Tags
Gaza Deaths, Gaza Tunnels, HAMAS attacks 2003, Israel Attack 2023, Israel-Hamas war, Joe Biden, Netanyahu
ఎం కోటేశ్వరరావు
మానవాళి చరిత్రలో అత్యంత విషాదానికి దారితీసే విధంగా గాజాలో పరిస్థితి ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి రిచర్డ్ పీపర్‌కోన్ చెప్పాడు. రెండు నెలలుగా మారణకాండ సాగుతోంది. ఐక్యరాజ్యసమితి దీన్ని నివారించటంలో ఘోరంగా విఫలమైంది.గాజాలోని రెండవ పెద్ద పట్టణమైన ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ మిలిటరీకి అడుగడుగునా ప్రతిఘటన ఎదురవుతున్నట్లు వార్తలు. ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ నౌకలపై ఎమెన్ సాయుధ శక్తుల దాడి, సంయమనం పాటించాలని అమెరికాను కోరిన సౌదీ అరేబియా.ఇప్పటికైనా మానవతా సంక్షోభాన్ని నివారించండని భద్రతా మండలిని తొలిసారిగా కోరిన ఐరాస ప్రధాన కార్యదర్శి.ఈ పరిణామాలన్నీ గాజాలో సాగుతున్న మారణకాండ, దాని పర్యవసానాలు మధ్యప్రాచ్యం పడుతున్న తీరు, మొత్తం మీద దిగజారుతున్న పరిస్థితిని సూచిస్తున్నాయి. పశ్చిమ గట్టు ప్రాంతంలో కూడా పాలస్తీనా పౌరుల మీద దాడులు కొనసాగుతున్నాయి. అంబులెన్సులను కూడా ఇజ్రాయెల్ మిలిటరీ అడ్డుకుంటున్నది. గాజాలో పౌరుల సామూహిక వధను ఆపాలని, ఐరాస సభ్యదేశాలు ఈ సంక్షోభంలో జోక్యం చేసుకోవాలని పాలస్తీనాలో మానవహక్కులపై ఐరాస ప్రత్యేక నివేదకురాలు ఫ్రాన్సెస్కా అల్బనీస్ మంగళవారం నాడు కోరారు. ఈ విషాదం మీద స్పందించటంలో అంతర్జాతీయ సమాజం పక్షవాతానికి గురైనట్లుగా ఉందని, ప్రసుతం తీవ్ర మారణహౌమ ముప్పు ఉందని హెచ్చరించారు. గాజాలో సంభవిస్తున్న మరణాల్లో సగమే వెల్లడౌతున్నాయని గతంలో తాను చేసిన వ్యాఖ్యకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టీకరించారు. ఆత్మ రక్షణ కోసం దాడులు జరుపుతున్నట్లు ఇజ్రాయెల్ చెప్పటాన్ని కూడా ఆమె తిరస్కరించారు.కేవలం హమస్‌ను మాత్రమే కాదు మొత్తం గాజాను నాశనం చేయటం లక్ష్యమని అల్బనీస్ అన్నారు.
ప్రస్తుత యుద్ధం ముగిసిన తరువాత గాజాను మిలిటరీ రహిత ప్రాంతంగా మారుస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించాడు. పోరు ఎంతకాలం సాగినా కొనసాగించేందుకు తాము సన్నద్దంగా ఉన్నట్లు హమస్ సీనియర్ నేత ఒసామా హందన్ చెప్పాడు. పాలస్తీనా అనుకూల మరియు పర్యావరణ పరిరక్షణ కోరే బృందాల పట్ల కఠినంగా వ్యవహరించిన తీరు కారణంగా ప్రపంచ పౌరహక్కుల సూచికలో జర్మనీ దిగజారినట్లు ప్రకటించారు. గాజాలో జరుగుతున్న మానవ సర్వనాశనం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, అంతర్జాతీయ చట్టాలను పాటించాలని, రెండు దేశాల ఏర్పాటు పరిష్కారానికి యత్నాలను తీవ్రతరం గావించాలని కతార్-సౌదీ సమన్వయ కమిటీ కోరింది. తమ వైమానిక దాడుల్లో అనేక మంది హమస్ నేతలను హతమార్చినట్లు ఇజ్రాయెల్ చెప్పుకుంది..
