Tags
Agri subsidies, BJP, Donald trump, Handling US Tariffs, India’s Poultry Industry, Indian Dairy Farmers, indian farmers, Indian poultry farmers, Narendra Modi Failures, Raghu ram rajan
ఎం కోటేశ్వరరావు
అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ విధించిన వాణిజ్య ఒప్పంద బెదిరింపు గడువు ఆగస్టు ఒకటవ తేదీ దగ్గరపడుతున్నది. ఏం చేస్తే దేశీయంగా ఏ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న ఆందోళనలో ప్రధాని నరేంద్రమోడీ ఉన్నారు. జూలై 21వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్‌తో పాటు వాణిజ్య ఒప్పందం గురించి ప్రతిపక్షాలు నిలదీసే అవకాశం ఉంది. ఇరుదేశాల లావాదేవీలలో పైచేయిగా ఉన్నా ఒకటికి పదిసార్లు మనవారు ట్రంప్ గడప తొక్కటమే ఒక బలహీన సూచన. ఇండోనేషియాతో కుదుర్చుకున్న ఒప్పందం మాదిరే భారత్‌తోనూ ఉండబోతోందని ట్రంప్ ఇప్పటికే ఒక లీకు వదిలాడు.వాణిజ్య చర్చల్లో డోనాల్ట్ ట్రంప్‌తో జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా విదేశీ సబ్సిడీలు ఎక్కువగా ఉండే వ్యవసాయరంగంలో కుదుర్చుకొనే ఒప్పందాలు దేశంలోని చిన్న రైతులకు హానికరంగా ఉంటాయని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. పిటిఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఎలాంటి ఆటంకాలు లేని వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు హానికలిగిస్తాయన్నారు. బహుశా ఇండోనేషియా ఒప్పందం గురించి ఉప్పంది ఉంటుంది.మన దేశంలోకి బయటి నుంచి మరిన్ని పాల ఉత్పత్తులను స్వాగతించటం కంటే ఆ రంగంలో విలువ ఆధారిత ఉత్పత్తుల పెంపుదలకు ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించాలని రాజన్ చెప్పారు. అమెరికా పన్నులతో ఆరు నుంచి ఏడు శాతం మధ్య ఉన్న మన జిడిపి వర్తమాన వృద్ధి రేటు స్వల్పంగా తగ్గుతుందని, చైనా వస్తువులపై పన్నులు ఎక్కువగా ఉన్నందున ప్రత్నామ్నాయంగా మన ఎగుమతులు పెరగవచ్చని అన్నారు.
లోకం దృష్టిలో ఎంతటి సమర్ధులైనా ఏదో ఒక సమయంలో ఏదో ఒక సమస్యతో అల్లాడిపోకతప్పదు. ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ స్థితి అదేనా ? కరవ మంటే కప్పకు, విడవ మంటే పాముకు కోపం తెలిసిందేగదా ! ఇక్కడ భారతీయులు కప్పలు, అమెరికా కార్పొరేట్లు పాములు. సుత్తిలేకుండా సూటిగా చెప్పాలంటే మన మార్కెట్‌ను తెరవాలని ట్రంప్ వత్తిడి తెస్తుంటే మన జనాలు ఎలా స్పందిస్తారో అని మోడీ ఎటూతేల్చుకోలేకపోతున్నారు. జూలై తొమ్మిదవ తేదీలోగా ఒప్పందంపై సంతకాలు జరగాల్సిందే అని వత్తిడి చేసిన డోనాల్డ్ ట్రంప్ ఆగస్టు ఒకటవ తేదీ వరకు గడువు పొడిగించాడు. ఒప్పందం కుదిరిందన్నట్లుగా ఎప్పటి నుంచో పదేపదే చెబుతున్నప్పటికీ మన పాలకులు మౌనం తప్ప మాటలేదు. మీడియాలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి.అయినా స్పందన లేదు. పోనీ ప్రతిపక్షాలను పిలిచి సమస్యలు, సవాళ్ల గురించి ఏదైనా సలహాలు తీసుకున్నారా అంటే అదీ లేదు, అంతా గుంభనం.
