Tags
attacks on journalists, journalist, journalistic independence, press, press freedom, Reporters Without Borders
ఎం కోటేశ్వరరావు
మేనెల మూడవ తేదీన ప్రపంచ పత్రికా స్వేచ్చా దినాన్ని పాటించారు. మీడియా స్వేచ్చ ప్రాధాన్యతను తెలియ చేసేందుకు ప్రతి ఏటా ఈ దినాన్ని పాటిస్తున్నారు. 1991 ఏప్రిల్ 29 నుంచి మే మూడవ తేదీ వరకు ఆఫ్రికా ఖండం నైరోబీ దేశంలోని విండ్‌హాక్ పట్టణంలో ఆఫ్రికా ఖండ జర్నలిస్టుల సమావేశం పత్రికా స్వేచ్చ సూత్రాల గురించి ఒక ప్రకటనను ఆమోదించింది. తరువాత ఐక్యరాజ్యసమితి ఆ తీర్మానాన్ని తనదిగా స్వీకరించి ఆమోదం పొందిన మూడవ తేదీని ప్రపంచ పత్రికా దినోత్సవంగా ప్రకటించింది.ఈ ఏడాది ఈ ప్రకటనకు పాతికేండ్లు నిండటంతో పాటు ప్రపంచంలో తొలిసారిగా 1776లో స్వీడన్ ఆమోదించిన పత్రికా స్వేచ్చ చట్టానికి 250 సంవత్సరాలు నిండటం కూడా ఈ ఏడాదే కావటం విశేషం. ఇంతవరకు 95దేశాలు పత్రికా స్వేచ్చకు సంబంధించి ఏదో ఒక చట్టాన్ని ఆమోదించాయి. ప్రతి ఏటా ఒక దేశంలో మీడియాకు సంబంధించి ఒక ఇతివృత్తంపై ఐరాస మే మూడవ తేదీన ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. కొలంబియాలో 1986లో తన కార్యాలయం ఎదుటనే మాదక ద్రవ్యాల మాఫియా చేతిలో గ్యూ లెర్మో కనో అనే జర్నలిస్టు హత్యకు గురయ్యాడు. అతని సంస్మరణంగా ప్రతి సంవత్సరం ఆ కార్యక్రమంలో మీడియా స్వేచ్ఛకోసం పోరాడిన జర్నలిస్టుకు బహుమతి ఇస్తోంది. ఈ ఏడాది అజర్‌బైజాన్ జర్నలిస్టు ఖతీజా ఇస్మాయిలోవాకు ప్రకటించారు. ఈ సందర్బంగా వివిధ దేశాలలో వున్న పరిస్థితుల గురించి చర్చలు జరుగుతాయి. ఈ ఏడాది ఫిన్లండ్ రాజధాని హెల్సింకీలో ‘అందుబాటులో సమాచారం మరియు ప్రాధమిక స్వేచ్ఛలు ‘ అనే అంశంపై కార్యక్రమం నిర్వహించారు. వెయ్యిమందికిపైగా పాల్గొన్న జర్నలిస్టులు విధి నిర్వహణలో హత్యకు గురైన వారికి నివాళులు అర్పించారు. అనేక దేశాలలో ఇదే రోజున పలు కార్యక్రమాలు జరిగాయి.
పత్రికలు లేదా టీవీ ఛానల్స్, ఇంటర్నెట్ ఏ మీడియా రంగంలో పని చేస్తున్నప్పటికీ జర్నలిస్టు జీవితం అంత సులభం కాదు. కత్తిమీద సాము వంటిది. నిత్యం ప్రమాదాలు పొంచి వుంటాయి. అవి ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, అవినీతి,అక్రమాలు ఏవైనా సరే జర్నలిస్టులను ప్రమాదపు అంచుల వరకు తీసుకు వెళుతున్నాయి. అయినా సరే ఈ వృత్తిని ఎంచుకొనేందుకు నిబద్దులై వుండే యువతీ యువకులు ముందుకు వస్తూనే వున్నారని ఈ సందర్బంగా ప్రపంచ వ్యాపితంగా మరోసారి వెల్లడైంది.
