Tags
:vizag steel package, BJP, CHANDRABABU, Narendra Modi Failures, VISVESVARAYA IRON AND STEEL FACTORY, vizag-steel-plant
ఎం కోటేశ్వరరావు
ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న విశాఖ ఉక్కును ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం రు.11,440 కోట్ల పాకేజ్‌ను ప్రకటించింది.ఆ మొత్తంలో రు.10,300 కోట్లు ఈక్విటీ వాటా సొమ్ముగా, మిగిలిన మొత్తం నిర్వహణ రుణం. అది గ్రాంటు కాదు.అయినా కనుక కొంత మేలు కలుగుతుంది. తీవ్రంగా ఉన్న రోగికి నొప్పి తగ్గించే మాత్ర ఇస్తే తాత్కాలిక ఉపశమనం తప్ప జబ్బు పోయినట్లు కాదు.ఈ మాత్రానికే తెలుగుదేశం శ్రేణులు సంబంరాలు చేసుకుంటున్నాయి. ఇది రెండిరజన్ల పాలన కారణంగానే జరిగినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజెపి పలుకులు వల్లిస్తున్నారు. ప్రయివేటీకరణ ముప్పు తొలగిపోయినట్లు నమ్మించేందుకు చూస్తున్నారు. ఆంధ్రుల ఆకాంక్షలను కేంద్రం గమనించిందని చిత్రిస్తున్నారు. ఈ పదజాలం నరేంద్రమోడీని పొగిడేందుకు తప్ప మరొకటి కాదన్నది స్పష్టం.నిజానికి బిజెపికి మతపరమైన మనోభావాలు తప్ప ఇతర అంశాలు పట్టవు. భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గౌరవార్దం ఆయన పేరు పెట్టిన భద్రావతి ఉక్కునే అమ్మేందుకు చూసిన వారికి విశాఖ ఉక్కు ఒక లెఖ్కా. దాన్ని రక్షించుకొనేందుకు 1,390 రోజులుగా కార్మికులు,వామపక్ష పార్టీలకు చెందిన వారు ఏదో ఒక రూపంలో నిరసన తెలియచేస్తూనే ఉన్నారు. ఈ ప్లాంట్ ఉనికిలోకి వచ్చిన నాలుగుదశాబ్దాల కాలంలో కేంద్రంలో, రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ఇష్టంలేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లుగానే ఉంది తప్ప ఆ సంస్థను నిలబెట్టేందుకు అవసరమైన మౌలిక చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కబుర్లు చెబుతున్నారు.
చంద్రబాబు నాయుడు చెప్పినట్లు రెండిరజన్ల పాలన కారణంగానే పదకొండువేల కోట్ల పాకేజ్ వస్తే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా అక్కడి భద్రావతిలోని విశ్వేశ్వరయ్య ఉక్కు కర్మాగారానికి నెల రోజుల క్రితమే ఉక్కు శాఖా మంత్రి కుమారస్వామి పదిహేనువేల కోట్ల పాకేజ్‌ను ప్రకటించటాన్ని ఎలా చూడాలి. ఆ సంస్థ పునరుద్దరణకు పదివేల కోట్లు అవసరమని గతంలో చెప్పిన మంత్రి పదిహేనువేల కోట్ల పాకేజ్ ప్రకటించారు, 26వేల కోట్ల అప్పులున్న విశాఖ స్టీలుకు పదకొండున్నరవేల కోట్లా ? గొప్పలు చెప్పుకొనేందుకు కాస్త వెనుకా ముందు చూసుకోవాల్సిన అవసరం లేదా ? జనం మరీ అంత అమాయకంగా కనిపిస్తున్నారా ? విశాఖ ఉక్కు లాభాలతో నడిచేందుకు అవసరమైన స్వంత గనుల గురించి, సెయిల్ సంస్థలో విలీనం గురించి రెండిరజన్ల పెద్దలు ఎందుకు మాట్లాడటం లేదు.
