Tags
a storm in a tea cup, BJP, CPI()M, Narendra Modi, Pinarayi Vijayan, Saji Cherian, wine and cake christmas politics
ఎం కోటేశ్వరరావు
క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ పూజార్లకు ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలో విందు ఇచ్చారు. దానిలో పాల్గొన్న బిషప్పులు మణిపూర్‌లో తమ సామాజిక తరగతికి చెందిన వారి మీద జరుగుతున్నదాడుల గురించి ప్రధానితో ప్రస్తావించలేదని కేరళ మంత్రి సాజి చెరియన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది.జనవరి మూడున కేరళ సిఎం పినరయి విజయన్ ఇచ్చిన క్రిస్మస్ విందుకు చెరియన్ వ్యాఖ్యలను తప్పుపట్టిన బిషప్పుల కౌన్సిల్ నేత క్లిమిస్‌తో సహా అనేక మంది హాజరయ్యారు. అంతకు ముందు చెరియన్ తాను చేసిన కొన్ని వ్యాఖ్యలను ఉపసంహరించుకోవటంతో ఆ వివాదం ముగిసింది. ఈ విందుకు గవర్నర్ మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ హాజరు కాలేదు. సిఎం ఆహ్వానించని కారణంగానే రాలేదని వచ్చిన వార్తలపై గవర్నర్ స్పందించారు. కావాలంటే రాజభవన్‌కు వచ్చి తనిఖీ చేసుకోవచ్చు, నేను ఆహ్వానాన్ని ఎందుకు తిరస్కరించానో మీరు శోధించవచ్చు, ముఖ్యమంత్రిని కూడా ప్రశ్నలు అడగవచ్చు అన్నారు. ప్రధాని విందు వివాదం గురించి చూద్దాం. న్యూ ఢిల్లీలో ప్రధాని నివాసంలో ఇచ్చిన క్రిస్మస్ విందుకు ఆహ్వానం అందగానే కొందరు బిషప్పులకు వెంట్రుకలు నిక్కబొడుచుకొని అక్కడ అందించిన పండ్లరసాలు, ద్రాక్ష రసాలు, కేకుల మీద చూపిన శ్రద్ద తమ స్వంత సామాజిక తరగతి మీద మణిపూర్‌లో జరిగిన హింసను మరిచిపోయారని, వారికది ఒక సమస్యగా కనిపించలేదని కేరళ సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సాజి చెరియన్ ఒక సభలో అన్నారు. చెరియన్ సిపిఎం నేత, క్రైస్తవ సామాజిక తరగతికి చెందిన వారు. దాని మీద కేరళ కాథలిక్ బిషప్పుల కౌన్సిల్(కెసిబిసి) అధ్యక్షుడు కార్డినల్ మార్ బెసిలియోస్ క్లిమిస్ మండిపడుతూ మంత్రి మాటలను ఉపసంహరించుకొనేంత వరకు తాము ప్రభుత్వానికి సహకరించేది లేదని ప్రకటించారు. వివాదాన్ని పొడిగించకుండా ఉండేందుకు తాను చేసిన విమర్శలో వెంట్రుకలు నిక్కపొడుచుకోవటం, కేకులు, డ్రాక్ష రసం పదాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే మణిపూర్ హింసాకాండపై క్రైస్తవ మతాధికారులు స్పందించలేదన్న విమర్శకు కట్టుబడి ఉన్నట్లు చెరియన్ స్పష్టం చేశారు. కెసిబిసి ప్రతినిధి ఫాదర్ జాకబ్ పాలకపిలి మాట్లాడుతూ దేశానికి క్రైస్తవులు చేసిన సేవల గురించి చర్చించేందుకు ప్రధాని ఏర్పాటు చేసిన సమావేశమని పేర్కొన్నారు.మణిపూర్ జనాభాలో 41శాతాల చొప్పున క్రైస్తవులు, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఎనిమిదిశాతంపైగా ఉన్నారు. అక్కడ గతేడాది మే 3వ తేదీన ప్రారంభమైన మెయితీ-గిరిజన ఘర్షణలు వందలాది మంది ప్రాణాలు తీశాయి. వేలాది ఇండ్లు, వందలాది ప్రార్ధనా మందిరాలను ధ్వంసమయ్యాయి. దాదాపు లక్ష మంది నిరాశ్రయులయ్యారు. గిరిజన మహిళలను ఇద్దరిని వివస్త్రలను గావించి రోడ్ల మీద తిప్పిన దుర్మార్గం వెలుగులోకి వచ్చిన తరువాత ప్రధాని మొక్కుబడిగా ఖండించారు తప్ప ఇంత వరకు ఆ రాష్ట్రానికి వెళ్లి భరోసా కల్పించేందుకు పూనుకోలేదు..
