Tags
BJP, Charlie Kirk, Donald trump, Far Right, Fascists, Indian cultural Fascists, Kirk Assassination, Nazis, RSS
ఎం కోటేశ్వరరావు
అమెరికా జనాభా 35 కోట్లు, తుపాకులు 50 కోట్లు, పెద్ద వారి దగ్గర సగటున 1.93 ఉన్నట్లు అంచనా. వాటిలో ఒక దానికి మూడుపదుల వయస్సున్న ఒక విశ్లేషకుడు, విద్వేష మితవాద ప్రచారకుడు చార్లీ కిర్క్ బలయ్యాడు. రోజుకు అమెరికాలో సగటున 131 మంది తుపాకులకు సమిధలవుతున్నారు. అలాంటి స్వేచ్చా గడ్డ మీద గుండెమీద చేయి వేసుకొని రోడ్ల మీదకు రావాలంటే రాజకీయ నేతలు భయపడుతున్నారు. భిన్న భావజాలం కలిగినవారి చేతుల్లో బలయ్యే స్థితి అమెరికాలో ఉంది. కిర్క్ హత్యపై అమెరికా, భారత్‌తో సహా యావత్ ప్రపంచ మీడియా గుండెలు బాదుకొంటోంది. అతడిని రెండు పదుల వయస్సు దాటిన టేలర్ రాబిన్సన్ అనే యువకుడు సెప్టెంబరు పదవ తేదీన కాల్చి చంపాడు. 31 ఏండ్ల కిర్క్ తన మిత్రుడు అంటూ 79 ఏండ్ల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందనతో పెద్ద ప్రచారం, చర్చ జరుగుతున్నది.ఈ నెల 21 కిర్క్ అంత్య క్రియలకు డోనాల్డ్ ట్రంప్ హాజరు కానున్నాడు. దేశవ్యాపితంగా జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని ఆదేశించాడు. ఇంత జరుగుతున్న తరువాత మితవాద శక్తులకు వాటికి మద్దతు ఇచ్చే మీడియా పెద్దలకు ఒంటి మీద దుస్తులు నిలుస్తాయా ? అందులోనూ మితవాద, కార్పొరేట్, పురోగామి భావాల వ్యతిరేక మీడియా ప్రపంచ వ్యాపితంగా రెచ్చిపోతున్న రోజులివి. అనేక మీడియా సంస్థలలో ని చేస్తున్న జర్నలిస్టులు కిర్క్ హత్య మీద స్పందించిన తీరు నచ్చని యాజమాన్యాలు ఉద్యోగాల నుంచి తొలగించేందుకు పూనుకున్నాయి.
అమెజాన్ కంపెనీ యజమాని జెఫ్ బెజోస్ నడిపే వాషింగ్టన్ పోస్టు పత్రికలో కరేన్ అటియా అనే ఆఫ్రో అమెరికన్ మహిళా జర్నలిస్టును యాజమాన్యం ఎలాంటి కారణం చెప్పకుండానే ఉద్యోగం నుంచి తొలగించింది. ఆమె అమెరికాలో రాజకీయ హింసను అరికట్టటం గురించి కబుర్లు చెప్పటం తప్ప చిత్తశుద్దితో నివారణకు తీసుకున్న చర్యలేమీ లేవని, పేరు పెట్టకుండా కిర్క్‌ను పరోక్షంగా విమర్శించినందుకు యాజమాన్యం ఈ చర్యకు పాల్పడింది. అనేక మంది జర్నలిస్టులపై ఇతర సంస్థలు సస్పెన్షన్ లేదా తొలగింపుకు పాల్పడినట్లు పెన్ అనే జర్నలిస్టుల సంస్థ పేర్కొన్నది. కిర్క్ హత్యతో సంబరాలు చేసుకున్న విదేశీయుల వీసాలను రద్దు చేస్తామని ట్రంప్ బృందం హెచ్చరించింది. వామపక్ష తీవ్రవాదులే హత్యకు కారకులను వారి అంతు చూస్తామని ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ బెదిరింపులకు దిగాడు. కిర్క్ హత్యకేసులో అనుమానితుడిని పట్టుకోక ముందే అదుపులోకి తీసుకున్నట్లు, తరువాత కొద్ది సేపటికే విడుదల చేసినట్లు భారతీయ సంతతికి చెందిన ఎఫ్‌బిఐ డైరెక్టర్ కాష్ పటేల్ చేసిన ప్రకటనపై దుమారం రేగింది. అతనా పదవికి పనికి రాడని తొలగించాలని కొందరు డిమాండ్ చేశారు. మరి కొందరు సమర్ధించారు.