Tags
BJP, India Exports, India Imports, India imports from China, India TRADE BALANCE, Narendra Modi Failures, Ten years Narendra Modi rule
ఎం కోటేశ్వరరావు
వచ్చే ఏడాది 2025 మార్చి నెలాఖరుకు మన వస్తు, సేవల ఎగుమతులు 800 బిలియన్ డాలర్లకు పెరుగుతాయని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బరత్‌వాల్ తాజాగా చెప్పారు. గత ఆర్థిక సంవత్సరలో 778.2బి.డాలర్లు ఉన్నాయి. వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి మూడు మాసాలలో 200బి.డాలర్ల మేర ఎగుమతులు జరిగినందున ఇదే ధోరణి మిగిలిన తొమ్మిది మాసాల్లో కూడా కొనసాగుతాయన్నది ఆశాభావం మాత్రమే. దిగుమతులు వెయ్యి బిలియన్ డాలర్లకు మించే ఉంటాయని కూడా చెప్పవచ్చు. గడచిన పది సంవత్సరాలలో ట్రైలర్ మాత్రమే చూపానని అసలైన సినిమా తరువాత ఉంటుందని నరేంద్రమోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. సాధారణంగా సినీ ప్రేక్షకులను ట్రైలర్లతో ఆకట్టుకొనేందుకు చూస్తారు. ఈ రీత్యా చూసినపుడు ట్రైలర్ చూసిన తరువాత జనానికి నచ్చని కారణంగానే లోక్‌సభలో స్వంతంగా మెజారిటీని తెచ్చుకోలేకపోయారు. కూటమిగా కూడా నాలుగు వందల సీట్లకు చాలా దూరంలో ఉన్నారు. ఇక నరేంద్రమోడీ ఫైల్స్ అనే సినిమాలో అనేక అంశాలు ఉన్నాయి. ముందుగా విదేశీ అప్పుల గురించి చూద్దాం.
మోడీ గద్దె నెక్కిన 2014లో మన విదేశీ అప్పులు 446.2బిలియన్ డాలర్లు. మోడీ కొత్త అప్పులు చేయలేదు, పాత అప్పులు తీర్చారంటూ భక్తులు గొప్పగా దైవాంశ సంభూతుడి మహిమల గురించి ప్రచారం చేశారు.కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ 2024 మార్చినెలలో వెల్లడించిన సమాచారం ప్రకారం 2023 డిసెంబరు ఆఖరుకు 648.2బిలియన్ డాలర్ల విదేశీ అప్పు ఉంది. అంటే రెండు వందల బిలియన్ డాలర్లు పెరిగింది. పాత అప్పు తీర్చితే బకాయి తగ్గాలి, కానీ పెరిగిందంటే కొత్త అప్పులు చేసినట్లే కదా ! దీనికి బాధ్యులెవరు ? మన విదేశీ మారక ద్రవ్య నిల్వ ప్రస్తుతం 657 బిలియన్ డాలర్లకు అటూ ఇటూగా ఉన్నాయి. ఇవి అప్పులకు సరిపోతాయి. మోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాది మన విదేశీ వాణిజ్య లోటు 137 బిలియన్ డాలర్లు కాగా తాజాగా నెలకు ఇరవై బిలియన్ డాలర్లకు అటూ ఇటూగా ఉంది, అంటే 240బి.డాలర్లు. లోటు తగ్గించలేకపోతే మానే పెత్తనంలో పెంచకూడదనుకుంటారు, కానీ దాదాపు రెట్టింపుకు దగ్గరగా ఉంది. వాణిజ్య, పరిశ్రమల శాఖ సమాచారం మేరకు 2023-24లో మన వాణిజ్యలోటు 238 బిలియన్ డాలర్లు.దీనిలో మూడోవంతుకు పైగా 85.09బి.డాలర్లు చైనాకే సమర్పించుకున్నాం, కొన్ని వస్తువులను హాంకాంగ్ ద్వారా చైనా ఎగుమతులు చేస్తున్నది కనుక దానితో ఉన్న 12.21 బి.డాలర్లను కూడా కలుపుకుంటే ఇంకా పెరుగుతుంది. మన విదేశీ మారక నిల్వలు అప్పులకు సరిపడా ఉన్నాయి. ఎగుమతులతో వచ్చే రాబడి దిగుమతులకు చాలటం లేదు, దేశం ముందుకుపోతున్నట్లా వెనక్కు నడుస్తున్నట్లా ? చివరకు లాటిన్ అమెరికా దేశాల మాదిరి అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వస్తుందా ? విదేశాల్లో ప్రతిష్ట, పలుకుబడి, మార్కెట్లను పెంచానంటారు తప్ప అది దేవతా లేదా మాయవస్త్రంలా మామూలోళ్లకు కనిపించటం లేదు.
