ఎం కోటేశ్వరరావు
బేటీ బచావో బేటీ పఢావో, మహిళా సురక్ష కేంద్ర, మహిళా పోలీసు వలంటీర్స్, రాష్ట్రీయ మహిళా కోష్, సుకన్య సమృద్ధి యోజన, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ… ఇవన్నీ మన దేశంలో ఉన్న పధకాలు, ఎవరికో చెప్పనవసరం లేదు.కొన్ని రాష్ట్రాల్లో వీటికి పేర్లు మార్చి అమలు జరుపుతున్నారు. మొత్తం మీద ఇన్ని జరిగిన తరువాత కూడా ప్రపంచంలో స్త్రీ, పురుష సమానత్వ తేడాలో 2024 ప్రపంచ 146దేశాల జాబితా ప్రకారం మన స్థానం 129. పదేండ్లతో పోల్చుకుంటే దిగజారింది. మహిళల అభ్యున్నతి గురించి గత పది సంవత్సరాలుగా తమ భుజాలను తామే చరుచుకొని రొమ్ములు విరుచుకొని గొప్పలు చెప్పుకున్న, మహిళలను వంచించిన వారు, అంతకంటే ఘనడు ఆచంట మల్లన అన్నట్లు వారికి భజన చేసిన ఘనులు తలలెక్కడ పెట్టుకుంటారో చూడాలి. పధకాలన్నీ మావే, రాష్ట్రాలు పేర్లు మార్చుకుంటున్నాయి, అందువలన మా ఫొటోలు పెట్టాలి, వాటి ” ఖ్యాతి ”లో మాకూ వాటా రావాలని కోరుతున్న బిజెపి పెద్దలు ఆ మొత్తాన్ని వారే తీసుకున్నా ఎవరికీ అభ్యంతరం లేదు. డిఎంకె సభ్యురాలు కనిమొళి రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు నాడు మంత్రిగా ఉన్న మేనకా గాంధీ 2015 మే 7వ తేదీన ఇచ్చిన జవాబు సారం ఇలా ఉంది. ప్రపంచ ఆర్థికవేదిక (డబ్ల్యుఇఎఫ్) లింగసమానత్వ తేడా నివేదిక 2014 ప్రకారం 142దేశాలలో భారత్ 114వదిగా ఉంది. అంతకు ముందు సంవత్సర నివేదిక ప్రకారం 136 దేశాలలో 101వదిగా ఉంది. ఏడాది కాలంలోనే ఇంతగా దిగజారి పోవటానికి కార్మికశక్తిలో మహిళా భాగస్వామ్యం తగ్గటం, అవకాశాలు లేకపోవటమే అని పేర్కొన్నారు. అలాంటిది కొన్ని మార్పులు జరిగినా పదేండ్ల తరువాత 101 నుంచి 129వ స్థానానికి దిగజారింది. కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది బిజెపి, మిత్రపక్షాలే, మెరుగుపరచకపోయినా దిగజారటానికి నెపం నెహ్రూ మీదో, గాంధీ మీదో నెడితే కుదరదు.
ఈ సూచికలను రూపొందించటానికి నాలుగు అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటున్నారు.1.ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం, అవకాశాలు, 2. విద్యా అవకాశాలు, 3. ఆరోగ్యం,బతుకు, 4.రాజకీయ సాధికారత. వీటన్నింటిలో ఏ దేశం ఎక్కడుందనే సూచికలు, పాయింట్లు వేస్తారు. వాటన్నింటిని కలిపి మొత్తంగా సాధారణ సూచికలను రూపొందిస్తారు. ఇలాంటి నివేదికలను 2006 నుంచి ప్రతి ఏటా రూపొందిస్తున్నారు. పరిగణనలోకి తీసుకున్న 146దేశాల సగటు లింగ సమానత్వ తేడా 2024లో 68.5శాతం ఉంది. గతేడాది కంటే కేవలం 0.1శాతమే మెరుగైంది. అంటే 31.5శాతాన్ని పూరించాల్సి ఉంది. ఇప్పుడున్న వేగంతో తేడాను పూర్తిగా తగ్గించాలంటే 134 సంవత్సరాలు పడుతుంది. ప్రపంచంలో నూటికి నూరుశాతం సమానత్వం సాధించిన దేశమేమీ లేదు. మొదటి స్థానంలో ఉన్న ఐస్‌లాండ్‌లో 93.5శాతం సాధించారు.భారత్‌లో 64.1శాతం ఉంది. ఈ లెక్కన పూర్తి సమానత్వం సాధించటానికి కనీసం 152 సంవత్సరాలు పడుతుంది. దక్షిణాసియా దేశాల సగటు తేడా 63.7శాతమే. పది సంవత్సరాల నాడు మొత్తం రాంకు మార్కులను చూస్తే 0.6455 కాగా తాజా సూచికలో 0.641కి దిగజారింది.
