Tags
Annexation of Hyderabad, BJP, Facts vs Myths, Jammu and Kashmir, Jawaharlal Nehru, Kashmir problem, Narendra Modi Failures, Pakistan-Occupied Kashmir, POK, RSS, Sardar Vallabhbhai Patel
ఎం కోటేశ్వరరావు
ఆక్రమిత కాశ్మీరు(పిఓకె)ను పూర్తిగా స్వాధీనం చేసుకొనే వరకు యుద్ధాన్ని ఆపకూడదని నాటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పిన అభిప్రాయాన్ని నాటి ప్రధాని నెహ్రూ అంగీకరించలేదని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. ఆమోదించి ఉంటే పహల్గామ్ దారుణం జరిగి ఉండేది కాదని మే 27వ తేదీన గుజరాత్ పర్యటనలో చెప్పిన మాటలకు మీడియా పెద్ద ఎత్తున ప్రాచుర్యం కల్పించింది. కాశ్మీరును ఆక్రమించుకొనేందుకు నాటి ముజాహిదిన్ దాడుల కొనసాగింపే పహల్గామ్ ఉదంతం అని మోడీ వర్ణించారు. నెహ్రూ నాడు యుద్ధాన్ని మధ్యలోనే ఆపివేసి చారిత్రక తప్పిదం చేశారని సంఘపరివార్ సంస్థలలో ఒకటైన బిజెపి పదే పదే చెబుతోంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా జరిపిన ఆపరేషన్ సిందూర్ కొనసాగించి ఆక్రమిత కాశ్మీరును విముక్తి చేయకుండా నరేంద్రమోడీ సర్కార్ వచ్చిన మంచి అవకాశాన్ని విడిచిపెట్టిందని జనం భావిస్తున్నారు. కనీసం ఉగ్రవాదుల మీద పాకిస్తాన్ నుంచి ఎలాంటి హామీ పొందకుండా సిందూర్‌ను నిలిపివేసిందని తీవ్ర అసంతృప్తి, విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో మోడీ జనం దృష్టిని మళ్లించేందుకు వల్లభాయ్ పటేల్ మాటున రక్షణ పొందినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గుడ్డిగా నమ్మేవారుంటే అది తాత్కాలికమే, వారు ఒకసారి కళ్లు తెరిస్తే నాన్నా పులి కథే. చివరికి నిజం చెప్పినా నమ్మరు.
కాశ్మీరు సమస్యను ఇరుదేశాలు పరిష్కరించుకోవాలన్నది సిమ్లా ఒప్పంద స్ఫూర్తి.దాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్ పాలకులు చిత్తశుద్దితో పనిచేసి పరిష్కరించలేదన్నది ఒక విమర్శ. వాస్తవమే, మరి బిజెపి చేసిందేమిటి ? జనతా పార్టీలో అది భాగస్వామి, వాజ్‌పాయి విదేశాంగ మంత్రిగా పని చేశారు. తరువాత ప్రధాని అయ్యారు. పదకొండు సంవత్సరాలుగా నరేంద్రమోడీ ఏలుబడి సాగుతున్నది. బిజెపి, దాని పూర్వ రూపమైన జనసంఫ్‌ు కాశ్మీరు సమస్యను ఓట్ల కోసం వాడుకోవటం తప్ప ఆక్రమిత కాశ్మీరును సాధించేందుకు మనదేశం వైపు నుంచి చేసిన ఒక్క ప్రయత్నాన్ని చూపమనండి. ఎందుకంటే ఆ సమస్య అలానే రావణకాష్టంలా కాలుతూ ఉండాలి. నెహ్రూ, కాంగ్రెస్‌ల మీద విమర్శలు చేస్తూ ఓట్లు దండుకొనేందుకు వినియోగించుకోవాలన్నది తప్ప బిజెపి చిత్తశుద్ది ఏమిటి ? 1994లోనే పార్లమెంటు ఆక్రమిత కాశ్మీరు మనదే అనే తీర్మానాన్ని కూడా ఆమోదించింది. మాకు అధికారమిస్తే పిఒకెను చిటికెలో వెనక్కు తీసుకువస్తాం అని తుపాకి రాముడు కబుర్లు చెప్పటం తప్ప పదకొండు సంవత్సరాల్లో ఒక్క అడుగువేసింది లేదు. ఆపరేషన్ సిందూర్‌తో వచ్చిన మంచి అవకాశాన్ని ట్రంప్ బెదిరిస్తే వెనక్కు తగ్గినట్లుగా జనం అనుకుంటున్నందున ముఖం మీద చెప్పకపోవచ్చుగానీ బిజెపి కబుర్లను ఇంకేమాత్రం నమ్మేస్థితి లేదు. దుకాణదారులు గోడమీద అప్పు రేపు అని రాసినట్లుగా రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్ మరోమారు గురువారం నాడు అదే చెప్పారు. పిఓకెను మనకు పాక్ అప్పగించకపోతే ఏం చేస్తారో ఎప్పుడు చేస్తారో చెప్పాలన్న ప్రశ్నలకు సూటిగా చెప్పకుండా తెస్తాం అంటే మరో 75 ఏండ్లు ఆగాలని అర్ధమా !