మాక్రోట్రెండ్స్ నెట్ సమాచారం ప్రకారం 1970లో ఎనిమిది బిలియన్ డాలర్లుగా ఉన్న విదేశీ అప్పు నూతన ఆర్థిక విధానాలను అమల్లోకి తెచ్చిన 1990నాటికి 83బి.డాలర్లకు చేరింది. తరువాత పదేండ్లకు 101, 2010 నాటికి 290, నరేంద్రమోడీ అధికారానికి వచ్చేనాటికి 457 బి.డాలర్లకు చేరింది. అప్పటి నుంచి ఐఎంఎఫ్ తాజా విశ్లేషణ ప్రకారం 2024 మార్చి నాటికి 681, మరుసటి ఏడాది మార్చికి 748 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది.ఈ సంవత్సరాలలో వార్షిక అప్పు పెరుగుదల శాతాల్లో ఎగుడుదిగుళ్లు ఉండవచ్చు తప్ప మొత్తంగా చూసినపుడు పెరుగుదల ధోరణే ఉంది. ఇదే కాలంలో కేంద్ర ప్రభుత్వ దేశీయ రుణ భారం 58.6లక్షల కోట్ల నుంచి 156.6లక్షల కోట్లకు 174శాతం పెరిగింది.కరోనా కారణంగా ఇంత అప్పు చేశాము, ఉచితంగా వాక్సిన్లు వేశాము అని బిజెపి పెద్దలు చెప్పవచ్చు. ఇన్ని లక్షల కోట్లు దానికే తెచ్చారా ? బడ్జెట్ పత్రాల్లో పేర్కొన్నదాని ప్రకారం 2024 మార్చి నాటికి దేశీయ అప్పు రు.164లక్షల కోట్లు, విదేశీ అప్పు 5లక్షల కోట్లు మొత్తం కలిపితే రు.169లక్షల కోట్లకు, 2025 మార్చి ఆఖరుకు 184లక్షల కోట్లకు చేరనుంది.
మన ఎగుమతుల తీరుతెన్నులను చూద్దాం. సిఎంఐఇ సేకరించిన సమాచారం ప్రకారం మన ఎగుమతుల తీరుతెన్నులు ఎలా ఉన్నాయో చూద్దాం. బాగా పలుకుబడి పెరిగిందని చెప్పుకున్న కారణంగా జనం రెండోసారి అధికారాన్ని కట్టబెట్టారు. సంవత్సరాల వారీ మొత్తం ఎగుమతుల్లో వస్తువుల శాతాలు ఇలా ఉన్నాయి.
వస్తువులు×××××××2019-20×2020-21×2021-22×2022-23×2023-24
చమురు ఉత్పత్తులు××× 13.2 ××× 8.8 ××× 16.0 ××× 21.6 ××× 19.3
చమురేతర ఉత్పత్తులు×× 86.8 ××× 91.2 ×× 84.0 ××× 78.4 ××× 80.7
వ్యవసాయ ఉత్పత్తులు×× 11.2 ××× 14.2 ×× 11.8 ××× 11.6 ××× 11.0
ఖనిజ ఉత్పత్తులు ×××× 01.5 ××× 02.4 ×× 01.4 ××× 01.1 ××× 01.5
పారిశ్రామికవస్తువులుు×× 73.0 ××× 73.5 ×× 69.8 ×× ×64.3 ××× 66.8
ఎగువన ఉన్న వివరాలు చెబుతున్నదేమిటి ? కరోనా సమయంలో పెద్దగా చర్చ లేకుండా ఎవరూ వ్యతిరేకించరనే ఎత్తుగడతో మూడు సాగు చట్టాలను తీసుకువచ్చినపుడు రైతులకు చెప్పిందేమిటి ? మన వ్యవసాయ ఉత్పత్తులకు పెద్గగా మార్కెట్‌ను పెంచాం, నేరుగా ఎక్కడికైనా ఎగుమతులు చేసుకొనేందుకు వీలుగా ఈ చట్టాలను తీసుకువచ్చామని చెప్పారు.కానీ మన ఉత్పత్తులకు మోడీ చెప్పినంత మార్కెట్, ఎగుమతి అవకాశాలు లేని కారణంగానే ఎదుగూబొదుగూ లేకపోవటం లేదా గిడసబారిన తీరు కనిపిస్తోంది.ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ఎగుమతులను పెంచామని తమ జబ్బలను తామే చరుచుకుంటారు. మొత్తం ఎగుమతుల్లో అవి 4.1 నుంచి ఐదేండ్లలో 7.1శాతానికి పెరిగాయి. ఇదే సమయంలో మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా, ఎగుమతుల ప్రోత్సాహక పథకం వంటి కబుర్లు ఎన్ని చెప్పినా మొత్తం పారిశ్రామిక వస్తువుల ఎగుమతుల వాటా తగ్గుతోంది.