ఎం కోటేశ్వరరావు
జమిలి ఎన్నికల గురించి తన అజెండాను అమలు జరిపేందుకు బిజెపి పూనుకుంది. ఆ విధానాన్ని వ్యతిరేకించే పార్టీలు తమ వైఖరిని మరోసారి స్పష్టం చేశాయి. గోడమీది పిల్లులు ఎటు వాటంగా ఉంటే అటు దూకాలని చూస్తున్నాయి. అతల్ బిహారీ వాజ్‌పాయి కాలంలో బిజెపి మౌనంగా ఉంది, నరేంద్రమోడీ పదేండ్ల పాలనలో చప్పుడు చేయలేదు. ఇన్నాళ్లూ జమిలి ఎన్నికలతో అభివృద్ధి అనే జ్ఞానోదయం కలిగించిన వృక్షం ఏమిటో తెలియదు. అదే ప్రాతిపదిక అయితే అసలు ఎన్నికలు లేని, తూతూమంత్రంగా జరిగే దేశాలు ఎప్పుడో అభివృద్ధి చెంది ఉండాలి. ఈ సందర్భంగా ముందుకు వచ్చిన కొన్ని వాదనలు, ఇతర అంశాలను చూద్దాం.
ప్రజాస్వామ్యం ఖూనీ –ముందుగానే నిర్ణయం తీసుకున్న తరువాత పార్టీలు చెప్పేదేముంది ?
జమిలి ఎన్నికల ప్రతిపాదనలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది ? కేంద్ర ప్రభుత్వం ముందుగానే ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ఎలా అమలు జరపాలో సూచించండి అంటూ ఒక కమిటీని వేసింది.రోగి కోరుకున్నదే వైద్యుడు ఇచ్చాడన్నట్లు చేసిన సిఫార్సులకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు, పార్టీలతో చర్చించి ఒక బిల్లును పెట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదేమి ప్రజాస్వామ్యం ? ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ? కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ 2023 సెప్టెంబరు రెండున తీసుకున్న నిర్ణయం ప్రకారం మాజీ రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ అధ్యక్షతన ఒక ఉన్నత స్థామి కమిటీని వేశారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకుగాను ఆ సమస్యను పరిశీలించి సిఫార్సులు చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని వేసినట్లు న్యాయశాఖ తీర్మానంలో ఉంది.దాని అర్ధం ఏమిటి ముందే తీసుకున్న నిర్ణయాన్ని ఎలా అమలు జరపాలో చెప్పమని కోరటమే కదా ? ప్రతిపక్షాలు తనను గేలి చేసినట్లు నరేంద్రమోడీ ఆరోపించారు. మరి ఈ చర్య ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం లేదా గేలిచేయటం కాదా ? ఇంత చేసిన తరువాత బిల్లు పెట్టటానికి పార్టీలను అడిగేదేమిటి ? అవి చెప్పేదేమిటి? ఇంతకు ముందే కమిటీకి చెప్పాయి కదా ! అందుకే అనేక పార్టీలు తమ వ్యతిరేకతను పునరుద్ఘాటించాయి. గోడమీది పిల్లులు ఇప్పటికీ నోరు విప్పటం లేదు. స్వాతంత్య్రం వచ్చిన తొలి సంవత్సరాల్లో జమిలి ఎన్నికలు జరిగాయి.రాజ్యాంగంలో ఎక్కడా వాటికి సంబంధించి నిర్దిష్ట ఆదేశమేమీ లేదు.అందుకే రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని కోవింద్ కమిటీ కూడా చెప్పింది.
