Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


ఇప్పుడు అమెరికా, ఇతర దేశాల మిలిటరీ నిపుణులను చైనా శాస్త్రవేత్తలు అయోమయంలో పడవేశారా ! లేక ఆయుధాల పోటీకి ఒక సాకుగా అమెరికన్లు ప్రచారదాడి ప్రారంభించారా ? సినిమాలకే పరిమితమైన స్టార్‌వార్స్‌ నిజం అవుతాయా ? ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు ! ఏదైనా జరిగేందుకు ఆస్కారముంది.చైనా ప్రయోగం నిజమైనా కాకున్నా ఈ పరిణామం అంతరిక్షాన్ని ఆయుధమయం గావిస్తుంది. ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక రాసిన ఒక కథనంతో అమెరికా మిలిటరీ నిపుణులు, పశ్చిమ దేశాల మీడియా గుండెలు బాడుకుంటూ ఇంకేముంది అంతా అయిపోయింది మిలిటరీ రంగంలో కూడా చైనా పైచేయి సాధించింది, అణు ముప్పు తలెత్తింది అంటూ నానాయాగీ చేస్తున్నారు. మరోవైపు భయ పడాల్సిందేమీ లేదంటూ తమ వీపును తామే తట్టుకుంటున్నారు. వార్తలో రాసిందేమిటి ?

చైనా వ్యోమ నౌకతో అనుసంధానం చేసిన అణ్వాయుధం అమర్చగలిగిన క్షిపణి విపరీత వేగంతో భూమికి దగ్గర కక్ష్యలో ప్రదక్షిణం చేసిందని, దాన్ని నిర్ణీత ప్రాంతంలో జారవిడిచిందని పేర్కొన్నది. ఈక్షిపణి అన్నివైపుల నుంచి అమెరికా మీద దాడి చేస్తుందని, రాడార్లను తప్పించుకుంటుందని రాసింది. హైపర్‌సోనిక్‌ క్షిపణిని ఆగస్టునెలలో ప్రయోగించిందని లక్ష్యానికి నలభై కిలోమీటర్ల దూరంలో బాంబును వేసిందని, అసలు అలాంటి పరిజ్ఞానం సాధించిన తరువాత నిర్ధిష్టంగా లక్ష్యాన్ని చేరుకొనే విధంగా లోపాలను సవరించటం పెద్ద పని కాదంటూ కిందు మీదవుతున్నారు.(ధ్వని వేగంతో సమంగా ప్రయాణించే వాటిని సూపర్‌ సోనిక్‌ అనీ ఐదు రెట్లు అంతకంటే ఎక్కువ వేగం ఉన్న వాటిని హైపర్‌సోనిక్‌ అంటున్నారు)


దీని మీద చైనా చెబుతున్నదేమిటి ? ఒక సారి ప్రయోగించిన వ్యోమనౌకను మరోసారి వినియోగించటం ద్వారా ఖర్చు తగ్గింపు గురించి జరిపిన ప్రయోగం తప్ప క్షిపణి కాదని చెబుతోంది. సదరు నౌక భూమి మీదకు తిరిగి వచ్చే క్రమంలో దానికి అనుసంధానించిన పరికరాలు విడిపోయి సముద్రంలో మండిపోయినట్లు పేర్కొన్నది. కాదు క్షిపణి అని అమెరికా అందించిన సమాచారం ఆధారంగా ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక రాసిన కథనం సంచలనం సృష్టించింది. దాని కొనసాగింపుగా మిగతా మీడియా అందుకుంది. రెండూ వాస్తవం కావచ్చు. అనేక దేశాలు తాము చేస్తున్న ప్రయోగాలను బహిరంగ పరచటం లేదు.


