Tags
ఎం కోటేశ్వరరావు
చైనాను చంద్రయాన్-3 విజయవంతం కావటంతో యావత్ దేశం మన ఇస్రో శాస్త్రవేత్తలను వేనోళ్ల కొనియాడుతున్నది. ఊరందరిదీ ఒక దారైతే ఉలిపికట్టెది మరొక దారి అన్న సామెత తెలిసిందే.మన ఇస్రో విజయాన్ని కూడా మతకళ్లతో చూసే బాపతు రెచ్చిపోతున్నది. మన దేశంలో మిసైల్ మహిళగా పేరు తెచ్చుకున్న కేరళకు చెందిన టెసీ థామస్ గురించి సామాజిక మాధ్యమంలో తాజాగా ఒక పోస్టును పెట్టారు.యునైటెడ్ బ్రాహ్మిన్స్ ఫ్రెండ్స్(ఆల్ ఇండియన్ బ్రాహ్మిన్ కమ్యూనిటీస్)కు చెందిన ఒకరు పెట్టిన ఆ పోస్టులో ఉన్న అంశం ఏమంటే అగ్ని క్షిపణి రూపకర్త టెసీ థామస్ అనీ ఆమె నుదుట బొట్టు, దాని మీద చిన్న గంధపు గీత ఉందని రాశారు. ఆమె క్రిస్టియన్ అయినప్పటికీ హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తున్నట్లు చెప్పటం దీని లక్ష్యం. క్షిపణి రూపకర్తలలో ప్రముఖురాలు ఆమె అనటంలో ఎవరికీ పేచీ లేదు. అందరూ అభినందించాల్సిన అంశమే. బిజెపి ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన కంగన రనౌత్ చంద్రయాన్-3 విజయం గురించి స్పందించారు. అందరికీ ఇస్రో శాస్త్రవేత్తల ప్రతిభ పాటవాలు కనిపిస్తే ఆమె వేరే విధంగా చూశారు. మహిళా శాస్త్రవేత్తలు ఉన్న ఒక ఫోటోను తన ఇనస్టాగ్రామ్‌లో పోస్టు చేసి వారంతా బిందీ, సింధూరాలు, తాళిడబొట్లు ధరించి ఉన్నారని, ఉన్నత ఆలోచనలు, సాధారణ జీవితాల భారతీయతకు ప్రతీకలని పేర్కొన్నారు. ఇలా చెప్పటం ద్వారా బొట్టు లేనివారు కాదని ఆమె జనాలకు సందేశం ఇవ్వదలచుకున్నారు. దాని తరువాతే టెసీ థామస్ బొట్టు, చందనం గురించి బ్రాహ్మణ సంఘాలు పోస్టు పెట్టాయి. రెండవ అంశం ఏమంటే 145 కోట్ల చైనీయుల గుండెల్లో భయం పుట్టించిన మహిళ అని చెప్పారు. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అణువార్ హెడ్‌తో చైనాలోని ఏ ప్రదేశాన్నైనా ఖచ్చితత్వంతో ఢకొీట్టగల అగ్ని-5 క్షిపణి రూపకర్త టెసీ థామస్ అని రాశారు.(ఆమె క్రిస్టియన్ అయినప్పటికీ బ్రాహ్మణ క్రైస్తవురాలని, అందుకే బ్రాహ్మణ సంఘాలు ఆమె గురించి రాసినట్లు సామాజిక మాధ్యమంలో కొందరు స్పందించారు ) ఆ క్షిపణిని 2018లోనే పరీక్షించారు, మిలిటరీకి అందచేశారు, ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమిటి ?
