Tags
Joe Biden, NATO, NATO summit in Vilnius, Recep Tayyip Erdoğan, Sweden’s NATO bid, Ukraine crisis, Vladimir Putin
ఎం కోటేశ్వరరావు
ఐరోపా సమాఖ్య తలుపులు తెరుస్తారేమోనని ఐదు దశాబ్దాలుగా గుమ్మం ముందు పడిగాపులు కాస్తున్నాం. సమయం వచ్చింది గనుక చెబుతున్నా మాకు సమాఖ్యలో సభ్యత్వానికి అంగీకరిస్తే మేము నాటోలో స్వీడన్ ప్రవేశానికి అడ్డుతొలుగుతామని టర్కీ అధ్యక్షుడు రిసెప్ తాయిప్ ఎర్డోవాన్ సోమవారం నాడు మెలిక పెట్టాడు.లిథువేనియా రాజధాని విలినస్‌లో మంగళ,బుధవారాల్లో జరగనున్న నాటో కూటమి వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లే ముందు టీవీలో చెప్పాడు. ఆదివారం నాడు తాను అమెరికా అధినేత జో బైడెన్‌తో చర్చలు జరిపినపుడు ఈ అంశాన్ని స్పష్టం చేసినట్లు కూడా వెల్లడించాడు. ఈ అనూహ్యప్రకటనతో పశ్చిమ దేశాలు కంగారు పడ్డాయి. ఇలా వివాదపడితే అంతిమంగా రష్యా అధినేత వ్లదిమిర్ పుతిన్ లబ్దిపొందుతాడంటూ నష్టనివారణకు పూనుకున్నాయి. మరోవైపున సోమవారం నాడే విలినస్‌లో ఎర్డోవాన్- స్వీడన్ ప్రధాని క్రిస్టెర్‌సన్ భేటీ జరిగింది. తరువాత స్వీడన్‌కు చారిత్రాత్మక క్షణం అంటూ తమ దేశ టీవీలో ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో టర్కీ వెనక్కు తగ్గిందని, లాంఛనంగా నాటోలో స్వీడన్ ప్రవేశానికి త్వరలో తమ పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆమోద ముద్ర వేసేందుకు ఎర్డోవాన్ అంగీకరించినట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం టర్కీ ఎదుర్కొంటున్న ఆర్థిక, ఇతర ఇబ్బందుల కారణంగా మెత్తబడిందన్నది స్పష్టం. ఎవరి ప్రయోజనం వారు చూసుకుంటున్నందున మీరు మాకది ఇస్తే మేం మీకిది ఇస్తాం అన్నట్లుగా అందుకోసం వేస్తున్న ఎత్తులు జిత్తులలో భాగంగానే ఐరోపా సమాఖ్యలో సభ్యత్వానికి ముడిపెట్టి ప్రకటించినట్లు స్పష్టమైంది. తమ గడ్డ మీద ఉన్న రష్యా సేనల మీద ఎదురుదాడులు జరిపి పోగొట్టుకున్న ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ప్రతిజ్ఞలు చేసిన ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోతున్నదనే వార్తలు వస్తున్నాయి. జెలెనెస్కీ దళాలకు అవసరమైన ఆయుధాలు, ఇతర సాయం ఎలా అందించాలా అని నాటో నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. నాటోలో చేరేందుకు ఫిన్లండ్, స్వీడన్ దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది ప్రారంభంలో ఫిన్లండ్‌కు ఆమోదం తెలిపారు. సంస్థ నిబంధనల ప్రకారం సభ్యదేశాలన్నీ అంగీకరిస్తేనే కొత్త దేశాలను చేర్చుకోవటానికి వీలుంటుంది.ప్రస్తుతం ఈ కూటమిలో 31 దేశాలు ఉన్నాయి. తాజా వార్తల ప్రకారం ఇప్పటికి ఉక్రెయిన్‌కు సభó్యత్వం లేనట్లే అని స్పష్టమైంది.