పాకిస్తాన్‌లో భాగమైన తూర్పు బెంగాల్( నేటి బంగ్లాదేశ్)లో తలెత్తిన 1971 తిరుగుబాటును నాడు మనదేశం చక్కగా వినియోగించుకొని పాకిస్తాన్లోని ఒక ముక్కను విడగొట్టి ఒక తలనొప్పిని వదిలించుకుంది. నాడు పాకిస్తాన్‌కు మద్దతుగా అమెరికా మనలను బెదిరించేందుకు బంగాళాఖాతంలోకి తన సప్తమ నౌకాదళాన్ని దింపింది. అయినా ఖాతరు చేయకుండా ముందుకు పోవటమే కాదు, సోవియట్‌తో రక్షణ సంధి చేసుకున్నాం. మనకు మద్దతుగా తాను రంగంలోకి దిగాల్సి ఉంటుందనే సందేశం వెలువడటంతో అమెరికా వెనక్కు తగ్గింది. ఇప్పుడు పహల్గాం రూపంలో వచ్చిన అవకాశాన్ని నరేంద్రమోడీ ఎందుకు వినియోగించకోలేదు ? అన్నింటి కంటే ట్రంప్ జోక్యం లేదా బెదిరింపులతో వెనక్కు తగ్గి ఏమీ సాధించకుండానే పాకిస్తాన్‌తో రాజకీ కుదుర్చుకున్నట్లు జనం భావిస్తున్నారు. లేదూ పాక్ కోరికతో మనమే రాజీపడ్డామని చెబుతున్నారు, దాని ప్రకారమే అయినా ఏం సాధించారని సంధికి అంగీకరించారు. ఇప్పుడు కూడా రష్యాతో రక్షణ ఒప్పందం ఉంది అయినా 56 అంగుళాల ఛాతీ ధైర్యం చేయలేకపోయింది.
నాణానికి బొమ్మా బొరుసూ ఉన్నట్లే కాశ్మీరుపై పటేల్ వైఖరిలో రెండూ ఉన్నాయి. పత్రికలు చదివేవారూ, టీవీలు చూసే ప్రతి ఒక్కరు చరిత్రలో ఏం జరిగిందనే శోధన చేయరనే గట్టి విశ్వాసంతో తమకు కావాల్సిందాన్నే కొందరు చెబుతారు.2018 ఫిబ్రవరి ఏడవ తేదీన ప్రధాని నరేంద్రమోడీ లోక్‌సభలో మాట్లాడుతూ ‘‘ సర్దార్ పటేల్ గనుక భారత తొలి ప్రధాని అయి ఉంటే మొత్తం కాశ్మీరు మనదే అయి ఉండేది ’’ అని చెప్పారు.కానీ అదే పటేల్‌కు అసలు కాశ్మీరు గురించి ఆసక్తి ఉందా ? ఉంటే నాటి రక్షణ మంత్రి బలదేవ్ సింగ్‌కు అలా లేఖ రాసేవారా ? కల్నల్ కటోచ్‌ను కాశ్మీరులో నియమించాలని, ఒకవేళ కాశ్మీరు గనుక వేరేదేశం(పాకిస్తాన్)లోకి వెళ్లిపోతే అతన్ని తిరిగి మనదేశానికి తీసుకురావాలని నరేంద్రమోడీ పుట్టక ముందే 1947 సెప్టెంబరు 13న లేఖ రాశారు. అది ఇంటర్నెట్‌లో అందరికీ అందుబాటులో ఉంది.
