Tags

,

AAO Alert: Coronavirus Update for Ophthalmologists – Eyewire News

ఎం కోటేశ్వరరావు
కరోనా ! యావత్‌ ప్రపంచాన్ని భయపెడుతోంది అనుకుంటున్నారు అందరూ !! నిజమా !!! చూస్తే అలా లేదు మరి. కరోనాకు ముందు-కరోనా తరువాత అని వేరు చేసి చూస్తే కరోనా విలయతాండవం తప్ప మిగిలినవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఏదీ ఆగలేదు !
కాలరెగరేసిన చైనాలో కరోనా తోక ముడిచింది !! నిర్లక్ష్యం వహించిన ఇటలీలో విలయతాండవం చేస్తోంది !!! నాలుగు వందల వెంటిలేటర్లు పంపుతామని అన్నారు అవేమి చాలతాయి 30వేలైనా కావాలి అని న్యూయార్క్‌ రాష్ట్ర గవర్నర్‌ చేసిన వ్యాఖ్య మీద రాష్ట్రాలలో కరోనా పాజిటివ్‌ కేసుల గురించి ఎక్కువ చేసి చెబుతున్నారు అంటూ ట్రంప్‌ మహాశయుడు ఫాక్స్‌ న్యూస్‌తో నోరుపారవేసుకున్నాడంటే పౌరుల ప్రాణాల పట్ల నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం ఇంకా కొనసాగుతూనే ఉంది.
కరోనాను అదుపు చేసి ఊహాన్‌ నగరంలో సాధారణ జనజీవనానికి, మామూలు ప్రయాణాలకు చైనా తెరతీయగా తమకేమీ కాదులే, తమనేమీ చేయదులే అని నిర్లక్ష్యం చేసిన అనేక దేశాలలో తలుపులు మూస్తున్నారు. తలలోని మెదడు మోకాల్లోకి వచ్చిన డోనాల్డ్‌ ట్రంప్‌ ఏలుబడిలో అమెరికన్లను కాటు వేసేందుకు కోరలు చాస్తోంది, ఇది రాస్తున్న సమయానికి అగ్రస్ధానానికి చేరిన అమెరికాలో కరోనా కేసులు 104,205, మరణాలు 1,701గా ఉన్నాయి. ఎప్పుడేం జరుగుతుందోనని జనం గంగవెర్రులెత్తుతున్నారు. దాంతో చివరకు …. తుడుచుకొనే టాయిలెట్‌ పేపర్లకోసం కూడా జనాలు ఎగబడుతున్నారు. దెబ్బలాటలకు సైతం దిగుతున్నట్లు వార్తలు. ఇంకేముంది ఒక చోట బకెట్‌ బీరు కొంటే ఒక టాయిలెట్‌ పేపర్‌ ఉండ(రోల్‌) ఉచితం అని ప్రకటించగానే బీరు మొత్తం అమ్ముడు పోయిందట.(వెనెజులా గురించి చెత్త రాసిన ”చూష్కోరా” రచయిత దీని గురించి ఏమంటారో తెలియదు). ఇదే సమయంలో అక్కడ ఎన్ని తుపాకులు కావాలంటే అన్ని పుష్కలంగా అమ్ముతూ లాభాలు పోగేసుకుంటున్నారు. దేశాలన్నీ జనబందీ లేదా గృహబందీలను పాటిస్తుంటే రేపో ఎప్పుడో మనం తిరిగి పనిలోకి పోవాల్సి ఉంటుందని చెబుతున్న ట్రంప్‌ ముది మది తప్పిన స్ధితిలో ఉన్నట్లే కదా !
కత్తులకు, తుపాకుల తూటాలకు, ఎంతో మహత్యం కలిగిందని ప్రచారం చేస్తున్న స్వదేశీ ఆవు మూత్రం, పేడకు, వేద మంత్రాలకు, పూజలు, పునస్కారాలకు, చర్చీలు, మసీదుల్లో ప్రార్ధనలకు లొంగేది కాదని జనానికి చెప్పటం కూడా ఒక పెద్ద సమస్యగా మారింది. కరోనా వ్యాప్తితో సహా ఏ దుర్మార్గమూ ఆగటం లేదు. కరోనాను అందరం ఐక్యంగా ఎదుర్కొందాం అని చెప్పేది బూటకం. అనేక దేశాల మీద అమెరికా విధించిన దుర్మార్గపూరితమైన ఆంక్షల్లో ఏ ఒక్కదాన్నీ ఎత్తివేయలేదు. జనాన్ని మరింతగా బలిపెట్టేందుకు సిద్దపడుతున్నారు.
