Tags
Anti China Media, Anti communist, BJP, China imports to India, Indian manufacturers, Narendra Modi Failures, RSS, Tata EV, Ten years Narendra Modi rule
ఎం కోటేశ్వరరావు
మన దేశంలో అగ్రశ్రేణి ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ తన విద్యుత్ కార్లకు చైనా బ్యాటరీలను కొనాలని నిర్ణయించింది. మేకిన్ ఇండియా పథకం కింద విద్యుత్ బాటరీలను తయారు చేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇదే సమయంలో గతంలో విధించిన నిషేధాలను తొలగించి ఇబ్బందిలేని ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలలో చైనా పెట్టుబడులను అనుమతించాలని కూడా నిర్ణయించారు. 2030నాటికి దేశంలో 30శాతం వాహనాలు విద్యుత్ బాటరీలో నడిచే అవకాశం ఉన్నందున వాటి ఉత్పత్తిని ఇబ్బడి ముబ్బడిగా పెంచాల్సి ఉంది. ఈ క్రమంలో చైనా పెట్టుబడుల అవసరం మనదేశానికి ఉందా లేదా అని మోడీ గారి బిజెపిలో ‘‘ అంతర్గత పోరు ’’ ఉన్నట్లు 2024 ఆగస్టు ఒకటవ తేదీన అమెరికాభారత సంయుక్త యాజమాన్యంతో నడుపుతున్న సిఎన్‌బిసి టీవీ ఛానల్ ఒక వార్తను ప్రసారం చేసింది. ఇటీవల కొద్ది నెలలుగా జరుగుతున్న పరిణామాలను చూసినపుడు చైనా లేదా అమెరికా,రష్యా దేశం ఏదైతేనేం వాటి నుంచి వచ్చే పెట్టుబడులు లేదా సంబంధాలను నిర్ణయించేది, నడిపేది మన పాలకులా కార్పొరేట్లా అన్న సందేహం కలుగుతున్నది. గతంలో సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ చైనాతో సంబంధాలు సజావుగా ఉన్నాయి. గాల్వన్ ఉదంతాల సందర్భంగా చైనా మన భూభాగాన్ని ఆక్రమించలేదని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన సంగతి తెలిసిందే. సంఘపరివార్ చైనా, కమ్యూనిస్టు వ్యతిరేకత గురించి తెలిసినప్పటికీ గత పదేండ్లలో వాణిజ్య,పారిశ్రామికవేత్తలు ఇబ్బడి ముబ్బడిగా చైనా నుంచి దిగుమతులు చేసుకుంటుండగా లేనిది దాని పెట్టుబడుల అంశంలో ఎందుకు మడిగట్టుకోవాలనే ధోరణి ఇటీవలి కాలంలో పెరిగింది.
గాల్వన్ లోయలో జరిగిన ఉదంతాల తరువాత దేశంలో పెద్ద ఎత్తున చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టారు. ఆ దేశ యాప్‌లను నిషేధించారు.పెట్టుబడులు రాకుండా ఆంక్షలు పెట్టారు.కాషాయ దళాలు, మీడియాలో కొంత భాగం చైనా వస్తు దిగుమతులను నిలిపివేస్తే అది మన కాళ్ల దగ్గరకు వస్తుందనే ప్రచారం చేశారు.తీరా చూస్తే మన ఉక్కు మంత్రిత్వశాఖ తాజా నివేదిక ప్రకారం మన దేశం దిగుమతి చేసుకుంటున్న ప్రతి నాలుగు ఉక్కు వస్తువులలో మూడు చైనా నుంచే ఉన్నట్లు ఆగస్టు 29వ తేదీ హిందూ బిజినెస్‌లైన్ పత్రిక వార్త పేర్కొన్నది.గతేడాది ఏప్రిల్‌జూలై నెలలతో పోల్చితే మన దిగుతులు అక్కడి నుంచి 30శాతం పెరిగాయి.ఏడాది క్రితం మన ఎగుమతులు ఎక్కువగా ఉండేవి కాస్తా ఇపుడు పరిస్థితి తారుమారైంది.ఇతర దేశాలకూ మన ఎగుమతులు పడిపోయాయి.విచారకరమైన అంశం ఏమంటే చివరికి గొడుగులు, బొమ్మలను కూడా చైనా నుంచి దిగుమతి పెరగటం వలన మన ఎంఎస్‌ఎంఇ సంస్థలు దెబ్బతింటున్నాయని గ్లోబల్ ట్రేడ్ రిసర్చ్ ఇనీషియేటివ్(జిటిఆర్‌ఐ) స్థాపకుడు అజయ్ శ్రీవాత్సవ చెప్పారు(2024సెప్టెంబరు ఒకటవ తేదీ పిటిఐ వార్త).ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు మనం చైనాకు 850కోట్ల డాలర్ల విలువగల వస్తువులను ఎగుమతి చేయగా అక్కడి నుంచి 5,040 కోట్ల డాలర్ల మేర దిగుమతి చేసుకున్నామని జిటిఆర్‌ఐ నివేదిక వెల్లడిరచింది.చైనాతో పోటీ పడి గొడుగులను కూడా ఉత్పత్తి చేయలేని దుస్థితికి గత పదేండ్లలో మన దేశాన్ని నరేంద్రమోడీ నెట్టారా ? చిన్నప్పటి పాఠాల్లో భార్య ఎండకు తాళలేక ఆపసోపాలు పడుతుంటే ఒక రుషి ఆగ్రహ శాపానికి భయపడి సూర్యుడు దిగివచ్చి చెప్పులు, గొడుగు ఇచ్చినట్లు చదువుకున్నాం. ఇప్పుడు చైనా వారు ఇస్తున్నారు. ఆ రుషులేమయ్యారు, ఆ సూర్యుడు ఎందుకు కరుణించటం లేదు ! చైనాతో పోటీ పడి నాణ్యంగా, చౌకగా గొడుగులు తయారు చేసేందుకు మన వేదాల్లో నిగూఢమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వెలికితీసే నిపుణులు, దేశం కోసంధర్మం కోసం పని చేసే వారే లేరా ?