‘‘ తరచూ ఎన్నికలు రాకుండా ఉంటే విధానాలను గొప్పగా కొనసాగించవచ్చు’’
2014 నుంచి కేంద్రంలో నిరాటంకంగా పాలన కొనసాగుతున్నది. ఒకే ప్రభుత్వం ఉంది. అది ప్రకటించిన మేకిన్ ఇండియా, మేక్ ఇండియా విధానాలు ఎందుకు విఫలమైనట్లు ? మన ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఎందుకు జరుగుతున్నట్లు ? దీనికోసం సిద్దాంత గ్రంధాలు రాయనక్కర లేదు. బిజెపి వారే చెబుతున్నట్లు రెండిరజన్ల పాలిత రాష్ట్రాలే ఎక్కువ. అక్కడ గానీ, ఇతర పార్టీల రాష్ట్రాలలో గానీ పదేండ్లలో ఎక్కడైనా మధ్యంతర ఎన్నికలు వచ్చి ఆటంకం కలిగిందా అంటే లేదు. అభివృద్ధి చెందిన దేశాల చరిత్రను చూసినపుడు అనేక అంశాలతో పాటు పరిశోధన మరియు అభివృద్ధి(ఆర్ అండ్ డి)కి భారీ మొత్తాలలో ఖర్చు చేయటం తెలిసిందే.మోడీ పాలనలో ఆవు పేడ, మూత్రంలో బంగారం ఉందా మరొకటి ఉందా అన్న పరిశోధనల మీద చూపిన శ్రద్ద మరొకదాని మీద లేదు. ఇటీవలనే కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ ప్రధాన సలహాదారు అజయ్ కుమార్ సూద్ చెప్పిందేమిటి ? ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘ 2047లో మనం ఎక్కడ ఉండాలని మీరు నన్ను అడిగితే సైన్సుకు సంబంధించి సర్వత్రా వినియోగిస్తున్న సూచికల ప్రకారం మనం ఎగువన మూడు లేదా ఐదవ స్థానంలో ఉండాలి. నిజానికి మనం మూడవ స్థానంలో ఉండాలి.ఒక దేశ శాస్త్రీయ పటిష్టను కొలిచేందుకు అన్ని చోట్లా వినియోగించే సూచికలను చూసినపుడు మనం చాలా వెనుకబడి ఉన్నాము, ప్రపంచ సగటు కంటే తక్కువ ’’ అన్నారు. ఈ సూచికలను మెరుగుపరచాలంటే ఆర్ ఆండ్ డి మీద పెట్టే మొత్తం ఖర్చు పెరగాలి, పరిశోధకలు, శాస్త్రీయ అంశాలలో మహిళలు, పేటెంట్లవంటివి పెరగాలని కూడా చెప్పారు. దరిద్రం ఏమిటంటే దేశంలో జరిగిన ప్రతి అనర్దానికి నెహ్రూ కారకుడని నిత్యం పారాయణం చేసే పెద్దలు పదేండ్లుగా పరిశోధన రంగ విధాన రూపకల్పన కూడా చేయలేకపోయారు. వేదాల్లోనే అన్నీ ఉన్నాయట అని చెప్పేవారిని నమ్ముకొని వాటిని వెలికితీసేందుకు దశాబ్ద కాలాన్ని వృధా చేశారని అనుకోవాలి. అనేక చర్చల తరువాత 2023లో వచ్చే ఐదేండ్ల కాలంలో 600 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తామని అందుకోసం జాతీయ పరిశోధనా ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అనేక మంది నిజమే కదా అని సంతోషించారు. పాఠ్య పుస్తకాల నుంచి డార్విన్ సిద్దాంతాన్ని, కొన్ని శాస్త్రీయ అంశాలను తొలగించారు. ఇదేదో అమాయకంగా చేశారని అనుకుంటే పొరపాటు. కరోనా నిరోధానికి గిన్నెలు మోగించాలని, కొవ్వొత్తులు వెలిగించాలని, గంగలో మునగాలని చెప్పిన పెద్దలకు ఇన్నేండ్ల తరువాతైనా జ్ఞానోదయం అయిందని చాలా మంది సరిపెట్టుకున్నారు. ఆదిలోనే హంసపాదు అన్నట్లు 202324 బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం ఎంతో తెలుసా ? ఏటా సగటున 120 కోట్ల డాలర్లు కేటాయించాల్సి ఉండగా కేవలం 3.09 కోట్ల డాలర్లు మాత్రమే. దశాబ్దాల తరబడి విధానాలను రూపొందించలేకపోవటమే కాదు, దానికి తగిన కేటాయింపులూ లేవు.1990దశకంలో జిడిపిలో 0.8శాతం ఉండగా 2023నాటికి 0.65శాతానికి తగ్గాయి. కబుర్లు మాత్రం రెండుశాతం ఉండాలని చెబుతారు.మూడు దశాబ్దాల క్రితం భారత్‌చైనా కేటాయింపులు దాదాపు సమంగా ఉన్నాయి. ఇప్పుడు చైనా 2.43శాతం ఖర్చు చేస్తోంది. ప్రపంచంలో తొలి అగ్రశ్రేణి వంద విశ్వవిద్యాలయాలు, సంస్థలలో చైనా ఏడిరటిని కలిగి ఉండగా మనదేశంలోని సంస్థలు కొన్ని 200400 మధ్య రాంకుల్లో ఉన్నాయి.మంత్రాలకు చింతకాయలు రాల్తాయా లేదా అని కళ్లలో వత్తులు వేసుకొని మరీ చూసే మన పాలకులు మాత్రం 2047నాటికి వికసిత భారత్‌కు జమిలి ఎన్నికలే జిందాతిలిస్మాత్ అంటే జనం చెవుల్లో కమలం పూలు పెట్టటం తప్ప మరొకటి కాదు.
