Tags

, , , , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


చందమామ రావే జాబిల్లి రావే అంటూ పాడుకున్నమనం దాని రాకకోసం ఆగకుండా మనమే వెళ్లాం. ఆగస్టు 23న భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలోనే కాదు, ప్రపంచంలోనే ఒక వినూత్న అధ్యాయానికి నాంది పలికింది. చంద్రుడి దక్షిణ ధృవం మీద అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్‌ నిలిచిందంటే దాని వెనుక ఉన్న యావత్‌ ఇస్రో సిబ్బంది దీక్ష, పట్టుదలే కారణం. అందుకు వారిని యావత్‌ జాతి శ్లాఘిస్తోంది.భుజం తట్టి మరిన్ని విజయాలతో ముందుకు పోవాలని మనసారా కోరుకుంటోంది. ఇంతటి మహత్తర విజయం తరువాత ఏమిటి అనే ప్రశ్న, ఉత్కంఠను రేకెత్తించింది. చంద్రయాన్‌-లో భాగంగా విక్రమ్‌ లాండర్‌ దిగిన ప్రాంతానికి ” శివశక్తి ” అని 2019లో చంద్రయాన్‌ -2లో దిగటంలో విఫలమైన ప్రాంతానికి ” తిరంగ ” అని ప్రధాని నరేంద్రమోడీ పేరు పెట్టారు. అనేక పరిశోధనలు, ఫలితాలు, నవీకరణలకు సంబంధిత రంగాల్లో విశేష కృషి చేసిన వారి పేర్లు పెట్టటం ప్రపంచమంతటా ఉన్నదే. దానిలో భాగంగానే లాండర్‌కు విక్రమ్‌ అన్న నామకరణం భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్‌ సారాభారు పేరును చిరస్థాయిగా చేసేందుకే అన్నది తెలిసిందే. పెట్టిన పేరు వివాదాలకు తావు ఇవ్వకుండా ఉత్తేజాన్ని లేదా సందేశాన్ని ఇచ్చేదిగా ఉండాలి. ఆ విధంగా చూసినపుడు రెండు పేర్లూ అభ్యంతరకరమైనవే. చంద్రయాన్‌-2లో విఫలమైన ప్రాంతానికి పనిగట్టుకొని నాలుగేండ్ల తరువాత పెట్టటం ఏమిటి ? ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున ఉంటుందా ? నరేంద్రమోడీ స్పూర్తితో చంద్రుడిని హిందూ దేశంగా, దాని రాజధానిగా విక్రమ్‌ లాండర్‌ దిగిన ప్రాంతాన్ని పార్లమెంటు ప్రకటించాలని సంత్‌ మహాసభ జాతీయ అధ్యక్షుడిగా చెప్పుకుంటున్న చక్రపాణి మహరాజ్‌ అనే హిందూ స్వామి ఒకరు ఆదివారం నాడు డిమాండ్‌ చేశారు. భిన్న భావజాలం కలవారు అక్కడకు చేరి గజ్వా ఏ హింద్‌ (ముస్లింలు జయించిన రాజ్యం) అని ప్రకటించుకోక ముందే ఈ పని చేయాలని అన్నారు. ఇదే ప్రాతిపదిక అయితే చంద్రుడి మీద తొలుత కాలుమోపిన వారు మతరీత్యా క్రైస్తవులు. వారు క్రీస్తు రాజ్యం అని పేరు పెట్టాలన్న ఆలోచన చేయలేదే !


