ఎం కోటేశ్వరరావు
గడిచిన పది సంవత్సరాల్లో మీరు చూసింది కేవలం ట్రైలరే మరోసారి ఎన్నుకుంటే అసలు సినిమా ముందు చూపిస్తా అని ప్రధాని నరేంద్రమోడీ రాజస్థాన్‌లోని చురు పట్టణంలో జరిగిన ఎన్నికల సభలో చెప్పారు. అంతకు ముందు ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పార్లమెంటులో మాట్లాడుతూ దేశ జిడిపి 11వ స్థానంలో ఉన్నందుకు కాంగ్రెస్ ఉత్సవాలు చేసుకుంది. కానీ ఈ రోజు ఐదవ స్థానానికి చేరుకుంది. కాంగ్రెస్ దిగ్భ్రాంతిలో ఉంది. ఈ విజయం సాధించాలంటే కాంగ్రెస్‌కు వంద ఏండ్లు పడుతుంది అని ఎద్దేవా చేశారు. నరేంద్రమోడీ సర్కార్ జిడిపిని ఒక విజయంగా గొప్పలు చెప్పుకుంటోంది. అయితే దాన్ని చూసి జనం ఎక్కడా సంబరాలు చేసుకోవటం లేదు. కొన్ని ట్రైలర్లను చూసి సినిమాకు వెళ్లినా, శీర్షికలను చూసి యూ ట్యూబ్ చూసినా ఆశాభంగం తప్ప మరొకటి మిగలదు.
నరేంద్రమోడీ ట్రైలర్లలో ఒకటైన జిడిపి సంగతి చూద్దాం. వివిధ సంస్థలు ప్రకటించే గణాంకాల్లో తేడాలు ఉండే అంశాన్ని గమనంలో ఉంచుకోవాలి. అయితే స్వల్పతేడాలున్నా ధోరణుల్లో పెద్ద తేడా లేదు. 2004లో ప్రపంచ జిడిపిలో భారత్ 12వ స్థానంలో ఉంది, 2014లో ఐఎంఎఫ్, ప్రపంచ బాంకు విశ్లేషణల ప్రకారం తొమ్మిది, 2015,16లో ఏడు,2017లో ఆరు, 2018లో ఏడవదిగా ఉంది. తరువాత ఐదవ స్థానానికి చేరింది. యుపిఏ లేదా కాంగ్రెస్ జిడిపిని ఒక విజయంగా చెప్పలేదు. 2004లో మన తలసరి జిడిపి మాక్రోట్రెండ్స్ విశ్లేషణ ప్రకారం 624 డాలర్లు, 2013లో 1,438 డాలర్లు, అంటే రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. అది నరేంద్రమోడీ ఏలుబడిలో 2022నాటికి 2,389కి పెరిగింది.రెట్టింపు కంటే చాలా తక్కువ అని ఎవరైనా చెబుతారు. మన కంటే దిగజారిన వారితో పోల్చుకొని మన స్థానం పెరిగిందని సంబరపడుతున్నారు. ప్రతిదానికీ చైనాతో పోల్చుకుంటున్నపుడు దీన్ని కూడా దానితోనే చూపాలి కదా.ప్రపంచ బ్యాంకు విశ్లేషణ ప్రకారం 2014లో చైనాలో 7,636 డాలర్లున్న తలసరి జిడిపి 2022 నాటికి 12,720కి పెరిగితే అదే కాలంలో మన దగ్గర 1,560 నుంచి 2,380కు మాత్రమే పెరిగింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) సమాచారం ప్రకారం 2023లో ప్రపంచ తలసరి జిడిపి 13,330 డాలర్లు. అంతకంటే ఎక్కువగా 65దేశాల్లో ఉంది. ప్రపంచ జిడిపిలో మనం ఐదవ స్థానంలో ఉంటే తలసరి జిడిపిలో 138లో ఉంది. దీని గురించి ఎప్పుడూ ఎందుకు ప్రస్తావించరు ? ప్రపంచ జిడిపిలో 32వదిగా ఉన్న బంగ్లాదేశ్ తలసరిలో మనకంటే ఎగువన 137వదిగా ఉంది. చైనా రెండు, 71వ స్థానాల్లో ఉన్నాయి. కనుక జిడిపి గురించి నరేంద్రమోడీ గొప్పలు చెప్పుకోవాల్సింది ఏముంది ?