భద్రావతి ఉక్కు ఫ్యాక్టరీ వ్యవహారాలను గమనించినపుడు ఒక వేళ విశాఖ ఉక్కును సెయిల్ సంస్థలో విలీనం చేసినా ప్రైవేటీకరణ ముప్పు ఉండదనే హామీ లేదు.భద్రావతి ఉక్కు సెయిల్లోనే ఉంది. అయినప్పటికీ దాన్ని మూసివేయాలని, విక్రయించాలని అదే సంస్థగతంలో నిర్ణయించటమే గాదు టెండర్లను కూడా పిలిచింది. లోక్‌సభ ఎన్నికలు జరిగి మూడోసారి నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2024జూన్ 30వ తేదీన మంత్రి కుమారస్వామి ఆ సంస్థను సందర్శించి తిరిగి పనిచేయిస్తామని వాగ్దానం చేశారు.అది జరిగిన నెల రోజులకు జూలై 30వ తేదీన అదే మంత్రిత్వశాఖ లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో దాన్ని ఇప్పటికే మూసివేయాలని నిర్ణయించామని అందువలన తిరిగి పనిచేయించే ఉద్దేశ్యం లేదని స్పష్టంగా పేర్కొన్నది. ప్రశ్న అడిగింది ఎవరో కాదు, షిమోగా బిజెపి ఎంపీ బివై రాఘవేంద్ర(మాజీ సిఎం ఎడియూరప్ప కుమారుడు). దానికి ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సమాధానం ఇచ్చారు. 2016 అక్టోబరులోనే సూత్రప్రాయంగా వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ విధానం కింద ఫ్యాక్టరీని అమ్మివేసేందుకు అనుమతి ఇచ్చినట్లు, అయితే దరఖాస్తు చేసిన వాటిలో ఎంపిక చేసిన సంస్థలు తదుపరి ముందుకు పోయేందుకు ఆసక్తి చూపకపోవటంతో అమ్మివేయాలనే నిర్ణయాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. తరువాత దాన్ని మూసివేసేందుకు చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించారు.ఈ విషయాన్ని 2022 అక్టోబరు 14వ తేదీన పెట్టుబడుల మరియు ప్రభుత్వ ఆస్తుల యాజమాన్యశాఖకు తెలియచేసినట్లు కూడా మంత్రి తెలిపారు.ప్రస్తుతం 245 మంది పర్మనెంటు ఉద్యోగులు ఉన్నట్లు అనుబంధ సంస్థలు పంపిన కొన్ని పూర్తిగాని ఉత్పత్తులకు మెరుగులు దిద్దుతున్నట్లు, 202324లో అమ్మకానికి వీలైన పదమూడువేల టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. నాలుగోసారి ఎంపీగా ఎన్నికైనప్పటికీ ఉక్కు ఫ్యాక్టరీని పునరుద్దరింప చేయటంలో విఫలమైనట్లు కాంగ్రెస్ పెద్ద ఎత్తున రాఘవేంద్రపై విమర్శల దాడికి దిగటంతో ప్రశ్న అడగాల్సి వచ్చింది.
వంద సంవత్సరాల క్రితం మైసూరు రాజు నలవాది కృష్జరాజ వడయార్ రాజ్యంలో దివానుగా ఉన్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచన మేరకు ఏర్పాటు చేసిన ఈ ఫ్యాక్టరీ మైసూర్ ఐరన్ వర్క్స్ పేరుతో 1923లో భద్ర నది తీరంలో ప్రారంభమైంది.ఇతర లోహాలతో మిళితం చేసి ప్రత్యేకమైన ఉక్కును తయారు చేసిన దేశంలోని తొలి ఫ్యాక్టరీ ఇది. తరువాత మైసూర్ ఐరన్ మరియు స్టీల్ వర్క్స్‌గా మారింది. 1962లో 40:60శాతం వాటాలతో కేంద్రకర్నాటక ప్రభుత్వ కంపెనీగా ఉనికిలోకి వచ్చింది.1975లో విశ్వేశ్వరయ్య ఐరన్ మరియు స్టీల్ లిమిటెడ్ అని నామకరణం చేశారు. 1989లో సెయిల్ అనుబంధ సంస్థగా జతచేసి 1998లో విలీనం చేశారు.2004లో లాభాల బాట పట్టిన సంస్థ తరువాత నష్టాలపాలైంది.తరువాత సెయిల్ దాన్ని మూసివేసి విక్రయించాలని నిర్ణయించింది. ఈ ఫ్యాక్టరీ మూసివేత, అమ్మివేత నిర్ణయం రెండిరజన్ల పాలనలోనే జరిగింది.కర్ణాటకలో అప్పుడు బిజెపి అధికారంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తరువాత కూడా మూసివేతకే కట్టుబడి ఉన్నట్లు అది స్పష్టంగా చెప్పింది.ఉత్పత్తి ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని, తక్కువ పరిమాణంలో ఉత్పత్తి ఉందని, పాతబడిన సాంకేతిక పరిజ్ఞానం, కాపిటివ్ మైన్స్ కూడా లేవని, అల్లాయ్ ఉక్కు రంగంలో పోటీ ఎక్కువగా ఉందని 2023లో ఉక్కుశాఖ మంత్రిగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా పార్లమెంటులో వాదించారు. నాటకీయ పరిణామాల మధ్య గతేడాది డిసెంబరులో దాని పునరుద్దరణకు పదిహేనువేల కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లు కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రకటించారు.అయితే నిర్దిష్ట చర్యలేవీ ఇంతవరకు ప్రారంభం కాలేదు, అది కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుందా లేక ఏదో ఒకసాకుతో అయినకాడికి తెగనమ్మి వదిలించుకుంటారా అన్నది చెప్పలేము.
