Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

ఈనెల 18 నుంచి శబరిమల ఆలయాన్ని భక్తుల సందర్శనార్ధం తెరవనున్నారు. అన్ని వయసుల మహిళలను అనుమతించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అమలు నిలిపివేసి, తక్షణమే పునర్విచారణ జరపాలని దాఖలు చేసిన పిటీషన్లను వరుస క్రమంలోనే పరిశీలనకు తీసుకుంటాం తప్ప అత్యవసరమైనవిగా పరిగణించబోమని సుప్రీం కోర్టు ప్రకటించింది. దాంతో బిజెపి, ఇతర సంస్ధలు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు పూనుకున్నట్లు కనిపిస్తోందని సిపిఎం పేర్కొన్నది. మహిళలు ఎవరైనా ఆలయంలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే అలాంటి వారిని రెండు ముక్కలుగా నరికి ఒకదానిని ఢిల్లీకి, మరొకదానిని ముఖ్యమంత్రి విజయన్‌కు పంపుతామని బిజెపి నేత, సినీనటుడు కొల్లం తులసీ బెదిరించాడు. తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులను ఇడియట్స్‌ అని నిందించాడు. ఈనెల 17,18 తేదీలలో తమ వలంటీర్లు ఆలయపరిసరాలకు చేరుకుంటారని, ఎవరైనా మహిళలు ఆలయ ప్రవేశం చేస్తే ఏడుగురు సభ్యులున్న తమ బృందం ఆత్మాహుతి చేసుకుంటుందని కేరళ శివసేన ప్రకటించింది. శని శింగనాపూర్‌ ఆలయ ప్రవేశం కోసం వుద్యమం నడిపిన భూమాత బ్రిగేడ్‌ నాయకురాలు తృప్తి దేశాయ్‌ తాను శబరిమల ఆలయ సందర్శనకు వస్తున్నట్లు ప్రకటించారు. మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటామని ప్రకటించిన ఆలయ తంత్రి కుటుంబానికి చెందిన రాహుల్‌ ఈశ్వర్‌ ఆమె కావాలంటే ఇతర అయ్యప్ప ఆలయాలను సందర్శించవచ్చుగానీ శబరిమల ఆలయానికి అనుమతించేది లేదని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. శబరిమల తీర్పు ఆ విధంగా వస్తుందని మతశక్తులు వూహించలేదు, అలాగే పునర్విచారణకు తక్షణమే స్వీకరించే అవకాశం లేదని సుప్రీం కోర్ట్టు చెబుతుందని కూడా వూహించకపోవటంతో ఆ శక్తులు హతాశులై మనోభావాల పేరుతో శాంతి భద్రతల సమస్యల సృష్టికి పూనుకున్నాయి, దానిలో భాగంగా మహిళలను ముందుకు తెస్తున్నాయి. గతంలో శ్రీలంకలో తమిళవుగ్రవాదులు, ప్రపంచంలో ఇతర చోట్ల అనేక వుగ్రవాద ముఠాలు మహిళలు, పిల్లలను మానవరక్షణ కవచాలుగా చేసుకొని అవాంఛనీయ చర్యలకు పాల్పడిన విషయాన్ని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవటం అవసరం.

