1965,66 సంవత్సరాలలో ఇండోనేషియాలో నియంత సుహార్తో నాయకత్వంలో జరిగిన కమ్యూనిస్టు వూచకోతపై ఐరోపాలోని హేగ్ నగరంలో జరిగే ‘ప్రజాకోర్టు’కు హాజరు కావద్దని ఇండోనేషియా ప్రభుత్వం విద్యార్ధినేతలను బెదిరించింది. ఈనెల 10-13 తేదీలలో జరిగే ఈ విచారణకు హాజరైనట్లయితే విద్యార్ధులకు స్కాలర్‌షిప్పులను నిలిపివేస్తామని నెదర్లాండ్స్‌లోని ఇండోనేషియా రాయబారకార్యాలయ అధికారులు లిడెన్లోని ఇండోనేషియా విద్యార్ది అసోసియేషన్ (పిపిఐ) విద్యార్ధులను పిలిపించి బెదిరించినట్లు ప్రజాకోర్టు కమిటీ అధిపతి, మానవ హక్కుల న్యాయవాది నూర్సిభానీ కాట్జసుంగ్కాన్ తెలిపారు. యాభై సంవత్సరాల నాటి ఊచకోత గురించి విచారణ జరపటాన్ని కమ్యూనిజం పునరుద్దరణగా రాయబార కార్యాలయం పరిగణిస్తున్నదని ఆమె జకర్తా పోస్టు పత్రికతో వ్యాఖ్యానించారు. రాయబార కార్యాలయానికి స్కాలర్ షిప్పులను నిలిపివేసే అధికారం లేదని, దాని పని విద్యార్ధులను బెదిరించటం కాదని ఆమె ఆగ్రహం వెలిబుచ్చారు. ఇదే విధంగా హింసాకాండకు గురైన, అదృశ్యమైన వ్యక్తుల విచారణ కమిటీ అధ్యక్షుడు హారిస్ అజార్ కూడా అధికారుల చర్యను ఖండించారు. ఈ చర్య అనారిక స్వభావాన్ని వెల్లడిస్తున్నదని, ఎందుకు తమ ప్రభుత్వం ఇలా చేస్తున్నదో అర్ధం కావటం లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రభుత్వంలోని పోలీసు, సైన్యం లేదా ప్రభుత్వంలోని పలుకుబడిగల ఎవరో దీని వెనుక వున్నారని, వాస్తవానికి ఇప్పుడు కమ్యూనిజంతో ముప్పులేదని కొందరు వ్యాఖ్యానించారు.
ఇండోనేషియా విద్యార్ధులకు బెదిరింపులు
09 Monday Nov 2015
Posted Left politics, Uncategorized
in