Tags
BJP, BRS, CHANDRABABU, fair wages, indian corporate, minimum wage, Narendra Modi Failures, Revanth Reddy, tdp
ఎం కోటేశ్వరరావు
బడ్జెట్ ప్రక్రియలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హల్వా వంటకాన్ని ప్రారంభించారు. అంటే బడ్జెట్ ప్రతుల ముద్రణకు శ్రీకారం చుట్టారు. ఫిబ్రవరి ఒకటిన పార్లమెంటులో ప్రవేశపెట్టేంత వరకు సిబ్బంది ముద్రణాలయం నుంచి బయటకు వచ్చేందుకు వీల్లేదు. గతంలో ఏ వస్తువు మీద ఎంత పన్ను వేస్తారో, ఎంత తగ్గిస్తారో ముందుగానే వెల్లడి కాకూడదని అలా చేసేవారు. ఇప్పుడు పార్లమెంటుతో పని లేకుండానే జిఎస్‌టి కౌన్సిల్లో ముందుగానే అన్నీ నిర్ణయిస్తున్న తరువాత నిజానికి బడ్జెట్‌లో అంత రహస్యమేమీ ఉండదు. బడ్జెట్ ప్రవేశపెట్టేబోయే ముందు కేంద్ర ప్రభుత్వం వివిధ తరగతులతో సంప్రదింపులు జరపటం ఒక నాటకం తాము కోరుకున్న వారికి పెద్ద పీట వేయటం చేదు వాస్తవం. నిర్మలా సీతారామన్ వరుసగా ఆరు బడ్జెట్‌లు, ఒక తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టి మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును అధిగమించారు.మరో బడ్జెట్‌కు సిద్దం అవుతున్నారు. ఏ బడ్జెట్ చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లుగా కార్పొరేట్లకు పెద్ద పీటవేయటంలో కూడా ఆమె రికార్డు సృష్టించారు. తాజా బడ్జెట్ గురించి అన్ని తరగతులను చర్చలకు ఆహ్వానించారు గానీ రైతులను కావాలనే విస్మరించారు. ఎందుకంటే నరేంద్రమోడీకి ఇష్టం ఉండదు గనుక. అంచనాలకు దూరంగా వర్తమాన ఆర్థిక సంవత్సరంలో వృద్ది రేటు ఉంది. ఎందుకు అంటే జనాల వినియోగం తగ్గిపోవటం ఒక ప్రధాన కారణంగా చెబుతున్నారు. చిన్నప్పటి ఏడు చేపల కథను గుర్తుకు తెచ్చుకుంటే అందులో ఏడ్చిన పిల్లవాడు ఒక్కడైతే వర్తమాన కథలో ఎందరో. కానీ కేంద్రీకరణ అంతా వారిలో ఒకరైన వినియోగదారు మీదే ఉంది.
కమ్యూనిస్టులు వేతన పెంపుదల కోరగానే అనేక మంది విరుచుకుపడుతుంటారు. వీరికి పరిశ్రమలు,వ్యాపారాలు ఎలాపోయినా ఫరవాలేదు, కార్మికులకు వేతనాలు, అలవెన్సులు, బోనస్‌లు ఇంకా ఏవేవో పెంచాలంటారు, మొత్తం సంస్థలనే అప్పగించాలంటారు, వేరే పనేలేదని దుమ్మెత్తి పోస్తారు. నిజమే, వాటి గురించి చట్టాలు, నిబంధనలు ఉన్నవే కదా, వాటినే కమ్యూనిస్టులు అడుగుతున్నారు, దీనమ్మ జీవితం ! చట్టాలు అమలు జరగాలని, వాటి మేరకు పాలన జరగాలని కోరుకోవటం కూడా తప్పంటారా ? ఇది ప్రమాదకర పోకడ, తమదాకా వస్తే గానీ తెలియదు. కమ్యూనిస్టుల సంగతి సరే సాక్షాత్తూ కార్పొరేట్ల అధిపతులే వేతనాలు పెంచాలని, న్యాయంగా ఉండాలని చెబుతున్న సంగతి కళ్లుండీ చూడలేని, చెవులుండీ వినలేని వారికి ఎలా చెప్పాలి ! బెంగలూరు కేంద్రంగా పని చేస్తున్న వెంచర్ కాపిటల్ సంస్థ ఆరిన్, దాని చైర్మన్ మోహనదాస్ పాయ్. గతంలో ఇన్ఫోసిస్ కంపెనీ సిఎఫ్‌ఓగా పని చేశారు. ఆయన వేతనాల గురించి చెప్పిన మాటల సారం ఇలా ఉంది.