తిరంగ అన్నది మన జాతీయ పతాకను జనం పిలిచే పేరు. ఒక విఫల ప్రయోగానికి దాని పేరు పెట్టటం మొత్తం జాతిని, జాతీయోద్యమాన్ని అవమానించటం తప్ప మరొకటి కాదు. అది బ్రిటీష్‌ వలస పాలకులపై సాగించిన సమర విజయానికి ప్రతీకగా 1947 ఆగస్టు 15న ఎగిరిన పతాకమది.స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వాములు కాకపోవటమే కాదు, బ్రిటీష్‌ వారికి సేవ చేసుకుంటామన్న వారిని ఆకాశానికి ఎత్తుతున్న పాలకులు చంద్రుడిపై లాండర్‌ దిగటంలో విఫలమైన ప్రాంతానికి ఆ పేరు పెట్టటాన్ని ఏమనాలి? అమృతకాలమని, ఆజాదీకా అమృతమహౌత్సవాలు జరిపిన వారు దీనికి పాల్పడటం నిస్సందేహంగా అభ్యంతరకరం. ప్రధాని నరేంద్రమోడీ, మన దేశంలోని ఇతర మూడు రాజ్యాంగ బద్దమైన ఉన్నత పదవుల్లో (రాష్ట్రపతి, ఉపాధ్యక్షుడు, లోక్‌సభ స్పీకర్‌) ఉన్నవారందరూ ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలానికి చెందిన వారే. తిరంగాను జాతీయ పతాకగా ఆర్‌ఎస్‌ఎస్‌ అంగీకరించలేదు, ఆ కారణంగానే స్వాతంత్య్రం వచ్చిన 52 సంవత్సరాల పాటు తమ కార్యాలయాల దగ్గర గానీ, ఇతర చోట్ల ఆ సంస్థ నేతలెవరూ ఎగురవేయలేదు. అజాదీకా అమృతమహొత్సవాల సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో తిరంగాను తమ ప్రొఫైల్‌ పిక్చర్‌గా పెట్టుకోవాలని ప్రధాని మోడీ సలహా ఇచ్చారు. అనేక మంది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు దాన్ని అనుసరించలేదని వార్తలు వచ్చాయి. హర్‌ ఘర్‌ తిరంగా ప్రచారానికి పిలుపునిచ్చిన వారు ఒక జాతివ్యతిరేక సంస్థకు చెందిన వారని 52 సంవత్సరాల పాటు వారు జాతీయపతాకను ఎగురవేయలేదని, వారు ప్రధాని మాట వింటారా అని గతేడాది రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని రాజకీయం చేయవద్దని, తమ అణువణువు దేశభక్తితో ఉంటుందని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పుకున్నాయి.


మూడు రంగుల్లో మూడు అనే పదమే అశుభమని, మూడు రంగులు దేశం మీద మానసిక చెడు ప్రభావాన్ని కలిగిస్తాయని, దేశానికి హానికరమని జాతీయ జెండాపై చర్చ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పింది. ఆ సంస్థ పత్రిక ఆర్గనైజర్‌లో రాసిన ఒక విశ్లేషణలో దాని వైఖరిని వెల్లడించారు. దాన్ని మార్చుకున్నట్లు ఇంతవరకు ఎక్కడా అది చేసిన ప్రకటన లేదు. నాగపూర్‌లోని తమ సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద రాష్ట్ర ప్రేమీ యువదళ్‌ అనే సంస్థకు చెందిన ముగ్గురు బలవంతంగా జాతీయ జెండాను ఎగురవేశారని 2001 జనవరి 26న ఆర్‌ఎస్‌ఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. సదరు ప్రాంగణ పర్యవేక్షకుడు తొలుత వారిని అడ్డుకున్నట్లు చెప్పారు. పది సంవత్సరాలకు పైగా నడిచిన తరువాత తగిన ఆధారాలు చూపలేదని కేసును కొట్టి వేశారు. తిరంగా బదులు జాతీయ పతాకంగా భగవధ్వజం ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధులు చెప్పారు. ఈ మేరకు ఆర్గనైజర్‌ పత్రికలో భగవధ్వజం వెనుక ఉన్న రహస్యం పేరుతో రాసిన ఒక విశ్లేషణలో పేర్కొన్నారు. విధి కారణంగా అధికారానికి వచ్చిన వారు మన చేతుల్లో త్రివర్ణ పతాకాన్ని పెట్టవచ్చు. దాన్ని ఎవరూ గౌరవించరు, హిందువులెవరూ స్వంతం చేసుకోరు ” అని రాశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ మన్మోహన్‌ వైద్య 2018లో చెన్నయిలో లౌకికవాదం మీద జరిగిన ఒక సెమినార్‌లో మాట్లాడుతూ జాతీయ పతాకంలో కాషాయ రంగు ఒకటి మాత్రమే ఉండాలి, ఇతర రంగులు మతోన్మాదానికి ప్రాతినిధ్యం వహిస్తాయి అని సెలవిచ్చారని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక వార్త పేర్కొన్నది. ఆర్‌ఎస్‌ఎస్‌ నేత కల్లాడక ప్రభాకర్‌ భట్‌ 2022 మార్చినెలలో ఒక దగ్గర మాట్లాడుతూ చాలా త్వరలోనే జాతీయ జెండాగా త్రివర్ణ పతాకం స్థానంలో కాషాయ జెండా రానుందని చెప్పారు.


