Tags
BJP, IMF, Narendra Modi Failures, RSS, Viksit Bharat 2047, Vision India@2047, World Bank, World Development Report 2024
ఎం కోటేశ్వరరావు
త్వరలో మరో తిరంగా జెండా పండగ జరుపుకోబోతున్నాం. చరిత్రను చూస్తే పరాయి పాలనలో ఆ జెండాను ఎగుర వేస్తే దేశ ద్రోహం, ప్రాణాలకు తెగించి ఆవిష్కరించటమే దేశభక్తి. నేటి పాలకులు అదే జెండాను ఎగురవేస్తూ చెప్పే కబుర్లలో నిజాయితీని ప్రశ్నించటమే దేశద్రోహంగా పరిగణించబడుతున్నది. ఒక్క ముక్కలో చెప్పాలంటే దేశ అభివృద్ధి గురించి కబుర్లు చెప్పేవారు అపర దేశ భక్తులు, వారి విధానాల బండారాన్ని ప్రశ్నించేవారు క్షమించరాని దేశద్రోహులు.నేడు దేశంలో జరుగుతున్న ప్రచారదాడిలో నలుగుతున్న అంశమిది. ఎప్పటికెయ్యది అప్పటికామాటలాడి ఓట్లేయించుకొని తప్పించుకు తిరుగువారు మనకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కనిపిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్పిన అభివృద్ధి కబుర్లలో వెయ్యోవంతు ఆచరించినా దేశం ఈ స్థితిలో ఉండేది కాదు. స్వాతంత్య్రం మాకేమిచ్చిందనే ప్రశ్న ఉత్పన్నమయ్యేది కాదు. 2047వరకు ఒకటే లక్ష్యంగా అదే వికసిత్ భారత్‌గా ఉండాలని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు.దాని అమలు గురించి ఎవరైనా ప్రశ్నిస్తే మీరు ఈ దేశంలో ఉండటం లేదా ? ఇక్కడి గాలి పీల్చటం లేదా ఇక్కడి తిండి తినటం లేదా అని ఎదురుదాడి చేస్తున్నారు. అసలు వికసిత భారత్ అంటే ఏమిటి ?
రెండు సంవత్సరాలకు పైగా నీతి ఆయోగ్ నిర్దేశం మేరకు అధికారులు మధనం చేసి తీసుకువచ్చిందే వికసిత భారత్ 2047 ప్రణాళిక. అంటే అప్పటికి స్వాతంత్య్రం వచ్చి వంద సంవత్సరాలు నిండుతాయి గనుక ఆనాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన వాటి జాబితాలో చేర్చే విధంగా పని చేస్తామన్నారు. దాని ప్రకారం దేశ జిడిపి 30లక్షల కోట్ల డాలర్లకు, తలసరి సంపద 18 నుంచి 20వేల డాలర్లకు పెరుగుతుంది.నవకల్పన, సాంకేతికంగా ప్రపంచ నేతగా ఎదుగుతుంది, మానవాభివృద్ధి, సామాజిక సంక్షేమంలో ఆదర్శవంతంగా తయారవుతుంది, పర్యావరణాన్ని కాపాడే ఒక మొనగాడుగా నిలుస్తుంది. సరిగ్గా దీన్ని లోక్‌సభ ఎన్నికలకు ముందు 2023 డిసెంబరు 11న ప్రధాని నరేంద్రమోడీ ”వికసిత్ భారత్ 2047: యువ గళం ” పేరుతో విడుదల చేశారు. ఈ ప్రకటన చేసేందుకే మోడీకి పదేండ్లు పట్టింది. మనకంటే ఎంతో ముందంజలో ఉన్న చైనా 2012లోనే 2049 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారే లక్ష్యాన్ని ప్రకటించింది. దీన్ని చూసి ఎవరైనా చైనా కంటే మనమే ముందుంటాం అని టాంటాం వేసుకుంటే చేయగలిగిందేమీ లేదు, నిజంగా అభివృద్దిలో పోటీ పడాలని కోరుకుందాం.