మన దేశంలో లింగ బేధాలను తగ్గించటంలో పదేండ్ల నరేంద్రమోడీ పాలన ఘోరంగా విఫలమైంది. మరింత దిగజారింది.ఇరుగుపొరుగు దేశాలలో బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్ తరువాత ఐదవదిగా మనదేశం ఉంటే బిజెపి పెద్దలు నిత్యం స్మరించే పాకిస్తాన్ ఏడవదిగా ఉంది.ఆర్థిక భాగస్వామ్యం, ఆరోగ్యంలో 146కు గాను 142వదిగా ఉంది.(మన తరువాత పాకిస్తాన్ ఉంది) విద్య అందుబాటులో 112, రాజకీయ రంగంలో 65, కార్మికశక్తి భాగస్వామ్యంలో 134వదిగా ఉంది. విద్యాఅవకాశాలు, రాజకీయ సాధికారత తగ్గుదల కారణంగానే గతేడాది వచ్చిన 127వ రాంకు 129కి దిగజారింది. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదించినప్పటికీ ఆ స్ఫూర్తిని రాజకీయ పార్టీలేవీ పాటించలేదు. దాని ఘనత తమదే అని భుజాలు చరుచుకున్న బిజెపి 30 మంది కాబినెట్ మంత్రులకు గాను కేవలం ఇద్దరికి, మొత్తం మంత్రివర్గంలో గతంలో ఉన్న పది మందిని ఈ సారి ఏడుకు తగ్గించింది. నేపాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న మంత్రులలో 23.5శాతం మంది మహిళలే ఉన్నారు. చట్టసభల్లో మహిళల ప్రపంచ సగటు 33శాతం కాగా అక్కడ 49.9శాతం ఉంది.
జనాభాలో సగంగా ఉన్న మహిళలకు ఉత్పాదక రంగంలో భాగస్వామ్యం కల్పించకుండా వారి సాధికారత గురించి ఎన్ని కబుర్లు చెప్పినా వట్టిస్తరి మంచి నీళ్లు తప్ప మరొకటి కాదు. గడచిన పది సంవత్సరాల్లో జరిగింది అదే. లింగసమానత్వ తాజా నివేదికలో మనదేశంలో కార్మికశక్తిలో మహిళా భాగస్వామ్యం 35.09శాతం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది కూడా ప్రభుత్వం అందచేసిన తప్పుడు లెక్కల కారణంగానే. నిజంగానే అంత ఉందా ? లోక్‌సభ ఎన్నికలకు ముందు తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశట్టే ముందు నరేంద్రమోడీ తన పాలనలో మహిళాభ్యున్నతిని చూసి ప్రతిపక్షాలు ఆత్మశోధన చేసుకోవాలని చెప్పారు. తన పదేండ్ల ఏలుబడిలో దిగజారిన రాంకును చూసి తలవంచుకుంటారా ? ప్రతిపక్షాలకు సుభాషితాలు చెబుతూనే ఉంటారా ? ప్రభుత్వం ప్రకటించిన సమాచారాన్ని విశ్లేషించిన పరిశోధకులు చెబుతున్న అంకెలకు, ప్రభుత్వ లెక్కలకు పొంతన కుదరటం లేదు. స్టాటిస్టా విశ్లేషణ ప్రకారం 2014 నుంచి 2022వరకు తొమ్మిదేండ్ల సగటు 26.81శాతం కాగా 2023లో 32.68శాతం ఉన్నట్లు అదే సంస్థ పేర్కొన్నది.ఒక్కసారిగా అంత ఎలా పెరిగింది ? ప్రపంచ బాంకు లెక్క 32.7శాతం అన్నది. దేశంలో 2022-23లో నియమిత కాల కార్మిక శక్తి సర్వే ప్రకారం మహిళలు అంతకు ముందుతో పోలిస్తే 4.2శాతం పెరిగి యూజువల్ స్టేటస్ లెక్కింపు అవగాహన ప్రకారం 37శాతానికి చేరినట్లు కేంద్ర ప్రభుత్వం గతేడాది అక్టోబరు తొమ్మిదిన ప్రకటించింది. అందుకే అంకెల గారడీ అనాల్సి వస్తోంది.