ముందుగా ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. ఏ భావజాలానికి చెందిన వారినైనా వ్యక్తిగతంగా హత్య కావించటం సమర్థించ కూడదు. అది భావదారిద్య్రం, సరకులేని బాపతు చేసే పని. యావత్ ప్రపంచంలో మితవాదం మీద భావజాల పోరు ఈనాటిది కాదు. పురోగామి శక్తులు అన్ని విధాలుగా సన్నద్దంగానే ఉన్నాయి. కిర్క్‌ను రాబిన్సన్ ఉద్రేకంతో చంపినట్లు కనిపిస్తున్నది. అయితే రాబిన్సన్ వామపక్ష భావజాలంవైపు ఆకర్షితుడు అయినందునే హత్య చేసినట్లు చిత్రించేందుకు చూస్తున్నారు. దానిలో భాగంగానే ఇటీవలి కాలంలో అతను వామపక్ష భావజాలం వైపు మొగ్గుతున్నట్లు కుటుంబ సభ్యులు, స్నేహితులు చెప్పినట్లు అటావా రిపబ్లికన్ గవర్నర్ స్పెన్సర్ కాక్స్ ఒక టీవీలో ఆరోపించాడు. చంపటానికి ముందు రాబిన్సన్ ఒక నోట్ కూడా రాశాడని పోలీసులు చెబుతున్నారు. మొత్తం మీద వామపక్ష శక్తుల మీద దాడి చేసేందుకు ఈ ఉదంతాన్ని వినియోగించుకొనేందుకు చూస్తున్నారన్నది స్పష్టంగా కనిపిస్తున్నది.
మన దేశంలో ఒక నరేంద్ర దబోల్కర్, ఒక గోవింద పన్సారే, ఒక కలుబుర్గి, ఒక గౌరీ లంకేష్ ఇలా అనేక మంది పురోగామి, హేతువాదులు, కుల, మతత్వ వ్యతిరేకులను హిందూత్వశక్తులు సంవత్సరాల తరబడి కాపుగాచి చంపినపుడు మన మీడియాలో పెద్దగా స్పందన లేదు. పచ్చి మితవాది చార్లీ కిర్క్ వయస్సు, అనుభవంతో పోల్చితే పైన చెప్పుకున్నవారందరూ మేథావులు. మన దేశంలో ”సాంస్కృతిక ఫాసిస్టులు ” గా తయారైన వారు ముందుకు తెచ్చిన హిందూత్వ భావజాలానికి గురైనవారి చేతిలో వారు బలయ్యారు. కిర్క్‌ను హత్య చేసిన రాబిన్సన్ 33 గంటల్లోగానే అరెస్టు అయ్యాడు. ఇదే మనదేశంలో పైన పేర్కొన్నవారి హత్యా ఉదంతాలలో ఎంత కాలం తరువాత అరెస్టులు చేశారో, కేసులు ఏమైందీ తెలిసిందే. ఉదాహరణకు గౌరీ లంకేష్ కేసులో నిందితులపై ఇంతవరకు విచారణే పూర్తి కాలేదు. అయినప్పటికీ వారిలో కొందరిని హీరోలుగా సన్మానించిన సంగతి తెలిసిందే. గౌరీ లంకేష్ కేసులో 18 మంది నిందితులు కాగా ఒక్కడు మినహా అందరూ అరెస్టయ్యారు, బెయిలు మీద దర్జాగా తిరుగుతున్నారు. వికాస్ పాటిల్ అనేవాడిని ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు పట్టుకోలేకపోయారు.ది న్యూస్ మినిట్ అనే వెబ్‌సైట్ వార్త 2024 అక్టోబరు 13 ప్రకారం నిందితుల్లో పరశురామ్ వాగ్మారే, మనోహర్ యదవే అనే వారిని సంఘపరివార్, శ్రీరామ్ సేన కార్యకర్తలు విజయపురాలో సన్మానించారు. అదే నెల 9వ తేదీన కోర్టు బెయిల్ మంజూరు చేయగానే 11న సన్మాన సభ. వార్తా భారతి అనే పత్రిక రాసిన మేరకు నిందితులు విజయపురాలోని కాళికా దేవి ఆలయంలో పూజ చేశారు, తరువాత శివాజీ విగ్రహానికి పూల మాలలు వేశారు. .