1947 ఆగస్టుఅక్టోబరు మధ్య తొలిసారిగా భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. అనేక మంది చరిత్రకారులు, విశ్లేషకులు రాసినదాన్ని బట్టి కాశ్మీరును రాబట్టుకోవాలా లేదా అనే అంశంలో నెహ్రూ, పటేల్ మధ్య గందరగోళం ఉంది. కనుకనే సెప్టెంబరులో పటేల్ అలా లేఖరాశారన్నది స్పష్టం. పటేల్ వైఖరి గురించి నరేంద్రమోడీ నోరు విప్పక ముందే అనేక మంది తమ రచనల్లో చర్చించారు. అవన్నీ అందుబాటులో ఉన్నాయి. ఎవరికి వారు స్వంత అభిప్రాయాలకు రావచ్చు. 1984లో రాజేంద్ర శరీన్ ‘‘పాకిస్తాన్ ద ఇండియా ఫాక్టర్ ’’ అనేపేరుతో రాసిన పుస్తకంలో అనేక అంశాలను చర్చించారు. అబ్దుల్ రాబ్ నిష్తార్ అనే పాకిస్తాన్ మంత్రితో పటేల్ సంభాషిస్తూ ‘‘ భాయ్ హైదరాబాద్, జునాఘడ్‌ల గురించి మాటలొద్దు, కాశ్మీరు గురించి చెప్పండి, కాశ్మీరును తీసుకోండి సమస్యను పరిష్కరించండి ’’ అని చెప్పినట్లుగా పేర్కొన్నారు. మౌంట్‌బాటన్ పాక్ ప్రధాని లియాకత్ అలీతో భేటీ అయినపుడు పాక్ రాజ్యాంగపరిషత్ సభ్యుడు సర్దార్ షౌకత్ హయత్ కూడా ఉన్నాడు. పాకిస్తాన్ గనుక హైదరాబాద్‌ను వదులు కుంటే దానికి బదులుగా కాశ్మీరును భారత్ ఇస్తుందని మౌంట్‌బాటన్ పటేల్ సందేశంగా లియాకత్ అలీకి చెప్పాడు. దాని మీద సంభాషణల్లో ‘‘ సర్దార్ సాహెబ్ మీకేమైనా మతిపోయిందా పంజాబ్ కంటే పెద్దదైన ప్రాంతాన్ని మనం ఎందుకు వదులుకోవాలి, దానికి బదులుగా కొన్ని పర్వతాలున్న దాన్ని ఎందుకు తీసుకోవాలి ’’ అన్నాడు. అంతే కాదు రాజేంద్ర శరీన్ పుస్తకంలో ఇంకా ఏమి ఉటంకించిదీ చూద్దాం.1947 జూన్‌లో కాశ్మీరు రాజు హరిసింగ్‌తో మౌంట్‌బాటన్ భేటీ అయ్యాడు. ఆ సందర్భంగా మౌంట్‌బాటన్ మాట్లాడుతూ ‘‘ మీరు పాకిస్తాన్‌తో కలవదలచుకుంటే భారత్ దాన్ని ఒక తప్పుగా భావించదు, ఆ మేరకు సర్దార్ పటేల్ స్వయంగా గట్టి హామీ ఇచ్చారు ’’ అని చెప్పినట్లు నాడు పటేల్ రాజకీయ కార్యదర్శిగా ఉన్న వి శంకర్ ( సర్దార్ పటేల్‌తో నా జ్ఞాపకాలు 1974 ) అనేపుస్తకంలో రాశారు.‘‘ కాశ్మీరు పాలకుడు ఒకవేళ తాను, తన రాజ్యానికి పాకిస్తాన్‌తో కలవాలనే ఆసక్తి ఉంటే ఆ దారికి నేను అడ్డుపడను ’’ అని పటేల్ అన్నట్లుగా కూడా శంకర్ రాశారు.