కొన్ని వాదనలు, తర్కాన్ని చూద్దాం. చైనాను పక్కకు నెట్టి ప్రపంచ ఫ్యాక్టరీగా, సరకుల ఎగుమతి దేశంగా మనదేశాన్ని మారుస్తామని మోడీ(సంఘ) పరివారం చెబుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చైనా ఎగుమతుల్లో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. మనవారేం చెప్పారు, 2030 నాటికి మన ఎగుమతుల విలువ 1.58లక్షల కోట్లు కాగా దిగుమతులు 1.88 ఉంటాయని, 2047 నాటికి మన ఎగుమతుల విలువ 8.67లక్షల కోట్ల డాలర్లుగా, దిగుమతులు 12.12లక్షల కోట్ల డాలర్లుగా ఉంటాయని జోశ్యం. దీని అర్ధం, భాష్యాన్ని సంస్కృత, వేదపండితులే చెప్పాలి. తేడా తగ్గాలి లేదా ఎగుమతులు పెరగాలి, దానికి విరుద్దంగా ఉంటుందని చెబుతున్నారు.ఇక ఇప్పుడు మన ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఎందుకున్నాయంటే మనదేశంలో వృద్ది పెరిగి ఎక్కువ మంది వస్తు వినియోగం చేస్తున్నారు గనుక ఇది నరేంద్రమోడీ సాధించిన ఘనత అన్నారు. అదే అయితే ఇబ్బడి ముబ్బడిగా దిగుమతులు చేసుకోక చైనా నుంచి విదేశీ కంపెనీలు మనదేశానికి వస్తున్నాయి, మేడిన్ ఇండియా, మేకిన్ ఇండియా, అన్నీ ఇక్కడి నుంచే అందరికీ ఎగుమతి చేస్తాం అన్న కబుర్లు ఎందుకు ? ఇప్పుడు చైనా దిగుమతులు తక్కువగా ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి గనుక డ్రాగన్ కంటే మనమే మెరుగ్గా ఉన్నట్లా ? దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అంటే ఇదే. కాంగ్రెస్ 50 సంవత్సరాల్లో చేసిందాన్ని తాను కేవలం తొలి ఐదేండ్లలోనే చేసి చూపించానన్నారు మోడీ. పదేండ్ల తరువాత ఏం చెప్పారు. ఇప్పటి వరకు చూపింది ట్రైలరే అసలైన సినిమా ముందు ఉంటుంది అన్నారు. వికసిత భారత్‌లో దిగుమతులే ఎక్కువ అంటే మన సొమ్మును విదేశాలకు పంపిస్తామని, విదేశాల్లో ఉన్న కార్మికులకు ఉపాధి చూపుతామని చెప్పటమే! నిజమేలే, ఎందుకంటే మోడీ విశ్వగురువు గనుక ప్రపంచమంతటి మంచి చెడ్డలు చూసుకోవాలి మరి !
అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరాలనుకుంటే సంకల్పం చెప్పుకుంటే చాలదు. తాజాగా ప్రపంచ బ్యాంకు వెలువరించిన 2024 ప్రపంచ అభివృద్ధి నివేదిక మోడీ అండ్ కో ప్రచార గాలి తీసింది. అధికాదాయ స్థాయికి చేరేందుకు ప్రస్తుతం భారత్, చైనాలతో సహా 108దేశాలు తీవ్రమైన ఆటంకాలను ఎదుర్కొంటున్నాయని ఆ నివేదికలో పేర్కొన్నది. ఐఎంఎఫ్ 2024 అంచనా ప్రకారం అమెరికా తలసరి ఆదాయం 85,373, ప్రపంచ బ్యాంకు 2022 అంచనా మేరకు 76,330, ఐరాస 2021 లెక్కల ప్రకారం 69,185 డాలర్లు ఉంది. వీటిలో నాలుగో వంతు స్థాయికి అంటే ప్రపంచ బ్యాంకు మొత్తాన్నే తీసుకుంటే 19,082 డాలర్లకు చేరటానికి భారత్‌కు 75, ఇండోనేషియాకు 70, చైనాకు పది సంవత్సరాలు పడుతుందని ప్రపంచ బ్యాంకు పేర్కొన్నది.