విలినస్ సమావేశాల్లో స్వీడన్ ప్రవేశానికి ఆమోద ముద్ర కూడా అజెండాలో ఉంది.టర్కీ దానికి మోకాలడ్డటంతో పాటు ప్రస్తుతం జరుగుతున్న పోరు ముగిసేంత వరకు నాటోలో ఉక్రెయిన్ చేరకూడదని అమెరికా అధినేత జో బైడెన్ చేసిన ప్రకటన కూడా తలనొప్పిగా మారింది. టర్కీ షరతులను తాము అంగీకరించేది లేదని ఐరోపా సమాఖ్య ప్రకటించగా స్వీడన్‌కు ఆమోదం తెలిపితేనే తాము ఎఫ్ 16 యుద్ధ విమానాలను టర్కీకి విక్రయిస్తామని అమెరికా మెలిక పెట్టింది. ” ముందు ఐరోపా సమాఖ్యలో టర్కీ చేరికకు మార్గాన్ని సుగమం చేయాలి, తరువాత ఫిన్లండ్ మాదిరి స్వీడన్‌కూ మేము దారి ఇస్తాము. మేము 50 సంవత్సరాలుగా గేటు ముందు వేచి చూస్తున్నాం, నాటోలోని దేశాలన్నీదాదాపు సమాఖ్యలో సభ్యులే ” అని ఎర్డోవాన్ చెప్పాడు. తమ దేశంలో వేర్పాటు వాదులు, కర్దిష్ వర్కర్స్ పార్టీ వంటి ఉగ్రవాదులను స్వీడన్ బలపరస్తున్నదని, ఖురాన్ దహనంతో సహా ఇస్లాం వ్యతిరేక ప్రదర్శనలను అనుమతించిన కారణంగా తాము అంగీకరించేది లేదని గతంలో టర్కీ ప్రకటించింది. ఇప్పుడు తమకు ఐరోపా సమాఖ్యలో సభ్యత్వానికి లంకె పెట్టింది. టర్కీని సంతుష్టీకరించేందుకు స్వీడన్ ఉగ్రవాద చట్టాల్లో మార్పు చేసింది. వాటితో టర్కీ సంతృప్తి చెందలేదు. సోమవారం రాత్రి టర్కీ వైఖరిలో మార్పు వచ్చిన తరువాత ఐరోపా సమాఖó్యవైపు నుంచి ప్రతికూల స్పందనలు, సంకేతాలు రాలేదు తప్ప సానుకూలత కూడా వెల్లడి కాలేదు. తరువాత ఇప్పుడున్న స్థితి నుంచి టర్కీతో సంబంధాలను మెరుగుపరచుకొనేందుకు పూనుకొని సంతుష్టీకరించవచ్చు.
ప్రపంచ రాజకీయాల్లో టర్కీ అనుసరిస్తున్న విధానాలే దానికి అమెరికా యుద్ధ విమానాల విక్రయం, ఐరోపా సమాఖ్యలో చేర్చుకొనేందుకు ప్రధాన ఆటంకాలుగా ఉన్నాయి.ఐరోపా ఆర్థిక సమాఖ్యలో చేరేందుకు 1963 సెప్టెంబరు 12న ఒక ఒప్పందం చేసుకుంది. అది మరుసటి ఏడాది డిసెంబరు ఒకటి నుంచి అమల్లోకి వస్తున్నట్లు చెప్పినప్పటికీ సంపూర్ణం కాలేదు.అది నత్తనడక నడుస్తోంది.మొత్తం 35 నిబంధనలకు గాను ఇంతవరకు టర్కీ 15 మాత్రమే, అదీ పాక్షికంగా నెరవేర్చింది. కేవలం శాస్త్ర, పరిశోధనా రంగాలకు సంబంధించిన అంశమే సంపూర్ణంగా అమలు చేసింది. ఏదో ఒకసాకుతో ఇతర దేశాలు పూర్తి సభ్యత్వానికి అడ్డుపడుతున్నాయి. అక్కడ ప్రజాస్వామ్యం, మానవహక్కులను కాలరాస్తున్నారని విమర్శిస్తున్నాయి. తాజా పరిణామాలకు వస్తే 2016లో ఎర్డోవాన్ను పదవి నుంచి దించేందుకు ఒక విఫల కుట్ర జరిగింది. తరువాత తన పదవిని సురక్షితం కావించుకొనేందుకు చేసిన రాజ్యాంగ సవరణలతో మానవహక్కులు, చట్టపరమైన ఆటంకాలను కల్పిస్తున్నట్లు వాటిని తొలగించి నిబంధనలన్నింటినీ పూర్తి చేస్తేనే చేర్చుకుంటామని సమాఖ్య చెబుతోంది. వీటి కంటే పుతిన్‌తో స్నేహం, ఇతర అంశాలు ప్రధానంగా పని చేస్తున్నాయని చెప్పవచ్చు. సిరియాలో పశ్చిమ దేశాలు మద్దతు ఇస్తున్న కిరాయి మూకలు, ఉగ్రవాదులను అణచేందుకు రష్యా తోడ్పడుతున్నది, దానికి టర్కీ మద్దతు ఇస్తున్నది. ఉక్రెయిన్ సంక్షోభాన్ని సృష్టించింది, దాన్ని కొనసాగించాలని చూస్తున్నది పశ్చిమ దేశాలు కాగా తాను మధ్యవర్తిగా ఉంటానని టర్కీ ముందుకు రావటం వాటికి సుతరామూ ఇష్టం లేదు. టర్కీకి అవసరమైన మిలిటరీ పరికరాలను నాటో, అమెరికా నుంచి కొనుగోలుకు వీల్లేకుండా ఆంక్షలు విధించారు. సిరియా నుంచి ఐరోపాకు వచ్చే 40లక్షల మంది కాందిశీకులను రాకుండా చేసినందుకు ఇప్పటి వరకు ఐరోపా సమాఖ్య బిలియన్లమేర యూరోలను అందచేసింది. మరో ఆరు బిలియన్లను అందచేసేందుకు కుదిరిన ఒప్పందాన్ని టర్కీ నిలిపివేసింది. ఐరోపా సమాఖ్య తల మీద తుపాకి గురిపెట్టినట్లుగా తమ షరతులను అంగీకరించకపోతే ఇతర ఐరోపా దేశాలకు కాందిశీకుల వరద పారిస్తామని టర్కీ బెదిరిస్తున్నది.
