ఎం కోటేశ్వరరావు
పదేండ్ల నరేంద్రమోడీ పాలన, వెనక్కు తిరిగి చూసుకుంటే జనాభాలో సగభాగమైన మహిళల స్థితి ఏమిటి ? వచ్చే ఎన్నికల్లో ఓట్ల మోడీ గ్యారంటీల పేరుతో ఊదరగొడుతున్నారు. తమ మోడీని ప్రపంచనేతగా గుర్తించారని కీర్తిస్తున్నారు బిజెపి అభిమానులు.ఎవరు గుర్తించారో, ప్రాతిపదిక ఏమిటో ఎవరూ చెప్పలేరు. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత. తమకు అవసరమైనపుడు వెంపల చెట్లకు నిచ్చెన వేసి ఎక్కేవారిని కూడా ఆజానుబాహుడని పొగడేవారికి ప్రపంచంలో కొరత లేదు. మహిళలకు శాంతి, రక్షణ సూచికలో మనమెక్కడున్నామో తెలుసా ? మన మిత్ర లేదా సహజ భాగస్వామ్య దేశంగా మోడీ అండ్ కో చెప్పుకుంటున్న అమెరికాలోని జార్జిటౌన్ సంస్థ రూపొందించిన 2023 విశ్లేషణ ప్రకారం 177దేశాలలో 128వ స్థానంలో ఉన్నాం.మోడీ గొప్పదనం గురించి చెప్పుకొనేందుకు ఆయన భక్తులు నిత్యం వల్లించే పాకిస్థాన్ 158 స్థానంలో ఉండటం ఎంతో ”ఊరట” కలిగిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. బేటీ పడావో, బేటీ బచావో నినాదంతో పాటు అచ్చేదిన్ వాగ్దానం చేసిన మోడీ ఏలుబడిలో తొమ్మిది సంవత్సరాల తరువాత పరిస్థితి ఇది. పోనీ మెరుగుపడే ఆశ ఉందా ? 2017 నివేదిక ప్రకారం మన దేశం 131వ స్థానంలో ఉన్నది కాస్తా 128కి ఎగబాకింది.ఇదేమీ పెద్ద మెరుగుదలా, పెరుగుదలా కాదు. పాయింట్ల పరంగా చూస్తే 0.580 నుంచి 0.595కు(15) చేరినప్పటికీ రాంకులో పెద్దగా మెరుగుదల లేదంటే దాని అర్ధం మిగతా దేశాల్లో పరిస్థితి బాగా మెరుగుపడినట్లు. ఉదాహరణకు పాకిస్థాన్నే తీసుకుందాం. ఇదే కాలంలో దాని పాయింట్లు 0.441 నుంచి 481కి(40) పెరిగినప్పటికీ రాంకు 150 నుంచి 158కి దిగజారింది. పాయింట్ల వారీ చూస్తే మన కంటే పాకిస్థాన్‌లో మెరుగుదల చాలా ఎక్కువగా ఉంది. మరో పొరుగుదేశమైన చైనా రాంకు ఈ కాలంలో 87నుంచి 82కు పెరిగింది. పాయింట్ల వారీ చూస్తే 0.671 నుంచి 0.7కు(29) చేరింది. ఇరుగుదేశమైన బంగ్లాదేశ్ 127 నుంచి 131కు దిగజారింది, అయినా అక్కడ పాయింట్ల వారీ చూస్తే 0.585 నుంచి 0.593కు పెరిగింది. స్త్రీ-పురుష తేడా 2023 సూచికలో మనదేశం ప్రపంచ ఆర్థిక వేదిక నివేదిక ప్రకారం 146దేశాల్లో 127వదిగా ఉంది. మోడీ అధికారానికి వచ్చిన 2014లో అది 142 దేశాల్లో 114వ స్థానంలో ఉంది. ఈ సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం 2022లో 135వదిగా ఉంది. ఒక్క ఏడాదిలో ఎనిమిది స్థానాలు ఎలా పెరిగిందన్నది ఆలోచించాల్సిన అంశం. ఒక వేళదాన్నే ప్రామాణికంగా తీసుకుంటే 114 నుంచి 135కు ఎందుకు దిగజారినట్లు ? ఏ రీత్యా చూసినా గడచిన పదేండ్లలో మొత్తం మీద ఈ అంతరం తగ్గకపోగా పెరిగిందని స్పష్టంగా కనిపిస్తోంది. లింగ అసమానతలో 2021 సూచిక ప్రకారం చైనా 48, శ్రీలంక 92, నేపాల్ 113, మనదేశం 122, బంగ్లాదేశ్ 131, పాకిస్థాన్ 149 స్థానాల్లో ఉన్నాయి.మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాల సూచికలో ఆఫ్‌ఘనిస్తాన్ 1, పాకిస్థాన్ 4, భారత్ 9, బంగ్లాదేశ్ 17, చైనా 23, శ్రీలంక 65 స్థానాలలో ఉన్నాయి. మనదేశం గురించి ఇలాంటి సూచికలన్నీ ప్రపంచ మంతటా అందరికీ తెలిసినప్పటికీ నరేంద్రమోడీని ప్రపంచ నేతగా గుర్తించిందని బిజెపి నేతలు ప్రచారం చేయటం విడ్డూరం కాదా !
