Tags
CHANDRABABU, Donald trump, Narendra Modi 2047, Narendra Modi Failures, visionless Narendra Modi, Vladimir Putin, Xi Jinping
ఎం కోటేశ్వరరావు
అన్నీ వారే చేశారంటూ గాంధీ, నెహ్రూ వంటి నేతలను ఇప్పటికీ ఆడిపోసుకుంటున్నారు. కాంగ్రెస్ ఐదు దశాబ్దాలలో చేయలేనిదానిని తమ మోడీ ఐదేండ్లలో చేశారు చూడండని డబ్బాకొట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వంటి వారు రంగంలోకి దిగి జిఎస్‌టిి సంస్కరణలతో బొందితో కైలాసానికి తీసుకుపోతున్నారన్నట్లుగా ఆకాశానికి ఎత్తుతున్నారు. గతంలో ఏం మాట్లాడారో తెలిసిందే ! నిజానికి ఏం జరుగుతోంది ? తాజాగా సెప్టెంబరు మాసంలో దేశ వాణిజ్యలోటు వివరాలు వెల్లడయ్యాయి. ఎగుమతులు 6.7శాతం పెరిగి 36.38 బిలియన్ డాలర్లకు చేరగా దిగుమతులు 16.7శాతం పెరిగి 68.53 బిలియన్ డాలర్లకు చేరాయి.కిందపడ్డా గెలిచింది మేమే అన్నట్లుగా దిగుమతులు అంటే మేం వస్తుకొనుగోలు శక్తి పెంచిన కారణంగానే అవసరం అవుతున్నాయని సమర్ధించుకుంటున్నారు. రూపాయి పాపాయిని ఆరోగ్యంతో బలిష్టంగా పెంచుతామని చెప్పారు. మోడీ మూడోసారి పాలన ఐదేండ్లు గడిచే సరికి ఇప్పుడున్న 89 డాలరుకు ముచ్చటగా వంద రూపాయలకు పతనమైనా ఆశ్చర్యం లేదు.
వికసిత భారత్ 2047 పేరుతో నరేంద్రమోడీ దేశాన్ని ఎక్కడికో తీసుకుపోతామన్నారు, ఇప్పుడు ఎటు తీసుకుపోతున్నారో తెలియదు. కొన్ని చేదు నిజాలను అంగీకరించకతప్పదు. ప్రపంచబ్యాంకు నివేదిక ప్రకారం మన దేశానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మోడీ అధికారానికి వచ్చిన తరువాత జిడిపిలో 2.1శాతం ఉండగా 2023 నాటికి 0.8శాతానికి దిగజారాయి. అంకెల్లో చూస్తే 2014 నుంచి 2024వరకు వచ్చిన మొత్తం 509.69 బిలియన్ డాలర్లు(సగటున ఏడాదికి 46.34బి. డాలర్లు) అధికారానికి వచ్చిన కొత్తలో విమానం వేసుకొని దేశదేశాలూ ఎందుకు తిరుగుతున్నారంటే దిగజారిన దేశ ప్రతిష్ట పునరుద్దరణ, పెట్టుబడుల కోసం అని చెప్పారు. గొర్రెతోక బెత్తెడు అన్నట్లుగా 2016లో 46 బిలియన్ డాలర్లు వస్తే 2024లో 53 బిలియన్ డాలర్లు ఉంది. చైనాకు 2019 నుంచి 21వరకు మూడు సంవత్సరాల్లో వచ్చిన మొత్తం 787 బిలియన్ డాలర్లు. తరువాత కాలంలో చైనాకు మనదేశానికి వచ్చిన మొత్తం కూడా రాలేదు.2021లో 344 బిలియన్ డాలర్లు వస్తే 2023లో 51.3, 2024లో 18.6బిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయి. దానికి ఉన్న కారణాల గురించి మరోసందర్భంలో చెప్పుకోవచ్చు.చైనాలో పెరిగిన ఉత్పాదకత ఖర్చులతో వచ్చే లాభదాయకత కంటే అమెరికాలో వడ్డీ రేటు ఎక్కువగా ఉండటం ఒకటి. ఇక్కడ ముఖ్యాంశమేమంటే చైనాకు పెట్టుబడులు ఆగిపోయాయి, మనదేశానికి అవి రూటుమార్చాయి, కంపెనీలు వరుసలో నిలుచున్నాయి అని చెప్పిన వారు యాపిల్ కంపెనీ గురించి పదే పదే చెప్పటం తప్ప చైనాకు తగ్గిన ఎఫ్‌డిఐ మనకు ఎందుకు రాలేదో చెప్పాలి. చైనా కంపెనీలు మనదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దపడితే గత ఐదు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్న సంగతి తెలిసిందే.ఆశించిన అమెరికా, ఇతర దేశాల కంపెనీల జాడకనిపించకపోవటంతో ఇప్పుడు చైనా పెట్టుబడులకు ద్వారాలు తెరిచేందుకు మోడీ సర్కార్ పూనుకుంది.
