Tags
BJP, BRI, China, CPEC, Narendra Modi Failures, pakistan, RSS, Xi Jinping
ఎం కోటేశ్వరరావు
‘‘ పాకిస్థాన్ 60 బిలియన్ డాలర్ల ఆర్థిక నడవా ప్రాజెక్టు నుంచి వైదొలిగిన చైనా, నిధుల కోసం ఎడిబిని ఆశ్రయించిన ఇస్లామాబాద్ ’’ ఇది కొన్ని పత్రికల్లో వచ్చిన వార్త శీర్షిక.ఇదే అర్ధం వచ్చేవి మరికొన్నింటిలో వున్నాయి. దీనికి కాషాయ దళం చెప్పిన భాష్యం మచ్చుకు ఒకటి ఇలా ఉంది. ‘‘ భారత జాతీయ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే కనెక్టివిటీని మోడీజీ వ్యతిరేకించిన తరువాత (సిపిఇసి ప్రాజెక్టులో స్పష్టంగా సూచించడం) చైనా పాకిస్తాన్ యొక్క 60 బిలియన్ డాలర్స్ ప్రాజెక్టు నుంచి వైదొలిగింది. ఇది భారతదేశానికి దౌత్యపరంగా అతిగొప్ప విజయం, పాక్‌కు చావు దెబ్బ ’’ అని పేర్కొన్నారు. ఇది నిజమా ? మొదటి అవాస్తవం ఏమిటంటే నరేంద్రమోడీ ప్రధాన మంత్రిగాక ముందే దానికి నాంది పలికిన 2013లోనే నాటి యుపిఏ ప్రభుత్వం ఈ పథకానికి అభ్యంతర తెలుపుతూ వ్యతిరేకించింది. ఎందుకు ? పాక్ ఆక్రమిత్ కాశ్మీరులో భాగమైన గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రాంతంలో 600 కిలోమీటర్ల పొడవున పాకిస్థాన్ మరియు చైనా నడవా ప్రాజెక్టులో భాగంగా రోడ్డు మరియు రైలు మార్గ నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటు సాగుతుంది. అది చైనాలోని షింజియాంగ్ స్వయంపాలిత ప్రాంతం నుంచి మొదలై మూడువేల కిలోమీటర్ల దూరంలో పాకిస్థాన్ అరేబియా సముద్ర తీరంలోని గ్వాదర్ రేవు వరకు ఉంటుంది. గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రాంతంపై మనదేశం హక్కును వదులుకోలేదు గనుక ఆ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు జరగకూడదని మన ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. అయినప్పటికీ దాన్ని కొనసాగిస్తున్నారు.2014లో అధికారానికి వచ్చిన నరేంద్రమోడీ సర్కార్ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ వివిధ సందర్భాలలో నిరసన తెలుపుతూనే ఉంది. వాస్తవం ఇది కాగా, కొత్తగా మోడీ వ్యతిరేకత తెలిపినట్లు దానికి తలొగ్గి ప్రాజెక్టు నుంచి చైనా వైదొలిగినట్లు చెప్పటం జనాల చెవుల్లో పూలు పెట్టటం తప్ప మరొకటి కాదు. ఆ పనులు కొనసాగుతూనే ఉన్నాయి.
