ఎం కోటేశ్వరరావు
ఇటీవల కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో అక్కడ అధికారంలో ఉన్న వామపక్ష సంఘటనకు ఎదురుదెబ్బ తగిలిందన్నది వాస్తవం. దాన్ని చావుదెబ్బగా కొందరు వర్ణిస్తున్నారు. అది నిజమా ? ప్రధాని నరేంద్రమోడీ తిరువనంతపురంలో బిజెపి సాధించిన విజయం గురించి గొప్పలు చెప్పుకున్నారు. కేరళ రాజకీయాల్లో ఒక మహత్తర ఘట్టం అన్నారు. మోడీ సేవలో తరిస్తున్న కాంగ్రెస్ తిరువనంతపురం ఎంపీ శశిధరూర్ చారిత్రాత్మక విజయం అన్నారు. ఎందుకటా నాలుగున్నర దశాబ్దాలుగా తిరువనంతపురం మేయర్ పీఠాన్ని నిలుపుకున్న సిపిఎం అక్కడ ఓడిపోయి 101 సీట్లకు బిజెపి 50 తెచ్చుకున్నందుకు. ఓకే, కాసేపు నరేంద్రమోడీని సంతుష్టీకరించేందుకు అంగీకరిద్దాం, నిజమే కదా ! అయోధ్య రామ మందిరం గురించి దశాబ్దాల పాటు బిజెపి ఎంత హడావుడి చేసిందో చూశాము. దానివల్లనే మూడుసార్లు మోడీ ప్రధాని అయ్యారు. అక్కడ మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్య భాగంగా ఉన్న ఫైజాబాద్‌లో పదేండ్ల అధికారం తరువాత బిజెపి ఓడిపోయింది, అంతేనా, వారణాసి నియోజకవర్గం, వరుసగా ప్రధాని నరేంద్రమోడీ మూడుసార్లు ఎన్నికయ్యారు. తొలిసారి 3,71,784 ఓట్ల మెజారిటీ తెచ్చుకుంటే రెండవసారి 4,79,505కు పెంచుకోగా మూడవ సారి 1,52,532కు దిగజారింది. దీని గురించి ఏమని వర్ణిస్తారు ? ఒక వాస్తవం ఏమంటే కేరళలో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఈసారి పెరగకపోగా స్వల్పంగా తగ్గాయి. దీని గురించి మోడీ నుంచి ఎలాంటి స్పందనా ఉండదు ! స్థానిక సంస్థలలో అనేక అంశాలు పని చేస్తాయి. బిజెపి కేరళలో గతంలో తెచ్చుకున్న ఆరువందలకు పైగా పంచాయతీ వార్డులను ఈసారి పోగొట్టుకుంది. కొత్తగా కొన్ని తెచ్చుకొని గతం కంటే స్వల్పంగా మెరుగుపడింది. ఒకసారి అధికారంలో ఉన్నతరువాత అన్ని పార్టీలకూ వాటి పనితీరును బట్టి వ్యతిరేకత ఉంటుంది. అది ఒక్క సిపిఐ(ఎం)కే కాదు, ప్రతి పార్టీకి వర్తిస్తుంది.
కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ(ఎం) నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్ పని అయిపోయిందని తరువాత బిజెపిదే హవా అన్నట్లుగా మీడియాలో కొందరు ఊదరగొట్టారు. కేరళలో కమ్యూనిస్టు వ్యతిరేక మీడియాలో మళయాళ మనోరమ ఒకటి. అది 2025 డిసెంబరు 22న ఒక విశ్లేషణ రాసింది. దానికి పెట్టిన శీర్షిక ” స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ బిజెపి తీరుచూసి అమిత్ షా ఎందుకు ఆశాభంగం పొందుతారంటే ” దాన్లో ఏముందో చూద్దాం. ” స్థానిక సంస్థల ఎన్నికల్లో 25శాతం ఓట్లు తెచ్చుకోవాలని కేంద్ర హౌమ్ మంత్రి అమిత్ షా లక్ష్య నిర్దేశం చేశారు. అమిత్ షాలో ఆశావాద వేడి ఎందుకు పుట్టిందంటే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డిఏ ఒక్కటే ఇక్కడ 19.40 శాతం ఓట్లను తన ఖాతాలో వేసుకుంది. అదిప్పుడేమైందంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (బిజెపి-భారత ధర్మ జనసేన-లోక్ జనశక్తి పార్టీ) కేవలం 14.76శాతం ఓట్లనే తెచ్చుకోగలిగింది.(గత స్థానిక ఎన్నికల కంటే 0.24శాతం తక్కువ-వికీపీడియా) యుడిఎఫ్‌కు 38.81, ఎల్‌డిఎఫ్‌కు 33.45శాతం వచ్చాయి.
