Tags

, , , ,

మామ తిట్టాడన్నదాని కంటే తోడల్లుడు తొంగి చూసినందుకు బాధగా వుందన్నట్లు మన ఇరుగు పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లలోనే జనం మన కంటే ఎక్కువ సంతోషంగా వున్నారట.

ఎం కోటేశ్వరరావు

    నిరోధం తప్ప చికిత్సలేని పరివార్‌ వైరస్‌ 2.014 బాధితులు వుపశమనం పొందేందుకు కూడా అవకాశం లేకుండా వరుసగా ప్రధాని నరేంద్రమోడీ వైఫల్యాలు వెల్లడవుతున్న కొద్దీ వారికి దిగులు పెరిగిపోతోంది. ఆ జాబితాలో తాజాగా ‘ ప్రపంచ సంతోష సూచిక 2016 ‘ చేరింది. అచ్చేదిన్‌ ఆయేగా అని సంతోష పడుతున్న వారిగా చచ్చే దిన్‌ అయా అన్న వార్త ఎలా వుంటుంది మరి.

     ఈనెల 20 ప్రపంచ సంతోష దినం. ఈ సందర్భంగా గురువారం నాడు ఐక్యరాజ్య సమితి ప్రపంచ సంతోష నివేదిక 2016 విడుదల అయింది. దానిలో వెల్లడించిన సూచిక ప్రకారం మన దేశం 156 దేశాలలో గతేడాది కంటే ఒకటి తగ్గి 118వ స్థానానికి పడిపోయింది. ఏడాది కాలంలో సంతోషం బాగా దిగజారిన పది దేశాలలో మనల్ని నిలపటం మోడీ సాధించిన ఘన విజయాలలో ఒకటి. మామ తిట్టాడన్నదాని కంటే తోడల్లుడు తొంగి చూసినందుకు బాధగా వుందన్నట్లు మన ఇరుగు పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లలోనే జనం మన కంటే ఎక్కువ సంతోషంగా వున్నారట. ఐక్యరాజ్య సమితి కోసం పాలనీయ లేదా నిరంతర అభివృద్ధి పరిష్కారాల నెట్‌ వర్క్‌( సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ సొల్యూషన్స్‌ నెట్‌ వర్క్‌ ) రూపొందించిన నివేదిక కనుక ఇదంతా తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో భాగమని ఆరోపిస్తే కుదరదు. కమ్యూనిస్టుల పాలనలో జనానికి స్వేచ్ఛ లేక సుఖ సంతోషాలు వుండవు అని చెప్పేవారు అది 83వ స్ధానంలో వుందని, నిరంతరం అమెరికా , ఇతర దేశాలు అందచేసిన ఆయుధాలు, డబ్బుతో నిరంతరం ఇజ్రాయెల్‌ దాడులకు గురవుతూ ఏ రోజు కారోజు పొట్ట చేతబట్టుకు తిరిగే పాలస్తీనియన్లు కూడా మన కంటే మెరుగైన 108 స్ధానంలో పాకిస్ధాన్‌ 92, నేపాల్‌ 107, బంగ్లాదేశ్‌ 110, శ్రీలంక 117, మయన్మార్‌ 119వ స్థానంలో వున్నాయి.కరవుకు మారుపేరైన సోమాలియా కూడా 76వ స్థానంలో సంతోషంగా వుంది. అంతకంటే గమనించాల్సిన అంశం ఏమంటే 2013లో మన దేశం 111వ స్ధానంలో వుంది.

    ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో వచ్చిన సంక్షోభం చైనా కూడా పడిందని, దానిని అవకాశంగా తీసుకోవాలని ఇప్పటికే అభివృద్ధి రేటులో మెరుగ్గా వున్న మన దేశం చైనా స్ధానాన్ని వెనక్కు గొట్టి కొంత మంది చెబుతూ వుంటారు. సంతోష నివేదిక ప్రకారం సంతోషంలో వచ్చిన మార్పులు 2005-7 నుంచి 2013-15 వరకు భాగం ఒకటి పట్టిక 5 పేజీ(20) ప్రకారం సంతోషం తగ్గిన 126 దేశాలలో పందొమ్మిదవ స్థానంలో వున్న చైనాలో 0.525 సంతోషం తగ్గగా 120వ స్ధానంలో వున్న మన దేశంలో మైనస్‌ 0.750 తగ్గింది. మన తరువాత ఎమెన్‌, వెనెజులా,బోట్స్‌వానా, సౌదీ అరేబియా, ఈజిప్టు, గ్రీసు వున్నాయి.

    సంతోషంలో అగ్రభాగాన వున్న దేశాల విషయానికి వస్తే స్విడ్జర్లాండ్‌ను వెనక్కు నెట్టి డెన్మార్క్‌ ప్రధమ స్ధానంలో వుంది తరువాత స్విడ్జర్లాండ్‌, ఐస్‌లాండ్‌, నార్వే, ఫిన్లాండ్‌ వున్నాయి. సంతోష సూచికకు ఏ అంశాలను పరిగణనలోకి తీసుకున్నారంటే తలసరి జిడిపి,ఆయుర్ధాయం, సామాజిక(ప్రభుత్వ) మద్దతు, జీవన ఎంపికకు స్వేచ్ఛలను పరిగణనలోకి తీసుకున్నారు.

    అమెరికా 13వ స్థానంలో ఆస్ట్రేలియా 9, ఇజ్రాయెల్‌ 11 కాగా చివరి స్ధానాలలో ర్వాండా,బెనిన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, టోగో, సిరియా,బురుండి వున్నాయి.మరింత సంతోషానికి ప్రభుత్వ విధానాల పట్ల మరింత శ్రద్ధ వుండాలన్న నూతన డిమాండ్‌ ప్రపంచ వ్యాపితంగా ముందుకు వచ్చిందని నివేదిక పేర్కొన్నది. అంటే దీనిని మరో విధంగా చెప్పాలంటే నయా వుదారవాద విధానాల పేరిట సామాజిక మద్దతును వుపసంహరించుకోవటం పెరిగిన కొద్దీ సంతోషం తగ్గిపోతూ వుంటుంది. ‘ఎక్కడైతే సంతోషంలో అసమానతలు తక్కువగా వున్నాయో అక్కడి సమాజాలలో జనం సంతోషంగా వున్నారని, 2005-2011తో పోల్చితే 2012-15 నాటికి సంతోష అసమానతలు గణనీయంగా పెరగటాన్ని కూడా కనుగొన్నామని, ఇది దాదాపు అన్ని ప్రాంతాలు, ప్రపంచ జనాభా మొత్తంలో ఇది కనిపించిదని’ నివేదిక పేర్కొన్నది.