జర్నలిస్టులు కనిపించగానే నమస్తే చెప్పటం, పక్కకు తిరిగి నోరు బట్టని బూతులు తిట్టటం సర్వసాధారణం. అక్రమాలకు పాల్పడే శక్తులే కాదు, రాజకీయ వేత్తలు, అధికారయంత్రాంగం ఇలా ఒకరని కాదు, తమ ప్రయోజనాలకు భంగం కలిగిందని భావించే ప్రతి వారూ చివరకు భౌతిక దాడులకు పాల్పడుతూ ప్రాణాలు తీసేందుకు కూడా సిద్ధం అవుతున్నారు. జెఎన్‌యు ఘటనల సందర్బంగా భారతమాతాకు జై అంటూ ఒకవైపు నినదిస్తూనే అదే నోటితో మరోవైపు ఆ వార్తలను కవర్ చేసేందుకు వెళ్లిన, ఆ ఘటనల పట్ల విమర్శనాత్మక కధనాలు వెలువరించిన, చర్చలు నిర్వహించిన మహిళా జర్నలిస్టులను మాన భంగం చేస్తామని కూడా బెదిరించటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే వుద్యోగ భద్రలేమి మరొక ప్రధాన అంశం. అధికారంలో వున్నవారికి నచ్చకపోయినా, యాజమాన్యం ఇచ్చగించకపోయినా బలౌతున్నది జర్నలిస్టులు. మీడియా స్వేచ్చ అన్నది రోజు రోజుకూ పరిమితం కావటంతో పాటు దుర్వినియోగం అవుతున్నది. యాజమాన్యాలు తమ లాభాల కోసం అనుసరిస్తున్న అక్రమ పద్దతుల కారణంగా జర్నలిస్టులు సమిధలుగా మారుతున్నారు.
సరిహద్దులు లేని విలేకర్ల సంస్ధ(రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్(ఆర్‌ఎస్‌ఎఫ్) గతనెలలో విడుదల చేసిన నివేదిక మీడియా స్వేచ్చ అన్ని ప్రాంతాలలో మొత్తం మీద దిగజారుతున్నది. ఈ సంస్ధ 2002 నుంచి ప్రతిఏటా నివేదికలను ప్రకటిస్తూ సూచికలను వెల్లడిస్తున్నది. దాని ప్రకారం గత ఏడు సంవత్సరాలుగా ఫిన్లండ్ మీడియా స్వేచ్చలో అగ్రస్ధానంలో వుంటున్నది. రెండు వందల యాభై సంవత్సరాల క్రితం స్విడ్జర్లండ్‌లో భాగంగా ఫిన్లండ్ వుండేది. స్వేచ్ఛాయుత ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై రాయటం, ప్రచురించటం మూలస్థంభాలుగా వుండాలని వుదారవాది అయిన ఫిన్నిష్ మతాధికారి ఆండెర్స్ చైడెనియస్ 1765లో ఒక రచనలో తన అభిప్రాయం వెల్లడించారు. జర్నలిజం మంచి చట్టాలు రూపొందించటానికి, అధికార యంత్రాంగ బాధ్యతలు, పరిమితుల గురించి సమాచారాన్ని అందించటంలో రాజ్యానికి సహాయపడుతుందని, దానినే ఒక చట్టంగా రూపొందించాలని పార్లమెంట్‌కు నివేదించాడు. అది లేకపోతే అధ్యయనం, వినయ విధేయతలు అణచివేయబడతాయని, ఆలోచనలో మొరటుతనం చోటు చేసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఆ మేరకు అది చట్టమైంది. అంతకు ముందు ఎక్కడా అలాంటి చట్టాలు వున్నట్లు దాఖలాలు లేకపోవటంతో ప్రపంచంలో తొలి చట్టంగా పరిగణిస్తున్నారు. ప్రభుత్వ పత్రాలు అందరికీ అందుబాటులో వుంచటం ప్రజల హక్కుగా గుర్తించటం దానిలోని ముఖ్యాంశం.ఇది జరిగి రెండువందల యాభై సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు పత్రికా స్వేచ్ఛ పూర్తిగా అన్ని దేశాలలో అమలులోకి రాలేదు.