నిజానికి మన్మోహన్ సింగ్ గానీ, నరేంద్రమోడీ గానీ ఈ సమస్య మీద పెద్దగా చేసిందేమీ లేదు. వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇద్దరూ చైనాతో ఇతర సంబంధాలను కొనసాగించారు. షాంఘై సహకార సంస్థలో మనదేశం 2005 నుంచి పరిశీలకురాలిగా 2014వరకు ఉంది. ఆ ఏడాది మోడీ ప్రభుత్వం పూర్తి స్థాయి సభ్యత్వం కోసం దరఖాస్తు చేసింది. మనదేశమూ, పాకిస్థాన్ రెండూ 2017లో ఒకేసారి సభ్యత్వం పొందాయి. అప్పుడు సిపిఇసి నడవాను ఒక సమస్యగా మోడీ ముందుకు తేలేదు. నరేంద్రమోడీ హయాంలో 2020 గాల్వన్‌లోయ ఉదంతాల ముందుకు వరకు చైనాతో సంబంధాలు మరింత ముందుకు పోయాయి.ఐదేండ్ల తరువాత తిరిగి సాధారణ స్థితికి వస్తున్నాయి. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) 25వ వార్షిక సమావేశాలకు నరేంద్రమోడీతో పాటు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా హాజరయ్యారు. మోడీ వెంటనే తిరిగి రాగా సెప్టెంబరు మూడున జపాన్‌పై రెండవ ప్రపంచ యుద్ధంలో చైనా సాధించిన విజయం 80వ వార్షికోత్సవ మిలిటరీ పరేడ్‌లో ఒక అతిధిగా షరీఫ్ పాల్గొన్నారు.ఆ ఉత్సవానికి నరేంద్రమోడీకి కూడా ఆహ్వానం ఉన్నప్పటికీ హాజరు కాలేదు. ఎస్‌సిఓ సమావేశాలలో సిపిఇసి గురించి అభ్యంతరాలు తెలిపినట్లుగానీ, చైనా నేతలతో మాట్లాడినట్లుగానీ ఒక్కటంటే ఒక్క వార్త కూడా రాలేదు. కానీ కొద్ది రోజుల తరువాత మీడియాలో వచ్చిన కథనాలను పట్టుకొని ఆర్‌ఎస్‌ఎస్ పత్రిక ఆర్గనైజర్ తనదైన శైలిలో రాసింది. ఆరు రోజులు పాటు చైనాలో ఉన్నప్పటికీ షెహబాజ్ షరీఫ్ సిపిఇసికి రెండవ దశ పెట్టుబడుల విషయంలో విఫలమయ్యారు.పరిమితమైన అవగాహన ఒప్పందాలు మాత్రమే చేసుకున్నారు.పెద్ద పెట్టుబడులేమీ లేవు. సిపిఇసి 2.0 ప్రారంభమైనట్లు షెహబాజ్ ఏకపక్షంగా ప్రకటించారు తప్ప చైనా వైపు నుంచి ఎలాంటి ప్రకటన లేదు.పరేడ్‌లో చైనా అధ్యక్షుడు తనతో పాటు పుతిన్, ఉత్తర కొరియా కిమ్‌ను తప్ప షెహబాజ్‌ను పట్టించుకోలేదు.పుతిన్‌తో సంభాషించినపుడు చెవులకు ఫోన్లను కూడా షరీఫ్ సరిగా అమర్చుకోలేకపోయారంటూ రాసింది. పాకిస్థాన్‌తో సిపిఇసి పెట్టుబడుల నుంచి వెనక్కు తగ్గినట్లు చైనా అధికారిక ప్రకటనను ఆర్గనైజర్ లేదా కథనాలు రాసిన ఇతర పత్రికలు చూపగలవా ?
కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఎటుతిప్పి ఎటురాసినా కీలకమైన రైల్వే ప్రాజెక్టుకు రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఇవ్వటం లేదని చైనా చెప్పిందని, గుట్టుచప్పుడు కాకుండా వెనక్కు తగ్గిందని, ఆ మొత్తాన్ని ఆసియన్ అభివృద్ధి బ్యాంకు (ఏడిబి) నుంచి తీసుకోవాలని పాక్ నిర్ణయించిందని రాశాయి. పదే పదే ఐఎంఎఫ్ నుంచి రుణాలు తీసుకుంటున్న పాకిస్థాన్‌కు తాము ఇచ్చిన రుణాలను చెల్లించే సత్తాదానికి ఉందా అనే అనుమానాలు చైనాకు వచ్చినట్లు పేర్కొన్నాయి. ఒక స్నేహితుడి కోసం మరొకర్ని వదులుకోలేమని ఇటీవల పాక్ ఆర్మీ ప్రధాన అధికారి అసిమ్ మునీర్ చెప్పాడని, దాంతో చైనా పెద్దగా ఆసక్తి చూపటం లేదన్నట్లుగా వర్ణించారు. ఇదే సమయంలో 8.5 బిలియన్ డాలర్లను వివిధ పథకాలకు చైనా అందించేందుకు పాక్ ప్రధానితో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వచ్చిన వార్తలను మన మీడియా పెద్దగా పట్టించుకోలేదు. రెండు బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు తిరస్కరించిన చైనా కొత్తగా 8.5బి.డాలర్లు ఇచ్చేందుకు ఎందుకు అంగీకరించినట్లు ? ఈ మొత్తాన్ని సిపిఇసి 2.0లో ఐదు కొత్త కారిడార్లు, అదే విధంగా ఇతర రంగాలలో వినియోగించనున్నట్లు ప్రముఖ పాక్ పత్రిక డాన్ రాసిందని మనదేశ వార్తా సంస్థ పిటిఐ పేర్కొన్నది. తొలిసారిగా పశ్చిమ దేశాలతో చేతులు కలిపిన ఒక సంస్థ సిపిఇసిలో పెట్టుబడులు పెట్టేందుకు చొరవ చూపిందని కూడా వార్తల్లో రాశారు.చైనాకు లాభదాయకం కాని వాటిలో అదెందుకు పెట్టుబడులు పెడుతున్నట్లు ? సమాధానం ఉండదు.
నిజానికి ఇలాంటి కథనాలు రావటం ఇదే కొత్త కాదు. 2024 జూన్ 11న బిజినెస్ స్టాండర్డ్ పత్రిక రాసిన కథనానికి ‘‘ సిపిఇసి 2.0లేదు, భారీ పెట్టుబడులు లేవని పాకిస్థాన్‌కు చెప్పకనే చెప్పింది ’’ అనే శీర్షిక పెట్టింది. ఐదు రోజుల పర్యటన జరిపిన ప్రధాని షెహబాజ్ షరీఫ్ పర్యటనకు ముందు ఇస్లామాబాద్ అధికారులు సిపిఇసి మరొక ఉన్నత స్థాయికి తీసుకువెళతారని చెప్పారని అయితే ఖాళీ చేతులతో తిరిగి వచ్చారని, పాక్ ఆశల మీద చైనా నీళ్లు చల్లిందని, పరిమిత లబ్దితోనే తిరిగి వెళ్లినట్లు నికీ ఆసియా రాసిందని దాన్లో పేర్కొన్నారు. ఏడాది క్రితం మోడీ చైనా వెళ్లలేదు, దానితో సాధారణ సంబంధాల స్థితి కూడా లేదు, అప్పుడెందుకు చైనా అలా వ్యవహరించిందో మీడియా ‘‘ వంట ’’ వారు, కాషాయ దళాలు చెప్పగలవా ? ‘‘పాకిస్థాన్ : ఎందుకు చైనా సిపిఇసి ప్రాజెక్టులు నిలిపివేసింది ?’’ అనే శీర్షికతో ఢల్లీి కేంద్రంగా పని చేస్తున్న అబ్జర్వర్ రిసర్చ్ ఫౌండేషన్ (ఒఆర్‌ఎఫ్) వెబ్‌సైట్‌లో 2020 నవంబరు 25వ తేదీన అయిజాజ్ వానీ రాసిన విశ్లేషణను ప్రచురించింది. అప్పుడు గాల్వన్‌లోయ ఉదంతాలతో చైనాతో మనదేశం వైరంలో ఉంది తప్ప మిత్రదేశంగా లేదు కదా, ఆ నాడే అలా ఎందుకు రాయాల్సి వచ్చినట్లు ? నరేంద్రమోడీ నిరసన లేదా పలుకుబడి ఏమైనట్లు ? అప్పటికే కొన్ని అంశాలను నిలిపివేసినట్లు అయిజాజ్ వానీ రాశారు. పాకిస్థాన్‌లో మాంద్యం, అవినీతి,బెలూచిస్తాన్ ఇతర తిరుగుబాట్లు వంటి అంశాలతో అనేక ప్రాజక్టులు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు.
