Tags
Ali Hosseini Khamenei, BJP, China, Donald trump, Narendra Modi Failures, Netanyahu, us and israel attack iran, Vladimir Putin, West Asia Crisis
ఎం. కోటేశ్వరరావు
ఫిబ్రవరి 28న అడ్డగోలుగా అమెరికా, ఇజ్రాయిల్ మిలిటరీ దళాలు ఇరాన్‌పై దాడులను ప్రారంభించాయి. ఆ దేశ సుప్రీమ్ నేత అయతుల్లా అలీ ఖమేనితో పాటు కుటుంబ సభ్యులు, ఇతర సీనియర్ నేతలను అనేక మందిని హత్య చేశాయి. దానికి ప్రతిగా ఇరాన్ కూడా తనకున్న సత్తామేరకు ఆత్మరక్షణ ఎదురు దాడులు చేస్తోంది. అమెరికా దాడుల ఆంతర్యం గురించి మీడియాలో రోజూ వస్తున్న వార్తల పూర్వ రంగంలో మరోసారి చెప్పనవసరం లేదు. అనేక కోణాల గురించి చర్చ జరుగుతున్నది.
ఇక అంతా వారే చేశారంటూ డోనాల్డ్ ట్రంప్ మాజీ అధ్యక్షులైన బరాక్ ఒబామా, జో బైడెన్ల మీద విరుచుకుపడ్డాడు. వారిద్దరూ నిద్రపోయిన కారణంగానే ఇరాన్ అణుముప్పు తలెత్తిందని ఆరోపించాడు. ఈ పెద్దమనిషి టెహ్రాన్‌తో కుదిరిన ఒప్పందం నుంచి 2018లో ఏకపక్షంగా తప్పుకొని చేసిందేమిటి? తాను గనుక వైదొలగకపోతే ఒబామా హయాంలో కుదిరిన ఒప్పందం మేరకు ఈపాటికే ఇరాన్ అణుబాంబులను తయారు చేసి ఉండేదని పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లగల ఆయుధాలను రూపొందించు కోవటం తమ హక్కని, ఇతరులకు అది లేదన్నట్లుగా మాట్లాడుతున్నాడు. సుదూర ప్రాంతాల లక్ష్యాలను దెబ్బతీసే క్షిపణులను మనం కూడా తయారు చేస్తున్నాం. ఏదో ఒక రోజు ఇరాన్ గురించి చేసిన వ్యాఖ్యలు ట్రంప్ గాకపోతే మరొకడు మనకూ వర్తింపచేయడని గ్యారంటీ ఏముంది ?
ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తే వాటిని ఇజ్రాయిల్ మీద ప్రయోగిస్తుందన్నది ఒక ఆరోపణ. మరి ఇజ్రాయిల్ ఎవరి మీద ప్రయోగించేందుకు అణుబాంబులను తయారు చేసినట్లు? అణ్వాయుధాలను రూపొందించిన వారందరూ ఎవరో ఒకరి మీద ప్రయోగించేందుకు అన్న అమెరికా అడ్డగోలు వాదనలను మన దేశంలోని కొందరు సమర్ధిస్తుంటారు. మరి మనం ఎవరి మీద వేసేందుకు రెండుసార్లు అణుపరీక్ష జరిపినట్లు? ఉత్తర కొరియా, పాకిస్తాన్ కూడా బాంబులను కలిగి ఉన్నాయి వాటి గురించి అమెరికా మాట్లాడదేం! అనేక సార్లు ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా-ఇజ్రాయిల్ తమ ఏజంట్లను ప్రయోగించి దాడులు చేశాయి. అనేక మంది శాస్త్రవేత్తలను చంపివేశాయి. కాస్పియన్ సముద్రంలో ఇరాన్ సహజ వాయువు పైప్‌లైన్లను 2024 ఫిబ్రవరిలో ఇజ్రాయిల్ ధ్వంసం చేసింది. ఏప్రిల్ నెలలో సిరియా రాజధాని డెమాస్కస్ లోని ఇరాన్ రాయబార కార్యాలయం మీద దాడికి ప్రతిగా ఇరాన్ ఎదురు దాడి చేసింది తప్ప…తర ఏ సందర్భంలోనూ ముందుగా అది టెల్‌అవీవ్ మీద దాడులు చేయలేదు.
