ఎం కోటేశ్వరరావు
అందరూ ఊహించినట్లుగానే వివాదాస్పద ‘‘ ఎమర్జన్సీ ’’ (అత్యవసర పరిస్థితి) సినిమా ప్రదర్శనకు పంజాబ్‌లో ఆటంకం ఏర్పడిరది. హిమచల్ ప్రదేశ్‌లోని మండీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైన సినిమా హీరోయిన్ కంగన రనౌత్ నిర్మించి,దర్శకత్వం వహించటమే గాక ఇందిరా గాంధీ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు (2025 జనవరి 17న) విడుదలైన ఈ సినిమా గురించి ప్రశంసలు విమర్శలు వెలువడ్డాయి. చరిత్ర కంటే మైకం ఎక్కువగా కనిపించిందని, వాస్తవ చరిత్రను ఎలా తీయకూడదో దీన్ని చూసి నేర్చుకోవాలన్న అభిప్రాయం కూడా వచ్చింది. తన చిత్రాన్ని అడ్డుకోవటం కళాకారులు, కళను అడ్డుకోవటమే అంటూ కంగన రనౌత్ విమర్శలకు దిగారు. తొలి రోజు సినిమా వసూళ్లు గణనీయంగానే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. నోటి దురుసు వ్యక్తిగా పేరు మోసిన కంగనా రనౌత్ ‘‘ ఎమర్జన్సీ’’ సినిమా 2024లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపికి తలనొప్పిగా మారింది. చరిత్రను వక్రీకరించటమే గాక తమను దేశద్రోహులు, ఉగ్రవాదులుగా చిత్రీకరించారని, సోదరత్వాన్ని దెబ్బతీసి అది తమపై విద్వేషాన్ని రెచ్చగొట్టే అవకాశం ఉన్నందున ఆ చిత్రంపై నిషేధం విధించాలంటూ దేశవ్యాపితంగా సిక్కులు డిమాండ్ చేశారు. ఖలిస్తాన్ మద్దతుదార్లు కంగనను చంపివేస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో 2024సెప్టెంబరు ఆరున విడుదల తేదీని ప్రకటించిన కంగన కొద్ది రోజుల ముందు సెన్సార్ ధృవీకరణ పత్రం రాలేదని ప్రకటించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితం, ఆమె ప్రధానిగా ఉన్నపుడు 21నెలల అత్యవసరపరిస్థితి విధింపు తదితర అంశాల ఆధారంగా ఈ సినిమా తీసినట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.2024 ఆగస్టు 14వ తేదీన 2.43నిమిషాల నిడివిగల ట్రైలర్‌ను విడుదల చేయగా 50లక్షల మంది చూశారని, కేవలం 461 మంది మాత్రమే ఇష్టపడినట్లు నమోదైనట్లు గతేడాది ఇండియా టుడే పేర్కొన్నది.ప్రతి ఒక్క ఓటునూ లెక్కించుకున్న బిజెపి దేశంలో ఉన్న మూడు కోట్ల మంది సిక్కులు ఉన్నందున వారంతా వ్యతిరేకిస్తారని భయపడిరది. లోక్‌సభ ఎన్నికల తరువాత కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నందున మొత్తం మీద ఏదో ఒకసాకుతో సినిమా విడుదలను వాయిదా వేయించారు. గతంలో బిజెపి మిత్రపక్షంగా ఉన్న అకాలీదళ్ కూడా సినిమా ప్రదర్శనను వ్యతిరేకించింది. వచ్చే నెలలో ఢల్లీి ఎన్నికలు జరుగుతుండగా విడుదలైన ఈ చిత్రం మీద తలెత్తిన వివాదం ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది. ఢల్లీిలో దాదాపు పది లక్షల మంది సిక్కు సామాజిక తరగతి ఓటర్లు ఉన్నారు, అక్కడ ఉన్న 70 నియోజకవర్గాలలో వారు విస్తరించి ఉన్నారు. అదే సామాజిక తరగతికి చెందిన ఆతిషి మోర్లెనా ఆమ్ ఆద్మీ ప్రభుత్వ సిఎంగా ఉన్న సంగతి తెలిసిందే.
ఎమర్జన్సీ సినిమా ప్రదర్శనకు నిరసన తెలుపుతామని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ(ఎస్‌జిపిసి) ఇచ్చిన పిలుపుతో శుక్రవారం నాడు పలు సినిమా ధియేటర్ల వద్ద సిక్కులు నిరసన తెలిపారు. దాంతో పంజాబ్ అంతగా సినిమా ప్రదర్శన నిలిచిపోయింది.సిక్కు మత చరిత్రను, 1984 ఉదంతాలను సినిమాలో వక్రీకరించారని ఆ సంస్థ విమర్శించింది. చరిత్రను వక్రీకరించి మసాలాను దట్టించకపోతే ఇలాంటి సినిమాలను ఎవరూ చూడరు గనుక అలా తీశారని, సెన్సార్‌బోర్డు, ప్రభుత్వాలు ఈ అంశాలను గమనంలోకి తీసుకోవాలని పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అమరిందర్ సింగ్ రాజా పేర్కొన్నారు, ఉడ్తా పంజాబ్ పేరుతో తీసిన సినిమా కూడా అలాంటిదే అన్నారు. చండీఘర్ పక్కనే ఉన్న పంజాబ్ మొహాలీ నగరంలో సినిమా హాళ్ల వద్ద రైతులు కూడా నిరసన వెల్లడిరచారు. స్వర్ణదేవాలయం ఉన్న అమృతసర్ పట్టణంలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. ఎక్కడైనా అవాంఛనీయ ఉదంతాలు జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎస్‌జిపిసి హెచ్చరించింది. రానున్న రోజుల్లో కూడా హాలు యజమానులు ఇదే వైఖరిని అనుసరిస్తే మంచిది లేకుంటే నిరసనను తీవ్రం చేస్తామని పేర్కొన్నది. సంస్థ న్యాయవాది హర్జిందర్ సింగ్ రాష్ట్ర ్పభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో చిత్ర ప్రదర్శనను అడ్డుకోవాలని కోరారు. ఎమర్జన్సీ చిత్రంలో ముఖ్యమైన చరిత్రను నమోదు చేశారని, కంగన ప్రతిభావంతంగా నటించారని, బిజెపి నేత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించారు. తన సినిమాను తిలకించి అభినందించినందుకు కంగన కృతజ్ఞత తెలిపారు. రాజకీయాల ప్రాతిపదికన సామాజిక మాధ్యమంలో స్పందించిన కొందరు కంగనకు జాతీయ అవార్డు ఇవ్వాలని కూడా చెప్పారు. నాడు ప్రతిపక్ష నేతలుగా ఉన్నవారిని గొప్పగా చూపారనే విమర్శలు వచ్చాయి.