Image result for durga vahini

ఎక్కడైనా వెనుకబాటుతనానికి మిత, మతవాదాలతో పాటు కమ్యూనిస్టు వ్యతిరేకత కూడా తోడైతే వారు పురుషులైనా, స్త్రీలైనా తరతమ తేడాలతో ఒకే విధంగా వ్యవహరించుతారు.ఇటీవల అనేక దేశాలలో జరుగుతున్న పరిణామాలను చూసినపుడు మితవాద శక్తులు మహిళలను రంగంలోకి దించే ధోరణి పెరిగింది. మహిళల్లో మితవాదం పెరుగుదల గురించి న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక గతేడాది ఒక విశ్లేషణలో పేర్కొన్నది. అనేక మంది రచనలు, అభిప్రాయాలను దానిలో వుటంకించారు. పచ్చిమితవాదులంటే పురుషులకు సంబంధించినదే అని మహిళలకు ప్రవేశం వుండదు అనుకుంటారు, ఇబ్బందికరమైన వాస్తవం ఏమంటే పచ్చిమితవాద ఆందోళనల్లో మహిళలకు కూడా దీర్ఘచరిత్ర వుంది, అమెరికాలోని శ్వేతజాతి దురహంకార ఆందోళనల్లో మహిళలు కీలక పాత్రపోషించారు అని చరిత్రకారిణి లిండాగార్డెన్‌ పేర్కొనటాన్ని దానిలో వుటంకించారు. మూర్ఖపు పట్టుదలలో పురుషుల కంటే మహిళలు తక్కువ అని చెప్పేకారణాలేమీ లేవు అని ఆమె నిర్ధారించారు. 1920దశకంలో అమెరికాలోని క్లూక్లక్స్‌క్లాన్‌ సంస్ధలో కనీసం పదిహేను లక్షల మంది మహిళలు సభ్యులుగా వున్నారని, కొందరు వారుగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకపోవచ్చుగానీ అలా తీసుకోవటాన్ని సమర్ధించారు అని లిండా పేర్కొన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో మితవాద మహిళలు అమెరికా జోక్యాన్ని వ్యతిరేకించారు తప్ప శాంతిని కోరుకోలేదు, వారి భావజాలం తీవ్రవాద క్రైస్తవం కలసినదిగాక కమ్యూనిస్టు, యూదు వ్యతిరేకతతో నిండి వుంది. ఐరోపాలో ఇరవయ్యవ శతాబ్దపు ఫాసిస్టు ఆందోళనల్లో ఇంట్లో మహిళల పాత్రకు ప్రాధాన్యత ఇచ్చారన్నది తెలిసిందే. ఇటలీలో మంచి ఫాసిస్టు తల్లులు, భార్యల మితవాద భావజాలాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నైతిక సరిహద్దులు గీసుకొని ఇండ్లకే పరిమితం అయ్యారు. జర్మనీలో మహిళలు ఇల్లు, పిల్లలు, చర్చికే పరిమితం కావాలని నిర్ణయించుకున్నారని అమెరికా మేధావి గ్లెన్‌ జీన్స్‌సనె రాసిన అంశాన్ని ఆ వ్యాసంలో పేర్కొన్నారు. జర్మనీ, ఫ్రెంచి, ఇటలీ, బ్రిటన్‌ ఫాసిస్టు రాజకీయాల్లో మహిళలు చురుకైన పాత్ర పోషించారు. స్పెయిన్‌లో ఫాసిస్టు జనరల్‌ ఫ్రాంకో హయాంలో కొన్ని సామాజిక కార్యక్రమాలను నిర్వహించేదిగా, ఆదర్శమహిళలకు నమూనాగా సెకియన్‌ ఫెమినైనా(ఎస్‌ఎఫ్‌) అనే ఒక సంస్ధను ముందుకు తెచ్చారు. అది ఫ్రాంకో అనుమతించిన ఏకైక రాజకీయ సంస్ధ అనుబంధ సంఘం. ఫాసిజానికి వ్యతిరేకంగా సాగిన అంతర్యుద్ధంలో అది ఫ్రాంకోకు మద్దతుగా పని చేసింది.

రెడీ టు వెయిట్‌ ( అర్హత వచ్చే వరకు వేచి చూస్తాం) అనే నినాదం వెనుక చేరుతున్న మహిళల మీద వెనుకబాటు, మిత, మతవాద భావజాలంతో పాటు కేరళలో కమ్యూనిస్టులు అధికారంలో వున్నారు గనుక ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు కమ్యూనిస్టు వ్యతిరేకతను కూడా రెచ్చగొడుతున్నారు. అక్కడ జరుగుతున్న ఆందోళనా కార్యక్రమాలకు పేరు మోసిన కమ్యూనిస్టు వ్యతిరేకులే ముందుండటం యాదృచ్చికం కాదు. రెడీ టు వెయిట్‌ నినాదమిచ్చే వారిలో తమను తాము కించపరచి చూసుకొనే ఆత్మన్యూనత కూడా వుంది. మా మతం, మా ఆచారం, మా పవిత్రత గురించి మాకంటే ఇతరులకు ఎక్కువ తెలుసా అనే అస్ధిత్వరాజకీయ ప్రభావం గురించి వేరే చెప్పనవసరం లేదు. మత మౌఢ్యం, విద్వేషాలను కూడా ఎక్కిస్తే ఫాసిస్టుల పని సులభం అవుతుంది.

Image result for durga vahini

బ్రిటన్‌లో ఏర్పడిన బ్రిటీష్‌ యూనియన్‌ ఆఫ్‌ ఫాసిస్టు(బియుఎఫ్‌) పార్టీ (బ్లాక్‌ షర్ట్స్‌)లో గణనీయంగా మహిళలు పాల్గన్నారు. సభల్లో మహిళా కమ్యూనిస్టుల మీద ఎలా దాడి చేయాలో ఆ సంస్ధలోని మహిళలకు శిక్షణ ఇచ్చారు, ఫాసిజం దుర్మార్గమైంది కాదు మంచిదే అంటూ ఇంటిఇంటికీ తిరిగి ప్రచారం చేసే బాధ్యతను మహిళలకు అప్పగించారు. శబరిమల విషయంలో వివక్ష మంచిదే, మేమే కోరుకుంటున్నాం అని ప్రదర్శనల్లో పాల్గంటున్న మహిళలను రాబోయే రోజుల్లో భారతీయ ఫాసిస్టు లక్షణాలున్న సంఘపరివార్‌కు మద్దతుగా సమీకరించకుండా ఎందుకు వుంటారు. ఫాసిజంలో పురుషులు ప్రధానంగా పైకి కనిపిస్తారు. మహిళలు ఓటర్లుగా, సభ్యులుగా, నిధులు వసూలు చేసేవారిగా, ప్రదర్శనల్లో పాల్గనేవారిగా, పార్టీ అధికార ప్రతినిధులుగా పని చేస్తారు.