కాశ్మీరు గనుక పాకిస్తాన్ వైపు వెళ్లాలని ఎంచుకుంటే దాని నిర్ణయాన్ని నేను నిరాక్షేపణీయంగా అంగీకరిస్తానని పేర్కొన్నారు. నిజంగా పటేల్ ప్రధాని అయివుంటే అన్నంత పనీ చేసి ఉండేవారు కాదా ! ఈ విషయాన్ని అదే పటేల్ ఉపప్రధానిగా ఉన్నపుడు ప్రభుత్వ కార్యదర్శిగా పని చేసిన విపి మీనన్ నిర్ధారించారని 1990లో ప్రచురితమైన ‘‘ పటేల్ ఏ లైఫ్( పటేల్ జీవితం ) అనే గ్రంధంలో మహాత్మాగాంధీ మనవడు, చరిత్రకారుడు రాజ్‌మోహన్ గాంధీ రాశారు. అదే విషయాన్ని మౌంట్‌బాటన్ అప్పుడే మహమ్మదాలీ జిన్నాకు కూడా చేరవేశారు. అంతే కాదు కాశ్మీరు స్వతంత్ర దేశంగా ఉన్నప్పటికీ దాన్ని వ్యతిరేకించబోమని చెప్పినట్లు కూడా మౌంట్‌బాటన్ చెప్పాడు. కాశ్మీరును తీసుకొని దాని బదులు జునాఘడ్, హైదరాబాద్ సంస్థానాలను మనం తీసుకోవాలన్నది పటేల్ వైఖరి. అయితే మూడు సంస్థానాలూ తమకే కావాలనే దురాశతో జిన్నా దానికి ఒప్పుకోలేదు. ఒకవేళ అంగీకరించి ఉంటే……
స్వాతంత్య్రం వచ్చిన సమయంలో సంస్థానాలు ఏ దేశంలో విలీనం కావాలో నిర్ణయించుకొనే స్వేచ్చను ఇచ్చారు. అది తప్పా ఒప్పా అంటే దానికి పటేల్ కూడా నాడు అంగీకరించారు. గట్టిగా పటేల్ అడ్డుపడి ఉంటే అసలు సమస్యే ఉండేది కాదు, కాశ్మీరు ఆక్రమణకు గురయ్యేదే కాదు. హైదరాబాద్ సంస్థానం, కాశ్మీరు స్వతంత్ర దేశాలుగా ఉంటామని ప్రకటించుకోగా జునాఘడ్(ప్రస్తుత గుజరాత్ రాష్ట్రంలో ఉంది) పాకిస్తాన్‌తో చేరాలని నిర్ణయించుకుంది.కాశ్మీరులో అత్యధికులు ముస్లింలు కాగా పాలకుడు హిందూ రాజు, జునాఘడ్, హైదరాబాదులో అత్యధికులు హిందువులు కాగా పాలకులు ముస్లింలు. పటేల్‌కు ఆ నాటికే ముస్లింలంటే పడదో లేక దేశవిభజనకు కారకులయ్యారనే కోపమో ఏమో హైదరాబాద్, జునాఘడ్‌లను వదులుకొనేది లేదు, కావాలంటే కాశ్మీరును పాకిస్తాన్ తీసుకుంటే వ్యతిరేకించం అని చెప్పినట్లు కనిపిస్తోంది. తరువాత పటేల్ వైఖరిలో మార్పు వచ్చిందంటే దానికి కారణం కాశ్మీరు గురించి నెహ్రూ ఇతర నేతలు గట్టిగా నిలవటం, పాకిస్తాన్ దురాక్రమణకు పూనుకోవటమే. కాశ్మీరు హిందూ రాజు స్వతంత్ర దేశమంటూ నాటి బ్రిటన్, అమెరికా పన్నిన కుట్రలో భాగంగా హడావుడి చేస్తే అక్కడి జనం ముస్లింలు మాత్రం నేషనల్ కాన్ఫరెన్సు నాయయకుడు షేక్ అబ్దుల్లా నాయకత్వంలో భారత్‌లో విలీనాన్ని కోరుకున్నారు. ఆ కారణంగానే మూడొంతుల కాశ్మీరు మనలో విలీనమైంది. దక్షిణాసియాలో అమెరికా, బ్రిటన్ చెప్పుచేతల్లో ఉండే పాకిస్తాన్, దానికి మరో స్వతంత్ర దేశంగా కాశ్మీరుకూడా తోడు కావటాన్ని నాటి సోవియట్,చైనా తదితర సమీప దేశాలేవీ అంగీకరించలేదు. అదే జరిగి ఉంటే ఎలాంటి ముప్పు వచ్చి ఉండేదో సిక్కిం అనుభవం తరువాత తెలిపింది.