ప్రస్తుతం ప్రపంచంలో ఆయుధ పోటీ నడుస్తోందన్నది వాస్తవం. నిత్యం ప్రపంచాన్ని తన అమ్ములపొదిని చూపి బెదిరిస్తున్నది అమెరికా. తన నూతన ఆయుధాల ప్రయోగశాలగా ఇరాక్‌ యుద్ధాన్ని వినియోగించుకున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం అణ్వస్త్రాలు ఉన్న దేశాలుగా అధికారికంగా గుర్తించినవి అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ మాత్రమే.ఈ ఏడాది జనవరి నాటికి వాటి వద్ద ఉన్నట్లు అంచనా వేస్తున్న అణ్వస్త్రాల సంఖ్య దేశాల వారీ ఇలా ఉంది. అమెరికా 5,550, రష్యా 4,495, చైనా 350, ఫ్రాన్స్‌ 290, బ్రిటన్‌ 225, అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పిటి)పై సంతకం చేయని పాకిస్తాన్‌ 165, భారత్‌ 156, ఇజ్రాయెల్‌ 90, ఉత్తర కొరియా 40-50 కలిగి ఉన్నట్లు అంచనా. ఇక ఏక్షణంలో అయినా బాంబులను తయారు చేయగలిగిన, కార్యక్రమం ఉన్న దేశాలుగా ఇరాన్‌, సిరియా ఉన్నాయి. అణుకార్య క్రమాన్ని నిలిపివేసిన జాబితాలో బెలారస్‌, కజకస్తాన్‌, ఉక్రెయిన్‌, దక్షిణాఫ్రికా, ఇరాక్‌, లిబియా,అర్జెంటీనా, బ్రెజిల్‌, దక్షిణ కొరియా ఉన్నాయి. ఇక్కడ ఎవరి దగ్గర ఎన్ని బాంబులు ఉన్నాయన్నది కాదు, అవి మారణహౌమం సృష్టిస్తాయన్నదే అసలు సమస్య. పరస్పర విశ్వాసం లేనందున ఎవరు ప్రయోగించినా వాటిని అడ్డుకొనే కొత్త క్షిపణులను, వాహకాలను తయారు చేసేందుకు పోటీ పడుతున్నారు. చైనా తయారు చేసిందని చెబుతున్న హైపర్‌సోనిక్‌ క్షిపణి రగడ అదే.


మిలిటరీ రంగంలో రష్యా పోటా పోటీగా ఉందికనుకనే ఇంతకాలం అమెరికా కొంత మేరకు అదుపులో ఉంది. ఇటీవలి కాలంలో ఆర్ధికంగా చైనా సవాలు విసురుతోంది. ఈదశాబ్ది అంతానికి అమెరికాను అధిగమిస్తుందనే అంచనాలు వెలువడ్డాయి. భారీ సంఖ్యలో అణ్వాయుధాలు లేకున్నా వాటిని అంతరిక్షం నుంచి ప్రయోగించగలిగే పరిజ్ఞానాన్ని చైనా సంతరించుకుందనే భయం పట్టుకుందిప్పుడు. దీనిలో రెండు అంశాలున్నాయి. ఇరాక్‌ను ఆక్రమించుకొనేందుకు దానికి ఏదో ఒక సాకు చూపాలి, దానిలో భాగంగా అక్కడ మారణాయుధాలను సద్దామ్‌ హుసేన్‌ గుట్టలుగా పోశారనే ప్రచారం చేసి దురాక్రమణకు పాల్పడ్డారు. ఇప్పుడు చైనా విషయంలో దాన్నొక బూచిగా చూపి ఇతర దేశాలను భయపెట్టటం, ఆ సాకుతో తన ఆయుధాలను మెరుగుపరచుకొనే ఎత్తుగడ ఉంది. ఒక వైపున చైనా అంటే చౌకవస్తువులను ఉత్పత్తి చేయటం తప్ప ఆధునిక పరిజ్ఞానం వారి దగ్గర ఎక్కడుందని చెబుతారు. మరొక వైపు అరే మనకు తెలియకుండా ఇప్పుడు ఇంత పరిజ్ఞానం ఎప్పుడు సంపాదించుకుందని ఆశ్చర్యపోతున్నట్లు, అతిశయోక్తుల కథలు చెబుతారు. భారత్‌, చైనా ఏ దేశమైనా తన భద్రతను తాను చూసుకోవాలి. అందుకే భారత్‌ అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందంలో చేరలేదు.అలాగే అమెరికా కవ్వింపులను ఎదుర్కొనేందుకు చైనా పూనకుంటుందనటంలో సందేహం ఉండనవసరం లేదు.


మరోవైపున అమెరికా చేస్తున్నదేమిటి ? దాని దగ్గర అత్యాధునిక బాంబర్లు ఉన్నాయి. వాటిలో ఒకటైన బి-52హెచ్‌ బాంబరుకు హైపర్‌సోనిక్‌ క్షిపణి ఎజిఎం 183ఏ(ఎఆర్‌ఆర్‌డబ్ల్యు)కు రాకెట్‌ను జతచేసి ప్రయోగాలు జరుపుతోంది. జూలై నెలలో రెండవ ప్రయోగం విఫలమైనట్లు, దాన్ని విశ్లేషిస్తున్నట్లు అధికారులే చెప్పారు. మరి వీటి సంగతేమిటి ? అమెరికా చేస్తే ఒప్పు చైనా చేస్తే ముప్పా ? ఈ ప్రయోగంలో ఆయుధం బాంబరు నుంచి విడిపోయి నప్పటికీ రాకెట్‌ మోటార్‌ పనిచేయక విఫలమైంది. అంతకు ముందు చేసిన తొలి ప్రయోగంలో క్షిపణి విడిపోలేదు. దీనికి సంబంధించి అనేక ప్రయోగాలు అంతకు ముందు జరిగాయి. ఇవి ఎందుకు చేస్తున్నారు ? ఆయుధ వ్యాపారి లాక్‌హీడ్‌ మార్టిన్‌ కంపెనీ కోసమేకదా ! ఈ ప్రయోగం ఇతర దేశాలను భయపెట్టేందుకు గాక ఏ లోక కల్యాణం కోసం జరుపుతున్నట్లు ? బ్రిటన్‌తో కలసి ఆస్ట్రేలియాకు అణుపరిజ్ఞానంతో పని చేసే జలాంతర్గాములను అందచేసేందుకు ఒప్పందం(అకుస్‌) చేసుకుంది. ఇది ఎన్‌పిటిని ఉల్లంఘించటం కాదా ? ఇలాంటి వాటిని ఎదుర్కోవాలంటే మిగతా దేశాలు ఏం చేయాలి ?


