ఎం కోటేశ్వరరావు
ప్రధాని గద్దె నెక్కిన తరువాత నరేంద్రమోడీ మాట్లాడటం ఆగిపోయి వుండవచ్చుగానీ కాలం ఆగలేదు. మరికొద్ది వారాలలో రెండవ వార్షికోత్సవం జరుపుకోవటానికి, వెంకయ్య నాయుడి వంటి వందిమాగధుల స్తోత్ర పారాయణాలు వినటానికి, విజయాల గురించి చెప్పుకోవటానికి సిద్ధం అవుతున్నారు.ఈరెండు సంవత్సరాల కాలంలో జనానికి దేశంలో అసలేం జరుగుతోంది అన్నది పూర్తిగా తెలియటం లేదు అనే అభిప్రాయం బలపడుతోంది. ఎంత వరకు నిజమో ఎవరికి వారు తమ అనుభవంతో తేల్చుకోవాలి. ఆవు,ఎద్దులు, గొడ్డు మాంస రాజకీయాలు, హత్యల మొదలు తాజాగా దేశభక్తులా కాదా అనటానికి భారతమాతాకి జై అన్నారా లేదా అన్న గీటురాయిని నిర్ణయించిన సంఘపరివార్ అజెండా ప్రధానంగా నడుస్తోంది. కమ్యూనిస్టులకు జనవాదం, మతశక్తులకు మనువాదం(మైనారిటీ మతశక్తులకు వాటి ఛాందసవాదాలు ఎలాగూ వుంటాయి) తప్ప మరొకటి పట్టదు. భారతీయ జనతా పార్టీ అన్న తరువాత ఈ రాజకీయాలు చేయకపోతే వారికి మనుగడ వుండదు కనుక కొత్తగా దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం జనానికి సంబంధించి ముఖ్యంగా యువత గురించి, మిగతా విషయాల గురించి అధికార ఓడ ఎక్కక ముందు ఎన్డిఏ ఏం చెప్పింది,ఎక్కిన తరువాత ఏం చేస్తోంది?ఏం చెబుతోంది అన్నది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా చాలా తక్కువగా తెలుస్తోంది.
ప్రధాని పదవిలో కూర్చున్న తరువాత నరేంద్రమోడీ వుపాధి కల్పన, నైపుణ్య అభివృద్ధికి పది అంశాలతో కూడిన ఒక పధకాన్ని ప్రకటించిన విషయం బిగ్గరగా వినిపిస్తున్న భారతమాతకు జై నినాదాల మధ్య జనానికి గుర్తు చేయటం అవసరం.ప్రధాని ఎక్కువ కాలం విదేశాల్లో ఎందుకు గడిపారంటే మేకిన్ ఇండియా కార్యక్రమానికి పెట్టుబడుల ఆకర్షణ కోసం తప్ప విహార యాత్రలు చేయటం లేదని బిజెపి పెద్దలు మండినపుడు జనం కామోసు అనుకున్నారు.
ప్రధాన మంత్రిగా పది నెలలు అధికారంలో వున్న తరువాత తొలిసారిగా హిందుస్థాన్ టైమ్స్ అనే ఒక పత్రికతో నరేంద్రమోడీ నోరు విప్పారు.రాజకీయాలు, పాలన, ఆర్ధిక విషయాలలో ప్రపంచంలో భారత దేశ విస్వసనీయతను పునరుద్ధరించామని, ప్రపంచ రాడార్లో మన దేశం తిరిగి కనిపిస్తున్నదని చెప్పారు. నరేంద్రమోడీ ప్రభుత్వం తొలి ఆరునెలల్లో 2.75లక్షల వుద్యోగాలు సృష్టించింది అని ఫైనాన్సియల్ ఎక్స్ప్రెస్ పత్రిక ఒక వార్తను ప్రచురించింది. అంతకు ముందు సంవత్సరం అదే కాలంలో కేవలం లక్షా ఇరవై వేల వుద్యోగాలు మాత్రమే గత ప్రభుత్వం సృష్టించింది. అంటే మోడీ 118శాతం అదనంగా సృష్టించటానికి కారణం 25 రంగాలలో మేకిన్ ఇండియా కార్యక్రమ శుభ ప్రారంభమని దానిలో పేర్కొన్నారు.నైపుణ్య శిక్షణ గురించి ఆర్ధిక మంత్రిత్వశాఖ 2014-15 వార్షిక నివేదికలో 2022 నాటికి 50 కోట్ల మందికి నైపుణ్యం కలిగించటం అవసరమని పేర్కొన్నారు. ప్రయివేటు రంగ భాగస్వామ్యంతో 15 కోట్ల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని జాతీయ నైపుణ్య శిక్షణ అభివృద్ధి కార్పొరేషన్ లక్ష్యంగా పెట్టుకోగా గతేడాది జూన్ నాటికి 51లక్షల మందికి శిక్షణ ఇచ్చారని, వారిలో 15లక్షల మందికి వుపాధి దొరికినట్లు ఆ వార్త వివరించింది.