(ఎకనమిక్ టైమ్స్ డిసెంబరు 19,2024) ‘‘ 2011లో ఇన్పోసిస్‌లో కొత్తగా చేరిన ఉద్యోగి ఏడాదికి రు.3.25లక్షలు పొందితే ఇప్పుడు రు.3.5 లేదా 3.75లక్షలు మాత్రమే తీసుకుంటున్నారు. పదిహేను శాతం ఎక్కువగా ఇస్తుండవచ్చు, పదమూడేండ్ల తరువాత దీన్ని ఎలా సమర్ధించాలి ? 2011లో కంపెనీ సిఇఓ ఎంత పొందారు ? ఇప్పుడు ఎంత ? న్యాయంగా ఉండాలి కదా ! మన వాణిజ్యం ద్రవ్యాశతో నీచకార్యాలకు పాల్పడే సంస్థలుగా(మెర్సినరీస్)గా మారాలని మనం కోరుకోకూడదు.లాభాల కోసం ప్రయత్నించటం తప్పుకాదు.తామెంతో న్యాయంగా ఉంటున్నట్లు యజమానులు చెప్పుకుంటున్నారు గనుక కంపెనీలు కూడా న్యాయంగా ఉండాలి. సిబ్బంది అత్యంత విలువైన సంపద అని చెబుతున్నారు గనుక దయచేసి చెప్పినట్లుగా చేయండి’’ అన్నార్ పాయ్. ఇదే ఒక కమ్యూనిస్టు చెబితే ఏ మీడియా అయినా దాన్ని అంత ప్రముఖంగా ప్రచురిస్తుందాప్రసారం చేస్తుందా ? అసలు వార్తగా అయినా ఇస్తుందా !
వేతన పెరుగుదల లేదా స్థంభన, నిజవేతనాలు పెరగకపోవటం గురించి తరచూ కమ్యూనిస్టులు, కార్మిక సంఘాలు మాట్లాడుతుంటాయి. కానీ ఇప్పుడు ఇతరులు మాట్లాడుతున్నారంటే నిజంగా వారికి కష్టజీవుల జీవితాల మీద ప్రేమ పుట్టుకువచ్చినట్లా ? ఇటీవలి కాలంలో కార్పొరేట్లకు ఆకాశాన్నంటే రీతిలో లాభాలు రావటం వెనుక నరేంద్రమోడీ అనుసరించే విధానాలు కారణం. అయితే ఆ మేరకు కార్మికులకు వేతనాలు పెరగకపోతే వినిమయ గిరాకీ తగ్గి మొదటికే మోసం వస్తుందని అదే మోడీ ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ స్వయంగా హెచ్చరించారు. పండుగల సమయాల్లో కూడా అమ్మకాల గురించి వాణిజ్యవేత్తలు పెదవి విరిచారు. ఇంటి దగ్గర భార్య ముఖాన్ని చూస్తూ ఎన్నిగంటలు గడుపుతారు, ఆదివారాలతో నిమిత్తం లేకుండా వారానికి 90గంటలు పని చేయాలని ఎల్ అండ్ టి అధిపతి సుబ్రమణ్యన్ సెలవిచ్చారు.పిల్లలు, పెద్ద వారిని వదిలేసి ఇద్దరూ 90 గంటలు పని చేయాలని అనలేదు. ఇన్పోసిస్ నారాయణ మూర్తి మరో 20 గంటలు తగ్గించి 70 అన్నారు. వీరందరికీ స్ఫూర్తి ఎవరంటే అత్యవసర పరిస్థితి ప్రకటించి ప్రస్తుతం జైలుపాలైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సక్ యోల్, అతగాడు 120 గంటలు చేయాలన్నాడు. యంత్రాలు కూడా నిరంతరం పని చేస్తే అరిగి చెడిపోతాయి గనుక కొంత విరామం, నిర్వహణ పనులు చేస్తారు. కార్మికులకు అదేమీ అవసరం లేదన్నది ఈ అపరమానవతా మూర్తుల ఉవాచ.
