Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఆమె మూడు పదులు నిండకుండానే అన్ని విధాలుగా పేరు మోసిన కట్టర్‌ హిందూత్వ వాది. అతడు తన మఠం, కాషాయ దుస్తులతో మోసానికి పాల్పడిన మరో కట్టర్‌. వీరితో చేతులు కలిపిన మరో నలుగురితో కలసి వారు ఇప్పుడు బెంగలూరు పోలీసు కస్టడీలో ఉన్నారు. కర్ణాటకలో పక్కా హిందూత్వ వాదులుగా జనంలో ప్రాచుర్యం పొందిన వారు. ఇప్పుడు పక్కా మోసకారులుగా పోలీసుల చేతికి చిక్కారు. సంవత్సరాల తరబడి వారిని ఉపయోగించుకున్న బిజెపి, ఇతర హిందూత్వ సంస్థలు ఇప్పుడు వారితో తమకేమీ సంబంధం లేదని నమ్మబలుకుతున్నాయి. ఉద్రేక, ఉన్మాద ఉపన్యాసాలు చేసి రెచ్చగొట్టటంలో పేరు మోసిన హిందూత్వ నేతగా పేరున్న చైత్ర కుందాపుర, శ్రీ హలస్వామి మహాసంస్థాన్‌మఠ అధిపతి అభినవ హలస్వామి, వారితో చేతులు కలిపిన బిజెపి యువమోర్చ నేతలు, ఇతరులు ఈ కేసులో ఉన్నారు. అధికారంలో ఉన్న పెద్దలతో తమకు ఉన్న సంబంధాలను ఉపయోగించి నామినేటెడ్‌ పోస్టులు, కాంట్రాక్టులు, ఎన్నికల్లో పోటీకి టిక్కెట్లు ఇప్పిస్తామంటూ డబ్బులు కొట్టేసేవారి గురించి బయటకు తెలిసేది తక్కువ. ఎందుకంటే చెప్పుకుంటే పరువుపోతుందని అనేక మంది తేలుకుట్టిన దొంగల మాదిరి కిమ్మనరు. కర్ణాటకలో ఇప్పుడు బిజెపి టిక్కెట్ల కుంభకోణం వెల్లడి కావటంతో ఆ పార్టీ ఇప్పుడు ఇరుకున పడింది.తమకేమీ సంబంధం లేదని పార్టీ నేతలు చెబుతుండగా, అగ్రనేతల ప్రమేయం ఉందని కేసుల్లో అరెస్టయిన వారు అంటున్నారు. బిజెపిలో టిక్కెట్లు ఎలా సంపాదించుకొనే అవకాశం ఉందో ఈ మోసం వెల్లడిస్తున్నది.


ఇంతకీ జరిగిందేమిటంటే బిజెపి టికెట్‌ వస్తే దాంతో గెలిచి ఇబ్బడి ముబ్బడిగా సంపాదించవచ్చనే దురాశతో గోవిందబాబు పూజారి అనే వ్యాపారవేత్త పైన చెప్పుకున్న మోసగాళ్ల ముఠాకు ఐదు కోట్లు సమర్పించుకున్నట్లు సెప్టెంబరు ఎనిమిదిన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ప్రధాన నిందితుల్లో చైత్ర కుందాపుర, ఆమె అనుచరులను పోలీసు అరెస్టు చేశారు.ఈ వార్త తెలియగానే మరో ప్రధాన నిందితుడు అభినవ హలస్వామి కాషాయ దుస్తులు పక్కన పడేసి మారు వేషంలో తప్పించుకున్నాడు. టీ షర్టు, షార్టు (లాగు కంటే ఎక్కువ, పాంట్స్‌ కంటే తక్కువ పొడవు) వేసుకొని పారిపోతుండగా ఒడిషా పోలీసులు పట్టుకున్నారు. ఉడిపి జిల్లాలోని బైందూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తనకు బిజెపి టిక్కెట్‌ ఇస్తామంటూ డబ్బు తీసుకొని మోసం చేశారని గోవిందబాబు పూజారి అనే వ్యాపారవేత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాని, కేంద్ర హౌం మంత్రి కార్యాలయం,ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలతో తమకు ఉన్న సంబంధాల గురించి చెప్పి డబ్బు వసూలు చేశారన్నది వారి మీద మోపిన నేరం. తనకు ఒకరిని పరిచయం చేసి అతగాడు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత అని చెప్పారని బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీకి నిధులు అవసరమంటూ చెప్పటంతో అతగాడికి మూడు కోట్లు, మరో రెండు కోట్లు చైత్ర అనుచరులకు చెల్లించినట్లు పూజారి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. డబ్బు తీసుకున్నప్పటి నుంచి వారంతా తప్పించుకుంటున్నారని తెలిపాడు.