గత పన్నెండు సంవత్సరాలలో గతేడాది మీడియా స్వేచ్చకు అత్యంత చెడ్డదిగా వుందని ఆర్‌ఎస్‌ఎఫ్ సూచిక వెల్లడించింది. ప్రపంచ వ్యాపితంగా మీడియా స్వేచ్ఛ ఆందోళనకరంగా వుందని, అనేక మంది ప్రపంచ నేతలు నిజమైన జర్నలిజం పట్ల ఒక విధమైన మానసిక రుగ్మతకు గురి అవుతున్నారని, భయ పూరిత వాతావరణం చర్చలు జరిపేందుకు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు విముఖులను చేస్తోంది. గతం కంటే ఎక్కువగా ప్రభుత్వాలు మీడియా అణచివేతకు పాల్పడుతున్నాయి. ప్రయివేటు వ్యక్తుల యాజమాన్యాలలో వున్న మీడియాలలో రిపోర్టింగ్ వ్యక్తుల ప్రయోజనాలకు అనుగుణంగా మలచబడుతున్నది.’ అని ఆర్‌ఎస్‌ఎఫ్ సెక్రటరీ జనరల్ క్రిస్టోఫీ డెలోయిర్ వ్యాఖ్యానించారు. తాజా సూచికలో ప్రధమ స్ధానంలో ఫిన్లండ్, నెదర్లాండ్, నార్వే తదుపరి స్ధానాలలో వున్నాయి.
ఖండాల వారీగా చూస్తే ఐరోపా సూచిక 19.8,ఆఫ్రికా 36.9, వుత్తర, దక్షిణ అమెరికా ఖండాలు 37.1, ఆసియా 43.8గా వుంది. ప్రాంతాల వారీగా చూస్తే తూర్పు ఐరోపా, మధ్య ఆసియా 48.4, వుత్తర ఆఫ్రికా , మధ్యప్రాచ్యం 50.8 పాయింట్లతో అధమ స్ధానంలో వుంది. 2013తో పోల్చితే మొత్తం మీద సూచిక 13.6శాతం పతనమైంది. గతేడాది 3,857 పాయింట్లు వుంటే తాజాగా 3,719కి పడిపోయింది. మతపరమైన అంశాలతో సహా దీనికి అనేక కారణాలు వున్నాయి. ప్రపంచ వ్యాపితంగా కార్పొరేట్ శక్తులు మీడియా రంగంలో ప్రవేశిస్తూ ప్రభుత్వాలపై వత్తిడిని పెంచుతున్నాయి. కొన్ని దేశాలలో ఇంటర్నెట్‌ను అందుబాటులో లేకుండా చేయటానికి, పత్రికా ముద్రణను అడ్డుకోవటానికి కూడా వెనుకాడటం లేదు. గత మూడు సంవత్సరాలలో ఈ సూచిక 16శాతం దిగజారింది. స్వల్ప కారణాలను సాకుగా చూపి జర్నలిస్టులను శిక్షించటానికి వీలుగా చట్ట సవరణలు కూడా ఈ కాలంలో పెరిగాయి. అధ్యక్షుడు, ప్రధానిని అమానించారనో, మత వ్యతిరేక ప్రచారానికి పాల్పడ్డారని, వుగ్రవాదులకు తోడ్పడటం వంటి కారణాలను వాటిలో పొందుపరుస్తున్నారు.