కంపెనీలు వేతనాలు సక్రమంగా ఇస్తున్నాయా అంటే లేదు, పని మాత్రం చేయాలి.నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో నమోదైన 500 కంపెనీలకు 2024 ఆర్థిక సంవత్సరంలో పన్నుల చెల్లింపు అనంతరం వచ్చిన లాభాలు 15 ఏండ్ల గరిష్టం అని అనంత నాగేశ్వరన్ చెప్పారు.జిడిపి వృద్ధి రేటు అంచనాలకంటే తగ్గినప్పటికీ ప్రపంచంలో అధికవృద్ధి మన దగ్గరే అని పాలకపార్టీ పెద్దలు తమ భుజాలను తామే చరుచుకుంటున్నారు. ఉపాధి రహిత వృద్ధి, వేతన వృద్ధి బలహీనంగా ఉన్నపుడు కార్పొరేట్లకు లాభాలు తప్ప శ్రామికులకు ఒరిగేదేమీ లేదు.ద్రవ్యోల్బణం పెరుగుదలతో వారిలో కొనుగోలు శక్తి పడిపోతున్నది. ఐటి రంగంలో వేతన వృద్ధి దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే పడిపోయింది. దానికి తోడు రూపాయి విలువ పతనంతో ఎగుమతులు ప్రధానంగా ఉన్న ఆ రంగంలోని కంపెనీలకు లాభాలే లాభాలు. వివిధ రంగాల్లోని నిపుణులైన కార్మికులు(వారిని బ్లూ కాలర్ వర్కర్స్ అంటున్నారు) జీవన వేతనం కోసం నిరంతరం సతమతం అవుతున్నారు. వర్క్ ఇండియా అనే సంస్థ నివేదిక ప్రకారం దేశంలో 57శాతం మంది ఈ కార్మికుల వేతనాలు నెలకు రు.20 వేలకంటే తక్కువే, 29శాతం మంది 2040వేల మధ్య పొందుతున్నారు. కార్పొరేట్ల నిలయం దవోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుల్లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడ పెట్టుబడులను ఆకర్షించేందుకు పడుతున్న తాపత్రయం మంచిదే. కానీ కార్మికులకు ఆర్థిక న్యాయం, గౌరవాన్ని కలిగించేందుకు అవసరమైన వేతనాలు ఇప్పించేందుకు ఏం చేస్తున్నారు. రెండు చోట్లా కోట్లాది మందిగా ఉన్న అసంఘటిత రంగ కార్మికుల కనీస అవసరాలు తీర్చే విధంగా దశాబ్దాలతరబడి సవరణకు నోచుకోని కనీసవేతనాల గురించి ఒక్క పలుకూ చేతా లేదు. వారి విజన్లలో కార్పొరేట్లు తప్ప కార్మికులకు చోటు లేదు.ఆకలి కేకలతో ఉన్న 80 కోట్ల మందికి మరికొన్ని సంవత్సరాలు ఉచితంగా ఐదేసి కిలోల ఆహార ధాన్యాలు ఇస్తానంటారు తప్ప చేసేందుకు ఉపాధి కల్పించి ఆత్మగౌరవంతో బతకటం విశ్వగురువు నరేంద్రమోడీ అజెండాలో లేదు.శ్రమజీవులు ముష్టిని కోరుకోరుకుంటారా ?
నైపుణ్యం పెంచినట్లు మోడీ పదేండ్లుగా చెబుతున్నారు.వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. రేవంత రెడ్డి విశ్వవిద్యాలయం ఏర్పాటు గురించి కబుర్లు చెబుతుంటే చంద్రబాబు నాయుడు నిపుణులు ఎంత మంది ఉన్నారో ముందు లెక్కతేలాలంటున్నారు.పదేండ్ల నుంచి నైపుణ్యాలు నిజంగా పెంచితే దానికి తగిన విధంగా వేతనాలు వాటికి అనుగుణంగా కార్మికుల వేతనాలు పెరగాలి, కానీ తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అన్ని రంగాల్లో ఆటోమేషన్ , దాంతో ఉత్పాదకత పెరుగుతోంది ఉపాధి తగ్గుతోంది, కంపెనీల లాభాలు పెరుగుతున్నాయి. న్యాయమైన వేతనాలు చెల్లించటం కేవలం నైతిక విధాయకమే కాదు నిరంతర వినియోగ గిరాకీ పెరగటానికి కూడా అవసరమే అని అనంత నాగేశ్వరన్ నొక్కి చెప్పారు. కార్పొరేట్ల లాభదాయకతకార్మికుల సంక్షేమం మధ్య తేడాను తగ్గించకపోతే దీర్ఘకాలంలో దేశ ఆర్థిక స్థిరత్వానికి పెద్ద ముప్పు పొంచి ఉన్నట్లే. దేశంలో కాంటాక్టు కార్మికుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది, పరిశ్రమలను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తారు, కార్మికులను మాత్రం తాత్కాలికం పేరుతో నియమిస్తారు. ఐటి రంగంలో సిఇఓవేల వేతనాలు చూస్తే గత ఐదేండ్లలో 5060శాతం పెరగ్గా దిగువ 20శాతం సిబ్బంది వేతనాలు 2025శాతం మాత్రమే పెరిగినట్లు మోహనదాస్ పాయ్ చెప్పారు. దిగువ 50శాతం మంది సిబ్బంది పెద్ద ఎత్తున దోపిడీకి గురవుతున్నారని కార్పొరేట్ సంస్థలు వారికి మెరుగైన వేతనాలివ్వాలని కూడా చెప్పారు. ఎక్కడైనా కమ్యూనిస్టులు లేదా కార్మిక సంఘాల నాయకత్వాన విధిలేని స్థితిలో కార్మికులు సమ్మెలకు దిగితే ఇంకేముంది సంస్థలు దివాలా అంటూ గుండెలు బాదుకొనే వారు పాయ్ చెప్పిందాన్ని ఏమంటారు ? దుకాణాలు, పరిశ్రమల్లో సహాయకులుగా ఉండే కాంట్రాక్టు కార్మికుల వేతనాలు గత ఐదేండ్లలో ఒకటి రెండుశాతమే పెరిగినట్లు అధ్యయనాలు తెలిపాయి.