రాజ్యాంగం ఆమోదించిన ఆదేశిక సూత్రాలను అమలు జరిపేందుకు మాత్రం ముందుకు రారు.జమిలి ఎన్నికల మీద ఏకాభిప్రాయం రాదని తేలిపోయింది.దాన్ని పక్కన పెట్టాల్సిందిపోయి వ్యతిరేకించేవారి మీద రాజకీయదాడి చేసేందుకు పూనుకోవటం అంటే దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పక్కదారి పట్టించే ఎత్తుగడతప్ప మరొకటి కాదు.1952 నుంచి 1967వరకు లోక్‌సభ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. అప్పుడేమీ దేశం గంతులు వేస్తూ అభివృద్ధి చెందిన దాఖలాలేమీ లేవు. విదేశీ చెల్లింపుల సంక్షోభం, రూపాయి విలువ తగ్గింపు, ఐఎంఎఫ్‌రుణం, ధరల పెరుగుదల తొమ్మిది రాష్ట్రాలలో కాంగ్రెస్ ఓటమి, కాంగ్రెస్‌లో చీలికతో 1971లో లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు, రాష్ట్ర ప్రభుత్వాల పతనం వంటి పరిణామాలన్నీ జరిగాయి.జస్టిస్ బిపి జీవన్ రెడ్డి నాయకత్వంలోని లా కమిషన్ 1999`2000లో ఖర్చు తగ్గింపు, పాలన మెరుగుదులకు జమిలి ఎన్నికల గురించి పరిశీలించాలని చెప్పింది తప్ప అభివృద్ధికి ముడిపెట్టలేదు. ఇంత పెద్ద దేశానికి ఓటర్లకు, ఓట్ల పెట్టెలకు రక్షణ లేని ఈ దేశంలో ఎన్నికల సమయంలో భద్రతా సిబ్బంది నియామకం,ఎన్నికల సిబ్బందికి అయ్యే ఖర్చు పెద్ద సమస్య కాదు. దాన్నే బూతద్దంలో చూపి ఆ కారణంగానే దేశం వృద్ధి చెందటం లేదంటున్నారు.నియంతలు పాలించిన అనేక దేశాల్లో దశాబ్దాల తరబడి ఒకేపాలన సాగింది. ఎలాంటి ఇబ్బందులు లేవు. అయినా అవేవీ వృద్ధి చెందలేదు. జపాన్‌లో రెండవ ప్రపంచ యుద్దం తరువాత 26సార్లు పార్లమెంటు ఎన్నికలు జరిగాయి, 38 మంది ప్రధానులు మారారు. అది గత కొన్ని దశాబ్దాలుగా పక్షవాత రోగి మాదిరి దాని అర్థిక వ్యవస్థ ఉంది. అభివృద్ధి నమూనాగా ఒకప్పుడు జపాన్ను చెప్పారు.దాన్ని చూసి నేర్చుకోవాలన్నారు. దాని పరిస్థితి ఏమిటి ? 2012లో జిడిపి ఆరులక్షల కోట్ల దాలర్లు దాటింది. ఇప్పుడు నాలుగు లక్షల కోట్లకు పడిపోయింది.
రామనాధ్ కోవింద్ కమిటీ దక్షిణాఫ్రికా,జర్మనీ, స్వీడెన్, ఇండోనేషియా,ఫిలిప్పీన్స్, జపాన్, బెల్జియం దేశాలలో జమిలి ఎన్నికల గురించి అధ్యయనం చేసింది. అక్కడ ఏకకాలంలో జరిగే వాటిని మాత్రమే తీసుకుంది తప్ప దామాషా ప్రాతిపదికన ప్రతి ఓటుకూ విలువ నిచ్చే నిజమైన ప్రజాస్వామిక పద్దతిని సిఫార్సు చేయకుండా వదలివేసింది.వాటిని గమనించినట్లు మాత్రం పేర్కొన్నది. ఎందుకుంటే సిఫార్సు చేస్తే బిజెపి ఆగ్రహం వస్తుంది గనుక.ప్రపంచం జమిలి ఎన్నికలు జరుగుతున్నవి మూడే మూడు దేశాలు అవి స్వీడన్, బెల్జియం, దక్షిణాఫ్రికా. ఈ మూడు చోట్లా దామాషా ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతున్నాయి.మరి ఈ విధానాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు. ఇటీవల ఎన్నికలు జరిగిన దక్షిణాఫ్రికాలో 64లక్షలు (40శాతం) ఓట్లు తెచ్చుకున్న పార్టీకి 200కు గాను 73 సీట్లు వస్తే కేవలం 29వేలు తెచ్చుకున్న పార్టీకి ఒక సీటు వచ్చింది.ప్రతి ఓటుకూ విలువ ఇచ్చే అసలు సిసలు ప్రజాస్వామ్యమంటే ఇది కదా ! కానీ మనదేశంలో జరుగుతున్నదేమిటి ? పార్టీలు తెచ్చుకున్న ఓట్లకు సీట్లకు పొంతన ఉంటోందా ? 2019లో బిజెపికి వచ్చిన ఓట్లు 37.36శాతమైతే సీట్లు 55.8శాతం, అదే 2024లో ఓట్లు 36.56శాతం కాగా సీట్లు 44శాతం వచ్చాయి. మైనారిటీ ఓట్లతో అధికారాన్ని పొందింది.
