Tags
#Indian Farmers, BJP, farm crisis, India export and import policy, Narendra Modi Failures, Rice export Ban
ఎం కోటేశ్వరరావు
బాస్మతి బియ్యం ధర 28శాతం పతనం, టమాటా ధర 70 శాతం దిగజారుడు, పదేండ్ల కనిష్టానికి సోయా ధర. బియ్యం ఎగుమతుల పతనం. గత వారంలో వచ్చిన కొన్ని వార్తల సారాంశమిది. కొన్ని చోట్ల తగినన్ని వర్షాలు పడలేదని, మరికొన్ని చోట్ల అధికంగా ఉన్నట్లు కూడా చెబుతున్నారు.సెప్టెంబరు ఆఖరు వరకు ఖరీఫ్ పంటల సాగు చేయవచ్చు, ఇప్పటి వరకు అందిన వార్తల మేరకు గతేడాది కంటే సాగు పెరిగింది. పంటలు పెరిగి రైతాంగానికి తగిన ధరలు వస్తే అంతకంటే కావాల్సిందేముంది ! ఆగస్టు మూడవ వారానికి అందిన వివరాల మేరకు దేశం మొత్తంగా 2024-25 ఖరీఫ్ సాధారణ సాగులో 94.13శాతం అంటే 10.316 కోట్ల హెక్టార్లలో పంటలు వేశారు. దీనికి మంచి వర్షాలే కారణమని వ్యవసాయశాఖ పేర్కొన్నది. కీలకమైన ధాన్యం, పప్పుధాన్యాలు,నూనె గింజలు, చెరకు, పత్తి సాధారణం కంటే 2.08శాతం పెరిగితే, ఒక్క వరి సాగే గతేడాదితో పోల్చితే 19.57శాతం పెరిగి 3.69 కోట్ల హెక్టార్లకు(ఒక హెక్టారు రెండున్నర ఎకరాలకు సమానం) చేరింది.చిరుధాన్యాల సాగు పెరిగింది. నూనె గింజల సాగు సాధారణం కంటే తగ్గింది. ఇటీవలి కాలంలో ఆహార ధరల ద్రవ్యోల్బణం పెరుగుదల నరేంద్రమోడీ సర్కార్‌కు చెమటలు పట్టించింది.ఖరీఫ్ సాగు పెరుగుదల కారణంగా వినియోగదారులకు ధరలు తగ్గవచ్చనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది మంచిదే కానీ రైతుల గిట్టుబాటు మాటేమిటి ? ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను మొత్తంగా చూసినపుడు ఒక్క కార్పొరేట్ వాణిజ్య సంస్థలకు తప్ప ఎవరికీ అలాంటి మేలు చేసిన దాఖలా లేదు. రానున్న రోజుల్లో మేలు చేస్తాయా, కీడు కలిగిస్తాయా అన్నదే అనూహ్యం. ఒక విధంగా చెప్పాలంటే పిచ్చోడి చేతిలో రాయిలా పరిస్థితి ఉంది.
ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఉత్తరా ఖండ్ మరికొన్ని ప్రాంతాల్లో కోటీ 50లక్షల హెక్టార్లలో సాగు చేసే బాస్మతి రకం బియ్యం కొత్త పంట ఇంకా మార్కెట్‌కు రాక ముందే గతేడాది కంటే మూడోవంతు ధర పతనమైంది. క్వింటాలు గతేడాది ఇదే రోజుల్లో రు.3,200 నుంచి 3,500 వరకు ఉంటే ఇప్పుడు రెండున్నర వేలకు తగ్గింది. దీంతో స్వయంగా బిర్యానీ వండుకు తినేవారికి కాస్త కలసి వచ్చిందిగానీ, ఏ హౌటల్లోనూ ధరలు తగ్గించకపోగా పెంచారు. గతేడాది అక్టోబరు, నవంబరు నెలల్లో నాలుగు వేల నుంచి 4,800వరకు పెరిగాయి. ధరల పతనానికిి ప్రధాన కారణం ప్రభుత్వ ఎగుమతి విధానమే అంటున్నారు. ఒక టన్ను బియ్యం కనీస ఎగుమతి ధర(ఎంఇపి) 950 డాలర్లకు తగ్గకూడదని కేంద్రం నిర్ణయించింది. గతేడాది ఉత్పత్తి నాలుగో వంతు పెరిగింది, ఈ ఏడాది