కార్పొరేట్లు సంపదల పంపిణీకి వ్యతిరేకం, కానీ పరిమితంగా వేతనాలు పెరగాలని కోరకుంటున్నాయి. ఎందుకని ? మనదేశంలో పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం జరుపుతున్నారు, తమ ప్రయాణాలు సుఖవంతం, వేగవంతంగా జరిపేందుకు వేస్తున్నారని జనం భావిస్తారు, దాన్లో వాస్తవం లేకపోలేదు, టోల్ రూపంలో తగిన మూల్యం చెల్లిస్తున్నారన్నది వేరే అంశం. అదొక్కటే కాదు, జనం సొమ్ముతో రోడ్లను ప్రభుత్వం వేస్తే కాంట్రాక్టులు తీసుకొని లాభాలు పొందేది, నిర్వహణను తీసుకొని టోలు వసూలు చేసుకొనేది ప్రయివేటు కంపెనీలే.ఆర్థిక వ్యవస్థ మందగించినపుడు అమెరికాలో పెద్ద ఎత్తున రోడ్లు, వంతెనల వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి వివిధ కంపెనీల ఉత్పత్తులు పడిపోకుండా ఉద్దీపన ఇచ్చారు. మనదేశంలో జరుగుతున్నది కూడా అదే. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రాణాపాయంగా మారిన గర్భిణులను డోలీల ద్వారా ఆసుపత్రులకు చేర్చటం ఒకవైపు జర్రున జారే రోడ్ల మీద తుర్రుమంటూ ప్రయాణించే తీరు మరోవైపు చూస్తున్నాం. ఎందుకిలా ? ఎక్కడ లాభం ఉంటే అక్కడే పెట్టుబడులు. గతంలో కూడా కార్మికులకు యజమానులు వేతనాలిచ్చేవారు, అవి కుటుంబ సభ్యులు, వారు మరుసటి రోజు పనిచేయటానికి అవసరమైన శక్తినిచ్చేందుకు సరిపడా మాత్రమే. ఇప్పుడు ఉత్పాదకత ఎన్నో రెట్లు పెరిగి ఇబ్బడి ముబ్బడిగా ఉన్న సరకులు, సేవలు అమ్ముడు పోవాలంటే తగినంత మంది వినిమయదారులు కూడా ఉండాలి. అందుకే అవసరమైతే జనాలకు సబ్సిడీలు ఇచ్చి ఆ మేరకు మిగిలే సొమ్ముతో కొనుగోలు చేయించేందుకు చూస్తున్నారు. ఇంత చేసినా వినియోగం పెరగటం లేదు. ఎక్కువకాలం ఇలాగే ఉంటే పరిశ్రమలు, వాణిజ్యాలను మూసుకోవాలి. అప్పుడు కార్పొరేట్ల పెట్టుబడి వృధా అవుతుంది. కరోనా సమయంలో ఉచితంగా నగదు బదిలీ కూడా జరగాలని కొందరు సూచించారు, ఇప్పుడు వేతనాలు పెంచాలని తద్వారా జనం జేబుల్లోకి డబ్బు చేరాలని తమ సరకులు, సేవలకు మార్కెట్ కల్పించాలని చెబుతున్నారు. కమ్యూనిస్టులు చెబుతున్నట్లుగా హక్కుగా కోరేందుకు మాత్రం అంగీకరించరు.అవసరమైతే అణచివేస్తారు.