‘మహిళా వాదం దుర్నడతలో వుందా ? జర్మనీలో పచ్చి మితవాదం, మహిళా సంఘాలు’ అనే శీర్షికతో అక్టోబరు మూడవ తేదీన ఒక వెబ్‌సైట్‌లో విశ్లేషణ వెలువడింది. ఫ్రాన్స్‌లో జరిగిన ఒక సెమినార్‌కు సమర్పించిన పరిశోధనా వ్యాసమది. జర్మనీలో పచ్చి మితవాద ఫెమినిస్టులు(మహిళావాదులు), ఇస్లాం వ్యతిరేకులైన కొందరు మహిళావాదుల తీరు తెన్నులను దానిలో చర్చించారు.దానిలోని కొన్ని అంశాల సారంశం ఇలా వుంది. ప్రజాకర్షక ఆల్టర్నేటిక్‌ ఫర్‌ జర్మనీ (ఎఎఫ్‌డి)(జర్మనీకి ప్రత్యామ్నాయ పార్టీ) అనే పచ్చి మితవాద పార్టీ 2013లో ఏర్పడి నప్పటి నుంచీ ప్రధమ స్ధానంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ రోజు ( సెప్టెంబరు 21,2018) ఎన్నికలు జరిగితే 18శాతం ఓట్లు ఆ పార్టీకి వస్తాయి. సాంప్రదాయ రాజకీయాల్లో మహిళావాదులను ఎడమవైపు చివరిలో వుంచుతారు. కానీ అందుకు విరుద్ధంగా వారు తిరుగులేని విధంగా ప్రత్యామ్నాయ పార్టీలో జర్మనీ ఇస్లామికీకరణ అనే వుమ్మడి నినాదం వెనుక సమీకృతం అవుతున్నారు. మన దేశం లో తమ సంఖ్యను పెంచేందుకు ముస్లింలు హిందూ యువతులకు వలవేసి వివాహాలు చేసుకుంటున్నారని, మతమార్పిడి చేస్తున్నారని లవ్‌ జీహాద్‌ పేరుతో హిందూమతోన్మాద సంస్ధలు రెచ్చగొడుతున్నట్లే కేవలం రెండు శాతం లోపే వున్న జర్మనీలో వున్న ముస్లింలు క్రైస్తవాన్ని మైనారిటీలోకి మార్చి ఇస్లామిక్‌ దేశంగా మార్చేందుకు పూనుకున్నారంటూ ఒక వూహాజనితమైన భయాన్ని రేపుతున్నారు. దీనిలో మహిళలు కూడా భాగస్వాములవుతున్నారు. అసలు సిసలు జర్మన్లు అందరూ ఐక్యం కావాలని ఎఎఫ్‌డి పిలుపునిస్తోంది. దీనికి తోడు పరిశుద్ధ జర్మన్లను పుట్టించేందుకు హిట్లర్‌ హయాంలో జరిగిన ప్రయత్నాల గురించి తెలిసిందే. ఆర్యనేతరులు(యూదులు, రోమాలు, ఆశియన్లు, ఇతరులు) జర్మనీలో కేవలం పని చేసేందుకు తప్ప పిల్లలను కనటానికి వీలు లేదంటూ దాదాపు హిట్లర్‌ హయాంలో నాలుగు లక్షల మంది యువతులకు, మరికొన్ని లక్షల మంది పురుషులకు బలవంతంగా ఆపరేషన్లు చేసిన దారుణం గురించి తెలిసిందే.