తన నేరాలు, ఘోరాలను కప్పి పుచ్చుకొనేందుకు ఇతర దేశాలపై నిందలు వేయటం, మీడియా ద్వారా ప్రచారం చేయించటం అమెరికాకు వెన్నతో పెట్టిన విద్య.గ్జిన్‌జియాంగ్‌ రాష్ట్రంలో అణ్వాయుధాలను ప్రయోగించేందుకు చైనా గోతులు తీసిందని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికలో రాశారు.పత్రికల వార్తలను పట్టుకొని అమెరికాలోని కొందరు రెచ్చిపోతున్నారు. సాయుధ దళాల పార్లమెంటరీ కమిటీ సభ్యుడైన రిపబ్లికన్‌ పార్టీ ఎంపీ మైక్‌ గాలఘెర్‌ వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగాలన్నాడు.లేనట్లైతే ఈ దశాబ్దిలోనే ప్రచ్చన్నయుద్దంలో కమ్యూనిస్టు చైనాతో అమెరికా ఓడిపోనుందని చెప్పాడు.
హైపర్‌సోనిక్‌ క్షిపణులను పరీక్షించటం కొత్తగా జరుగుతున్నదేమీ కాదు, బహిరంగ రహస్యమే.చైనా తొలిసారిగా 2014లో రష్యా 2016లో పరీక్షించింది, అమెరికా చేస్తున్నదీ అదే. అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్ధలను కూడా తప్పించుకొని నిర్దేశిత లక్ష్యాన్ని చేధించే దాన్ని చైనా రూపొందిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి పరిజ్ఞానం అమెరికా దగ్గర లేదని కూడా కొందరు చెప్పారు. ఇదే గనుక నిజమైతే తామెంతో ముందున్నామని చెప్పుకుంటున్న అమెరికా తన మిత్రదేశాలను, తన జనాన్ని ఏ విధంగా సమాధానపరుస్తుంది ? ఆప్ఘనిస్తాన్‌లో పొందిన పరాభవం గురించి ఇంకా చర్చ జరుగుతుండగానే ఈ వార్త అమెరికా సామర్ధ్యం మీద మరింత అనుమానాలను రేకెత్తించదా ? అయినా ప్రచారం చేస్తున్నారంటే ఏదో దాని వెనుక ఏదో ఉండి ఉండాలి.


అమెరికా దూకుడును అడ్డుకునేందుకు 1960దశకంలో నాటి సోవియట్‌ ఇలాంటి వ్యవస్ధలను ఏర్పాటు చేసేందుకు పూనుకున్నప్పటికీ తరువాత నిలిపివేసింది. ఇప్పుడు మరోసారి అమెరికా తెగబడుతున్నందున ఇతర దేశాలు అందుకు పూనుకొనే అగత్యం ఏర్పడింది. అనేక రంగాల్లో దూసుకుపోతున్న చైనా నిజంగా అధునాతన క్షిపణిని పరీక్షించినా ఆశ్చర్యం లేదు. ఫైనాన్సియల్‌ టైమ్స్‌ కధనం ప్రకారం చైనా పరీక్షించిన క్షిపణి వేగం గంటకు 33,800కిలోమీటర్లు, గాలిలో ధ్వని కంటే 27 రెట్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీన్ని పసిగట్టటం లేదా అడ్డుకోవటం కష్టం. అమెరికా వద్ద ఉన్న ఖండాంతర క్షిపుణులు 23రెట్ల వేగంతో దూసుకుపోతాయి. కొందరు నిపుణులు మరోవాదన వినిపిస్తున్నారు. ఉపగ్రహాల వినియోగం పెరగటం, భూమి, అంతరిక్షంలోని వస్తువులను పసిగట్టే పరికరాలుఉన్నందున హైపర్‌సోనిక్‌ క్షిపణులతో పెద్దగా ప్రయోజనం లేదని ఖండాంతర క్షిపణులే మెరుగని చెబుతున్నారు. అదే నిజమైతే అమెరికన్లు ఇంతగా స్పందించాల్సిన అవసరం ఏముంది ? అమెరికా నిపుణుడు మార్కో వాదన మరో విధంగా ఉంది.అమెరికా రూపొందించిన బాలిస్టిక్‌ క్షిపణి రక్షణ వ్యవస్ధ( బిఎండి)ను, అమెరికా నగరాలను దెబ్బతీసే శక్తి హైపర్‌సోనిక్‌ క్షిపణికి ఉంటుందని చెబుతున్నాడు. ఇదే అమెరికన్లను భయపెడుతోందన్నది మరొక వాదన. ఒక క్షిపణి ప్రయోగం జరిపినంత మాత్రానే చైనా వద్ద అలాంటివి ఉన్నట్లు కాదని మరొకరు చెప్పారు. అసలు చైనా వారెలా చేశారో తమకు అర్దం కావటం లేదని ఒక అధికారి చెప్పినట్లు ఫైనాన్సియల్‌ టైమ్స్‌ రాసింది. ఈ పత్రిక విశ్వసనీయత గురించి చర్చించటంలో అర్ధం లేదని కొన్ని కీలకమైన మిలిటరీ సాంకేతిక పద్దతుల్లో అమెరికాతో ఉన్న దూరం తగ్గుతోందని, చైనాను ఎవరూ ఆపలేరని గ్రహించాలని చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ రాసింది. బిఎండి ఉంది కదా మనకు ఇబ్బంది లేదనుకుంటే ఇప్పుడు కుదరదని, ఉపగ్రహాలను కూల్చివేసే క్షిపణులను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని ఒక అమెరికన్‌ సూచించాడు.