ప్రపంచ జిడిపిలో చైనా వాటా 2014లో 13.1శాతం ఉండగా 2023లో 17.86కు పెరిగింది. త్వరలో చైనాను అధిగమిస్తామని చెబుతున్న నరేంద్రమోడీ ఏలుబడిలో ముక్కుతూ మూలుగుతూ 2.6 నుంచి 3.37శాతానికి మాత్రమే అంటే ఒకశాతం కూడా పెరగలేదు. ఈ మాత్రానికే ఇది ట్రైలర్ అంటున్నారు.అసలు సినిమా ప్రారంభమే కాలేదని, జనం చూసేదేమీ ఉండదని ఈ తీరు వెల్లడించటం లేదా ! ఈ మధ్య కాలంలో కొందరు పడకకుర్చీ మేథావులు చైనా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంటున్నది గనుక మనదేశం దాని స్థానాన్ని ఆక్రమించనుందనే కబుర్లు చెబుతున్నారు. మనదేశం అందరితో పోటీపడాలని, ఆరోగ్యకరమైన పోటీతో అధిగమించాలని కోరుకోవటం వేరు, మనం ఎగువన ఉండాలంటే మిగతావారు దిగువకు తగ్గాలని కోరుకోవటం విడ్డూరం, మన పూర్వీకులు మనకు చెప్పిన సుగుణమిదా ! గత పాతిక సంవత్సరాలలో దేశంలో రోడ్లు, రేవుల వంటి మౌలిక సదుపాయాలను వృద్ధి చేశారు. ఏ బిజెపి నేతను కదిలించినా పాడిందే పాడరా అన్నట్లు మనకు చెప్పేది ఇదే. సంస్కరణలు, వాటిలో భాగంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు చైనాలో కూడా ఇదే మాదిరి చేశారు. అనేక మంది అక్కడి మాదిరే ఇక్కడ కూడా అభివృద్ధి జరుగుతుందని, మరో పారిశ్రామిక కేంద్రంగా మారుతుందని ఆశించారు, ఆహ్వానించారు. కానీ అదేమీ జరగలేదు. చైనాలో ఉత్పత్తులతో పాటే వాటి రవాణా వేగంగా జరగటానికి మౌలిక సదుపాయాలను కల్పించారు. మన దేశంలో చూడండి మేము వేసిన రోడ్లు, రేవులు అని బిజెపి నేతలు చెప్పుకొనేందుకు తప్ప జనానికి ఉపాధిని పెంచే పారిశ్రామిక ఉత్పత్తి పెరగకపోగా గత పదేండ్లలో జిడిపిలో దాని వాటా తగ్గిపోయింది. గత పాలకుల ఏలుబడిలో ప్రారంభమైన ఉపాధి రహిత పరిశ్రమలు, సేవారంగాలు మరింతగా విస్తరించాయి. రవాణా చేసేందుకు రోడ్లు, రేవులు ఉన్నా సరకులు లేవు.డిజిటల్ చెల్లింపుల రంగంలో గణనీయ పురోగతి ఉంది తప్ప రాబడులు పెరగటం లేదు.
సేవారంగంలో పని చేసేందుకు అవసరమైన ఐటి నిపుణులు గణణీయంగా పెరిగారు.దీనికిగాను ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వటం తప్ప పెట్టుబడులేమీ పెట్టలేదు. ప్రభుత్వరంగంలో సంస్థలేవీ రాలేదు.ఈ రంగంలో ఎగుమతుల వల్లనే మన పరిస్థితి మెరుగుపడింది తప్ప పారిశ్రామిక రంగ వృద్ది వలన కాదు. పారిశ్రామిక రంగంలో మాదిరి సేవారంగంలో కూడా మనవారిని చౌకగా వినియోగించుకొనేందుకు అనేక విదేశీ కంపెనీలు ఇక్కడకు వాలిపోయాయి. జెపి మోర్గాన్, గోల్డ్‌మాన్ శాచస్, అమెజాన్, తదితర విదేశీ కంపెనీలు వేలాది మందిని నియమించుకుంటున్నాయి.చైనా నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నట్లు సంవత్సరాల నుంచి చెబుతున్నారు. కొన్ని వస్తున్నమాట నిజం. అవి మనదేశంలో ఉత్పత్తిని పెంచుతున్నాయా ? ఉపాధి కల్పిస్తున్నాయా ? రెండూ లేవు. స్టాక్ మార్కెట్, రుణ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. జనవరి చివరి నాటికి అలాంటి పెట్టుబడులు రు.1.43 లక్షల కోట్లు వచ్చినట్లు, అంతకు ముందు ఏడాది అదే కాలంలో రు.91,460 కోట్లు వచ్చినట్లు వివరాలు వెల్లడించాయి. ఇలాంటి వాటికోసం మన పాలకులు చూస్తున్నారు తప్ప ఉత్పత్తికి, తద్వారా ఉపాధి పెరుగుదలకు అవసరమైన పెట్టుబడుల గురించి శ్రద్దలేదు. స్టాక్ మార్కెట్లు, రుణాలలో విదేశీ పెట్టుబడులు ఎంత పెరిగితే అంతగా అది చైనా, మనదేశం మరొకటైనా లాభాలను తరలించుకుపోతే నష్టం తప్ప లాభం ఉండదు. నైపుణ్యాలతో పెద్దగా పనిలేని వస్తువులను ఉత్పత్తి చేసి ఎగుమతులు చేయటంలో ప్రస్తుతం చైనా వాటా ప్రపంచంలో 40శాతం ఉండగా మనవాటా మూడు శాతానికి అటూ ఇటూగా ఉంది. రానున్న దశాబ్దంలో ఇది 5 నుంచి పదిశాతం వరకు పెరగవచ్చని కొందరి అంచనా. ఇదే సమయంలో చైనా అలాంటి ఎగుమతులను తగ్గించి అధిక నైపుణ్యం గల వస్తువులవైపు కేంద్రీకరిస్తున్నది. అక్కడ వేతనాల పెరుగుదల వంటి కారణంగా కొందరు మనవైపు చూస్తున్న మాట నిజం.