ఎం కోటేశ్వరరావు
ప్రకృతి ఉన్నంత వరకు ఎర్ర పూలు పూస్తూనే ఉంటాయి. దోపిడీ కొనసాగినంత కాలం కమ్యూనిస్టులు ఉద్భవిస్తూనే ఉంటారు.వైపరీత్యాలు సంభవించినపుడు ఎర్రపూల చెట్లు దెబ్బతిన్నట్లే కమ్యూనిస్టులూ అంతే. ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది.మారిన పరిస్థితులను బట్టి కమ్యూనిస్టులూ మారాలి అంటే దానర్దం మౌలిక లక్షణాన్ని వదులుకోవాలని కాదు, ఎత్తుగడలు, వ్యూహాలను మార్చుకోవాలి.అనేక దేశాల్లో కమ్యూనిస్టులు స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి సమస్యలను ఎదుర్కొంటున్నమాట నిజం. ఉద్యమాలు నల్లేరు మీద బండిలా సాగటం లేదు. ఉదాహరణకు రష్యన్ కమ్యూనిస్టులను చూద్దాం.ఒక వైపు ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం పేరుతో సామ్రాజ్యవాదులు ముందుకు తెచ్చిన ముప్పు, మరోవైపు దానికి వ్యతిరేకంగా గట్టిగా నిలిచిన బూర్జువావర్గ ప్రతినిధి పుతిన్.అతగాడి నాయకత్వంలో కార్మికవర్గాన్ని దోపిడీ చేస్తున్న అల్పజనపాలన. యుద్ధంతో ముందుకు వచ్చిన ఆర్థిక సమస్యలు, జాతీయవాదం. కమ్యూనిస్టులకు ఇది కత్తిమీద సాము.
ఓల్గాగ్రాడ్ విమానాశ్రయానికి స్టాలిన్ పేరు !
కమ్యూనిస్టులకు గాక ఏ ఎండకా ఆ గొడుగు పట్టే వారికి ఎందుకు వస్తాయి కష్టాలు. హిట్లర్ మూకలకు గోరీ కట్టిన ఓలాగ్రాడ్‌కు నాడు సోవియట్‌ను నడిపించిన ఉక్కుమనిషి స్టాలిన్ స్మారకంగా స్టాలిన్ గ్రాడ్ అని పేరు పెట్టారు. సోవియట్‌ను కూల్చివేసిన తరువాత తిరిగి పూర్వనామాన్ని తెచ్చారు.ఫాసిజం, నాజీలపై విజయం సాధించి 2025 మే 9న 80వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆ నగరానికి తిరిగి స్టాలిన్ పేరు పెట్టాలని రష్యన్ కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు అలెగ్జాండర్ జెమిలియానిచెంకో, అగ్రనేత గెనడీ జుగనోవ్ అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ను కోరారు. ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్న సైనికులకు మానవతాపూర్వక సాయంగా డ్రోన్లు, మోటారు సైకిళ్లను పంపిన సందర్భంగా జుగునోవ్ స్టాలిన్ గ్రాడ్‌లో ఉన్నాడు. తానెప్పుడూ ఆ నగరాన్ని అలాగే పిలుస్తానని, యావత్ దేశం అలాగే అంటున్నదని అన్నాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న వారి గౌరవార్ధం గతవారం పుతిన్ పర్యటన సందర్భంగా ఓల్గాగ్రాడ్ విమానాశ్రయానికి స్టాలిన్ గ్రాడ్ అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరును ప్రకటించాడు. అందువలన నగరం మొత్తానికి ఆ పేరు పెట్టాలని జుగనోవ్ అన్నాడు. గతంలో కొన్ని సంస్థలు స్టాలిన్ గ్రాడ్ అని తిరిగి పెట్టాలా లేదా అన్న సర్వే చేస్తే ఓల్గాగ్రాడ్ పౌరులు వ్యతిరేకించినట్లు తేలిందని చెప్పారు, నిజంగా అప్పుడు జనం అలా ఉన్నారా లేక పాలకులకు అనుగుణంగా సర్వేను చేశారా అన్నది చెప్పటం కష్టం. ఇప్పుడు పుతినే స్వయంగా విమానాశ్రయపేరు మార్చాడంటే జనాల్లో వ్యతిరేకత లేదన్నది స్పష్టం ఎందుకు అంటే ఫాసిస్టు వ్యతిరేక పోరాటానికి మారు పేరు స్టాలిన్, ఆ పేరును ఉచ్చరించకుండా దాని గురించి చెప్పలేరు.
