వస్తువుల ధరలు ప్రపంచ మార్కెట్లో చౌకగా ఉండి ఎగుమతులు పెరిగేందుకు అవకాశం ఉండే మాట నిజం. కానీ మన కరెన్సీ పతనమైనా ఎగుమతులు దానికి అనుగుణంగా ఎందుకు పెరగలేదో పెద్దలు చెప్పాలి. చైనానే తీసుకుంటే జిడిపిలో దాని ఎగుమతులు 2013లో 24.6శాతం కాగా 2024లో 20శాతానికి తగ్గాయి. దాని యువాన్ విలువ పెరిగిందని సరిపెట్టుకుందాం. సన్యాల్ వాదన ప్రకారం దాని కరెన్సీ విలువ పెరిగింది కనుక తగ్గినట్లు అంగీకరిద్దాం. భారత్ పరిస్థితి ఏమిటి ? 2013లో జిడిపిలో మన ఎగుమతులు 25.43 శాతం కాగా 2024లో 21.2శాతానికి తగ్గాయి. ఈ కాలంలోనే కదా మన రూపాయి విలువ 60 నుంచి ఇప్పుడు 91కి పడిపోయినా ఎగుమతులు ఎందుకు తగ్గినట్లు ? జపాన్ ఎన్ విలువ డాలరుకు 2014లో 106కాగా ఇప్పుడు 157కు తగ్గింది. ఇదే కాలంలో దాని జిడిపిలో ఎగుమతులు 15.8 నుంచి 22.8శాతానికి పెరిగాయి. మన కరెన్సీ విలువపతనమైనా ఎగుమతులు ఎందుకు పెరగలేదు ? అందుకని రూపాయి పతనం గురించి ఎప్పటికెయ్యది అప్పటికామాటలాడి తప్పించుకుంటున్నారు. వారి ధైర్యం ఏమంటే దీని గురించి సామాన్యులకు నిజానిజాలు తెలుసుకొనే తీరిక, ఆసక్తి లేదా తెలివి తేటలు ఉండవనే గట్టి నమ్మకం. అభివృద్ధి చెందుతున్నపుడు కరెన్సీ విలువను తగ్గించి ఉంచుతారని చెప్పటమంటే కావాలనే పతనాన్ని ప్రోత్సహిస్తున్నారు లేదా పతనమౌతుంటే కాగల కార్యం గంధర్వులు తీర్చుతున్నారన్నట్లుగా చూస్తూ ఊరుకున్నట్లు కనిపిస్తున్నది. రూపాయి పతనం అవుతుంటే ఎగుమతిదార్లు సంతోషిస్తారు, దిగుమతిదార్లు పెరిగిన భారాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు, వారికి పోయేదేమీ లేదు, జనాలకు జేబులు గుల్ల. అందుకే సన్యాల్ వంటి ఆర్థికవేత్తలకు ఎలాంటి ఆందోళన ఉండదు. ఒక్క సన్యాలే కాదు. ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ ఇంకా తీవ్రమైన వ్యాఖ్య చేశారు. రూపాయి పతనం అవుతుంటే ప్రభుత్వం ” నిద్ర చెడగొట్టుకోవటం ”లేదన్నారు. అంటే తాపీగా తడిబట్ట వేసుకొని ఉందని వేరే చెప్పనవసరం లేదు.
బిజెపి పెద్దలు ప్రతిపక్షంలో ఉన్నపుడేంచెప్పారో చూద్దాం. రాజ్యసభలో బిజెపి ఉపనేతగా ఉన్న రవి శంకర్ (2013 జూలై 10) రూపాయి విలువ 60.15కు పడిపోయినపుడు ” జాతీయ స్వాభిమానాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నది,ప్రభుత్వం ఏమి చెప్పినప్పటికీ ఆర్థిక మూలాలు విపరీతంగా దిగజారుతున్నయనేందుకు ఇది నిదర్శనం. విదేశీ పెట్టుబడులపై ఆధారపడటం దుర్బల నమూనా, ఎక్కువగా వాటిపై ఆధారపడితే అవెంత వేగంగా వస్తాయో అదే విధంగా వెనక్కు వెళతాయి.” ఇలాంటి పెద్ద మనుషులందరూ 2014లో అధికారానికి వచ్చినకొత్తలో మోడీ పదే పదే విదేశాలకు ఎందుకు వెళుతున్నారంటే దేశప్రతిష్ట పునరుద్దరణ, విదేశీ పెట్టుబడుల కోసం అని సమర్ధించిన అంశాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. యుపిఏ ప్రభుత్వ హయాంతో పోల్చితే ఎక్కువగా రూపాయి పతనమైంది. ఇప్పుడు స్వాభిమానం పెరిగినట్లా దిగజారినట్లా ? ఆడవారి మాటలకు అర్దాలే వేరులే అని మహిళలను రచయిత పింగళి నాగేంద్రరావు మిస్సమ్మ సినిమాలో తూలనాడారు గానీ బిజెపి నేతల మాటలకు అది వర్తిస్తుంది.