గౌరీ లంకేష్ ఒక జర్నలిస్టు, పురోగామి వాది. అలాగే చార్లీ కిర్క్ పచ్చి మితవాది, మీడియా రంగంలోనే ఉన్నాడు. తీవ్రవాద భావాలతో ఉన్న వామపక్ష వాదులు అద్భుతమైన చార్లీ కిర్క్ వంటి అమెరికన్లను నాజీలు, ఫాసిస్టులు, సామూహిక హత్యలు చేసేవారు, నేరగాండ్లుగా వర్ణిస్తున్నట్లు ట్రంప్ ఆరోపించాడు. అమెరికాలో ఏం జరుగుతోంది ? ఎవరు ఎవరిని చంపుతున్నారు. యాంటీ డిఫమేషన్ లీగ్ అనే సంస్థ పదేండ్ల నాటి పరిణామాల గురించి 2022లో ఒక అధ్యయనం జరిపింది.మూడింట రెండువంతులకు పైగా హత్యలు మితవాదులు చేసినవే అని తేలింది. మనదేశంలో మితవాద భావజాలాన్ని, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారిని జాతివ్యతిరేకులు,తుకడే తుకడే గాంగ్, కుహనా లౌకికవాదులు, అర్బన్ నక్సల్స్ అంటూ ముద్రవేసినట్లుగానే అమెరికాలో కూడా తీవ్రవాద వామపక్ష వాదులని, మరొకటిగా చిత్రించి వాళ్లను చంపినా ఫరవాలేదన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. చంపివేస్తున్నారు. న్యూయార్క్ మేయర్ పదవికి పోటీ చేస్తున్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి జోహ్రాన్ మమదానీ తాను కమ్యూనిస్టును కాదని పదే పదే చెప్పినా డోనాల్డ్ ట్రంప్ పక్కా కమ్యూనిస్టు అంటూ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. జోహ్రాన్ డెమోక్రటిక్ సోషలిస్టు గనుక అలా అన్నాడని అనుకుందాం. జో బైడెన్ గెస్టపో పాలన కొనసాగిస్తున్నాడని ట్రంప్ ఆరోపించాడు. గెస్టపో అంటే హిట్లర్ నాజీ పాలనలో ప్రత్యర్ధులను మట్టుపెట్టే రహస్య పోలీసు దళం. అలాంటపుడు జో బైడెన్ ఫాసిస్టు అయినట్లా ? మనదేశంలో మత, కుల దురహంకారాలు ఉన్నట్లే అమెరికాలో జాత్యంహకారం ఉంది.