శివసేన(ఉద్దావ్‌)నేత సంజయ రౌత్‌ మాట్లాడుతూ లాండర్‌ దిగిన చోటుకు విక్రమ్‌ సారాభారు లేదా నెహ్రూ పేరు పెట్టి ఉండాల్సిందని అన్నారు. వారు చేసిన కృషి కారణంగానే ఇదంతా జరిగింది అన్నారు. శాస్త్రవేత్తలను మరిచిపోతున్నారు, ప్రతి చోట హిందూత్వను తీసుకువస్తున్నారు. మేము కూడా హిందూత్వ పట్ల విశ్వాసం ఉన్నవారిమే, కానీ కొన్ని అంశాలు శాస్త్రానికి సంబంధించినవి, అక్కడికి హిందూత్వను తీసుకురాకూడదని వీర సావర్కర్‌ చెప్పారని శివసేన నేత అన్నారు. దేశాన్ని హిందూ మత రాజ్యంగా మార్చాలనే అజెండాలో భాగంగా ఇలాంటి వన్నీ చోటు చేసుకుంటున్నాయి. మెజారిటీ హిందువులు చెప్పినట్లు జరగాలి తప్ప ఇతరంగా పరిణామాలు ఉండకూడదనే దురహంకార ధోరణిని ఈ పేరు ప్రతిబింబిస్తున్నది. రెండవది స్వాతంత్య్రం విఫలమైందని జనాలకు చెప్పటం కూడా తిరంగ పేరు పెట్టటం వెనుక దాగుంది.


చంద్రుడిపై లాండర్‌ దిగిన కేంద్రానికి శివశక్తి అని ప్రధాని మోడీ పేరు పెట్టటం సరైనదే అని దానికి ఆయనకు అర్హత ఉందని ఇస్రో చైర్మన్‌గా ఉన్న ఎస్‌ సోమనాధ్‌ ఆదివారం నాడు సమర్ధించారు. శివశక్తి, తిరంగ అనే పేర్లు భారతీయతను ధ్వనిస్తున్నాయని అన్నారు.శివ అనే మాటలో శుభం ఉందని శక్తి అనే పదంలో నారీశక్తి దాగుందని ప్రధాని మోడీ చెప్పారు. శనివారం నాడు స్వంత రాష్ట్రమైన కేరళలోని తిరువనంతపురంలోని భద్రకాళీ, ఇతర ఆలయాలను సోమనాధ్‌ సందర్శించి పూజలు చేశారు. తాను శాస్త్రాన్ని,పరలోకాన్ని నమ్ముతానని అందుకే దేవాలయాల సందర్శన, పురాణాలను చదువుతానని అన్నారు. తాను అన్వేషినని చంద్రుడిని, అంత:కరణాన్ని కూడా అన్వేషిస్తానని చెప్పారు. అది తన జీవితంలో భాగమని, సంస్కృతి అన్నారు. మన ఉనికి, అంతరిక్షంలోకి మన ప్రయాణ అర్ధాలు తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక సంస్థలలో పని చేస్తున్న ఇలాంటి అనేక మందిలో సోమనాధ్‌ ఒకరు. గతంలో ఇస్త్రో నేతలుగా ఉన్నవారి హయాంలో కూడా రాకెట్ల నమూనాలను సుళ్లూరు పేట చెంగాలమ్మ గుడిలో, తిరుపతి వెంకటేశ్వరుడి గుడిలో పూజలు చేయించిన తరువాత ప్రయోగించిన సంగతి తెలిసిందే. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని చెప్పే క్రమంలో మన పరిశోధనలు విఫలమైనా సఫలమైనా అంతా దేవుడి లీల అని చెబుతున్న సంగతి తెలిసిందే. అంతే కాదు, అన్నీ వేదాల్లో ఉన్నాయష, సంస్కృతంలో రాసిన శాస్త్ర విజ్ఞానాన్ని పశ్చిమ దేశాలు తస్కరించి వాటిని తామే కనుగొన్నట్లు చెబుతారని వాదించేవారు ఇటీవల బాగా పెరిగారు. అలాంటి కోవకు చెందిన శాస్త్రవేత్తే సోమనాధ్‌ కూడా. ఈ ఏడాది మే నెలలో మధ్యప్రదేశ్‌లోని మహరిషి పాణిని సంస్కృత, వేద విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ ఆల్జీబ్రా, స్క్కేర్‌ రూట్స్‌, కాలం, ఆర్కిటెక్చర్‌, మెటలర్జీ, వైమానిక పరిజ్ఞానం కూడా తొలుత వేదాల్లోనే కనుగొన్నారని చెప్పారు. ఈ అంశాలన్నీ అరబ్‌ దేశాల ద్వారా ఐరోపాకు చేరినట్లు, తరువాత వాటిని పశ్చిమ దేశాల శాస్త్రవేత్తలు కనుగొన్నట్లు ప్రకటించారని అన్నారు. సంస్కృతంలో రాసిన వాటిని పూర్తిగా పరిశోధించి ఉపయోగించుకోలేదని సోమనాధ్‌ చెప్పారు. ఇలాంటి కబుర్లు చెప్పేవారు ఇస్రో కేంద్రాలతో సహా, ఇతర శాస్త్రపరిశోధనా సంస్థలలో శాస్త్రవేత్తల బదులు సంస్కృత పండితులను నియమించి పరిశోధనలు జరిపితే ఎంతో ఖర్చు కలసి వచ్చేది. ఈ కబుర్ల మీద వారికి నిజంగా నమ్మకం ఉంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు, వెంటనే ఆపని చేయవచ్చు.విజ్ఞానమంతా వేదాల్లో , సంస్కత గ్రంధాల్లో వుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. వాటిని వెలికి తీసి దేశానికి మేలు చేసి పక్కా దేశభక్తులని నిరూపించుకోండని చేసిన సూచనలను ఏ ఘనాపాఠీ, సంస్కత పండితులు పట్టించుకోలేదు. ఎందుకంటే దేవుడు నైవేద్యం తినడనే నిజం పూజారికి తెలిసినట్లుగా మరొకరికి తెలియనట్లే వాటిలో కావలసినంత అజ్ఞానం తప్ప విజ్ఞానం లేదని పండితులకు బాగా తెలుసు. ఇస్రో లేదా మరొక శాస్త్ర పరిశోధనల్లో పని చేస్తున్న శాస్త్రవేత్తలు అలా కాదు, వారిలో నిజాయితీ వుంది, తాము నమ్మిన దాన్ని ఆచరణలో పెట్టేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు. వారిని మరింతగా ప్రోత్సహించాలంటే వాటిని నిరుత్సాహపరిచే అశాస్త్రీయ భావాల ప్రచారాన్ని కట్టిపెట్టాలి.