ఏడు రోజుల విరామంలో హమస్ వద్ద ఉన్న వారిలో వంద మంది బందీలు, ఇజ్రాయెల్ జైళ్లలో అక్రమంగా నిర్బంధంలో ఉన్న పాలస్తీనా పౌరుల్లో 240 మంది విడుదల తరువాత పెద్ద ఎత్తున గాజా మీద ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఇంకా హమస్ వద్ద 138 మంది బందీలు, వేలాది మంది పాలస్తీనా పౌరులు జైళ్లలో ఉన్నారు. బుధవారం ఉదయానికి అందిన సమాచారం మేరకు గత రెండు నెలల దాడుల్లో 16,248 మంది పాలస్తీనియన్లు మరణించారు. దాదాపు 50వేల మంది గాయపడ్డారు.మరికొన్ని వేల మంది శిధిలాల కింద మరణించి ఉంటారని భయపడుతున్నారు. కూల్చిన భవనాల శిధిలాలను తొలగించే అవకాశం కూడా లేదు. దాడులను విరమించే వరకు చర్చల ప్రసక్తే లేదని హమస్, దాడులను కొనసాగించి తీరుతామని ఇజ్రాయెల్ ప్రకటించాయి. ఇదిలా ఉండగా బందీల విడుదలకు ప్రధాని నెతన్యాహు ప్రయత్నించటం లేదంటూ ఇజ్రాయెల్‌లో కుటుంబసభ్యులతో పాటు అనేక మంది తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇజ్రాయెల్ మారణకాండలో 70శాతంపైగా పిల్లలు, మహిళలే ఉండటం, ఆసుపత్రులు, ఐరాస కేంద్రాలతో సహ నిర్వాసితుల శిబిరాలపై కూడా మారణకాండను కొనసాగించటంతో ప్రపంచ మంతటా తీవ్ర నిరసన వెల్లడి అవుతోంది. దీంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం, దానికి వంతపాడే బిబిసి వంటి మీడియా సంస్థలు, నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్న జో బైడెన్ వంటి వారు అరవై రోజుల తరువాత కొత్త పల్లవి అందుకున్నారు. గాజాలోని సొరంగాల్లో దాగి ఉన్నారని భావిస్తున్న హమస్ సాయుధులను వెలుపలికి రప్పించేందుకు విష పూరిత వాయువులను పంపాలని గతంలో ఇజ్రాయెల్ ఆలోచించింది. ఇప్పుడు దాని బదులు మధ్యధరా సమద్రం నుంచి నీటిని తోడి సొరంగాల్లోకి పంపాలని చూస్తున్నది.
హమస్ సాయుధులు అక్టోబరు ఏడవ తేదీన ఇజ్రాయెల్ మీద జరిపిన దాడి సందర్భంగా అనేక మంది పిల్లలతో సహా మహిళలపై అత్యాచారాలు చేశారని, అంగవిచ్చేదనలకు పాల్పడ్డారంటూ కొత్త కథనాలను ప్రచారంలోకి తెచ్చారు.ఎలాంటి సందిగ్దతకు, మినహాయింపులకు తావు లేకుండా ఇజ్రాయెల్ మహిళలపై జరిపిన అత్యాచారాలను ఖండించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నాడు. అంతర్జాతీయ మానవహక్కుల సంస్థలు, బృందాల నుంచి ఎలాంటి ఖండన ప్రకటనలను తాను వినలేదు, చూడలేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పాడు.దక్షిణ గాజాలో రెండు లక్షల మందికి పైగా జనాభా ఉన్న ఖాన్‌యూనిస్ పట్టణాన్ని సర్వనాశనం చేసేందుకు మంగళవారం నుండి ఇజ్రాయెల్ సేనలు విమానాలు, టాంకులతో దాడులు జరుపుతున్నాయి. అక్కడ ఎందరు ప్రాణాలు కోల్పోయిందీ ఇంకా వెల్లడి కాలేదు. పౌరులు పట్టణాన్ని ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరింత దక్షిణంగా అంటే ఈజిప్టు సరిహద్దువైపు వెళ్లాలంటూ వెదజల్లిన కరపత్రాలలో పేర్కొన్నారు. తమ భూభాగంలోకి శరణార్ధులు రాకుండా ఈజిప్టు సరిహద్దులను మూసివేసింది. ఉత్తర గాజాతో పోలిస్తే దక్షిణ ప్రాంతంలో జన నష్టం జరగకుండా నిర్దిష్ట సమాచారంతో దాడులు జరుపుతున్నట్లు ప్రపంచాన్ని నమ్మించేందుకు ఇజ్రాయెల్ చూస్తున్నది. జనాన్ని అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్లిపోవాలని తరుముతున్న ఇజ్రాయెల్ మిలిటరీ నుంచి అమాయకులైన పౌరులకు ఎక్కడా రక్షిత ప్రాంతమంటూ లేకుండా పోయింది. ఒకసారి ఖాళీ చేసిన ప్రాంతానికి తిరిగి అనుమతించటం లేదు. ఖాన్ యూనిస్ పట్టణం చుట్టూ ఆరుకిలోమీటర్ల పరిధిలో 150 ఇజ్రాయెలీ టాంకులు, సాయుధులతో కూడిన అనేక వాహనాలు ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాలు చూపుతున్నాయి.యుద్ధ విమానాలు కూడా దాడులు జరుపుతున్నాయి.మరోసారి అక్టోబరు ఏడున హమస్ జరిపిన మాదిరిదాడులు పునరావృతం కాకుండా చూసేందుకు ఆ సంస్థ మిలిటరీ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసే దిశగా తాము దాడులు జరుపుతున్నట్లు ఇజ్రాయెల్ చెబుతున్నది.
గత రెండు నెలల దాడుల్లో ఐదువేల మంది హమస్ తీవ్రవాదులను మట్టుపెట్టామని ఇజ్రాయెల్ చెప్పటం తప్ప ఎలాంటి ఆధారాలను చూపలేకపోయింది.తమ దాడుల్లో మరణించిన నిరాయుధులైన పౌరులను హమస్ తీవ్రవాదులుగా చిత్రిస్తున్నది. తమ సైనికులు 86 మంది మరణించినట్లు ప్రకటించింది.అన్ని రకాల మత, నైతిక, మానవతా విలువలను ఉల్లంఘిస్తున్న ఇజ్రాయెల్ ఆక్రమిత పాలస్తీనాలో మారణకాండ జరుపుతున్నదని ఏడు రోజుల దాడుల విరామం, బందీలు, ఖైదీల విడుదల చర్చలకు మధ్యవర్తిత్వం వహించి కతార్ పాలకుడు హమద్ అల్ తానీ దోహాలో జరిగిన అరబ్ నేతల సమావేశంలో విమర్శించాడు. ఆత్మరక్షణ పేరుతో ఇదంతా చేస్తున్నారని మారణకాండ నేరాన్ని ఆత్మరక్షణ అనుమతిస్తుందా అని ప్రశ్నించారు. కతార్‌లో హమస్ రాజకీయ కార్యాలయంతో పాటు అనేక మంది నేతలు అక్కడే ఉంటున్నారు. ఇజ్రాయెల్ షిన్‌బెట్ భద్రతా సంస్థ అధిపతి రొనెన్ బార్ ఒక ఆడియో ప్రకటన చేస్తూ కతార్‌తో సహా హమస్ నేతలు ఎక్కడ ఉన్నా వారిని అంతం చేస్తామని బెదిరించాడు. గాజా మీద రెండవ దశ పేరుతో పెద్ద ఎత్తున దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సరిహద్దులో ఉన్న లెబనాన్ను కూడా కవ్విస్తున్నది.అక్కడ ఉన్న హిజబుల్లా సాయుధులపై జరిపిన దాడిలో లెబనాన్ మిలిటరీ పోస్టులో ఉన్న ఒక సైనికుడి ప్రాణాలు పోయినట్లు లెబనాన్ ప్రకటించింది. సరిహద్దు ఆవల నుంచి తమ మీద దాడి జరిగిందని, క్షిపణులు జనం లేని చోట పడినట్లు, తమ విమానాలు హిజబుల్లా మిలిటరీ కేంద్రాల మీద దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ చెబుతున్నది. ఇజ్రాయెల్ ఆక్రమించిన గోలన్ గుట్టల మీద అక్టోబరు ఎనిమిది నుంచి హిజబుల్లా అడపాదడపా దాడులు జరుపుతున్నది.తరువాత మొత్తం సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
