Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజు అమెరికా పర్యటన తరువాత ఈజిప్టు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత ఏమి సాధించారో మోడీ మాటల్లో విన్న తరువాత వాటి మంచి చెడ్డల గురించి చూద్దాం. ఏదేశమేగినా ఎందుకాలిడినా మోడీ వెంట మన బడా కొర్పొరేట్‌ పెద్దలు పొలోమంటూ వెళతారు. వెళ్లిన చోట అక్కడి బడా సంస్థల వారితో కొలువు తీరతారు, ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వాటితో మన 140 కోట్ల జనానికి కలిగే లబ్ది ఎంత ? వేళ్ల మీద లెక్కించగలిగిన బడా పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు కలిగే లాభం ఏమిటి అన్నదాన్ని బట్టే టూరు ఎందుకో అవగతం అవుతుంది. గత తొమ్మిది సంవత్సరాలుగా జరిపిన అన్ని విదేశీ టూర్లను ఈ ప్రాతిపదికగానే చూడాల్సి ఉంది. గతంలో పదేండ్లు ప్రధానిగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌, ఇతర ప్రధానులు కూడా విదేశాలకు వెళ్లారు. మోడీ మాదిరి పొగడ్తలు, బిరుదులు, ఆహా ఓహౌలను వెంట తీసుకురాలేదన్నది నిజం. ఎవరినైనా కౌగలించుకొనే చొరవ అందరికీ ఉంటుందా ? ప్రపంచంలో నాడున్న పరిస్థితి, అంతర్జాతీయ రాజకీయాలు, వాటిలో భారత నేతలను మునగచెట్టు ఎక్కిస్తే తమకెంత లాభం అన్నదాన్ని బట్టి పొగడ్తలు ఉంటాయి. ఇక్కడ ఒక అంశం చెప్పుకోవాలి. గత ప్రధానులను విదేశాల్లో పొగడనంత మాత్రాన మన జనానికి కలిగిన నష్టం లేదు-మోడీని పొగిడినదానికి వచ్చిన లాభమూ లేదు. విదేశాల్లో మోడీ పొందిన బహుమతులను వేలం వేస్తే ఖజనాకు నాలుగు డబ్బులు వస్తాయి. పొగడ్తలను కొనుగోలు చేసే వారెవరూ ఉండరు. వాటిని చూపి ప్రపంచంలో మోడీ హయాంలో దేశ ప్రతిష్ట విపరీతంగా పెరిగిందని బిజెపి నేతలు, మోడీ సర్కార్‌తో అవసరం ఉన్నవారందరూ ఆకాశానికి ఎత్తుతున్నారు. అమెరికా, ఈజిప్టు టూర్‌లో ఇంకెన్ని తీసుకువస్తారో చూడాల్సి ఉంది. రాహుల్‌ గాంధీ బ్రిటన్‌, అమెరికా వెళ్లి మన ప్రభుత్వ విధానాలను విమర్శించి దేశ ప్రతిష్టకు మచ్చ తెచ్చారని బిజెపి నానా రచ్చ చేసింది. మోడీ వెళ్లిన చోట కూడా మన అంతర్గత విధానాలు, వైఖరి గురించి రచ్చ జరుగుతూనే ఉంది. అమెరికాలో కూడా జరిగింది. దాన్ని దేశానికి గౌరవాన్ని తెచ్చినట్లు ఎవరైనా వర్ణిస్తారా ?