మణిపూర్ ఉదంతాల గురించి మౌనంగా ఉండటంపై కేరళ క్రైస్తవ మత పత్రికల్లోనే తీవ్ర విమర్శలు చాలా నెలల క్రితమే వచ్చాయి. ఈ పూర్వరంగంలోనే మంత్రి చెరియన్ మాట్లాడారు. కేరళలో ఓటు బాంకు ఏర్పాటు చేసుకొనే ఎత్తుగడతో క్రైస్తవ మతాధికారులను ప్రసన్నం చేసుకొనేందుకు బిజెపి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నది.లౌ జీహాద్ పేరుతో హిందూ, క్రైస్తవ యువతులను కూడా ఆకర్షించి మతమార్పిడికి పూనుకుంటున్నారని క్రైస్తవుల-ముస్లింల మధ్య విబేధాలు సృష్టించే విధంగా బిజెపి నేతలు గతంలో కొందరు వ్యాఖ్యానించారు. క్రైస్తవులు దేశానికి చేసిన సేవ గురించి చర్చించేందుకు ప్రధాని విందు ఏర్పాటు చేసినట్లు చెప్పటమే విచిత్రం.సంఘపరివార్ (ఆర్‌ఎస్‌ఎస్) ఏర్పాటు చేసిన బిజెపి, ఇతర అనేక సంస్థలు క్రైస్తవ మిషనరీల గురించి, ప్రలోభాలతో మతమార్పిడులు చేస్తున్నారంటూ నిత్యం చేస్తున్న ప్రచారం, ఆ పేరుతో చేస్తున్న దాడుల గురించి తెలిసిందే. వాటిని నివారించటం గురించి ప్రధాని నరేంద్రమోడీ గడచిన పది సంవత్సరాల్లో ఎలాంటి సమావేశాల ఏర్పాటు లేదా ప్రయత్నాలుగానీ కనిపించవు.
2014లో నరేంద్రమోడీ ప్రధానిగా అధికారానికి వచ్చిన తరువాత ముస్లింలు, క్రైస్తవులు అభద్రతా భావానికి గురయ్యారు.భారత్‌లో ఇతర మతాల్లో ఉన్నప్పటికీ వారంతా గతంలో హిందువులే అన్న ప్రచారాన్ని తీవ్రం చేయటంతో పాటు ఘర్‌వాపసీ పేరుతో ఇతర మతాల వారిని తిరిగి హిందువులుగా మార్చే పేరుతో పెద్ద హడావుడి చేశారు. దానికి స్పందన రాలేదు. గుజరాత్‌లో జరిపిన మారణకాండను నివారించటంలో విఫలమైన నరేంద్రమోడీ తమ దేశంలో అడుగుపెట్టకూడదంటూ 2005 అమెరికా అనుమతి నిరాకరించింది. తరువాత అదే అమెరికా మోడీ ప్రధాని పదవిలోకి వచ్చిన తరువాత ఆహ్వానం పలికింది. 2014 అక్టోబరు, 2015 జనవరిలో నరేంద్రమోడీతో భేటీ అయినపుడు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా,మత స్వేచ్చపై అమెరికా కమిషన్ కూడా భారత్‌లో మతస్వేచ్చకు భంగం కలుగుతున్నదని, మైనారిటీ మతాల వారి మీద దాడులు జరుపుతున్నట్లు విమర్శలు చేసింది. భారత్‌లో కనిపిస్తున్న అసహనాన్ని మహాత్మాగాంధీ చూసి ఉంటే దిగ్భ్రాంతికి గురై ఉండేవాడని బరాక్ ఒబామా వ్యాఖ్యానించాడు. ఈ పూర్వరంగంలో అమెరికాను సంతుష్టీకరించేందుకు, ప్రపంచంలో తన ప్రతిష్టకు కలిగిన మచ్చను కనిపించకుండా చేసుకొనేందుకు నరేంద్రమోడీ చూశారు. తమ ప్రభుత్వం ఎలాంటి వత్తిడీ, ప్రభావం లేకుండా పౌరులు ఏ మతాన్నైనా అనుసరించటానికి, లేదా నిలుపుకోవటానికి స్వేచ్చను అన్ని విధాలుగా పరిరక్షిస్తుందని, మెజారిటీ లేదా మైనారిటీ మతాలకు చెందిన వారు ఎవరైనా ఇతరుల మీద విద్వేషాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలా రెచ్చగొట్టినప్పటికీ సహించదని పార్లమెంటులో చెప్పాల్సి వచ్చింది. విదేశాల వారిని ఆకట్టుకొనేందుకు ఈ ముక్కలను ఆంగ్లంలో చెప్పారని కొందరు వ్యాఖ్యానించారు. ఈ మాత్రం మాట్లాడటాన్ని కూడా సహించలేని హిందూ జాతీయవాదులు ” లౌకిక నరేంద్రమోడీ ” అంటూ ఎద్దేవా చేశారని వాషింగ్టన్ పోస్టు, గార్డియన్ పత్రికలు రాశాయి. క్రైస్తవ మతాధికారులతో సమావేశాన్ని కూడా మోడీ నిర్వహించారు.