వర్షాలు బాగున్న కారణంగా మరో 15శాతం పెరిగవచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది ఉత్పత్తి నిల్వలు గణనీయంగా ఉన్నాయి. ఇలా పలు కారణాలు ధరల పతనానికి దారితీసింది. ప్రస్తుత సీజన్‌లో ఏ గ్రేడ్ రకం వరి మద్దతు ధర రు.2,320గా నిర్ణయించారు. బాస్మతి ధరలు కూడా దానికి దగ్గరగా ఉన్నాయి. కనీస ఎగుమతి ధర 950డాలర్లుగా ఉండటమే ధరల పతనానికి ప్రధాన కారణమని బియ్యం ఎగుమతిదార్ల అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు విజరు సేటియా చెప్పారు. ఇంత ధరతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఎగుమతికి పోటీ పడలేమని అన్నారు. అది రైతాంగానికి చెల్లించే ధర తగ్గటానికి కూడా దోహదం చేస్తున్నదన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఎగుమతి ధర 700 డాలర్లుగా మాత్రమే ఉందని, అందువలన వారికి ఎక్కువ అవకాశాలుంటాయిని హర్యానా బియ్యం ఎగుమతిదార్ల అధ్యక్షుడు సుశీల్ జైన్ చెప్పారు.
బాస్మతేతర బియ్యం ఎగుమతుల మీద నిషేధం ఉంది, కొన్ని మినహాయింపులతో ఎగుమతులు చేయాలన్నా థారులాండ్, వియత్నాం ధరలతో పోటీపడలేక ఎగుమతులు పతనమయ్యాయి. గతంలో ఈ రెండు దేశాల ధరల కంటే మన బియ్యం ధర తక్కువ ఉంది. ఉదాహరణకు ఐదుశాతం ముక్కలైన పార్‌బాయిల్డ్ బియ్యం థారులాండ్ టన్ను 565 డాలర్లకు ఇస్తే మనదేశం ఇచ్చే ధర 540 నుంచి 545కు పెరిగింది. దీనికి పన్ను అదనం. ఇలా తేడా తగ్గుతున్న కారణంగా మన ఎగుమతుల మీద ప్రతికూల ప్రభావం పడుతున్నది. మనకంటే ధర ఎక్కువగా ఉన్నప్పటికీ వియత్నాం ఎగుమతులు ఇటీవలి కాలంలో పెరిగాయి. బాస్మతేతర రకాల బియ్యం, గోధుమ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఎన్నికలకు ముందు ధరలు పెరిగితే తమ విజయావకాశాల మీద ప్రతికూల ప్రభావం పడుతుందనే ముందు చూపుతోనే ఈ పని చేశారన్నది స్పష్టం.దాన్లో భాగంగానే భారత బియ్యం, గోధుమల పేరుతో కొన్ని అమ్మకాలను ప్రారంభించారు.ఎగుమతులపై నిషేధం వలన జరిగిందేమిటి ? మనం రంగంలో లేకపోవటంతో ప్రపంచ మార్కెట్‌లో ధరలు పెరిగాయి.థారు బియ్యం ధర 20శాతం పెరిగింది, ఆ మేరకు రైతాంగానికి కొంత మేలు జరిగింది. మన నుంచి కొనుగోలు చేసే ఖాతాదారులు ఇతర దేశాల వారితో ఖాతాలు కుదుర్చుకున్నారు. ఎన్నికలు ముగిసిన తరువాత కూడా ఎగుమతి ఆంక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అందువలన ఒక నిర్ణయం తీసుకొనే వరకు అనిశ్చితి కొనసాగుతూనే ఉంటుంది. రైతుల పంట చేతికి రాక ముందే ఏదో ఒకటి తేల్చాలి. తీరా అయినకాడికి తెగనమ్ముకున్న తరువాత ఎగుమతి ఆంక్షలు ఎత్తివేస్తే అది బడా వ్యాపారులకే లాభం. వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి మూడు మాసాల్లో గతంతో పోల్చితే మామూలు బియ్యం ఎగుమతులు 34శాతం తగ్గాయి.