మనం ముడి చమురును దిగుమతి చేసుకొని దాన్నుంచి ఉత్పత్తులను తయారు చేసి ఎగుమతి చేయటం ఒక్కటే పెరుగుతోంది.అది కూడా రష్యా నుంచి చౌకగా దిగుమతులు చేసుకొని ఎగుమతులు పెరిగినందున ఆ మేరకు ఉంది. చమురుకు విదేశాల మీద ఆధారపడటం తగ్గించాలని గద్దెనెక్కగానే చెప్పారు. స్వదేశీ ఉత్పత్తి పెంచుతామన్నారు.2014-15లో మొత్తం దేశీయ ముడిచమురు ఉత్పత్తి 37.46మిలియన్ టన్నులు కాగా అదేమి దరిద్రమో పదేండ్లలో 30మి.టన్నులకు పడిపోయింది.దీనిలో 22.6 మిలియన్ టన్నులు పనికిరాని వంటూ నిత్యం ఆడిపోసుకొనే ప్రభుత్వ రంగ సంస్థలే చేస్తున్నాయి.రిలయన్స్ వంటి ప్రయివేటు కార్పొరేట్లకు అప్పగించేందుకు వాటిని కూడా సరిగా పని చేయనివ్వకుండా చేస్తున్నందున వాటి ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. వ్రతం చెడ్డా ఫలం దక్కిందా అంటే ప్రయివేటు కంపెనీలు పొడిచిందేమీ లేదు.
చైనా వృద్ధి రేటు భారత్ కంటే ఎంతో తక్కువగా ఉందని,రియలెస్టేట్ రంగం సంక్షోభంలో పడిందని, మొత్తం ఆర్థిక వ్యవస్తే కుప్పకూలిపోనుందన్నట్లుగా రోజూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. జూన్ మాసంలో మన ఎగుమతులు 2.5శాతం పెరగ్గా, దిగుమతుల వృద్ధి రేటు ఐదు శాతం ఉన్నట్లు వెల్లడించిన తరుణంలోనే చైనా గురించి కూడా వార్తలు వచ్చాయి. రాయిటర్స్ విశ్లేషణ ప్రకారం జూన్‌లో చైనా ఎగుమతులు అంచనాలకు మించి జరగ్గా దిగుమతులు తగ్గాయి. ఇలా జరగటం అంటే స్థానిక డిమాండ్ తగ్గటం ఆందోళన కలిగించే పరిణామం, గిరాకీని పెంచాలంటే ఉద్దీపన పథకాలను అమలు జరపాలని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. గడచిన పదిహేను మాసాల్లో ఎగుమతులు జూన్‌లో వేగంగా పెరిగినట్లు కూడా ఆ వార్త పేర్కొన్నది. ప్రపంచంలో డిమాండ్ పెరిగిన కారణంగా చైనా ఎగుమతులు 8.6శాతం పెరిగినట్లు జపాన్ ఆసియా నికీ డాట్‌కామ్ పేర్కొన్నది. చైనా వస్తువుల దిగుమతులను అడ్డుకొనేందుకు అనేక దేశాలు భారీ మొత్తాలలో దిగుమతి పన్నులను విధించినప్పటికీ ఈ పెరుగుదల ఉంది. ఇదే సమయంలో మన వస్తువుల మీద అలాంటి పన్నులు లేకున్నా ఎగుమతులు 2.5శాతానికే ఎందుకు పరిమితం అయినట్లు ? చైనా దిగుమతులు తగ్గినందున గిరాకీ పెంచేందుకు ఉద్దీపన ప్రకటించాలని కోరుతున్నవారు విదేశీ కార్పొరేట్ల ప్రతినిధులు తప్ప వేరు కాదు. స్వదేశీ వస్తు వినియోగం తగ్గితే ఆందోళన చెందాలి లేదా పెంచటానికి ప్రోత్సాహకాలు ఇస్తే ఏ దేశానికైనా లాభం, గిరాకీ పెరిగితే పరిశ్రమలు పని చేస్తాయి, కార్మికులకు ఉపాధి దొరుకుతుంది, జనాలకు రాబడి పెరిగితే గిరాకీ పెరుగుతుంది తప్ప విదేశీ వస్తువులకు రాయితీలు ఇస్తే ఆయా దేశాల పరిశ్రమలకు, కార్మికులకు లబ్ది ఉంటుంది. ఇప్పుడు మనం చేస్తున్నది అదే.