భారత్‌తో కుదిరే ఒప్పందం ఇండోనేషియాతో కుదిరిన దానికి ప్రతిబింబంగా ఉంటుందని ట్రంప్ సూచన ప్రాయంగా చెప్పాడు. ఆగస్టు ఒకటవ తేదీలో ఒప్పందానికి రాకుంటే ఇండోనేషియా ఉత్పత్తులపై 32శాతం దిగుమతి పన్ను విధిస్తామని లేఖా బెదిరింపులో పేర్కొన్నాడు. పద్దెనిమిది బిలియన్ల డాలర్ల మేర వాణిజ్య మిగులుతో ఉన్న ఇండోనేషియాతో కుదిరిన ఒప్పందం ప్రకారం 32కు బదులు 19శాతం పన్ను విధిస్తారు. అయితే అమెరికా వస్తువులపై ఇండోనేషియాలో ఎలాంటి పన్నులు ఉండవని ట్రంప్ చెప్పాడు. పశుపెంపకదారులు, రైతులు, మత్స్యకారుల ఉత్పత్తులను సులభంగా ఇండోనేషియాలో అమ్ముకోవచ్చని అన్నాడు. అయితే ఒప్పంద వివరాలు ఇంకా వెల్లడి కాలేదు గానీ, నామ మాత్ర పన్నులు ఉండవచ్చని భావిస్తున్నారు. ఇది ఇండోనేషియాకు నష్టదాయకమని నిపుణులు వ్యాఖ్యానించారు. అమెరికా వస్తువులకు పూర్తి మార్కెట్‌ను తెరుస్తారు. బోయింగ్ 777 రకం 50విమానాలను, 15బిలియన్ డాలర్ల ఇంథనం, 4.5 బిలియన్ డాలర్ల వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఇండోనేషియా అంగీకరించింది. వారు విమానాలను ఆమ్ముకోవాలి, మాకు వాటి అవసరం ఉందని అధ్యక్షుడు ప్రభువు సుబియాంతో చెప్పాడు. ఎలాంటి పన్నులు లేకుండా అమెరికా వస్తువులను దిగుమతి చేసుకుంటున్నారా అన్న ప్రశ్నకు సూటిగా చెప్పకుండా ప్రతిదాన్నీ సంప్రదిస్తున్నామని మాత్రమే అన్నాడు. పాదరక్షలు, దుస్తులు, పామాయిల్‌ను ఇండోనేషియా ఎగుమతి చేస్తున్నది.
పరస్పర లబ్ది చేకూర్చే నూతన యుగం అని ఒప్పందం గురించి ఇండోనేషియ నేత ప్రభువు వర్ణించగా కొత్త పన్నుల విధానంతో గణనీయ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షిస్తామని, ఎగుమతులు పెరుగుతాయని వాణిజ్య మంత్రి బుడి సంతోసో అన్నాడు. ఒప్పందం ప్రతికూలంగా ఉంటుందని ఒక ఇండోనేషియా అధ్యయన సంస్థ డైరెక్టర్ భీమా యుధిష్టిర చెప్పాడు.(ఇండోనేషియాలో ముస్లింల పేర్లు మహాభారత, రామాయణ,పురాణాల్లోవే ఎక్కువగా ఉంటాయి). ఎగుమతులు పెరిగినా అమెరికా నుంచి దిగుమతులు ఇబ్బడిముబ్బడి అవుతాయన్నాడు. వియత్నాం పోటీ సామర్ధ్యం ఎక్కువ, రెండు దేశాలకు పన్నుల్లో ఇండోనేషియాకు ఒకశాతమే తక్కువ గనుక పోటీలో నష్టపోతామని చెప్పాడు. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులు స్థానికంగా ఉత్పత్తి చేసేవే అయితేగనుక దేశీయ పరిశ్రమలకు దెబ్బ అని ప్రొఫెసర్ విశాంతి చెప్పారు. స్థానిక వస్తువుల బదులు విదేశీ వస్తువులతో మార్కెట్‌ను నింపితే ప్రతికూలమే అని అమె అన్నారు.