అణుబాంబును తయారు చేయటమే గాక దాన్ని ప్రయోగించి ప్రపంచాన్ని భయపెట్టింది, మిగతాదేశాలను రెచ్చగొట్టిందీ అమెరికా. దాన్ని అడ్డుకొనేందుకు ఎవరైనా కొత్త అస్త్రాలను సమకూర్చుకుంటే అమెరికాను రెచ్చగొట్టేందుకే ఆ పని చేస్తున్నారని ఎదురుదాడికి దిగుతున్నారు. అమెరికా ఖండాంతర క్షిపణులకు ధీటుగా రష్యా ఆర్‌ఎస్‌-28 సరమాట్‌ పేరుతో కొత్త క్షిపణి తయారు చేస్తోంది. అది ఈ ఏడాదే సిద్దం అవుతుందనే వార్తలు వచ్చాయి. అది సూపర్‌ ఖండాంతర క్షిపణి అంటున్నారు. దాదాపు పదహారువేల కిలోమీటర్ల వేగంతో, ఒకేసారి అనేక బాంబులను మోసుకుపోయి ఒకేసారి నిర్ణీత ప్రాంతాల మీద జారవిడుస్తుందని చెబుతున్నారు.

అక్టోబరు తొలివారంలో చైనా విమానాలు తైవాన్‌ దీవి మీద అనేక చక్కర్లు కొట్టటాన్ని ప్రపంచ మీడియా కథలు కథలుగా వర్ణించింది. చైనా చర్యకు పోటీగా, కవ్విస్తూ అమెరికా, కెనడాలు క్షిపణి విధ్వంసక నావ, ఫ్రైగేట్‌ను తైవాన్‌ జలసంధిలో తిప్పాయి. ఆ తరువాతే ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక ప్రపంచాన్ని రెచ్చగొట్టే విధంగా చైనా హైపర్‌సోనిక్‌ క్షిపణి గురించి కథ అల్లింది. అమెరికా క్షిపణి విధ్వంసక వ్యవస్ధను రూపొందించినప్పటికీ దాని అవసరం కలగలేదు. అది ఎలా పనిచేస్తుందో పరీక్షలు జరుపుతున్నారు. ఎవరైనా అమెరికా మీదకు దీర్ఘశ్రేణి క్షిపణిని వదిలితే దాన్ని మధ్యలోóనే అడ్డుకొనేందుకు రూపొందించారు. ఇప్పటి వరకు 19సార్లు పరీక్షించగా పన్నెండుసార్లు విజయవంతమైంది. గత రెండున్నర సంవత్సరాలుగా పరీక్షలు లేవు. దాని మీద ఇంకా అనుమానాలు తొలగలేదు. ప్రస్తుతం ఉన్న ఖండాంతర క్షిపణులు వంద మీటర్లకు అటూ ఇటుగా లక్ష్యాన్ని చేరతాయి. ఇటీవలి కాలంలో చైనా అంతరిక్ష రంగంలో అమెరికా, రష్యాతో పోటీ పడుతోంది. ఈ నేపధ్యంలో చైనా పరీక్ష ఇప్పుడు నిజం కాకపోయినా త్వరలో చేసినా ఆశ్చర్యలేదు. అమెరికన్లు అదుపులో ఉంటారు.