కుండలో కూడు కదల కూడదు బిడ్డడు దుడ్డులా ఉండాలన్నది మన ఆలోచనా విధానంగా ఉంది. అది మారనంత వరకు అటూ ఇటూ కాని స్థితే. ఇతర అభివృద్ధి చెందిన, చైనా వంటి దేశాలతో పోల్చితే మనదేశంలో కాలం చెల్లిన సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడుల పరిమితం, బలహీనమైన మౌలిక సదుపాయాలు ఆకర్షణీయంగా లేనపుడు రాజకీయ నేతలు, వారికి భజన చేసే మీడియా ఎన్ని కబుర్లు చెప్పినా ఉపయోగం ఉండదు.” విదేశీ కంపెనీలకు భారత్ శ్మశానం వంటిది ” అని ఏకంగా ప్రపంచబ్యాంకే వాణిజ్య నివేదికలో పేర్కొన్నది.ఆ ముద్ర నుంచి ఇంతవరకు బయటపడిందా అన్నది సందేహమే. ఇంతే కాదు 2014 నుంచి 2021 వరకు మన దేశంలో ఉన్న 2,800 విదేశీ కంపెనీలు దుకాణాలు మూసుకొని వేరేచోట్లకు వెళ్లిపోయాయి.మన దేశానికి రావాలనుకొనే వారు ఇలాంటి వాటన్నింటినీ ఒకటికి రెండుసార్లు చూసుకుంటారు. ఇప్పుడు అమెరికా విధించిన పన్నులతో ఇక్కడ పరిశ్రమలే ఎలా మనుగడ సాగించాలా అని ఆలోచిస్తుండగా కొత్తగా వచ్చేవారి సంగతి వేరే చెప్పనవసరం లేదు. మన కార్పొరేట్ల తీరుతెన్నులు చూస్తే మిగతావారి మాదిరే తమ లాభాలు తప్ప వేరే పట్టవు. కేంద్రంలో అధికారంలో ఎవరున్నా తమకు అనుకూలమైన విధానాలను అమలు చేయిస్తారు. ఇప్పుడు అమెరికా, ఇతర దేశాలతో తలెత్తిన పరిస్థితుల్లో ఏం చేయాలో దిక్కుతోచటం లేదని చెప్పవచ్చు.గతంలో ఆసియన్ దేశాలతో కూడిన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్‌సిఇపి) కూటమిలో లేదా పసిఫిక్ భాగస్వామ్య కూటమి సిపిటిపిపి(కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ ఎగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్టనర్‌షిప్)లో చేరాలా ? చేరితే వచ్చే లాభాలేమిటి ? నష్టాలేమిటనే గుంజాటనలో పాలకవర్గం దాని ప్రతినిధిగా ప్రస్తుతం ఉన్న నరేంద్రమోడీ సర్కార్ ఉంది. ఏదో ఒక కూటమిలో చేరాలనే వత్తిడి ప్రారంభమైంది.చేరితో పౌరుల నుంచి వచ్చే వ్యతిరేకత తమ అధికారానికే ఎసరు తెస్తుందేమో అన్న భయం బిజెపి, దాని మద్దతుదార్లలో కూడా తలెత్తింది. పైకి చెప్పుకోకపోవచ్చు.