భద్రావతి ఉక్కుతో పోలిస్తే విశాఖ ఉక్కు ఎంతో అధునాతనమైన సంస్థ.ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖలోని అతి పెద్ద కంపెనీ. ఏది పెద్దది ఏది చిన్నది అన్న చర్చ అవసరం లేదు. రెండిరటినీ రక్షించుకోవాల్సిందే. ఇప్పుడు రెండు సంస్థలకూ కేంద్ర ప్రభుత్వం పాకేజీలను ప్రకటించాల్సి వచ్చింది.దీనికి కారణం కేంద్రంలో బలాబలాల్లో వచ్చిన మార్పే అన్నది స్పష్టం. ఎవరి మద్దతు అవసరం లేకుండా స్వంతంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం నరేంద్రమోడీకి లోక్‌సభ వచ్చినపుడు కళ్లు నెత్తికెక్కాయంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి అధికారానికి వచ్చినపుడు విశాఖ ఉక్కుకు గనులు కేటాయించాలని చంద్రబాబు నాయుడు గట్టిగా అడిగింది లేదు, జగన్మోహనరెడ్డి ఏలుబడి సంగతి తెలిసిందే. రెండు పార్టీలూ మోడీకి మద్దతు ఇవ్వటంలో పోటీ పడ్డాయి. భద్రావతి ఉక్కును పునరుద్దరించాలని బిజెపి నేత యడియూరప్ప నాయకత్వంలో ఆ పార్టీ ప్రతినిధివర్గం నరేంద్రమోడీని కలిసినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు.బిజెపికి దూరంగా ఉన్న కారణంగా అప్పుడు దేవెగౌడ పాలనలో తగిన చర్యలు తీసుకొని ఉంటే మూతపడే పరిస్థితి వచ్చేది కాదని ఎడియూరప్ప కుమారుడు, ఎంపీ రాఘవేంద్ర నెపాన్ని ఆయన మీదకు నెట్టేందుకు చూశారు. భద్రావతి ఉక్కును కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాని కారణంగా అది అలాగే ఉండిపోయింది తప్ప లేకుంటే తుక్కు కింద ఎప్పుడో మారి ఉండేది.విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ 33వేల ఎకరాల్లో ఉంది.అందువలన అమ్మకానికి పెడితే దాన్ని ఎగరేసుకు పోయేందుకు సిద్దంగా ఉన్నారు.ఆ ఫ్యాక్టరీ కోసం ప్రాణాలర్పించిన వారుగానీ, దానికి భూములు ఇచ్చిన వారు గానీ పప్పుబెల్లాల్లా పందారం చేసి కారుచౌకగా ఎవరికో కట్టబెట్టేందుకు కాదు. ఇప్పటి వరకు ప్రైవేటీకరణ విధానంలో మార్పు చేసినట్లు కేంద్రం ఎక్కడా చెప్పటం లేదు. అందువలన తెలుగుదేశం, జనసేన నేతల మాటలు నమ్మనవసరం లేదు. తీరా వేటు పడిన తరువాత మేము చేయాల్సిందంతా చేశామని చేతులు దులుపుకుంటారు. ఇప్పటివరకు ఎంతో పట్టుదలతో ఉన్న కార్మికులు, వారికి మద్దతుగా ఉన్న వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలను మరింతగా జనం ఆదరించి నిలబడితే ప్రైవేటీకరణ ముప్పును తిప్పికొట్టటం అసాధ్యం కాదు.
