Tags
#Anti China, Alexis Tsipras, Anti China Media, Anti communist, BJP, Donald trump, India Water War Against Pakistan, Narendra Modi, Narendra Modi Failures, Pahalgam terror attack, POK, Xi Jinping
ఎం కోటేశ్వరరావు
పహల్గామ్ ఉగ్రదాడి ఉదంతంలో పాకిస్తాన్ వైపు చైనా మొగ్గిందనే అర్ధం వచ్చే రీతిలో మీడియాలో వార్తలు వచ్చాయి.ఉగ్రవాదులకు చైనా తయారీ సమాచార పరికరాలు అందినట్లు చిత్రించారు. కమ్యూనిజం, చైనాపై వ్యతిరేకతను రెచ్చగొడుతున్నవారు ఇలాంటి అభిప్రాయం కలిగించటం ఆశ్చర్యం కలిగించటం లేదు. అసలు ఎవరేమి చెప్పారో ముందు చూడాలి. మన భాగస్వామ్య దేశం, నరేంద్రమోడీ జిగినీ దోస్తుగా వర్ణించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడాడు.రోమ్‌లో పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు విమానంలో వెళుతూ విలేకర్ల ప్రశ్నకు సమాధానమిచ్చాడు. ఎఎన్‌ఐ ఇచ్చిన వార్తలో ఇలా ఉంది. .‘‘ నేను భారత్‌కు ఎంతో సన్నిహితుడిని, అలాగే పాకిస్తాన్‌కూ ఎంతో దగ్గర.వారు కాశ్మీరు సమస్య మీద వెయ్యి సంవత్సరాల నుంచి దెబ్బలాడుకుంటున్నారు. అంతకు మించి ఎక్కువ సంవత్సరాల నుంచే ఉండవచ్చు, సరిహద్దుల గురించి 1,500 సంవత్సరాలుగాగా ఉద్రిక్తతలు ఉన్నాయి. ఉగ్రవాదదాడి చెడ్డది, భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఎప్పుడూ ఉన్నవే. ఏదో విధంగా వారే పరిష్కరించుకుంటారు.ఇద్దరు నేతలూ నాకు తెలుసు’’ అన్నాడు.
చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ వార్తలో ఇలా ఉంది.‘‘ పాకిస్తాన్ మరియు భారత్ మధ్య తలెత్తుతున్న పరిస్థితిని సన్నిహితంగా చైనా పరిశీలిస్తున్నది. నిష్పాక్షిక దర్యాప్తు జరపాలన్న చొరవకు మద్దతు ఇస్తున్నది. ఉభయపక్షాలూ ఉద్రిక్తతలను తగ్గించేందుకు పూనుకోవాలని, సంయమనం పాటిస్తాయని ఆశాభావం వెలిబుచ్చుతున్నాం.’’ పాకిస్తాన్ ఉప ప్రధాని మరియు విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషాక్ దార్ ఆదివారం నాడు ఫోన్ చేసిన సందర్భంగా చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, విదేశాంగ మంత్రి వాంగ్ ఇ చెప్పిన మాటలివి. తాము చైనాతో సహా అంతర్జాతీయ సమాజంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని వివరిస్తున్నామని దార్ చెప్పాడు. అన్ని దేశాలూ ఉమ్మడిగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంది, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్థాన్ తీసుకుంటున్న చర్యలను నిరంతంర చైనా సమర్ధిస్తూనే ఉందని వాంగ్ చెప్పాడు. ఎల్లవేళలా వ్యూహాత్మక భాగస్వామిగా, గట్టి స్నేహితుడిగా ఉన్న పాకిస్తాన్ భద్రతాపరమైన ఆందోళనలను చైనా పూర్తిగా అర్ధం చేసుకుంటున్నదని, సార్వభౌమత్వం,భద్రతా ప్రయోజనాలకు పూర్తి మద్దతు ఇస్తామని వాంగ్ ఇ చెప్పాడు.రెండు దేశాల మధ్య వివాదం ప్రాంతీయ శాంతి, స్థిరత్వాలకు మంచిది కాదని కూడా అన్నాడు. పాక్ మంత్రి ఫోన్ చేశాడు తప్ప చైనా మంత్రి చేయలేదని గ్రహించాలి.తటస్థ మరియు పారదర్శక పద్దతిలో పహల్గాం ఉదంతంపై దర్యాప్తు జరపాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కోరాడు. రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు ఇరాన్, సౌదీ అరేబియా ముందుకు వచ్చినట్లు వార్తలు.