అంతర్జాతీయ ఫాసిస్టు వ్యతిరేక వేదిక రెండవ సమావేశం గత నెలాఖరులో మాస్కోలో జరిగింది. ప్రపంచమంతటా ఫాసిజం తిరిగి తలెత్తుతున్న పూర్వరంగంలో దాన్ని ఎలా ఎదుర్కోవాలా అని 91దేశాల నుంచి హాజరైన 164 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాస్కో కమ్యూనిస్టు నాయకురాలు తాతిన్యా దెశియాతోవా మాట్లాడుతూ పాలకులు తమ సంపదలను పెంచుకోవటం తప్ప చేసిందేమీ లేదు. కాబట్టి ఇప్పుడు మేము గత కీర్తి కట్టడాలన్నింటినీ శుభ్రం చేస్తున్నాం, పాత సోవియట్ చిహ్నాలను పెడుతున్నాం, పాత పాటలను పాడుతున్నాం, గత విజయాల గురించి చెబుతున్నాం అని చెప్పింది. మూడవ తరానికి చెందిన కమ్యూనిస్టు అయిన ఆమె అమెరికా పత్రిక పీపుల్స్ వరల్డ్‌తో మాట్లాడినపుడు ఈ వ్యాఖ్యలు చేసింది. నిజానికి ఫాసిస్టు వ్యతిరేక వారసత్వం రష్యన్ పౌరులది తప్ప పుతిన్ లేదా అతగాడు ప్రాతినిధ్యం వహిస్తున్న పెట్టుబడిదారీ విధాన పాలకులది కాదు. బోరిస్ ఎల్సిన్ వినాశకర మరియు ప్రజల సంపద లూటీ పాలనతో పోలిస్తే పుతిన్ పాలనలో ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగైంది, అది ఎంతో కాలం నిలిచేట్లు కనిపించటం లేదని ఆమె చెప్పింది. యుద్ధం, సంబంధిత అంశాల్లో సోవియట్ పాత్ర, దాని గురించి జనంలో ఉన్న జ్ఞాపకాల గురించి పుతిన్ గ్రహించాడు గనుకనే గత కొద్ది సంవత్సరాలుగా వాటిలో కొన్నింటిని ఎంచుకొంటున్నాడు. విమానాశ్రయానికి స్టాలిన్ పేరు పెట్టటం దానిలో భాగమే. రెండవ ప్రపంచ యుద్ధ విజయం 80వ వార్షికోత్సం సందర్భంగా నాటి బ్యానర్లు, చిహ్నాలతో మాస్కోను అలంకరించారు.
సోవియట్‌ను కూల్చివేసి మూడున్నర దశాబ్దాలు కావస్తున్నది, ఆ సమయంలో తెలిసీ తెలియని వయస్సులో ఉన్నవారికీ, తరువాత పుట్టిన వారికి గతం గురించి తెలియదు. వర్తమానంలో బతుకు ఎలా సాగించాలా అన్నది తప్ప ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించే తీరిక కూడా ఉండటం లేదు. పరిస్థితి ఉన్నది ఉన్నట్లుగా ఉంటే చాలన్నట్లుగా కొందరి ఆలోచన ఉంది. అయితే 2022లో ప్రారంభమైన ఉక్రెయిన్‌పై మిలిటరీ చర్య తరువాత పరిస్థితిలో మార్పు ప్రారంభమైంది. సామ్రాజ్యవాదుల కుటిల యత్నాలు,వారికి మద్దతు ఇస్తున్న పాలకులు రష్యా సరిహద్దులోని తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలలో రష్యన్ జాతి పౌరులను అణచివేస్తున్న తీరుతెన్నులను గ్రహించిన కమ్యూనిస్టు పార్టీ యుద్ధ ప్రయత్నాలకు మద్దతు ఇచ్చింది. మూడు సంవత్సరాలు గడిచింది, వేలాది మంది మరణించారు, ఆర్ధికంగా దేశం సమస్యలను ఎదుర్కొంటున్నది, మిలిటరీ చర్య ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ఇలాంటి తరుణంలో ఏ వైఖరి తీసుకోవాలన్నది కమ్యూనిస్టులకు పెద్ద సమస్య. ఉక్రెయిన్ పోరులో రెండు లక్షణాలు ఉన్నాయి, ఒకటి సామ్రాజ్యవాద పోరు, రెండవది జాతీయ అంశం. నాటో కూటమి నాయకత్వంలోని సామ్రాజ్యవాదులు, రష్యాలోని పెట్టుబడిదారులకు ప్రాతినిధ్యం వహించే శక్తుల మధ్య ఈ యుద్ధం నడుస్తున్నది.