గతేడాది ఏప్రిల్ 17వ తేదీన ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రచురించిన వార్త ప్రకారం గత ఆర్ధిక సంవత్సరంలో ఎనిమిది కీలక రంగాలలో మూడవ త్రైమాసికంలో అంతకు ముందు మూడు త్రైమాసికాల కంటే వుద్యోగఅవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి. 2014 అక్టోబరు-డిసెంబరు మాసాలలో కేవలం 1.17లక్షల వుద్యోగాలు రాగా అంతకు ముందు సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో 1.58, ఏప్రిల్-జూన్లో 1.82లక్షల వుద్యోగాలు వచ్చాయి. ఇలా అంకెలను పేర్కొంటూ పోతే ఆల్జీబ్రా మైండ్ గాబరా అని ఒకప్పుడు అనుకున్న విధంగా బుర్ర తిరిగి పోతుంది. అంకెలను ఎలా అయినా వినియోగించుకోవచ్చన్నది ఆరునెలల విజయ గాధ, రెండవది ఏడాది పాలన అసలు గాధ వెల్లడించింది. మా తాతలు నేతులు తాగారు కావాలంటే మా మూతులు వాసన చూడండి అని చెప్పుకుంటే కుదరదు. ఇప్పుడేంటి ? మాకేంటి అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలి? నరేంద్రమోడీ లేదా ఆయన భక్త బృందంగానీ ఏం చెబుతుందో తెలియదు.
గురువారం నాడు(మార్చి 31) హిందూ పత్రిక ‘వుపాధి పెరుగుదల ఆరు సంవత్సరాల కనిష్టానికి పడిపోయింది’ అనే శీర్షికతో వార్తను ప్రచురించింది.దాని సారాంశం ఇలా వుంది. కేంద్ర ప్రభుత్వ కార్మికశాఖ కార్మికులు ఎక్కువగా అవసరం వుండే ఎనిమిది కీలక రంగాలలో సేకరించిన సమాచారం ప్రకారం 2015 తొలి తొమ్మిది మాసాలలో కేవలం 1.55లక్షల నూతన వుద్యోగాలు మాత్రమే నికరంగా వచ్చాయి. ఇది ఆరు సంవత్సరాలలో కనిష్టం. ఇదే సమయాలలో 2013,14 సంవత్సరాలలో మూడు లక్షలకు పైగా వుద్యోగాలు వచ్చినట్లు కార్మికశాఖ సమాచారం తెలిపింది. ఇది ఆరోగ్యకరమైన సూచిక కాదని విశ్లేషకులు పేర్కొన్నారు. ‘ మన పారిశ్రామిక అభివృద్ధి తక్కువగా వుంది,వుత్పత్తి పెరినపుడు మాత్రమే వుపాధి వుంటుంది.కార్పొరేట్ రంగంలో పెద్ద ఎత్తున సిబ్బందిని క్రమబద్దీకరిస్తున్నారు.ప్రభుత్వం రంగం కూడా కార్మికులను నియమించటం లేదు. అభివృద్ధి ప్రధాన ఆశయం వుద్యోగ కల్పన. అంతిమంగా మనం అన్ని స్ధాయిలలో వుద్యోగాలను సృష్టించాలి. అదే జరగటం లేదు.’ అని కేర్ రేటింగ్ సంస్ధ ప్రధాన ఆర్ధికవేత్త మదన్ సబ్నవిస్ చెప్పారు.