Image result for no to burkas, yes to bikinis, afd

ఈ ఏడాది జనవరిలో 120 డెసిబుల్స్‌ (గొంతెత్తి చెబుదాం అని అర్ధం చెప్పుకోవచ్చు. జర్మనీలో మహిళలు ఎవరైనా తమకు ముప్పు ఎదురైనట్లు భావిస్తే తమ బ్యాగులో వున్న 120 డెసిబుల్స్‌ ధ్వని చేసే అలారాన్ని మోగిస్తారు. అందువలన తమ ప్రచారానికి ఆ అలార సూచికగా ఆ పేరు పెట్టుకున్నారు) పేరుతో మహిళావాదులుగా చెప్పుకొనే వారు ఒక ప్రచారాన్ని ప్రారంభించారు.(మన సంభాషణ సాధారణంగా 60 ధ్వని ప్రమాణంలో వుంటుంది, పాలకులు మామూలుగా చెబితే వినటం లేదు, గొంతెత్తి చెప్పండి అంటాం). దీని నాయకురాలైన ప్రముఖ నటీమణి పాలా వింటర్‌ ఫెట్‌ అంతకు ముందు ఏడాది పచ్చి మితవాదులతో నిండిన అస్ధిత్వ ఆందోళన సంస్ధతో కలసి బెర్లిన్‌లో జరిగిన ఒక ప్రదర్శనలో పాల్గన్నారు. జర్మన్‌ మహిళలు ఇప్పటి మాదిరి తమ బ్యాగుల్లో పెప్పర్‌ బదులు గతంలో దుర్వాసనలు పోగొట్టే స్ప్రేలు పెట్టుకొని తిరిగే వారు, ఆ పాత మంచి రోజులు తిరిగి రావాలంటూ వుపన్యసించారు. 120 డెసిబుల్స్‌ అలారం ప్రచారంలో చెబుతున్న అంశాలేమిటి? మేము ఐరోపా తనయలం, వుత్తర ఆఫ్రికన్‌ లేదా ముస్లిం నిర్వాసితులు జర్మనీకి వస్తున్నప్పటి నుంచి ఆడవారు బ్యాగుల్లో ఈ రోజుల్లో అలారంతో పాటు పెప్పర్‌ స్ప్రే పెట్టుకొని తిరగాల్సి వస్తోంది. జర్మన్‌ మహిళలను ముస్లిం పురుషుల నుంచి రక్షించాలంటే వలసలు రాకుండా సరిహద్దులను మూసివేయాలి. స్వచ్చమైన జర్మన్లు కలుషితమయ్యే తీవ్ర ముప్పు వారి నుంచి ఎదురవుతోంది. ఇలా వుంటుంది. ఇది ఇంకా ఎంతవరకు పోయిందంటే స్వచ్చమైన జర్మన్లను కనటం జర్మనీ మహిళల కర్తవ్యం, అందుకు గాను వారు గృహిణులుగా తమ కుటుంబాలను చూసుకొనేందుకు పరిమితం కావాలి అని ఎఎఫ్‌డి పార్టీ ప్రచారం చేస్తోంది. గత ఏడాది ఎన్నికల సందర్భంగా బుర్ఖా బదులు మేము బికినీలు వేసుకుంటాం అని ఒక పోస్టర్‌, మేము నూతన జర్మన్లను కంటాం అంటూ ఒక శ్వేతజాతి గర్భిణీ మహిళ పొటోతో మరొక పోస్టర్‌ వేశారు.

మన దేశంలో కూడా అలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. తాము సేవ చేసేందుకు అవతరించిన స్వయం సేవకుల మని ఆర్‌ఎస్‌ఎస్‌ వారు చెప్పుకుంటారు. దానిలో మహిళలకు ప్రవేశం లేదు. అది ఏర్పాటు చేసిన సంస్ధే రాష్ట్ర సేవికా సమితి. దానికి గుజరాత్‌ ఒక నాయకురాలు డాక్టర్‌ మాయా కొదనాని. 2002 గుజరాత్‌ మారణకాండలో భాగంగా నరోదా పాటియాలో 97 మంది ముస్లింలను వూచకోత కోసిన వుదంతంలో ఆమె స్వయంగా దుండగులకు ఆయుధాలు అందించినట్లు సాక్షులు చెప్పారు. 2012లో 28 సంవత్సరాల జైలు శిక్ష విధించగా 2018లో హైకోర్టులో కేసును కొట్టి వేశారు. పచ్చిమితవాద భావజాలాన్ని ఎక్కించటమే కాదు, రకరకాల సంస్ధల పేరుతో యువతులను సాయుధులను చేసే ప్రయత్నం జరుగుతోంది. దుర్గావాహిని పేరుతో సాయుధ శిక్షణ గరుపుతూ హిందూత్వను నూరిపోస్తున్నారు. మేము నమ్మినదానికోసం ప్రాణాలిస్తాం, మాదారికి అడ్డు వచ్చిన వారిని అంతమొందించటానికి కూడా వెనుకాడబోమని ఆ శిక్షణ పొందిన వారు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఒక వున్మాదాన్ని ఎక్కిస్తే అది ఎలాంటి వెర్రితలలను వేయిస్తుందో వేరే చెప్పనవసరం లేదు.