ఒక మిత్రదేశ విదేశాంగ మంత్రి ఫోన్ చేసినపుడు ఎవరైనా స్పందించటం సహజం.పాకిస్తాన్ మాదిరి భాగస్వాములు లేదా మిత్రదేశాలతో మనదేశం మాట్లాడినట్లు ఎలాంటి వార్తలు లేవు.చైనాతో మాట్లాడతారని ఎవరూ అనుకోరు. అఫ్‌కోర్స్ మాట్లాడాలా లేదా అన్నది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. ఈ సందర్భంగా మీడియాలో మరోసారి చైనా వ్యతిరేక ప్రచారం మొదలైంది. చైనా తయారీ ఆధునిక ఆల్ట్రాసెట్ వాకీటాకీలతో ఉగ్రవాదులు తమ నేతలతో మాట్లాడారని, వారికి అవి ఎలా వచ్చాయంటూ చైనా అంతర్గతంగా దాడికి సహకరించిందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. చైనా దగ్గర చౌకరకం వస్తువుల తయారీ తప్ప ఆధునిక పరిజ్ఞానం లేదని గతంలో, ఇప్పటికీ ప్రచారం చేస్తున్నవారి నుంచే ఇప్పుడు ఇలాంటి మాటలు వస్తున్నాయి. ఇలాంటి పరికరాలు గతంలోనే ఉగ్రవాదుల దగ్గర దొరికినట్లు వార్తలు వచ్చాయి. ఆల్ట్రాసెట్ వాకీటాకీలను అంతర్జాతీయంగా నిషేధించలేదు. అలాంటివి ఒక్క చైనా మాత్రమే తయారు చేయటం లేదు,ప్రతి అగ్రదేశం వద్దా ఉన్నాయి.చైనా దగ్గర వాటిని ఎవరైనా కొనుగోలు చేయవచ్చు, ఆ క్రమంలో పాకిస్తాన్ కొనుగోలు చేసి ఉగ్రవాదులకు ఇచ్చి ఉండవచ్చు, దానికి చైనాను ముడిపెట్టటం సమస్య. మనదేశంలో నక్సలైట్ల దగ్గర రష్యన్ ఏకె రకం తుపాకులు ఉన్నాయి, అవి ప్రపంచంలో అనేక చోట్ల, మనదేశంలో కూడా తయారవుతున్నాయి. అంటే నగ్జల్స్‌కు మనదేశమే విక్రయిస్తోందని అర్ధమా !
సామాజిక మాధ్యమంలో వెలువడుతున్న పోస్టులు,వ్యాఖ్యలను చూస్తే ఉన్మాదం ఎంతగా తలకెక్కిందో అర్ధం అవుతున్నది. జీలం నది భారత్‌లో పుట్టి పాకిస్తాన్‌లో సింధునదిలో కలసి అరేబియా సముద్రంలోకి ప్రవహిస్తుంది. సింధు జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టినట్లు మన ప్రభుత్వం ప్రకటించిన తరువాత ఎలాంటి ముందస్తు హెచ్చరికలేకుండా జీలం నది నీటిని విడుదల చేయటంతో మన కాశ్మీరులోని అనంతనాగ్ జిల్లా నుంచి పాక్ ఆక్రమిత కాశ్మీరులో ప్రవేశించి ముజఫరాబాద్ పరిసరాలకు వరద ముప్పు తెచ్చినట్లు, అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పాకిస్తాన్ ప్రకటించింది. దీని గురించి అవునని గానీ కాదని గానీ ఇది రాసిన సమయానికి మన ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.భారత్ దెబ్బ అంటే ఇట్లుంటది అన్నట్లుగా కొందరు సంబరపడుతున్నారు. ఎవరి మీద ఈ వరద దాడి జరిగిందో, దాని పరిణామాలు, పర్యవసానాలను గమనించే స్థితిలో ఇలాంటి బాపతు లేకపోవటం విషాదం, గర్హనీయం. మన కాశ్మీరు నుంచి విడదీసిన ముక్కలో ముజఫరాబాద్ ఉంది. దాన్నే మనం ఆక్రమిత కాశ్మీరు అంటున్నాం, పాకిస్తాన్ విముక్త కాశ్మీరు అని పిలుస్తున్నది. మనదేశంలో అంతర్భాగంగా ఉన్న ముక్కను కూడా విముక్తి చేసి స్వతంత్ర కాశ్మీరు దేశాన్ని ఏర్పాటు చేస్తామని పాక్ చెబుతున్నది. అందుకే దాన్ని తనలో విలీనం చేసుకోలేదు, పార్లమెంటులో ప్రాతినిధ్యం కల్పించలేదు, తన స్వంత రాష్ట్రంగా కూడా పరిగణించటంలేదు తప్ప మిగతా అన్ని విషయాల్లో తన అంతర్భాగంగానే చూస్తున్నది.
