ఎం కోటేశ్వరరావు
ఇంతకీ నరేంద్రమోడీ ఎవరు ? లోక్‌సభ ఎన్నికలకు ముందు చెప్పినట్లు మహత్తర లక్ష్యం కోసం దేవుడు పంపిన దూత అనుకోవాలా ? తాజాగా చెప్పినట్లు మానవుడినే కానీ దేవుడిని కాదు, తప్పులు చేసి ఉంటా అనే మాటలు నమ్మాలా ? మోడీ గురించి తెలిసిన వారు ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగు ధన్యుడు అనుకుంటారు. ఇక తేల్చుకోవాల్సింది భక్తులే ! అప్పుడు దేవుడు ఎందుకు పంపాడని చెప్పారో ఇప్పుడు మానవుడినే అని ఎందుకు అన్నారో మోడీ ఎలాగూ నోరు విప్పరు గనుక ఆయన ప్రధమ గణాలు వివరించాలి. ఈ కాలంలో మోడీ నెరవేర్చిన లేదా మిగిలిపోయిన మహత్తర లక్ష్యం ఏమిటో ఎవరికైనా తెలుసా ? జరోధా అనే సంస్థ తరఫున నిఖిల్ కామత్ 2025 జనవరిలో మోడీతో నిర్వహించిన పాడ్‌కాస్ట్ ( ఒక జర్నలిస్టు జరిపే ముఖాముఖీ`ప్రశ్నలు ముందే ఇవ్వాలి, ఇంటర్య్వూ సమయంలో మోడీని ఇబ్బందికరమైన కొత్త ప్రశ్నలు అడగకూడదు అనే షరతులు వర్తిస్తాయి)లో అనేక అంశాలను వివరించారు. తనకు దేశమే ప్రధమ లక్ష్యం అన్నారు. గుజరాత్ సిఎంగా పని చేస్తున్నపుడే మరో ఇరవై సంవత్సరాల పాటు పనిచేసే బృందాన్ని తాను తయారు చేశానని, ఇప్పుడు కూడా చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఆ బృందంలో ఎవరున్నారో వెల్లడిరచలేదు, వ్యక్తుల పేర్లు చెబితే అనేక మంది ఇతరులకు అన్యాయం చేసినట్లు అవుతుందని చెప్పుకున్నారు. దీన్ని బట్టి ఆ బృందం ఒక బ్రహ్మపదార్ధం అనాల్సి ఉంటుంది.ప్రతివారినీ తన ఖాతాలో వేసుకోవచ్చు. మరికొన్ని సుభాషితాలు, స్వంత గొప్పలు ఇలా ఉన్నాయి. తప్పులు సహజం కానీ దురుద్ధేశ్యాలతో చేయలేదు, నేనూ తప్పులు చేసి ఉంటాను, నేను మనిషిని దేవుడిని కాదు. నేను ఒక విలక్షణమైన రాజకీయవేత్తను కాదు.నేను ఎన్నికల సమయంలో రాజకీయ ప్రసంగాలు చేయాల్సి ఉంటుంది. అది నాకు తప్పనిసరి, నాకది ఇష్టం లేదు గానీ చేయాల్సి ఉంటుంది. పాడ్‌కాస్ట్ ఇలా సాగింది. మహాత్మా గాంధీ, సావర్కర్ మార్గాలు వేరైనా ఇద్దరూ స్వాతంత్య్రం కోసమే పోరాడారంటూ ఇద్దరూ ఒకటే అన్నట్లుగా చిత్రించారు. జైలు నుంచి విడుదల చేస్తే బ్రిటీష్ వారికి సేవ చేసుకుంటానని, స్వాతంత్య్ర ఉద్యమానికి దూరంగా ఉంటానంటూ ప్రేమ లేఖలు రాసిన సావర్కర్‌ను గాంధీతో పోల్చటం చరిత్ర వక్రీకరణ తప్ప మరొకటి కాదు.