పంచాయత్‌లలో(జిల్లా,బ్లాక్,గ్రామపంచాయతీలు అన్నీ కలిపి) ఎన్‌డిఏకు వచ్చిన ఓట్లు 13.92శాతం, 2020లో వచ్చిన 14.34శాతం కంటే స్వల్పంగా తక్కువ. మున్సిపాలిటీలలో 13.1 నుంచి 19.44శాతానికి పెంచుకుంది.కార్పొరేషన్లలో 19.44 నుంచి 23.58శాతానికి పెంచుకుంది. మొత్తం అన్ని స్థానిక సంస్థలలో వచ్చిన సగటు ఓట్లు 14.76శాతం.2020 ఎన్నికల్లో వచ్చిన 12.92శాతం కంటే స్వల్పంగా పెంచుకుంది. కానీ ఇది తప్పుదారి పట్టించేది,ఎందుకంటే 2020 కంటే బిజెపి అదనంగా ఈసారి 40శాతం సీట్లలో పోటీ చేసింది.ఆ ఏడాది బిజెపి 14వేల వార్డుల కంటే తక్కువే పోటీ చేసింది. ఈసారి ఆ పార్టీ, మిత్రపక్షాలతో కలసి ఎన్నికలు జరిగిన మొత్తం 23,576 వార్డులలో 89.35శాతం అంటే 21,065 చోట్ల పోటీ చేసింది. బిజెపి ఒక్కటే 19,262 సీట్లలో పోటీ చేసింది. ఇతర ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ 17,497, సిపిఎం 14,802చోట్ల పోటీ చేశాయి. గత ఎన్నికల కంటే ఏడువేల వార్డులలో అదనంగా పోటీ చేయటంతో పాటు మొత్తం 25శాతం ఓట్లు, రెండు కార్పొరేషన్లు, కనీసం పది మున్సిపాలిటీలు,30 బ్లాక్ పంచాయతీలు, 300కు పైగా గ్రామ పంచాయతీలు సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా దానిలో ఒక చిన్న భాగం మాత్రమే చివరికి దక్కింది. ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు (తిరువనంతపురం 6, కొల్లం 2, పత్తానంతిట్ట 4, అలప్పూజ 5,కొట్టాయం 3, త్రిసూర్ 1, పాలక్కాడ్ 2, కాసరగోడ్ ),రెండు మున్సిపాలిటీలు(పాలక్కాడ్,తిరుప్పునితుర) ఒక కార్పారేషన్(తిరువనంతపురం) దానికి దక్కాయి. అయినప్పటికీ కేవలం ఆరుగ్రామ పంచాయతీల్లోనే దానికి స్పష్టమైన మెజారిటీ ఉంది. ముదక్కల్(తిరువనంతపురం),పండలం-తెక్కెక్కర(పత్తానంతిట్ట) తిరువిలివామల(త్రిసూర్) అకతెత్తెర, పూడూరు(పాలక్కాడ్) మాధూర్(కాసర్‌గోడ్). చివరికి తిరువనంతపురం కార్పారేషన్‌లో కూడా 101 సీట్లకు గాను సాధారణమెజారిటీ 51కి గాను ఒకటి తక్కువగా 50వచ్చాయి. సీట్ల రీత్యా ఎల్‌డిఎఫ్ కంటే మెరుగ్గావచ్చాయి, గతం కంటే నాలుగుశాతం ఓట్లు పెరిగినప్పటికీ ఎన్‌డిఏకు వచ్చిన 34.52శాతం కంటే మెరుగ్గా ఎల్‌డిఎఫ్‌కు 34.56శాతం వచ్చాయి.