అమెరికా, ఇజ్రాయిల్‌ను వ్యతిరేకించే దేశాలు, సాయుధ బృందాలకు ఇరాన్ సాయం చేయటం సరైంది కాదు కదా! ఈ వాదన చేస్తున్న వారు ఐరాస నిర్దేశించిన పాలస్తీనా ప్రాంతాలను తీర్మానం చేసిన మరుసటి రోజు నుంచే ఇజ్రాయిల్ ఎందుకు ఆక్రమించుకొని పాలస్తీనియన్లను ఆ ప్రాంతాల నుంచి తరిమివేస్తున్నట్లు? దానికి పశ్చిమ దేశాలు ఎందుకు మద్దతు ఇస్తున్నట్లు? తమ మాతృభూమి కోసం పోరాడుతున్న వారికి మద్దతు ఇస్తున్నది ఇరాన్, అడ్డుకొనే దుర్మార్గానికి ఆసరా ఇస్తున్నవి అమెరికా, దాని మిత్ర దేశాలు. పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించుకొని అవి మావే అని చెబుతున్న ఇజ్రాయిల్ దుండగాలను సమర్ధిస్తున్నవారు ఏదోఒక సాకుతో మరో దేశాన్ని ఆక్రమించరనే హామీ ఏముంది? కెనడాను తమ 51వ రాష్ట్రంగా మార్చాలని ట్రంప్ అంటే తప్పు పట్టిన అదే కెనడా నేడు అమెరికా దుండగానికి, పాలస్తీనా ఆక్రమణలో ఇజ్రాయిల్‌కు మద్దతు ఇస్తున్నది. పాలస్తీనా ప్రాంతాలు తమ రక్షణకు హామీగా కావాలని యూదు దురహంకారులు చెబుతున్నట్లే అమెరికా రక్షణకు గ్రీన్‌లాండ్ అవసరం అంటున్న అమెరికా చర్యను విమర్శించిన ఫ్రాన్సు, బ్రిటన్, జర్మనీ ఇప్పుడు ఇరాన్‌పై దాడిని సమర్ధిస్తున్నాయి. తమ స్థావరాలను వినియోగించుకొని మరింత మంది పసిపిల్లలను చంపమని, గాజాను నాశనం చేసిన మాదిరి ధ్వంసం చేయమని చెబుతున్నట్లు కాదా!
చరిత్రలో యూదులకు అన్యాయం జరిగిందని, ఇజ్రాయిల్ బాధిత దేశం అని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. యూదులు నీచులంటూ మధ్యయుగాల్లోనే పశ్చిమాసియా ప్రాంతం నుంచి మధ్యయుగాల్లో జరిగిన మత యుద్ధాల్లో తరిమివేశారు. నాజీ మూకలు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అనేక దేశాల్లో ఊచకోత కోశాయి. వారికి న్యాయం చేసే పేరుతో మాతృభూమిగా ఇజ్రాయిల్‌ను ఏర్పాటు చేశారన్నది ఒక వాస్తవం. అదే సమయంలో పాలస్తీనా కూడా అవతరించాలని ఐరాస చేసిన నిర్ణయం గడచిన ఎనిమిది దశాబ్దాలుగా అమల్లోకి రాకపోతే ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెప్పేవారు ఎందుకు ప్రశ్నించరు? వారికి మాతృభూమి లేకనే ఇరుగు పొరుగు దేశాల్లో తల దాచుకుంటున్నారు. తమ దేశ ఏర్పాటు కోసం సాయుధ పోరాట మార్గాన్ని కొందరు చేపట్టారు. అలాంటి సంస్థలలో ఒకటైన హమాస్ 2023 అక్టోబరు ఏడున దాడి చేసి 1200 మందిని హతమార్చి 250 మందిని బందీలుగా పట్టుకోవటాన్ని ప్రపంచంలో ఎవరూ సమర్ధించలేదు. కానీ ఆ పేరుతో గాజాలో 70 వేల మందిని ఊచకోత కోసిన ఇజ్రాయిల్ దుర్మార్గాన్ని హమాస్ చర్యను ఒకే గాటన కట్టటం ఏ విధంగా సమర్ధనీయం? మన దేశం పాలస్తీనా ఏర్పాటును పూర్తిగా సమర్ధించింది. కానీ ఇటీవల ప్రధాని మోడీ ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లి హమాస్ దురాగతాన్ని ఖండించారు తప్ప ఇజ్రాయిల్ మారణకాండ గురించి పల్లెత్తు మాట అనలేదు. మానవత్వం గురించి కబుర్లు చెబితే ఎలా! దాడులు ప్రారంభమైన తరువాత ఇజ్రాయిల్, ఇతర దేశాలతో మాట్లాడారు తప్ప ఇరాన్ నేతలకు మోడీ ఎందుకు ఫోన్ చేయలేదు! పోనీ ఇరాన్ మన శత్రు దేశమా? కాదే, అమెరికా బెదిరించేవరకు 2019కు ముందు చమురు దిగుమతి చేసుకన్నాంగా !