కరోనా వ్యాప్తి పూర్వరంగంలో తమ దేశ ఆరోగ్య వ్యవస్ధ పటిష్టతకు అత్యవసర రుణం ఐదు బిలియన్‌ డాలర్లు కావాలంటూ వెనెజులా చేసిన వినతిని ఐఎంఎఫ్‌ తిరస్కరించింది. ఎవరు అధికారంలో ఉన్నారో గుర్తించే విషయంలో సభ్యదేశాలకు స్పష్టత లేనందున దేశ అధ్యక్షుడు మదురో వినతిని పరిగణనలోకి తీసుకోవటం లేదని పేర్కొన్నది. అమెరికా ఆడిస్తున్న ఆటలో పావుగా మారకపోతే తన సభ్యదేశాలలో మదురోను వెనెజులా నేతగా గుర్తించిన రాజ్యాలను ఐఎంఎఫ్‌ ఎందుకు విస్మరించినట్లు ? ప్రపంచమంతా కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతుంటే వెనెజులా మీద ఆంక్షలకు అమెరికా పూనుకోవటం కనీస మానవత్వ స్ఫూర్తికి వ్యతిరేకమని చైనా వ్యాఖ్యానించింది.
మరోవైపు అదే మదురో మాదక ద్రవ్యాల అక్రమరవాణాదారులతో చేతులు కలిపాడంటూ అమెరికాలో ఒక తప్పుడు కేసును తాజాగా బనాయించారు. ఇప్పటికే ఉన్న ఆంక్షలను మరింతగా అమలు జరిపి మదురో సర్కార్‌ను కూల్చివేసేందుకే ఈ యత్నం. అమెరికాకు అవసరమైన వైద్య సరఫరాల కోసం రష్యాను తప్ప ఇతర దేశాలను సంప్రదించాలంటూ అమెరికా విదేశాంగశాఖ రాయబారులను ఆదేశించింది.
ఒక వైపు తమను కరోనా కబళిస్తున్నా నిద్రపోతున్న ట్రంప్‌ సర్కార్‌ నిర్వాకాన్ని కప్పిపుచ్చేందుకు చైనా మీద ఆరోపణలను కొనసాగిస్తూనే ఉంది. అనేక దేశాలలో అది పెట్టిన చిచ్చు ఇంకా రాజుకుంటూనే ఉంది, ఎక్కడా దాడులు ఆగలేదు. ఇది దుష్ట రాజకీయం తప్ప జనాన్ని ఆదుకొనే వారు చేయాల్సిన పనేనా ? బాధితులైన అమెరికా జనం మీద ఎవరికీ కోపం ఉండాల్సినపనిలేదు గానీ ట్రంప్‌ బాధ్యతా రాహిత్యం, దుర్మార్గాలను ముక్త కంఠంతో ఖండించాల్సిందే. నైతికంగా అతగాడికి అధికారంలో ఉండే అర్హత ఏమాత్రం లేదు.
దేశాన్ని ఆర్ధికంగా దిగజార్చటం, నిరుద్యోగం పెరగటం అచ్చే దిన్‌కు బదులు జనాలకు చచ్చే దిన్‌ తెచ్చిన పూర్వరంగంలో ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమంలో నరేంద్రమోడీ భజన తగ్గింది. అయితే జనతా కర్ఫ్యూ, జనం ఇండ్లకే పరిమితం(లాక్‌డౌన్‌) కావటం నరేంద్రమోడీ మెదడులోంచి వచ్చిన తెలివితేటలు, మహత్తర ఆలోచనలంటూ తిరిగి భజన ప్రారంభమైంది. ఆయనకు ధన్యవాదాలు తెలిపేందుకు నమో జ్యోతి పేరుతో కార్యక్రమాలు నిర్వహించాలట. చైనాలో రెండు నెలల పాటు జనబందీ అమలు జరిగిన తరువాత ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా అనివార్యమే అయినా ఆకస్మికంగా దేశవ్యాపిత కర్ఫ్యూను ప్రకటించి ఎలాంటి ఇబ్బందులకు గురి చేశారో చూశాము. చైనాలో ఎలా అమలు జరిపారో కనీసంగా అధ్యయనం చేసినా ఇలా జరిగి ఉండేది కాదు. వలస కార్మికులు స్వస్ధలాలకు వెళ్లే ఏర్పాట్లు లేక కంటెయినర్లలో బిక్కు బిక్కు మంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వెళ్లినట్లు వచ్చిన వార్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు చూపు లేమికి, నిర్లక్ష్యానికి నిదర్శనం. విదేశాల్లో ఉన్నవారికోసం విమానాలు పంపిన వారికి స్వదేశంలో వలసపోయిన వారిని స్వస్ధలాలకు పంపే బాధ్యతను ఎందుకు తీసుకోరు ?