ఇండియా టుడే వెబ్‌సైట్ 2023 జూన్ పదకొండున రోషిణీ చక్రవర్తి రాసిన విశ్లేషణకు ” భారత్‌లో తగ్గుతున్న మహిళా శ్రామికులు, ఎందుకు మహిళలు పని చేయటం లేదు ” అనే శీర్షిక పెట్టింది. భారత్‌లో వేతనాలు చెల్లించే ఉపాధిలో మహిళలు ఇరవైశాతానికి లోపుగానే ఉన్నట్లు ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) నివేదికను దానిలో ఉటంకించారు. ఐఎల్‌ఓ నివేదిక ప్రకారం ఉపాధిలో కేవలం 19.2శాతం మంది మాత్రమే మహిళలు ఉండగా పురుషుల్లో 70.1శాతం ఉన్నారు. మహిళల భాగస్వామ్యం పెరిగితే 2025 నాటికి జిడిపిలో 70వేల కోట్ల డాలర్లు పెరుగుతుందన్నది ఒక అంచనా. ఐఎల్‌ఓ నివేదిక ప్రకారం భారత్‌లో 52శాతం మంది మహిళలు వేతన ఉపాధి లేదా లేదా కుటుంబ సంరక్షణలో రెండింటిలో ఉంటామని చెప్పారు. కానీ 2005లో 32శాతంగా ఉన్న మహిళా శ్రామిక శక్తి 2021నాటికి 19.2శాతానికి తగ్గింది. ప్రముఖ మీడియా సంస్థ అల్ జజీరా. అది 2023 ఏప్రిల్ పదిన ఒక విశ్లేషణ ప్రచురించింది.” జనాభాలో భారత్ దూసుకుపోతున్నా శ్రామిక శక్తిలో తగ్గుతున్న మహిళలు ” అని పేరు పెట్టింది.ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ ఉన్న భారత్ మహిళా శ్రామిక శక్తిలో ప్రపంచంలోని అతితక్కువ 20దేశాల్లో ఒకటిగా ఉందని, గత కొద్ది సంవత్సరాలుగా తగ్గుతున్నట్లు పేర్కొన్నది. పెరుగుతున్న జనాభాకు ప్రత్యేకించి మహిళలకు ఉపాధిని చూపటంలో విఫలమైతే భారత్‌కు అది గుదిబండగా మారుతుంది. అధికారిక సమాచారాన్ని విశ్లేషించినపుడు 2004లో గరిష్టంగా 35శాతం మంది మహిళలు ఉపాధి పొందగా 2022 నాటికి 25శాతానికి తగ్గినట్లు అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్థికవేత్త రోజా అబ్రహాం చెప్పిన అంశాన్ని అల్ జజీరా ఉటంకించింది. సిఎంఐయి ఉపాధి నిర్వచనం ప్రకారం 2022లో పని చేసే వయస్సులో ఉన్నవారిలో కేవలం పదిశాతం మంది మాత్రమే అంటే 3.9 కోట్ల మంది మాత్రమే పని చేస్తూ ఉండటం లేదా పని కోసం ఎదురు చూస్తున్నవారున్నారని , అదే పురుషుల విషయానికి వస్తే 36.1కోట్ల మంది ఉన్నట్లు పేర్కొన్నది. పని చేయగలిగిన వయస్సు వారి పెరుగుదలకు అనుగుణంగా ఉపాధి పెరగటం లేదని, గత దశాబ్దిలో మంచి ఉద్యోగాలు గణనీయంగా తగ్గినట్లు, తక్కువ వేతనాలతో పని చేయటం కంటే ఇల్లు, పిల్లలను చూసుకోవటం మరింత లాభదాయకమని వారి కుటుంబాలు భావిస్తున్నాయని సిఎంఐఇ డైరెక్టర్ మహేష్ వ్యాస్ చెప్పిన మాటలను ఉటంకించింది.శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పదిశాతం పెరిగితే జిడిపి 552 బిలియన్ డాలర్ల మేరకు అదనంగా పెరుగుతుందని 2018లో మెకెన్సీ నివేదిక పేర్కొన్నది. చిత్రం ఏమిటంటే మహిళలకు అన్ని గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం, ఇన్ని మరుగుదొడ్లు కట్టించాం అని ఊరూ వాడా ప్రచారం చేసే బిజెపి ప్రచార దళాలు తమ రెండింజన్ల డ్రైవర్లు సాధించిందేమిటో, పదేండ్లలో పరిస్థితి ఎందుకు దిగజారిందో ఎక్కడా మాట్లాడటం లేదు. గోడీ మీడియా సంగతి సరేసరి తేలుకుట్టిన దొంగల్లా నోరెత్తటం లేదు. ఈ అంశాన్ని పట్టించుకోవాల్సింది కాదన్నట్లుగా ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి సంపూర్ణ మెజారిటీని కోల్పోవటానికి మహిళా ఉపాధి తగ్గటం కూడా ఒక కారణమే.