మిగతా ప్రాంతాలతో పోల్చితే ఐరోపా జర్నలిస్టులు ఎక్కువ స్వేచ్చాయుత వాతావరణంలోనే పని చేస్తున్నారు, అయితే అక్కడ కూడా పరిస్థితి దిగజారుతోంది. పోలాండ్‌లో కొత్త ప్రభుత్వానికి విధేయులుగా లేరనే సాకుతో ప్రభుత్వ రేడియో, టీవీ సర్వీసులనుంచి 135 మంది జర్నలిస్టులకు వుద్వాసన పలికారు. జర్నలిస్టుల వార్తా వనరుల విషయంలో పోలీసులు నిబంధనలను వుల్లంఘించిన కారణంగా బ్రిటన్ రేటింగ్స్ పడిపోతున్నాయి. టర్కీ అధ్యక్షుడిపై ఒక వ్యంగ్య పద్యాన్ని ప్రచురించినందుకు ఆదేశం కోరిక మేరకు ఒక కమెడియన్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఆదేశించారు. మీడియా స్వేచ్చ సూచికలో 180 దేశాలలో టర్కీ స్ధానం 151 అంటే అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా వున్నాయో వూహించుకోవచ్చు. పత్రికా స్చేచ్చలో అగ్రగాములుగా వున్న దేశాలలో ఒకటైన స్వీడన్‌లో జర్నలిస్టులపై బెదిరింపుల కారణంగా దాని సూచిక ఐదు నుంచి ఎనిమిదికి పడిపోయింది. ‘ఇది ప్రజాస్వామ్యానికి నిజమైన ముప్పు, ఇంటర్నెట్ మీడియాలో వ్యాఖ్యల విభాగాలను ఎత్తివేస్తున్నాయి.అనేక మంది జర్నలిస్టులు స్వయం సెన్సార్ విధించుకుంటున్నట్లు చెబుతున్నారని స్వీడిష్ జర్నలిజం ప్రొఫెసర్ ఇంగెలా వాడ్ బ్రింగ్ తెలిపారు. పనామా పత్రాలతో సంబంధం వున్న సమాచారాన్ని పన్నులు, పోలీసు అధికారులకు అందచేయాలని ఫిన్లండ్ ఆర్ధిక మంత్రి హుకుం జారీ చేశారు. ఇది ప్రమాదకర సంప్రదాయం అవుతుందంటూ ప్రభుత్వ మీడియా సంపాదకులు తిరస్కరించారు. హెల్సింకీలో ప్రపంచ మీడియా స్వేచ్చా పరిరక్షణ దిన సదస్సు జరుగుతుండటంతో మంత్రి తాత్కాలికంగా వెనక్కు తగ్గాడు.
మన దేశం విషయానికి వస్తే తాజా సూచికలో 133వ స్థానంలో వున్నందుకు తల దించుకోవాలి. గతేడాది కంటే మూడు ర్యాంకులు తగ్గిందన్న మాటే గానీ ఇదేమీ గౌరవ ప్రదమైంది కాదు. వుగ్రవాదులనుంచి జర్నలిస్టులకు ఎదురవుతున్న బెదిరింపుల పట్ల ప్రధాని నరేంద్రమోడీ నిర్లిప్తంగా వున్నారని, జర్నలిస్టులను రక్షించేందుకు క్రియా విధానం లేదని,ఎప్పుడు అవకాశం వచ్చినా మీడియాను అదుపు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆర్‌ఎస్‌ఎఫ్ నివేదిక పేర్కొన్నది. మన పొరుగు దేశాల సూచికలు ఇలా వున్నాయి. చైనా 176, పాకిస్థాన్ 147, బంగ్లాదేశ్ 144, శ్రీలంక 141, ఆఫ్ఘనిస్తాన్ 120, నేపాల్ 105, భూటాన్ 94. ఇదే సమయంలో స్వేచ్చా ప్రపంచంగా చెప్పుకొనే అమెరికా 44, కమ్యూనిస్టు ఇనుప తెరలను బద్దలు కొట్టామని చెప్పుకుంటున్న రష్యా 148వ స్థానంలో వుంది. ఈ నివేదికలో లోపాలు వున్నాయని అభిప్రాయం కూడా వుంది.
