Tags
Avimukteshwaranand saraswati, BJP, fake Hindu, Jyotish Peeth controversy, Narendra Modi, Yogi Adityanath
ఎం కోటేశ్వరరావు
వేదాలు నాలుగు, వాటి ప్రాతిపదికన దేశంలో ఏర్పాటు చేసిన నాలుగు పీఠాలకు నలుగురు జగద్గురువులైన శంకరాచార్యలు ఉన్నారు. ఒడిషాలోని పూరీలో ఉన్న గోవర్ధన మఠం రుగ్వేదంతో సంబంధం కలిగినది, నిశ్చలానంద అధిపతి, గుజరాత్‌లోని ద్వారకలో ఉన్నది శారదా పీఠం, సామవేదం ప్రకారం నడుస్తుంది, స్వామి సదానంద సరస్వతి, కర్ణాటక శృంగేరిలో ఉన్న శారదా పీఠం యజుర్వేదాన్ని అనుసరిస్తుంది, స్వామి భారతీ తీర్థ.నాలుగవది ఉత్తరాఖండ్‌లో ఉన్న జ్యోతిర్మ్‌ఠం. ఇది అధర్వణవేదాన్ని పాటిస్తుంది. స్వామి అవిముక్తేశ్వరానంద అధిపతి. ఆయన నియామకాన్ని కొందరు సవాలు చేయటంతో అది సుప్రీం కోర్టుకు చేరింది.ఈ శంకరాచార్యకు యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మధ్య పెద్ద యుద్దమే నడుస్తున్నది. మాఘ మాసం సందర్భంగా జనవరి 18న మౌనీ అమావాస్య రోజున ప్రయాగరాజ్‌లో పల్లకిలో ఊరేగుతూ త్రివేణీ సంగమంలో స్నానం చేసేందుకు రాగా కుదరదని అధికార యంత్రాంగం అడ్డుకుంది.రద్దీ ఎక్కువగా ఉందని సాకు చెప్పింది, కావాలంటే అందరి మాదిరి కాలినడకన వెళ్ల వచ్చంటూ అసలు ముందు మీరు శంకరాచార్య అని రుజువు ఏమిటి అని ప్రశ్నించింది. ముఖ్యమంత్రి అండ లేదా ప్రమేయం లేకుండా ఇలా జరుగుతుందని ఎవరూ నమ్మటం లేదు. మొత్తం మీద ఈ వివాదం కొత్తమలుపు తిరిగింది. మార్చినెల పదవ తేదీలోగా ఆవును రాష్ట్రమాతగా ప్రకటించాలని, గోవధను, గొడ్డు మాంసాన్ని నిషేధించాలని లేనట్లయితే పది, పదకొండు తేదీలలో లక్నోలో జరిగే సాధు, సంతుల సభలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ” నకిలీ హిందువు ” గా ప్రకటిస్తామని అవిముక్తేశ్వరానంద ప్రకటించారు.
తానే జ్యోతిర్మఠ శంకరాచార్యనని, తాను చూపిన రుజువును పదిహేను రోజుల తరువాత కూడా తిరస్కరించలేదంటే ఇంతకంటే వేరే ఆధారం ఏమి కావాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని పీఠాధిపతి ప్రశ్నించారు. జనవరి 29న వారణాసిలో నిర్వహించిన పత్రికా గోష్టిలో ముఖ్యమంత్రికి అవిముక్తేశ్వరానంద సవాల్ విసిరారు. యోగి ప్రభుత్వం తనను వేధిస్తున్నదని 1966లో కరపత్రి జీ మహారాజ్ ఉదంతాన్ని గుర్తుకు తెస్తున్నదని అన్నారు.