గత తొమ్మిది సంవత్సరాలలో మోడీ విదేశాల్లో మన ప్రతిష్టను పెంచారా తగ్గించారా అన్నది ఒక చర్చ. అమెరికాలోని ప్రముఖ పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ తాజాగా అమెరికా వెళ్లిన మన ప్రధాని గురించి మన టీవీల తీరు తెన్నుల మీద రాసిన కొన్ని అంశాలను చూద్దాం. ” అమెరికాలో అడుగుపెట్టిన బాస్‌, దౌత్య రారాజు, చరిత్ర సృష్టిస్తున్నారు చూడండి, దౌత్యంలో మోడీ వినూత్న పరిణామం ” ఇలా టీవీల శీర్షికలున్నాయి. జో బైడెన్‌, నరేంద్రమోడీ కరచాలనం చేస్తున్న దృశ్యంలో వారి హావ భావాలను చూస్తే ఒకరికొకరు లేకపోతే అసంపూర్ణం అన్నట్లుగా ఉందని ఒక యాంకర్‌ వర్ణించారట.( గతంలో మోడీ-డోనాల్డ్‌ ట్రంప్‌ కౌగిలింతలు, చెట్టపట్టాలు వేసుకు తిరిగినపుడు కూడా చాలా మందికి వారు అలానే కనిపించారు. మోడీ, బైడెన్‌, ట్రంప్‌ మహానటులు అనటంలో సందేహం లేదు) ఎంతో యుక్తితో జాగ్రత్తగా సంప్రదాయ వార్తా సంస్థలతో సంబంధాలను మోడీ ఏర్పాటు చేసుకున్నారు. ప్రోత్సాహకాలు, వత్తిడి ఎత్తుగడల సమ్మిళితంతో ఎక్కువ సంస్థలను తనవైపు ఉండేట్లు చేసుకున్నారు.ఇబ్బందికరమైన సమస్యలు తలెత్తినపుడు అంటే ఒక రాష్ట్రంలో ఎన్నికల్లో ఓటమి, ఈశాన్య రాష్ట్రంలో తెగల మధ్య తలెత్తిన పోరులో రక్తపాతం, అశాంతి, ప్రాణాంతకమైన మూడు రైళ్ల ఢ వంటి వాటితో మోడీకేమీ సంబంధం లేదని తప్పుదారి పట్టించటంలో అవి వేగంగా ఉంటాయి. మోడీ అమెరికా టూరు గురించి వార్తలు ఇచ్చిన తీరు ఒక వరం. వచ్చే ఏడాది జరగాల్సిన పార్లమెంటు ఎన్నికల్లో తన ప్రచారాన్ని ప్రారంభించేందుకు అవసరమైన అజెండాను రూపొందించేందుకు తోడ్పడుతుంది అని కూడా ఆ పత్రిక రాసింది. దీన్ని బట్టి జరుగుతున్నదేమిటో చెప్పేందుకు అరటి పండు ఒలిచి చేతుల్లో పెట్టాల్సిన పనిలేదు. కొస మెరుపు ఏమిటంటే బైడెన్‌తో కలసి మోడీ పాల్గొన్న పత్రికా గోష్టిలో భారత్‌లో మానవహక్కుల ఉల్లంఘనల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని దాటవేశారు. దాన్నే ఎంతో ధైర్యంగా ఆప్రశ్నను మోడీ ఎదుర్కొన్నట్లు ఒక హిందీ ఛానల్‌ యాంకరమ్మ వర్ణించినట్లు కూడా అమెరికా పత్రిక పేర్కొన్నది. రాజులు, రంగప్పల ఆస్థానాల్లో ఉన్న భట్రాజులు(కుల ప్రస్తావన, కించపరచటంగా భావించవద్దని మనవి) స్వర్గం నుంచి చూస్తూ తమ స్థానాన్ని ప్రజాస్వామ్యంలో కొందరు టీవీ యాంకర్లు, విశ్లేషకులు భర్తీ చేశారని భావిస్తూ తమ పొగడ్తలతో పోల్చుకొని ఉండాలి.


గతంలో వారం రోజుల పాటు జరిపిన అమెరికా టూర్‌ నుంచి తిరిగి వచ్చిన తరువాత ప్రధాని నరేంద్రమోడీ తన పాలనలో విదేశాల్లో దేశ ప్రతిష్ట పెద్ద ఎత్తున పెరిగిందని స్వయంగా చెప్పుకున్నారు. అప్పుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలో ఉన్నాడు, ఇప్పుడు జో బైడెన్‌ ఉన్నాడు. తాజా పర్యటన గురించి ఇంకెన్ని కబుర్లు చెబుతారో చూద్దాం. అమెరికా పార్లమెంటులో మోడీ ప్రసంగంలో 79సార్లు హర్వధ్వానాలు చేశారని, 15సార్లు లేచి నిలిచి చప్పట్లు కొట్టారని, ప్రసంగం ముగిసిన వెంటనే ఎంపీలు మోడీతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడినట్లు వార్తలు, దృశ్యాలను చూపారు. భారత సంతతివారు పోటెత్తినట్లు పేర్కొన్నారు.