చిట్కాలు చెప్పటంలో మన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పెట్టింది పేరు. రూపాయి పతనం చెందినందుకు అసలు ప్రభుత్వాన్ని రద్దు చేస్తే పోతుంది అన్నారు.(2013సెప్టెంబరు ఒకటి) చెన్నరులో మాట్లాడుతూ పక్షవాతం వచ్చిన ప్రభుత్వాన్ని దేశం భరించలేదు, ఈ అనిశ్చితిని తొలగించటం మంచిది, సాధ్యమైనంత మేరకు త్వరగా ఎన్నికలు పెట్టాలి. మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక బాధల కంటే తన పేరు ప్రతిష్టలను పెంచుకోవటం గురించి ఎక్కువగా శ్రద్ద చూపుతున్నారు. ప్రభుత్వ పెద్దగా దీనికి బాధ్యత ఎవరిదో నిర్ణయించాలి. సదరు వ్యక్తిని తొలగించాలి లేదా తానే బాధ్యత తీసుకోవాలి ” ఎంత బాగా అన్నావు ఎవ్వరు నేర్పిన మాటరా వేదంలా విలువైన దంటూ ఒక పాట గుర్తుకు వచ్చింది. ఇప్పుడు నరేంద్రమోడీని లేదా కనీసం నిర్మలాసీతారామన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలి మరి, చేస్తారా ? బిజెపి జాతీయ అధ్యక్షుడిగా నితిన్ గడ్కరీ (ఇప్పుడు జాతీయ రహదారుల కేంద్ర మంత్రి) ఉన్న సమయంలో(2012 మే 24) రూపాయి పతనానికి ప్రపంచ కారణాలు కానేకాదంటూ ” సమస్య యూరో జోన్‌లో కాదు, యుపిఏ జోన్‌లో ఉంది. ఆర్థికవేత్త అయిన మన ప్రధాని నాయకత్వంలో రూపాయి స్వేచ్చగా పతనమౌతున్నది.” బిజెపి మరోనేత పియూష్ గోయల్, ఇప్పుడు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి 2013 జూన్ 26న ఒక ట్వీట్ చేశారు(ఇప్పుడు ఎక్స్) పతనం అవుతున్న రూపాయిని చూస్తుంటే చాలా వేదనా భరితంగా ఉంది ” రూపాయి పతనం కాకుండా మోడీ ప్రభుత్వం ఏమైనా పడకుండా కాపాడుతున్నదా ? గోయల్ ఆనందంతో గంతులు వేస్తున్నారా ? బిజెపి అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ 2013లో మాట్లాడుతూ రూపాయి పతనాన్ని ఆపలేనట్లయితే మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలి.ఒక ఆర్థికవేత్తగా ఏం చేస్తున్నారు ? పదవిలో కొనసాగే హక్కులేదు ” అని చెప్పారు. మరో బిజెపి నేత ప్రకాష్ జవదేకర్ 2013లో మాట్లాడుతూ ” పూర్తిగా దివాలాకోరు ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోలేని స్థితి,పాలన లేదు. రూపాయి పతనానికి అసమర్ధ నాయకత్వమే కారణం, మన్మోహన్ సింగ్, ఆయన మంత్రులే బాధ్యులన్నది స్పష్టం. మౌలిక సదుపాయాలు, వాణిజ్యంపై సకాలంలో చర్యలు తీసుకుంటే రూపాయి పతనాన్ని అరికట్టవచ్చు ” అన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎంతో అనుభవం ఉందటూ ప్రధానిగా మోడీ పేరును ముందుకు తెచ్చిపుడు చెప్పారు. సదరు అనుభవం రూపాయి పతనాన్ని ఆపలేకపోయింది. ఇక మౌలిక సదుపాయాల గురించి అతిశయోక్తులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఎనిమిది సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం పెద్ద ప్రకటనలు ఇచ్చి విజయాల గురించి చెప్పుకుంది.తమ ఏలుబడిలో విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 140కి పెరిగిందన్నది వాటిలో ఒకటి. నిజానికి 2014లో దేశంలో 94 పని చేస్తున్నవి, 31పని చేయనివి ఉన్నట్లు ఎయిర్‌పోర్ట్ అధారిటీ వార్షిక నివేదికలో ఉందని ఫాక్ట్‌చెకర్ అనే వెబ్ పోర్టల్ పేర్కొన్నది. యుపిఏ పాలనలో రోజుకు 12కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు నిర్మించగా తాము 37 కిలోమీటర్లు నిర్మించినట్లు చెప్పుకుంది. నిజానికి తొమ్మిది సంవత్సరాల సగటు 19.17 కిలోమీటర్లు మాత్రమే, 2021లో 36.5 కిలోమీటర్లు నిర్మించారని లోక్‌సభకు అందచేసిన సమాచారంలో పేర్కొన్నారు. అందువలన అసత్యాలు,అర్ధసత్యాలకు మోడీ సర్కార్ పేరు మోసిందన్నది సత్యం.