అదే ప్రపంచ బ్యాంకు తాజా అంచనాను పరిగణనలోకి తీసుకుంటే 21,343 డాలర్లు, కానీ వికసిత భారత్ 2047 నాటికి అంటే మరో 23 సంవత్సరాల్లోనే 18 నుంచి 20వేల డాలర్లకు చేర్చుతామన్నారు మోడీ. మన ప్రభుత్వం,నీతి ఆయోగ్ ఇచ్చిన లెక్కలు, సమాచారాన్నే ఆధారం చేసుకొని 75 సంవత్సరాలు పడుతుందని ప్రపంచ బ్యాంకు చెప్పింది. ఎక్కడన్నా పోలిక ఉందా ? తాను మానవ మాత్రుడిని కాదని తన పుట్టుక గురించిచెప్పిన మోడీ ఏదో శక్తి నడిపిస్తున్నదని కూడా అన్నారు. ప్రపంచ బ్యాంకు చెప్పినదాని ప్రకారం మోడీ మరో 75 సంవత్సరాలు ఇలాగే ఉండాలి. చూద్దాం, ఆ మాటలను నమ్మేవారి మనోభావాలను ఎందుకు గాయపరచాలి. త్వరలో చైనాను కూడా అధిగమిస్తామని రంగుల కలను చూపుతున్నారు. ప్రపంచ బ్యాంకు చెప్పినదాని ప్రకారం మన దేశం ఆరున్నర దశాబ్దాలు చైనా కంటే వెనుక ఉంటుంది.మనదేశం గురించి అనేక అంతర్జాతీయ సంస్థలు ఆకలితో సహా ఇచ్చిన సూచికలు వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించటం లేదని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ప్రపంచబ్యాంకు జోశ్యం మీద ఎందుకు స్పందించలేదు ? మన నీతి ఆయోగ్ మన పాలకులు చెప్పినట్లు నివేదికలు రాస్తుంది, వాటినే నమ్మాలని జనానికి చెబుతుంది ? ప్రపంచబ్యాంకు మన విశ్వగురువు కనుసన్నలలో నడవదు, దాని విశ్లేషణను తిరస్కరిస్తే అదిచ్చే అప్పులు మనకు రావు. దాన్నుంచి అప్పులు తీసుకోవటం మానుకున్నారని, అది మోడీ ఘనత అని చెప్పారు. కానీ మన సర్కార్ తాజాగా హరిత ఇంథన అభివృద్ధి కోసం 150 కోట్ల డాలర్లు ఇప్పటికే అప్పు తీసుకుంది, అమరావతి నగరం కోసం15వేల కోట్ల రూపాయలకు సమానమైన మరో 180 కోట్ల డాలర్లకు హామీగా ఉండి ఆంధ్ర ప్రదేశ్‌కు అప్పు ఇప్పిస్తామని ఇటీవలనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచ బ్యాంకును తప్పుపడితే అవేవీ రావు.
ప్రపంచ బాంకు చెప్పినదానికి ప్రాతిపదిక ఏమిటి ? గత ఐదు దశాబ్దాలలో జరిగినదాన్నుంచి తీసుకున్న పాఠాలే.2023 చివరి నాటికి ఉన్న స్థితి ప్రకారం 108దేశాలను మధ్య తరహా ఆదాయ తరగతిలో చేర్చారు.ఈ దేశాల్లో ప్రపంచ జనాభాలో నూటికి 75శాతం(ఆరువందల కోట్లు లేదా ప్రతి ముగ్గురిలో ఇద్దరు ) ఉన్నారు. వీరి తలసరి జిడిపి 1,136నుంచి 13,845 అమెరికన్ డాలర్ల వరకు ఉంది.అంతకంటే ఎక్కువ ఉన్న దేశాలు అరవై ఆరు ఉన్నాయి. మలేసియా 13,315 డాలర్లతో 67, చైనా 13,136 డాలర్లతో 68వదిగా ఉంది. మన దేశం మొత్తం 191దేశాలలో 2,71 డాలర్లతో 136వ స్థానంలో ఉంది. మంచి మాటలు చెబుతుంటే సానుకూలంగా (బి పాజిటివ్) ఉండాల్సింది పోయి, మన దేశంలో జరుగుతున్నదాన్ని ప్రశ్నించటం ఏమిటనే వారు రెండు రకాలు. ఏదో చెబుతున్నారుగా వ్యతిరేకంగా మాట్లాడటం ఎందుకు అనేవారు ఒకరు, అసలు ప్రశ్నించకూడదు అనే దుష్టాలోచన బుర్రలో పెట్టుకున్న వారు మరొకరు. దేన్నయినా