అనేక రాష్ట్రాలలో ఇలాంటి మోసగాళ్లు ఎందరో ఉన్నారు. కర్ణాటకలో 2020లో బెంగలూరు పోలీసులు స్వామి అలియాస్‌ సేవాలాల్‌ అనే జ్యోతిష్కుడు యువరాజ్‌ రామదాస్‌ను అరెస్టు చేశారు.అతగాడు 2014 నుంచి 2020వరకు అనేక మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఒక గవర్నర్‌, ఒక కేంద్ర మంత్రి, ఒక రాజ్యసభ సభ్యుడితో తనకు సన్నిహిత సంబంధాలున్నట్లు చెప్పేవాడు.2015లో జౌళిశాఖ కేంద్ర మంత్రిగా ఉన్న సంతోష్‌ గాంగవార్‌కు శ్రీకాళహస్తికి చెందిన కోలా ఆనందకుమార్‌ అనే వ్యక్తిని పరిచయం చేశాడు. కేంద్ర సిల్క్‌బోర్డు చైర్మన్‌ పదవి ఇప్పిస్తానంటూ ఒకటిన్నర కోట్ల రూపాయలు వసూలు చేశాడు. ఈ స్వామికి ఒక ప్రముఖ బిజెపి నేత తనను పరిచయం చేసినట్లు, తన దగ్గర డబ్బు తీసుకున్న తరువాత పదవీ లేదు, స్వామి ముఖంచాటేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆనందకుమార్‌ పేర్కొన్నారు. సదరు స్వామి ఒక ఎంపీని తిరిగి నామినేట్‌ చేయిస్తానని ఇరవై కోట్లు, కర్ణాటక హైకోర్టు మాజీ మహిళా జడ్జికి గవర్నర్‌ పదవి ఇప్పిస్తానంటూ ఎనిమిదిన్నర కోట్లు కోట్లు వసూలు చేశాడు. బిఎస్‌ ఇంద్ర కళ అనే ఆ మాజీ జడ్జి నగదు రూపంలో నాలుగున్నర కోట్లు, ఆర్‌టిజిఎస్‌ ద్వారా రు.3.77 కోట్లు చెల్లించారు. ఆమెను ఢిల్లీ తీసుకువెళ్లి కొంత మంది బిజెపి అగ్రనేతలను పరిచయం చేశారట.ఆమె 2020లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయమూర్తులుగా ఎలాంటి వారు ఎంపిక అవుతున్నారు, గవర్నర్‌ పదవులను కొనుక్కోవటం ఎంత సులభంగా ఉంటుందో డబ్బు, పలుకుబడి కలవారి ప్రయత్నాల గురించి ఈ ఉదంతం వెల్లడించింది.బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలతో ఉన్న పలుకుబడితో తన కుమారుడికి ఉద్యోగం ఇప్పించమని ఒక డాక్టర్‌ 30లక్షలు సమర్పించుకున్నారట.2019లో స్వామి తనను పది కోట్లకు మోసం చేసినట్లు శశికాంత్‌ బంద్రే అనే వాణిజ్యవేత్త ఫిర్యాదు చేసిన తరువాత పైన పేర్కొన్న మోసాలన్నీ వెలుగులోకి వచ్చాయి.