అయితే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని రష్యన్ జాతి పౌరులు అక్కడి నాజీల చేతిలో అణచివేతను ఎదుర్కొంటున్నారు. వారికి కమ్యూనిస్టులు, ఇతర వామపక్ష శక్తులు నాయకత్వం వహిస్తున్నాయి. రష్యన్ మిలిటరీ ఆప్రాంతంలోకి వెళ్లిన తరువాత పోరాడుతున్న ఆ శక్తులు ఎన్నికలలో పాల్గొనేందుకు పుతిన్ అనుమతించటం లేదనే వార్తలు వచ్చాయి.ఈ సమస్య ఉన్నప్పటికీ ఉక్రెయిన్ను నాజీకరణ కావించకుండా చూడటం, నాటో విస్తరణను అడ్డుకోవటం, అణచివేతకు గురవుతున్నవారిని రక్షించటం మౌలిక అంశాలుగా ఉన్నట్లు అనేక మంది భావిస్తున్నారు. అయితే కమ్యూనిస్టులకు పుతిన్ మీద, పాలకవర్గం మీద ఎలాంటి భ్రమలు లేవు. పాలకవర్గంలో ఉన్న విబేధాలు, వైరుధ్యాల కారణంగా గతంలో ప్రైవేటీకరించిన 10.8బిలియన్ డాలర్ల విలువగల కంపెనీలను గత మూడు సంవత్సరాలలో పుతిన్ సర్కార్ జాతీయం చేసింది. అయితే వాటిని ప్రజల ఆస్తిగానే ఉంచుతారా లేక తిరిగి తమకు అనుకూలమైన వారికి కట్టబెడతారా అన్న సందేహాలు ఉన్నాయి. ప్రైవేటీకరణను తీవ్రంగావిస్తామని పాలకపార్టీ నేతలు మార్చి నెలలో ప్రకటించారు. దాన్ని అడ్డుకొనేందుకు కమ్యూనిస్టులు సిద్దం అవుతున్నారు.
ప్రపంచ విప్లవ ధృతార వియత్నాం !
అమెరికా సామ్రాజ్యవాదులపై దక్షిణ వియత్నాంలో విజయం సాధించి రెండు ప్రాంతాల ఏకీకరణకు 50వసంతాలు నిండాయి, 1975 ఏప్రిల్ 30వ తేదీని విజయదినంగా పరిగణిస్తున్నారు. ఈ పరిణామం యావత్ లాటిన్ అమెరికా దేశాలకు, యావత్ ప్రపంచానికి ఇప్పటికీ ఒక ధృవతారగానే ఉందని అర్జెంటీనా కమ్యూనిస్టు పార్టీ ఈ సందర్భంగా పేర్కొన్నది. అమెరికా సామ్రాజ్యవాదంపై విజయం సాధించిన తరువాత గత ఐదు దశాబ్దాలలో వియత్నాం ఎంతో పురోగతి సాధించిందని ఉరుగ్వే కమ్యూనిస్టు పార్టీ శ్లాఘించింది. గతంలో సోషలిస్టు దేశాలైనప్పటికీ పరస్పర అనుమానాలు, ఇతర కారణాలతో చైనా, వియత్నాం మధ్య సాయుధ దాడులు జరిగాయి. అయితే తరువాత రెండు దేశాల కమ్యూనిస్టు పార్టీలు తమ వైఖరులను సవరించుకొని తిరిగి దగ్గరయ్యాయి, కొన్ని దీవుల గురించి ఇప్పటికీ కొన్ని సమస్యలున్నా .తాజాగా రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడిరది. షీ జింపింగ్ వియత్నాం సందర్శించారు. ఒక ఏడాది కాలంలోనే గణనీయ ఫలితాలు వచ్చాయని ఏప్రిల్ 28న చైనా రాయబారి ప్రకటించారు. తొలిసారిగా విదేశాంగ, జాతీయ రక్షణ, ప్రజాభద్రత మంత్రుల స్థాయిలో ఇరుదేశాలు 3 ప్లస్ 3 పేరుతో సంప్రదింపులకు ప్రపంచంలో తొలిసారిగా నిర్ణయించిన దేశాలుగా చైనా, వియత్నాం దౌత్య చరిత్రకు ఎక్కాయి. యువకుల్లో విప్లవ చరిత్ర గురించి అవగాహన కలిగించేందుకు రెడ్ కల్చర్, రెడ్ జర్నీలను ప్రోత్సహించాలని నిర్ణయించారు.రెండు దేశాల వాణిజ్య లావాదేవీలు గతేడాది 260 బిలియన్ డాలర్లు దాటాయి.
సోషలిస్టు వ్యవస్థల కూల్చివేతలో పోప్ ప్రమేయం !