చార్లీ కార్క్ హత్య జరిగింది ఎక్కడ ? మితవాదుల అడ్డాగా ఉన్న అటా వ్యాలీ విశ్వవిద్మాయలయంలో , తుపాకి సంస్కృతి ఎక్కడ మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతున్నదంటే మితవాదులు ఎక్కువగా ఉన్న రెడ్ రాష్ట్రాలలో అన్నది జగమెరిగిన సత్యం.2021లో ట్రంప్‌కు మెజారిటీ వచ్చిన పదింటిలో ఎనిమిది రాష్ట్రాలలో తలసరి తుపాకి మరణాలు లక్షకు 33.9 ఉన్నాయి. డెమోక్రాట్లు బలంగా ఉన్న మసాచుసెట్స్‌లో 3.4గా ఉంది. సామూహిక తుపాకి హత్యలు ఎక్కడ ఎక్కువగా జరుగుతున్నాయంటే మితవాదులు ఎక్కువగా ఉన్న చిన్న పట్టణాల్లో ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. రిపబ్లికన్ల తుపాకి విధానాలు వారినే బలితీసుకుంటున్నాయంటే అతిశయోక్తి కాదు.తుపాకి హింసాకాండను అరికట్టేందుకు కేటాయించిన బడ్జెట్‌లో ఈ ఏడాది ట్రంప్ యంత్రాంగం 15.8 కోట్ల డాలర్ల కోత పెట్టింది. మితవాదుల పట్ల అమెరికాలో ఎంత వ్యతిరేకత ఉందంటే కార్క్ హత్య వార్త వెలువడగానే కొందరు సైనికులు పండగ చేసుకున్నారని వార్తలు రాగా వారి సంగతి చూడాలంటూ రక్షణ మంత్రి హెగసేత్ ఆదేశించాడు. సామాజిక మాధ్యమంలో సాయుధ దళాలకు చెందిన వారితో సహా ఉద్యోగులు, టీచర్లు, ప్రొఫెసర్లు ఇంకా అనేక మంది హర్షం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారంటే చార్లీ కిర్క్ మీద ఉన్న ఆగ్రహానికి నిదర్శనంగా చెప్పవచ్చు.
ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవటం, అనుకరించటం ఈ రోజుల్లో ఎంతో సులభం.ప్రజలకు దూరమైన పాలకుల మీద శ్రీలంక జనం తిరుగుబాటు చేసిన తీరును బంగ్లాదేశ్‌లో అనుకరించారు, తాజాగా నేపాల్‌లో చూశాము. అదే విధంగా భావజాల రంగంలో కూడా అదే జరుగుతున్నదా ? అమెరికాలో చార్లీ కిర్క్ ఒక మితవాది, జాత్యహంకారి, అలాంటి వారు అన్ని రంగాలలో కోకొల్లలుగా ఉన్నారు. అతగాడిని చంపివేస్తే అనేక మంది పండగ చేసుకున్నారు. దాన్ని చూసిన తరువాత మనదేశంలో మితవాద జర్నలిస్టులు, లాయర్లు, ఇతర ప్రభావకులుగా పరిగణిస్తున్న ఆర్నాబ్ గోస్వామి, శాయి దీపక్, ఆనంద రంగనాధన్, వివేక్ అగ్నిహౌత్రి, అభిజిత్ అయ్యర్ మిశ్రా, స్మితా ప్రకాష్, మయూఖ్ రంజన్‌లకు అదే గతి పడుతుందనే పోస్టులు సామాజిక మాధ్యమంలో కొన్ని వచ్చాయి. అపహాస్యం చేస్తూ జోకులు కూడా వేశారు. అయితే వాటిని వామపక్ష శక్తులు, ఉదారవాదుల కలగా వర్ణిస్తూ కమ్యూనిస్టు వ్యతిరేకులు బురదచల్లేందుకు పూనుకున్నారు.నిజానికి అలాంటి పోస్టులను ఏ కమ్యూనిస్టూ, పురోగామి వాదీ కూడా సమర్ధించరు. పైన పేర్కొన్నవారు ఏ విధంగారెచ్చగొడుతూ మాట్లాడతారో, ఎలాంటి తిరోగామి భావ జాలాన్ని వ్యాపింపచేస్తున్నారో అందరికీ తెలుసు. వారి తీరు కమ్యూనిస్టులు కానివారికి కూడా ఆగ్రహం తెప్పిస్తున్నదంటే అతిశయోక్తి కాదు.పోస్టులు పెట్టిన వారికి ఎలాంటి భావజాలంతోనైనా సంబంధం ఉందోలేదో కూడా తెలియదు.మనదేశంలో మితవాద భావజాలానికి ధీటుగా సమాధానం చెప్పలేని దుస్థితిలో పురోగామి వాదులు లేరు.రాబిన్సన్ ఉపయోగించిన బుల్లెట్ మీద రేరు ఫాసిస్టు కాచుకో అని, మరోదాని మీద ఇటాలియన్ ఫాసిస్టు వ్యతిరేక పాటలోని ఒక చరణం రాసిి ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. అది నిజం కావచ్చు కల్పితమూ కావచ్చు. అమెరికాలో ఫాసిస్టు వ్యతిరేక భావజాలం పెరుగుతున్నందున రాబిన్సన్ కూడా స్పందించి ఉండవచ్చు.