ముందుగా ఆర్‌సిఇపి గురించి చూద్దాం. ఈ కూటమి ఒప్పందంపై 2020 నవంబరు 15 సంతకాలు చేసింది. అది 2022 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది.దీనిలో ఆస్ట్రేలియా,బ్రూనీ, కంపూచియా, చైనా, ఇండోనేషియా, జపాన్, దక్షిణ కొరియా, లావోస్, మయన్మార్, మలేసియా, న్యూజీలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్,థారులాండ్, వియత్నాం ఉన్నాయి. ఏడు సంవత్సరాలు తర్జన భర్జన పడిన తరువాత 2019 నవంబరులో ఈ కూటమిలో చేరకూడదని నరేంద్రమోడీ సర్కార్ నిర్ణయించింది. ముందు ఎట్టిపరిస్థితిలోనూ చేరకూడదని రైతు, వ్యవసాయ కార్మిక, పారిశ్రామిక కార్మికులు, ఇతరులూ స్పష్టం చేశారు. చైనా ఉన్న ఏ వాణిజ్య కూటమిలోనూ చేరకూడదని పారిశ్రామికవేత్తలు గట్టిగా పట్టుబట్టారు. దాంతో ఈ కూటమికి మనదేశం దూరంగా ఉంది. అయితే ఇప్పటికీ ఆర్‌సిఇపి మన దేశానికి ఆహ్వానం పలుకుతూనే ఉంది. గతంలో వ్యతిరేకించిన కార్పొరేట్ శక్తులే డోనాల్డ్‌ట్రంప్ దెబ్బతో పునరాలోచన చేయాలని కోరుతున్నాయి. వారెందుకు నాడు వ్యతిరేకించారంటే ఒకటి, చైనాతో అప్పటికే ఉన్న వాణిజ్యలోటు మరింత పెరుగుతుంది, రెండు, ఆ కూటమిలోని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తమ పాడి ఉత్పత్తులకు మన మార్కెట్‌ను తెరవాలని డిమాండ్ చేస్తున్నాయి, అదే జరిగితే మన పాడి పరిశ్రమలో ఉన్న కోట్లాది మంది రైతులు నష్టపోతారు.రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో సున్నితమైన అంశం. మూడవది, సేవారంగానికి ఇతర దేశాలు తమ మార్కెట్లను తెరిచే అంశంపై మన ప్రతిపాదనలకు ప్రత్యేకించి నిపుణుల రాకపోకలకు సంబంధించి తగిన మద్దతు రాకపోవటం.
అయితే ఇప్పుడు కార్పొరేట్లలో పునరాలోచనకు పరిస్థితులేమైనా మారాయా ? ఒక్క మాటలో చెప్పాలంటే లేదు. చైనాతో వాణిజ్య లోటు ఆరేళ్ల క్రితం 48.6 బిలియన్ డాలర్లు ఉంటే ఇప్పుడు వంద బిలియన్ డాలర్లకు చేరింది. వ్యవసాయం, పాడి పరిశ్రమలపై మన వైఖరిలో అప్పుడూ ఇప్పుడూ ఒకటిగానే ఉంది. అందుకే ఆస్ట్రేలియా, అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవటానికి మోడీ సర్కార్ భయపడుతోంది. నయా ఉదారవాదం ప్రకారం మనకు లబ్ది కలిగించే సేవారంగ మార్కెట్‌లను తెరవాలన్న మన ప్రతిపాదనలకు ఇతర దేశాలు సుముఖంగా లేవు. దీని అర్ధం ఎవరి రక్షణ చర్యలకు వారు కట్టుబడి ఉన్నారు. ఈ స్థితిలో పునరాలోచన చేయాలని కొందరు ఎందుకు కోరుతున్నారంటే ట్రంప్ ఇచ్చిన షాక్‌తో ప్రభావితమైన రంగాలకు ఏం చేయాలో తోచక ఈ ప్రయత్నం ఏమైనా ఉపయోగపడుతుందా అని భావిస్తున్నారని చెప్పవచ్చు.పోనీ చేరితే వెంటనే ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే ఉండదు. దాని నిబంధనావళి ప్రకారం 2022 నుంచి ఇరవై సంవత్సరాల వ్యవధిలో నాడున్న పన్నులను 92శాతం తగ్గించాల్సి ఉంటుంది. అదే విధంగా ఎగుమతి, దిగుమతుల కోటాలను ఖరారు చేస్తారు. తెల్లవారేసరికి మన సరుకులను ఎగుమతి చేసి లాభాలు సంపాదించాలంటే కుదరదు. మన రైతాంగానికి, పాడి, కోళ్ల పరిశ్రమల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకొని మార్కెట్‌ను తెరిస్తే అదొక తీరు. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించటానికే మొరాయిస్తున్న నరేంద్రమోడీ సర్కార్ అలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందంటే నమ్మేదెవరు ? రైతాంగమే కాదు కొన్ని పరిశ్రమలు కూడా దెబ్బతింటాయి.
