Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

దక్షిణా ఫ్రికా అధ్యక్షుడు జాకబ్‌ జుమా అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్ప మరికొద్ది గంటల్లోనే పదవీచ్యుతుడు కానున్నారు. పదవికి రాజీనామా చేయాలని పార్టీ ఇచ్చిన గడువు బుధవారంతో ముగిసింది. గురువారం నాడు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ జరగక ముందే గౌరవ ప్రదంగా రాజీనామా చేసే అవకాశాన్ని వినియోగించుకుంటారా ? ఓటింగ్‌ ద్వారా మెడపట్టి బయటకు గెంటించుకుంటారా అన్నదే ఇప్పుడు మిగిలి వుంది. పదవి నుంచి గౌరవ ప్రదంగా తప్పుకోవాలని దక్షిణాఫ్రికా పాలక కూటమి ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌(ఎఎన్‌సి) జాతీయ కార్యవర్గం చేసిన నిర్ణయాన్ని దేశాధ్యక్షుడు జాకబ్‌ జుమా తిరస్కరించటంతో అక్కడ తీవ్రమైన రాజకీయ సంక్షోభం ఏర్పడింది. సోమవారం రాత్రి ఆయనకు రెండురోజుల గడువు ఇస్తూ ఎన్‌ఎన్‌సి చేసిన తీర్మానాన్ని స్వయంగా పార్టీనేతలు అందచేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే తప్పుకోమని కోరాము తప్ప గడువు విధించలేదని ఎఎన్‌సి ప్రధాన కార్యదర్శి ఏస్‌ మగాషులే మంగళవారం నాడు చెప్పారు. తాను రాజీనామా చేసేది లేదని ఏం చేసుకుంటారో చేసుకోండని జుమా ఎఎన్‌సి నేతలకు చెప్పినట్లు తాజా వార్తలు తెలిపాయి. జుమా బింకాలు పోతున్నాడా లేక నిజంగానే రాజీనామా చేయకుండా తొలగింపువరకు తెచ్చుకుంటారా అన్నది చూడాల్సి వుంది. ఒక వేళ రాజీనామా చేస్తే వుపాధ్యక్షుడిగా వున్న ఎఎన్‌సి అధ్యక్షుడు సిరిల్‌ రాంఫొసా వెంటనే తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు. తరువాత ఆయనను లేదా మరొకరిని పాలకపక్షం అధ్యక్షుడిగా ఎన్నికుంటుంది. ప్రతిపక్ష ఎకనమిక్‌ ఫ్రీడమ్‌ పార్టీ జుమాపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం స్పీకర్‌ పరిశీలనలో వుంది. జుమా బుధవారం నాడు రాజీనామా చేస్తారని నిర్ధారణ కాని వార్తలు పేర్కొన్నాయి. ఆ తీర్మానాన్ని తాము బలపరుస్తామని ఎఎన్‌సి ప్రకటించింది. వెంటనే స్పీకర్‌ ఒక ప్రకటన చేస్తూ ఈ నెల 22న చేపట్టాల్సిన అవిశ్వాస తీర్మానాన్ని గురువారం నాడే చర్చకు అనుమతించనున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు అవిశ్వాస తీర్మానాన్ని వుపసంహరించుకోవాలని ఎఎన్‌సి చేసిన వినతిని ఫ్రీడమ్‌ పార్టీ తిరస్కరించింది. దాంతో తమ సవరణ తీర్మానం ద్వారా దాన్ని బలపరచాలని ఎఎన్‌సి నిర్ణయించింది.

బుధవారం నాడు జుమాతో చేతులు కలిపి అక్రమాలకు పాల్పడిన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలైన గుప్తా సోదరుల ఇండ్లపై పోలీసుదాడులు జరిగాయి. గతంలో దాఖలైన కేసుల కొనసాగింపే అని చెప్పినప్పటికీ జుమా వుద్వాసన ఖాయం అని ఈ పరిణామాలు స్పష్టం చేశాయి. మరోవైపు జుమా టీవీలో మాట్లాడుతూ తనను రాజీనామా చేయమనటం అన్యాయమని, తానేమీ తప్పు చేయలేదన్నారు. తనను వేధించినందుకు ఎఎన్‌సి సభ్యులు విచారిస్తారని వ్యాఖ్యానించాడు. గురువారం నాడు అవిశ్వాస తీర్మానం నెగ్గితే అదే రోజు కొత్త అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరిస్తారని కూడా వార్తలు వచ్చాయి. జాకబ్‌ జుమా రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకోవాలని పాలక త్రిపక్ష కూటమిలోని దక్షిణాఫ్రికా కమ్యూనిస్టుపార్టీ(ఎస్‌ఏసిపి) గత కొద్ది నెలలుగా డిమాండ్‌ చేస్తూ వస్తోంది. మరో పక్షమైన కార్మిక సంఘాల కూటమి(కొసాటు) కూడా రాజీనామా చేయాలని కోరింది. చివరకు ఎఎన్‌సి కార్యవర్గం సుదీర్ఘ తర్జనభర్జనల అనంతరం జుమా రాజీనామా కోరుతూ తీర్మానించింది. గురువారం నాడు అవిశ్వాస తీర్మానం నెగ్గితే శుక్రవారం నాడు సిరిల్‌ రాంఫొసా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, అదే రోజు బడ్జెట్‌ సందర్భంగా దేశాన్ని వుద్ధేశించి ప్రసంగిస్తారని, 21వ తేదీన బడ్జెట్‌ ప్రవేశపెడతారని వార్తలు వచ్చాయి.