అయితే చైనా దిగుమతుల్లో మూడో వంతు పరికరాలు తిరిగి ఎగుమతి చేసేందుకు ఉద్దేశించిన విడి భాగాలే. ఈ రీత్యా చైనాకు సమస్యలొస్తే వాటిని ఎగుమతి చేసే దేశాలకూ వచ్చినట్లే. కనుక అవి కూడా చైనాతో సంబంధాలను పునరాలోచించుకోవాలి. ఇతర దేశాల ఆంక్షల కారణంగా దిగుమతులకు అవకాశం లేని సెమీ కండక్టర్ల వంటి వాటిని చైనా స్వయంగా తయారు చేసుకోవటం కూడా ప్రారంభించింది. తొలి ఆరు నెలల కాలంలో చైనా ఎగుమతులు 3.6శాతం పెరిగి 1.71లక్షల కోట్ల డాలర్లకు, దిగుమతులు రెండుశాతం పెరిగి 1.27లక్షల కోట్ల డాలర్లకు చేరాయి. వాణిజ్య మిగులు 435బిలియన్ డాలర్లు. మన అధికారులు చెప్పినట్లు మొత్తం ఎగుమతులు 800బిలియన్ డాలర్లకు పెరిగినప్పటికీ అది చైనా వాణిజ్య మిగులు కంటే తక్కువే.అమెరికా వంటి వ్యతిరేక దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచుకోవటం కంటే అదిరించి బెదిరించి తమ వస్తువులను కొనిపించాలని లేదా చైనాను ఎలా దెబ్బతీయాలా అన్నదాని మీదే ఎక్కువ కేంద్రీకరిస్తున్నట్లు కనిపిస్తోంది. అనేక దేశాలు రక్షణాత్మక చర్యలకు పూనుకున్నాయి. చైనా వస్తువుల మీద అవి కేంద్రీకరిస్తున్నప్పటికీ అంతిమంగా ఇతర దేశాల మీద కూడా ఆంక్షలకు పూనుకుంటాయి. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్లీనంతీసుకున్న నిర్ణయాల గురించి అనేక దేశాలు ఎదురు చూస్తున్నాయి.
అధికారానికి వచ్చినప్పటి నుంచీ చైనాను అధిగమిస్తామని, దేశాన్ని ప్రపంచ ఫ్యాక్టరీగా మారుస్తామని నరేంద్రమోడీ చెబుతూనే ఉన్నారు. పదేండ్లలో ఒక్క ఏడాదైనా వాణిజ్య మిగులును సాధించలేకపోయారు.మోడీకి పొగడ్తలు తప్ప మన వస్తువులకు మార్కెట్‌లేదు. దిగుమతులు పెరిగినప్పుడు తమ ఘనతే, దేశంలో కొనుగోలు శక్తి పెరగటానికి నిదర్శనం అంటారు.ఎప్పుడైనా తగ్గితే చూశారా దిగుమతుల మీద ఆధారపడటం తగ్గించాం, విజయం కాదా అంటారు. వాణిజ్య విషయాలకు వస్తే 2022-23తో పోలిస్తే వస్తు ఎగుమతులు 451 నుంచి 437 బి.డాలర్లకు తగ్గగా సేవలు 325 నుంచి 339బి.డాలర్లకు పెరిగాయి.దిగుమతులు 752 నుంచి 677 బి.డాలర్లకు, సేవలు 182 నుంచి 177 బి.డాలర్లకు తగ్గాయి. జిడిపిలో ఐదవ స్థానానికి చేర్చటం తమ ఘనత అని, త్వరలో మూడో స్థానానికి తీసుకుపోతాం అని చెప్పుకుంటున్న మోడీ బృందం వస్తు ఎగుమతుల్లో ఎక్కడ ఉందో ఎందుకు చెప్పదు. గత పది సంవత్సరాల్లో ప్రపంచంలో 19 నుంచి 17వ స్థానానికి ఎగబాకింది. మొదటి స్థానంలో ఉన్న చైనా 3,380 బిలియన్ డాలర్ల మేర 2023లో ఎగుమతి చేయగా మనం 432బి.డాలర్ల దగ్గర (స్టాటిస్టా సమాచారం) ఉన్నాం. చివరకు చైనా ఏలుబడిలో 70లక్షలకు పైగా జనాభా ఉన్న హాంకాంగ్ 573బి.డాలర్లతో పదవ స్థానంలో ఉంది.చైనాతో పోటీ పడాల్సిందే ! దేనిలో, ఉత్పత్తిలో తప్ప ఉత్తుత్తి కబుర్లలో కాదు !!