అక్రమ గనుల తవ్వకాల గురించి పరిశోధించిన సందీప్ కొథారి అనే జర్నలిస్టును మధ్యప్రదేశ్‌లో హత్య చేశారు.ఈ సంబంధిత కార్యకలాపాలకు పాల్పడుతున్న శక్తులు కొద్ది వారాలలోనే చేసిన రెండవ హత్య ఇది. ఇసుక, మాంగనీస్ మాఫియా గురించి రాయటమే ఆ జర్నలిస్టు చేసిన ‘తప్పిదం’. స్నేహితుడితో కలిసి మోటార్ సైకిల్‌పై వెళుతున్న అతనిని కారుతో ఢీకొట్టించి తరువాత కిడ్నాప్ చేసి హత్య చేశారు. అంతకు ముందు వుత్తర ప్రదేశ్‌లో జగేంద్ర సింగ్ అనే జర్నలిస్టును అతని ఇంటి వద్దే పోలీసులు సజీవ దహనం చేశారు. దేశంలో వుత్తర ప్రదేశ్ అత్యంత ప్రమాదకర రాష్ట్రాలలో ఒకటని ఆర్‌ఎస్‌ఎఫ్ పేర్కొన్నది. జర్నలిస్టుల హత్యలను నేర సమాచారంలో ప్రత్యేకంగా పరిగణించటం లేదని హోంమంత్రి తెలిపారని, 2014లో దేశంలో ప్రతి మూడు రోజులకు ఒక జర్నలిస్టు దాడులకు గురైనట్లు పేర్కొన్నది.
ఆర్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ వ్యాపితంగా అన్ని ప్రాంతాలకు, అన్ని భాషలకు చెందిన మీడియా నుంచి సమాచారాన్ని సేకరించటం లేదు. ముఖ్యంగా మన వంటి ప్రాంతీయ భాషల మీడియా రంగంలో జరుగుతున్న దాడులను కూడా నివేదికలలో చేరిస్తే సమగ్రంగా వుంటుంది. మన రాష్ట్రంలో ఇటీవలి కాలంలో పలు చోట్ల జర్నలిస్టులపై బెదిరింపులు, దాడులు జరుగుతున్నాయి. ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటం లేదు. పోలీసులు జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించటం కొత్త పరిణామం. దీనిపై మీడియాలో పనిచేస్తున్న వారు మేల్కొనకపోతే మరొక మెక్సికో, లాటిన్ అమెరికా, ఆఫ్రికా ఖండ దేశాల మాదిరి పరిస్థితులు తయారయ్యే రోజులు ఎంతో దూరంలో లేవు.
జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల తీరు తెన్నులు
ప్రపంచ పత్రికా స్వేచ్చా దినం సందర్బంగా అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్ధ కొన్ని వుదంతాలలో జర్నలిస్టులు ఎలా దాడులకు గురైందీ తెలిపింది. జర్నలిస్టులు తమ విధులను నిర్వహించినందుకు తప్ప వారిని వేధించటానికి మరొక కారణాలేమీ లేవని పేర్కొన్నది.’ ప్రపంచ వ్యాపితంగా జర్నలిస్టులను ఏకపక్షంగా అరెస్టు చేస్తున్నారు. పార్టీ విధానాలకు అనుగుణం లేకుండా అధికారంలో వున్న వారిని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగినందుకు గాను వారిని జైలు పాలు చేస్తున్నారు, చివరకు చంపేందుకు కూడా వెనుకాడటం లేదని సంస్ధ పరిశోధనా విభాగపు సీనియర్ డైరెక్టర్ అన్నా నెయిస్టాట్ వ్యాఖ్యానించారు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సేకరించిన వందలాది కేసులలో కొన్నింటి వివరాలు సంక్షిప్తంగా ఇలా వున్నాయి.
1.మహమ్మద్ అబు జైద్ అలియాస్ షకవాన్ ఓ ఫొటో జర్నలిస్టు. కైరోలో నిరసనల సందర్బంగా భద్రతా దళాలు సాగించిన హింసాకాండను చిత్రాలలో బంధించినందుకు మూడు సంవత్సరాల పాటు జైలులో వున్నాడు.అతనిని చిత్రహింసలు కూడా పెట్టారు.మరణశిక్ష పడటానికి వీలు కలిగించే సెక్షన్లతో బనాయించిన కేసులను అతను ఇప్పుడు ఎదుర్కొంటున్నాడు.ఈజిప్టులో నిర్బంధించిన 20 మంది జర్నలిస్టులలో అతను ఒకడు.