ఇక హిందూత్వ నాయకురాలు చైత్ర కుందాపూర్‌, ఆమె గాంగ్‌ మోసం చేసిన తీరు గురించి పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. మోసగాళ్ల ముఠాలో స్వామీజీతో పాటు కబాబ్‌లు తయారు చేసి అమ్ముకొనే వ్యక్తి , ఒక క్షురకుడు ఉన్నారు.తమ సైద్ధాంతిక గురువు ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి, ప్రధాని కార్యాలయంలో తనకు పెద్ద తలకాయలు ఎందరో తెలుసని చైత్ర ప్రచారం చేసుకుంది. 2022లో వ్యాపారవేత్త పూజారికి ప్రసాద్‌ బైదూర్‌ అనే వ్యక్తిని పరిచయం చేసి అతను బిజెపి కార్యకర్త అని చెప్పారు. చైత్ర తలచుకుంటే రాష్ట్రంలో, కేంద్రంలో ఏదైనా సాధించగలదని అతను పూజారిని నమ్మించాడు. అది బాగా పని చేసిందని గ్రహించిన తరువాత ఆ ముఠా గగన్‌ కదూర్‌, రమేష్‌ నాయక్‌ అనే వారిని పరిచయం చేశారు. రమేష్‌ తన పేరును దాచి తాను చిక్‌మగళూరుకు చెందిన విశ్వనాధ్‌ అనే ఆర్‌ఎస్‌ఎస్‌ నేతనని గత 45 ఏండ్లుగా పని చేస్తున్నట్లు నమ్మించాడు. తరువాత బెంగలూరులోని ధనికులు నివాసం ఉండే ప్రాంతంలో చెన్నా నాయక్‌ అనే అతన్ని బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడని పరిచయం చేశారు. ఒక పర్యావరణవేత్త, పద్మశ్రీ అవార్డు పొందిన 110 సంవత్సరాల తిమ్మక్క కుమారుడు ఉమేష్‌తో గగన్‌ కదూర్‌కు పరిచయం ఉంది. ఆమెకు వయసు పైబడటంతో కాబినెట్‌ స్థాయి కల్పించి ఒక కారు కూడా ఇచ్చారు.ఉమేష్‌ను ఒప్పించి ఆ కారులో చెన్నానాయక్‌, ఇతర ముఠా పూజారిని కలిశారు. అధికారిక కారును చూసి నిజంగానే పలుకుబడి కలిగిన వారని పూజారి నమ్మాడు. టిక్కెట్‌ కనుక రాకపోతే ఇచ్చిన సొమ్ము పూర్తిగా తిరిగి ఇస్తామని రమేష్‌ నాయక్‌ నమ్మబలికాడు. మూడు రోజుల్లో 50 లక్షలు, తరువాత మూడు కోట్ల మేర వసూలు చేశారు. ఆ సొమ్ములో ఒకటిన్నర కోట్లు అభినవ హలశ్రీ స్వామి అనే మఠాధిపతికి చెల్లించినట్లు పూజారి పేర్కొన్నాడు.2022 జూలై ఏడు నుంచి 2023 జనవరి 16 వరకు మొత్తం ఐదు కోట్లు సమర్పించుకున్నాడు.


బిజెపి అభ్యర్ధులను ప్రకటించటానికి కొద్ది రోజుల ముందు కాశ్మీరులోని ఒక ఆసుపత్రిలో ఆర్‌ఎస్‌ఎస్‌నేత విశ్వనాధ్‌ మరణించినట్లు గగన్‌ కదూర్‌ చెప్పాడు. అనుమానం వచ్చిన పూజారి విచారించగా అసలు ఆ పేరుగల వ్యక్తి లేడని తేలింది.దాంతో తన డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేయటంతో మోసగాళ్ల ముఠా తప్పించుకు తిరిగింది.చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అరెస్టు చేశారు. సెప్టెంబరు పన్నెండు నుంచి హలశ్రీ స్వామి పరారీలో ఉండి పందొమ్మిదవ తేదీ రాత్రి ఒడిషా పోలీసులకు చిక్కాడు. ఇంతకీ రమేష్‌ నాయక్‌ చిక్‌మగలూర్‌లోని ఒక క్షురకుడు అని తేలింది. చెన్నానాయక్‌ బెంగలూర్‌ కెఆర్‌ పురంలో వీధుల్లో కబాబ్‌లు అమ్ముతాడని పోలీసులు గుర్తించారు. పూజారి నుంచి కొట్టేసిన