కేంద్ర కార్మిక శాఖ వుద్యోగకల్పన గురించి 2009 నుంచి ప్రతి మూడు మాసాలకు ఒకసారి సర్వే నిర్వహిస్తున్నది. వస్త్ర, తోళ్ల,లోహ, ఆటోమొబైల్, ఆభరణాలు, రవాణా, చేనేత, ఐటి రంగాలలో ప్రపంచ ఆర్ధిక సంక్షోభ ప్రభావం ఎలా పడింది అనే అధ్యయనం కోసం ఈ సర్వే నిర్వహిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలలో ప్రతి ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు వివరాలు ఇలా వున్నాయి. 2009లో నికరంగా 2.49లక్షల వుద్యోగాలు పెరిగాయి.(2009 జనవరి-మార్చిలో 1.17, ఏప్రిల్-జూన్లో 1.31లక్షలు తగ్గగా జూలై-సెప్టెంబరులో 4.97లక్షలు పెరిగాయి. ఈ కాలంలో నికర పెరుగుదల 2.49లక్షలు) ఇదే విధంగా 2011లో 7.04లక్షలు, 2013లో 3.36లక్షలు, 2015లో 1.55లక్షల వుద్యోగాలు నికరంగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ కార్మిక శాఖ అధికారికంగా వెల్లడించిన ఈ సమాచారంపై కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు రితుపర్ణ చక్రవర్తి దీని గురించి మాట్లాడుతూ ‘ స్టాఫింగ్ పరిశ్రమ ఆరోగ్యకరంగా 18-20శాతం పెరుగుతోంది.కార్మిక శాఖ విడుదల చేసిన సమాచారం వుద్యోగ పెరుగుదల గురించి సమగ్ర చిత్రాన్ని ఇవ్వటం లేదు.అనేక రంగాలను అది స్వీకరించలేదు’ అన్నారు. 2015లో కాంట్రాక్టు వుద్యోగుల నియామకం గణనీయంగా తగ్గినట్లు లేబర్ బ్యూరో పేర్కొన్నది. వుపాధి కల్పన లేదా కోల్పోయిన వుపాధి గురించి సమగ్ర సమాచారం సేకరించటం మన దేశంలో సాధ్యం కాదు.ఎందుకంటే అసలు అధికారికంగా నమోదు అన్నది సమగ్రం కాదు. ధోరణులు మాత్రమే మనకు తెలుస్తాయి. కేంద్ర కార్మిక శాఖ ప్రభుత్వ విభాగం కనుక వున్నంతలో దాని సమాచారాన్ని ప్రాతిపదికగా తీసుకోవటం తప్ప మరొక మార్గం లేదు
వుపాధి కల్పన గురించి కొన్ని సందర్భాలలో ప్రధాని నరేంద్ర మోడీతో సహా ఇతరులు ఏం చెప్పారో చూడండి.’ కేవలం వాగ్దానాలు మాత్రమే అద్బుతాలను సృష్టించవు’ అని మోడీ పాలన ఇరవై నెలల తరువాత ఈ ఏడాది ఫిబ్రవరి నాలుగున బెంగలూరులో ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా చెప్పారు. విదేశీయలు మన సరిహద్దులు దాటి పెట్టుబడులు పెట్టేందుకు భారత్లో ప్రవేశించటం లేదన్నది టాటాతో సహా ప్రముఖ పారిశ్రామికవేత్తల అంతరంగం, బహిరంగం కూడా. ప్రపంచ పెట్టుబడిదారీ దేశాలలో ఆర్ధిక మాంద్యం 2008 నుంచి అనేక సమస్యలను ముందుకు తెస్తోంది. పెట్టుబడిదారులు తమకు ఎక్కడ అప్పనంగా లాభాలు వస్తాయో అక్కడికే పెట్టుబడులను తరలిస్తున్నారు. నరేంద్రమోడీ, చంద్రబాబు వంటి వారు జనం సొమ్ము ఖర్చు చేసి ఎన్ని విదేశీ పర్యటనలు చేసినా అయ్యగారి సంపాదన అమ్మగారి బుట్టలోలకులకు చాలటం లేదన్నట్లుగా పరిస్థితి తయారైంది.