అంబానీ కుటుంబంలో పెండ్లి వేడుకకు తన స్నేహితురాలితో కలసి వచ్చిన బిల్‌గేట్స్ దేశంలో జరిగిన అభివృద్ధి తనను ఎంతగానో ముగ్దుడిని చేసిందని పేర్కొన్నారు. ఇలాంటి ప్రశంసలను చూసి మోడీ భక్తులు ఊగి తూగుతారని వేరే చెప్పనవసరం లేదు. ఇంట్లో ఈగల మోత బిల్‌గేట్స్‌కు ఎలా తెలుస్తుంది. పదేండ్ల పాలన గురించి ప్రసార మాధ్యమాల్లో మోడీ గ్యారంటీల గురించి ఎంత ఊదరగొట్టినా పరిస్థితుల్లో పెద్ద మార్పులేదు, దిగజారుడే కనిపిస్తోంది.మహిళల శాంతి, భద్రతల గురించి తాజా సూచికల గురించి అంతర్జాతీయ మీడియాలో పేర్కొన్న అంశాలు నరేంద్రమోడీ పరువును మరింత పోగొట్టేవిగా ఉన్నాయి తప్ప మరొకటి కాదు. స్టాటిస్టా అనే సంస్థ సమీక్ష జార్ఖండ్‌లో స్పానిష్-బ్రెజిలియన్ పర్యాటకరాలి మీద ఆమె భర్త ముందే ఎనిమిది మంది చేసిన అత్యాచార ఉదంతంతో ప్రారంభమైంది.ఇది అంతర్జాతీయంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే.ప్రపంచంలో మహిళలకు రక్షణ లేని దేశాల సరసన చేర్చి మన గురించి చర్చించుకుంటున్నారు. దేశంలో రోజుకు 86 అత్యాచారాలు జరుగుతున్నట్లు 2022లో నమోదైంది. దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులు, వేధింపులు పెరుగుతున్నట్లు నమోదైన నివేదికలు వెల్లడిస్తున్నాయి. అసలు పోలీసుల వరకు రాని కేసులు ఎన్నో. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న, ఒక యోగి పాలనలోని ఉత్తర ప్రదేశ్ 2022లో ప్రధమ స్థానంలో ఉంది.
ప్రపంచం మొత్తం మీద చూసినపుడు స్త్రీల కంటే పురుషుల సంఖ్య ఎక్కువ. అయితే ఇదే స్థితి అన్ని చోట్లా లేదు. కొన్ని దేశాల్లో పురుషులు, కొన్ని చోట్ల మహిళలు ఎక్కువగా ఉన్నారు.అయితే ఈ పరిస్థితి శాశ్వతంగా ఒకే విధంగా ఉండదు. తూర్పు ఐరోపా కొన్ని దేశాల్లో గతంలో రెండవ ప్రపంచ యుద్ధ కారణంగా, ప్రస్తుతం పురుషుల వలసలు, జీవిత కాలం ఎక్కువగా ఉన్నందున మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది.మధ్య ప్రాచ్య దేశాల్లో కార్మికులుగా పురుషులు ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన కారణంగా అక్కడ మహిళల శాతం తక్కువగా ఉంది. వర్తమాన పార్లమెంటులో చివరి బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ బ్రహ్మాండమైన నారీశక్తి (మహిళా సాధికారత) అవుతుందని చెప్పారు.నిర్మలా సీతారామన్ బడ్జెట్ ” మహిళా సాధికారత పండగ ” అని కూడా వర్ణించారు.నూతన పార్లమెంటు భవనంలో జరిగిన తొలి సమావేశంలో నారీశక్తి అభియాన్‌కు ఆమోదాన్ని చూశారని, జనవరి 26న కర్తవ్యపథ్‌లో మహిళాశక్తిని చూశారని అన్నారు. గతంలో బేటీ బచావో, బేటీ పఢావో అని పిలుపు ఇచ్చారు.