లండన్‌ కేంద్రంగా ఉన్న హెన్లే పాస్‌ పోర్ట్‌ విశ్లేషణ ప్రకారం 2013లో మన సూచిక 199 దేశాలలో 74లో ఉండగా (52 దేశాలకు ముందుగా వీసాలతో పని లేకుండా వెళ్లి రావచ్చు) అది 2021లో 90కి దిగజారింది. ఆ మధ్యలో ఎగుడు దిగుడులు ఉన్నాయి. ఒక దేశ పాస్‌ పోర్టుతో వీసాలతో నిమిత్తం లేకుండా ఎన్ని దేశాలకు స్వేచ్చగా వెళ్లి రావచ్చు అనేదాన్ని బట్టి ఆ దేశ ప్రతిష్టకు కొలబద్దగా ఈ సూచికను పరిగణిస్తున్నారు. కరోనా కారణంగా అనేక దేశాలు రాకపోకల మీద ఆంక్షలు విధించినందున 2020,21 సంవత్సరాలను ప్రామాణికంగా తీసుకోనవసరం లేదు. 2023లో మన దేశం ఈ సూచికలో 82వ స్థానంలో ఉంది, 59 దేశాలకు స్వేచ్చగా వెళ్లి రావచ్చు. పెరుగుదల ఏడు దేశాలు మాత్రమే. ఇదే పెద్ద గొప్ప అంటారా? ప్రపంచంలో మన దేశ ప్రతిష్ట పెరిగితే నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడు ఉన్న స్థానం కంటే ఇప్పుడు ఎందుకు దిగజారినట్లో మోడీ భక్తులు చెప్పాలి. ఈ కాలంలోనే ప్రపంచంలో ఒంటరిదౌతున్నదని చెబుతున్న చైనా రాంకు 82 నుంచి 62కు పెరిగింది. దేశాల సంఖ్య 81గా ఉంది. ఎవరి పలుకుబడి పెరిగినట్లు ? మొదటి మూడు స్థానాల్లో సింగపూర్‌ 194, జపాన్‌ 192,జర్మనీ, దక్షిణ కొరియా,స్పెయిన్‌,ఇటలీ 191 దేశాలతో మూడవ స్థానంలో ఉన్నాయి. మనకు ఎగువన 140కిపైగా దేశాలు మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. ఇతర అంతర్జాతీయ సూచికల్లో మన స్థానం గురించి వార్తలు వచ్చినపుడు వాటిని మేము గుర్తించం అని బిజెపి సర్కార్‌ చెబుతున్నది. మరి మోడీ దేశ ప్రతిష్టను పెంచినట్లు బిజెపి నేతలు చెప్పేదానికి ప్రాతిపదిక ఏమిటి ? కరోనా నిరోధంలో మోడీ సర్కార్‌ ప్రపంచంలోనే గొప్పగా ప్రశంసలు పొందిందని చెప్పారు, అలాంటపుడు దాని తరువాత వీసా ఆంక్షలను ఇతర దేశాలు మన వారికి ఎందుకు సడలించలేదు ? ఏ దేశమూ వేయనన్ని వాక్సిన్లు వేసినట్లు చెప్పుకుంటారు. ఇంత మంది జనాభా మరో దేశంలో లేదు. మన దేశంలో ఈ ఏడాది జనవరి నాటికి 220 కోట్ల టీకాలు వేస్తే చైనాలో మార్చి 23వ తేదీ నాటికి 351 కోట్లు వేశారు.