ఎప్పటికైనా ఆక్రమిత కాశ్మీరును మనం తిరిగి తెచ్చుకోవాల్సిందే. అందుకే అసెంబ్లీలో ఆ ప్రాంతానికి కొన్ని సీట్లను కేటాయించి, అవి మినహా మిగిలిన వాటికే ఎన్నికలు జరుపుతున్నాం.మొత్తం 114 సీట్లకు గాను 24 పాక్ ఆక్రమిత కాశ్మీరుకు కేటాయించాం, 90స్థానాలకు ఎన్నికలు జరిగాయి.అప్పుడప్పుడు ముజఫరాబాద్‌లో తాము భారత్‌లో విలీనం అవుతామంటూ ప్రదర్శనలు జరుగుతుంటాయి, వాటిని మన మీడియా కూడా చూపుతుంది. ఇప్పుడు మనదేశం ఆ పట్టణం, పరిసరాలను పహల్గాం దాడికి ప్రతీకారంగా వరద నీటితో ముంచెత్తితే వారు మనకు అనుకూలంగా ఉంటారా ప్రతికూలంగా మారతారా ? కొంత మంది ఉగ్రవాదులు చేసిన దానికి సామాన్యుల మీద ప్రతీకారం తీర్చుకుంటే ఉగ్రవాదులకు ఆశ్రయం మరింత పెరుగుతుందా తగ్గుతుందా ? మానవహక్కులకు, అంతర్జాతీయ ఒప్పందాలకు ఇది పూర్తి విరుద్దం. అంతర్జాతీయ సమాజం ముందు తలదించుకోవాల్సిందే. ఉగ్రవాదులను పట్టుకోవాల్సిందే, నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేయాల్సిందే.మన దేశంలో నక్సల్స్‌ను పట్టుకొనే పేరుతో ఆదివాసీల మీద పోలీసులు, భద్రతా దళాలు దాడులు చేస్తే జరిగిందేమిటి ? దాన్ని అవకాశంగా తీసుకొని భయంతో లేదా పోలీసుల మీద కసితో మరింతగా నగ్సల్స్‌కు వారు ఆశ్రయమిచ్చారా లేదా !