రూపాయి పతనం గురించి ఒక్క బిజెపి నేతలే కాదు, వారిని సమర్ధించే సినీనటీనటులు, ఆధ్యాత్మికులం అని చెప్పుకొనే బాబాలు కూడా యుపిఏ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. ఇప్పుడు వారు తలలు ఎక్కడ పెట్టుకున్నారో తెలియదు. జూహీ చావ్లా ఒకపుడు ప్రముఖ హీరోయిన్, 2013 ఆగస్టు 21న ఒక ట్వీట్ చేశారు.” దేవుడా నీకు కృతజ్ఞతలు, నా అండర్‌వేర్ పేరు డాలర్, రూపాయి గనుక అయి ఉంటే అది మాటి మాటికీ జారిపోతూ ఉండేది ” అని పేర్కొన్నారు. నెటిజన్లు మామూలుగా స్పందించలేదు, ఇప్పుడు ఆమె అండర్‌వేర్‌ను చూడాలి,రూపాయి పడిపోకుండా డాలర్‌కు రాఖీ కట్టటం(ముడివేయటం) ఆపిందేమో అంటూ సెటైర్లు. గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ఒక ట్వీట్‌లో నరేంద్రమోడీ అధికారానికి వస్తే రూపాయి విలువ 40కి పెరుగుతుందని పేర్కొన్నారు. నిజమే అతని పేరులో ఉన్న ఒక్కో శ్రీ కి 45 రూపాయల చొప్పున ఇప్పుడు 90కి దిగజారిందరటూ జోకులు. బాబా రామ్‌దేవ్ యుపిఏ ప్రభుత్వం మీద ఆరోపణల పత్రం(చార్జిషీట్) దాఖలు చేయాలని 2013లో చెప్పారు.ఈ 0.75కంటి మనిషి కాంగ్రెస్ మీద చార్జిషీట్ వేయాలన్నారు, ఇప్పుడు స్వదేశీ పేరుతో భక్తులను వెర్రి వెంగళప్పలను చేస్తున్నాడంటూ నెటిజన్లు ఆడుకున్నారు.
బిజెపిలో సుబ్రమణ్యస్వామి స్థానం ఏమిటో ఒక బ్రహ్మపదార్ధం.తనకు పదవులు ఇచ్చినపుడు, కావాల్సినపుడు ఒక మాట లేనపుడు మరోమాట మాట్లాడతారు, అయినా ఎలాంటి చర్య తీసుకొనే ధైర్యం బిజెపికి లేదు. ఆ పెద్దమనిషి ఆర్థికవేత్త కూడా, 2014 ఏప్రిల్ 27న మాట్లాడుతూ ఎన్‌డిఏ గనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేట్లయితే మోడీ ప్రధానమంత్రి అవుతారు, రెండు సంవత్సరాలలోపు రూపాయి బలపడి రు.35కు చేరుతుంది ” అన్నారు. నిర్మలా సీతారామన్ ప్రతిపక్షంలో ఉండగా ఏం చెప్పారో చూద్దాం ” రూపాయి పతనం చెందుతున్నపుడు మీరు ఊహించుకోవచ్చు, భారత ఎగుమతులు పెరుగుతాయి, ఎందుకంటే మీ వస్తువులు చౌకగా మారతాయి. మీ వస్తువులను కొనేందుకు విదేశాల వారు ఆకర్షణకు లోనౌతారు. కానీ అలా జరగటం లేదు, మీ వస్తువులను కొనాలని జనాలు అనుకోవటం లేదు. మీ పెట్టుబడులు పెరుగుతున్నాయి, రూపాయి పతనం అవుతున్నా మీ ఎగుమతులు పెరగటం లేదు, ఇది తీవ్రమైన పరిస్ధితి. ఆందోళన పడాల్సిన అవసరం లేదని మనకు ప్రతిసారీ ప్రభుత్వం చెబుతున్నది. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను.నాకు తెలుసు అనేక మంది తమకున్న కొద్దిపాటి పొలాలను కూడా అమ్ముకొని విదేశాల్లో చదువుకుంటున్న తమ పిల్లల కోసం డబ్బు చెల్లించారు. రూపాయి విలువ పతనం కారణంగా బయట ఉన్న విద్యార్ధులు చదువులను మధ్యలో ఆపివేసి తిరిగి రాకతప్పటం లేదు.మనం ఎప్పుడైనా ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల గురించి మాట్లాడుతున్నాం రూపాయి పతనం గురించి చెబుతున్నామా ? మనకేమీ చెప్పటం లేదు ” ఒకనాడు తెలుగింటి కోడలిగా ఉన్న ఆమె ఇప్పుడు మాట్లాడటం లేదేం ?
