Tags
BJP, China, China imports to India, Chinese E vehicles, Chinese investment, Narendra Modi Failures, RSS
ఎం కోటేశ్వరరావు
సరిహద్దు సమస్యల గురించి మాతో రహస్యంగా భారత్ లోతైన చర్చలు జరుపుతున్నదని, మరోవైపు విదేశాంగ మంత్రి రాజీపడేది లేదని ప్రకటిస్తారని, ఇదంతా నెపం మా మీద నెట్టేందుకు, బేరమాడేందుకు చేస్తున్న ట్రిక్కు అని చైనా విదేశాంగశాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నది. గత నెలలో బీజింగ్‌లో రెండు దేశాల ప్రతినిధులు సరిహద్దు వివాదాల గురించి 29వ దఫా చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొనాలంటే సరిహద్దులో సాంప్రదాయ పద్దతిలో బలగాలను మోహరించితేనే సాధ్యమని చర్చల అనంతరం మలేషియా భారతజాతీయుల సమావేశంలో జై శంకర్ చెప్పారు. సరిహద్దు సమస్యపై రాజీపడేది లేదన్నారు. భారత్‌లో జరగనున్న ఎన్నికల్లో లబ్దిపొందేందుకే జైశంకర్ ఇంత గట్టిగా మాడ్లాడారని చైనా విశ్లేషకులు పేర్కొన్నారు. సరిహద్దు వివాదానికి బాధ్యత చైనాదే అని ప్రపంచానికి చెప్పే యత్నం కూడా దీనిలో ఉందన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌ను భారత్ అంతర్భాగంగా తాము ఎన్నడూ గుర్తించలేదని, మరోసారి దాన్ని గురించి ప్రస్తావించటం కూడా ఎన్నికల కోసమే అని విమర్శించారు. అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా జాంగ్‌నాన్ అని పిలుస్తున్నది, పురాతన కాలం నుంచి అది చైనా ప్రాంతమే అని వాదిస్తున్నది. స్వాతంత్య్రం వచ్చిన సమయానికి అది మనదేశ అంతర్భాగంగా ఉంది.అదే విధంగా మనదని చెబుతున్న ఆక్సారుచిన్ ప్రాంతం చైనా ఆధీనంలో ఉంది. ఇది రెండు దేశాల మధ్య తెగని సరిహద్దు వివాదంగా కొనసాగుతున్నది. పరస్పరం చొరబడకుండా వాస్తవాధీన రేఖకు అటూ రెండు దేశాలూ కాపలా కాస్తుంటాయి.ఉద్రిక్తతలు తలెత్తినపుడు మిలిటరీని మోహరిస్తున్నాయి. లడక్ ప్రాంతంలోని గాల్వన్ లోయ 2020 ఉదంతం తరువాత మోహరించిన మిలిటరీలు కొనసాగుతున్నాయి. వాటి ఉపసంహరణ గురించి చర్చలు జరుగుతున్నా కొత్త వివాదం తలెత్తలేదు తప్ప పూర్వపు స్థితి నెలకొనలేదు.