సిఎం సన్నిహితుడు రామభద్రాచార్య తనకు వ్యతిరేకంగా కుట్రపన్నారని, వేధిస్తున్నారని ఆరోపించారు. ఇరవై నాలుగు గంటల్లో తన ఆచార్యత్వం గురించి రుజువులు చూపాలని అడిగారని, చూపి పదిహేను రోజులు కావస్తున్నా ప్రభుత్వం వాటిని కాదని తిరస్కరించలేదని చెప్పారు. యోగి నిజమైన హిందువో కాదో నిరూపించుకోవాలన్నది ఇప్పుడు ప్రశ ్న అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం క్షమాపణలు చెప్పి రక్షణ కల్పిస్తే ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రయాగరాజ్‌లో మాఘపూర్ణిమ రోజున పవిత్ర స్నానం చేస్తారని అవిముక్తేశ్వరానంద మీడియా ప్రతినిధి శైలేంద్ర యోగిరాజ్ చెప్పారు గానీ జరిగినట్లు వార్తలు లేవు. మౌనీ అమావాస్య రోజున తన పరివారంతో స్నానమాచరించటానికి అనుమతి నిరాకరించచటంతో జనవరి 18 నుంచి పది రోజుల పాటు ప్రయాగరాజ్‌లోని తన శిబిరంలోనే నిరసన దీక్ష చేసి 28వ తేదీన వెళ్లిపోయారు. తన అంతరాత్మ సంతృప్తికోసం సంగమంలో స్నానమాచరించాలని తలపెట్టానని అనుమతించకపోవటంతో ఎంతో కలచివేతకు గురయ్యానని, స్నానమాచరించకుండానే బరువైన హృదయంతో వెళ్లిపోతున్నట్లు శంకరాచార్యచెప్పారు. తానిలాంటి పరిస్థితిని ఎన్నడూ ఊహించలేదన్నారు. స్వామి అనుచరులు బారికేడ్‌ను ధ్వంసం చేసినట్లు పోలీసులు ఆరోపించారు.శంకరాచార్య ఎవరనేది సుప్రీం కోర్టులో వివాదం ఉన్నందున మీరు శంకరాచార్య అని ఎలా చెప్పుకుంటారంటూ అధికార యంత్రాంగం నోటీసు జారీ చేసింది.
శంకరాచార్య పట్ల అనుసరించిన వైఖరి దురహంకారానికి నిదర్శనం, తీవ్ర అరిష్టదాయకమని సమాజవాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ వర్ణించారు.యోగి ప్రభుత్వ చర్యతో ప్రపంచంలోని సనాతనులందరూ బాధపడ్డారని, అధికారం బిజెపిని గుడ్డిదానిగా మార్చిందన్నారు.కాంగ్రెస్ పార్టీ కూడా శంకరాచార్యకు మద్దతుగా నిలిచింది.తప్పిదాన్ని సరిచేసుకొనేందుకు మాఘపూర్ణిమ రోజున లాంఛనాలతో స్నానమాచరించేందుకు అధికారులు చూస్తున్నారని అవిముక్తేశ్వరానంద చెప్పగా అలాంటిదేమీ లేదని అధికారవర్గాలు చెప్పాయి.తనకు క్షమాపణ చెప్పాలని, రానున్న రోజుల్లో నలుగురు శంకరాచార్యలకు ప్రామాణిక లాంఛనాలతో పవిత్ర స్నానాలు ఆచరించే విధంగా నిబంధనలు రూపొందించాలని స్వామి డిమాండ్ చేశారు. జనవరి 18 ఉదంతంపై సిబిఐ విచారణకు ఆదేశించాలంటూ అలహాబాద్ హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలైంది. ప్రయాగరాజ్ కమిషనర్, జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్, మేలా అధికారిపై కేసులు దాఖలు చేయాలని కూడా దానిలో కోరారు. యోగి ఆదిత్యనాధ్‌పై అవిముక్తేశ్వరానంద చేసిన ఆరోపణలతో మనోభావాలు దెబ్బతిన్న కారణంగా తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు రాష్ట్ర జిఎస్‌టి ఆయోధ్య ఉపకమిషనర్ ప్రశాంత కుమార్ సింగ్ ప్రకటించారు.రాజీనామాను నేరుగా గవర్నర్‌కు పంపారు, అయితే దాన్ని ఆమోదించిందీ లేనిదీ తెలియదు..