నరేంద్రమోడీ చేసిన ప్రకటన ఇంకా చెవుల్లో వినిపిస్తుండగానే ఆర్‌ఎస్‌ఎస్ నేత మోహన్ భగవత్ మదర్ తెరెసాను విమర్శిస్తూ తన గణాన్ని సంతృప్తి పరచేందుకు చూశారు. మిషనరీలు తమ సాయం కోరి వచ్చిన వారిని మతం మారాలని కోరినట్లు ఆరోపించారు.ఆమె సేవలు మంచివే కావచ్చు, కానీ వాటిని వినియోగించుకున్న వారిని క్రైస్తవులుగా మార్చే లక్ష్యంతో చేశారని అన్నారు. ప్రభుత్వేతర సంస్థలు కూడా సేవలు చేస్తాయి అవి మదర్ తెరేసా వంటివి కాదు అన్నారు. అంతకు ముందు మతపరమైన మైనారిటీలను అపహరణకు గురైన వస్తువులుగా వర్ణిస్తూ నా వస్తువులను నేను తిరిగి పొందుతా అన్నారు. మదర్ తెరేసాపై మోహన్ భగవత్ మాటలతో తీవ్ర విమర్శలు రావటంతో తమ నేత మాటలను మీడియా వక్రీకరించిందంటూ ఆర్‌ఎస్‌ఎస్ ఆరోపించింది. విదేశీ నిధులతో క్రైస్తవ మిషనరీలు, సంస్థలు మత మార్పిడికి పాల్పడుతున్నాయంటూ చేస్తున్న ప్రచారం ఒక ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. క్రైస్తవం మన దేశానికి రెండువేల సంవత్సరాల నాడే వచ్చింది. రెండు వందల సంవత్సరాల బ్రిటీష్ పాలన, తరువాత కూడా చూస్తే ప్రస్తుతం దేశంలో క్రైస్తవుల సంఖ్య కేవలం 2.3శాతమే. అంటరానితనం వంటి తీవ్ర వివక్ష కారణంగా అనేక మంది క్రైస్తవంలోకి మారారు. ఆ సమస్యతో నిమిత్తం లేని వారు ఆర్థిక, ఇతర ప్రయోజనాల కోసం క్రైస్తవం పుచ్చుకున్నారు. మొఘల్ పాలనా కాలంలో కూడా జరిగింది అదే. రిజర్వేషన్ల కారణంగా అనేక మంది క్రైస్తవంలోకి మారనప్పటికీ దేవాలయాలకు బదులు చర్చ్‌లకు వెళ్లి క్రీస్తును పూజిస్తున్నారన్నది హిందూత్వవాదుల దుగ్ద.