యావత్‌ సమాజం కష్టకాలంలో ఉన్నపుడు పాలకులు చేసిన సాయానికి వంకలు పెట్టటం ఏమిటి అని అనేక మందికి అనిపించవచ్చు. మన దేశంలో కష్టకాలానికి కరోనా తోడైంది. ఈ సమయంలోనే లీటరు డీజిల్‌, పెట్రోలుకు మూడేసి రూపాయల పన్ను పెంచారు. మరో ఎనిమిది లేదా పది రూపాయలను పెంచేందుకు పార్లమెంటులో ముందస్తు అనుమతి తీసుకున్నారు. ఇది కష్టకాలం అని జనం మీద కనికరం చూపాలని దయగల పాలకులకు అనిపించలేదు. అంతకు ముందు వేళ్ల మీద లెక్కించదగిన ధనికులకు 7.78లక్షల కోట్ల రూపాయల రుణాలను రద్దు చేసిన చేతులతో 130కోట్ల మందికి లక్షా 75వేల కోట్ల రూపాయల పాకేజి ప్రకటించి తమ భుజాలను తామే చరుచుకుంటున్నారు. ఈ మొత్తంలో గత ఏడాదే ప్రకటించిన మూడు వాయిదాల ఆరువేల రూపాయల రైతు సాయంలో ఒకవిడత రెండువేల రూపాయలు కూడా ఇమిడి ఉన్నాయి. ఏటా 70వేల కోట్లు ఇందుకు అవసరమని గతంలో చెప్పినదాన్ని బట్టి మూడో వంతు ఇరవై వేలను మినహాయిస్తే కరోనా సాయం మరింత తగ్గినట్లే . అది వాస్తవం అయితే రెండు వేల రూపాయలను కరోనా సందర్భంగా రైతులకు చేస్తున్న సాయమని మభ్యపెడుతూనే ఉన్నారు.కంపెనీల యజమానులకు అందచేసే మొత్తాలను (పిఎఫ్‌ వాటా చెల్లింపు) కూడా జనం ఖాతాలో రాస్తున్నారు. బహుశా ఇది వేద గణితం అయి ఉండాలి. గతంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదా బదులు ప్రత్యేక పాకేజి అని చెప్పారు. తీరా చూస్తే కేంద్ర పధకాలన్నింటినీ కలిపి చెప్పారు తప్ప అదనపు సాయం ఏమీ లేదు. ఇప్పుడు కరోనా సాయంలో కూడా కేంద్ర పధకాలు ఏమైనా కలిసి ఉన్నాయా అన్నది చూడాల్సి ఉంది.
డెమోక్రాట్ల వత్తిడితో అల్పాదాయవర్గాల వారికి ఈ ఏడాది చివరి వరకు నెలనెలా పెద్ద వారికి ఒక్కొక్కరికి పన్నెండువందల డాలర్లు, పిల్లలకు ఐదువందల డాలర్లు చెల్లించేందుకు ట్రంప్‌ సర్కార్‌ అంగీకరించాల్సి వచ్చింది.(డాలరుకు 75 రూపాయలు) ఆయన జిగినీ దోస్తు నరేంద్రమోడీ మాత్రం జనధన్‌ ఖాతాలున్న మహిళకు మూడు నెలల పాటు నెలకు ఐదు వందల రూపాయలు జమచేస్తామని చెప్పి తమలో తామే ఉబ్బితబ్బిబ్బు అవుతూ టాంటాం వేసుకుంటున్నారు. అమెరికా, ఇతర దాని తొత్తు దేశాల ఆంక్షలు, అష్టదిగ్బంధం కారణంగా ఇబ్బందులు పడుతున్న వెనెజులా ఆరునెలల పాటు జనానికి ఉపశమన చర్యలను ప్రకటించింది. మన ఆర్ధిక వ్యవస్ధను ఐదో స్ధానానికి చేర్చామని ఊరూవాడా ప్రచారం చేసిన పెద్దలు తీరా జనానికి సాయం విషయంలో ఎక్కడ ఉన్నారు. ప్రపంచ రాజకీయాల్లో నరేంద్రమోడీ తమ సహభాగస్వామి అని ట్రంప్‌నుంచి పొగడ్తలు అందుకున్నారు. అలాంటి ట్రంప్‌ 150లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన ప్రకటిస్తే ఆ పెద్దమనిషి భాగస్వామి 1.75లక్షల కోట్లు మాత్రమే ప్రకటించారు. వ్యాధిని వారాల తరబడి నిర్లక్ష్యం చేసిన, సముద్రంలో కాకిరెట్ట మాదిరి సాయం ప్రకటించిన నాయకత్వానికి నీరాజనాలా ? సిగ్గు చేటు ! కేంద్రంలో నరేంద్రమోడీ లేదా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు తమ బాధ్యతలను నిర్వరిస్తున్నారు. కేరళ ముందుగా మేలుకున్నట్లు అందరూ అంగీకరిస్తారు, కానీ అక్కడ అధికార సిపిఎం నేతలు మన తెలుగు రాష్ట్రాల్లో మాదిరి అక్కడి సిఎంను పొగడ్తలతో ముంచెత్తటం లేదు. పొగడ్తలు, భజనలతో అభిమానం సంపాదించుకొనేందుకు అలవాటు పడిన నేతలకు సమయం సందర్భం గురించి సృహ ఉండదని ఇప్పుడు రుజువు చేస్తున్నారు.