ఎన్నికల ప్రజాస్వామ్య సూచికలో మన దేశం అంతకు ముందు ఏడాది వందవ స్థానంలో ఉన్నది కాస్తా 2023లో 108వ స్థానానికి దిగజారినట్లు వి డెమ్‌ (ప్రజాస్వామ్య రకాలు) సంస్థ పేర్కొన్నది.మన కాషాయ దళాలు నిరంతరం పారాయణం చేస్తూ గుర్తు చేసే పాకిస్తాన్‌ మనకు దగ్గరగా 110వదిగా ఉంది. ఎగువన లేకపోవటం మోడీ భక్తులకు కాస్త ఊరట కలిగించే అంశం. నిరంకుశత్వం వైపు వెళుతున్న దేశాల గురించి కూడా ఆ సంస్థ సూచికలను ఇచ్చింది. ప్రపంచ ప్రజాస్వామ్య స్థితి నివేదికల్లో వెల్లడించిన సమాచారం ప్రకారం 1975 నుంచి 1995వరకు మన మార్కులు 59 నుంచి 69కి పెరగ్గా, 2015లో 72, తరువాత 2020లో 61కు తగ్గాయి. ఇలా ఏ సూచికను చూసినా తగ్గుదల తప్ప పెరిగింది లేదు. అలాంటపుడు ప్రపంచ దేశాల్లో మన ప్రతిష్ట పెరుగుతుందని ఎలా నమ్మబలుకుతున్నారో అర్ధం కాదు. సరిహద్దులు లేని విలేకర్ల పేరుతో ఉన్న సంస్థ విడుదల చేసిన సూచిక ప్రకారం పత్రికా స్వేచ్చలో మన స్థానం 2023లో అంతకు ముందున్న స్థితి నుంచి పదకొండు స్థానాలు దిగజారి 180 దేశాలలో 161 దగ్గర ఉన్నాం. మన దేశం ప్రజాస్వామ్య పుట్టిల్లు అని చెప్పిన తరువాత ఉన్న స్థితి ఇది. 2002లో 139 దేశాల్లో 80 మెట్టు దగ్గర ఉంటే 2023నాటికి 81 మెట్లు దిగజారి 180 దేశాల్లో 161 దగ్గర ఉన్నాం. ప్రధాని నరేంద్రమోడీ గద్దె నెక్కినపుడు 140లో ఉన్నాం. తొమ్మిదేండ్లలో మన ప్రతిష్టను మోడీ పెంచారా తగ్గించారా ?


నరేంద్రమోడీ పలుకుబడి అంతగా పెరిగితే పదే పదే ఐరాస సంస్కరణల గురించి చెబుతుంటే విడదీయరాని బంధంలో ఉన్నట్లు చెబుతున్న అమెరికా, ఇతర శాశ్వత దేశాలు భారత్‌కు శాశ్వత ప్రాతినిధ్యం గురించి ఇంతవరకు ఒక నిర్దిష్ట ప్రతిపాదనను ఎందుకు చేయలేదో ఎవరైనా చెబుతారా ? చైనా వీటో చేస్తుందేమో అని కొందరు గొణగవచ్చు, ముందు ప్రతిపాదించాలి గదా ! చైనా మీద ప్రేమతో జవహర్‌లాల్‌ నెహ్రూ మనకు అవకాశం వచ్చినపుడు వదులుకున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.స్వాతంత్య్రం రాకముందే ఐరాస ఏర్పడిందని, ప్రారంభంలోనే చైనా శాశ్వత దేశమని చరిత్ర తెలియని వారికి ఎన్నిసార్లు చెప్పినా అర్ధం కాదు. ఒక దేశాన్ని తొలగించి తాను ఎవరికి కావాలంటే వారికి ఇవ్వటానికి ఐరాస ఏమైనా అమెరికా జేబు సంస్థా ? దానికి నిర్ణయాత్మక సత్తా, అధికారం ఉంటే ఇప్పుడు ఇమ్మనండి ఎవరు వద్దన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే వారి మీద ఆంక్షలు విధిస్తామని అమెరికా బెదరించింది. మోడీ పలుకుబడి కారణంగా వెనక్కు తగ్గిందని చెబుతున్నారు, మరి అదే పలుబడి, చాణక్యం భద్రతా మండలి అంశంలో ఏమైంది ? పుతిన్‌ దగ్గర నుంచి చమురు కొని దాన్ని డీజిల్‌, పెట్రోలు, ఇతర ఉత్పత్తులుగా మార్చి అదే అమెరికా, ఐరోపా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు గనుక అమెరికా చూసీ చూడనట్లు ఉంటోంది తప్ప మోడీ ఘనత ఏముంది ?