దేశంలో ఇలాంటి తాతగారి నాన్నగారి భావాలను పెంచి పోషిస్తున్న కారణంగానే అనేక మంది రెచ్చిపోతున్నారు. బిజెపి ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన కంగన రనౌత్‌ చంద్రయాన్‌ గురించి స్పందించారు. ఇస్రో మహిళా శాస్త్రవేత్తలు ఉన్న ఒక ఫోటోను తన ఇనస్టాగ్రామ్‌లో పోస్టు చేసి వారంతా బిందీ, సింధూరాలు, తాళిబట్లు ధరించి ఉన్నారని, ఉన్నత ఆలోచనలు, సాధారణ జీవితాలల భారతీయతకు ప్రతీకలని పేర్కొన్నారు. ఇలా చెప్పటం ద్వారా ఆమె జనాలకు ఏ సందేశం ఇవ్వదలచుకున్నారు ? చంద్రయాన్‌-1 చంద్రుడి ఉపరితలం మీద ఉన్న ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు ఉద్దేశించారు. రెండు సంవత్సరాల పాటు పరిశోధనకు పంపిన ఉపగ్రహం 2008 నవంబరు 14న అక్కడకు వేరుకుంది. ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్‌ కలాం అజాడ్‌ సూచన మేరకు అది దిగిన చోటును ప్రధమ ప్రధాని జవహర్‌లాల్‌ నెగ్రూ కేంద్రం అని పేరు పెట్టారు.అయితే అది 312 రోజులు మాత్రమే పని చేసింది.2009 ఇస్రో కేంద్రం నుంచి సంబంధాలు తెగిన తరువాత ఆచూకీ తెలియలేదు. తరువాత అమెరికా నాసా కేంద్రం కనుగొన్న సమాచారం ప్రకారం 2016వకు క్షక్ష్యలో తిరుగుతూనే ఉంది. అది పంపిన సమాచారంలో చంద్రుడి మీద నీరు ఉన్నట్లు తేలింది. అది దిగిన కేంద్రానికి నెహ్రూ పేరు పెట్టటం మీద ఎలాంటి వివాదం తలెత్తలేదు. కానీ చంద్రయాన్‌ -3 లాండర్‌ దిగిన చోటుకు నరేంద్రమోడీ శిశశక్తి అని పెట్టటం వివాదాస్పదమైంది. ఒక మతానికి ప్రతీక అయిన పేరు పెట్టటం ఏమిటన్నది ప్రశ్న. ఇప్పటికే భారత్‌లో మతశక్తులు రెచ్చిపోతున్నారని భావిస్తున్న విదేశాల్లో మన దేశ ప్రతిష్ట మరింత దిగజారుతుంది తప్ప మరొకటి కాదు.ది. భారత్‌ వారసత్వంలో అనేక మతాలు ఉన్నాయి, వాటన్నింటినీ తోసి పుచ్చి హిందూ ఒక్కటే వారసురాలని చరిత్రను వక్రీకరిస్తున్నారు. ఒకనాడు పెద్ద ఎత్తున విలసిల్లిన బౌద్ద, జైన మతాలు మన దేశంలో పుట్టినవి తప్ప విదేశాల నుంచి వచ్చినవి కాదు. అసలు అన్నింటికంటే కుల, మతాలకు అతీతంగా ఉన్న మనశాస్త్రవేత్తల సమిష్టి కృషికి వైజ్ఞానిక గుర్తింపు ఇవ్వాల్సి ఉండగా మతం రంగు పులమటం దుష్టఆలోచనకు ప్రతిరూపం తప్ప మరొకటి కాదు. జవహర్‌ పేరు లౌకిక వాదానికి శివశక్తి మతవాదానికి ప్రతీకలు. ఇది మత ప్రాతిపదికన సమాజం మరింతగా చీలిపోవటానికి దోహదం చేస్తుంది.మతం పేరుతో జరిపే వాటికి రానున్న రోజుల్లో ఇతర దేశాలు ఏమేరకు సహకరిస్తాయన్నది ప్రశ్న.