గత రెండు దశాబ్దాలలో ఎఎన్‌సి ఇద్దరు అధ్యక్షులను రాజీనామా చేయాలని కోరింది.2008లో తాబో ఎంబెకీ పార్టీ ఆదేశాన్ని శిరసావహించి రాజీనామా చేశారు. ఆయన స్ధానంలో 2009లో జాకబ్‌ జుమా అధ్యక్షుడయ్యారు. ఈ ఇద్దరూ తమ రాజకీయ జీవితాన్ని కమ్యూనిస్టుపార్టీ కార్యకర్తలుగా ప్రారంభించి ఎఎన్‌సి నేతలుగా ఎదిగారు. చివరకు పార్టీ చర్యలకు గురయ్యారు.జుమా పాలనలో అనేక అవినీతి ఆరోపణలు, ఆశ్రిత పక్షపాత వంటి ఆరోపణలతో పాటు అనేక రంగాలలో వైఫల్యం కారణంగా 2016లో జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలలో ఎఎన్‌సి అనేక పరాజయాలు చవి చూసింది.ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పరువు ప్రతిష్టలు నిలబడాలంటే, కార్పొరేట్‌ వ్యతిరేక చర్యలు తీసుకొనేందుకు గాను జాకబ్‌ జుమా రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను ముందుగా కమ్యూనిస్టుపార్టీ లేవెనెత్తింది. దానితో ఆగ్రహించిన జుమా కమ్యూనిస్టు మంత్రి ఒకరిని మంత్రి వర్గం నుంచి తొలగించారు. జుమాపై చర్యతీసుకోని పక్షంలో తాము అధికార కూటమి నుంచి వైదొలుగుతామని, అవసరమైతే వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలలో వంటరిగా పోటీ చేస్తామని కమ్యూనిస్టులు హెచ్చరించారు. వత్తిడికి తట్టుకోలేని జుమా తాను రాజీనామా చేస్తానని అయితే అది మూడు నెలల్లోనో ఆరు నెలల్లోనో తనకు ఇష్టమైనపుడు మాత్రమే చేస్తానంటూ మొరాయిస్తూ వచ్చాడు. అయితే డిసెంబరులో ఎఎన్‌సి పార్టీఅధ్యక్షుడిగా జుమాను తొలగించి సిరిల్‌ రాంఫొసా ఎన్నికైన తరువాత ఎఎన్‌సి కార్యవర్గం ఏదో ఒక నిర్ణయం చేయాల్సిన పరిస్ధితి ఏర్పడింది. దానిలో భాగంగానే పదవి నుంచి మర్యాదపూర్వకంగా తప్పుకోవాలని కోరింది.దానికి జుమా తిరస్కరించటంతో అల్టిమేటం జారీ చేయాల్సి వచ్చింది.