పైన చెప్పుకున్నవారందరికీ తిరుగులేని నేత నరేంద్రమోడీ ఏం సెలవిచ్చారో చెప్పుకోకపోతే ప్రహసనం సంపూర్ణం కాదు. ప్రధానమంత్రి పదవి స్వీకరించిన తరువాత రూపాయి పతనం గురించి నోరెత్తితే భారతమాత మీద ఒట్టు. అఫ్‌కోర్స్ మహానుభావులుగా మారిన తరువాత వారి మౌనానికి ఎన్నో అర్దాలు ఉంటాయనుకోండి. కర్ణాటకలోని హుబ్లీలో 2014 ఫిబ్రవరి 28న జరిగిన సభలో మాట్లాడుతూ ఇలా అన్నారు.” మన రూపాయి నిలకడ లేకుండా ఉంది. విలువ పడిపోతూనే ఉంది. అతల్ జీ ప్రభుత్వంలో రూపాయి 40-45 మధ్య ఉంది,ఈ ప్రభుత్వ హయాంలో 62,65,70…..గా పడిపోతూనే ఉంది.దిగుమతులు పెరుగుతున్నాయి, ఎగుమతులు తగ్గుతున్నాయి…స్పృహ ఉన్న ప్రభుత్వం చేయాల్సినపని ఎగుమతులను పెంచాలి, దిగుమతులను తగ్గించాలి ” పదకొండు సంవత్సరాల పాలనలో మోడీ ప్రభుత్వం చేసిందేమిటి ? తాజాగా వెలువడిన సమాచారం ప్రకారం 2025లో చైనా కస్టమ్స్‌శాఖ చెబుతున్నదాని ప్రకారం బీజింగ్‌తో మన వాణిజ్య లోటు 115 బిలియన్ డాలర్లు, మనదేశం 106 బిలియన్ డాలర్లు అంటున్నది, ఏ సంఖ్యను చూసినా మోడీ తన రికార్డులను తానే బద్దలుకొట్టుకున్నారు. పదకొండు సంవత్సరాల మోడీ ప్రభుత్వ నిర్వాకాన్ని చూసినపుడు 2014 తరువాత ఒక్క ఏడాది కూడా ఎగుమతులు పెరిగి దిగుమతులు తగ్గలేదు. పదకొండు సంవత్సరాలలో మన వాణిజ్య లోటు 80వేల కోట్ల డాలర్లు. తొలి ఏడాది 607 కోట్ల డాలర్లు లోటు ఉంటే 2024-25లో అది 950 కోట్ల డాలర్లకు చేరింది. అయినా సరే సమర్ధవంతమైన పాలన అందిస్తున్నామని చెబుతుంటే మనమంతా నిజమేకదా అని నమ్ముతున్నాం, విశ్వాసం అలాంటిది మరి. రూపాయి గురించి గతంలో నరేంద్రమోడీ ఇంకా ఏం చెప్పారు ! రూపాయి ఆసుపత్రిలో ఉంది ఐసియులో చేర్చారు. సంక్షోభం వచ్చింది, ఇలాంటి సమయాల్లో ఆశల్లేనపుడు, నాయకత్వం ఎటుపోతున్నదో తెలియనపుడు సంక్షోభం మరింత తీవ్రం అవుతుంది. ఒకసారి రూపాయి పతనం అయితే ప్రపంచ శక్తులు దాన్ని పూర్తి అవకాశంగా మలుచుకుంటాయి. ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం రూపాయి పోటీ పడుతున్నాయి, రూపాయి విలువ వేగంగా పతనం అవుతున్నది. అతల్ జీ అధికారానికి వచ్చినపుడు రూపాయి విలువ రు.42 ఉంది, దిగిపోయేటపుడు 44, కానీ ఈ ప్రభుత్వం(యుపిఏ) దాన్ని రు.60కి దిగజార్చింది. రూపాయి బలాన్ని కోల్పోవటం లేదు, దాని సైజు మారింది, ఎందుకంటే ఢిల్లీలో అధికారంలో ఉన్నవారు అవినీతి మీద కేంద్రీకరించారని చెప్పారు. నిజంగా బిజెపి నేతలకు, వారిని సమర్ధించేవారికి భారతీయ ఆత్మ, విలువలు, వలువలు ఉండి వారి గతాన్ని నెమరువేసుకుంటే వారి ముఖాలు ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు ?