చైనాభారత సరిహద్దులో సిక్కిం మనదేశంలో విలీనం కాలేదు. రాచరిక దేశంగా ఉంది. అక్కడ పాగా వేసేందుకు రాజుకు అమ్మాయిలను ఎరవేసి తనవైపు తిప్పుకోవాలని అమెరికా చేసిన యత్నాన్ని నాటి ప్రధాని ఇందిరా గాంధీ నాయకత్వంలోని యంత్రాంగం వమ్ముచేసింది. భారత్‌లో విలీనానికి అవసరమైన కథనడిపి విజయవంతమైంది.ప్రజాభిప్రాయం మేరకు 1975లో మన దేశంలో విలీనమైంది. లేకుంటే హిమాలయాల్లో అమెరికా తొత్తు దేశంగా ఇజ్రాయెల్ మాదిరి మనకూ, చైనాకూ సమస్యలను తెచ్చిపెట్టి ఉండేది. కాశ్మీరు సమస్యను ఐరాసకు తీసుకువెళ్లి జవహర్‌లాల్ నెహ్రూ పెద్ద తప్పుచేశారన్నది బిజెపి ఆరోపణ. తప్పో ఒప్పో జరిగిపోయింది. అలా తీసుకువెళ్లినందుకు నిరసనగా వల్లభాయ్ పటేల్ ఎందుకు రాజీనామా చేయలేదు ? అంటే ఆ నిర్ణయానికి ఆయన కూడా అంగీకరించినట్లే, కనుక నెహ్రూనే బాధ్యుడిని చేయటం వక్రీకరణ.భద్రతా మండలి ఒక తీర్మానం చేయాలని 1948 జనవరి ఒకటిన భారత్ కోరింది. దాని మీద అదే ఏడాది ఏప్రిల్ 21న 47వ నంబరు తీర్మానాన్ని ఆమోదించారు. దాని ప్రకారం ఉభయ దేశాలూ కాల్పుల విరమణ పాటించాలి. ఇతర ప్రాంతాల నుంచి పోరాటానికి వచ్చిన గిరిజనులు, పాక్ పౌరులు, ఇతరులు కాశ్మీరు నుంచి వెళ్లిపోవాలి.భారత ప్రభుత్వం తన ఆధీనంలోని ప్రాంతాలలో మిలిటరీని కనీస స్థాయికి తగ్గించాలి. తద్వారా పాకిస్తాన్, భారత్ ఏ దేశంలో చేరేదీ నిర్ణయించేందుకు ప్రజాభిప్రాయ సేకరణకు వీలు కల్పించాలి.అది 1949 జనవరి ఒకటి వరకు జరగలేదు. ఈలోగా ఐరాస కమిషన్ మూడుసార్లు కాశ్మీరు సందర్శించింది. పరిస్థితి మీద ప్రభావితం చూపే విధంగా కాశ్మీరులో పాకిస్తాన్ మార్పులకు పాల్పడిరది. అందువలన ముందుగా పాక్ తన మిలిటరీ, పౌరులను అక్కడి నుంచి ఉపసంహరించాలి.తరువాత భారత్ వెనక్కు తీసుకోవాలి. ఆ తరువాత ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని 1948 ఆగస్టులో కమిషన్ భద్రతా మండలికి నివేదించింది. దీన్ని మనదేశం అంగీకరించగా పాక్ తిరస్కరించింది. చట్టబద్దంగా కాశ్మీరు మనదేశంలో విలీనమైంది, అంటే పాక్ మిలిటరీ, అది మద్దతు ఇచ్చిన వారు కాశ్మీరులో ఉండటం అంటే శత్రుపూరిత చర్య, దురాక్రమణకు పాల్పడటమే, ప్రజాభిప్రాయ సేకరణ అంటే విలీనాన్ని నిర్ధారించేందుకు తప్ప అంతకు ముందే అన్ని లాంఛనాలు పూర్తయినట్లు మనదేశం వాదించింది. అయితే ఇతర