ప్రధాని నరేంద్రమోడీని స్వయంగా కలవాలనుకున్నాను, జరగలేదు, అంత మాత్రాన ఇతర ప్రముఖులు కలిస్తే నేనెందుకు కలవరపడతాను అంటూ కంగన రనౌత్ తన ఉక్రోషాన్ని వెళ్లగక్కారు. శుభంకర్ మిశ్రా అనే జర్నలిస్టుతో పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన కంగన లేదంటూనే కలవరపాటును వెల్లడిరచారు. గతంలో రైతు ఉద్యమాన్ని గట్టిగా సమర్ధించిన సినిమా గాయకుడు, నటుడు, నిర్మాత దల్జిత్ దోసంజ్, కపూర్ కుటుంబ సభ్యులు ఇటీవల కలిసేందుకు నరేంద్రమోడీ అవకాశం ఇచ్చారు. కపూర్ కుటుంబం పేరెత్తకుండానే దానికి నా కెందుకు కలవరం, దీన్లో అలాంటిదేముంది అంటూ ఎదురు ప్రశ్నించారు. ప్రధాని అంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతుల నిరసనలో దల్జిత్ ముందు వరుసలో ఉన్నాడు, వారిని సమర్ధించాడు అని కంగన ధ్వజమెత్తారు.మరి అలాంటి వ్యక్తిని కలుసుకొనేందుకు, తీరికలేకుండా ఉండే ప్రధాని అతని పాటలు వినేందుకు, సంగీతం గురించి చర్చించేందుకు కొన్ని గంటలు కేటాయించటం మిమ్మల్ని గాయపరచలేదా అన్న ప్రశ్నకు తనకు అవకాశం ఇవ్వకుండా దల్జీత్‌ను కలిసినందుకు తనకు ఎలాంటి కలవరం కలగలేదన్నారు, దీనికి కలవరపడాల్సిందేముంది? ఆయనకు అందరూ సమానమే, సినీ రంగానికి చెందిన అనుపమఖేర్, మనోజ్ ముంతాషిర్ వంటి వారికి గతంలో ప్రధాని కలిసే అవకాశం వచ్చింది.తనకు కొద్ది క్షణాలు మాత్రమే కలిసే అవకాశం వచ్చింది, ఇతరులు కలిసినందుకు నేను ఆశాభంగం చెందలేదు. నిజానికి నేను ఎన్నడూ ప్రధానిని కలవలేదు.ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒకసారి ఆయనకు నమస్కారం పెట్టాను తప్ప మాట్లాడలేదు. నేను ప్రధానికి పెద్ద అభిమానిని అని మీరు తెలుసుకోవాలి. కళల గురించి ఆయన ఏమి ఆలోచిస్తున్నారో తెలుసుకొనేందుకు అభిప్రాయాలు మార్పిడి, దీర్ఘమైన చర్చ జరపాలని కోరుకుంటాను అని కంగన వివరణ ఇచ్చుకున్నారు. తన చిత్రం ఎమర్జన్సీ ప్రచారంలో భాగంగా విడుదలకు ముందు రోజు ఆమె వివిధ మీడియా సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోడీ దృష్టిని ఆకర్షించటానికి ఆమె పడరాని పాట్లు పడ్డారు. అధికారానికి వచ్చిన 2014లోనే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని 2021లో చెప్పారు.స్వీయ అనుభవంతో తానీ మాటలు చెబుతున్నట్లు, తన అతి మంచితనం కారణంగా వ్యవస్థ తనను దేశం విడిచి అమెరికా వెళ్లేట్లు చేసిందని, మోడీ అధికారానికి వచ్చాక తాను తిరిగి వచ్చానని అందుకే అసలైన స్వాతంత్య్రం వచ్చినట్లు భావిస్తున్నట్లు చెప్పుకున్నారు. అదే విధంగా కత్రినా కైఫ్ వంటి విదేశీ హీరోయిన్లు ఎంతో రాణించారని కానీ 2014తరువాత స్వదేశీ నటీనటులు, కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, విదేశీయుల నృత్యాలు ఆపాలని జనం చెప్పారని, ఇటాలియన్ ప్రభుత్వాన్ని తొలగించి ఒక చాయ్‌వాలాను ప్రధానిని చేశారని కూడా సెలవిచ్చారు. రైతు ఉద్యమాన్ని వ్యతిరేకించటమే గాక అందులో పాల్గొన్నవారిపై నోరు పారవేసుకున్నందుకు చండీఘర్ విమానాశ్రయంలో ఒక మహిళా కానిస్టేబుల్ చేతిలో చెంపదెబ్బ తిన్న సంగతి కూడా తెలిసిందే.