ప్రశ్నించటం, సందేహం వెలిబుచ్చటం మానవనైజం. అదే జంతువుల నుంచి వేరే చేసింది. అందువలన ప్రశ్నించేవారు చెప్పేదాన్లో ఏముందో ఆలోచించాలా వద్దా ? స్వామివారు చెప్పింది వేదవాక్కు దాన్ని ప్రశ్నించకూడదు, ఇది తరతరాల భారత సంస్కృతి అనే పరిరక్షకుల కారణంగానే మన సమాజంలో ఎందుకు అనే జిజ్ఞాస పుచ్చి చచ్చిపోయింది. ఎండిపోయిన నదులను తిరిగి నీటితో నింపుతున్నారు, నిలిచిపోయిన జలలో తిరిగి నీరు వచ్చేట్లు చేస్తున్నారు. అలాంటపుడు చెవుల్లో సీసం పోసుకున్నవారిని ఎవరూ ఏమీ చేయలేముగానీ ఇతరుల్లో ఆలోచనను కలిగించలేమా ? ఎవరూ మనోభావాలను గాయపరచుకోనవసరం లేదు. ఎవడబ్బ సొమ్మని అంటూ భక్త రామదాసు రాముడినే ప్రశ్నించినపుడు ఏమిటీ వంచన అని పాలకులను ప్రశ్నించకూడదా ? బోధించు, సంఘటితపరుచు, పోరాడు అన్న అంబేద్కర్‌ను ఎవరైనా మరచిపోగలరా ! ఏ పదజాలం వెనుక ఏ ప్రయోజనం దాగున్నదో తెలుసుకోలేనంత కాలం జనం మోసపోతూనే ఉంటారు అన్న కమ్యూనిస్టు మహాశయుడు లెనిన్ బోధను విస్మరించగలమా ?
ప్రపంచ బ్యాంకు గ్రూప్ ప్రధాన ఆర్థికవేత్త, డెవలప్‌మెంట్ ఎకనమిక్స్ సంస్థ సీనియర్ ఉపాధ్యక్షుడు ఇందర్‌మిత్ గిల్ ప్రపంచ అభివృద్ధి నివేదిక 2024లో చెప్పిన అంశాలను ఎవరూ విస్మరించకూడదు. ” ప్రపంచ ఆర్థిక ఐశ్వర్యం కోసం జరిగిన పోరులో మధ్య తరహా ఆదాయ దేశాలు ఎక్కువగా విజయం సాధించటం లేదా ఓడిపోయాయి. అయితే అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థలుగా మారేందుకు వీటిలో చాలా ఎక్కువ దేశాలు కాలం చెల్లిన వ్యూహాలను అనుసరించాయి. అవి కేవలం భారీ పెట్టుబడుల మీద లేదా పరిణితి చెందకుండా నవకల్పనల మీద ఆధారపడ్డాయి. నూతన దృక్పధం అవసరం. ముందుగా పెట్టుబడుల మీద కేంద్రీకరించాలి తరువాత విదేశాల నుంచి నూతన సాంకేతికతలను చొప్పించాలి. తరువాత మూడు రకాల వ్యూహాన్ని అనుసరించాలి.ఒకటి సమతుల్యమైన పెట్టుబడులు, నూతన సాంకేతికతల చొప్పింపు,నవకల్పనలుగా అది ఉండాలి. పెరుగుతున్న జనాభా, పర్యావరణ, భౌగోళిక రాజనీతి సంబంధమైన వత్తిడులుంటాయి గనుక తప్పు చేసేందుకు ఆస్కారమివ్వకూడదు. గంగలో మునిగితే కరోనా సోకదు, గోవధ కారణంగానే వయనాడులో ప్రకృతి ప్రళయం సంభవించిందని చెప్పే ప్రబుద్దులు, వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అంటూ అమానుష మనుధర్మాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని చూస్తున్న శక్తులు చెలరేగుతున్నవేళ ఇలాంటి హితోక్తులను పట్టించుకుంటారా ? దేశాన్ని ముందుకు తీసుకుపోతారా ? ఇలాంటి వారి మార్గదర్శనంలో 75 కాదు, మరో 75 సంవత్సరాలు గడిచినా అమెరికాలో నాలుగోవంతు సంవపదల స్థాయికి చేరగలమా ? ఇప్పుడు కావాల్సింది పుట్టుకతో వృద్దులు, తాతగారి నాన్నగారి భావాలకు దాసులు కాదు.పావన నవ జీవన బృందావన నిర్మాతలు, కాదంటారా ?