ఎన్నికల్లో డబ్బు ప్రమేయం ఎలా పెరిగిపోయిందో చూస్తున్నాము. ఇన్నేండ్ల తరువాత తమకు డబ్బు ఇస్తేనే ఓట్లు వేస్తామని కొన్ని చోట్ల, ఇతరులకు ఇచ్చిన మొత్తం తమకెందుకు ఇవ్వలేదని కొన్ని చోట్ల ఓటర్లు ధర్నా చేయటాన్ని మన రాజ్యాంగ నిర్మాతలు అసలు ఊహించి ఉండరు. ఇలాంటి ధోరణులు పెరిగిన తరువాత డబ్బున్న పార్టీ ఓట్లను టోకుగా కొనుగోలు చేయటం తప్ప మరొకటి జరుగుతోందా ? రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిమితంగా పోటీ చేస్తున్న కమ్యూనిస్టులు తప్ప ఓటర్లకు డబ్బు పంచని పార్టీ ఏది ? దాని ప్రమేయం లేకుండా ఎందుకు చేయరు ? ఎన్నికల విధానాన్ని ఎందుకు సంస్కరించరు ? బిజెపికి ఇవేవీ తెలియనంత అమాయకంగా ఉందా ? ఎన్నికల కమిషన్ తొలి సాధారణ ఎన్నికల్లో ప్రతి ఓటుకు చేసిన ఖర్చు రు.0.60 కాగా 2014లో ఆ మొత్తం రు.46.40కి పెరిగింది. తొలి సాధారణ ఎన్నికల్లో ఒక అభ్యర్ధి రు.25వేలకు మించి ఖర్చు చేయకూడదని చెప్పిన ఎన్నికల కమిషన్ తాజాగా దాన్ని రు.75 నుంచి 95లక్షల వరకు పెట్టవచ్చని, అసెంబ్లీ అభ్యర్ధులు 28 నుంచి 40 లక్షల వరకు పెంచింది. లెక్కలో చూపకుండా చేసే ఖర్చు గురించి తెలిసిందే. వీటిని పరిగణనలోకి తీసుకొని సిఎంఎస్ అనే సంస్థ వేసిన లెక్క ప్రకారం 2019లో ఒక్కో ఓటు ఖర్చు రు.700 కాగా 2024 రు.1,400లకు పెరిగింది.1998లో ఎన్నికల ఖర్చు రు.9,000 కోట్లు కాగా అది 2024లో లక్షా 35వేల కోట్లకు పెరిగినట్లు అంచనా ? దీన్ని నివారించటానికి కమిటీ వేయాల్సిన అవసరం లేదా ?