అన్నీ వేదాల్లోనే ఉన్నాయష అని చెప్పిన వారే ఇప్పుడు శాస్త్రవేత్తలకు మతం, కులం ఆపాదించుతున్న తీరును చూస్తున్నాం.వారిలో ఎవరైనా బొట్టు పెట్టుకోలేదో దేశవ్యతిరేక మతాల ముద్రవేస్తారు. వాటిని పక్కన పెడితే చంద్రయాన్ విజయం, అగ్ని క్షిపణితో మన మిలిటరీ సామర్ధ్యం పెరుగుతుందన్నది స్పష్టం. కానీ చైనీయులకు భయం పుట్టించిందని చెప్పటం అవసరమా ? అసలది నిజమా ? అతిశయోక్తులు మాత్రమే. అంతరిక్ష ప్రయోగాల్లో మనం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది, క్షిపణుల రంగంలోనూ అదే పరిస్థితి. తాజా సమాచారం ప్రకారం జూలై రెండవ వారంలో గ్లోబల్ ఫైర్ పవర్(జిఎఫ్‌పి) అనే సంస్థ మిలిటరీ బల రాంకులు-2023 ప్రకారం శక్తివంతమైన పది దేశాల్లో వరుసగా అమెరికా, రష్యా, చైనా, భారత్,బ్రిటన్, దక్షిణ కొరియా,పాకిస్థాన్, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ ఉన్నాయి. నూటనలభై దేశాలలో అత్యంత బలహీనమైన దేశాల మిలిటరీలో భూటాన్ తొలి స్థానంలో ఉంది. ఈ రాంకులు ప్రతి ఏడాదీ మారుతుంటాయి. గతేడాది తొలి నాలుగు స్థానాల్లో ఉన్న దేశాల్లో ఇప్పుడు ఎలాంటి మార్పు లేదు. గతేడాది ఎనిమిదో స్థానంలో ఉన్న బ్రిటన్ తాజాగా ఐదవ స్థానంలోకి వచ్చింది. పాకిస్థాన్ తొలిసారిగా మొదటి పదిలో ఏడవ స్థానం పొందింది. ఇక ఈ రాంకులు ఇచ్చేందుకు అన్ని దేశాలు అంగీకరించిన ఒక ప్రామాణిక సంస్థ ఏదీ లేదు.
ఉదాహరణకు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వచ్చిన వార్తల ప్రకారం అమెరికాకు చెందిన ఫెయిర్ బృందం రాంకులను యుఎస్ న్యూస్ ప్రకటించింది. దాని ప్రకారం అత్యంత శక్తివంతమైన మిలిటరీలో చైనాకు రెండవ, భారత్‌కు 14స్థానం ఇచ్చారు. వీటిని తయారు చేసింది అమెరికా సంస్థలు, అక్కడి ఆయుధ తయారీదారుల హస్తం దీని వెనుక ఉన్నట్లు కనిపిస్తున్నది. చైనాతో పోల్చితే భారత్ ఎంతో వెనుకబడి ఉంది కనుక ఆయుధాలను మరింతగా కొనాలని వత్తిడి తెచ్చే ఎత్తుగడ ఉందన్నది స్పష్టం. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వెంట తన ఆధీనంలోని భూ భాగంలో గతంలో ఎప్పుడో నిర్మించిన గృహాల స్థానంలో చైనా కొత్తవాటిని నిర్మిస్తే ఇంకే ముంది అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా వారు గ్రామాలను నిర్మిస్తున్నట్లు మన దేశాన్ని తప్పుదారి పట్టించేందుకు అమెరికా సంస్థలు చూసిన సంగతి తెలిసిందే.మన దేశం ప్రపంచంలో అన్ని దేశాలు దిగుమతి చేసుకుంటున్న ఆయుధాల్లో పదకొండుశాతం వాటాతో ప్రధమ స్థానం కలిగి ఉండగా చైనా 4.6శాతమే కలిగి ఉంది. అంటే ఆయుధాల కోసం ఇతర దేశాల మీద ఆధారపడటం తక్కువగా ఉంది. గ్లోబల్ ఫైర్ పవర్ సంస్థ పేర్కొన్న సమాచారం ప్రకారం మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న చైనా-భారత్ మిలిటరీ బలాల పోలిక దిగువ విధంగా ఉంది.