గూగుల్‌తల్లిని అడిగితే కృత్రిమ మేథ రూపంలో అందించిన సమాచారం ప్రకారం అమెరికాలో కోడి మాంసం ధరలు అన్ని చోట్లా ఒకే విధంగా లేవు.ఉదాహరణకు సెలీనా వాముసీ వివరాల మేరకు పౌండు(450గ్రాములు) ధర 1.6 నుంచి 2.97 డాలర్ల వరకు ఉంది. అదే గ్రేజ్‌కార్ట్ వివరాల ప్రకారం డజను కోళ్ల ధర 428 డాలర్లు, ఒక్కొక్కదాని ధర 35.67 డాలర్లు, ఒక్కో కోడి సగటున 4.2 పౌండ్లు, అంటే రెండు కిలోలకు వంద గ్రాములు తక్కువ.హడ్సన్ వాలీ కోళ్ల ఫారంలో 4 పౌండ్ల బరువు ఉండే ఒక మొత్తం కోడి ధర 18 డాలర్లు. చికెన్ బ్రెస్ట్ ధర పౌను 8.5 నుంచి 12 డాలర్ల వరకు, కోడి డ్రమ్‌స్టిక్స్ వెల 4.99, కాళ్ల ధర 5.36 డాలర్ల వరకు ఉంది. అమెరికాలో కోడి కాళ్లు తినరు. అందుకే బ్రెస్ట్, కాళ్ల ధరలో అంత తేడా ఉంది. ఎప్పటి నుంచో అమెరికన్లు తమ దగ్గర గుట్టలుగా పడిఉన్న కోడి కాళ్లను మన దేశానికి ఎగుమతి చేయాలని చూస్తున్నారు. అమెరికాతో పోలిస్తే మనదేశంలో కోడి మాంసం ధర తక్కువ. అందువలన అంతకు మించి ఎక్కువ ఉంటే దిగుమతి చేసుకున్న సరకును కొనుగోలు చేసే అవకాశం లేదు. కనుక మన ధరలకు సమానంగా ఉండేట్లు చూస్తారు. అందుకు గాను అమెరికా ప్రభుత్వం పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇస్తుంది, మన ప్రభుత్వం దిగుమతులపై సుంకాన్ని గణనీయంగా తగ్గించాల్సి ఉంటుంది. అదే జరిగితే మన కోళ్ల పరిశ్రమ కుదేలే.
తమ కోడి మాంస ఉత్పత్తులకు మార్కెట్ తెరవాలని, దిగుమతి పన్ను తగ్గించాలని అమెరికా పదేండ్ల క్రితమే మోడీ సర్కార్ మీద వత్తిడి తెచ్చింది. దాన్ని మన యావత్ పరిశ్రమ వర్గాలు వ్యతిరేకించాయి.వెనక్కు తగ్గిన కేంద్రం తరువాత ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల పేరుతో టర్కీ, బాతు మాంసంపై ఉన్న 30శాతం పన్నును ఐదుశాతానికి తగ్గించింది. కోళ్ల ఉత్పత్తులపై వందశాతం పన్ను అమలు చేస్తున్నారు.చిన్నా, పెద్ద రైతులు, వారి మీద ఆధారపడిన వారు కోళ్ల పెంపకంలో 30లక్షల మంది ఉన్నారు. అమెరికా తెస్తున్న వత్తిడిలో జన్యుమార్పిడి మొక్కజొన్నల దిగుమతి కూడా ఒకటి. ఇది కూడా మన రైతాంగాన్ని దెబ్బతీసేదే. మొక్క జొన్నల దిగుమతి అనుమతించాలని కోళ్ల పరిశ్రమవారు, కూడదని సాగు రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇది మిత్ర వైరుధ్యం.ఎవరి లాబీ బలంగా ఉంటే వారి ప్రయోజనం నెరవేరే అవకాశం ఉంది, అయితే దానికి ప్రతికూల ఫలితాలను కూడా పాలక పార్టీ అనుభవించాల్సి ఉంటుంది. శ్రీలంకలో కోడి మాంస ఉత్పత్తుల దిగుమతులను అనుమతించటంతో అక్కడి పరిశ్రమ దెబ్బతిన్నది. ఇప్పుడు మొక్కజొన్నల దిగుమతి కోసం పరిశ్రమ, వద్దంటూ రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.దిగుమతి చేసుకున్న సరకు కిలో ధర 0.43 నుంచి 0.46 డాలర్లు గిడుతున్నది, తమకు 0.56 డాలర్లు వస్తే తప్ప గిట్టుబాటు కాదు గనుక దిగుమతులు వద్దని, దిగుమతి సుంకం పెంచాలని రైతులు అంటున్నారు. కోళ్ల పరిశ్రమ దీన్ని వ్యతిరేకిస్తున్నది ప్రస్తుతం కిలోకు 0.08 డాలర్లు దిగుమతి పన్ను ఉందని, ఇంకా పెంచితే కోడి మాంసం, గుడ్ల ధరలు పెరుగుతాయని, తమకు గిట్టుబాటు కాదని వారంటున్నారు.