మన దేశంలో పెట్టుబడుల గురించి అధ్యయనం చేసే భారతీయ ఆర్ధిక పర్యవేక్షణ కేంద్రం( సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సిఎంఐఇ) కూర్చిన సమాచారం ఇంతవరకు ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. 2015 మూడవ త్రైమాసికంలో నూతన సామర్ధ్య కల్పనకు ప్రతిపాదనలు అంతకు ముందుతో పోల్చితే 74శాతం తగ్గిపోయాయి.కేవలం లక్ష కోట్లరూపాయల విలువగల 383 పధకాలు మాత్రమే ప్రకటించబడ్డాయి. ఇది అంతకు ముందు ఐదు త్రైమాసికాల కంటే కనిష్టం. అన్ని రంగాలలో తగ్గుదల కనిపిస్తోందని, కచ్చితంగా ఫలానా అంశాలు కారణమని అప్పుడే చెప్పలేమని సిఎంఐఇ పేర్కొన్నది.నిలిచిపోయిన పధకాల విలువ 10.8లక్షల కోట్ల రూపాయలు. నరేంద్రమోడీ విదేశీ పర్యటనలన్నీ విజయవంతమయ్యాయని అప్పుడు చెప్పారు. వాటి అర్ధమేమిటి ?
ఐటి రంగంలో పెట్టుబడుల గురించి చంద్రబాబు నాయుడు, ఆయన ప్రచార మంత్రి పల్లె రఘునాధ రెడ్డి, ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ తమ పలుకుబడిని వుపయోగించి అనేక ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. 2015-16లో 12-14శాతం అభివృద్ధి వుంటుందని భావిస్తే అది 2017లో 10-12 శాతంగా వుందని అంచనా.’ ప్రభుత్వం చేసిన ప్రకటనలు, మేము చూసిన ధోరణులను బట్టి ఒక వేగంతో దేశీయ విభాగం పెరుగుతుందని అంచనా వేశాము. అయితే వాటిలో ఎక్కువ భాగం ఆచరణలోకి రాలేదు. అవి ఎప్పుడు ఆచరణలోకి వస్తే అప్పుడు మనం పెద్ద ప్రభావాన్ని చూడవచ్చు ‘ అని నాస్కామ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి విదేశీ పర్యటనల మోజు తగ్గిపోయినట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే విమాన ఖర్చులకు కూడా సరిపడా ప్రయోజనం లేకపోతే జనానికి చెప్పుకొనేదేమీ వుండదు. బహుశా ఈ కారణంగానే ఆయన మంత్రులు కొత్త పల్లవి అందుకున్నారు. తమ ప్రభుత్వ ఖాదీ పధకాల కారణంగా 2016-17లో 70-80లక్షల వుద్యోగాలు లభిస్తాయని చిన్న, సన్న, మధ్యతరగతి పరిశ్రమల మంత్రి గిరిరాజ్ సింగ్ చెబుతున్నారు. అంటే జనం చౌకగా దొరికే మిల్లు వస్త్రాల బదులు ఖరీదయిన ఖాదీ ధరిస్తారని అర్ధమా ? ఖాదీ వడికేందుకు సోలార్ రాట్నాలను ప్రవేశపెడితే ఖర్చు తగ్గుతుందని,లాభాలు వస్తాయని మంత్రిగారు చెబుతున్నారు. ‘ప్రధాని నరేంద్రమోడీ విజ్ఞాపనలో ఏదో మాజిక్ వుంది. ఖాదీ పెరుగుదల రేటును చూస్తే గణనీయంగా పెరిగిందని’ ఖాదీగ్రామీణ పరిశ్రమల సంస్ధ సిఇఓ అరుణ్ కుమార్ చెబుతున్నారు. అది పిట్ట కధలా లేదూ !