ఎనిమిది నెలల క్రితం తన జన్మ జీవ సంబంధమైనది కాదని (2024 లోక్‌సభ ఎన్నికల చివరి దశ) లో నరేంద్రమోడీ చెప్పుకున్నారు, ఇప్పుడు మానవుడిని అని చెప్పుకోవటం నష్ట నివారణ చర్య అని స్పష్టంగా కనిపిస్తోందని కాంగ్రెస్ నేత జయరామ్ రమేష్ వ్యాఖ్యానించారు. భూమ్మీద తన ఉనికి కేవలం జీవ సంబంధమైనది కాదని, తన తల్లి మరణించిన తరువాత తనను దేవుడు భూలోకంలోకి ఒక లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు పంపాడని తనకున్న శక్తులను చూసిన తరువాత తానీ మాటలు చెప్పగలుగుతున్నట్లు మోడీ చెప్పిన సంగతి తెలిసిందే. ‘‘ నా తల్లి బతికి ఉన్నంత వరకు నేను కూడా జీవసంబంధంగానే జన్మించానని అనుకున్నాను. కానీ తరువాత అనుభవాలను చూస్తే పరమాత్ముడు ఒక లక్ష్యం కోసం పంపాడని నేను నమ్మాను, ఆ లక్ష్యం నెరవేరిన తరువాత మరోసారి నాతో పని ఉండదు. అందువల్లనే నేను పూర్తిగా దేవుడి కోసం అంకితమయ్యాను, నేను ఒక సాధనాన్ని తప్ప మరొకటి కాదు ’’ అంటూ అదానీ యాజమాన్యంలోని ఎన్‌డిటివితో మోడీ చెప్పారు.( ఆ లక్ష్యం ఏమిటో, ఎంత వరకు వచ్చింది, పూర్తి చేసిందీ లేనిదీ చెప్పలేదు) ఒక సామాన్యుడు ఇలాంటి మాటలు మాట్లాడితే అలాంటి వారిని నేరుగా మానసిక వైద్యుడి వద్దకు తీసుకు వెళతారు అంటూ అప్పుడు రాహుల్ గాంధీ అపహాస్యం చేశారు. ఎవరెన్ని విమర్శలు చేసినా మోడీ మారు మాట్లాడలేదు. అంతకు కొద్ది రోజుల ముందు తననెవరూ దెబ్బతీయలేరని, తాను మూడు, ఐదు చివరికి ఏడు ఎన్నికలైనా సరే గెలుస్తూనే ఉంటానని చెప్పుకున్నారు.తనకు ఓటు వేయటం అంటే పుణ్యం చేసుకోవటమే అని కూడా చెప్పారు. మోడీ చుట్టూ ఉన్నవారు కూడా ఆయనను ఆకాశానికి ఎత్తిన తీరు చూశాము. ఎంతగా అంటే పూరీ జగన్నాధుడు కూడా నరేంద్రమోడీ భక్తుడేనని ఒడిషాకు చెందిన బిజెపి నేత సంబిత్ పాత్ర వర్ణించి తరువాత నోరు జారినట్లు చెప్పుకున్న సంగతి తెలిసిందే.
చరిత్రలో అవతార పురుషులమని ప్రదర్శించుకున్నవారందరూ ఇలాగే ఒక లక్ష్యం కోసం ఉద్భవించినట్లు చెప్పుకున్నవారే. దైవదూతను అన్న నోటితోనే అదానీ, అంబానీలు రాహుల్ గాంధీకి టెంపోల నిండుగా నోట్ల కట్టలు పంపారని తుచ్చ మానవుల మాదిరి మోడీ ఎన్నికల సమయంలో ఆరోపణ చేసిన సంగతిని గుర్తుకు తెచ్చుకోవాలి. అంటే ఆ పారిశ్రామిక, వాణిజ్యవేత్తల వద్ద లెక్కల్లో చూపని నల్లధనం పెద్ద ఎత్తున ఉందని చెప్పటమే. బహుశా ఆ వ్యాఖ్యల తరువాత తన స్నేహితుల గురించి మాట్లాడిరది తప్పని తెలిసిందో లేక వారి నుంచి హెచ్చరికలు వచ్చాయో తెలియదు గానీ తరువాత మరోసారి ప్రస్తావించలేదు. అంతే కాదు ప్రతిపక్షపార్టీల నేతలందరూ ముజ్రా పనులు చేస్తున్నారంటూ దిగువ స్థాయి విమర్శలు కూడా చేశారు.(ఉత్తరాదిన వేశ్యలతో కులీనులు చేసే గానాబజానాలను ముజ్రా అంటారు). తనకు ఇల్లూ, సంసార బంధాలు లేవు, దేశం కోసమే పుట్టినట్లు నరేంద్రమోడీ చెప్పుకుంటారు, భక్తులు కూడా అదే చెబుతారు. గుజరాత్ రాజధాని గాంధీ నగర్‌లో ధనికులు నివసించే ప్రాంతంలో తనకు ఒక ఇంటి స్థలం ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్న అంశాన్ని కారవాన్ పత్రిక వెల్లడిరచింది. ముఖ్యమంత్రిగా ఉండగా తన పేరున తానే మంజూరు చేసుకున్న స్థలమది. దాని మీద వివాదం చెలరేగటం, కోర్టులకు ఎక్కటంతో సదరు స్థలాన్ని పార్టీకి ఇస్తానని మోడీ చెప్పారు. ఏ బంధాలు లేని తాను స్థలం తీసుకోవటం ఎందుకు, తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం చేయకుండా పార్టీకి ఇస్తానని చెప్పటం ఏమిటి ? ఈ స్థలం ఉన్న అంశం గురించి మసిబూసి మారేడు కాయ చేసే ప్రయత్నం జరిగిందనే ఆరోపణ ఉంది.