దేశాలతో ఒప్పందం చేసుకొనే ముందు తొలుత తమతో కాశ్మీరు ప్రభుత్వం యథాతధస్థితి (కాశ్మీరు అంతకు ముందు మాదిరే ఉండేట్లు ) ఒప్పందం చేసుకుందని, కాశ్మీరు పౌరులు తిరుగుబాటు చేశారని, మహరాజు పారిపోయినందున అతగాడికి ఒప్పందం చేసుకొనే హక్కులేదని పాకిస్తాన్ వాదించింది. విముక్త కాశ్మీరు ఆందోళనలు, గిరిజనుల తిరుగుబాట్లు వాటికవే పుట్టినవి తప్ప వాటికి తమ మద్దతు గురించి విమర్శకు తావేలేదన్నది. ముందు పాకిస్తాన్ తన దళాలను ఉపసంహరించుకోవాలని భారత్ అంటే మేము తప్పుకున్న తరువాత భారత్ వైదొలుగుతుందన్న గ్యారంటీ ఏమిటి అంటూ పాకిస్తాన్ అడ్డం తిరిగింది. అంతే, తరువాత జరిగిందేమీ లేదు.బంగ్లా విముక్తి తరువాత 1972లో ఇరుదేశాలు పరస్పరం చర్చించుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని సిమ్లా ఒప్పందంలో నిర్ణయించటంతో ఐరాస పాత్రకు అవకాశం లేకుండా పోయింది. ఇప్పటి వరకు వాజ్‌పాయి, నరేంద్రమోడీ ఎవరు ఏలుబడిలో ఉన్నప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరూ చేసిందేమీ లేదు.
హైదరాబాద్ సంస్థాన విలీనం గురించి ఎందుకు పటేల్ అంతగట్టిగా పట్టుబట్టారనటం ఆసక్తి కలిగించే అంశం. దేశం మధ్యలో మరొక దేశం లేదా పాకిస్తాన్ ప్రాంతం ఉండటం అంటే కడుపులో కాన్సరే అని పటేల్ వర్ణించాడు. అది వాస్తవమే. మరొక కారణాన్ని కూడా కొట్టి పారవేయటానికి లేదు. నైజాం నవాబు మీద స్వాతంత్య్రానికి ముందు నుంచే కమ్యూనిస్టులు పాలనకు వ్యతిరేకంగా సాయుధపోరాటం చేస్తున్నారు. చైనాలో దీర్ఘకాలం సాగిన కమ్యూనిస్టుల లాంగ్ మార్చ్ మాదిరి భారత్‌లో కూడా నైజాం సంస్థానం మారితే ప్రమాదకరమని నెహ్రూ ప్రభుత్వాన్ని సిఐఏ హెచ్చరించిందని చెబుతారు. ఆపరేషన్ పోలో నాలుగు రోజుల్లోనే ముగిసింది కానీ తరువాత నెహ్రూపటేల్ సైన్యాలు కమ్యూనిస్టుల మీద మూడు సంవత్సరాల పాటు అణచివేతకు పాల్పడ్డాయి. నైజాం నవాబు, వాడితో చేతులు కలిపిన జాగీర్దార్లు, దేశముఖల కంటే మిలిటరీ ఎక్కువ మంది కమ్యూనిస్టులను చంపింది, ఒక్క తెలంగాణాలోనే కాదు, దానికి మద్దతు ఇచ్చిన ఆంధ్రప్రాంతంలో కూడా వందలాది మందిని పొట్టన పెట్టుకుంది. పాకిస్తాన్ వైపు నుంచి కాశ్మీరు ఆక్రమణకు పూనుకోవటం, భారత్‌లో విలీనానికి రాజు హరిసింగ్ అంగీకరించటం, కేంద్ర ప్రభుత్వం సైన్యాలను పంపిన తరువాత పటేల్ వైఖరిలో