సొమ్ములో భారీ మొత్తాని చైత్ర నొక్కేసింది. కుందాపురలోని ఒక సహకార బాంకులో రు.1.8 కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసినట్లు, రు.65లక్షలు పెట్టి బంగారు నగలు కొన్నట్లు, మరో రు.40లక్షలను ఒక బంధువు సాయంతో శ్రీరామ్‌ బాంక్‌లో డిపాజిట్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మరొక బాంకులాకర్‌ నుంచి రు.23లక్షల బంగారు బిస్కట్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒక నలభై లక్షలు వెచ్చింది చైత్ర తనకు కొత్త ఇంటి నిర్మాణంతో పాటు తన సోదరి ఇంటిని 15లక్షలతో మరమ్మతు చేయించినట్లు, పన్నెండు లక్షలతో కియా కారు కొన్నట్లు తేలింది. గగన్‌ కదూర్‌ వివాహానికి రు.35లక్షలు ఖర్చు చేసి పది లక్షలతో కొత్త కారు కొన్నారు, రమేష్‌ నాయక్‌ రు.1.5లక్షలు, చెన్నా నాయక్‌కు రు.93వేలు ఇచ్చారు. తమ ముఠాలోని ఆరుగురు మూడు కోట్లు తీసుకున్నట్లు చైత్ర పోలీసులకు వెల్లడించింది. స్వామీజిని అరెస్టు చేస్తే దీని వెనుక ఉన్న పెద్దల గురించి తెలుస్తుందని కూడా చెప్పిందని పోలీసులు చెప్పారు.ఆమెను ప్రశ్నిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకేమీ కాలేదని తరువాత తేలింది. బిజెపి నేత ఒకరు ఈ ముఠావెనుక ఉన్నట్లు రాష్ట్ర మంత్రి ఆర్‌బి తిమ్మాపూర్‌ ఆరోపించారు. కొంత మందికి టిక్కెట్లు రాకపోవటంతో ఇలాంటి మోసాలన్నీ వెలుగు చూస్తున్నాయని మాజీ సిఎం, బిజెపి నుంచి కాంగ్రెస్‌లో చేరిన జగదీష్‌ షెట్టార్‌ అన్నారు.రియలెస్టేట్‌ బిజినెస్‌లో ఉన్నవారికి టిక్కెట్లు ఇచ్చారని విమర్శించారు. అరెస్టు చేసిన వారెవరూ అసలు తమకు తెలియదని బిజెపి నేతలు చెబుతున్నారు.ఈ కేసులో ఇప్పటి వరకు 80శాతం కొట్టేసిన సొమ్ము ఆచూకీ దొరికినట్లు పోలీసులు చెప్పారు.


ఒకటిన్నర కోట్లు తీసుకున్న హలశ్రీ స్వామి తప్పించుకోగా అతని కారు డ్రైవర్‌ పోలీసులకు దొరికాడు. సెప్టెంబరు ఎనిమిదవ తేదీన గోవింద పూజారి కేసు దాఖలు చేశారు. పన్నెండవ తేదీన చైత్రను ఉడిపిలో అదుపులోకి తీసుకున్నారు. అది తెలిసిన స్వామి ఆ రోజు హాజరు కావాల్సిన ఒక కార్యక్రమానికి వెళ్ల కుండా తప్పించుకున్నాడు. మైసూరు పారిపోయే ముందు నాలుగు కొత్త సిమ్‌ కార్డులు, నాలుగు కొత్త ఫోన్లు కొన్నాడట, పారిపోతున్నపుడు కారు నంబరు ప్లేటును తొలగించారు, తరువాత కారును ఒక బంధువు ఇంట్లో ఉంచి, కర్ణాటక నుంచి తప్పించుకున్నాడు. భువనేశ్వర్‌ నుంచి బుద్ధ గయకు రైలులో వెళుతుండగా కటక్‌ వద్ద పోలీసులకు దొరికాడు. మైసూరు నుంచి హైదరాబాద్‌, పూరీ, కోణార్క్‌ వెళ్లి అక్కడి నుంచి వారణాసి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులకు దొరికాడు. గోవింద పూజారి నుంచి తీసుకున్న సొమ్ముతో వ్యవసాయ భూమి కొనుగోలు, ఒక పెట్రోలు బంకులో పెట్టుబడి పెట్టినట్లు చెబుతున్నారు.