2020లో బిజెపికి కాసరగోడ్ జిల్లాలోని మధుర్, బెల్లూర్ గ్రామపంచాయతీలలో, రెండు మున్సిపాలిటీలు పాలక్కాడ్, పండలంలో స్పష్టమైన మెజారిటీ ఉంది. ఈసారి రెండింటిలో దానికి మెజారిటీ రాలేదు, పండలంలో అవమానకరంగా నష్టపోయింది.ఈసారి ఎన్‌డిఏ 421 కార్పొరేషన్ వార్డులకు గాను 22.09శాతం(93), 3,240 మున్సిపల్ వార్డులకు గాను పదిశాతం (324), 346 జిల్లా పంచాయత్ వార్డులకు గాను ఒక్కటి, 2,267 బ్లాక్ పంచాయత్ వార్డులకు 54, గ్రామపంచాయతీలలోని 17,337కు గాను 1,447 వార్డులు 8.35శాతం వచ్చాయి.ఒక్క కార్పొరేషన్లలో తప్ప 2020తో పోల్చితే బిజెపి పరిస్థితి పెద్దగా మెరుగైనట్లు ఇవి ప్రతిబింబించటం లేదు. మున్సిపాలిటీలు, జిల్లా పంచాయత్‌లో గతం కంటే తగ్గింది. బిజెపి 2020లో సాధించినవి, ఇప్పటి పరిస్థితి ఇలా ఉంది.కార్పొరేషన్లు 14.25(ఇప్పుడు 22.09), మున్సిపాలిటీలు 10.4(ఇప్పుడు పదిశాతం) జిల్లాపంచాయత్‌లు 0.60(ఇప్పుడు 0.29), బ్లాక్ పంచాయత్ 1.78(ఇప్పుడు 2.38) గ్రామపంచాయతీలు 7.4 (ఇప్పుడు 8.35).ఈ సారి పండలం మున్సిపాలిటీని బిజెపి కోల్పోయింది. ఇది శబరిమలకు దగ్గరగా ఉంది. అంతర్గత కుమ్ములాటలు, పాలనలో అక్రమాల కారణంగా ఇది జరిగింది.గతంలో బిజెపికి 20 సీట్లు ఉంటే ఇప్పుడు తొమ్మిది స్థానాలతో మూడవ స్థానానికి దిగజారింది. పాలక్కాడ్‌లో బిజెపి 2020లో 28 సీట్లు తెచ్చుకొని సంపూర్ణ మెజారిటీ సాధించింది. ఈసారి పెద్ద పార్టీగా ఎన్నికైనప్పటికీ మెజారిటీకి అవసరమైన 27కు గాను 25 తెచ్చుకుంది. తిపురినిత్తుర మున్సిపాలిటీలో గత ఎన్నికల్లో 15 తెచ్చుకుంది(ఎల్‌డిఎఫ్‌కు 21) ఈసారి 21సీట్లతో బిజెపి పెద్ద పార్టీగా ఎన్నికైంది, మెజారిటీ సంఖ్య 27.గత ఎన్నికల్లో రెండవ పార్టీగా ఉన్నప్పటికీ ఓట్లశాతంలో 27.54తో పెద్దదిగా, యుడిఎఫ్ 24.42, ఎల్‌డిఎఫ్ 23.25శాతం తెచ్చుకున్నాయి.
మున్సిపాలిటీలలో గుర్తించదగినదిగా బిజెపి ఉనికి ఉన్నప్పటికీ కొన్ని జిల్లాల్లో దాని ఓట్ల వాటా పెరిగింది. ఎర్నాకుళంలో 9.08 నుంచి 12.65, పత్తానంతిట్టలో 16.18 నుంచి 18.02, త్రిసూర్‌లో 19.14 నుంచి 21.86, పాలక్కాడ్‌లో 18.28 నుంచి 23.96కు పెరిగాయి. కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో క్రైస్తవ అభ్యర్ధులతో అది ప్రయోగం చేసింది. మున్సిపాలిటీలలో దాని ఓట్ల వాటా పెరిగింది.కొట్టాయంలో 11.5 నుంచి 15.1, ఇడుక్కిలో 12.53 నుంచి 14.88శాతానికి పెరిగింది. ఎల్‌డిఎఫ్ వాటా 21.63శాతానికి దగ్గరగా వచ్చింది.అయితే కొన్ని జిల్లాలోని మున్సిపాలిటీలలో దాని ఓట్ల వాటా తగ్గింది. తిరువనంతపురంలో 24.49 నుంచి 23.48కి, అలప్పూజలో 19.08 నుంచి 18.19, కాసరగోడ్‌లో 15.36 నుంచి 14.52కు తగ్గాయి. కొల్లం కార్పొరేషన్‌లో ఆరు నుంచి పన్నెండు సీట్లకు పెరిగాయి. ఆ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో ఓట్ల శాతం స్థిరంగా ఉంది, ఇప్పుడు 15.92 రాగా 2020లో 15.9శాతం వచ్చాయి. కొల్లం కార్పొరేషన్‌లో కూడా ఓట్లశాతం స్థిరంగానే ఉంది. తిరువనంతపురంలో 30.92 నుంచి 34.52,కొచ్చిలో 10.95 నుంచి 14.41కి, కన్నూరులో 11.61 నుంచి 14.06కు పెరిగాయి. మిగిలిన మూడు కార్పొరేషన్లలో 2020లో వచ్చిన మేరకే తిరిగి వచ్చాయి. కొల్లంలో 22.02 నుంచి 22.61కి,త్రిసూర్‌లో 18.86 నుంచి 18.54, కోజికోడ్‌లో 22.29 నుంచి 22.43శాతంగా ఉంది.
పైన పేర్కొన్నదంతా మళయాళ మనోరమ విశ్లేషణలోని అంశాలే. తిరువనంతపురంలో బిజెపి గెలుపు గురించి మీడియాలో వచ్చిందేమిటో చూశాము. శబరిమల అయ్యప్ప ఆలయం సమీపంలో ఉన్న పండలం మున్సిపాలిటీలో 34వార్డులు ఉండగా గత ఎన్నికల్లో బిజెపి పద్దెనిమిది తెచ్చుకుంది. ఈ సారి తొమ్మిది వార్డులతో మూడ స్థానానికి పడిపోయింది. అనేక మంది రాష్ట్ర నేతలు ఇక్కడ తిష్టవేసి ఎలాగైనా నిలబెట్టుకోవాలని చూశారు. ఎల్‌డిఎఫ్ 14, యుడిఎఫ్ 11 తెచ్చుకున్నాయి. అయ్యప్పస్వామి ఆలయ ప్రవేశ వివాదంతో గతంలో బిజెపి పొందిన లబ్ది ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయింది. ఇటీవల అయ్యప్ప ఆలయంలో జరిగిన బంగారు తాపడాల అక్రమాన్ని ప్రచారం చేసి మరింతగా లబ్దిపొందాలని చూసి భంగపడింది. ఈ మున్సిపాలిటీ మాత్రమే కాదు, దాని పక్కనే ఉన్న కులంద గ్రామ పంచాయతీ 15 సంవత్సరాలుగా బిజెపి ఆధీనంలో ఉంది. ఈ సారి అక్కడ ఎల్‌డిఎఫ్ 8,బిజెపి, ఇతరులు నాలుగు చొప్పున, యుడిఎఫ్‌కు ఒక స్థానం వచ్చింది. శబరిమల ఆలయం ఉన్న రన్నీ-పెరునాడ్ పంచాయతీ శబరిమల వార్డులో బిజెపి మూడవ స్థానంలో ఉంది. యుడిఎఫ్, ఎల్‌డిఎఫ్‌కు సమంగా ఓట్లు రావటంతో లాటరీలో ఎల్‌డిఎఫ్‌కు వచ్చింది. ఈ పంచాయతీని పదివార్డులతో ఎల్‌డిఎఫ్ గెలుచుకుంది. తిరువనంతపురం కార్పొరేషన్‌లో బిజెపి 101కిగాను 50వార్డులతో అధికారానికి వచ్చింది. సిపిఐ(ఎం) రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ వెల్లడించిన వివరాల ప్రకారం ఓట్ల రీత్యా అక్కడ సిపిఐ(ఎం) ప్రధమ స్థానంలో ఉంది. మీడియాకు ఈ వివరాలు తెలిసినప్పటికీ అది పెద్ద ప్రాధాన్యత కలిగిన అంశం కాదన్నట్లుగా మౌనంగా ఉంది.లోక్‌సభ ఎన్నికలు 2024లో బిజెపికి తిరువనంతపురంలో 2,13,214 ఓట్లు వస్తే కార్పొరేషన్ ఎన్నికల్లో అవి 1,65,891కి తగ్గాయి. యుడిఎఫ్ ఓట్లు 1,84,727 నుంచి 1,25,984కు పడిపోగా ఎల్‌డిఎఫ్ ఓట్లు 1,29,048 నుంచి 1,67,522కు పెరిగాయి, అంటే బిజెపి కంటే స్వల్పంగా ఎక్కువ తెచ్చుకుంది. బిజెపి గెలిచిన 50 వార్డులలో 40 చోట్ల యుడిఎఫ్ మూడవ స్థానంలో ఉంది. ఇరవై అయిదు వార్డులలో కాంగ్రెస్‌కు కనీసం వెయ్యి ఓట్లు కూడా రాలేదు. కొన్నింటిలో ఐదువందలకు లోపే వచ్చాయి. ? కొన్ని చోట్ల బిజెపి వంద ఓట్లకంటే తక్కువ మెజారిటీతో గెలిచింది. దీని అర్ధం ఏమిటి ? పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికలో ఓటర్ల తీరులో తేడా ఉంటుందన్నది వాస్తవం. అక్కడ గెలిచిన కాంగ్రెస్ నేత శశిధరూర్ ఆ పార్టీలో ఉంటూనే బిజెపితో చెలిమిచేస్తున్న సంగతి బహిరంగ రహస్యం. తన పార్టీ తీరుతెన్నులను మరిచి పోయి బిజెపి చారిత్రాత్మక విజయం సాధించిందని పొగిడారంటే ఏం జరిగిందో చెప్పనవసరం లేదు. అనేక చోట్ల రెండు పార్టీలు సిపిఎంకు వ్యతిరేకంగా కుమ్మక్కు కావటం గతంలో జరిగింది, ఇప్పుడు కూడా పునరావృతం అయినట్లు కనిపిస్తోంది !