ఇటీవలన మన దేశ వార్షిక ఆర్థిక సర్వే విడుదల చేశారు. దాని వివరాల ప్రకారం చైనా నుంచి ఎఫ్‌డిఐని ఆహ్వానించాలని ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ చెప్పారు.రెండు దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలను పెంచుకోవటం కంటే చైనా నుంచి పెట్టుబడులను ఆహ్వానించటం మెరుగని ఆర్థిక మంత్రికి నివేదించారు. గాల్వన్ ఉదంతాల తరువాత వైఖరిలో వచ్చిన మార్పుకు సూచిక ఇది.అమెరికా, ఐరోపాలు చైనా నుంచి సేకరణకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నందున మనం చైనా నుంచి దిగుమతులు చేసుకోవటం, వాటికి కొంత విలువను జోడిరచి తిరిగి ఎగుమతి చేయటం కంటే చైనా కంపెనీల పెట్టుబడులతో మనదేశంలో వస్తువులను ఉత్పత్తి చేసి విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయటం మరింత ప్రభావం చూపుతుందని ఆ నివేదికలో పేర్కొన్నారు. దీనికి నిర్మలా సీతారామన్ కూడా విలేకర్ల సమావేశంలో మద్దతు తెలిపారు. అయితే ప్రస్తుతానికి అలాంటి పునరాలోచన లేదని వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొన్నది.‘‘ బిజెపి ప్రతిష్టను దెబ్బతీసే పర్యవసానాలకు దారితీసే దీన్ని ఎవరూ కోరుకోవటం లేదు. ఈ విధానాన్ని భారతీయులు మెచ్చరు, కానీ అది అవసరమని మోడీ ఆయన ఆర్థిక మంత్రిత్వశాఖ గుర్తించింది ’’ అని నాటిక్సిస్‌లోని ఆసియా పసిఫిక్ ఎకానమిస్ట్ అల్సియా గార్సియా హెరారో చెప్పినట్లు సిఎన్‌బిసి వార్త పేర్కొన్నది. రానున్న ఐదు సంవత్సరాల్లో ఏటా వంద బిలియన్ డాలర్ల మేర ఎఫ్‌డిఐలను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.గత ఆర్థిక సంవత్సరంలో 71బిలియన్ డాలర్లు వచ్చాయి. సోలార్ పలకలు,విద్యుత్ బాటరీల తయారీ రంగాలలో చైనా పెట్టుబడులను అనుమతించేందుకు నిబంధనలను సులభతరం చేయనున్నారు.‘‘ భారత ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా,ఐరోపా వారు విముఖంగా ఉన్నారు. అత్యధిక విదేశీ పెట్టుబడులు ఐసిటి(ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీస్) డిజిటల్ సర్వీసెస్ వంటి రంగంలోకి వెళ్లాయి’’ అని హెరారో చెప్పాడు. ఆసియా ఉత్పత్తి కేంద్రంగా మారాలని భారత్ కోరుకుంటే చైనా సరఫరా గొలుసులతో సంబంధాలు పెట్టుకోవాలని ఢల్లీి కేంద్రంగా పని చేస్తున్న అబ్జర్వర్ రిసర్చ్ ఫౌండేషన్‌లోని విదేశీ విధాన అధ్యయన విభాగ ఉపాధ్యక్షుడు హర్ష వి పంత్ చెప్పారు.