జ్యోతిర్మఠ్ పీఠం శంకరాచార్య గురించి గత ఎనిమిది దశాబ్దాలుగా వివాదాలు నడుస్తున్నాయి.అవిముక్తేశ్వరానంద 2022 నుంచి శంకరాచార్యగా గుర్తింపు పొందారు. అయితే అప్పటి నుంచీ వివాదం ప్రారంభమైంది. ఎక్కడా లేని విధంగా స్వామి రామకృష్ణ తీర్ధ మరణించిన తరువాత గత 168 సంవత్సరాల నుంచి ఈ పీఠానికి గుర్తింపు పొందిన శంకరాచార్యల గురించి వివాదాలు నడుస్తున్నాయి. అనేక మంది తమను పీఠాధిపతులుగా ప్రకటించుకొని కొనసాగారు.స్వాతంత్య్రానికి ముందు 1941లో మిగిలిన ముగ్గురు శంకరాచార్యలు ఉత్తరాఖండ్ పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించాలని స్వామి బ్రహ్మానంద సరస్వతిని కోరారు. ఆయన 1953 మే 20వ తేదీన మరణించినప్పటి నుంచి వారసత్వం గురించి ఇప్పటి వరకు వివాదాలు కొనసాగుతున్నాయి.బ్రహ్మానంద శిష్యుడు హరిహరానంద పీఠాన్ని అలంకరించేందుకు నిరాకరించారు. వారసుడిగా శాంతానంద సరస్వతి అని బ్రహ్మానంద విల్లు రాసినట్లుగా చెప్పటమే దీనికి కారణం. విల్లు చట్టబద్దతను ఇతర శంకరాచార్యలు ప్రశ్నించారు. ఆది శంకరుడు మహాత్మన్యాయ మహానుశాసనం ప్రకారం విల్లుద్వారా వారసుల నియామకం చెల్లదని వారు పేర్కొన్నారు. తరువాత కూడా వివాదాలు కొనసాగాయి. 1973లో స్వామి కృష్ణబోధ్ మరణంతో స్వామి స్వరూపానంద నియామకం జరిగింది. తరువాత వాసుదేవానంద సరస్వతిని కూడా శంకరాచార్యగా గుర్తించటంతో ఒకేసమయంలో ఇద్దరు శంకరాచార్యలు తయారయ్యారు. ఇది కోర్టుకెక్కటంతో 2017లో వీరిద్దరినీ గుర్తించేందుకు అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది. స్వామి స్వరూపానంద 2022 సెప్టెంబరు 11న మరణించారు. ఆ మరుసటి రోజే తానే నూతన శంకరాచార్య అని స్వామి అవిముక్తేశ్వరానంద ప్రకటించుకున్నారు. అయితే అక్టోబరు 16నఆచారం ప్రకారం నిర్ణయించిన పీఠాధిపత్య స్వీకార కార్యక్రమాన్ని సుప్రీం కోర్టు నిలిపివేసింది. అయితే కోర్టు ఉత్తరువులో పలు చోట్ల అవిముక్తేశ్వరానందను శంకరాచార్యగా ప్రస్తావించటం సమస్యను ఝటిలం చేసింది.కోర్టు అలా పేర్కొన్నది కనుక తానే ఆ స్థానంలో ఉన్నట్లు అప్పటి నుంచి అవిముక్తేశ్వరానంద చెబుతున్నారు.పీఠంలో కొనసాగుతున్నారు. సాంప్రదాయాలు, చట్టపరమైన అంశాల గురించి కోర్టు ఇంతవరకు తేల్చలేదు. దీనికి తోడు రాజకీయనేతలు కూడా వేలుబెట్టటం మరింతగా వివాదాన్ని పెంచింది. ఈ కారణంగానే ఉత్తర ప్రదేశ్ అధికార యంత్రాంగం మీరు శంకరాచార్యులనేందుకు ఆధారాలేమిటని ప్రశ్నించింది, పల్లకిలో ఊరేగుతూ స్నానానికి వెళ్లటాన్ని అడ్డుకుంది.