మన దగ్గర ఉన్న రాఫేల్ యుద్ధ విమానాలను ఎదుర్కొనేందుకు వీలుగా నిర్ధారణ కాని వార్తలంటూ చైనా తన ఆధునిక పిఎల్15 క్షిపణులను అత్యవసరంగా పాకిస్తాన్‌కు తరలించినట్లు క్లాష్ రిపోర్టు అనే మీడియాలో రాశారు. ఇవి రాడార్ల నియంత్రణలో గగన తలం నుంచే గగనతలంలో ప్రయోగించే కంటికి కనిపించని దీర్ఘశ్రేణి క్షిపణులు. వీటిని ఒకసారి వదిలిన తరువాత మధ్యలో కూడా దిశను మార్చి లక్ష్యాలవైపు ప్రయోగించవచ్చు. పాక్ యుద్ధ విమానాలకు అమర్చిన పిఎల్10, పిఎల్15 క్షిపణులంటూ ఎక్స్‌లో బొమ్మలను పెట్టారు. అధికారిక వర్గాలేవీ నిర్ధారించలేదని కూడా వార్తలో పేర్కొన్నారు.వీటిని తొలిసారిగా చైనా 2024 నవంబరులో ఒక ప్రదర్శనలో చూపిందట. ఇంత అత్యాధునిక క్షిపణులను ఏ దేశమూ కొన్ని నెలల్లోనే ఇతర దేశాలకు విక్రయించదు.ఈ క్షిపణులను అమెరికా ఏఐఎం120డి అనే వాటికి ధీటుగా చైనా తయారు చేసింది. ఇవి ఐరోపా ఎంబిడిఏ మెటోయర్‌కు సమానమైనవని కూడా చెబుతున్నారు.ఫ్రాన్సు నుంచి మనం కొనుగోలు చేసిన రాఫెల్ విమానాలు వీటిని ప్రయోగించేందుకు వీలు కలిగినవి. ఇవి చైనా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్న పిఎల్15ఇ రకంతో సమానమని నిపుణులు చెబుతున్నారు, అవి 145 కిలోమీటర్ల లక్ష్యాలను దెబ్బతీస్తాయని వార్తలు వచ్చాయి.2019లో బాలకోట్‌పై మన దేశం సర్జికల్ దాడులు జరిపినపుడు పాకిస్తాన్ మన మిగ్21 బైసన్ అనే విమానాన్ని కూల్చివేసింది. దానికి గాను అమెరికా అందచేసిన ఎఫ్16విమానానికి అమెరికా నుంచే తెచ్చుకున్న మధ్యశ్రేణి క్షిపణి అమ్‌రామ్ అమర్చి కూల్చివేసింది. నాటికి మన దగ్గర అలాంటివి లేవు.ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఎఫ్16 విమానాలు, వాటికి అమర్చిన క్షిపణులను కూడా ధ్వంసం చేసే, దాడులు చేసే క్షిపణులను రష్యా ఇప్పుడు వినియోగిస్తున్నది.
ఇప్పుడు పాకిస్తాన్ సేకరిస్తున్న ఆయుధాల గురించి చెబుతుంటే కొంత మందికి రుచించదు. విపరీత అర్ధాలు తీసే ప్రబుద్ధులు కూడా ఉంటారు. ప్రతిదేశం తన భద్రతకు ప్రాధాన్యత ఇస్తుంది.ఇప్పుడు పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకొనేందుకు మన దేశం ఉన్న సమయంలో పాకిస్తాన్ ఆర్మీ చైనా నుంచి ఆధునిక క్షిపణులు సేకరిస్తున్నదని నిర్ధారణగాని వార్తలు వచ్చాయి. సాధారణ పరిస్థితి ఉన్నపుడే మనదేశం అమెరికా ఆంక్షలు, బెదిరింపులను కూడా ఖాతరు చేయకుండా రష్యా నుంచి ఆధునిక ఎస్`400 శామ్ వ్యవస్థలను కొనుగోలు చేసింది. ఎందుకు అంటే చైనా, పాకిస్తాన్ల నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు అని చెప్పారు. మూడిరటిని ఇప్పటికే మోహరించాము. ఇంకా రెండు వ్యవస్థలు రష్యా నుంచి రావాల్సి ఉంది. వాటిని ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించేందుకు, ఎక్కడికి కావాలంటే అక్కడికి తరలించవచ్చు. ఇవి అన్ని రకాల యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణులను గుర్తిస్తాయి, క్షిపణులతో వాటి మీద దాడులు చేస్తాయి.ఎనభై లక్ష్యాలను 380 కిలోమీటర్ల పరిధిలో ఛేదిస్తాయి. అందువలన పాకిస్తాన్ వైపు నుంచి వచ్చే ముప్పును ఎదుర్కోగల స్థితిలో మనదేశం ఉంది !