ఒక వైపు కరోనా మరణమృదంగాన్ని వాయిస్తుంటే ఇటలీలోని కార్పొరేట్‌ల యజమానులు చట్టాల్లోని లోపాలను వినియోగించుకొని లబ్ది పొందేందుకు ప్రయత్నించటం కంటే దుర్మార్గం మరొకటి లేదు. ఆరోగ్య సంబంధ సంస్ధలు మినహా మిగిలిన వాటన్నింటినీ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ అత్యవసర సేవల చట్టంలోని నిబంధనల లోపాలను వినియోగించుకొని ఆయుధ కంపెనీల యజమానులు ఫ్యాక్టరీలను మూసివేసేందుకు తిరస్కరిస్తున్నారు.దీనికి నిరసనగా కార్మికులు సమ్మెకు పిలుపు ఇవ్వాల్సి వచ్చింది.

Cartoons: Coronavirus outbreak classified as pandemic
గతంలో బ్రెజిల్‌ వామపక్ష ప్రభుత్వం క్యూబా వైద్యులను రప్పించి పెద్ద ఎత్తున వైద్య, ఆరోగ్యసేవలను అందించింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న మితవాద బోల్‌సోనోరో సర్కార్‌ క్యూబా మీద వ్యతిరేకతతో ఆదేశ వైద్యులను వెనక్కు పంపింది. మరి కొంత మందిని దేశంలో ఉండేందుకు          అనుమతించినప్పటికీ వారి సేవలను వినియోగించుకోవటం నిలిపివేసింది. . ఇప్పుడు కరోనా వ్యాప్తి కారణంగా అదే క్యూబా వైద్యులు తమకు సేవలు అందించాలని, క్యూబా వెళ్లిన వారు తిరిగి రావాలని బోల్‌సోనోరో సర్కార్‌ వేడుకున్నది.ఐదువేల మంది క్యూబన్‌ వైద్యులను ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో వినియోగించనున్నట్లు ఆరోగ్య మంత్రి జావో గబ్బార్డో ప్రకటించాడు.ఎన్నికల ప్రచారంలో క్యూబా వైద్యులను వ్యతిరేకించటం ఒక ప్రచార అంశంగా బోలోసోనారో ముందుకు తెచ్చారు. క్యూబా నుంచి వచ్చిన పదివేల మంది వైద్యులు బ్రెజిల్‌లో గెరిల్లా దళాలను ఏర్పాటు చేసేందుకు వచ్చారని, వారు నిజంగా వైద్యులు కాదని తాను అధికారంలోకి రాగానే వారిని వెనక్కు పంపినట్లు ప్రకటించాడు. క్యూబన్‌ వైద్యుల మీద తప్పుడు ప్రచారం చేసినందుకు బోలోసోనారో క్షమాపణ చెప్పాలని లూలా నాయకత్వంలోని వర్కర్స్‌ పార్టీ డిమాండ్‌ చేసింది.
వాట్సప్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో కాషాయ దళాల ప్రచారం ముమ్మరంగా సాగుతూనే ఉంది. ఇటలీకి వచ్చిన క్యూబా వైద్యుల బృందం ఫొటోను మార్ఫింగ్‌ చేసి ఆర్‌ఎస్‌ఎస్‌ సేవా దళం అని చిత్రించింది వాటిలో ఒకటి. మూఢనమ్మకాలను పుంఖాను పుంఖాలుగా ముందుకు తెస్తున్నారు. కాషాయ దళాలతో పాటు ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్టు వ్యతిరేకుల ప్రచారానికి కరోనా కలసి వచ్చింది.