జాత్యహంకార పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరులో ఆయుధాలు పట్టిన జాకబ్‌ జుమా అనేక మంది ఇతర నేతల మాదిరిగానే జైలు పాలయ్యారు. యువనేతగా దేశం దృష్టిని ఆకర్షించిన ఆయన 1997లో ఎఎన్‌సి వుపాధ్యక్షుడిగా, 1999లో దేశ వుపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తరువాత ఐరోపా కంపెనీతో జరిగిన ఆయుధ లావాదేవీలలో చోటు చేసుకున్న అక్రమాలతో జుమాకు సంబంధం వున్నట్లు ఆరోపణలు వచ్చాయి. జుమా ఆర్ధిక సలహాదారుగా వున్న వ్యక్తి నిందితుడిగా తేలాడు.జుమా2005లో పదవీచ్యుతుడయ్యాడు. తానెలాంటి అక్రమాలకు పాల్పడలేదని, అధ్యక్షుడు తాబో ఎంబెకీ అక్రమాలను వ్యతిరేకించినందుకు తనను కేసులలో ఇరికించారని చేసిన వాదనలను ఏఎన్‌సి నాయకత్వం విశ్వసించింది. దాంతో ఎంబెకీని రాజీనామా చేయించి ఆ స్ధానంలో జుమాను 2009లో అధ్యక్షుడిగా నియమించారు. ఇటీవల జుమాపై 18 అంశాలలో వచ్చిన అవినీతి, ఆరోపణలపై విచారణను ఎదుర్కోవాల్సిందేనని ప్రతిపక్ష డెమోక్రటిక్‌ అలయన్స్‌ దాఖలు చేసిన కేసులో సుప్రీం కోర్టు గతేడాది స్పష్టం చేసింది. తాను అమాయకుడిని అన్న జుమా వాదనను కోర్టు కొట్టివేసింది. డిసెంబరు 13న ఇచ్చిన తీర్పులో జుమా, అతని అనుచరులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు ఒక కమిషన్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆమేరకు జనవరిలో ఒక కమిషన్‌ ఏర్పడింది.ఒక అవినీతి నివేదికను తొక్కిపెట్టటంలో జుమా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు మరో కేసులో న్యాయస్ధానం స్పష్టం చేసింది.భారతీయ సంతతికి చెందిన గుప్తా కుటుంబం జుమాతో వున్న సంబంధాలను వుపయోగించుకొని అనేక ప్రభుత్వ కాంట్రాక్టులను పొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కోర్టు తీర్పుల తరువాత వారం రోజులకే డిసెంబరు 18న జుమాను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి సిరిల్‌ రాంఫొసాను ఎన్నుకున్నారు. వుద్వాసనకు గురికానట్లయితే మరొక పద్నాలుగు నెలలపాటు జుమా అధికారంలో వుండవచ్చు. అక్కడి రాజ్యాంగం ప్రకారం ఒకరు రెండువిడతలు మాత్రమే పదవికి అర్హత కలిగివుంటారు.

1994లో స్వేతజాతి పాలన అంతమైన తరువాత ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ అనుసరించినవి స్ధూలంగా నయా వుదారవాద విధానాలు తప్ప మరొకటి కాదు. పర్యవసానంగా జనంలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. ఎఎన్‌సి కూటమి జాత్యహంకార పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఒక విశాల వేదిక మాత్రమే. జాత్యంహకార పాలనను అంతం చేసి జాతీయప్రజాస్వామిక విప్లవ సాధన దిశగా ఎఎన్‌సిలో కమ్యూనిస్టులు , కాని వారు ఐక్యంగా పోరాడారు. 1994 తరువాత ఎఎన్‌సిలో కమ్యూనిస్టుపార్టీ, కొసాటు కొనసాగటమే కొత్త పరిణామం.పెట్టుబడిదారీ విధానాన్ని కొనసాగించాలనే ఎఎన్‌సి నాయకత్వం కుడివైపు, మిగతా రెండు పక్షాలు ఎడమవైపు లాగినప్పటికీ అంతిమంగా మొగ్గు కుడివైపే వుంది. వివిధ ఎన్నికలలో తగిలిన ఎదురుదెబ్బలు, పలు తరగతులలో పెరుగుతున్న అసంతృప్తికారణంగా కమ్యూనిస్టుపార్టీ పునరాలోచనలో పడింది.ఎఎన్‌సి నుంచి విడగొట్టుకోవాలనే ఆలోచనదానిలో ప్రారంభమైంది. పార్టీలు వేర్వేరుగా వున్నప్పటికీ చట్టసభలకు ఎఎన్‌సి గుర్తుమీదనే మూడు పక్షాలూ పోటీ చేస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరిగే ఎన్నికల నాటికి ఈ కూటమి ఇలాగే వుంటుందా అన్నది ఒక పెద్ద ప్రశ్న. తాము వచ్చే ఎన్నికలలో విడిగా పోటీ చేస్తామని కమ్యూనిస్టుపార్టీ నాయకులు చెబుతున్నారు. కింది శాఖలలో అలాంటి చర్చను అనుమతిస్తున్నారు. రానున్న ఎన్నికలలో విడిగా ప్రచారం చేయాలని కమ్యూనిస్టుపార్టీ మహాసభ గతేడాది నిర్ణయించింది. అవసరమైతే వచ్చే ఎన్నికలలో విడిగా పోటీ చేసేదిశలో ఇదొక అడుగుగా చెప్పవచ్చు.ఎఎన్‌సి పాలనలో అవినీతికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు గళమెత్తుతున్నారు. తొమ్మిది సంవత్సరాల క్రితం ఏ కమ్యూనిస్టుపార్టీ జాకబ్‌ జుమాను బలపరిచిందో అదే పార్టీ అతడిని తొలగించాలని ముందుగా గళమెత్తింది. అనేక అంశాలపై పార్టీ విబేధిస్తున్నది. అందువలన వచ్చే ఎన్నికల నాటికి అది దేశాన్ని నడిపించేందుకు తనదైన పంధాలో పయనిస్తుందా అన్నది ఆసక్తికలిగించే అంశం. అదే అయితే కమ్యూనిస్టుపార్టీ, కొసాటు ఒకవైపు, ఎఎన్‌సి మరోవైపు అధికారం కోసం పోటీపడినా ఆశ్చర్యం లేదు.