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడు, అందువలన అతగాడు మరణిస్తే సంతాపం తెలపాల్సిన అవసరం లేదు, ఖండించాల్సిన పని కూడా లేదంటున్నారు. పోనీ కాసేపు నిజమే అనుకుందాం. వెనిజులా అధ్యక్షుడు మదురో మన వ్యవహారాల్లో వేలు పెట్టలేదుగా, చమురు సరఫరా చేశాడుగా, అతన్ని అమెరికా కిడ్నాప్ చేస్తే ఎందుకు ఖండించలేదో ఎవరైనా చెప్పగలరా? ఆర్టికల్ 370 రద్దును ఖమేనీ వ్యతిరేకించాడని అంటున్నారు. ఆ మాటకు వస్తే చైనా కూడా వ్యతిరేకించింది, అయినా సీ జిన్‌పింగ్‌తో మోడీ చెట్టపట్టాలు వేసుకోలేదా? పాక్ ఆక్రమిత కాశ్మీరును పాక్ పాలిత ప్రాంతమని, మన అంతర్భాగంగా ఉన్న కాశ్మీర్‌ను భారత పాలిత ప్రాంతంగా అమెరికా వర్ణించింది. అంటే కాశ్మీరు మనది అని చెప్పకపోయినప్పటికీ అమెరికాతో సన్నిహితంగా మసలుతున్నాం. ఖమేని మరణానికి సంతాపం తెలపాలా లేదా అన్నది ఒక సమస్య. కచ్చితంగా చెప్పాలని ఎవరూ అనటం లేదు, అయితే హత్యను, ఇరాన్ మీద దాడిని ఖండించాలా లేదా, ఎందుకు నోరువిప్పటం లేదు! కొన్ని అంశాల మీద భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ ఇరాన్ మన మిత్ర దేశమే అని చెబుతున్నారు కదా? ఎందుకుని వారితో మాట్లాడలేదు! ఈ వైఖరి ప్రపంచానికి ఇస్తున్న సందేశం ఏమిటంటే మనం అమెరికా చంకనెక్కాం, దాని హత్యాకాండను సమర్ధించాం అని కాదా !
ఇరాన్‌కు కోపం ఉంటే అమెరికా, ఇజ్రాయిల్ మీద తీర్చుకోవాలిగానీ గల్ఫ్ దేశాల మీద దాడులు చేయటం ఏమిటన్నది మరొక అతి తెలివి వాదన. ఒక వేళ తమ మీద దాడి చేస్తే అమెరికా వైమానిక స్థావరాలు, నౌకల మీద విరుచుకుపడతామని పదే పదే ఇరాన్ ముందే ప్రకటించింది. అలాంటపుడు గల్ఫ్ దేశాలు తమ గడ్డ మీద ఉన్న స్థావరాల నుంచి అమెరికన్లను ఎందుకు ఖాళీ చేయించలేదు. స్థావరాలు ఎందుకు అంటే అమెరికా పెట్టుబడులు ఆ ప్రాంతంలో ఉన్నాయి గనుక వాటిని రక్షించుకొనేందుకని అతనికంటే ఘనడు ఆచంట మల్లన అన్నట్లుగా సమర్ధిస్తున్నారు. అమెరికా పెట్టుబడులు మన దేశంలో, చైనాలో కూడా ఉన్నాయి, మరి వాటి రక్షణకు మిలిటరీ స్థావరాలను నెలకొల్పలేదేం! మనకు పదిహేడు వందల కిలోమీటర్ల దూరంలో హిందూ మహా సముద్రం లోని డిగోగార్షియా దీవుల్లో అమెరికా మిలిటరీ కేంద్రం ఉంది. అక్కడ ఏం పెట్టుబడులు ఉన్నట్లు ? తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డి కోసం అన్నట్లుగా సాకులు చెబుతున్నారు. గల్ఫ్ దేశాల్లోని స్థావరాలను ఉపయోగించుకొని అమెరికా ఇప్పుడు ఇరాన్ మీద దాడులు చేస్తున్నది. అందుకే వాటిని టెహ్రాన్ లక్ష్యంగా చేసుకుంది తప్ప ఆ దేశాల మీద యుద్ధం ప్రకటించలేదు. యుద్ధం అంటే ముందు హతమయ్యేది నిజం. అందువలన ఏ మాట, చర్య వెనుక ఏ ప్రయోజనం దాగుందో జనం తెలుసుకోవాలి!