ఐరోపా, అమెరికాలో ఇటీవలి కాలంలో పచ్చి మితవాదులు, వారిని వ్యతిరేకించేవారి సమీకరణలు పెరుగుతున్నాయి. దీనికి ఒక ప్రధాన కారణం ఆర్థికంగా ఆయా దేశాలు అనేక సమస్యలను ఎదుర్కోవటం. ఇలాంటి పరిస్థితి ఉన్నపుడు మూఢభక్తి, మితవాద భావనలు పెరగటానికి అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు లండన్‌లో వేలాది మంది వలసకార్మికులకు వ్యతిరేకంగా మితవాద శక్తుల పిలుపు మేరకు జరిగిన ప్రదర్శనలో b్గన్నారు. అనేక దేశాల్లో ఎన్నికల్లో ఇదొక ప్రధాన సమస్యగా మారుతున్నది. డోనాల్డ్ ట్రంప్ ఒక వైపు విదేశీ వస్తువుల మీద దిగుమతి పన్నులు వేస్తూ మరోవైపు విదేశీ కార్మికులు, విద్యార్థుల మీద తీవ్రమైన ఆంక్షలు పెట్టటం, అమెరికా నుంచి పంపివేసేందుకు ప్రయత్నించటాన్ని మనం చూస్తున్నాం. మనదేశంలో నరేంద్రమోడీ తన విధానాలను వ్యతిరేకించే వారందరికీ దేశద్రోహులని ఎలా ముద్రవేస్తున్నారో అమెరికాలో మితవాదులను వ్యతిరేకించే శక్తులను వామపక్షం, తీవ్రవాదవామపక్షం, కమ్యూనిస్టులుగా చిత్రించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనికి శ్వేజాతిదురహంకారం, ఆఫ్రో అమెరికన్ల పట్ల వివక్ష, ముస్లిం వ్యతిరేకత వంటివి తోడవుతున్నాయి. పాలస్తీనా విమోచన కోరుతున్న శక్తులకు, ఇజ్రాయెల్ మారణకాండకు వ్యతిరేకంగా విద్యార్ధులు ఉద్యమిస్తే ఆయా విద్యా సంస్థల మీద ట్రంప్ కక్ష తీర్చుకుంటున్నాడు. ఒక చిన్న ఉదంతం కూడా పెద్ద పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. యువతలో గూడుకట్టుకున్న అసంతృప్తి సాధారణంగా ప్రదర్శనలు ధర్నాల రూపంలో ప్రదర్శితమౌతుంది. కానీ నేపాల్‌లో అలాంటి సూచనలేమీ లేకుండానే కేవలం సామాజిక మాధ్యమాల మీద ఆంక్షలు విధించటాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున వీధుల్లోకి రావటం బహుశా ప్రపంచంలో ఇదే మొదటి సారి.వారి వెనుక విదేశీశక్తులున్నాయనే మాట వినిపిస్తున్నప్పటికీ బయటకు కనిపించింది సామాజిక మాధ్యమాల అదుపుపై నిరసనే అన్నది వాస్తవం.మనదేశంలో సాంస్కృతిక సారధుల పేరుతో సంఘపరివార్‌కు చెందిన వారు ఎలా తయారువుతున్నారో అమెరికాలో చార్లీ కిర్క్ కూడా యుక్త వయస్సు నుంచే మితవాదభావజాల సైనికుడిగా తయారయ్యాడు. ఫాక్స్ న్యూస్ వంటి మీడియా సంస్థలు అలాంటి వారిని వామపక్ష భావజాలంపై దాడికి వినియోగించాయి.మన దేశంలో కూడా అలాంటి ధోరణులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అందుకే కిర్క్ హత్య తరువాత అలాంటి శక్తుల మీద సామాజిక మాధ్యమంలో అలాంటి వారికీ అదే గతి పడుతుంది లేదా పట్టాలని స్పందించారు, వీటి నుంచి అందరూ గుణపాఠాలు తీసుకోవాల్సి ఉంది.