విద్యార్ధినిగా ఉండగా ఎబివిపిలో పని చేసిన చైత్ర కొన్ని పత్రికల్లో జర్నలిస్టుగా, స్పందన అనే టీవీలో యాంకర్‌గా పని చేసింది. హిందూత్వ కార్యకర్తగా మైనారిటీల మీద రెచ్చగొట్టే ప్రసంగాలతో అనేక పాత్రల్లో కనిపించిన చైత్ర 2018లో ఉడిపి పట్టణంలో కాంగ్రెస్‌ మీద ధ్వజమెత్తి వెలుగులోకి వచ్చింది. కేంద్ర మంత్రులు కూడా ఆమెను ఆకాశానికి ఎత్తారు. ముస్లింల మీద విద్వేష పూరిత ప్రసంగాలు చేసినందుకు ఆమె మీద కేసులు కూడా నమోదు చేశారు.ఈ ఉపన్యాసాలకు భజరంగ్‌దళ్‌, విశ్వహిందూపరిషత్‌ ఏర్పాటు చేసిన ప్రదర్శనలు, సభలు, సమావేశాలే వేదికలు.2021లో ఒక సభలో ముస్లింలు, క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇరవై మూడు శాతం ఉన్న మీకే ఇంత అహం ఉంటే 70శాతంగా ఉన్న హిందువులకు ఎంత ఉండాలి ?ఇదే మీకు చివరి హెచ్చరిక, మీరు గనుక లౌ జీహాద్‌ను మానుకుంటేనే మీరు బతికి ఉంటారు, 70శాతం హిందువులు 23శాతం మందిని మార్చాలని అనుకుంటే, లౌ జీహాద్‌కుపూనుకుంటే రెండు రోజులు చాలు మీ ఇండ్లలో ఒక్క బుర్కా కూడా కనిపించదు. మేము ప్రతి ముస్లిం యువతి నుదుటి మీద తిలకం దిద్దుతాం అని రెచ్చగొడుతూ మాట్లాడారు. ఆమె గత ఎన్నికల్లో బిజెపి తరఫున ప్రచారం చేశారు. శ్రీరామ్‌ సేన నేత ప్రమోద్‌ ముతాలిక్‌తో కలసి వేదికలను పంచుకున్నది. రెచ్చగొట్టే ప్రసంగాలు శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్నందును కలుబుర్గి జిల్లాలో అలంద్‌ తాలుకాలో వారం రోజుల పాటు తిరగ కుండా జిల్లా కలెక్టర్‌ ఈ ఏడాది ప్రారంభంలో నిషేధం విధించారు. 2018లో సర్పపూజ్‌ ఎలా చేయాలనే అంశంపై గొడవ పడి గురుప్రసాద్‌ పంజా అనే హిందూ జాగరణ్‌ వేదిక కార్యకర్తమీద చేయి చేసుకున్న కేసులో అరెస్టయింది.


అవివాహిత అయిన చైత్ర కుందాపుర మీద ఉడిపిలో బిజెపి కార్యకర్త సుధీన్‌ ఒక కేసు దాఖలు చేశాడు. తన కోసం ఒక దుకాణాన్ని కట్టిస్తానని చెప్పి ఆమె ఐదు లక్షలు తీసుకున్నదని, అది చేయకపోగా సొమ్ము వాపసు అడిగితే అత్యాచారం చేసినట్లు కేసు పెడతానని , హత్య చేయిస్తానని బెదిరించినట్లు పేర్కొన్నాడు. బిజెపి టిక్కెట్‌ పేరుతో సొమ్ము తీసుకున్న వ్యాపారి పూజారిని కూడా బెదిరించినట్లు వెల్లడైంది. అరెస్టుకు ముందు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు ఒక లేఖ రాసి అతని వాణిజ్య లావాదేవీల మీద విచారణ జరపాలని, దర్యాప్తుకు తాను సహకరిస్తానని పేర్కొన్నది. తాను జర్నలిస్టుగా ఉన్నప్పటి నుంచి గోవిందబాబు పూజారి తెలుసునని, బిజెపి టిక్కెట్‌ కోసం చూశాడని, తాను ఒక ప్రైవేటు కంపెనీలో పని చేసినపుడు అతని అక్రమ లావాదేవీల గురించి తెలుసుకున్నట్లు రాసింది. అతని అక్రమాలను బయట పెట్టేందుకు అతనితో సంబంధాల్లో ఉండి సమాచారం సేకరించినట్లు చెప్పుకుంది. చిత్రం ఏమిటంటే సదరు పూజారికి ఎంఎల్‌ఏ టిక్కెట్‌ రాకున్నా, ఎన్నికలకు ముందు బిజెపి వెనుకబడిన తరగతుల మోర్చా కార్యదర్శి పదవిని బహుకరించారు. ఏ నియోజకవర్గంలో టికెట్‌ను ఆశించాడో అదే చోట బిజెపి అభ్యర్ధికి ప్రచారం చేశాడు. అనేక మంది నేతలతో సంబంధాలను ఏర్పాటు చేసుకొని ఒక గుర్తింపు పొందాడు. అధికారం వచ్చిన తరువాత ఆ సొమ్మును ఏదో విధంగా రాబట్టుకోవచ్చని భావించి ఉండాలి. బిజెపి ఓడిపోవటం, పార్టీ పదవి ఉన్నా ప్రయోజనం లేదని గ్రహించిన తరువాత తన సొమ్ము తనకు ఇచ్చివేయాలని డిమాండ్‌ చేయటంతో అసలు కథ బట్టబయలైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది.