ఎం కోటేశ్వరరావు
అమెరికా వ్యవసాయాన్ని దెబ్బతీసేందుకు ఫుసారియమ్ గ్రామినియారమ్ అనే ఫంగన్‌ను చైనా పంపిందని, దాన్ని తీసుకువచ్చిన ఇద్దరు చైనా జాతీయులను అమెరికా ఎఫ్‌బిఐ అరెస్టు చేసినట్లు అంతర్జాతీయంగా వార్తలు వచ్చాయి. దీన్ని ఆగ్రో టెర్రరిజం(వ్యవసాయ ఉగ్రవాదం లేదా దాడి ) అని పిలుస్తున్నారు. ఆ ఫంగస్‌ను పరిశోధనలకోసం తెచ్చారన్నది ఒక కథనమైతే అమెరికా వ్యవసాయాన్ని దెబ్బతీసేందుకు తీసుకువచ్చారనేది మరొక ఆరోపణ. ఎవరినైనా కేసుల్లో ఇరికించదలిస్తే పోలీసులు లేదా క్రిమినల్ గాంగ్స్ మాదక ద్రవ్యాలను ప్రత్యర్థుల నివాసాలు లేదా కార్యాలయాల్లో పెట్టి కేసుల్లో ఇరికించటం తెలిసిందే. రెండు దేశాల మధ్య వైరుధ్యాలు ముదిరితే ఆయా దేశాల్లో ఉన్న రాయబార కార్యాలయాల సిబ్బంది గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు ఆరోపించి వెళ్లగొట్టటం సాధారణమే. అమెరికా, చైనా మధ్య నడుస్తున్న వైరం పూర్వరంగంలో ఫుసారియమ్ ఫంగస్‌ను అమెరికా ఏజంట్లే చైనీయుల చేతిలో పెట్టి అరెస్టు చేసి ఉండవచ్చు. ఎందుకంటే అది అమెరికాలో కూడా దొరుకుతుంది. అరెస్టు చేసిన ఎఫ్‌బిఐ కథనం ప్రకారం జున్‌యోంగ్ లియు అనే 34 ఏండ్ల పరిశోధకుడు చైనాలో పని చేస్తున్నాడు.తన స్నేహితురాలు యంగింగ్ జియాన్ (33) అమెరికాలోని మిచిగాన్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నది. ఆమెను కలిసేందుకు 2024జూలైలో అమెరికా వచ్చాడు, తనతో పాటు ఫంగస్‌ను తెచ్చాడు. జియాన్ పని చేస్తున్న ప్రయోగశాలలో పరిశోధన కోసం పంగస్‌ను తెచ్చినట్లు ఆరోపణ. వారి చర్యలు అమెరికా పౌరుల భద్రతకు పెను ముప్పు అంటూ కేసు నమోదు చేశారు. వారు కమ్యూనిస్టు పార్టీకి విధేయులు కావటం మరింత ముప్పని అమెరికా అటార్నీ చెప్పాడు. మన దేశంలో నక్సలైట్లను బూటకపు ఎన్‌కౌంటర్లు చేసినపుడు వారి వద్ద ఎర్ర అట్టలున్న విప్లవ సాహిత్యం దొరికినట్లు పోలీసులు చెప్పే పిట్టకతలు తెలిసినవే. అలాగే వారు చైనా కమ్యూనిస్టు పార్టీలో సభ్యులని కూడా అమెరికా పోలీసులు తెలుసుకున్నారట. తప్పుడు సమాచారం, తప్పుడు వీసాల ఆరోపణల గురించి చెప్పనవసరం లేదు. చైనా తన ఏజంట్లు, పరిశోధకులను అమెరికా సంస్థలలోకి చొప్పించి విద్రోహ చర్యలతో అమెరికా ఆహార సరఫరా వ్యవస్థను దెబ్బతీసేందుకు చైనా కమ్యూనిస్టు పార్టీ పని చేస్తోందని భారతీయ సంతతికి చెందిన ఎఫ్‌బిఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఆరోపించాడు. ఆ కేసు ఏమౌతుంది ఏమిటి అన్నది ముందు ముందు చూద్దాం.
అసలు ఆగ్రో టెర్రరిజం గురించి అమెరికా గుండెలు బాదుకోవటాన్ని చూస్తే దొంగే దొంగని అరవటం గుర్తుకు వస్తోంది. మన దేశం గడచిన ఏడున్నర దశాబ్దాలుగా అమెరికా ఆగ్రో టెర్రరిజానికి బలి అవుతున్నది. ఇది నమ్మలేని నిజం, మన మీడియాకు కనిపించని వాస్తవం. మీరు ఎప్పుడైనా వయ్యారి భామ, కాంగ్రెస్ గడ్డి, పార్ధీనియమ్ అనే మాటలను విన్నారా ? మూడూ ఒకటే, మన రైతాంగాన్ని, మనకు తెలియకుండానే ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న అమెరికా కలుపు మొక్క. దీని శాస్త్రీయ నామం పార్థీనియం హిస్టరోఫోరస్. ఇది చూడటానికి అందంగా ఉంటుంది గనుక వయ్యారి భామ అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చింది కాబట్టి కాంగ్రెస్ గడ్డి అని పిలిచారు. అమెరికా అమ్మాయి కూడా అంటారు. ఒక మొక్క ఎంతో ఏపుగా పెరిగి చాలా త్వరగా పుష్పించి వేలాది విత్తనాలను విడుదల చేస్తుంది.చాలా చిన్నవిగా ఉండటంతో గాలిలో మూడు కిలోమీటర్ల వరకు వ్యాపించి మొలకలెత్తుతాయి. ఒక్కో మొక్క 60 కోట్ల పుప్పొడి రేణువులను వదులుతుందట. ఇవి మొలిస్తే పంటల దిగుబడి 40శాతం తగ్గుతుంది, వాటిని తాకితే, తింటే పశువులు, మనుషులకూ వ్యాధికారకాలవుతాయి.దేశంలో 35 మిలియన్ల హెక్టార్లలో ఇది వ్యాపించి ఉన్నట్లు అంచనా. ఇంకా ఎక్కువే అన్నది మరొక అభిప్రాయం. మొక్కగా ఉన్నపుడు దాన్ని నాశనం చేయకపోతే పుష్పించినపుడు రెచ్చిపోతుంది.
మనదేశం స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొన్నది. ఆసమయంలో అమెరికాతో ఉన్న సంబంధాలతో ప్రధాని నెహ్రూ అక్కడి నుంచి గోధుమలను దిగుమతి చేసుకుంటే వాటితో అమెరికా ఈ కలుపు మొక్కనూ కావాలనే మనకు బహుమతిగా పంపింది. అంతకు ముందు అసలు మన రైతాంగానికి దీని గురించి తెలియదు. ఇది పంటలను దెబ్బతీస్తుందని అమెరికన్లకు పూర్తిగా తెలుసు. గోధుమలతో పాటు పంపింది అంటే మన పొలాల్లో వ్యాపించి పంటలను దెబ్బతీయాలని, తద్వారా శాశ్వతంగా తమ మీద ఆహార ధాన్యాలకు ఆధారపడేట్లు చేసుకోవాలన్నది అమెరికా ఎత్తుగడ. నాడు పిఎల్ (పబ్లిక్ లా)480 పధకం కింద 1950దశకంలో కేవలం రెండు మిలియన్ టన్నుల గోధుమలను సాయంగా తెచ్చుకున్నందుకు ఇప్పటికీ మనం మూల్యం చెల్లిస్తూనే ఉన్నాం. అనేక మంది ఊపిరితిత్తులు, చర్మ వ్యాధుల బారిన పడుతూనే ఉన్నారు, నోరులేని పశువుల సంగతి సరేసరి. వ్యాధులతో పాటు పాలదిగుబడీ తగ్గిపోతుంది.దీన్ని అమెరికా మన ఒక్క దేశానికే కాదు 46దేశాలకు వ్యాపింప చేసిందంటే దాని కుట్ర ఎంత పెద్దదో అర్ధం చేసుకోవచ్చు, ఇది అతి పెద్ద ఆగ్రో టెర్రరిజం కాదా ! నాడు మనదేశం అలీన విధానాన్ని అనుసరిస్తున్నది, ఆహార ధాన్యాలు కావాలని కోరినపుడు తమతో కలిస్తే వెంటనే ఇస్తామని 1949లో నాటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ ఒక బిస్కెట్ వేశాడు. నెహ్రూ అంగీకరించలేదు, ఉచితంగా వద్దు డబ్బుతీసుకోవాలని ప్రతిపాదించాడు.1955వరకు ఎటూ తేల్చలేదు, మరోవైపు దేశంలో ఆహార కొరత పెరుగుతుండటంతో అమెరికా సాయంగానే ఇస్తూ ప్రపంచంలో పది ప్రమాదకర మొక్కల్లో ఒకటైన వయ్యారి భామను మన మీదకు వదిలింది. కావాలనే వదలినట్లు ఇంత వరకు అంగీకరించకపోగా తామే పంపినట్లు ఆధారాలేమిటో చూపాలని మనలను దబాయిస్తోంది.