ఎర్డోవాన్ పెట్టిన మెలికను ఐరోపా కమిషన్ తిరస్కరించింది. స్వీడన్ నాటోలో, టర్కీ ఐరోపా సమాఖ్యలో చేరటం రెండూ వేర్వేరని, సమాంతరంగా జరుగుతున్న పరిణామాలు గనుక ఒకదానికి మరొకదాన్ని పోటీ పెట్టరాదని ప్రతినిధి దానా సిపినాంట్ స్పష్టం చేసింది. జర్మన్ ఛాన్సలర్ షుల్జ్ కూడా ఆ వైఖరిని బలపరిచాడు. టర్కీ కోర్కెను తాను సమర్ధిస్తున్నట్లు నాటో ప్రధాన కార్యదర్శి జేన్స్ స్టోల్టెన్‌బర్గ్ చెప్పాడు. స్వీడన్ చేరికను టర్కీ బలపరుస్తుందని కూడా అన్నాడు. ఎర్డోవాన్ మెలిక పెట్టినప్పటికీ ఇప్పటికీ ఆమోదించే అవకాశం ఉందనే ఆశాభావం వెల్లడించాడు. విస్తరణకు సంబంధించి 2022 నివేదికలో సమాఖ్య పేర్కొన్న అంశాలు టర్కీ చేరిక అంత తేలిక కాదని స్పష్టం చేస్తున్నాయి. అక్కడ ప్రజాస్వామ్యం క్షీణిస్తున్నదని, చట్టబద్దపాలన, ప్రాధమికహక్కులు, స్వతంత్ర న్యాయవ్యవస్థల గురించి తీవ్ర ఆందోళన వెల్లడించింది.
గ్రీసును బెదిరించకుండా ఉండేట్లైతే, నాటోలో స్వీడన్ చేరికను ఆమోదిస్తే తాము టర్కీకి ఎఫ్ 16 విమానాలను విక్రయించేందుకు సిద్దమే అని అమెరికా గతంలో సందేశం పంపింది. విలినస్‌కు బయలు దేరిన జో బైడెన్ ఆదివారం నాడు విమానం నుంచే ఎర్డోవాన్‌తో గంటసేపు సంభాషించినప్పటికీ ఎలాంటి పురోగతి లేదని అమెరికా అధికారవర్గాలు చెప్పినట్లు వార్తలు. గ్రీసు పట్ల శతృత్వం, రష్యానుంచి క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు టర్కీ నిర్ణయించిననందున ఎఫ్ 16 విమానాలను విక్రయించకూడదని గతంలో అమెరికా నిర్ణయించింది. ఇప్పుడు ఒక అడుగు దిగివచ్చినట్లు కనిపిస్తోంది. స్వీడన్ చేరికకు మద్దతు ఇస్తే టర్కీకి విమానాలు విక్రయించేందుకు అమెరికా పార్లమెంటు ఆమోదించవచ్చని వార్తలు వచ్చాయి. వాటిని తమకు వ్యతిరేకంగా వినియోగించరాదని గ్రీసు డిమాండ్ చేస్తోంది. ఏజియన్ సముద్ర జలాల్లో నౌకా సంచార హక్కుల గురించి వివాదం ఉంది. తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తూ రోజూ తమ దీవుల మీదుగా విమానాలు ఎగురుతున్నట్లు గ్రీసు చెబుతున్నది. ఆ దీవుల మీదుగా ఎఫ్16 విమానాలను అనుమతించకూడదని ఆరుగురు అమెరికన్ ఎంపీలు తమ విదేశాంగ మంత్రికి లేఖలు రాశారు. విలినస్ సమావేశాల్లో జరిగిన పరిణామాల్లో వాటిని సరఫరా చేసేందుకు అమెరికా మార్గం సుగమం చేసినట్లు, దీంతో పుతిన్‌కు దూరం జరిగి టర్కీ పశ్చిమ దేశాలకు దగ్గరైనట్లు విశ్లేషణలు వెలువడ్డాయి. మంగళవారం నాడు అమెరికా భద్రతా సలహాదారు సులివాన్ మాట్లాడుతూ స్వీడన్‌కు టర్కీ పచ్చజెండా ఊపినందున 2021లో కుదిరిన ఒప్పందం మేరకు లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ నుంచి 20బిలియన్ డాలర్ల విలువ గల కొత్త ఎఫ్ 16 విమానాలతో పాటు ఇప్పటికే టర్కీ దగ్గర ఉన్న 80పాత వాటిని నవీకరించేందుకు ముందుకు వెళ్లనున్నట్లు చెప్పాడు.
విలినస్ నాటో వార్షిక సమావేశాల్లో ఉక్రెయిన్‌కు అవసరమైన ఆయుధ సాయం గురించి తప్ప నాటోలో ప్రవేశం మీద ఎలాంటి నిర్ణయమూ తీసుకొనే అవకాశం లేదు. అక్కడ పోరు ముగిసిన తరువాతే దాన్ని గురించి పరిశీలిస్తామని జో బైడెన్ సిఎన్‌ఎన్ టీవీతో చెప్పాడు. నాటో కుటుంబంలో ఉక్రెయిన్ను చేర్చుకోవాలా వద్దా అనే అంశం మీద సభ్యదేశాల్లో ఏకీభావం లేదని కూడా అన్నాడు.ఇప్పుడు గనుక చేర్చుకుంటే మేమంతా యుద్ధంలో ఉన్నట్లే అవుతుంది. ఇప్పుడే ఓటింగ్ జరపాలనటం అపరిపక్వత అవుతుంది, ఒక దేశాన్ని చేర్చుకోవాలంటే ప్రజాస్వామీకరణతో సహా కొన్ని అర్హతలు ఉండాలి అని కూడా బైడెన్ చెప్పాడు. జర్మనీ కూడా అమెరికా వైఖరితో ఏకీభవిస్తోంది. నాటో నిబంధన ఐదును పరీక్షించే అవకాశం పుతిన్‌కు ఇవ్వకూడదని జర్మనీ కోరుకొంటోందని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఉక్రెయిన్‌కు తక్షణమే నాటో సభ్యత్వం అన్న చర్చ అసంగతం, దానికి చేస్తున్న మంచిని మరచి దీని గురించి చర్చను అనుమతించటం విచారకరం.ఎవరూ ఇప్పటికిప్పుడు నాటోలో చేరాలని గట్టిగా చెప్పటం లేదు, దానికి తగిన మార్గం గురించి మాట్లాడుతున్నాం, ఇప్పుడు ఎలా సాయం చేయాలా అని ఆలోచిస్తున్నాం. దీని గురించి గాక సభ్యత్వం గురించి చర్చ పెట్టటం అంటే సమావేశాన్ని పక్కదారి పట్టించటమే, పశ్చిమ దేశాల్లో విబేధాలు ఉన్నట్లు అని చెప్పటమే, దీన్ని రష్యా స్వాగతిస్తుందని నాటో అధికారులు చెప్పినట్లు మీడియా పేర్కొన్నది.
తమను వెంటనో నాటోలో చేర్చుకోవాలని, ఆధునిక అస్త్రాలను పెద్ద ఎత్తున సరఫరా చేయాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తున్నది. అదే గనుక జరిగితే ఉక్రెయిన్ సంక్షోభ స్వభావమే మారిపోతుంది. పుతిన్ మీద నేరుగా ఆ కూటమి సేనలు యుద్ధానికి దిగవచ్చు. రష్యా దాడులకు దిగకముందుఉన్న పరిస్థితి వేరు, తరువాత తమ ప్రాంతాలను ఆక్రమించుకున్నందున నాటో సభ్వత్వం ఇవ్వాలని గతేడాది సెప్టెంబరులో జెలెనెస్కీ దరఖాస్తు చేశాడు. అనేక దేశాలు అందుకు మద్దతు తెలిపినా అమెరికా, జర్మనీ సిద్దం కాలేదు. కొన్ని ప్రాంతాలు ఉక్రెయిన్నుంచి వేరుపడి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాయి. క్రిమియా ద్వీపం తమదే అంటూ 2014లోనే రష్యా స్వాధీనం చేసుకుంది. మరికొన్ని ప్రాంతాలు ఇప్పుడు దాని ఆధీనంలో ఉన్నాయి, అటువంటపుడు మధ్యలో సభ్యత్వం ఇవ్వటం, గతం నుంచి వర్తింప చేసి ఎదురుదాడులకు పూనుకోవటం నాటో ఐదవ ఆర్టికల్ నిబంధన పరిధిలోకి రాదని చెబుతున్నారు. దాన్ని సవరించి నాటోలో చేర్చుకొని రష్యాతో నేరుగా తలపడేందుకు నాటో కూటమి ప్రస్తుతం సిద్దంగా లేదన్నది స్పష్టం.