ఒక వైపు మనదేశంలోని సంఘపరివార్, ఇతర కొన్ని శక్తులు చైనా వ్యతిరేకతను నిరంతరం రెచ్చగొడుతూ ప్రచారం చేస్తుంటాయి. మరోవైపు అదే చైనా నుంచి మన దేశం రికార్డు స్థాయిలో దిగుమతులు చేసుకుంటున్నది. గత రికార్డులను నరేంద్రమోడీ బద్దలు కొట్టారు.ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో గతేడాది అదే నెలలతో పోలిస్తే 15.8శాతం తమతో వాణిజ్యం పెరిగిందని చైనా కస్టమ్స్ శాఖ ప్రకటించింది. తూర్పు చైనాలో ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉన్న షియాంగ్‌సు రాష్ట్రం నుంచి బ్రెజిల్,భారత్,రష్యా, దక్షిణాఫ్రికా దేశాలతో గతేడాదితో పోలిస్తే 2024జనవరి, ఫిబ్రవరి మాసాల్లో 36శాతం పెరిగి 14.4బిలియన్ డాలర్లకు చేరిందని వెల్లడించారు.షియాంగ్‌షు రాష్ట్రం నుంచి ప్రధానంగా విద్యుత్ వాహనాలు, వాటిలో వినియోగించే లిథియమ్ అయాన్ బాటరీలు, ఫొటోవోల్టాయిక్ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి.పైన పేర్కొన్న నాలుగుదేశాలతో పాటు చైనాను కలిపి బ్రిక్స్ అని పిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి నుంచి దీనిలో సౌదీ అరేబియా, ఈజిప్టు,ఇరాన్, యుఏయి. ఇథియోపియా కూడా చేరటంతో దీన్ని బ్రిక్స్ ప్లస్ అని పిలుస్తున్నారు. ఒక వైపు చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని, మనదగ్గర నుంచే మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియాలో భాగంగా ఇతర దేశాలకు వస్తువులను ఎగుమతి చేసే అవకాశం వచ్చిందని మీడియా ఊదరగొడుతున్నది. మరోవైపు మనదేశం చైనా, ఐరోపా సమాఖ్య మీద ఆధారపడటం పెరుగుతున్నదని తాజాగా ఐరాస సంస్థ ” అంక్టాడ్ ” ప్రకటించింది.
మనదేశం అందించిన వివరాలను విశ్లేషించిన ఆ సంస్థ కరోనా తరువాత, రష్యా-ఉక్రెయిన్ వివాదం ప్రారంభమైనప్పటి నుంచి చైనా, ఐరోపా సమాఖ్యపై భారత్ ఆధారపడటం 1.2శాతం పెరిగిందని, సౌదీ అరేబియాపై 0.6శాతం తగ్గిందని పేర్కొన్నది. భారత్‌లో ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సాహక పథకం(పిఎల్‌ఐ) అమలు, చైనా నుంచి వస్తున్న దిగుమతులపై నాణ్యతా ప్రమాణాల ఉత్తరువుల పేరుతో పరిమితులను విధించిన తరువాత కూడా భారత్ ఆధారపడటం పెరిగింది. గడచిన రెండు సంవత్సరాలుగా అంతర్జాతీయ వాణిజ్యం స్థిరంగా ఉండటం, రాజకీయాల ప్రాతిపదికన వాణిజ్యం పెరిగినప్పటికీ చైనా మీద ఆధారపడటం ఎక్కువైంది. చైనాపై ఆధారపడటాన్ని 2023లో అమెరికా 1.2శాతం తగ్గించుకుంటే మనదేశం పెంచుకుంది. ఈ కాలంలోనే చైనాపై ఆధారపడిన రష్యా వాణిజ్యం 7.1శాతం పెరగ్గా, ఐరోపా మీద 5.3శాతం తగ్గింది.2022 నుంచి ప్రపంచ వస్తు వ్యాపారం క్రమంగా తగ్గుతున్నది, సేవల లావాదేవీలు పెరుగుతున్నాయి. పొద్దున లేస్తే చైనా వ్యతిరేకతను రెచ్చగొడుతున్న కారణంగా చైనాతో పెంచుకుంటున్న వాణిజ్య లావాదేవీల గురించి చెప్పుకొనేందుకు మన మీడియా సిగ్గుపడుతున్నదని చెప్పవచ్చు. మన ఆర్థిక సంవత్సరపు లెక్కలను మన అధికారులు వెల్లడిస్తే చైనా జనవరి నుంచి డిసెంబరు ప్రాతిపదిక వార్షిక లెక్కలు ప్రకటిస్తుంది. అందువలన రెండుదేశాల లెక్కల్లో తేడాలు కనిపిస్తాయి.చైనా నుంచి జనవరిలో వస్తువులు ఎగుమతి జరిగి అవి మనదేశానికి వచ్చే సరికి ఒకటి రెండు నెలలు పడుతుంది. ఇది లెక్కల్లో తేడాలకు ఒక కారణం.