ప్రమాదకరమైన కలుపు మొక్కలు, విత్తనాలు ఇతర దేశాల నుంచి రాకుండా అరికట్టేందుకు అవసరమైన గట్టి చట్టాలు, నిబంధనల మనదేశంలో లేని కారణంగా అనేకం మన దేశంలో ప్రవేశించాయి. మెక్సికో, అమెరికా, లాటిన్ అమెరికా నుంచి వయ్యారి భామ ఇతర దేశాలకు వ్యాపించింది. మన దేశంలో దీన్ని పూర్తిగా తొలగించాలంటే పదేండ్ల పాటు ఏడాదికి 18,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని 2010లో శాస్త్రవేత్తలు చెప్పారు, 1955 నుంచి మనకు జరిగిన నష్టం రు. 2,06,716 కోట్లు అని ఒక అంచనా. ఇది గాక మనుషుల, పశువుల అనారోగ్య ఖర్చు అదనం. జీవ వైవిధ్యానికి జరిగిన నష్టం, పునరుద్దరణలను పరిగణనలోకి తీసుకుంటే ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువ నష్టం అంటున్నారు. జమ్మూ`కాశ్మీరులో పాకిస్తాన్ ఉగ్రవాద సమస్య గురించి మాత్రమే మనకు తెలుసు, కార్గిల్ వంటి ప్రాంతాలలో వయ్యారి భామ తిష్టవేసింది, ప్రధాన భూభాగానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న అండమాన్‌కు సైతం ఇది విస్తరించిందంటే దాని వేగం, ప్రమాదం ఏమిటో అర్దం చేసుకోవచ్చు. మన కళ్ల ముందు వయ్యారాలు పోతూ సవాలు చేస్తున్న ఈ ఆగ్రో ఉగ్రవాదిని అరికట్టేందుకు దేశమంతటా ఒకేసారి చర్యలు తీసుకొని ఉంటే నిరోధించి ఉండేవారు. కానీ జరగలేదు. దీని విస్తరణ ఎంత ప్రాంతంలో జరిగిందన్నది కూడా సమగ్ర అధ్యయనం లేదు. ఒక అంచనా ప్రకారం ఎక్కువగా పెరిగిన ప్రాంతం నుంచి దీన్ని తొలగించాలంటే హెక్టారుకు నలభై పనిదినాలు అవసరమని తేల్చారు. ఆయా సమయాలను బట్టి అందుకయ్యే ఖర్చును లెక్కకట్టాలి.
ఆగ్రో ఉగ్రవాది వయ్యార భామ గురించి క్లుప్తంగా చెప్పుకున్నాం, వ్యవసాయంతో అనుబంధంగా ఉండే వాటిపై మరికొన్ని దాడుల గురించి చూద్దాం. వీర, రౌద్ర,శోక,హాస్య,శృంగార తదితర రసాలతో పాటు భీభత్స రసం అంటే ఉగ్రవాదమే. ఇతిహాసాలు, పురాణాల్లో వీరులు శత్రువులకు ఈరసాన్ని చవి చూపించినట్లు చదువుకున్నాం. కానీ ఆధునిక మిలిటరీ దుర్మార్గాల్లో బయో ఉగ్రవాదం కూడా ఒక ఆయుధం.అనేక ప్రమాదకర వైరస్‌లను ప్రత్యేకంగా ఎవరో పనిగట్టుకొని వ్యాపింప చేయనవసరం లేదు. అయితే సహజంగా తలెత్తినవి ఏవో ఇతరులు ప్రయోగించినవి ఏవో తెలుసుకోవటం అవసరం, అదేమీ కష్టం కూడా కాదు. ఆఫ్రికన్ హార్స్ సిక్‌నెస్(ఎహెచ్‌ఎస్) వైరస్‌ను తొలిసారిగా 1600 సంవత్సరాల్లో ఆఫ్రికాలోని సహారా ఎడారి కనుగొన్నారు. అది క్రమంగా మనదేశానికి వ్యాపించి మిలిటరీలో ఉన్నవాటితో సహా 20లక్షల గుర్రాల మరణానికి కారణమైంది. రిఫ్ట్‌వాలీ వైరస్ అనేది ఒంటెల ద్వారా వ్యాపిస్తుంది, అనేక దేశాలను అది చుట్టుముట్టింది,మన దేశం సంగతి తెలియదు, ఎప్పుడైనా రావచ్చు. మన వ్యవసాయానికి అనుబంధంగా ఉండేది పశుపాలన, చేపలు, రొయ్యలు, కోళ్ల పెంపకం వంటివి. వాటికి అనేక వైరస్‌లు వ్యాపిస్తున్నాయి. సంతలు, మార్కెట్‌లు పెద్ద వ్యాపక కేంద్రాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఆరేండ్ల నాటి అంచనా ప్రకారం దేశంలో ఎలుకలు, పందికొక్కుల సంఖ్య 240 కోట్లు, అవి ఇప్పుడిరకా పెరిగి ఉంటాయి. ప్రతి ఆరు ఒక మనిషి ఆహారాన్ని తింటున్నాయి. ఏటా 24లక్షల నుంచి 2.6కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు వృధా అవుతున్నాయి. వాటితో వచ్చే వ్యాధులు, వాటి నివారణ ఖర్చులపై అంచనాల్లేవు. వీటన్నింటినీ ఎవరు ప్రవేశపెట్టినట్లు ? ఇప్పుడైతే కుట్ర సిద్దాంతవేత్తలు, వారిని అనుసరించే మీడియా పండితులు వెంటనే చైనా అనేస్తారు. గతంలో ప్రపంచలో కోట్లాది మంది ప్రాణాలు తీసిన ప్లేగు, స్పానిష్ ఫ్లూ వంటి వాటికి కూడా అదే అని చెప్పినా ఆశ్చర్యం లేదు.బ్రిటీష్ పాలనా కాలంలో 1943లో వచ్చిన బెంగాల్ కరువుకు 30లక్షల మంది మరణించారు.వారి ఆకలి బాధ తీర్చటానికి ఆ రోజు ప్రపంచంలో ఆహారం లేదా అంటే ఉంది,బ్రిటీష్ వారికి పట్టలేదంతే ! ఇటీవలి సంవత్సరాల్లో తెల్లదోమ ఎంతటి వినాశనాన్ని కలిగించిందో చూశాము. తెగుళ్ల నివారణకు తయారు చేసిన సింథటిక్ పైరిత్రాయిడ్స్ వినియోగంతో పర్యావరణ సమతుల్యం దెబ్బతిని కొత్త సమస్యలు తలెత్తాయి. అనేక పశ్చిమ దేశాలలో వాటిని నిషేధించినప్పటికీ మనదేశంలో వాటిని విక్రయించేందుకు ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి. బహుళజాతి గుత్త సంస్థలు చేస్తున్న ఆగ్రో ఉగ్రదాడి తప్ప మరొకటి కాదు. అసలు అమెరికా గతంలో చేసిన ఆగ్రో ఉగ్రదాడులకు బలైన దేశాలు, ఉదంతాలు గురించి మరో విశ్లేషణలో చూద్దాం !