ఇక రెండో ఆర్థిక కూటమి సిపిటిపిపిని చూద్దాం. దీనిలో ఆర్‌సిఇపిలో ఉన్న కొన్నింటితో పాటు ఇతర దేశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, వియత్నాం, సింగపూర్, బ్రూనీ,కెనడా, మలేసియా,జపాన్, చిలీ, పెరూ, బ్రిటన్,మెక్సికో ఉన్నాయి. వీటి మధ్య ఒప్పందం 2018లో ఉనికిలోకి వచ్చింది. దీని ప్రకారం 99శాతం వరకు పన్నులను తగ్గించాల్సి ఉంటుంది.ఆర్‌సిఇపి కంటే నిబంధనలు గట్టిగా ఉన్నాయి. అంతకు ముందు ట్రాన్స్ ఫసిఫిక్ పార్టనర్‌షిప్ (టిపిపి) పేరుతో కుదిరిన ఒప్పందం నుంచి అమెరికా వైదొలగటంతో అది మూలన పడి దాని స్థానంలో కొత్తగా ఉనికిలోకి వచ్చింది.దీనిలో సభ్యత్వం కోసం చైనా దరఖాస్తు చేసినప్పటికీ దానికి ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆర్ధిక సేవారంగాన్ని తెరవాలన్న నిబంధనతో పాటు సమాచారాన్ని స్వేచ్చగా ఇచ్చిపుచ్చుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థల గుత్తాధిపత్యాన్ని తొలగించాలనే షరతులు ఉన్నాయి. వాటిని చైనా అంగీకరించటం లేదు. అమెరికా, చైనా రెండూ లేవు గనుక మనం చేరితే ఉపయోగం ఉంటుందన్న ఆశతో సిపిటిపిపిలో చేరితే ఎలా ఉంటుందని మన కార్పొరేట్లు ఆలోచన చేస్తున్నారు. ఆర్‌సిఇపి కంటే మరింతగా ఉదారవాద విధానాలను అమలు జరపాల్సి ఉంటుంది.ప్రస్తుతం నరేంద్రమోడీ చేస్తున్నవాటికే ప్రతిఘటన ఎలా ఉంటుందో రైతాంగ ఉద్యమం స్పష్టం చేసింది. ఇప్పుడు కార్మిక చట్టాలలో తెస్తున్న మార్పులకు వ్యతిరేకంగా కార్మికవర్గం కూడా ఆందోళనకు సిద్దం అవుతున్నది. ప్రభుత్వ రంగ సంస్థలను పరిమితం చేసే యత్నాలకు వాటి సిబ్బంది కూడా వ్యతిరేకత వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. అందువలన ఈ కూటమిలో చేరటం కూడా అంత తేలిక కాదు.