చంద్రయాన్‌ -2 ప్రయోగం విజయవంతంగా కావాలని మఠాధిపతులు, గుడి పూజారులు, చిన్న దేవుళ్లు, దేవతలు, పెద్ద వెంకటేశ్వరస్వామి ఆశీర్వచనాలు, వాట్సాప్‌ భక్తులు చేసిన పూజలు ఫలించలేదు. అందుకుగాను వారెవరూ ఏడ్చినట్లు చూడలేదు గానీ ఇస్రో అధిపతి శివన్‌ ఏడ్చేశారు.ౖ ఒక ప్రయోగం విఫలమైనపుడు, మరొకటి సఫలమైనపుడు శాస్త్రవేత్తలు, సమాజం భావోద్వేగాలకు గురి కావటం సహజం. మన చంద్రయాన్‌ మాదిరే ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు మన ఖర్చులో సగంతో ఒక ప్రయోగం జరిపారు. అది 2019 ఏప్రిల్‌ 19వ తేదీన చివరిక్షణాల్లో సమాచార వ్యవస్ధతో సంబంధాలు తెగిపోయి, మన ప్రయోగం మాదిరే జయప్రదం కాలేదు. మన దేశంలో మాదిరి దశ్యాలు,ఓదార్పులు అక్కడ లేవు. చంద్రయాన్‌-2 ప్రయోగానికి ముందు సామాజిక మాధ్యమంలో ఒక అంశం చక్కర్లు కొట్టింది. ” చంద్రయాన్‌-2 ప్రయోగానికి అంతా రెడీ, కానీ ఎక్కడో ఏదో చిక్కుముడి తెమలడం లేదు, తేలడం లేదు లెక్క తెగడమే లేదు.900 కోట్ల ప్రాజెక్టు. కోట్ల మంది భారతీయుల ఆశలు. ప్రపంచ కన్ను . ఇస్రో ఛైర్మన్‌కు ఓ సీనియర్‌ సైంటిస్టు ఓ సలహా ఇచ్చాడు. ఇస్రో శివన్‌ కూడా ప్రతిదీ వినే తరహా, దేన్నీ తేలికగా తీసేసే రకం కాదు. ఆ సలహా ఏమిటంటే..? ‘పూరి శంకరాచార్యను కలుద్దాం సార్‌, ఆయన ఏమైనా పరిష్కారం చెప్పవచ్చు, తను ఓ క్షణం విస్తుపోయాడు, ఆధునిక గణితవేత్తలు, అంతరిక్ష శాస్త్రవేత్తలు, భౌతికశాస్త్ర పరిశోధకులకే చేతకానిది ఓ కాషాయగుడ్డల సన్యాసికి ఏం తెలుసు అని బయటికి వెల్లడించలేదు తన మనసులో భావాన్ని..! కానీ వాళ్లు వెళ్లలేదు స్వామివారినే శ్రీహరికోటకు రమ్మని ఆహ్వానించారు ఆయన వచ్చాడు,చూశాడు. ఆ లెక్కను చిటికెలో సాల్వ్‌ చేసేశాడు శంకరాచార్య అలియాస్‌ నిశ్చలానంద సరస్వతి. ఆయన ఎదుట అక్షరాలా భక్తిభావంతో సాగిలపడ్డాడు ఇస్రో చీఫ్‌. ” ఇలా సాగింది. ఇది కచ్చితంగా ఫేక్‌ ప్రచారమే. ఇస్రో అంటే ఏదో గణిత శాస్త్ర సంస్ధ అన్నట్లు, లెక్కల చిక్కు ముడి పడినట్లు చిత్రించారు. ఇలా చెప్పటం నిజంగా మన శాస్త్రవేత్తలను అవమానించటం, స్వామీజీలు, బాబాలకు లేని ప్రతిభను ఆపాదించటం తప్ప మరొకటి కాదు. ప్రతి అంతరిక్ష ప్రయోగానికి ముందు వాటి ప్రతిమలతో తిరుపతి వెంకన్న , సుళ్లూరు పేట చెంగాలమ్మ దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు. చంద్రయాన్‌-2కు నాటి ఇస్రో అధిపతి కె శివన్‌ వుడిపి శ్రీకష్ణ మఠాధిపతి ఆశీస్సులు కూడా అందుకున్నారు. ఇక వాట్సాప్‌ భక్తులు, ఇతరులు చేసిన వినతులకు కొదవ లేదు. మరి శంకరాచార్య లెక్కలేమయ్యాయి. దేవుళ్ల కరుణాకటాక్షం, మఠాధిపతుల, తిరుపతి వేద పండితుల ఆశీర్వాచనాల మహత్తు, శక్తి ఏమైపోయినట్లు ? మూఢనమ్మకాలను పెంచే, శాస్త్రవిజ్ఞానం మీద పూర్తి నమ్మకంలేని తరాలను మనం తయారు చేస్తున్నాము. దీనికి తాజాగా ప్రస్తుత ఇస్రో అధిపతి సోమనాధ్‌ కూడా జతకలిశారు. అన్నీ వేదాల్లోనే ఉన్నాయష బాపతు పక్కన చేరారు.