ముందే చెప్పుకున్నట్లుగా చైనా వ్యతిరేకతను పెద్ద ఎత్తున రెచ్చగొట్టిన కారణంగా వ్యతిరేకులను సంతుష్టీకరించేందుకు , రాజకీయంగా పరువు నిలుపుకొనేందుకు గత కొద్ది నెలలుగా చైనా పెట్టుబడులను అందరితో అంగీకరింపచేయించేందుకు ఢల్లీి పెద్దలు కసరత్తుచేస్తున్నారు.‘‘ ఆర్థిక కోణంలో చూస్తే కొన్ని రంగాలలో చైనా పెట్టుబడులు మనకు అవసరమే అని చక్కటి తర్కంతో చెప్పవచ్చు. కానీ ఆక్రమంలో దేశ భద్రత,అంతర్జాతీయ రాజకీయ కోణాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది, ప్రస్తుతం చైనాతో సంబంధాలు అంత మంచిగా,సాధారణంగా లేవు ’’ అని విదేశాంగ మంత్రి జై శంకర్ ఇటీవల చెప్పారు. 2070నాటికి పూర్తి కాలుష్య రహిత లక్ష్యాన్ని చేరుకోవాలని మనదేశం లక్ష్యంగా పెట్టుకుంది.దానిలో భాగంగా 2030 నాటికి 50శాతం విద్యుత్‌ను పునరుత్పత్తి ఇంథన వనరుల నుంచి తయారు చేయాల్సి ఉంది.చైనా ఆ రంగంలో ఎంతో ముందుంది,తక్కువ ఖర్చుతో, సమర్ధవంతంగా ఉత్పత్తి చేస్తున్నది. ప్రస్తుతం అది 584 టెరావాట్ అవర్స్ సామర్ధ్యం కలిగి ఉండగా మనది కేవలం 113టెరావాట్ అవర్స్ మాత్రమే.చైనా కమ్యూనిస్టుదేశం, మనది ప్రజాస్వామ్యం అక్కడి నుంచి పెట్టుబడులు ఎలా తీసుకుంటాం అని మడిగట్టుకు కూర్చొనేందుకు మనదేశంలోని కార్పొరేట్ కంపెనీలు సిద్దంగా లేవు.అక్కడి నుంచి దిగుమతులు చేసుకొనే బదులు పెట్టుబడులు తీసుకొని మనదేశంలోనే సంస్థలను ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉపాధిని కూడా కల్పించవచ్చు. ప్రస్తుతం మన దేశం తప్ప ప్రపంచంలో మరేదేశమూ చైనా పెట్టుబడులపై పూర్తి నిషేధం విధించలేదు.దాన్నుంచి పూర్తిగా విడగొట్టుకునేందుకు ఏ దేశమూ సిద్దంగా లేదు.తోటి సోషలిస్టు దేశమైనా చైనావియత్నాం మధ్య కొన్ని సరిహద్దు విబేధాలున్నాయి, అయినా చైనా నుంచి పెట్టుబడులను తీసుకుంటున్నది.
టాటా కంపెనీ అనేక దేశాల అనుభవాలను చూసిన తరువాతనే చైనా నుంచి బ్యాటరీలను కొనాలని నిర్ణయించింది.సరఫరా, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిగణనలోకి తీసుకుంది.మన దేశ విద్యుత్ వాహన మార్కెట్‌లో దాని వాటా 60శాతం. ఇంతకు ముందుదాని ఉత్తత్తుల్లో బాటరీల నుంచి ఎదురైన సమస్యలతో పాటు మార్కెట్లో పోటీని కూడా అది గమనంలోకి తీసుకుంది.చైనాతో ఉన్న సరిహద్దు, రాజకీయ విధానాలను అది పక్కన పెట్టింది. ఇప్పటికే చైనా బివైడి కంపెనీ మన దేశంలోని సంస్థలతో భాగస్వామిగా లేదా విడి భాగాలను ఎగుమతి చేసేదిగా ఉంది. విద్యుత్ వాహనాలలో బ్యాటరీ ధర, సామర్ధ్యమే కీలకం.చైనాతో అమెరికా ప్రభుత్వానికి ఉన్న రాజకీయ విబేధాల కారణంగా అమెరికా దిగ్జజ కంపెనీ ఫోర్డ్ చైనా కంపెనీతో కలసి అమెరికాలో ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకొని కూడా అనేక ఆటంకాలను ఎదుర్కొని విరమించుకుంది. అది చేసిన తప్పిదాన్ని టాటా చేయదలచలేదని పరిశీలకులు పేర్కొన్నారు.తొలుత కొన్ని రంగాలలో ఆటంకాలను తొలగిస్తే క్రమంగా ఇతర రంగాలకు విస్తరిస్తారు. మన దేశంలో ఇప్పటి వరకు కేంద్రంలో ఎవరు అధికారంలో ఏ పార్టీ లేదా కూటమిఉన్నప్పటికీ కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలనే అనుసరించింది. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది.వాటి అడుగులకు మడుగులొత్తితేనే ఎవరైనా అధికారంలో ఉంటారు !