రెండింజన్ల పాలనతో నేరుగా స్వర్గానికి తీసుకుపోతామని బిజెపి చెబుతోంది. అలాంటి స్వర్గదారిలో ఉన్న మధ్య ప్రదేశ్‌లో సోయా గింజల ధరలు క్వింటాలు ధర రు.3,500 నుంచి రు.4,000 పడిపోయిందని ఇది కనీస మద్దతు ధర రు.4,850 కంటే తక్కువే కాదు, పదేండ్ల కనిష్టం అని వార్త. కొత్త పంట చేతికి రాక ముందే ఇలా ఉంటే వచ్చిన తరువాత పరిస్థితి ఏమిటని రైతాంగం ఆందోళన చెందుతోంది. అక్కడ బిజెపి అధికారంలో ఉంది.కేంద్ర సిఏసిపి చెప్పినదాని ప్రకారం ఒక క్వింటాలు ఉత్పత్తి ఖర్చు రు.3,261గా ఉంది. సోయాబీన్ ప్రోసెసర్స్ అసోసియేషన్ సమాచారం ప్రకారం 2013-14లో సగటు మార్కెట్ ధర రు.3,823 ఉంది. గతేడాది ఐదువేల వరకు రైతులు పొందారు.దేశంలో మధ్యప్రదేశ్‌లో ఎక్కువగా సోయా సాగు చేస్తారు.ధరల పతనానికి కారణం ఏమిటి ? వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిన పూర్వరంగంలో ఓటర్ల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకొనేందుకు దిగుమతి చేసుకొనే సోయా నూనె మీద ఉన్న 32శాతం దిగుమతి పన్నును నరేంద్రమోడీ సర్కార్ 12.5శాతానికి తగ్గించింది. దీంతో చౌకగా అర్జెంటీనా, బ్రెజిల్, అమెరికా నుంచి దిగుమతులు పెరిగాయి.ప్రపంచ ఉత్పత్తిలో ఈ మూడింటి వాటా 95శాతం ఉంది. మన వాటా 2.5 నుంచి మూడుశాతం మధ్య ఉంటోంది. గతేడాది ఆ దేశాల్లో ఉత్పత్తి తగ్గటంతో ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ ఏడాది మంచి పంట ఉంటుందనే అంచనాలు వెలువడటంతో మనదగ్గర ధరలు పతనమయ్యాయి.కొద్ది వారాల క్రితం 25కిలోల టమాటాల ధర రు.900 నుంచి వెయ్యి రూపాయల వరకు ఉన్నది కాస్తా ఇప్పుడు దేశంలో అనేక చోట్ల రు.300కు పడిపోయింది.పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంచాలని చెప్పటమే తప్ప రైతాంగానికి తగిన ప్రోత్సాహం, ఇబ్బందులు లేని పరిస్థితిని కల్పించటం లేదు. మధ్య ప్రదేశ్‌లో పెసర రైతులు పంటను అమ్ముకొనేందుకు నిరసన తెలపాల్సి వచ్చింది, అమ్ముకున్న తరువాత రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో డబ్బు చెల్లించని స్థితి. కొనుగోలు తరువాత ఏడు రోజుల్లో ఇస్తామన్నది ఆరువారాలు గడచినా ఖాతాలలో పడటం లేదని వార్తలు. అంతకు ముందు ప్రతి రైతు నుంచి ఎకరానికి ఇన్ని క్వింటాళ్లే అనే నిర్ణీత పరిమాణానికి మించి కొనుగోలు చేసేది లేదని, అది కూడా నిర్ణీత సమయానికి తెస్తేనే అని నిబంధనలు పెట్టటంతో రైతులు ఆందోళన చేయాల్సి వచ్చింది.