అంశం ××××××× చైనా ××××× భారత్
రాంకు ××××××× 3 ××××× 4
అందుబాటులో జనం ××76,16,91,468×× 65,31,29,600
మిలిటరీకి అర్హులు ××62,48,69,113×× 51,55,55,492
ఏటా మిలిటరీవయస్సు వారు××1,97,47,552 ×× 2,36,23,837
రక్షణ బడ్జెట్, బి.డాలర్లు ×× 230 ×× 50.2
విమానాలు ×× 3,284 ×× 2,210
యుద్ద విమానాలు ×× 1,199 ×× 577
హెలికాప్టర్లు ×× 913 ×× 807
విమానాశ్రయాలు ×× 507 ×× 346
యుద్ద టాంకులు ×× 4,950 ×× 4,614
యుద్ద నౌకలు ×× 730 ×× 295
వి.వాహకనౌకలు ×× 3 ×× 2
హెలికాప్టర్ నౌకలు ×× 3 ×× 0
జలాంతర్గాములు ×× 78 ×× 18
డెస్ట్రాయర్లు ×× 50 ×× 11
రేవులు ×× 22 ×× 13
స్వయంచలిత ఆర్టిలరీ ×× 2,720 ×× 100
రాకెట్ ఆర్టిలరీ ×××××× 3,140 ×× 960
సాయుధ శకటాలు ×× 14,130 ××× 8,600
భారత్ వద్ద మిగ్-21 రకం 107, మిగ్-29 రకం 66 ఉన్నాయి. చైనా వద్ద స్వంత తయారీ జె-11 రకం 442, జె-7 రకం 388, జె-18 రకం 96, యస్‌యు-30 రకం 121 ఉన్నాయి. బహుముఖ పాత్ర పోషించే యుద్ద విమానాలు మన దేశం దగ్గర సుఖోరు -30 రకం 272, మిరేజ్ 49, మిగ్ – 29 రకం 36, రాఫెల్ 26, తేజస్వి 22, కమోవ్ 14 మొత్తం 393 ఉన్నాయి. అదే చైనా వద్ద అన్ని రకాలు కలసి 1,130 ఉన్నాయి. మన దగ్గర మిలిటరీ డ్రోన్లు 12 ఉండగా, చైనా వద్ద 151ఉన్నాయి. రాఫెల్ 4.5 తరం విమానాలను మనం కొనుగోలు చేయగా, దాని కంటే మెరుగైన స్వంత తయారీ 5వ తరం జె-20 విమానాలు చైనా వద్ద ఉన్నాయి.మిలిటరీ ఆయుధాలకు సంబంధించి ప్రపంచ సంస్థలు చెప్పే అంకెలు కొన్ని భిన్నంగా ఉన్నప్పటికీ మిలిటరీ బలాబలాల ధోరణులు తెలుసుకొనేందుకు ఉపయోగపడతాయి.వరల్డ్ పాపులేషన్ రివ్యూ 2023 అంచనా ప్రకారం చైనా వద్ద 350, పాకిస్థాన్ దగ్గర 165, మనదగ్గర 156 అణ్వాయుధాలు ఉన్నాయి. అణ్వాయుధాలను ఉపయోగించబోమని భారత్-చైనా ప్రకటించాయి. అందువలన ఎవరి దగ్గర ఎంత ఎక్కువ దూరం ప్రయాణించే క్షిపణులు ఉన్నప్పటికీ వాటితో అణ్వాయుధాలను ప్రయోగించే అవకాశం లేదు. ఎవరైనా దాన్ని ఉల్లంఘించి అణుదాడులకు పాల్పడితే ఎవరూ మిగలరు. అందువలన మన అగ్ని క్షిపణిని చూసి చైనా వారు గానీ వారి వద్ద 12 నుంచి 15వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించే డిఎఫ్-41క్షిపణులను చూసి మన జనం భయపడుతున్నారా అంటే లేదు.మన అణుక్షిపణి పరిధి ఏడువేల కిలోమీటర్లని మన శాస్త్రవేత్తలు ప్రకటించిన సంగతి తెలిసిందే. మన దేశంతో సహా అన్ని దేశాలూ అలాంటివి మరింత వేగంతో, ఎక్కువ దూరం ప్రయాణించేందుకు నిరంతరం పరిశోధనలు జరుపుతూనే ఉంటాయి. ది కంట్రీస్ ఆఫ్ డాట్ కామ్ ఆగస్టు ఎనిమిదిన వెల్లడించిన సమాచారం ప్రకారం 2023లో క్షిపణి సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రస్థానంలో వున్న పది దేశాల వరుస ఇలా ఉంది. రష్యా, అమెరికా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, భారత్, ఇజ్రాయెల్, పాకిస్థాన్, ఇరాన్, ఉత్తర కొరియా ఉన్నాయి.మన పొరుగునే ఉన్న పాకిస్థాన్ ఇప్పటికే 2,300 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల ఘౌరీ, షాహిన్ క్షిపణులను కలిగి ఉంది, వాటిని ఇంకా విస్తరించే పరిశోధనలో ఉంది. దాని దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి. అంత మాత్రాన భారతీయులు భయపడాల్సిన అవసరం లేదు. మనకు పాక్, చైనా ఎంత దూరమో, మనం కూడా వాటికి అంతేదూరంలో ఉన్నాము.