నరేంద్రమోడీ గురించి ఉన్నతంగా చిత్రించేందుకు ప్రశాంత కిషోర్ వంటి నిపుణులెందరో పని చేశారన్నది బహిరంగ రహస్యం. దానికి గోడీ మీడియా ఎంతగానో సహకరించిందని అనేక మంది విమర్శలు చేసింది కూడా వాస్తవమే.2019లో ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్రమోడీ పేరుతో ఒక ప్రచార సినిమా కూడా తీశారు. వాస్తవాల ఆధారంగా తీసినట్లు చెప్పిన ఆ సినిమాలో వక్రీకరణలు, అవాస్తవాలెన్నో, అన్నింటినీ త్యజించి దేశం కోసమే మోడీ పాటుపడుతున్నట్లు చిత్రించారు.ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా పనిచేసిన నరేంద్రమోడీ బాల్యంలో ఒక చేత్తో టీ అమ్ముతూ మరో చేత్తో జాతీయ జండాను పట్టుకున్నట్లు, దానికి వందనం చేసినట్లు చూపారు. వాస్తవం ఏమంటే అదే ఆర్‌ఎస్‌ఎస్ స్వాతంత్య్రం వచ్చిన తరువాత 52 సంవత్సరాల పాటు జాతీయ జండాను ఎగురవేయటానికి నిరాకరించింది, బాల్యంలోనే జాతీయ భావాలతో పెరిగినట్లు సినిమాలో చూపిన మోడీ కూడా ఆర్‌ఎస్‌ఎస్‌లో భాగస్వామే.శ్రీనగర్ లాల్ చౌక్‌లో ఆర్మీ పహారాలో బిజెపి నేత మురళీ మనోహర జోషి జాతీయపతాకాన్ని ఎగురవేశారు. కానీ ఈ చిత్రంలో నరేంద్రమోడీ ఆ పని చేశారని చిత్రించటం కళ్ల ముందే చరిత్రను వక్రీకరించటం తప్ప మరొకటి కాదు. దేశ చరిత్రలో ఏ ప్రధానీ చేయని విధంగా గుళ్లు గోపురాలు తిరిగి, ధ్యానం పేరుతో ఫొటో ప్రదర్శనలు, అయోధ్యలో రామాలయ ప్రారంభం సందర్భంగా అన్నీ తానై చేసిన హడావుడి, బాలరాముడి చిత్రంతో నరేంద్రమోడీ బొమ్మ పెట్టి వేసిన పోస్టర్లు, ఫ్లెక్సీలు, వాటన్నింటికీ పరాకాష్టగా అసలు తనది జీవసంబంధ జన్మ కాదని చెప్పుకొనేంత వరకు వెళ్లింది. ఇప్పుడు తాను మానవుడనే అని, తప్పులు చేయటం సహజం అని చెప్పుకోవటం కూడా తన గురించి తాను గొప్పగా చెప్పుకోవటంలో భాగమే అన్నది స్పష్టం.మాట మార్చి తాను మానవమాత్రుడనని ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది ? అయోధ్యలో బిజెపి ఓడిపోవటం, వారణాసిలో తన మెజారిటీ భారీగా పడిపోవటం, లోక్‌సభలో ఒక పార్టీగా బిజెపికి సంపూర్ణ మెజారిటీని తీసుకురావటంలో వైఫల్యం, గతంకంటే ఓట్లు కూడా తగ్గటం, దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారుడు, ఎటు చూసినా వైఫల్యాలే కనిపిస్తుండగా తాను దైవాంశ సంభూతుడనని, తన శక్తి గురించి చెప్పుకొనే అవకాశాలు ఆవిరయ్యాయి. వీటి గురించి ఎవరు ఎక్కడ ప్రశ్నిస్తారో అని గ్రహించి తాను కూడా మానవ మాత్రుడనేనని, వైఫల్యాలు సహజమేనని చెప్పుకొనేందుకు చూసినట్లు కనిపిస్తోంది.