ఎన్నికల కోసం తప్ప రైతాంగ ప్రయోజనాలను కాపాడేందుకు ఒక జవాబుదారీతనంతో కూడిన విధానం కేంద్రం వద్ద లేదు. ఉదాహరణకు గతంతో పోల్చితే ఎరువుల సబ్సిడీని ఈ ఏడాది తగ్గించింది.మరోవైపు ధరల పెరుగుదల నియంత్రణలో భాగంగా దిగుమతులు చేసుకొనే ముడి పామ్, సోయా,పొద్దుతిరుగుడు నూనెల మీద ఉన్న డ్యూటీని పూర్తిగా రద్దు చేసింది.వీటి మీద ఉన్న సెస్‌ను 20 నుంచి ఐదు శాతానికి తగ్గించింది.శుద్ధి చేసిన సోయా, పామ్,పొద్దుతిరుగుడు ఆయిల్ మీద దిగుమతి పన్ను గణనీయంగా తగ్గించింది. పప్పు ధాన్యాల దిగుమతుల మీద పన్ను పూర్తిగా రద్దుచేసింది. వీటి ప్రభావం రైతుల మీద ప్రతికూలంగా పడే అంశాన్ని విస్మరించింది.దేశంలో పప్పు, చమురు గింజల దిగుబడిని పెంచితేనే రైతు వాటి సాగు పట్ల ఆసక్తి చూపుతాడు. అందుకు ప్రభుత్వాలే అవసరమైన పరిశోధనలు, నూతన వంగడాలను రూపొందించాల్సి ఉంటుంది.అదేమీ పెద్దగా కనిపించదు. ధరల స్థిరీకరణ నిధి(పిఎస్‌ఎఫ్) గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పటం తప్ప బడ్జెట్ కేటాయింపులు – ఖర్చు చేసిందీ నామమాత్రమే.2023లో 1500 కోట్లు కేటాయించి అసలు ఖర్చేమీ చేయలదని, మరుసటి సంవత్సరం బడ్జెట్‌లో ఖాతా మూతపడకుండా కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమే కేటాయించినట్లు వార్తలు వచ్చాయి.
వర్తమాన ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది ప్రాధాన్యతలతో బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రతి బడ్జెట్‌లో ఇలాంటి కబుర్లనే చెబుతున్నారు. పాతవాటిని మరచిపోతున్నారు. అన్నింటికంటే కేటాయింపులు ప్రకటిత లక్ష్యాల సాధనకు పనికి వస్తాయా ? గత అనుభవం ఏమిటన్న సమీక్ష ఎప్పుడైనా చేశారా అన్న అనుమానం కలుగుతోంది. ద్రవ్యోల్బణ పెరుగుదల రేటులోనైనా నిధులు కేటాయిస్తే అదొకదారి లేకపోతే నిజనిధులు తగ్గినట్లే.లాబ్ టు లాండ్ అంటే పరిశోధన నుంచి పంటపొలాలకు అనే మాటలు ఎప్పటి నుంచో వింటున్నాము.ఉత్పాదకత పెంపుదల, వాతావరణానికి అనుగుణమైన విత్తనాలు, ఖర్చుల తగ్గింపు, చీడపీడల నివారణ తదితర రంగాల్లో పరిశోధనలు జరిపి వాటిని అభివృద్ధి చేయకుండా రైతాంగానికి ఎలాంటి మేలు చేయలేము. మొత్తం వ్యవసాయ పరిశోధనను సమీక్షిస్తామని నిర్మలమ్మ చెప్పారు. గతేడాది వ్యవసాయ విద్య, పరిశోధనలకు కేటాయించిన మొత్తం రు.9,876 కోట్లు, దీనిలో ఖర్చు పెట్టినదెంతో కోత పెట్టిందెంతో తెలియదు గానీ ఈ ఏడాది కేటాయింపు రు.9,941 కోట్లు కేవలం 65 కోట్ల పెంపుదలతో మొత్తం కార్యకలాపాలను ఎలా పెంచుతారు ? సేంద్రీయ సాగు గురించి ఎన్నో కబుర్లు చెబుతారు.దీనికి గాను గతేడాది రు.459 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది కేవలం వంద కోట్లు మాత్రమే. రానున్న రెండు సంవత్సరాల్లో రెండు కోట్ల మంది రైతులతో ఈ సాగు చేయిస్తామని కేటాయించిన మొత్తం 365 కోట్లు మాత్రమే. ప్రతి బడ్జెట్‌లో ఇలాంటి కబుర్లే చెబుతున్నారు. ఇలా కాలక్షేప సాగుతో నరేంద్రమోడీ పదేండ్లుగా గడుపుతున్నారు. అందుకే వ్యవసాయ రంగంలో పరిస్థితి దిగజారుతోంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రైతాంగం ఇచ్చిన ప్రతికూల తీర్పును చూసైనా నేర్చుకుంటారా అంటే కనిపించటం లేదు. పోగాలము దాపురించినపుడు ఎవరూ ఏమి చేయలేరు !