ఒకరు బాంబులు విసురుతుంటే రెండోవారు గులాబ్ జాములు అందిస్తూ స్పందించేంత ఉత్తములు ఈ రోజుల్లో ఎవరూ ఉండరు. అలా ఉండాలన్నా ఉండనివ్వరు. శత్రుదేశాల ఉపగ్రహాల మీద దాడి చేసేందుకు అవసరమైన ఆయుధాలను చైనా రూపొందిస్తున్నట్లు, ఇతర దేశాల ఉప గ్రహాలను అదుపులోకి తెచ్చే సత్తా ఉన్నదని సిఐఏ నివేదించినట్లు బహిర్గతమైన అమెరికా గూఢచార, ఇతర కీలక పత్రాల్లో ఉంది.చైనా ఆయుధాల గురించి సిఐఏ పత్రాలను ఉటంకిస్తూ ఫైనాన్సియల్ టైమ్స్ పత్రికలో పేర్కొన్నారు. స్టాక్‌హౌమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ(సిప్రి) విడుదల చేసిన 2022 వార్షిక నివేదికలో ప్రపంచంలో మిలిటరీ ఖర్చు కొత్త రికార్డు నెలకొల్పినట్లు పేర్కొన్నది. అంతరిక్షం, సైబర్ రంగాలలో అమెరికా ముందున్నది. తాజాగా చంద్రయాన్ -3 విజయం, ఇతర ఉపగ్రహాల ప్రయోగాలతో మన దేశం కూడా ధీటుగా ఉండేందుకు అవకాశాలు పెరుగుతున్నాయి. సైబర్ నిఘాలో అమెరికా ప్రపంచ ఛాంపియన్‌గా ఉంది. అమెరికాకు చెందిన స్టార్‌లింక్ ఉపగ్రహ సమాచార వ్యవస్థ ద్వారా రష్యా సేనల సమాచారం గురించి ఎప్పటికప్పుడు ఉక్రెయిన్‌కు అందచేస్తున్న సంగతి తెలిసిందే. దాని ద్వారా మనతో సహా ఏ దేశ సమాచారాన్నైనా అమెరికా తెలుసుకోవచ్చు. దీని మాతృసంస్థ ఎలాన్ మస్క్ అధిపతిగా ఉన్న స్పేస్ ఎక్స్ కంపెనీ ఇప్పటి వరకు 3,580 చిన్న ఉపగ్రహాలను పంపి 53 దేశాలకు సమాచారాన్ని అందచేస్తున్నది, వాటిని పన్నెండువేలకు పెంచాలని కూడా చూస్తున్నది. అంతరిక్షంలో అమెరికా ఆధిపత్యానికి ఇదొక నిదర్శనం.
అమెరికా, అది ఎగదోస్తున్న దేశాలు ఇటీవలి కాలంలో మిలిటరీ ఖర్చు పెంచటం, కొత్త కూటములను కడుతుండటంతో మన దేశం, చైనా కూడా తన ఖర్చును పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్టాక్‌హౌం సంస్థ పరిగణనలోకి తీసుకున్న అంశాల ప్రకారం ప్రపంచంలో 40దేశాలు గణనీయంగా ఖర్చు చేస్తున్నాయి. వాటిలో మన దేశం మూడవ స్థానంలో ఉండగా మన పొరుగునే ఉన్న పాకిస్తాన్ 24వదిగా ఉంది. ఏ దేశమైనా మిలిటరీ ఖర్చును పెంచి అది జనాల మీద భారం,జీవితాలు మెరుగుపడే అవకాశం లేదన్నది అనేక దేశాల అనుభవం చెబుతున్నది. ఉగ్రవాదం కారణంగా పక్కనే ఉన్న శ్రీలంక తన వనరులన్నింటినీ ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు గాను మిలిటరీని విపరీతంగా పెంచింది. ఉగ్రవాదులను నిర్మూలించినా వెంటనే దాని మిలిటరీ ఖర్చు వెంటనే తగ్గదని తేలింది.మనతో గిల్లికజ్జాలు పెట్టుకొనే పాకిస్తాన్ తలసరి ఖర్చు మనకంటే ఎక్కువే. అది ఇప్పుడు ఆర్థికంగా ఎంత దివాళా తీసిందో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నదో చూస్తున్నదే. మన దేశంలో ఉన్న కొంత మంది చైనాను బూచిగా చూపి మిలిటరీ బడ్జెట్‌ను గణనీయంగా పెంచాలని చెప్పటం వెనుక అమెరికా మిలిటరీ కార్పొరేట్ లాబీ ఉందన్నది స్పష్టం.మన జిడిపితో పోలిస్తే చైనా ఐదురెట్లు ఎక్కువ.అందువలన దానితో మిలిటరీ ఖర్చులో మనం పోటీ పడాలంటే వనరులన్నింటినీ మళ్లించాల్సి ఉంటుంది. అది జరిగితే ఆర్థికవృద్ది కుంటుపడుతుంది.అలాగని మన రక్షణ ఏర్పాట్లను నిర్లక్ష్యం చేయనవసరం లేదు.