సిపిఇసి అవకాశాన్ని పాకిస్థాన్ వృధా కావించిందని, మద్దతు గురించి చైనా పునరాలోచనలో పడిరదని సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయ మాజీ ఫ్రొఫెసర్ సజ్దాద్ అష్రాఫ్ 2025 మే రెండవ తేదీన రాశారు. పదేండ్ల తరువాత పాకిస్థాన్ అసమర్ధత, రాజకీయ అవకతవకల వంటి కారణాలతో అనేక కీలక ప్రాజెక్టులు ఆలశ్యం,వాయిదా పడటం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కొన్ని ముఖ్యాంశాలను చూద్దాం.2015 ఏప్రిల్ 20న షీ జింపింగ్ ఇస్లామాబాద్‌లో ఎంతో అట్టహాసంగా ప్రాజెక్టును ప్రారంభించారు. పదేండ్ల తరువాత తలపెట్టిన 90 పథకాల్లో 38 పూర్తి కాగా మరో 23 నిర్మాణంలో ఉన్నాయి. మూడోవంతును ఇంతవరకు ముట్టుకోలేదు. దీనికి బాధ్యత పరిమితంగా చైనాది కాగా ఎక్కువగా ఇస్లామాబాద్‌దే ఉంది. అత్యంత కీలకమైన ప్రత్యేకించి సెజ్‌లు, పారిశ్రామికవాడలు పూర్తికాలేదు. దీనికి పాకిస్థాన్ రాజకీయ నేతలు, ఆసక్తి కనపరచని, సమన్వయం లేని ఉన్నతాధికారులదే బాధ్యత. వీటికి కేటాయించిన వనరులను ఆర్థికంగా పెద్దగా చెప్పుకొనేందుకు ఏమీ ఉండని లాహార్ మెట్రో రైలు ప్రాజక్టుకు మళ్లించారు. ఇలాంటి వాటికి తోడు 2021 నుంచి ప్రాజెక్టులలో పని చేస్తున్న చైనా సిబ్బందికి రక్షణ కల్పించటంలో తీవ్ర పరిస్థితి ఏర్పడిరది. అప్పటి నుంచి 14దాడులు జరగ్గా 20 మంది మరణించారు, 34 మంది గాయపడ్డారు. వీటిలో ఎక్కువ భాగం బెలూచిస్తాన్‌లో జరిగాయి. దౌత్యపరంగా ఇప్పటికీ సిపిఇసికి చైనా మద్దతు ఉన్నప్పటికీ 2023 తరువాత కొత్త పెట్టుబడుల పట్ల వెనక్కి తగ్గుతున్నది.