దాని ఫలితం ఏమిటో పైన చూశాము. ఇండియా టుడే వెబ్‌సైట్ 2023 జూన్ పదకొండున రోషిణీ చక్రవర్తి రాసిన విశ్లేషణకు ” భారత్‌లో తగ్గుతున్న మహిళా శ్రామికులు, ఎందుకు మహిళలు పని చేయటం లేదు ” అనే శీర్షిక పెట్టింది. భారత్‌లో వేతనాలు చెల్లించే ఉపాధిలో మహిళలు ఇరవైశాతానికి లోపుగానే ఉన్నట్లు ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) నివేదికను దానిలో ఉటంకించారు. ఐఎల్‌ఓ నివేదిక ప్రకారం ఉపాధిలో కేవలం 19.2శాతం మంది మాత్రమే మహిళలు ఉండగా పురుషుల్లో 70.1శాతం ఉన్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక లింగ అసమానతల నివేదిక 2022 ప్రకారం 146 దేశాల జాబితాలో 135వ స్థానంలో భారత్ ఉంది.ప్రపంచ శ్రామిక శక్తిలో లింగ సమానత్వం రావాలంటే 132 సంవత్సరాలు పడుతుందని ఆ నివేదిక పేర్కొన్నది. అట్టడుగున్న ఉన్న మన దేశానికి ఇంకా ఎక్కువ వ్యవధి పడుతుందని వేరే చెప్పనవసరం లేదు. 2005లో 32శాతంగా ఉన్న మహిళా శ్రామిక శక్తి 2021నాటికి 19.2శాతానికి తగ్గింది.
అధికారిక సమాచారాన్ని విశ్లేషించినపుడు 2004లో గరిష్టంగా 35శాతం మంది మహిళలు ఉపాధి పొందగా 2022 నాటికి అది 25శాతానికి తగ్గినట్లు అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్థికవేత్త రోజా అబ్రహాం చెప్పారు. సిఎంఐయి ఉపాధి నిర్వచనం ప్రకారం 2022లో పని చేసే వయస్సులో ఉన్నవారిలో కేవలం పదిశాతం మంది మాత్రమే అంటే 3.9 కోట్ల మంది మాత్రమే పని చేస్తూ ఉండటం లేదా పని కోసం ఎదురు చూస్తున్నవారున్నారని , అదే పురుషుల విషయానికి వస్తే 36.1కోట్ల మంది ఉన్నట్లు పేర్కొన్నది. పని చేయగలిగిన వయస్సు వారి పెరుగుదలకు అనుగుణంగా ఉపాధి పెరగటం లేదని, గత దశాబ్దిలో మంచి ఉద్యోగాలు గణనీయంగా తగ్గినట్లు, తక్కువ వేతనాలతో పని చేయటం కంటే ఇంటి దగ్గర ఉండి ఇల్లు, పిల్లలను చూసుకోవటం మరింత లాభదాయకమని వారి కుటుంబాలు భావిస్తున్నారని సిఎంఐఇ డైరెక్టర్ మహేష్ వ్యాస్ చెప్పారు. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పదిశాతం పెరిగితే జిడిపి 552 బిలియన్ డాలర్ల మేరకు అదనంగా పెరుగుతుందని 2018లో మెకెన్సీ నివేదిక పేర్కొన్నది. క్వాల్‌ట్రిక్స్ డాట్‌కామ్ సమాచారం ప్రకారం 2022లో ప్రపంచంలోని 180దేశాలలో శ్రామిక శక్తిలో 52.7శాతం మహిళలతో ఆర్మేనియా మొదటి స్థానంలో ఉంది.ప్రపంచ సగటు 39.49శాతం.మన దేశం 23.54శాతంతో 166వ స్థానంలో ఉంది.మనకంటే ఎగువన 147లో నేపాల్, 153, 156 స్థానాలలో శ్రీలంక, బంగ్లాదేశ్, దిగువున 168వ స్థానంలో పాకిస్తాన్ ఉంది. మనతో జనాభాలో పోటీ పడుతున్న చైనా 45.17శాతంతో 89వ దేశంగా ఉంది. పరిస్థితి ఇంతదారుణంగా ఉంటే ఏం చేశారని ఓట్లు అడుగుతున్నట్లు ? కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాల్లో బిజెపి లేదా దానితో జతకట్టిన వారి ప్రభుత్వాలే ఉన్నాయి గనుక అతివల స్థితి అధ్వానంగా ఉండటానికి కారకులు ఎవరంటే మోడీని చూసి ఓటువేయాలని బిజెపి చెబుతున్నందున మోడీనే అని చెప్పాల్సి వస్తోంది. కాదంటారా ?