ఏ దేశానికైనా ఒక దీర్ఘకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలు ఎత్తుగడలు అవసరం. నరేంద్రమోడీ సర్కార్‌కు అలాంటి ఆలోచనగానీ, ఆచరణగానీ లేదు. అందువల్లనే అమెరికా మనమీద పెద్ద ఎత్తున వత్తిడి తెస్తున్నది.దాన్ని తప్పించుకొనేందుకు మాటల్లేవ్, మాట్లాడుకోవటాలు లేవు అన్నట్లుగా ఐదేండ్ల క్రితం అన్ని సంబంధాలను తెంచుకున్న చైనాతో తిరిగి చేయి కలపటం, అవసరమైతే రష్యా, చైనా, భారత్ ఒక కూటమిగా ఏర్పడతాయనే సందేశాన్ని షాంఘై సహకార సంస్థ సమావేశాల సందర్భంగా ఇచ్చారు. అయితే అమెరికాతో సంబంధాలకు కూడా తహతహలాడుతున్నారు.అందుకే చైనా, రష్యా బహిరంగంగా చెప్పనప్పటికీ ప్రతి అడుగూ అనుమానంతో వేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం, ఐరోపా సమాఖ్యతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవాలని, స్థానిక గిరాకీని పెంచేందుకు పరిశ్రమలకు మద్దతు ఇవ్వాలని, అదనపు రిస్కులను తీసుకోకుండా అన్ని దేశాలతో ఉన్న స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలతో గరిష్టంగా లబ్దిపొందేందుకు చర్యలు తీసుకోవాలని మనకార్పొరేట్లు కోరుతున్నారు. పదేండ్ల మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా పిలుపులు ఘోరంగా విఫలమయ్యాయి. దీంతో చైనా ప్లస్ 1పేరుతో కొత్త పల్లవి అందుకున్నారు.
బహుళజాతి కంపెనీలు ముందుకు తెచ్చిన ఈ వ్యూహం వాణిజ్యపరమైనది. సరఫరా వ్యవస్థ లేదా గొలుసులో చైనాను విస్మరించలేరు.కనుచూపు మేరలో ప్రత్యామ్నాయం కనిపించటం లేదు. చైనాలో కార్మికవేతనాలు పెరుగుతున్నందున, ఇతర నిబంధనలతో ఉత్పాదక ఖర్చులు పెరుగుతున్నాయి. అయితే 140 కోట్ల జనాభా ఉన్న మార్కెట్‌ను వదులుకోలేరు. అందుకే చైనాతో పాటు మరొక దేశంలో తమ కార్యకలాపాలను ప్రారంభించాలన్నదే చైనా ప్లస్ 1 అర్ధం. మన దేశంలో యాపిల్ కంపెనీ కార్యకలాపాలకు కారణమిదే. దీని భావం అన్ని కంపెనీలు మన దేశానికి బారులు తీరాయని కాదు. వియత్నాం,ఇండోనేషియా,థారులాండ్ ఇలా ఏది అనుకూలంగా ఉంటే దాన్ని ఎంచుకోవచ్చు.మన విషయానికి వస్తే సానుకూల, ప్రతికూల అంశాలు ఉన్నాయి. యువజనాభా గణనీయంగా ఉండటం, కార్మికవేతన ఖర్చు తక్కువ(2023 సర్వే ప్రకారం చైనా కంటే వేతనాలు 47శాతం తక్కువ.) ఉత్పాదకతతో ముడిపెట్టిన ప్రోత్సాహకాలు ఉన్నాయి. రోడ్ల వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. ఇవి సానుకూల అంశాలు కాగా సవాళ్లు కూడా ఉన్నాయి. 2013 నుంచి చైనాలో వేతనాలు పెరుగుతున్నందున కంపెనీలు మనదేశానికి వస్తాయని చెప్పినా వాటి జాడలేదు. నియంత్రణలు ఎక్కువ ( అంబానీ, అదానీలకు ఎవరూ పోటీ రాకూడదు, అందుకే అమెజాన్ అధిపతి బెజోఫ్‌కు గతంలో మోడీ కనీసం దర్శన భాగ్యం కూడా కల్పించలేదు) మౌలిక సదుపాయాలు అంటే ” తోలు ” వలిచే రోడ్లు మాత్రమే కాదు. వియత్నాం, థారులాండ్ వంటి చిన్నదేశాల నుంచి కూడా మనకు పోటీ ఎక్కువగా ఉంది. కబుర్లు ఎక్కువ ఆచరణ తక్కువ.మొత్తంగా చూసినపుడు సమర్ధుడైన నావికుడిగా భావించి మన నావను నరేంద్రమోడీకి అప్పగిస్తే ఇప్పుడది చుక్కాని లేనట్లు ఎటు పోతుందో తెలియకుండా నడి సముద్రంలో ఉంది. చిత్రం ఏమిటంటే దీనికి కూడా నెహ్రూ కారణమని చెప్పగల సమర్ధులుంటే నిజమే అని నమ్మే అమాయకులు పుష్కలంగా ఉండటం అసలైన సమస్య !