చైనా ప్రారంభించిన బిఆర్‌ఐ(బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్) పెట్టుబడి పథకాన్ని ప్రారంభం నుంచి అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు, వాటి ఆధ్వర్యాన నడిచే ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్, గిల్గిట్ బాల్టిస్థాన్ గుండా రోడ్డు, రైలు మార్గాల నిర్మాణాన్ని కారణంగా చూపినప్పటికీ మనదేశం కూడా దానికి వ్యతిరేకమే అనే చెప్పాలి. పాకిస్థాన్‌లో రాజకీయ, ఇతర కారణాలతో అక్కడి రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించాయి. బెలూచిస్తాన్‌లోని ఉగ్రవాద శక్తులు చైనా జాతీయుల మీద చేసిన దాడుల వెనుక బిఆర్‌ఐని వ్యతిరేకించే దేశాలు ఉన్నాయని వేరే చెప్పనవసరం లేదు. ఇన్ని సమస్యలు, వాటి పరిణామాలు, పర్యవసానాల గురించి చైనాకు తెలిసినప్పటికీ ఎందుకు చేపట్టిందన్నది ప్రశ్న. ప్రపంచ ఫ్యాక్టరీగా తయారైన తరువాత దాని ఎగుమతులు, దిగుమతులు తక్కువ ఖర్చు, తక్కువ వ్యవధిలో యూరేషియా, ఆఫ్రికా దేశాలకు చేరేందుకు గల మార్గాలను అన్వేషించినపుడు సిపిఇసి ముందుకు వచ్చింది. దక్షిణ చైనా సముద్రం, మలక్కా జలసంధి ద్వారా రవాణా కంటే పశ్చిమ చైనాలోని షిజియాంగ్(ఉఘిర్) స్వయంపాలిత ప్రాంతం నుంచి పాక్ అరేబియా సముద్రరేవు పట్టణం గద్వార్ వరకు రవాణా సదుపాయాల ఏర్పాటు లాభదాయకమని భావించింది. చరిత్రలో ఇంగ్లీష్ ఛానల్ ప్రాంతంలో బ్రిటన్ మరియు ఫ్రాన్సును కలుపుతూ ఏర్పాటు చేసిన భూగర్భ రైల్వే టన్నెల్, పనామా, సూయజ్ కాలవల తవ్వకం అలా జరిగిందే. ప్రస్తుత పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోదరుడు నవాజ్ షరీఫ్ ప్రధానిగా ఉన్న సమయంలో 51 ఒప్పందాల ద్వారా 46 బిలియన్ డాలర్ల ఖర్చుతో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ప్రారంభించారు. ఇప్పుడు అది 65 బిలియన్ డాలర్లకు పెరిగిందని అంచనా. మధ్యలో కరోనా, ఇతర సమస్యలతో అనుకున్నంత వేగంగా పూర్తి కావటం లేదు. ఈ నేపధ్యంలో పాకిస్థాన్ నుంచి 60 బిలియన్ డాలర్ల ప్రాజక్టు నుంచి చైనా వైదొలిగిందని రాస్తే జనం నమ్మాలా ? ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా శాశ్వతంగా ఉంటుందని భావించి మనదేశం అక్కడ మూడు బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టింది. మనకు కూడా చెప్పకుండా అమెరికన్లు 2021లో అక్కడి నుంచి బతుకుజీవుడా మమ్మల్ని ప్రాణాలతో పోనిస్తే చాలంటూ ఆయుధాలు, రవాణా వాహనాల వంటి వాటన్నింటినీ వదిలి కాలికి బుద్ది చెప్పటాన్ని చూశాము. అప్పటి నుంచి మనదేశం తాలిబాన్ల ప్రభుత్వాన్ని గుర్తించకపోయినా తెరవెనుక వారితో మంతనాలు జరుపుతూ పెట్టుబడులను రాబట్టుకొనేందుకు చూస్తున్న సంగతి బహిరంగ రహస్యం. వదలివేసినట్లు ఎక్కడా ప్రకటించలేదు. జూలై మొదటి వారంలో తాలిబాన్ సర్కార్‌ను గుర్తించిన ఏకైక దేశం రష్యా. దానితో మనకున్న సంబంధాలను ఉపయోగిస్తామని వేరే చెప్పనవసరం లేదు. అలాంటిది 60 బిలియన్ డాలర్ల పెట్టుబడులను అర్ధంతరంగా పాకిస్థాన్‌కు వదలి వట్టి చేతులతో చైనా తిరిగి వెళుతుందని మీడియాలో కొందరు రాస్తే, నరేంద్రమోడీ అభ్యంతరంతోనే ఆపని చేసిందని కాషాయదళాలు జనాన్ని నమ్మించేందుకు చూడటం నిజంగానే దుస్సాహసం. జనాలు చెవుల్లో పూలు పెట్టుకొని లేరని వారికి చెప్పకతప్పదు !
.