పోప్ ఫ్రాన్సిస్ అస్తమయం తరువాత కొత్త పోప్ ఎంపిక గురించి విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ సందర్భంగా గతంలో పనిచేసిన పోప్‌లు, అమెరికా అధ్యక్ష భవనంతో వారి సంబంధాలు, రాజకీయాలు, కుట్రలు ముఖ్యంగా కమ్యూనిజం, సోషలిస్టు సమాజాలకు వ్యతిరేకంగా జరిపిన కుట్రల గురించి కూడా ప్రస్తావనలు వెలువడ్డాయి.1989లో బెర్లిన్ గోడ కూల్చివేత,1991లో సోవియట్ కూల్చివేతకు ముందు ప్రచ్చన్న యుద్ధ సమయంలో రెండవ పోప్ జాన్ పాల్, అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ సమావేశం వైట్ హౌస్‌లో 1982లో జరిగింది. వారిద్దరి మీద హత్యా ప్రయత్నాలు జరిగిన ఏడాది తరువాత వారి ఏకాంత భేటీ జరిగింది.అక్కడే సోషలిస్టు సమాజాల కూల్చివేతకు కుట్రకు తెరలేపినట్లు గతంలోనే విమర్శలు వచ్చాయి.ఇద్దరూ కమ్యూనిస్టు వ్యతిరేకులే. రెండవ పోప్ జాన్ పాల్ జన్మస్థలమైన పోలాండ్‌లో లెచ్‌వాలేసాను ముందుకు తెచ్చి సాలిడారీ ఉద్యమం పేరుతో కుట్రకు తెరతీశారు.తమ పని గడచిన తరువాత లెచ్‌వాలేసాను చరిత్ర చెత్తబుట్టలోకి నెట్టారు. మనదేశంలో కమ్యూనిస్టులమని చెప్పుకున్న కొందరు ఆ సోషలిస్టు వ్యతిరేక సాలిడారిటీ పేరుతో ఊరేగారు. లెచ్‌వాలేసా సాలిడారిటీతో తమకు ఎలాంటి సంబంధం లేదని పోప్, రీగన్ ఇద్దరూ అప్పుడు ఠలాయించారు. అయితే వారి ప్రమేయం గురించి 2004లో ఏపి వార్తా సంస్థ వెల్లడిరచింది.1989లో పోలాండ్ ఎన్నికల్లో సాలిడారిటీ గెలిచింది, తూర్పు ఐరోపాలో సోషలిస్టు వ్యవస్థల కూల్చివేతకు నాంది పలికింది. సోవియట్ కమ్యూనిజాన్ని పతనం గావించేందుకు పోప్, రీగన్ కలసి పని చేశారని రిపబ్లికన్ పార్టీ మాజీ గవర్నర్ అయిన స్కాట్ వాకర్ 2020లో వాషింగ్టన్ పోస్టు పత్రికలో రాసినదానిలో పేర్కొన్నాడు. చరిత్రలో ఒక అమెరికా అధ్యక్షుడిగా ఉడ్రో విల్సన్ మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి, తొలి సోషలిస్టు రాజ్యం ఏర్పడిన తరువాత 1919లో పదిహేనవ పోప్ బెనెడిక్ట్‌ను కలసి వాటికన్‌తో సంబంధాలను ఏర్పరచుకున్నాడు.1959లో అమెరికా అధ్యక్షుడు ఐసెన్ హోవర్ ఇరవై మూడవ పోప్ జాన్‌తో భేటీ జరిగినప్పటి నుంచి పోప్‌లు, అమెరికా అధ్యక్షుల కలయికలు క్రమంగా జరుగుతున్నాయి.ఇప్పటి వరకు 32 సమావేశాలు జరిగినట్లు ఫాక్స్ న్యూస్ పేర్కొన్నది.1979వరకు అధ్యక్షులే వాటికన్ వెళ్లేవారు, ఆ తరువాత నుంచి పోప్‌లు అధ్యక్ష భవనానికి వస్తున్నారు.
శ్రీలంక మేడేకు భారత, చైనా కమ్యూనిస్టులు ! తైవాన్‌లో చైనా వ్యతిరేక ప్రదర్శనలు !
శ్రీలంక రాజధాని కొలంబోలో అధికార నేషనల్ పీపుల్స్ పవర్(ఎన్‌పిపి), దానికి ప్రధాన చోదకశక్తిగా ఉన్న జనతా విముక్తి పెరుమన పార్టీ నిర్వహించిన మేడే ప్రదర్శనలకు భారత్, చైనా కమ్యూనిస్టు పార్టీల నేతలు హాజరయ్యారు. దేశ అధ్యక్షుడు అనుర కుమార దిశన్నాయకే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌లో కమ్యూనిస్టు వ్యతిరేకతను మరోసారి రెచ్చగొడుతున్నారు.దానిలో భాగంగా గత నెలలో ఒక యూట్యూబర్ పేరుతో కమ్యూనిజాన్ని అడ్డుకోవటం, తైవాన్ రక్షణ నినాదాలతో కెటాగలాన్ ప్రాంతంలో 50వేల మందితో ప్రదర్శన చేశారు. మాతృదేశంలో విలీనం కావాలని కోరుతున్న ప్రజా ప్రతినిధులను వెనక్కు పిలవాలంటూ దరఖాస్తుల దాఖలుకు పూనుకున్నారు.