2.ఆఫ్రికాలోని కామెరూన్‌లో బాబా వామె, రోడ్రిగ్ టోంగ్, ఫెలిక్స్ ఎబోల్ బోలా అనే ముగ్గురు జర్నలిస్టులు భద్రతా దళాలు- ఒక సాయుధ బృందం కుమ్మక్కై ఒక పట్టణంపై చేసిన దాడి గురించి వారు పరిశోధించారు.వారు సేకరించిన సమాచారం దేశ భద్రతకు ముప్పుతెచ్చే దంటూ వారికి అది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలంటూ ప్రభుత్వం వారిపై కేసులు బనాయించింది. వార్త వనరులను చెప్పేందుకు వారు నిరాకరించారు.
3.ఖతీజా ఇస్మాయిలోవా అజర్‌బైజాన్‌లో దేశాధ్యక్షుడి కుటుంబంతో సహా అనేక మంది అక్రమాల చిట్టాను బయట పెట్టిన జర్నలిస్టు. ఆమె నోరు మూయించేందుకు అన్ని రకాలుగా బెదిరించినా ఆమె లొంగలేదు. చివరకు తప్పుడు అభియోగాలు మోపి విచారణను బూటకంగా మార్చివేసి ఏడున్నర సంవత్సరాల శిక్ష వేసి జైలులో పెట్టారు.
4. ఆఫ్రికాలోని బురుండీలో ఒక వున్నత సైనికాధికారిని హత్య చేసిన వుదంతంలో ఫొటోలు తీసినందుకు గాను ఎడ్రాస్ దికుమానా అనే జర్నలిస్టును అరెస్టు చేశారు.చిత్రహింసల పాలు చేశారు. ప్రస్తుతం అతను ప్రవాసంలో వున్నాడు. తమ పట్ల విమర్శనాత్మకంగా వున్నారనే దుగ్దతో పాలకపార్టీ జర్నలిస్టులు,ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడింది. గతేడాది ఒక తిరుగుబాటు సందర్బంగా నాలుగు ప్రయివేటు రేడియోస్టేషన్లను పోలీసులు ధ్వంసం చేశారు.
5. అనాబెల్ ఫ్లోరెస్ సలజార్, మెక్సికోలో ఒక పత్రిక క్రైమ్ రిపోర్టర్.ఆమెను ఈ ఏడాది ఫిబ్రవరిలో హత్యచేశారు. సాయుధులైన వ్యక్తులు ఆమెను ఇంటి నుంచి తీసుకు వెళ్లి చంపివేశారు. గత ఆరు సంవత్సరాలలో మెక్సికోలో 17 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు.
6. అంగోలాలో సెడ్రిక్ కార్‌వాలో, డోమింగోస్ డా క్రజ్ అనే ఇద్దరు జర్నలిస్టులను మరో 15 మందితో కలిపి అరెస్టు చేశారు. వారు చేసిందేమీ లేదు ప్రజాస్వామ్యం, స్వేచ్చ గురించి చర్చించుకోవటమే. తిరుగుబాటుకు సన్నాహంగా కుట్ర చేస్తున్నారనే అభియోగం మోపి నాలుగున్నర సంవత్సరాల జైలు శిక్ష వేశారు.
7.థాయ్‌లాండ్‌లో రాజకుటుంబాన్ని విమర్శించే రెండు వ్యాసాలను ప్రచురించినందుకు సోమయోట్ అనే సంపాదకుడికి పది సంవత్సరాల జైలు శిక్ష వేశారు.
8. పత్రికలో వచ్చిన రెండు వార్తాకధనాల ద్వారా అధికారిక రహస్యాలను వెల్లడించారనే పేరుతో కంహరియత్ పత్రిక సంపాదకుడు కన్ దుండర్, ఒక విలేకరిని టర్కీ ప్రభుత్వం అరెస్టు చేసింది. సిరియాలోని సాయుధ ముఠాలకు టర్కీ సైన్యం మానవతా పూర్వక సాయం ముసుగులో ఆయుధాలను ఎలా అందించిందన్నదే వాటి సారాంశం.
ఈ వ్యాసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్సు ఫెడరేషన్ ఆధ్వర్యాన వెలువడే ‘వర్కింగ్ జర్నలిస్టు సమాచార స్రవంతి’ మాసపత్రిక మే నెల సంచిక నిమిత్తం రాసినది.