దీన్నే బూతద్దంలో చూపి చైనా స్థానంలో మనదేశం ఉంటుందని చెబుతున్నారు. కానీ ప్రచారం చేస్తున్నదానికి అనుగుణంగా మనదేశంలో అలాంటి మార్పులు కనిపించటం లేదని, దానికి విధానపరమైన లోపాలే కారణమని అనేక మంది చెబుతున్నారు.మేకిన్ ఇండియా పిలుపు ఇచ్చినప్పటికీ ఎన్ని విదేశీ సంస్థలు తమ కార్యకలాపాలను మనదేశంలో విస్తరించాయన్నది సమస్య. 2023లో వెల్లడైన లెక్కల ప్రకారం ప్రపంచ వస్తూత్పత్తిలో చైనా 28.4, అమెరికా 16.6, జపాన్ 7.5, జర్మనీ 5.8 శాతాల చొప్పున మొత్తం 58.3శాతం నాలుగుదేశాలే చేస్తున్నాయి. మనం 3.3శాతంతో ఉన్నాం. 2010లో మొదటి స్థానంలో ఉన్న అమెరికాను వెనక్కు నెట్టి చైనా ముందుకు వచ్చింది. అదే ఏడాది తొమ్మిదవ స్థానంలో ఉన్న మనదేశం 2014లో ఆరవ స్థానానికి వచ్చింది. గుజరాత్ నమూనా అని మేకిన్, మేడిన్ ఇండియా, ఆత్మనిర్భర్ వంటి ఎన్ని కబుర్లు చెప్పినా మోడీ ఏలుబడిలో పదేండ్లు గడచినా ఐదవ స్థానంలో మాత్రమే ఉంది.
విదేశాల్లో దేశ ప్రతిష్టను పెంచానని, పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నించానని మోడీ చెప్పుకుంటారు.2004లో మనదేశానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 4.3బిలియన్ డాలర్ల నుంచి 2014 నాటికి 36బిలియన్లకు పెరిగాయి. మోడీ ఏలుబడిలో గరిష్టంగా 84.8బి.డాలర్లకు పెరిగి 2023లో 70.9బి.డాలర్లకు తగ్గాయి. గత పదేండ్లు, అంతకు ముందు పెరుగుదల రేటు ఎంత ? ఈ కాలంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే వస్త్ర రంగంలో ఎగుమతులు తగ్గాయి. కొత్త ప్రాజెక్టులు పెట్టి ముప్పు ఎదుర్కోవటం కంటే ఉన్న కంపెనీల వాటాల మీద పెట్టుబడి పెట్టటం లాభసాటిగా ఉంది కనుక విదేశీ పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ వైపు చూస్తున్నారు. స్థానిక పరిశ్రమలకు రక్షణ కల్పిస్తున్న కారణంగా విదేశీ కంపెనీలు పెద్దగా ఉత్పత్తి రంగంలో ఆసక్తి చూపటం లేదు. సెల్‌ఫోన్ల వంటి రాయితీలు ఉన్న వాటికే వస్తున్నారు. లాప్‌టాప్‌ల దిగుమతులపై పరిమితులు విధించి తరువాత నిబంధనలను నీరుగార్చారు. దాని వలన జరిగిందేమిటి ? ప్రభుత్వం ఎప్పుడు ఏం చేస్తుందో తెలియని స్థితిలో స్థానిక పెట్టుబడిదారులు, విదేశీయులూ ముందుకు రావటం లేదు.చైనాలో ఇలాంటి అనిశ్చితికు తావులేదు గనుకనే విదేశీ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. ఒక నిర్దిష్ట వ్యవధి వరకు విధానాల్లో మార్పులు ఉండవని చెబుతున్నారు. ఉదాహరణకు బ్రిటీష్, పోర్చుగీసు వారి కౌలు గడువు తీరిన తరువాత హాంకాంగ్, మకావో దీవులను నేరుగా ప్రధాన భూభాగం చైనాలో విలీనం చేసుకోవచ్చు.కాని దాని వలన కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువ గనుక ఆ ప్రాంతాల్లో ఉన్న పెట్టుబడులు, సేవారంగం బయటకు వెళ్లకుండా ఉండేందుకు ఒకే దేశం – రెండు వ్యవస్థలనే విధానాన్ని ప్రకటించింది. దాని ప్రకారం 50 ఏండ్లు అంటే 2049వరకు ఆ రెండు దీవుల్లో ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థను కొనసాగిస్తామనే నిర్దిష్ట హామీ ఇచ్చింది.