పదిరోజుల పాటు జరిపిన ధర్నా సమయంలో మాటల తూటాలు పేలాయి. యోగి ఆదిత్యనాథ్‌ను హిందువుగా పిలవాల్సిన అవసరం లేదని, అతన్ని తాను అక్బర్, ఔరంగజేబ్ అంటానని, సదరు వ్యక్తి దేవాలయాల కూల్చివేతకు మద్దతు పలికాడని అవిముక్తిశ్వేరానంద ధ్వజమెత్తారు. ధర్మం పేరుతో కొందరు వ్యక్తులు బలహీనపరిచేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ పేరు పెట్టకుండా యోగి ఆదిత్యనాథ్ ధ్వజమెత్తారు.ఇలాంటి వారి పట్ల సనాతన ధర్మాన్ని నమ్మేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. హర్యానాలో ఒక మతపరమైన క్రతువులో మాట్లాడుతూ ఒక యోగి అంటే అన్నింటినీ త్యజించిన వాడు, ఒక స్వామి అంటే ధర్మం, జాతికంటే గొప్పవ్యక్తి కాదు. అతనికేమీ వ్యక్తిగత ఆస్థి ఉండదు,అనేక మంది కాలనేమి వంటి వారు ఉన్నారు.(రామాయణంలో హనుమంతుడు లక్ష్మణుడి కోసం సంజీవినీ మూలిక తెచ్చేందుకు హిమాలయాలకు ఎగిరి వెళుతున్న సమయంలో కాలనేమి అనే రాక్షసుడు మునివేషంలో వచ్చి తప్పుదారి పట్టించేందుకు చూస్తాడు) స్వాముల పేరుతో ఉండేవారు ధర్మం ముసుగు వేసుకుంటారు.వారు సనాతన ధర్మాన్ని బలహీన పరిచేందుకు కుట్ర చేస్తున్నారు. అయితే యోగి మాట్లాడిన కొద్ది గంటల తరువాత అవిముక్తేశ్వరానందకు మద్దతుగా ఉత్తర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య ముందుకు వచ్చారు. భగవాన్ శంకరాచార్య లేదా గౌరవనీయమైన స్వాములు, ఆచార్యలు ఎవరి పట్లా కూడా అగౌవరవాన్ని ప్రదర్శించకూడదని, అలాంటి ఉదంతాలు జరిగినట్లు వెల్లడైతే విచారణ జరుపుతామని, తప్పుచేసిన వారి మీద చర్య తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి మీడియాకు చెప్పారు. శంకరాచార్యకు పాదాభివందనం చేస్తాం, పవిత్ర స్నానం ఆచరించాలని కోరతాం. వివాదం దాంతో సమసి పోవాలి. ఎవరైనా తప్పు చేస్తే విచారణ జరిపి బాధ్యులైన వారి మీద చర్య తీసుకుంటామని చెప్పారు.శంకరాచార్యను అవమానించటం అంటే సనాతన ధర్మాన్ని అవమానించటమే అని బిజెపి నేత సునీల్ భలారా విమర్శించారు. ప్రయాగరాజ్ అధికారులు దయ్యాల మాదిరి అవమానించారని, శంకరాచార్య శిష్యుల శిఖలు పట్టుకొని లాగారని అన్నారు.బిజెపి నేతల ఈ పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలతో ఆ పార్టీలో ఉన్న గందరగోళంతో పాటు విబేధాలు కూడా వెల్లడయ్యాయి. వ్యక్తులుగా అభిప్రాయాలు వెల్లడించటం మినహా పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేని దుస్థితిలో ఉంది. అనేక మంది సంత్‌లు, ఆలిండియా అఖారాపరిషత్ కూడా అవిముక్తేశ్వరానందకు మద్దతు పలికింది.యోగి-శంకరాచార్య మధ్య వివాదం కొత్తగా తలెత్తింది కాదు,పరోక్షంగా చాలా కాలం నుంచి కొనసాగుతున్నది,అవిముక్తేశ్వరానంద బ్రాహ్మణ సామాజిక తరగతికి చెందగా యోగి ఠాకూర్.గతేడాది కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట, మరణాల గురించి యోగి అబద్దాలు చెప్పినందున రాజీనామా చేయాలని గతేడాది జనవరిలోనే అవిముక్తేశ్వరానంద డిమాండ్ చేశారు.నలభై రోజుల్లో ఆవును రాష్ట్రమాతగా ప్రకటించాలని,గొడ్డు మాంస ఎగుమతుల నిషేధం చేయకపోతే యోగిని నకిలీ హిందువుగా ప్రకటిస్తామని శంకరాచార్య చేసిన ప్రకటన ఏమౌతుందో ఆసక్తి కలిగిస్తోంది !