అట్లాంటిక్‌ కౌన్సిల్‌ అనే సంస్థ జరిపిన ఒక సర్వేలో 2033 వరకు అసలు భద్రతా మండలి విస్తరణే ఉండదని 64శాతం మంది చెప్పారు. శాశ్వత సభ్యత్వం భారత్‌కు ఇవ్వాలని 26, జపాన్‌కు 11,బ్రెజిల్‌కు 9, జర్మనీకి 7,నైజీరియాకు 4, దక్షిణాఫ్రికాకు రెండు శాతం మంది మద్దతు తెలిపారు. విస్తరణ అంశం నరేంద్రమోడీతో ప్రారంభం కాలేదు, స్వస్తి పలికే అవకాశమూ లేదు.1990 దశకం నుంచే విస్తరణను అడ్డుకోవాలని కొన్ని దేశాలూ కంకణం కట్టుకున్నాయి. దీన్ని కాఫీ క్లబ్‌ అని నిక్‌నేమ్‌ పెట్టారు. దీన్లో ఇటలీ, ఈజిప్టు, పాకిస్తాన్‌, మెక్సికో, కెనడా, టర్కీ, స్పెయిన్‌, అర్జెంటీనా తదితర దేశాలు ఉన్నాయి. ఏకాభిప్రాయ సాధనతో ఏదైనా జరగాలని ఇవి మోకాలడ్డుతున్నాయి. ఈ పూర్వరంగంలో బ్రెజిల్‌, జర్మనీ, భారత్‌, జపాన్‌ 2005లో జి 4 కూటమిగా ఏర్పడి ఉమ్మడిగా మద్దతు సాధించాలని నిర్ణయించుకున్నాయి. ఈ బృందంలో భారత్‌కు మద్దతు ఇస్తాం గానీ జపాన్ను అంగీకరించేది లేదని గతంలోనే చైనా స్పష్టం చేసింది. ఇప్పుడు సంబంధాలు దెబ్బతిన్న పూర్వరంగంలో పూర్వ వైఖరికి కట్టుబడి ఉంటుందని చెప్పలేము. మొత్తంగా చెప్పాలంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నట్లుగా నరేంద్రమోడీ రంగంలోకి వచ్చిన తరువాత ఒక్క అంగుళం కూడా ముందుకు పోలేదు. విశ్వగురువు పలుకుబడి పని చేయటం లేదన్నది స్పష్టం.


మోడీ ఏలుబడిలో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ విమానవాహక యుద్ధ నౌకను ప్రారంభించారని గొప్పగా చెబుతారు. దాని చరిత్రను చూసిన వారెవరూ ఆ ఖ్యాతిని మోడీ ఖాతాలో వేయరు. నౌక రూపకల్పన 1999లో ప్రారంభమై 2022 నాటికి సర్వీసులోకి వచ్చింది. అగ్ని 5 క్షిపణి, ఇస్రో కూడా అలాంటిదే.ఎప్పటి నుంచో ఉన్న కార్యక్రమం అది. వీటి వలన ప్రపంచంలో మన దేశం కూడా అగ్రదేశాల సరసన చేరిందనే పేరు తెచ్చుకుంది. గత ప్రభుత్వాల కొనసాగింపుగా మోడీ సర్కార్‌ కూడా ఈ పధకాలను కొనసాగిస్తున్నది తప్ప మోడీతోనే ప్రారంభమైనట్లు చెప్పుకుంటే ఎలా ? ఇలాంటి వాటిని ఏ దేశమూ స్వల్పకాలంలో సాధించలేదు. కానీ పత్రికా స్వేచ్చ, ప్రజాస్వామ్యం,ఆకలి వంటి అంశాలను మెరుగుపరచేందుకు దశాబ్దాల కాలం అవసరం లేదు. మరి వాటిలో పురోగతి లేకపోగా దేశద్రోహం వంటి చట్టాలు కొనసాగాలని చెబుతుంటే, పరిస్థితులు ఇంకా దిగుజారుతుంటే విదేశాల్లో మన ప్రతిష్ట పెరుగుతుందా ? విదేశాల వారు మరీ అంత అమాయకులా ?