గతంలో జపాన్ ప్రధాని షింజో అబేతో కలసి అహమ్మదాబాద్‌లో ఒక పురాతన మసీదును మోడీ సందర్శించారు. సందర్శన వేరు, చర్చిలో మాదిరి పూజా క్రతువులో భాగంగా కొవ్వొత్తి వెలిగించినట్లుగా మసీదులో ఎక్కడా చూడలేదు.విదేశాలకు వెళ్లినపుడు అబూదాబీలో మోడీ మసీదును సందర్శించారు. ఇవన్నీ ఇస్లామిక్, క్రైస్తవ దేశాల పాలకుల మెప్పు పొందేందుకే అన్నది స్పష్టం. గతేడాది ఈస్టర్ పండగనాడు మోడీ చర్చికి వెళ్లటానికి ముందు క్రైస్తవుల మీద అత్యాచారాలను అరికట్టాలని కోరుతూ ముంబైలో పదివేల మంది ప్రదర్శన చేశారు.” ఈస్టర్ పండగ రోజు కెథడ్రల్ చర్చిని సందర్శించాలన్న వాంఛను ప్రధాని మోడీ వెలిబుచ్చారు. మేము ఏర్పాటు చేశాము. దీని మీద స్పందన ఏమిటని అనేక మంది జర్నలిస్టులు ఎందుకు అడుగుతున్నారో తెలియటం లేదని ” అన్న ఢిల్లీ ఆర్చిబిషప్ అనిల్ కౌటో అంతకు మించి మాట్లాడేందుకు తిరస్కరించారు.ప్రధాని కోరితే కుదరదని చెప్పలేం అని ఫరీదాబాద్ సిరో మలబార్ చర్చి అధిపతి కురియకోస్ భరణికులనగార అన్నారు. ప్రధాని చర్చిలో ఉండగా మూడు స్తోత్రాలను ఆలపించాము, రైసెన్ క్రీస్టు విగ్రహం ముందు కొవ్వొత్తిని కూడా వెలిగించారని చెప్పారు.అరగంటపాటు అక్కడే ఉన్న మోడీ ప్రాంగణంలో ఒక మొక్క నాటారు.ముంబైలో క్రైస్తవుల ప్రదర్శన నిర్వాహకులలో ఒకరైన డోల్ఫీ డి సౌజా మాట్లాడుతూ నరేంద్రమోడీ చర్చికి రావటానికి మాకెలాంటి సమస్య లేదు. స్వాగతిస్తాం, కానీ మోడీ ప్రధాని పదవిలోకి వచ్చిన తరువాత క్రైస్తవుల మీద హింసాకాండ పెరిగింది, దాడులకు పాల్పడిన వారికి వ్యతిరేకంగా మాట్లాడటానికి మోడీ నిరాకరిస్తున్నారు, అదే మాకు ఆందోళన కలిగిస్తోంది అని కూడా డి సౌజా చెప్పారు.అలాంటి ప్రధాని మణిపూర్ గురించి మౌనంగా ఉండటాన్ని ఎందుకు ప్రశ్నించలేదనే కేరళ మంత్రి తప్పుపట్టారు.
ఈస్టర్ పండుగ రోజున బిజెపి నేతలు కేరళలో పదివేల చర్చ్‌లు, క్రైస్తవుల ఇండ్లను సందర్శించి వారిని సంతుష్టీకరించేందుకు, ఓటు బాంకుగా మార్చుకునేందుకు చూశారు. ఈస్టర్ రోజున ఆడించిన నాటకమిదని కేరళకు చెందిన కురియకోస్ భరణికులనగార విమర్శించారు. కేరళలో సిరో మలబార్ చర్చ్ ఆర్చిబిషప్ కార్డినల్ జార్జి అలెంచెరీ నరేంద్రమోడీని ప్రశంసించినట్లు, దేశంలో క్రైస్తవులు అభద్రతతో లేరని చెప్పినట్లు న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక రాసింది. దేశంలో ఆందోళనకరంగా ఉన్న వాస్తవం కార్డినల్ అలెంచెరీ మాటల్లో ప్రతిబింబించలేదని కేరళలో ప్రచురితమయే సత్యదీపమ్ అనే కాథలిక్ పత్రిక సంపాదకుడు ఫాదర్ పాల్ తెలక్కాట్ వ్యాఖ్యానించారు. మోడీ పాలనను ప్రశంసించటం క్రైస్తవులకు విభ్రాంతి కలిగించిందని కూడా అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధాని మిజోరం వెళ్లలేదు. మణిపూర్ తగులబడుతుంటే రాని ప్రధాని తగుదునమ్మా అంటూ పక్కనే ఉన్న మిజోరంలో ఓట్ల కోసం వచ్చారనే విమర్శను మూటగట్టుకోవాల్సి వస్తుందనే కారణం తప్ప మరొకటి కాదు. లోక్‌సభ ఎన్నికల పూర్వరంగంలో నరేంద్రమోడీ క్రిస్మస్ రాజకీయం చేశారు. ఈ పూర్వరంగంలో ప్రధాని విందుకు వెళ్లిన బిషప్పులు మణిపూర్‌లో జరుగుతున్న ఉదంతాలను పట్టించుకోలేదని కేరళ మంత్రి సాజీ చెరియన్ చేసిన వ్యాఖ్యలను చూడాల్సి ఉంది.