జమిలి ఎన్నికలు జరపాలని బిజెపి చెబుతున్నది. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన ఘనత తమదే అని జబ్బలు చరుచుకుంటున్నది. కానీ ఆచరణలో ఎక్కడా ఆ స్ఫూర్తి కనిపించటం లేదు. రిజర్వేషన్ల బిల్లును ఆమోదించిన తరువాత జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో ఎక్కడా మూడోవంతు సీట్లకు ఆ పార్టీ మహిళలను నిలపలేదు. బిజెపి తాను పోటీ చేసిన 446 స్థానాల్లో కేవలం 69 మందిని 15.47శాతం మందినే నిలిపింది.బిజెడి ఒడిషాలో 33శాతం మందిని నిలిపింది. అసలు 150 స్థానాల్లో మహిళా అభ్యర్దులే లేరు. గత లోక్‌సభలో అన్ని పార్టీల తరఫున 78 మంది గెలిస్తే ఈసారి 73కు తగ్గారు. అదే విధంగా తాను తన మిత్ర పార్టీల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేసి లోక్‌సభతో పాటే ఎన్నికలు జరిపించి ఉంటే ఆదర్శంగా ఉండేది. ఆ పార్టీ చెబుతున్నట్లు దాని వలన కలిగే లాభాలేమిటో ఎందుకు చూపలేదు ? దానికి రాజ్యాంగసవరణలతో పని లేదు. ఏ పార్టీ కూడా వ్యతిరేకించేదేమీ లేదు కదా ! బిజెపికి చివరికి ఎన్నికల కమిషన్‌కూ చిత్తశుద్ది లేదు. గతంలో హర్యానా, మహారాష్ట్రలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే ఈ సారి బిజెపికి అనుకూలంగా ఉండేందుకు మహారాష్ట్ర ఎన్నికలను విడిగా జరుపుతున్నారు. రెండు రాష్ట్రాలూ బిజెపివేగనుక ఆరునెలల కంటే తక్కువే వ్యవధి ఉన్నందున వాటినైనా రద్దు చేసి లోక్‌సభతో పాటు ఎన్నికలు జరపవచ్చు. అదే విధంగా ఎప్పుడో జరగాల్సిన కాశ్మీరు అసెంబ్లీ ఎన్నికలను లోక్‌సభతో పాటు ఎందుకు జరపలేదంటే సరైన సమాధానం లేదు.
జమిలి ఎన్నికలు మేలని 1999లోనే లా కమిషన్ అభిప్రాయపడిరది. దేశాభివృద్దికి ఇది సర్వరోగనివారణి జిందాతిలిస్మాత్ అనుకుంటే నాడు అధికారంలో ఉన్న వాజ్‌పాయి ఎందుకు చొరవ తీసుకోలేదు, పోనీ 2014లోనే గద్దె నెక్కిన నరేంద్రమోడీ వెంటనే దీన్ని ఎందుకు ముందుకు తేలేదు ? దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాగే తన పాలన వైఫల్య దిశగా పోతున్నదని అందరికంటే ముందుగా గ్రహించిన వ్యక్తి మోడీ. ప్రతి ఎన్నికలలోనూ పాతదాన్ని వదలి కొత్త నినాదాన్ని ముందుకు తేవటం తెలిసిందే. అధికారయంత్రాంగ సమయం, డబ్బు వృధాను అరికట్టటానికి ఒకేసారి ఎన్నికలని మరొక పాట పాడుతున్నారు.కోవింద్ కమిటీ చేసిన సూచనలలో ఏ కారణంతోనైనా ఒక ప్రభుత్వం పడిపోతే జరిగే ఎన్నికలు ఐదేండ్లలో మిగిలిన కాలానికి మాత్రమే అన్నది ఒకటి. సంక్షోభంతో ఐదేండ్లలో ఎన్నిసార్లు పతనమైతే అన్ని సార్లు జరుపుతారా ? జనాభా లెక్కలతో కలిపి బిసి కులగణన జరపాలని కోరితే దానికి బిజెపి ససేమిరా అంటున్నది.కావాలంటే రాష్ట్రాలు లెక్కించుకోవచ్చు అన్నది. అప్పుడు సిబ్బంది సమయం, డబ్బుదండగకాదా ? జమిలి ఎన్నికల వాదన దీనికి ఎందుకు వర్తించదు ? జమిలి ఎన్నికల చర్చ జరుగుతుండగానే దాని స్ఫూర్తిని దెబ్బతీసేదిగా కేంద్ర ఎన్నికల సంఘం గతంలో ఒకేసారి జరిగిన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలను ఈసారి విడదీసింది. మరోవైపు జమిలిని వ్యతిరేకించేపార్టీలకు నీతులు చెబుతున్నారు. ? పదేండ్ల మోడీ విఫల పాలన మీద జనం దృష్టిని మళ్లించేందుకు తప్ప జమిలి ఎన్నికలు మరొక మేలుకు కాదన్నది స్పష్టం. ‘‘ మీరు కొంత కాలం జనాలందరినీ వెర్రి వారిగా చేయగలరు. కొంత మందిని కాలం చేయగలరు. అందరినీ ఎల్లకాలం వెర్రివారిని చేయలేరు.’’ అన్న అబ్రహాం లింకన్ మాట మోడీతో సహా ఎవరికైనా వర్తిస్తుంది. కాదంటారా ?