మార్పు రావటం అనివార్యం. ఉక్కు మనిషి, పట్టిన పట్టు వదలడు కదలడు అని పటేల్ గురించి చెబుతారు. కానీ నరేంద్రమోడీ చెప్పినట్లుగా ఆక్రమిత కాశ్మీరును విముక్తి చేసేంత వరకు యుద్ధం కొనసాగించి ఉండాల్సిందనే వైఖరి మీద గట్టిగా పట్టుబట్టినట్లుగానీ, దానికి తిరస్కరించిన నెహ్రూతో విబేధించి మంత్రివర్గం నుంచి బయటకు రావటం గానీ ఎక్కడా మనకు కనిపించదు. ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంలో 1949 జనవరి ఒకటి నుంచి రెండుదేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. పటేల్ కుమార్తె మణిబెన్ రాసిన డైరీలలో 1949 జూలై 23నమోదు చేసినదాని ప్రకారం ‘‘ మనం మొత్తం ప్రాంతం కావాలని కోరుతున్నాం… మొత్తం కాశ్మీరు కోసం పోరు సాగించాలి’’ అని ఉన్నట్లు బిజెపి నేత తరుణ్ విజయ్ రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. దానిలో నెహ్రూ నా మాట వినలేదు అనే భావం ఉందా ? అది కూడా యుద్దం ముగిసిన ఆరు నెలల తరువాత నిజంగానే నెహ్రూ వినలేదు అని చెప్పినందువలన ప్రయోజనం ఏముంది ? అంత పట్టుదలగల వ్యక్తి నిజంగా దేశానికి నష్టం జరిగిందని భావిస్తే రాజీనామా చేసి ఉండాలి. అటూ ఇటూ కాందిశీకులుగా వెళ్లిన వారు స్వస్థలాలకు వచ్చి తమ ఆస్తులను విక్రయించుకొనేందుకు వీలు కల్పించే ఒప్పందాన్ని నెహ్రూ పాకిస్తాన్‌తో చేసుకున్నారనే కారణంతో నిరనస తెలిపి వాణిజ్యశాఖ మంత్రిపదవికి శ్యామప్రసాద ముఖర్జీ రాజీనామా చేసి బయటకు వచ్చారు. తరువాత వెంటనే జనసంఘాన్ని ఏర్పాటు చేశారు. దానికే అంత పట్టుదల ఉంటే మరి ఉక్కు మనిషి పటేల్‌కు కీలకమైన కాశ్మీరు విషయంలో నెహ్రూతో విబేధాలు ఉంటే ఎందుకు బయటకు రానట్లు ? అందువలన కాశ్మీరు సమస్య మీద పటేల్ అసలు వైఖరిని వదలి నెహ్రూ మీద మరోసారి దాడి చేసేందుకు, తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ ప్రస్తావించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.పోనీ నెహ్రూ, తరువాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆక్రమిత కాశ్మీరు గురించి పట్టించుకోలేదని విమర్శిస్తున్న కాషాయ దళాలు తాము అమితంగా ప్రేమించే వల్లభాయ్ పటేల్ వాంఛను తీర్చాలనే చిత్తశుద్ది ఉంటే కబుర్లు కాదు, కార్యాచరణను ప్రారంభించాలి,యావత్ ప్రతిపక్షం, పౌరులూ సంపూర్ణ మద్దతు ఇస్తారు.