గాజాలో జరుపుతున్న నేరాలను ఇతర ప్రాంతాలకు విస్తరించవద్దని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు హితవు చెప్పాడు. అదే జరిగితే మొత్తం ప్రాంత భద్రతకు ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించాడు. రాజకీయ మనుగడకోసం నెతన్యాహు మొత్తం ప్రాంతాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాడని విమర్శించాడు. తమ గడ్డ మీద ఉన్న హమస్ సభ్యులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరపవద్దని టర్కీ హెచ్చరించింది. ఇజ్రాయెల్ భద్రతా సంస్థ అధినేత రొనెన్ బార్ చేసిన ప్రకటనలో లెబనాన్, టర్కీ, కతార్‌లలో ఎక్కడ ఉన్నా హతమారుస్తామని బెదిరింపు ప్రకటన తరువాత టర్కీ నుంచి ఈ ప్రకటనవెలువడింది. గతంలో విదేశీ శక్తుల చట్టవిరుద్ద పనులను తాము అడ్డుకున్నట్లు గుర్తు చేసింది. అనేక సంవత్సరాలుగా ఇజ్రాయెల్ మొసాద్ ఏజంట్లు అనేక దేశాల్లో తమ వ్యతిరేకులను హత్య చేస్తున్న సంగతి తెలిసిందే. హమస్ ఒక విముక్త సంస్థ తప్ప ఉగ్రవాది కాదని అందుకు వారికి ఆశ్రయం కల్పిస్తున్నట్లు గతంలో ఎర్డోగన్ ప్రకటించాడు.
హమస్ సాయుధుల జాడ కనుగొనటంలో విఫలమైన ఇజ్రాయెల్ తొలుత వారు తలదాచుకుంటున్నట్లు భావిస్తున్న సొరంగాల్లో విషవాయువులను నింపి వెలుపలికి వచ్చేట్లు చేయాలని చూసింది. తాజాగా వాటిని సముద్రపు నీటితో నింపాలని ఏర్పాట్లు చేస్తున్నది. ఈ దుష్ట ఆలోచన గురించి అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. అదే జరిగితే ఇప్పటికే కాలుష్యమైన గాజా ప్రాంతంలో మరిన్ని పర్యావరణ సమస్యలతో పాటు రానున్న అనేక తరాల మీద ప్రతికూల ప్రభావం పడుతుందని, మంచి నీటి వనరులన్నీ ఉప్పునీటితో నిండుతాయని అనేక మంది హెచ్చరిస్తున్నారు. నవంబరు రెండవ వారంలోనే ఆల్ షాతి నిర్వాసిత శిబిరం సమీపంలో ఐదు భారీ పంపులను ఏర్పాటు చేసింది. మధ్యధరా సముద్రం నుంచి నీటిని తోడి సొరంగాల్లో నింపేందుకే ఈ ఏర్పాటు. హమస్ సాయుధులను ఏరివేసేందుకు తాము అనేక పద్దతుల గురించి పరిశీలిస్తున్నామని వాటిలో ఒకటి నీటితో నింపటమని ఇజ్రాయెల్ మిలిటరీ అధికారి చెప్పినట్లు అమెరికా పత్రిక పేర్కొన్నది. అదే జరిగితే అంతర్జాతీయంగా వెలువడే ఖండనలు జో బైడెన్ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తాయని అమెరికా మాజీ అధికారి ఒకడు చెప్పాడు. ఈజిప్టు 2015లో తన భూభాగంలో ఉన్న సొరంగాలను ఉప్పునీటితో నింపి దొంగ రవాణాను అరికట్టేందుకు పూనుకున్నపుడు ఆ ప్రాంత పంటలు దెబ్బతినట్లు రైతులు ఆందోళన చేశారు.అమెరికా ఇతర ఐరోపా ధనికదేశాల అండచూసుకొని చెలరేగుతున్న ఇజ్రాయెల్ మారణకాండకు ఇంకా ఎంత మంది బలికావాలన్న ప్రశ్న తలెత్తింది. ఈ దారుణాన్ని నివారించటంలో ఐక్యరాజ్యసమితి ఘోరంగా విఫలమైంది.