చంద్రయాన్‌ 2 విఫలం కాదు, ప్రయోగాలలో అది ఒక భాగమే. ఆర్యభట్ట నుంచి సాగుతున్న విజయాల పరంపరలో ఇదొక ప్రయోగం. వైఫల్యాలతో గతంలో ఏ శాస్త్రవేత్త కుంగిపోలేదు. నిరాశపడలేదు. అది అసలు వారి లక్షణం కాదు. వారి ప్రయోగాలు విజయవంతం కావాలని, అది దేశానికి వుపయోగపడాలని అందరూ కోరుకుంటున్నారు. చంద్రయాన్‌ 1లో 2008లోనే దాదాపు 10 నెలలపాటు మన పరిశోధనలు చంద్రునిపై సాగాయి, కొన్ని లోపాలు ఉన్నా అది విజయమే, ప్రపంచంలో స్థానం ఆనాడే సాధించాము. చంద్రయాన్‌ 2 లో ఆర్బిటర్‌ లక్షణంగా పని చేసింది. లాండర్‌ మాత్రమే విఫలమైంది. ఇప్పుడు చంద్రయాన్‌-3లో ఆ లోపాన్ని కూడా అధిగమించాము. ఇందుకు గాను మన శాస్త్రవేత్తలను యావత్‌ లోకం వేనోళ్ల కొనియాడుతున్నది.


నరేంద్రమోడీ సర్కార్‌ వుగ్రవాదులు, నల్లధనం వున్న వారి మీద కంటే మేధావులు, శాస్త్ర పరిశోధనల మీద సమర్దవంతంగా మెరుపు దాడులు చేసిందని (సర్జికల్‌ స్ట్రెక్స్‌ ) ప్రముఖ చరిత్ర కారుడు రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు. 2014లో అధికారానికి వచ్చినప్పటి నుంచి మేథావుల మీద నిరంతరం యుద్ధం సాగిస్తున్నదని, ఒక విశ్వవిద్యాలయం తరువాత మరొక విశ్వవిద్యాలయాన్ని, పరిశోధనా సంస్ధలను లక్ష్యంగా చేసుకొని వాటి విశ్వసనీయతను దెబ్బతీస్తున్నదని పేర్కొన్నారు. మన పూర్వీకులు ప్లాస్టిక్‌ సర్జరీ చేశారని, కత్రిమ గర్భధారణ పద్దతులను అభివద్ధి చేశారని స్వయంగా నరేంద్రమోడీయే చెప్పారు. ఇలాంటి ఆధారం లేని ఆశాస్త్రీయ ప్రచారాలను చేయటంలో మోడీని ఆయన మంత్రులు పెద్ద ఎత్తున అనుకరిస్తున్నారు.ఇలాంటి విషయాలను (చెప్పింది వినటం తప్ప ప్రశ్నించటానికి సాహసం చేయని) ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖల్లో లేదా ప్రయివేటు సంభాషణల్లో కాదు, ఏకంగా సైన్స్‌ కాంగ్రెస్‌లోనే చెప్పారని రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు. నరేంద్రమోడీ నాలుగు సంవత్సరాల తరువాత చంద్రయాన్‌-2లో లాండర్‌ విఫలమైన చోటుకు తిరంగా అని పెట్టటం జాతీయ పతాకను అవమానించటం, తాజాగా జయప్రదంగా దిగిన చోటుకు శివశక్తి అని పేరు పెట్టటం మత అజెండాను ముందుకు తీసుకుపోవటంలో భాగంగా భావించటం తప్పువుతుందా ?