మనదేశ వాణిజ్య శాఖ సమాచారం ప్రకారం 2021-22 నుంచి 2023-24వరకు మూడు సంవత్సరాలలో 95.266 నుంచి 99.389 బిలియన్ డాలర్లకు చైనాతో వాణిజ్యం పెరిగింది. ఇదే సమయంలో చైనా వెల్లడించిన సమాచారం ప్రకారం 110.361 నుంచి 116.953 బిలియన్ డాలర్లకు చేరింది. చైనా లెక్కలు తప్పు మనం అంతగా దిగుమతులు చేసుకోలేదు అని కొందరు వాదించవచ్చు. అంకెల్లో తేడాలున్నా చైనా నుంచి దిగుమతులు పెరిగాయన్నది స్పష్టం.లేకపోతే కొంత మంది చెబుతున్నట్లు దిగుమతి చేసుకున్న వస్తువుల విలువను తగ్గించి లేదా పెంచి చూపుతున్నట్లు వార్తలు. దాన్ని నిర్ధారించుకోవటం కష్టమేమీ కాదు. కొన్ని వస్తువులు చైనా బదులు హాంకాంగ్ నుంచి వచ్చినట్లుగా మనదేశం నమోదు చేస్తే చైనా నుంచి తక్కువ మొత్తాలు కనిపించవచ్చు. మనదేశం చైనాతో పోటీ పడాల్సిన అవసరం ఉందని, కానీ నిర్లక్ష్యం చేశారని, నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత ప్రాధాన్యత ఇచ్చినట్లు విదేశాంగ మంత్రి జై శంకర్ సూరత్‌లో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. మేకిన్, మేడిన్ ఇండియా అని పిలుపులు ఎన్ని ఇచ్చినా పారిశ్రామిక వస్తుఉత్పత్తి పెద్దగా పెరగటం లేదు.2010 నుంచి 2022వరకు ఉన్న వివరాల ప్రకారం వార్షిక సగటు జిడిపిలో పారిశ్రామిక రంగం వాటా 14.92శాతం ఉంది.స్టాటిస్టా అందించిన వివరాల ప్రకారం 2010లో 17శాతం ఉన్నది 2022నాటికి 13కు తగ్గింది. చైనాలో 2013 నుంచి 2023వరకు వార్షిక సగటు 40శాతం కాగా, 2013లో 44.2 నుంచి 2023లో 38.3శాతానికి తగ్గింది. దీన్ని బట్టి ప్రపంచ ఫ్యాక్టరీగా చైనాను వెనక్కునెట్టటం మరో పదేండ్లు పదవిలో ఉన్నా నరేంద్రమోడీ వల్లకాదని అనుభవం తేల్చింది. అందువలన జైశంకర్ చెబుతున్న మాటలు మోడీని మునగచెట్టు ఎక్కించటానికి మాత్రమే పనికివస్తాయి.
చైనా నుంచి వచ్చే పెట్టుబడులను నిరుత్సాహపరచాలని గతంలో తీసుకున్న నిర్నయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. విద్యుత్ వాహనాల తయారీలో మనదేశంలో 50 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టి స్థానికంగా ఉత్పత్తి చేస్తే చైనాతో సహా ఏ కంపెనీలనైనా అనుమతిస్తామని మన అధికారులు వెల్లడించారు. అలాంటి కంపెనీలు ఉత్పత్తిని ప్రారంభించే వరకు దిగుమతి చేసుకొనే వాహనాలపై ఇప్పుడున్న 70-100శాతం పన్ను మొత్తాన్ని 15శాతానికి తగ్గిస్తున్నట్లు కూడా ప్రకటించింది. టిక్‌టాక్ యాప్‌తో మన సమాచారం అంతా చైనా సంగ్రహిస్తుందని నిషేధించిన పెద్దలు ఇప్పుడు చైనా పెట్టుబడితో ఫ్యాక్టరీలు పెట్టటాన్ని ఎలా అనుమతిస్తున్నట్లు ? చైనా మీద ప్రేమతో లేదా నరేంద్రమోడీ మారుమనసు పొంది కాదు. కార్పొరేట్ల వత్తిడే కారణం ! 2022-23లో మన దేశం 20.3బిలియన్ డాలర్ల మేరకు ఆటో విడిభాగాలను దిగుమతి చేసుకుంటే వాటిలో 30శాతం చైనా నుంచే ఉన్నాయి. రానున్నది విద్యుత్ వాహనాల యుగం. ప్రస్తుతం చైనా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. స్థానికంగా వాటిని తయారు చేసే కంపెనీలకు చైనా విడిభాగాలు అవసరం. తమ పెట్టుబడులను అడ్డుకుంటామంటే చైనా ఊరుకుంటుందా ? ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతుంది. విద్యుత్ వాహనాలకు అవసరమైన బ్యాటరీల ఉత్పత్తిలో 75శాతంతో చైనా ముందుంది.వాహనతయారీ ఖర్చులో 40శాతం బ్యాటరీలదే. ప్రస్తుతం ప్రపంచ విద్యుత్ వాహనాల ఉత్పత్తి, ఎగుమతుల్లో చైనా 50శాతం వాటా కలిగి ఉంది. రానున్న కొద్ది సంవత్సరాల్లో భారత రోడ్లపై తిరిగే ప్రయాణ,వాణిజ్య విద్యుత్ వాహనాల్లో ప్రతి మూడింటిలో ఒకటి చైనా సంస్థలు లేదా వాటితో భాగస్వామ్యం కలిగినవే ఉత్పత్తి చేయనున్నాయని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఆమేరకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అందువలన అనివార్యమై కేంద్ర ప్రభుత్వం చైనా పెట్టుబడులు, వాహనాలకు అనుమతి ఇచ్చింది.వాటిలో ఒకటైన బ్రిటన్‌కు చెందిన ఎంజి మోటార్స్ ఇండియా ఈ ఏడాది సెప్టెంబరు నుంచి ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అనేక చైనా కంపెనీలు రంగ ప్రవేశం చేయనున్నాయి.దీంతో చైనా నుంచి విడిభాగాల దిగుమతులు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి.టెస్లా, విన్‌ఫాస్ట్ వంటి ఇతర దేశాల కంపెనీలు కూడా చైనా వాహనాలతో పోటీ పడేందుకు చూస్తున్నాయి. దీని వలన మన వినియోగదారులకు మేలు జరుగుతుందని వేరే చెప్పనవసరం లేదు.
గాల్వన్ ఉదంతం తరువాత 2020 జూన్‌లో కేంద్ర ప్రభుత్వం షీ ఇన్‌తో పాటు చైనాకు చెందిన 58 యాప్‌లను నిషేధించింది. వీటి ద్వారా దేశ సార్వభౌమత్వం, సమగ్రత,రక్షణ, భద్రతలకు ముప్పు తలెత్తినట్లు కారణంగా చెప్పారు. తరువాత జాబితాను 270కి పెంచారు. షీ ఇన్ ప్రపంచంలో అతి పెద్ద ఆన్‌లైన్ ఫాషన్ దుస్తుల విక్రయాల కంపెనీ. 2022 ఏప్రిల్ నాటికి 150 దేశాల్లో దాని లావాదేవీల విలువ 100బిలియన్ డాలర్లు. కంపెనీ ప్రధాన కార్యాలయం ఇప్పుడు సింగపూర్‌లో ఉంది కనుక గతంలో మన ప్రభుత్వం దానిపై విధించిన నిషేధం ఇప్పుడు వర్తించదని రిలయన్స్ దానితో ఒప్పందం చేసుకోవచ్చని, మన ప్రభుత్వం తిరిగి అనుమతించనున్నదని పత్రికలు రాశాయి. అసలు సంగతి ఏమంటే మరింతగా విస్తరించేందుకు, పన్నుల భారాన్ని తగ్గించుకొనేందుకు గాను తన ప్రధాన కార్యాలయాన్ని 2019లోనే చైనా నుంచి సింగపూర్‌కు మార్చుకుంది. 2020లో నిషేధం విధించేటపుడు అది చైనా కంపెనీ అని చూశారు తప్ప దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని కాదు. ఇప్పటికీ అది చైనా కంపెనీనే కదా ! రిలయన్స్ దానితో ఒప్పందం చేసుకోనుంది గనుక దాని వత్తిడి మేరకు సింగపూర్ పేరును ముందుకు తెచ్చారు. ఇప్పుడు విద్యుత్ వాహనాలు,పెట్టుబడులకు గేట్లు తెరిచారు.కార్పొరేట్లు రంగంలోకి దిగితే నరేంద్రమోడీ తనమాటలను తానే దిగమింగుతారు. కాషాయమార్కు దేశభక్తి మరి !