అమెరికా పాడి ఉత్పత్తులకు మనం ద్వారాలు తెరిస్తే సగటున 15శాతం మేరకు పాల ధరలు పతనమై ఏటా రు.1.8లక్షల కోట్లు నష్టం వస్తుందని, దానిలో రైతులు రు.1.03లక్షల కోట్లు నష్టపోతారని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఎస్‌బిఐ) అధ్యయనం హెచ్చరించింది. భారీ మొత్తంలో దిగుమతులు పెరిగి కోట్లాది మంది రైతుల జీవితాలు దెబ్బతింటాయని పేర్కొన్నది.(పాడి పరిశ్రమపై ఎనిమిది కోట్ల మంది ఆధారపడి ఉన్నారని ఒక అంచనా) పాల ధరలు తగ్గితే గిరాకీ 1.4 కోట్ల టన్నులు పెరుగుతుందని, అదే సమయంలో 1.1 కోట్ల టన్నుల సరఫరా తగ్గుతుందని, రెండిరటి మధ్య తేడా 2.5 కోట్ల టన్నులను దిగుమతుల ద్వారా పూడ్చుకోవాల్సి ఉంటుందని, చిన్న డైరీలు, రైతులు తీవ్రంగా దెబ్బతింటారని కూడా ఎస్‌బిఐ హెచ్చరించింది. అమెరికా జన్యుమార్పిడి ఉత్పత్తులతో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని పేర్కొన్నది. వాణిజ్య ఒప్పందం కుదిరితే జపాన్, మలేసియా, దక్షిణ కొరియాల నుంచి అమెరికాకు రసాయనాల ఎగుమతులు తగ్గి మన ఎగుమతులు మరొక శాతం పెరుగుతాయని జిడిపి0.1శాతం పెరుగుతుందని, దుస్తుల ఎగుమతులు ఆరు నుంచి 11శాతానికి పెరుగుతాయని చెప్పింది. జనరిక్ ఔషధాలతో పాటు ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు ప్రస్తుతం ఉన్న ఒక బిలియన్ నుంచి మూడు బిలియన్ డాలర్ల వరకు పెరుగుతాయని పేర్కొన్నది.ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం రెండంచుల పదును గల కత్తి వంటిదని కూడా హెచ్చరించింది. అమెరికా పాడి ఆవులకు ఇచ్చే మేతలో జంతు సంబంధిత అంశాలు లేవని నిర్ధారిస్తూ హామీ ఇవ్వాలని భారత్ గతంలో పేర్కొన్నది. ఇప్పుడు దానికి కట్టుబడి ఉందా లేదా అన్నది ఒక చర్చ సాగుతున్నది. అలాంటి పాలను మాంసాహారంగా పరిగణించే 30శాతం మందిగా ఉన్న శాఖాహారులు వాటి ఉత్పత్తులైన జున్ను, వెన్న, పాలను భుజించేందుకు అంగీకరించరు. మొత్తం మీద వ్యవసాయం, అనుబంధ పాడి, కోళ్ల పెంపకం వంటి మీద ఏం జరుగుతుందో అన్న అనుమానం, భయం రైతాంగంలో ఉన్నాయి. ట్రంప్ చెప్పినట్లు ఇండోనేషియా మాదిరి మనతో ఒప్పందం ఉంటే అది కచ్చితంగా ముప్పే. మోడీ దేవుడు అని నమ్ముతున్నవారికి ఒప్పందం పీక్కుతినే దెయ్యంగా మారుతుందా ఏం జరుగుతుందో చూడాల్సిందే !
